Sri Matsya Mahapuranam-1    Chapters   

చత్వారింశదుత్తరశతతమోధ్యాయః

అమావాస్యాకాలనిర్ణయ - ఐలకృతపితృతృప్త్యాదినిర్ణయశ్చ.

ఋషయః : కథం గచ్ఛత్యమావాస్యాం మాసిమాసి నృపః | ఐళః పురూరవా స్సూత తర్పయేచ్చ కథం పితౄ&. 1

ఏత దిచ్ఛామహే శ్రోతుం ప్రభావం తస్య ధీమతః | సూతః : ఏతదేవతుపప్రచ్ఛమనుస్సమధుసూదనమ్‌. 2

సూర్యపుత్త్రాయ చోవాచ యథా తన్మే నిబోధత | శ్రీమత్స్యః : తస్య చాహం ప్రవక్ష్యామి ప్రభావం విస్తరేణతు. 3

ఐళస్య దివి సంయోగం సోమేన సహ ధీమతా | సోమాచ్చైవామృతప్రాప్తిః పితృణాం తర్పణం తథా. 4

సో(సౌ)మ్యా బర్హిషదః కవ్యా అగ్నిష్వాత్తా స్తథైవచ | యదా చన్ద్రశ్చ సూర్యశ్చ నక్షత్రేణ సమాగతౌ. 5

అమావాస్యా న్నివసత ఏకరాత్రైకమణ్డలే | తదా స గచ్ఛతి ద్రష్టుం దివాకరనిశాకరౌ. 6

అమావాస్యాంచ దివసే మాతామహపితామహౌ | అభివాద్యతు తౌ తత్ర కాలాపేక్షః స తిష్ఠతి. 7

అస్కన్దమాన స్సోమాద్యం పిత్రర్థే స పరిశ్రమాత్‌ | ఐళః పురూరవా విద్వానమాశ్రాద్దచికీర్షయా. 8

తత స్స దివి సోమంవై హ్యువతస్థే పితౄనపి | ద్విలవంచ కుహుమాత్రం తావుభౌచ నిధాయ సః 9

సినీప్రమాణా స్వల్పాతు కుహూమాత్ర ముపాసతే | కుహూమాత్రబలో(లవో)ద్దేశం జ్ఞాత్వా కుహు ముపాసతే. 10

తముపాస్య సదా సోమకాలాపేక్షీ వ్రతీక్షతే | సుధామృతంతు సోమాద్వైవస (స్రవ)స్తం తస్య తృప్తయే. 11

దశభిః పఞ్చభిశ్చైవ సుధామృతపరిస్రవైః | కృష్ణపక్షభుజాం ప్రీతి రుహ్యతే పరమాంశుభిః 12

సద్యోభిక్షరతా తేన సౌమ్యేన మధునాచ సా | నివాపేష్వథ దత్తేషు పిత్ర్యేణ విధినాతు వై. 13

సుధామృతేన సౌమ్యేన తర్పయామాసవై పితౄ & | సౌమ్యే బర్హి షదః కావ్యా అగ్నిష్వాత్తా స్తథైవచ. 14

నూట నలువదవ అధ్యాయము.

అమావాస్యాకాల నిర్ణయము - ఐలుడు పితరులను తృప్తుల జేయుట.

ఇలా పుత్త్రుడగు పురూరవసుడు ప్రతి మానమున అమావాస్యనాడు స్వర్గమునకేగి తన పితరులకు తృప్తి చేయు విధము తెలుపుమని ఋషులు నూతునడిగిరి. పూర్వము మనుపు ఇదే ప్రశ్న మడుగగా మత్స్యనారాయణుడతనికి ఈ విషయమును పురూరవసుని ప్రభావమును చెప్పెను. అదియే నేనిపుడు మీకు తెలిపెదనని సూతుడు ఋషులకిట్లు చెప్పనారంభించెను. పురూరవసుడు ప్రతి మాసము స్వర్గమునకేగి సోమునితో కూడి అతని నుండి అమృతమును సంపాదించి తన పితరులకు తృప్తి కలిగించును. అతనిచే తృప్తినందు పితరులు (సౌమ్యులు) బర్హిషదులు కావ్యులు అగ్నిష్వాత్తులునను వర్గములవారు. అమావాస్యనాడు స్వర్గమున సూర్యమున సూర్యచంద్రులిద్దరు ఒకేరాత్రి ఒకే నక్షత్రమున ఒకటిగా ఏకమండలము (భాగ)లో కూడియుండు సమయమున పురూరవసుడుపోయి సూర్యచంద్రులను దర్శించును. అట్టి అమావాస్యనాడతడు స్వర్గమునకేగి తన మాతామహులు పితామహులు నగు రవి చంద్రులను దర్శించి నమస్కరించి తగిన సమయమున కెదురు చూచుచుండెను. అతడు సోమునినుండి క్షణముకూడ ఎటుకదలక తన పితరుల తృప్తిపరచుటకై పరిశ్రమము చేయుచుండును. అతడు శాస్త్రమును సంప్రదాయమును ఎరిగిన విద్వాంసుడు కావున ఆమావాస్యనాడు తన పితరులకు శ్రాద్దము చేయగోరి తన పితరులను సోమునికూడ ఇట్లు సేవించును. అమావాస్యనాడు చంద్రరేఖ కొంచెమైన కనబడుచో అది 'సినీ వాలీ' - కనబడనిచో అది 'కుహూ' - అనబడును. పురూరవసుడు 'సినీవాలి' ని విడిచి 'కుహూ' యందలి బలముకల ద్విలవ పరిమాణ పర్వసంధి కాలమునకై కనిపెట్టుకొని యుండును. ఆ సమయమున సోమునినుండి లభించుసుధ పితరులకు తృప్తి కలిగించునుకదా: ఏలయన కృష్ణపక్షమున చంద్రునినుండి లభించు పదునైదు పరిస్రవముల (ప్రవాహ భేదముల)తో కూడిన చంద్రుని ఉత్తమ కిరణములతో పితరులకు తృప్తి కలుగును. అది ఎరిగిన పురూరవసుడు సోమునినుండి అమావాస్యనాడు కుహూ క్షణములందు లభించు అమృతము స్రవించుచుండగనే దానిని తానందు కొని తన పితరులకందించి తృప్తినొందించుచుండును. దీనిచే తృప్తి నొందుదురని తెలిపిన సౌమ్యులు అగు బర్హిషదులు కావ్యులు అగ్నిష్వాత్తులనను పితృవర్గముల విషయము తెలిపెదను.

(వివరణము: 1. ఇచట 'ఐలః పురూరవాః' అని చెప్పబడినది. అనగా ' ఇలా పుత్త్రుడగు పురూరవసుడు' అని అర్థము. తరువాత 'అతడు మాతామహ పితామహులను అమావాస్యనాడు దర్శించును. ' అనియు చెప్పబడినది. ఆ తిథి సూర్యచంద్రులు సంగమించు ఒకే భాగ (Degree) యందు ఉండు తిథి. ఆనాడు ఆతడు వారికడకు పోవును. తన మాతామహ పితామహులను దర్శించును. అనగా సూర్యచంద్ర వంశీయులగు తన పెద్దలను సూర్యచంద్రుల తాత్త్విక మగు దేవతాత్మక రూపమును కూడ దర్శించును. వారందరను పురూరవసునకు మాతామహులును - పితామహులును; ఎట్లన - పురూరవసుని తల్లియగు ఇల-తాను స్త్రీత్వమును పొందుటకు మునుపు మునుపు ఇలుడు- అను సూర్యవంశ్యుడగు రాజు కదా: కావున అంతకు పైతరముల సూర్యవంశ్యులును సూర్యుడును అతనికి మాతామహ పక్షములోనివారు. తన తండ్రియగు బుధడును అతని తండ్రియగు చంద్రుడును ఇతనికి పితృపితామహులు.

2. పితరులు ' సౌమ్యులు' అనబడుదురు. ఎట్లన సోముని (చంద్రుని) నుండి లభించు అమృత పరిస్రవముతో వారు ఆప్యాయితులు- రసపానముచే తృప్తినందినవారు- అగుచున్నారు. కనుక సోముడు పితరులకు 'ఆప్యాయయితా' ' సంతృప్తినందించువాడు.' కావున- 'సోమః అప్యాయయితా ఏషాం- ఇతి-సౌమ్యాః ' 'సోముడు వీరికి ఆప్యాయనము కలిగించువాడుగా నున్నాడు కావున 'సౌమ్యులు' అని పితృదేవతలకు వ్యవహారము సముచితమగును.

3. పితరులు అగ్నిష్వాత్తులు- బర్హిషదులు - కావ్యులు - అని మూడు వర్గముల వారుగా ఈ అధ్యాయమున చెప్పబడినారు. కాని-లోగడ 13-14-15 అధ్యాయములలో పితరులు - అమూర్తిమంతలు 1. వైరాజులు 2. అగ్నిష్వాత్తులు 3. బర్హిషదులు అను మూడు వర్గములవారు; మూర్తిమంతులు - 1. సుకాలినులు 2. హవిష్మంతులు 3. అజ్యపులు 4. సోమపులు అను నాలుగు వర్గములవారు; ఇట్లు వారు మొత్తము ఏడు వర్గములవారు. అని చెప్పబడినది. దీని సమన్వయయమును ఆలోచించవలయును.

అమూర్తిమంతులలో 1. వైరాజులను 2. అగ్నిష్వాత్తులును దేవతలకు ఆరాధ్యులగు పితరులు. కావున వీరిని ఇద్దరను అగ్నిష్వాత్తులు అను ఒకే వర్గముగా ఈ అధ్యాయమున గ్రహించినారు. 3. బర్హిషదులు అను వర్గపు పితరులు దానవాదులకు ఆరాధ్యులు. కావున వీరినికూడ ఇచట వేరుగ గ్రహించినారు. మిగిలిన నాలుగు మూర్తి మద్వర్గములవారును మానవులలో నాలుగు వర్ణములవారిచే ఆరాధింపబడుచు వారిచే కవ్యములను- పితరులకు అందించు ఆహారాదికమును - అందుకొందురు. కావున-కావ్యులు అనబడుదురు. ఇట్లు లోగడ తెలిపిన ఏడు వర్గముల పితరులను ఇచట మూడు వర్గములలోనికి వచ్చినారు. )

ఋతురగ్ని స్స్మృతో విపై#్ర ర్భతు స్సంవత్సరం విదుః | జజ్ఞిరే ఋతవ స్తస్మాత్పితరోహ్యార్తవా భవ&.

పితరోర్ధమాసా జ్జజ్ఞే (జ్ఞిరే)వై యేచతే ఋతుసూనవః | పితామహాశ్చ సు(ఋ)తవో మాసాయేహ్యష్టసూనవః .

ప్రపితామహా స్స్మృతా దేవాః పఞ్చబ్దా బ్రహ్మణస్సుతాః | (కావ్యా) సౌమ్య బర్హిషదశ్చైవ అగ్నిష్వాత్తాశ్చ తేత్రిధా. 17

గృహస్థా యేతు యజ్వానో హవిర్యజ్ఞార్తవాశ్చ యే | స్మృతా బర్హిషద స్తేవై పురాణ నిశ్చయంగతాః 18

గృహమేధినశ్చ యజ్వానో అగ్నిష్వాత్తార్తవా స్మృతాః | అష్టకాపతయః కావ్యాః పఞ్చహ్యబ్దాని చోచ్ఛృ(ణు)త. 19

తేషు సంవత్సరో హ్యగ్ని స్సూర్యస్తు పరివత్సరః | సోమస్త్విద్వత్సరశ్చైవ వాయుశ్చైవానువత్సరః . 20

రుద్రస్తు వత్సరస్తేషాం పఞ్చబ్దా యే యుగాత్మకాః | కాలేనాధిష్ఠత స్తేషాం చన్ద్రమాః స్రవతే సుధామ్‌. 21

ఏతే స్మృతా దేవకృత్యా స్సోమపాశ్చోష్మపాశ్చయే | తాంస్తేన తర్పయామాస యావదాసీ త్పురూరవాః 22

యస్మా త్ప్రసూయతే సోమో మాసిమాసి విశేషతః | తత స్సుధామృతం తద్వై పితౄణాం సోమపాయినామ్‌. 23

ఏత త్తదమృతం సోమ స్సుదాచ మధు చైవహి | తతః పీతసుధం సోమం సూర్యోసా వేకరశ్మినా. 24

యుగాన్తరోదితే చైవ చన్ద్రరేఖోపరి స్థితే | ఆప్యాయయతి ససుధం సోమంతు సోమపాయినమ్‌. 25

నిశ్శేషావై కలాః పూర్వా యుగపద్‌ వ్యాప్యతే పురా | సుషుమ్నాప్యాయమానస్య భాగంభాగ మహఃక్రమాత్‌. 26

దేవైః పీతసుధం సోమం పురా పశ్చా త్పిబే ద్రవిః | పీతం పఞ్చదశాహంతు రశ్మినై కేన భాస్కరాః. 27

ఆప్యాయ్య ససుషుమ్నేన భాగంభాగ మహఃక్రమాత్‌ | సుషుమ్నా೭೭ప్యాయమానస్య శుక్లే వర్దన్తి వై కలాః . 28

తస్మాద్ద్రసన్తివై కృష్ణా శుక్లా హ్యాపాయయన్తిచ | ఏవం సా సూర్యవీర్యేణ చన్ద్రస్యాప్యాయితా తనుః. 29

పౌర్ణమాస్యాం స దృశ్యేత శుక్ల స్సమ్పూర్ణమణ్డలః | ఏవ మాప్యాయిత స్సోమః క్షీయతేచ పునః పునః. 30

సమృద్దిరేవ సోమస్య పక్షయో శ్శుక్లకృష్ణయోః | ఇత్యేష పితృమాన్త్సోమ స్స్మృత స్తద్వ త్సుధాత్మకః 31

కాస్తః పఞ్చదశై స్సార్దం సుధామృతపరిస్రవైః |

విప్రులు-వేదములచే ప్రతిపాదింపబడిన సకల విషయములను తాత్త్వికముగా ఎరిగినవారు- అగ్నిని 'ఋతువు' అని వ్యవహరింతురు. వారే సంవత్సరమును కూడ ఋతువు అనియే తలంచుచున్నారు. (కావున సంవత్సరావయవములగు పక్షములు- మాసములు - రెండేసి మాసములతో ఏర్పడు కాలపరిమాణము - ఆయనములు-కూడ 'ఋతువు' అనదగి యున్నవి.) పితరులు ఋతువులనుండి జనించినవారు కావున వారికి 'ఆర్తవులు' అనియు సంవ్రదాయమునందు వ్యవహారము. పితృ-పితామహ- ప్రపితామహులు అను మూడు తరములకు చెందిన పితరులకు అభిమాని దేవతలగు పితృదేవతలలో-పితృశ్రేణికి చెందినవారు సంవత్సరావయవముగు పక్షములనుండి జనించినారు. పితామహ శ్రేణికి చెందిన పితృదేవతలు 'అష్టకలు' అనబడు పర్వకాలముతో కూడిన మాసము అనెడు సంవత్సరావయవములనుండి జన్మించినవారు. ప్రపితామహ శ్రేణికి చెందిన పితృదేవతలు పంచాబ్దా (పంచ సంవత్సరా)త్మకుడగు బ్రహ్మకు (ప్రజాపతికి) కుమారులు.

సౌమ్యులు అను సామాన్య నామముకల 1. కావ్యులు 2. బర్హిషదులు 3. అగ్నిష్వాత్తలు అను మూడు వర్గముల పితరుల పైని పేర్కొనబడినారుగదా: వారి స్వరూపము చెప్పబడుచున్నది.

'గృహస్థులుగానుండి హవిర్యజ్ఞములతో ఋతురూప (సంవత్సరాత్మక) ప్రజాపతిని యజించిన యజ్వలగు మహాత్మలు 'బర్హిషదులు' అను వర్గములనకు చెంది అమూర్త పితృదేవతలు అని శాస్త్రములందు స్మరింపబడుచున్నారు. ' అని ఈ పురాణమునందు గడచిన అధ్యాయములందు ఈ శబ్దపు నిర్వచనముతో కూడ నిశ్చయింపబడియున్నది. ఇదే విధముగ యజ్వలుగా నుండిన గృహమేధులే అగ్నిష్వాత్తులనబడు అమూర్త పితృదేవతా వర్గమువారు కూడను. 'అష్టకలు' మొదలుగు పర్వదినములందు మానవులలో చతుర్వర్ణులచే జరుపబడు శ్రాధ్దములను అనుభవించుచు వాటికి వతులుగా - అధిష్ఠాతలుగా - ఉండు మూర్త పితృదేవతా వర్గమలు సమష్టియగు వారు కావ్యులు.

ఇక ఇపుడు ప్రపితామహ శ్రేణికి చెందిన పితరులకు జన్మహేతువగు ప్రజాపతి రూప పంచాబ్ద (పంచ సంవత్సర) స్వరూపమును తెలిపెదను; వినుడు. *పంచ సంవత్సరాత్మకమగు యుగమునకు అవయవములగు ఐదు అబ్దములను వివరింతును. వానిలో మొదటిదగు 1. 'సంవత్సరము' అగ్నిదేవతాత్మకము. 2. రెండవదియగు 'పరివత్సరము' సూర్యదేవతా రూపము. 3. మూడవదియగు 'ఇద్వత్సరము' సోమాత్మకము 4. నాలుగవదియగు 'అనువత్సరము' వాయుదేవతాత్మకము 5. ఐదవదియగు 'వత్సరము' రుద్ర దేవతాత్మకము. ఈ ఐదింటితో ఏర్పడినదగు పంచ సంవత్సరమయ 'యుగము' సాక్షాత్‌ కాలాత్మక ప్రజాపతియే.

ఇట్లు సోముడు ప్రతి మానమునందును చంద్రుడు విశేష రూపమున స్రవించు అమృతము సోముని నుండి లభించు స్వధామృతమును మాత్రమే అనుభవించుటచే తృప్తినందు పితరులకు ఆహారమగుచున్నది. దానిచేతనే వారికి సోమపులనియు వ్యవహారము. ఈ సోమామృతమునకు అమృతమనియు సోమమనియు మధువనియు పేరులు కలవు. పితరులు సోమపానము చేసిన తరువాత అమృత శూన్యడై పోయిన చంద్రుని సూర్యుడు తన సుషుమ్నయను కిరణముతో మరల పూరించును. ఇట్లు దినదిన క్రమమున చంద్రుని 'కల' లన్నియు శుక్లపక్షమున పూర్ణములగుచు పోవుచుండును. కృష్ణపక్షమున క్షీణములగుచు పోవును. ఈ చెప్పిన విధమున చంద్రుని శరీరము సూర్యుని వీర్యముతో నింపబడుచుండును. క్రమవృద్దితో పూర్ణిమాతిథినాడు చంద్ర మండలము షోడశ కళలతో నిండి అతడు సంపూర్ణమండలుడై యుండును. ఇచట ఇదియొక చమత్కారము: ఏమన-కృష్ణపక్షమున పితరులు చంద్రుని పానము చేయ(త్రావ)గా శుక్లపక్షమున ప్రతిపదాదిగా రవియు చంద్ర మండలమును పానము చేయును. (వ్యాపించును; పానము అనగా ఇచట ఈ రెండర్ధములు సంప్రదాయమున వచ్చినవి.) ఇదే విధముగా శుక్లపక్షమునందును కృష్ణపక్షమునందును చంద్రుడు వృద్దినొందుచునే యుండును. (ఇచట వృద్దియను మాటకు గూడ రెండర్థములు - శరీరము బలియుట ఒక విధముగు వృద్ది - తాను అమృతము నిచ్చి పితరులకు శరీరపుష్టి కలిగించుట మరియొక విధమగు వృద్ది. వృద్ది = శుభము) ఈ కారణములతోనే సోమునకు 'పితృమాన్‌ - పితరులు కలవాడు (పితరులను పోషించువాడు)' అనియు 'సుధాత్మకుడు (అమృతము తన ఆత్మ- దేహము - గా కలవాడు) అనియు పేరులు కలిగినవి. అత డిట్లు స్రవించు అమృత ప్రవాహముతో పంచదశ తిథులందును కాంతుడు-

* సంవత్సరారంభ దినమున (చైత్ర శుక్ల పాడ్యమినాడు) సూర్యుడు ఏదేని రాశిలో (లేదా మేషరాశిలో) ప్రవేశించిన ఏడు. 1. సంవత్సరము. దాని తరువాత వచ్చు. నాలుగు ఏడులను వరుసగా పరివత్సరము ఇద్వత్సరము అను - వత్సరము వత్సరము అందురు. ఇట్టి ఐదేండ్లు కలిసి యుగమనబడును. ఈ ఐదేండ్లకును వ్యష్టిగా దేవతలు ఇచట చెప్పబడినారు. యుగమునకు అంతటికిని సమష్టిగా ప్రజాపతి అధిపతి అని ' పంచ సంవత్సరమయయు గాధ్యక్షం ప్రజాపతిమ్‌' అని వేదాంగ జ్యోతిషమున చెప్పబడినది. చూచువారికి కలిగించువాడు. - గానే యుండును. (శుక్లపక్షమున మండలము పూర్ణలము పూర్ణమగుచుండటచేత మానవులకును తమకు ఇతని నుండి అమృతము లభించును గదాయని పితరులకును. చంద్రుడు ఇంపు గొలుపును. అట్లే కృష్ణపక్షమున పితరులకు అతడు చేసిన ఉపకారమును బట్టి మానవులకును పితరులకును చంద్రుని చూడగానే ఆనందము కలుగును. )

అతఃవరం ప్రవక్ష్యామి పర్వణాం సంధయశ్చ యే. 32

యథా గ్రన్థిభిః పర్వాణఙ అవృతానీక్షువేణునామ్‌ | తథార్ధమాసా స్తస్యర్తుశుక్లకృష్ణాస్తు వై స్మృతాః 33

పూర్ణమాసస్య యో భేదే గ్రన్థయ న్సన్ధయ స్తథా | అర్ధమాసస్య పర్వాణి ద్వితీయాప్రభృతీనిచ. 34

అగ్న్యాధానక్రియా స్తస్మా న్నియన్తే పర్వసన్దిషు | తస్మాత్తు పర్వణోహ్యాదౌ ప్రతిపద్యాదిసన్దిషు. 35

సాయహ్నే హ్యనుమత్యా యద్ద్వౌలవౌ కాల ఉచ్యతే | లవౌ ద్వావేవ కాలో యః కాలో జ్ఞేయోవరాహ్ణికః 36

ప్రకృతిః కృష్ణవక్షస్య కాలే೭೭పన్నేమరాహ్ణికే | సాయహ్ణే ప్రతిపత్తశ్చ సకాలః పౌర్ణమాసకః 37

వ్యతీపాతే స్థితే సూర్యే లేఖామూర్దం యుగాన్తరే | యుగాన్తరోదితే చైవ చన్ద్రలేఖక్షపరిస్థితే 38

పూర్ణమాసావ్యతీసాతౌ యదా పశ్యే త్పరస్పరమ్‌ | యావన్తౌతు వ్యతీపాతే యస్మిన్కాలే వ్యవస్థితా. 39

తథైన సూర్యముద్దిశ్య దృష్ట్వా సజ్ఖ్యాతు మర్హసి | సవై వషట్‌ క్రియాకాల ష్షష్ఠః కాలోభిధీయతే. 40

పూర్ణేన్దుః పూర్ణవక్షేతు రాత్రిసన్దిషు పూర్ణిమా | తస్మా దాప్యాయతే నక్తం పూర్ణిమాస్యాం నిశాకరః

యథాన్యోన్యం వ్యతీపాతే పూర్ణిమాం ప్రేక్షతే దివా. 41

చన్ద్రాదిత్యోపరాహ్ణేతు పూర్ణత్వా త్పూర్ణిమా స్మృతా | యస్మాత్తా మనుమన్యన్తే పితరో దైవతైస్సహ. 42

తస్మా దనుమతిర్నామ పూర్ణిమా ప్రతిమా స్మృతా | అత్యర్ధం రాజతే యస్మా త్పౌర్ణమాస్యాం నిశాకరః . 43

రఞ్జనాచ్చైవ చర్ద్రస్య రాకేతి కవయో విదుః | అమా-వసేతా-మృక్షేతు యదా చంద్రదివాకరౌ | ఏకా పంచదశీ రాత్రి రమావాస్యా తతః స్మృతా. 44

ఉద్దిశ్య తామమావాస్యాం యదా దర్శం సమాగతౌ | అన్యోన్యం చంద్రసూర్యౌతు దర్శనా ద్దర్శ ఉచ్యతే.

ద్వౌద్వౌ లవా వమావాస్యాం సకాలః వర్వసన్దిషు | ద్వ్యక్షరః కుహూమాత్రశ్చ పర్వకాలస్తు స స్మృతః 45

ఇకమీదట పర్వ సంధుల విషయము తెలిపెదను. చెరకు గడలకును వెదురుగడలకును కలకణుపులకు ముడులు ఉన్నట్లే సంవత్సరమునకును ఆయనములు ఋతువులు మానములు అర్ధ మాసములు తిథులు మొదలగునవియు కణుపులుగాను ఆ (పర్వముల) కణుపుల నడుమ వాటిని కలుపుచు నుండు సంధికాలము ఆ కణపుల ముడులుగాను అమరియున్నవి. పూర్ణ (శుక్ల) కృష్ణపక్షాత్మకమగు మాసమునకు శుక్ల కృష్ణ పక్షములు కణువులును వాటి సంధి కాలములు (పూర్ణిమామావాస్యలు) ముడులునైనట్లే పక్షములకును ప్రతిపత్‌ మొదలు పూర్ణిమామావాస్యల వరకు గల (విదియ మొదలగు) కాలము కణుపులును పూర్ణిమకును కృష్ణ ప్రతివత్‌కును - అమావాస్యకును శుక్ళ ప్రతిపత్‌కును నడుమగల కాలము గ్రంథులు (ముడులు)ను ఆగుచున్నవి. (వెదురు-చెరకు-మొదలగువాని యందు ముడులవలె నుండు కఠిన భాగము గ్రంథి- ఆ గ్రంథులకు రెంటికి నడుమ నుండు భాగము పర్వము (కణుపు) అని తెలియవలెను.) ఇట్టి పర్వముల సంధి కాలములందు అగ్న్యాధానము మొదలగు కర్మముల నాచరించవలయును. పూర్ణిమనాటి సాయాహ్నకాలమందలి రెండు లవముల కాలము 'అనుమతి' అదే నాటి అపరాహ్ణపు రెండు లవముల కాలము 'రాకా' అనబడును. కృష్ణ ప్రతిపత్‌నాటి అపరాహ్ణము గడచి సాయాహ్నము ఆరంభమగు సమయము పౌర్ణమాసేష్టికి సముచిత సమయము. ఏ పూర్ణిమనాడు రవి క్రాంతివృత్తమున సంపాత స్థానమందుండగా చంద్రుడు రవినుండి ఆరు రాసుల (180 భా.),దూరములో విషువద్వృత్త సంధిస్థానమునందుండి అతనిని చూచుచుండునో ఆ కాలమును కృష్ణ ప్రతివత్‌ ఆరంభము కాకుండునంతలో సూర్యుని గతిని అనుసరించి గణన చేసి తెలిసికొనవలెను. సరిగా ఆ సమయము వషట్కార సహితమగు శ్రౌతస్మార్త సత్కర్మాష్ఠానమునకు తగిన సమయము. దీనినే షష్ఠకాము అనియు పిలుతురు, రవి కిరణములలో నొకటగు సుషుమ్నా కిరణముతో పూరింపబడుచుండ అమృతము కల చంద్రుడు పూర్ణిమనాటి అర్దరాత్రి సమయమున నిండుగా అమృతము కలిగియుండును. అందుచే ఆ తిథికి 'పూర్ణిమా' నిండుదనము గలది ' అని పేరు. ఆ అమృతముతోనే ఆనాడు చంద్రుడు ప్రాణులకును అప్యాయనము (పరితృప్తి) కలిగించును. ఆనాడు చంద్రుడును రవియును పగలు అపరాహ్ణ సమయమున క్రాంతి వృత్త విషువ వృత్తముల సంపాత ప్రదేశమందుండి పరస్పరము నిండు చూపుతో (పూర్ణ దృష్టితో) చూచుకొందురు. అందుచే గూడ ఈ తిథికి పూర్ణిమా యని పేరు. ఇట్టి పూర్ణిమా తిథిని పితరులును దేవతలును అనుమతింతురు కావున దీనికి అనుమతి యనియు వ్యవహారము. ఈనాడు చంద్రుడు మిక్కిలిగా (మేర మీరి) రాజిల్లును కావునను ప్రాణులను అతడు రంజిల్ల (ఆనందింప)జేయును గావునను ఈ విధమగు పూర్ణిమకు 'రాకా ' అనియు నామము. చంద్రసూర్యులు కలిసి (ఆమా-కలిసి) ఉండుతిథికి అమావాస్య (అమా-కూడి ఒకటిగా; వసతః- వసింతురు) అని వ్యవహారము. ఈ అమావాస్యనాడు చంద్రసూర్యులు ఒకేచోట కూడి దర్శనము ఇత్తురు. కావున ఈక తిథికి 'దర్శ' అనియు పేరు కలిగినది. పూర్ణిమా-కృష్ణ ప్రతివత్‌లకు నడుమకాని అమావాస్యా- శుక్ల ప్రతివత్‌లకు నడుమ కాని ఉండు సంధికాలము రెండు లవముల పరిమాణముతో నుండును. ఇది కోకిల 'కుహూ' అని రెండక్షరములు పలికినంత కాలమే; కనుక అమావాస్యనాటి ఇట్టి పర్వ సంధికాలమును 'కుహూ' అందురు. (ఇది వింతగా కనబడు అర్ధము. వాస్తవమున ఈ 'కుహూ' పదము 'గుహూ' పదమునుండి మారినది; అనగా చంద్రకళ పూర్తిగా మరుగుపడి కొంచెము కూడ ఆనాడు కనబడదని అర్థము.) ఇది శ్రౌత కర్మలకు తగిన పర్వకాలము.

దృష్టచన్ద్రా త్వమావాస్యా మధ్యాహ్న ప్రభృతీహవై | దివా తదూర్ద్వం రాత్ర్యాంతు సూర్యే ప్రాప్తేతు చన్ద్రమాః. 46

సూర్యేణ సహసోద్గచ్ఛే త్ప్రాతస్స్నానాత్తు వై తతః | సమాగమ్య లవౌ ద్వౌతు మధ్యాహ్నా న్ని పతద్రవిః. 47

ప్రతిపచ్ఛుక్లపక్షస్య చన్ద్రమా స్సూర్యమణ్డలాత్‌ | నిర్ముచ్యమానయో ర్మధ్యే తయోర్మణ్డలయోస్తు వై. 48

తస్మా ద్దివాహ్యమావాస్యో గృహ్యతే యో దివాకరః | కుహేతి కోకిలే నోక్తం యస్మా త్కాల స్సమాప్యతే. 49

తత్కాలసమ్మితా హ్యేషా అమావాస్యా కుహూ స్స్మృతా | సినీవాలీప్రమాణంతు క్షీణష నిశాకరః 50

అమావాస్యా విశత్యర్కం సినీవాలీ తదా స్మృతా | అనుమతిశ్చ రాకాచ సినీవాలీ కుహూ స్తథా. 51

ఏతాసాం ద్విలవః కాలః కుహూమాత్రా కుహూః స్మృతా | ఇత్యేష పర్వసన్దీనాం కాలోవై ద్విలవ స్స్మృతః. 52

పర్వణాం తుల్యః కాలస్తు తుల్యాహుతివషట్క్రియా | చన్ద్రసూర్యవ్యతీపాతే సామవై పూర్ణిమే ఉబే. 53

ప్రతిపత్ప్రిత్తిపన్నస్తు పర్వకాలో ద్విమాత్రకః | కాలః కుహూసినీవాల్యౌ సముద్దౌ ద్విలవ స్స్మృతః 54

అర్కాగ్ని మణ్డలే సోమే సర్వకాల కలా స్సమాః | యస్మా దాపూర్యతే సోమః పఞ్చదశ్యాం తు పూర్ణిమా . 55

తస్మా త్సోమస్య విప్రోక్తా వఞ్చదశ్యాం మహఃక్షయః | ఇత్యేతే పితరో దేవా స్సోమపా స్సోమవర్ధనాః 57

ఆర్తవా ఋతవోథాబ్డా దేవాస్తాన్‌ భావయన్తిహి | అతఃపరం ప్రవక్ష్యామి పితౄ ఞ్చ్రద్దభుజస్తుయే. 58

శ్రాధ్దభో క్తృపితృనిర్ణయ - స్తద్గతినిర్ణయశ్చ.

తేషాం గతించ సత్త్వంవా ప్రాప్తిం శ్రాద్దస్య చైవహి | న మృతానాం గతిశ్శక్యా జ్ఞాతుంవా పునరాగతిః. 59

అమావాస్యనాడు వలెనే ఇతర తిథులందును పర్వ సంధికాలము రెండు లవముల పాటే యుండును. ఇదియు 'కుహూ' అను కోకిల కూతయంత కాలమే యగును. ఏనాడు మధ్యాహ్న సమయమున అమావాస్య ఆరంభమగునో ఆనాడు చంద్రు డుదయించవలసిన వేళ##కే అతనితో పాటు కలిసి సూర్యుడును ఉదయించుచుండును; కనుక చంద్రునిలో మిగిలిన ఒక కళ కూడ కనబడదు. కావున ఆ అమావాస్యను 'నష్టచంద్రా' 'చంద్రుడు కనబడనిది' అందురు. ఇదియే వాస్తవమయిన 'కుహూ' ఆ మరునాడు మధ్యాహ్న సమయము మీదట చంద్రుడు రవినుండి వేరుపడుట ఆరంభము అగును. అట్టి పర్వ సంధికాలము (అమావాస్య ముగిసి ప్రతివత్‌ ఆరంభమగు సమయము) 'అన్వాహుతులు' అను శ్రౌత కర్మలకును 'దర్శ' యందు చేయదగిన వషట్కార (శ్రౌత)కర్మలకును సముచిత సమయము. ఇట్టి అమావాస్య నాటి పర్వ సమయమునకు 'ఋతుముఖ' మని వ్యవహారము. ఇట్లు ఆనాడు చంద్రుడు ఒక్క కళ కూడ బొత్తుగా కనబడుకుండ పోవు ఆ అమావాస్య శుక్ల పక్షారంభమగు మధ్యహ్న కాలము వరకు ఉండి ఆ సమయపు రవి అమావాస్యకు చెందిన రవిగా గ్రహింపబడును. కావున అది శ్రౌత కర్మానుష్టానమునకు ప్రశస్తకాలము. పర్వ (అమావాస్యా) శుక్ల ప్రతివత్‌ సంధికాలములో సరిగా రెండు లవముల (కోకిల 'కుహూ' అని పలుకునంత) కాలము సరియగు కుహూ అని గ్రహించవలయును. క్షీణించినంత క్షీణించినను మిగిలిన చంద్రకళ ఎంతసేపు కనబడునో అంతకాలము ఆ అమావాస్య 'సినీవాలీ' అనబడును. అట్టి అమావాస్యతో రవికి సంబంధ ముండుటచే ఆ తిథికి ఈ పేరు వచ్చినది. ('సిని' అనగా చంద్రుడు; అతనితో సంబంధము గల తిథి 'సినీవాలీ') ఈ విధముగా 'కుహూ' అను రెండక్షరముల ఉచ్చారణ కాలము అగు ద్విలవముల కాలమే అనుమతి - రాకా - సినీవాలీ -కుహూ-అను నాలుగు పర్వ సంధులకును కాల పరిమితి అనితెలియవలెను. పర్వకాలముల పరిమితి వలెనే వాటిని ఆశ్రయించి చేయవలసిన ఆహుతి- వషట్కార పూర్వక శ్రౌతకర్మల-కాల పరిమితియు సమానముగా నుండును. చంద్ర సూర్యులకు వ్యతీపాతము సంభవించుట (క్రాంతివృత్తవిషువవృత్త సంపాతములందు ఇద్దరును 180 భాగల దూరమందుండి పరస్పరము చూచుకొనుట) చేతనే రాకా-అనుమతి-అను రెండు విధములగు పూర్ణిమలును ఏర్పడుచున్నవి. అట్లే పూర్ణిమా కృష్ణ ప్రతివత్‌ల పర్వ సంధికాలము కూడ ద్వి లవ పరిమితమే. కుహు-సినీవాలీ-అను రెండు పర్వముల కాల పరిమితియు ద్వి లవములే. చంద్ర సూర్యాదుల తేజః కళల సంబంధము చేతనే పర్వ సమయములు ఏర్పడును. కావున సూర్యాగ్ని తేజః కళా సంబంధము గల చంద్రుని కళలును పర్వ కాలములందు అందులకు అనుగుణముగా అగ్ని సూర్యుల సంబంధానుసార ముండును. (అందుచేతనే చంద్ర సంబంధముపై ఆధారపడి ఏర్పడు పర్వదినములు శ్రౌత కర్మలకు ప్రశస్తము లనబడును.) సోముడు దినమున కొక కలవంతున కలా పూర్తి నొందుచు పూర్ణిమనాడు పదునైదు కళలు కలవాడగును. (ఇదికాక అతనియందు ఎప్పుడను (సదా) తరుగక పెరుగక యుండుపుదనారవ కళయొకటి (సాదా) కలదు. అది వృద్దిక్షయములలో పాలుపంచుకొనదు.) కావున నేను పంచదశ కళలతోనే చందర్రుడ వృద్ది క్షయములకు పాలుపడునని చెప్పితిని. సోమపులు (సోముని అమృతమునను త్రావువారు) 'సోమవర్దనాః'(సోమునిచే వృద్ది నొందుచు సోముని కూడ వృద్ది నొందించువారు) అనబడు పితరు లనబడు దేవతల విషయము ఇట్లుండును. వీరికి బుతువులు-ఆర్తవులు అనియు ప్యవహారము కలదనియు వీరుని (ఆజాన-కర్మ) దేవతలు కూడ కర్మానుష్టానమున భావన చేయుచుందురనియు ఎరుగవలయును. ఇకమీదట శ్రాద్దములను అనుభవించు పితృ దేవతలు ఎవరో-వారి గతులు (వారి ఆశ్రయ స్థానములును ప్రవృత్తులును) ఎట్టివో లోకమందలి ఆయా వర్ణములవారు ఇచ్చు శ్రాద్దములు వారి కెట్లు అందునో తెలిపెదను; వినుము. ఏలయన ప్రాణులు మృతులైన తరువాత ఆ జీవుల గతి - లోకములందు వా రెచ్చట సంచరించుచుండురో - మరల వా రెట్లు ఈ లోకములో ఎక్కడకు వత్తురో తెలియుట (శాస్త్ర ప్రమాణముతోనే తప్ప) శక్యము కాదు.

తపసా (పి) హి ప్రసిద్దేన; కింపునర్మాంసచక్షుపా | ఆత్ర దేవా న్పితౄంశ్చైవ పితరౌ లౌకికా శ్ర్శితాః. 60

తేషాం తే ధర్మసామర్థ్యాత్‌ స్మృతాః సాయుజ్యగా ద్విజైః | యది చాశ్రమధర్మేణ సమ్ప్రస్థానై ర్వ్యవస్థితాః. 61

అన్యే చాత్ర ప్రసీదన్తి శ్రద్దాయుక్తేషు కర్మసు | బ్రహ్మచర్యేణ తపసా యజ్ఞేన ప్రజయా భువి. 62

శ్రాద్దేన విద్యయా చైవాన్నదానేనచ సప్తదా | కర్మస్వేతేషు యే సక్తా వర్తన్త్యాదేహపాతనాత్‌. 63

దేవై స్తేపితృభిస్సార్ధమూష్మపై స్సోమపై స్తథా | స్వర్గతా దివి మోదన్తే పితృమన్త ముపాసతే. 64

ప్రజావతాం ప్రసిద్దైషా ఉక్తా శ్రాద్దకృతాంచ వై | తేషాం నివాపే దత్తాని తత్కులీనైస్తు బాన్దవైః 65

మాస శ్రాద్దంహి భుఞ్జనా స్తృప్యన్తే సోమలోకకైః | ఏతే మనుష్యాః పితరో మాసశ్రాద్దభుజస్తు వై. 66

తేభ్యః పరేతు యేత్వన్యే సజ్కీర్ణాః కర్మయోనిషు | భ్రష్టాశ్చాశ్రమధర్మేషు స్వధాస్వాహావివర్జితాః. 67

భిన్నే దేహే దురావస్థాః ప్రేతభూతా యమక్షయే | స్వకర్మాణ్యనుశోచన్తో యాతనాస్థాన మాగతాః. 68

దీర్ఘాశ్చైవాతిశుష్కాశ్చ శ్మశ్రులాశ్చ వివాసనః | క్షుత్సిపాసాభిభూతాస్తే విద్రవన్తి తతస్తతః. 69

సరిత్సర స్తడాగాని పుష్కరిణ్యశ్చ సర్వశః | పరాన్నా న్యభికాఙ్‌క్షన్తః కాల్యమానా స్తత స్తతః. 70

స్థానేషు పాత్యమానా యే యాతనా స్తేషు తేషువై | శాల్మల్యాం వైతరణ్యాంతు కుమ్భ్యాం కారమ్భవాలుకే. 71

అసిపత్రవనేచైవ పాత్యమానా స్స్వకర్మభిః | తత్రస్థానాంతు తేషాంవై దుఃఖితానా మశాయినామ్‌. 72

మృతులైన జీవులు ఏగతి కేగుదురను విషయమును ప్రసిద్దమగు మహా తపస్సుతో కూడ తెలియుట సాధ్యము కాదనిన మాంస నిర్మితమగు కంటితో చూచి ప్రత్యక్ష ప్రమాణముతో ఎట్లు సాధ్యమగును:

లౌకికులగు పితరులు శ్రాద్దము చేయు యజమానుని మృత పితృ పితామహ ప్రపితామహాదులు) ద్యులోకవాసులగు పితృదేవతలను ఆశ్రయించి (వారి ద్వారమున) సద్గతిని పొందుదురు. వారు వా రాచరించిన ధర్మపు సామర్థ్యముచే ద్యులోకవాసి దేవతలును పితృ దేవతలును ఈ లౌకిక పితృ పితామహ ప్రపితామహాది పితరులకు తమతోడి సాయుజ్యమునో తమ లోకమందు వీరి నివాసమునో అనుగ్రహించి సుఖింపజేయుదురు. ఈ లౌకిక పితరులు గాని వారి పుత్ర పౌత్త్రాది సంతతి కాని తమ తమ ఆశ్రమ ధర్మములను ఆయా కర్మానుష్ఠాన సంప్రదాయములను చక్కగా పాటించుచువ్యవస్థానుసారము జీవించుటచే వీరికి పరలోకమున సద్గతి కలుగును. ఈ లౌకిక పితృ పితామహాదుల పుత్త్ర పౌత్త్రాదులు వీరి నుద్దేశించి శ్రద్దాయుక్తులయి కర్మల నాచరించుటచే గూడ ఈ లౌకిక పితరులకు నద్గతి కలుగును. బ్రహ్మచర్యము-తపస్సు-యజ్ఞము ఆచరించుట- సత్సంతానమును కనుట-శ్రాద్దకర్మలను శ్రద్దతో ఆచరించుట-విద్యాధ్యయనము చేయుట-అన్నదానము చేయుట-ఇవి ఏడును లౌకిక పితరుల హేతువులు. కావున దేహము పడిపోవు వరకును ఇవి విడువక ఆచరించుచుండవలయును. పితరులయందు శ్రద్దాభక్తులు గల తమ పుత్త్ర పౌత్త్రాదులను ఉపాసించి (ఆధారముగా చేసికొని) ఈ లౌకిక పితరులు లోగడ చెప్పిన సోమపులు- ఊష్మపులు అను పితృ దేవతలతోను దేవతలతోను కూడ స్వర్గలోకమున మోదముతో నుందురు. నంతానవంతులగు ఈ లౌకిక పితరులు తమ పుత్త్ర పౌత్త్రాదులు చేయు శ్రాద్దాది కర్మలతోను వారి వంశమునందలి జ్ఞాతిజనులు గాని బాంధవులుగాని ఇచ్చు తర్పణోదకము మొదలగు వానితోను వీరు జరుపు మాస శ్రాద్దము మొదలగు వానితోను తృప్తి చెంది సోముని అమృతము అందెడి లోకములలో ఆనందించుచుందురు. మాస శ్రాద్దముల ననుభివించు అదృష్టము మానవ(లౌకిక)పితరుల విషయము ఇది.

ఈ చెప్పిన విధమగు ఆచరణములతో తమ జీవితము గడువక ఆయా పుణ్యాపుణ్య సంమిశ్రమగు సంకీర్ణ కర్మములను (శాస్త్రవిధి నిషేధములను పట్టించుకొనక తమకు తోచినట్లు చేయు కర్మలు సంకీర్ణ కర్మములు) ఆచరించుచు దానిచే లభించు ఆయా వివిధ జన్మములందును. తమ వర్ణాశ్రమ ధర్మములను శాస్త్రానుసారము పాటించక భ్రష్టులై స్వాహా- స్వధాకారములతో దేవపితృ కర్మముల ఏవియు ఆచరించక జీవించినవారు తమ దేహము పోయిన తరువాత ప్రేత భూతలయి యముని లోకమునకు పోయి దురవస్థల పాలయి యాతనానుభవ న్థానమున కేగి తాము ఈ లోకమున చేసిన ఆయా కర్మములను తలచుకొని పశ్చాత్తాపపడుచు శోకించుచు ఉందురు. అచ్చట వీరు పొడవగు దేహములతో రక్త మాంసములు లేక శుష్కించి గడ్డములు మీసములు తెగ పెరిగి వస్త్రములు లేక ఆకలి దప్పులతో బాధ పడుచు యాతనా లోకములో అటుఇటు పరుగెత్తుచుందురు. ఆయా యాతనాస్థానములందు పడవేయబడుచు వారు యాతనల ననుభవింతురు. ఇతరు లెవరైన అన్నము పెట్టుదురాయని పరాన్నములు కోరుచు నదులు సరస్సులు చెరువులు కోనేరులు (నీటికై) వెదకుచు పోయి పోయినచోటినుండి (యమదూతలచే) తరిమివేయబడుచు తిరుగుచుందురు. అచట వీరిని ఆ దూతలు శాల్మలి (ముండ్ల బూరుగు) వైతరణి (నెత్తురు-చీము మొదలగు కశ్మలముతో నిండిన నది ) కుంభి - కారంభ వాలుకము - అసిపత్ర వనము మొదలగు యాతనా స్థానములందు తమ తమ కర్మానుసారము పడద్రోయబడుదురు. వా రచట ఎంతో దుఃఖ మనుభవించుచు పండుకొనుటకు తావు దొరకక బాధ పడుచుందురు.

తేషాం లోకాన్తరస్థానాం బాన్ధవై ర్నామగోత్రతః | భూమా వాస్తృతదర్భేషు దత్తాః పిణ్డా స్త్రయస్తువై. 73

ప్రాప్తాస్తు తర్పయన్త్యేవ ప్రేతస్థానే ష్వధిష్ఠితా& | అప్రాప్తా యాతనాస్థానం ప్రభ్రష్టా యేచ పఞ్చధా. 74

పశ్చాద్యే స్థావరాంతేవై భూతానీకే ప్రయత్నతః | యేచాన్యే స్థావరాస్తేవై భూతదీపై#్త స్స్వకర్మభిః. 75

నానారూపాసు జాతేషు తిర్యగ్యోనిషు మూర్తిషు | యదాహారా భవన్త్యేతే తాసుతాస్వితి యోనిషు. 76

తస్మిం స్తస్మిం స్తదాహారే శ్రాద్ధందత్తంతు ప్రీణయేత్‌ | కాలే న్యాయాగతం పాత్రే విధినా ప్రతిపాదితమ్‌. 77

ప్రాప్నువన్త్యమరా దత్తం యత్రయత్రచ తిష్ఠతి | యథా గోషు ప్రతిష్ఠాసు వత్సో విన్దతి మాతరమ్‌. 78

తద్వచ్చాస్త్రేషు దృష్టాన్తో మన్త్రః ప్రాపయతే పురమ్‌ |

ఏవం హ్యవికలం శ్రాద్ధం శ్రద్ధాదత్తం మును ర్బ్రవీత్‌. 79

సనత్కురమారః ప్రోవాచ పశ్యన్దివ్యేన చక్షుషా | గతాగతజ్ఞః ప్రేతానాం ప్రాప్తిం శ్రాద్ధస్య చైవహి. 80

కృష్ణ పక్ష స్త్వహస్తేషాం శుక్లే స్వప్నాయ శర్వరీ | ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పితరస్తు యే. 81

అన్యోన్యపితరో హ్యేతే దేవాశ్చ పితరో దివి | ఏతేతు పితరో దేవా మనుష్యాః పితరస్తు వై. 82

పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః | ఇత్యేష విషయః ప్రోక్తో పితౄణాం సోమపాయినామ్‌. 83

ఏతత్పితృమహత్త్వంహి పురాణ నిశ్చయం గతమ్‌ | ఇత్యేష సోమసూర్యాభ్యా మైళస్య చ సమాగమః.

అవాప్తిః శ్రద్ధయాచైవ పితౄణాం చైవ తర్పణమ్‌ | పర్వణాం చైవ యః కాలో యాతనాస్థాన మేవచ. 85

సమాసా త్కీర్కిత స్తుభ్యం సర్గఏష సనాతనః | వైదుష్యాయ న తత్సర్వం కథితం త్వేకదేశకమ్‌. 86

అశక్యం పరిసఙ్ఖ్యాతుం శ్రద్ధేయం భూతి మిచ్ఛతా | స్వాయమ్భువస్య దేవస్య ఏష సర్గో మయేరితః. 87

విస్తరేణానుపూర్వ్యాచ్చ భూయః కిం కథయామి వః. 87

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మన్వన్తరానుకీర్తనే అమావాస్యాకాలనిర్ణయాది

కథనం నామ చత్వారింశదుత్తర శతతమోధ్యాయః.

ఇట్టివారు లోకాంతరములందు యాతనా స్థానములందు ఉన్నను వారి బాంధవులు ఈ లోకమందు ఈ ప్రేతల నామ గోత్రముల నుచ్చరించుచు భూమిపయి దర్భలను పరచి మూడు పిండములను ఉంచగా అవి ఈ శ్రాద్ధకర్తృ యజమానుని పితృ పితామహ ప్రపితామహులకు అంది వారికి తృప్తికలిగించును. ఒకవేళ ఈ శ్రాద్ధకర్తృ యజమానుని మృతలౌకిక పితరులు లోకాంతరములందు యాతనా స్థానములందుండక అచటినుండి ఈవలకు పడి దేవాసుర మానవ తిర్యక్‌ స్థావర జన్మములు అను ఐదింటిలో దేనియందైన నున్నను స్వకర్మానుసారము స్థావర జన్మములందు భూతత్వ మాత్రమును సూచించు ఎంత క్షుద్ర జన్మమునందు ఉన్నను తిర్యక్‌ (పశుపక్షి మృగ) జన్మములందలి నానా రూపములు గల యోనుల (జన్మముల)లో ఏయోనియందు ఏ మూర్తితో నున్నను అందు ఆ ప్రాణి ఏఆహారమును తినునదియైనచో ఈ శ్రాద్ధకర్తృ యజమానుడిచ్చిన శ్రాద్ధీయాహారము ఆ ఆహారముగా మారి ఆ ప్రాణిని తృప్తినొందించును. అంతేకాక ఈ ప్రేతప్రాణి తన జీవితకాలమందు తానుకాని అతని పుత్త్ర పౌత్త్రాదులు ఇప్పుడు కాని తమ న్యాయార్జిత ధనము నుండి సత్పాత్రమునందు శాస్త్ర విధిననుసరించి ఇచ్చిన దానవుఫలముకూడ దేవతలచే గ్రహింప (అందుకొన) బడి అది వారిచే ఈ మృతప్రేత ప్రాణికి - ఆ ప్రాణి ఏ జన్మమునందున్నను - అందజేయబడు. గోవులు తప్పిపోయి ఎచ్చట ఏవిధముగా నున్నను దూడ పోయి తన తల్లిని గుర్తించగలదు. అట్లే మంత్రము శ్రాద్ధ దానాది ఫలమును ఆ ప్రేత ప్రాణికి అందజేయును. అను ఈ లౌకిక దృష్టాంతముతో ఇది శాస్త్రములందు చెప్పబడియున్నది. ఇట్లు శ్రద్దతో జరిపిన శ్రాద్ధము అవికలము - సంపూర్ణము-సమగ్రము-అగునని మనువు చెప్పెను. అని సనత్కుమారుడు తన దివ్య తపోమయ నేత్రముతో చూచి ప్రేతల గతాగతములను వారికి శ్రాద్ధఫలములు అందు విధమును ఎరిగి చెప్పెను. ఈ పితృలోకస్థ పితరులకు (పితృదేవతలకు; లౌకిక పితరులకు కాదు) మానవుల కృష్ణపక్షము పగలుగా - శుక్లపక్షము రాత్రిగా అగును. ఇట్లు పితృదేవతలు - దేవతలు - (లౌకిక) పితరులు అను మూడు విధములగు వారి విషయమును చెప్పబడినది. పితృదేవతలును దేవతలును ద్యులోకమున వీరికి వారును వారికి వీరిని పరస్పరము పితరులుగా ఆరాధన లందుకొందురు. మనుష్య పితరులు - లేదా లౌకిక పితరులు అనగా మానవలోకమునందలి శ్రాద్ధకర్తృ యజమానుల పితృపితామహ ప్రపితామహులు అని తెలియవలయును. సోమ పాయులగు (సోమునినుండి లభించు అమృతమును త్రావు) పితరుల విషయము ఇది; అన్ని శాస్త్రములందును ప్రవచింపబడిన దానిని నీకు చెప్పతిని. ఇదియంతయు *పురాణమునందు పితృ మహత్త్వము (పితరుల గొప్పదనము) అను పేరుగల ప్రకరణమునందు చెప్పబడియున్నది.

ఇట్లు నీకు ఇచట ఇలాపుత్త్రుడగు పురూరవసుడు తన మాతామహుడగు సూర్యుని - పితామహుడగు చంద్రుని కలియుటయు శ్రద్ధాయుక్తుడై అతడచట శ్రాద్ధకాలమెరిగి ఆకాలమునకు వేచియుండుటయు పితరుల నతడు తృప్తి నొందించుటయు పర్వకాల పరిమాణ స్వరూపమును మృతప్రేత ప్రాణుల యాతనాస్థాన స్థితిని నీకు సంక్షేపముగ తెలిపితిని. ఇది సనాతనము (నిత్యమును అతి ప్రాచీనమును) అగు సృష్టి వ్యవస్థా ప్రకారము. నీకు దీనియందు వైదుష్యము (సంపూర్ణ పాండిత్యము) కలుగునంత విస్తరముగకాక ఏకదేశము - అల్పాంశము - మాత్రము తెలిపితిని. ఇదియంతయు పరిసంఖ్యానము చేయుట (పరితః-సమగ్రముగా; సంఖ్యాయ-లెస్సగా ఎరిగి-ప్రతిపాదించుట) ఎట్టివారికిని శక్యముకాదు. దీనిని మానవులు వ్యవస్థ చేసిన ప్రత్యక్షానుమానాది ప్రమాణములతో నిరూపించ అలవికాదు. నిరూపించరాదు. తనకు (ఇహమునను పరమునను) క్షేమము కలుగవలెనని దీనిని శ్రద్ధతో (సర్వ సాధారణ) దృష్టికందనిదియు కలదను నమ్మికతో) ఆచరించవలయును. స్వాయంభువమనుని సృష్టి వ్యవస్థా ప్రకారమిది నీకు విస్తరించి ఆను పూర్వితో (దేని తరువాత ఏది చెప్పవలెనో అదే క్రమమున) చెప్పితిని. మీకు ఇంకేమి చెప్పవలయు నందురో అడుగుడు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మన్వంతరాను కీర్తనమున అమావాస్యా కాలనిర్ణయాది

ప్రతిపాదనమను నూట నలువదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters