Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకోనవింశో7ధ్యాయః.

ద్విజాదికృతశ్రాద్ధేన పితృతృప్తివిషయః.

ఋషయః : కథం కవ్యాని దత్తాని హవ్యాని చ జనైరిహ| గచ్ఛన్తి పితృలోకస్థా న్ప్రాపకః కో7త్ర గద్యతే.

యది మర్త్యో ద్విజో భుంక్తే హూయతే యది చానలే | శుభాశుభాత్మకం ప్రేతదత్తం తద్భుజ్యతే కథమ్‌. 2

సూతః : వసూ న్వద న్తిచ పితౄ న్రుద్రాంశ్చైవ పితామహా& |

ప్రపితామహాం స్తథాదిత్యా నిత్యేవం వైదికీ శ్రుతి. 3

నామగోత్రే పితౄణాంతు ప్రాపకం హవ్యకవ్యయోః| శ్రాద్ధస్య మన్త్రా శ్ర్శద్ధాచ ఉపయోజ్యాశ్చ భక్తితః.

అగ్నిష్వాత్తాదయ స్తేషా మాధిపత్యే వ్యవస్థితాః | నామగోత్రం కాలదేశాః భవాన్తరగతానపి. 5

ప్రాణినః ప్రీణయన్త్యేతే తదాహారత్వ మాగతా& |దేవో యది పితాజాత శ్శుభాకర్మానుయోగతః. 6

తస్యాన్న మమృతం భూత్వా దివ్వత్వే ష్యనుగచ్ఛతి| దైత్యత్వే భోగరూపేణ పశుత్వేచ తృణం భ##వేత్‌.

శ్రాద్ధాన్నం వాయురూ పేణ సర్పత్వే ప్యుపతిష్ఠతి | పానం భవతి యక్షత్వే గృధ్రత్వే7పి తథామిషమ్‌. 8

దనుజత్వే తథా మాయా ప్రేతత్వే రుధిరోదకమ్‌ | మనుష్యత్వేన్నపానాని నానాభోగరసం భ##వేత్‌. 9

రతిశ్శక్తి స్త్రియః కాన్తి ర్భోజ్యం భోజనశ క్తితా | దానశక్తి స్సవిభవరూప మారోగ్యమేవచ. 10

శ్రాద్ధపుష్ప మిదం ప్రోక్తం ఫలం బ్రహ్మసమాగమః |

ఆయుఃపుత్త్రాన్ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ. 11

రాజ్యంచైవ ప్రయచ్ఛన్తి ప్రీతాః పితృగణా నృణామ్‌ | శ్రూయతేచ పరంమోక్షం ప్రాప్తాః కౌశికసూనవః.

పంచభి ర్జన్మసమ్భన్ధైర్గతా విష్ణోః పరం పదమ్‌.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుసంవాదే శ్రాద్ధకల్పే ద్విజాదిదత్త

శ్రాద్ధఫలానుభవకథనం నామైకోనవింశతితమో7ధ్యాయః.

పందొమ్మిదవ అధ్యాయము.

శ్రాద్ధముచే పితరులకు తృప్తి కలుగు విధము.

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి: ''లోకమున పితృ కర్మలయందు పితృదేవతలను ఉద్దేశించి జనులు ఇచ్చిన కవ్యములును (పితృ దేవతలకు ఇచ్చిన ద్రవ్యములు అన్నము మొదలైనవి) హవ్యములును (విశ్వేదేవులు మొదలగు వారిని ఉద్దేశించి ఇచ్చిన ద్రవ్యములు అన్నము మొదలగునవి) పితృలోకమునందున్ను పెద్దలకుగాని పితృదేవతలు మొదలగు వారికి గాని ఎట్లు చేరును ? ఈ పదార్థముల వలన కలుగు తృప్తిని అచ్చటికి చేర్చువారు ఎవరు ? ఇక్కడ ఈ పదార్థములను తినువారును అనుభవించువారును మానవులగు బ్రాహ్మణులు గదా! హోమము చేయునది అగ్ని హోత్రమునందు కదా! ప్రేతలనుద్దేశించి ఇచ్చిన ఈ పదార్థములు శుభాశుభ రూపులై పుణ్యమో పాపమో చేసియుండి ఈ లోకమును విడిచిపోయి ఉన్న ఆ ప్రేతలు ఏ విధముగా అనుభవింతురు ?''

సూతుడు ఆ ఋషులతో ఈ విధముగా చెప్పనారంభించెను : పితృ శ్రాద్ధములను ఆచరిందు ప్రక్రియలో పితను మాతను వసు రూపులనుగా పితామహుని పితామహిని రుద్రరూపులనుగా ప్రపితామహుని ప్రపితామహిని ఆదిత్య రూపులనుగా చెప్పుదురు. ఇట్లని శ్రుతి ప్రమాణము. వారిని వారిని ఈఈ రూపములతో ఉన్నట్లు పేర్కొనుటతో బాటు పితరుల నామమును గోత్రమును కూడ చెప్పుదురు. ఇవియే శ్రాద్ధక ర్త ఇచ్చిన హవ్యకవ్యములను ఆయా పితరులకు చేర్చును. ఇదికాక శ్రాద్ధపు మంత్రములను శ్రద్ధను భక్తి పూర్వకముగ శ్రాద్ధమున ఉపయోగించవలెను. అగ్ని ష్వాత్తులు మొదలగు పితృదేవతా గణములవారు పితరులకును వారినుద్దేశించి ఇచ్చిన ద్రవ్యములకును అధిపతులై యుందురు. పితరుల నుద్దేశించి చెప్పిన ఈ వసురుద్రాదిత్య రూప నిర్దేశములును వారికి ఆహారముగా ఇచ్చిన దానిని వారికి అందజేసి తృప్తి కలిగించును.

ఎట్లన-ఒకానొక శ్రాద్ధక ర్తయొక్క తండ్రి తన శుభకర్మ బలమువలన దేవత్వమును పొందెను. అను కొందము. ఈ లోకమునందలి అతని కుమారుడు అతనినుద్దేశించి ఇచ్చిన అన్నము అమృతమై దేవత్వములో ఉన్న ఆ తండ్రికి చేరును. ఆ తండ్రియే రాక్షసుడై యున్నచో ఈ కుమారుడు శ్రాద్ధమున ఇచ్చిన అన్నము అతనికి తగిన భోగముగా అందును. పశువుగా ఉన్నవానికి గడ్డియై అందును. పామయియున్న వానికి గాలియై చేరును. యక్షులై యున్న పితరులకు పానీయవై గ్రద్దగానున్న వారికి మాంసమయి దనుజులై యున్న వారికి మాయగా అయి పిశాచములుగా అయియున్న పితరులకు రక్తపానీయమయి మనుష్య జన్మము పొందియున్న పితరులకు అన్నము పానము భోగము ర సద్రవ్య ములునయి వారివారికి చేరును.

ఆనందానుభవము శ క్తి స్త్రీలు కాంతి భోజ్యద్రవ్యములు భుజించు శ క్తి దానము చేయు శక్తి విభవము రూపము ఆరోగ్యము ఇవి అన్ని యు శ్రాద్ధపు వూవులు-బ్రహ్మత్వ ప్రాప్తి ఫలము. మానవులు జరిపిన శ్రాద్ధమువలన ప్రీతినొందిన పితృదేవతలు శ్రాద్ధక ర్తకు ఆయువును పుత్త్రులను ధనమును విద్యను స్వర్గమును మోక్షమును సుఖములను రాజ్యమును కూడ ఇత్తురు. కౌశిక గోత్రమునందలి బ్రాహ్మణులు (లేదా కౌశికుని కుమారులు) శ్రాద్ధముచే పితృదేవతలకు తృప్తి కలిగించినందువలన తత్ఫలితముగా ఐదు జన్మలతోనే మోక్షమును పొంది విష్ణు స్థానమును చేరుకొనిరి. అని పరంపరలో వినబడుచున్నది.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్ధముచే పితరులకు తృప్తి కలుగు విధము అను పందొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters