Sri Matsya Mahapuranam-1    Chapters   

వింశో7ధ్యాయః

కౌశికదాయాదకృతశ్రాద్ధా త్తేషాం విష్ణులోకప్రాప్తిః.

ఋషయః : 

కథం కౌశికదాయాదాః ప్రాప్తాస్తే యోగము త్తమమ్‌ | పఞ్చ భిర్జన్మసమృన్ధైః కథం కర్మక్షయో7భవత్‌. 1

సూతః : కౌశికో నామ ధర్మాత్మా కురుక్షేత్రే మహానృషిః | నామతః కర్మత స్తస్య సుతా స్సప్త నిబోధత.

స్వసృపః : క్రోధనో హింస్రో మిథునః కవిరేవచ | వాగ్దుష్టః పితృవర్తీచ గర్గశిష్యా స్తదా7భవ9. 3

పితర్యుపరతే తేషా మభూ ద్దుర్భిక్షముల్బణమ్‌ | అనావృష్టిశ్చ మహతీ సర్వలోకభయఙ్కరీ. 4

గర్గాదేశా ద్వనే దోగ్ధ్రీం చరతస్తే తపోధనాః | భక్ష్యామ కపిలా మేతాం వయం క్షుత్పీడితా భృశమ్‌. 5

ఇతా చి న్తయతాం పాప మఘం ప్రాహ తదానుజః | యద్యవశ్యమియం వధ్యా శ్రాద్ధరూ పేణ యోజ్యతామ్‌.

శ్రాద్ధే నియోజ్యమానేయం పాపం నశ్వతి నో ధ్రువమ్‌ | తతః కుర్వ న్ననుజ్ఞాతః పితృవర్తీ తదానుజః. 7

చక్రే సమాహిత శ్శ్రాద్ధ ముపయుజ్యచ తాం పునః |

ద్వౌ దైవే భ్రాతరౌ కృత్వా పిత్ర్యే త్రీన ప్యనుక్రమాత్‌. 8

కథౌక మతిథిం కృత్వా శ్రాద్ధద స్స్వయమేవతు | చకార మన్త్రవ చ్ఛ్రద్ధం స్మర న్పితృపరాయణః. 9

వినా గాం వత్స ఏకోపి గురవే తు నివేదితః | వ్యాఘ్రేణ నిహతా ధేను ర్వత్సో7యం ప్రతిగృహ్యతామ్‌.

ఏవం సా భక్షితా ధేను స్సప్తభి సై#్త స్తపోధనైః | వైదికం బలమాశ్రిత్య క్రూరకర్మణి నిర్భయైః. 11

ఇరువదవ అధ్యాయము.

కౌశిక వంశీయులు శ్రాద్ధఫలముగా విష్ణులోకమును పొందుట.

ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: ''కౌశిక వంశీయులు తాము జరిపిన శ్రాద్ధమునకు ఫలముగా ఉత్తమమగు యోగమును ఎట్లు పొందగలిగిరి? ఐదు జన్మముల సంబంధముతోనే వారికి కర్మక్షయము కలిగి విష్ణులోక ప్రాప్తి ఎట్లు కలిగెను?''

సూతుడు వారికి ఇట్లు చెప్పనారంభించెను: పూర్వము కురుక్షేత్రమునందు కౌశికుడు అను ధర్మాత్ముడగు మహర్షి యుండెడివాడు. అతనికి ఏడుమంది కుమారులు ఉండిరి. వారుతమపేరులకుతగినకర్మలనుఆచరించెడివారు.ఎట్లనస్వసృపుడు-క్రోధనుడు-హింస్రుడు-పిశునుడు-కవి-వాగ్దుష్టుడు-పితృవర్తి-అని వారి పేరులు (తన ఇష్టముననుసరించి నడుచు కొనువాడు-కోపస్వభావము కలవాడు-ఇతరులకు అకారణముగా బాధ కలిగించువాడు-చాడీలు చెప్పువాడు-కవిత్వము అల్లగల వాడు-చెడునోటివాడు-తండ్రియందు భక్తితోనడుచుకొనువాడు) వీరు అందరును గర్గమునికి శిష్యులయి విద్యలనభ్యసించిరి. కొంతకాలమునకు వీరి తండ్రి మరణించెను. పిమ్మట ఒకప్పుడు భయంకరమగు కరవువచ్చెను. సర్వలోకములకు భయంకరమగు దీర్ఘకాలికమగు అనావృష్టి (వరపు-వానలు కురియకపోవుట) ఏర్పడెను. ఈ ఏడుగురు తపోధనులును గర్గుని ఆజ్ఞచే ఆమునియొక్క పాడియావును మేపుచుండగా వారిలో కొందరు '' మనము ఆకలితో చాల బాధపడుచున్నాము. ఈకపిల గోవును చంపి తిందము.'' అనిరి. వారిలో కడపటివాడు ఇది పాపకరమనిచెప్పెను. ఒకవేళ మనము దీనిని చంపితినుట తప్పనిసరిఐనచో పితృశ్రాద్ధము జరుపుదము. దానిలో దీనిని వినియోగించి తిందము. ఆ విధముగాచేసి తినినచో మనకు పాపము అంటదు. గోవదపాపము నశించును. అనికూడ అతడు (పితృవర్తి) పలికెను. మిగిలిన వారు అతని మాట సరేయనిరి. వారి అనుమతితో అతడు శ్రద్ధతో శ్రాద్ధము జరిపెను. ఆ శ్రాద్ధమునందు ఆ శ్రాద్ధమునుందు ఆ గోవును అన్నమునకు మారుగా ఉపయోగించెను. పితృస్థానమునందు ముగ్గురను దైవస్థానమునందు ఇద్దరను తన సోదరులనే అర్చించి భోక్తలుగా కూర్చుండ బెట్టి భుజింపజేసెను. మరియొకనిని అతిథిగా గ్రహించి భుజింపచేసెను. తాను శ్రాద్ధకర్త అయి శ్రాద్ధమును ఆ పితృభక్తి పరాయణుడు మంత్రపూర్వకముగా శ్రాద్ధము జరిపెను.

తరువాత వారు గోవులేకుండ దూడను ఒక్కదానినే గురునకు అప్పగించిరి. ఆవును పులి చంపినది. ఈ దూడను మాత్రమే తీసికొనుడు. అని అప్పగించిరి. ఇట్లు ఆ తపోధనులు ఏడుగురును వేదవిధిని బలముగా(ప్రమాణముగా) ఆశ్రయించి నిర్భయులై క్రూరకర్మము జరిపి గోవును తినిరి.

తతః కాలాచ్చ కృష్టాస్తే వ్యాధా దాశపురే7భవ& | జాతిస్మరత్వం ప్రాప్తాస్తే పితృభావేన భావితాః. 12

యత్కృతం క్రూరకర్మాపి శ్రాద్ధరూ పేణ తైస్తదా | తేన తే భవనే జాతా వ్యాధానాం క్రూరకర్మణామ్‌.

పితౄణాంచైవ మాహాత్మ్యా జ్జాతా జాతిస్మరాస్తుతే | తేన వైరాగ్యయోగేన ఆస్థాయానశనం పునః. 14

కౌశికదాయాదానాం మృగాదిజన్మాన్తరప్రాప్తిః.

జాతిస్మరా న్సప్తజాతా మృగాః కాళఞ్జరే గిరౌ | నీలకణ్ఠస్య పురతః పితృభా వానుభావితాః. 15

తత్రాపి జ్ఞానవైరాగ్యా త్ప్రాణానుత్సృజ్య ధర్మతః | లోకైరవేక్ష్యమాణాస్తే తీర్థతో7నశ##నేన తు. 16

మానసే చక్రవా స్తే సంజాతా స్సప్త యోగినః | నామతః కర్మత స్సర్వా న్ఛృణుధ్వం ద్విజసత్తమాః.

సుమనాః కుముద శ్శుద్ధ శ్ఛిద్రదర్శీ సునేత్రకః | అనేత్ర శ్చాంశుమాంశ్చైవ సపై#్తతే యేగపారగాః. 18

యోగభ్రష్టా స్త్రయస్తేషాం బభూవు శ్చాల్పచేతనాః | దృష్ట్వావై భ్రాజనామాన ముద్యానే స్త్రీభి రన్వితమ్‌.

క్రీడన్తం వివిధై ర్భావై ర్మహాబలపరాక్రమమ్‌ | పాఞ్చాలాన్వయసమ్భూతం ప్రభూతబలవాహనమ్‌. 20

రాజ్యకామో7భవత్త్వేక స్తేషాం మధ్యే జలౌకసామ్‌ | పితృవర్తీచ యో విప్రశ్శాద్ధకృ త్పితృవత్సలః.

అపరౌ మన్త్రిణౌ దృష్ట్వా ప్రభూతబలవాహనౌ | మన్త్రిత్వే చక్రతు శ్చేచ్ఛా మస్మిన్మర్త్యే ద్విజోత్తమాః.

తన్మధ్యే యే తు నిష్కామా స్తే బభూవు ర్ద్వి జోత్తమాః| వైభ్రాజపుత్త్రస్త్వేకోభూ ద్రహ్మదత్త ఇతి స్మృతః.

మ న్త్రిపుత్త్రౌ తథోభౌచ కణ్డరీకసువాలకౌ | బ్రహ్మదత్తోభిషిక్తస్స న్పురోహితవిపశ్చితా. 24

పాంచాలరాజో విక్రాన్త స్సర్వశాస్త్రవిశారదః | యోగవి త్సర్వజన్తూనాం రుతవేత్తా7భవత్తదా. 25

తరువాత కొంతకాలమునకు వారు కాలునకు వశులై మరణించిరి. మరు జన్మమున వారు దశార్ణదేశ రాజధాని యగు దశపురమున వ్యాధులు (బోయవారు)గా పుట్టిరి. పితృ శ్రాద్ధము శ్రద్ధతో జరిపిన శ్రద్ధాభావముతో భావితులై (నంస్కారముపొంది)నందున పూర్వజన్మ స్మరణము వారికి కలిగియుండెను. వారు చేసిన క్రూరకర్మకు ఫలముగా క్రూర కర్ములగు బోయల ఇంట జన్మించిరి. వారు వై రాగ్యముతో తమ జీవితము గడపిరి. అనశన (నిరాహార) వ్రతముతో దేహమునవదలి తరువాత జన్మములో కాలంజరపర్వతమున పూర్వజన్మ స్మృతికల లేళ్లుగా జన్మించిరి. అచటను వారు శివుని సన్నిధిలో జ్ఞానవై రాగ్యములతో ధర్మముతో జీవించి తుదకు దేహామువదలిరి. వారు ఈమృగ జన్మమున తీర్థవాసము తోను అనశన వ్రతముతోను దేహాత్యాగము చేయుటను అచటిజనులు అందరును ప్రత్యక్షముగా చూచిరి. తరువాత వారు మానస సరస్సులో యోగులగు చక్రవాక పక్షులుగా జన్మించిరి. వారి పేరులు ఈ జన్మములో సుమనుడు-కుముదుడు-శుద్ధుడు-ఛిద్రదర్శి-సునేత్రుడు-అనేత్రుడు-అంశుమంతుడు (మంచి మనస్సు కలవాడు-లోకమునకు సంతోషము కలిగించువాడు నిర్మలుడు ఇతరుల దోషములను ఎత్తి చూపువాడు-మంచిని చూచువాడు-ఏమియు చూడనివాడు-కిరణ ప్రకాశము కలవాడు) అనునవి సార్థకములై యుండెను. వారు తమ పేరునకు తగినట్లు కర్మల నాచరించుచుండిరి. వీరు ఏడుమందియు యోగత త్త్వము నెరిగినవారయి యుండిరి. కాని వారిలో ముగ్గురు యోగభ్రష్టులయి తక్కువ బుద్ధి శక్తి కలవార యియుండిరి.

ఒకనాడు వారు పాంచాల దేశరాజగు వైభ్రాజుడను నతనిని చూచిరి. ఆ రాజు ఒక ఉద్యానవనమున భార్యలతో కూడి వివిధ విలాసభావములతో విహరించుచుండెను. అతడు మహాబలపరాక్రమములు కలవాడు . అధికమగు పరివారమును వాహనములును కలవాడు.

ఈ కౌశిక కుమారులలో కడపటివాడు (తండ్రియందు భక్తి కలవాడయి యుండి భక్తితో శ్రద్ధతో పితృశ్రాద్ధమును జరిపిన పితృవర్తి అను నాతడు) ఈ రాజును చూచి తానును రాజు కావలెనని సంకల్పించెను. మిగిలిన వారిలో ఇద్దరు అధిక మగు పరివారమును వాహనములును కలిగియున్న రాజమంత్రులను ఇద్దరను చూచి తామును అట్లు మంత్రులు కావలెనని కోరుకొనిరి. (వీరు ముగ్గురును యోగభ్రష్టులు) మిగిలిన నలుగురును ఏమియు కోరుకొనలేదు.

తరువాత జన్మమున పితృవ ర్తి అను నాతడు ఈ వైభ్రాజుడను పాంచాల రాజునకు కుమారుడయి బ్రహ్మదత్తుడను పేర పుట్టెను. మిగిలిన వారు ఇద్దరును కండరీక సువాలకులు అను పేర విభ్రాజుని మంత్రికి కుమారులైరి. ఏ కోరికలు లేని నలుగురును బ్రాహ్మణులై పుట్టిరి.

కొంతకాలమునకు పండితుడగు పురోహితునిచేత బ్రహ్మదత్తుడు పాంచాల రాజుగా పట్టాభిషిక్తుడయ్యెను. అతడు విక్రమము కలవాడు. సర్వశాస్త్ర విశారదుడు. యోగము నెరిగినవాడు. సర్వప్రాణుల ధ్వని విశేషములను ఎరిగినవాడు.

తస్యరాజ్ఞో7భవద్భార్యా దేవలస్యాత్మజా శుభా | సన్నతిర్నామ విఖ్యాతా కపిలా యా7భవత్పురా. 26

పితృకార్యే నియుక్తత్వా దభవ ద్బ్రహ్మవాదినీ| తయా చకార సహిత స్స రాజ్యం రాజనన్దనః. 27

కదాచి దుద్యానగత స్తయా సహ స పార్థివః | దదర్శ కీటమిథున మనఙ్గకలహాకులమ్‌. 28

కీటమిథునసంవాదః.

పిపీలికా మనునయ న్పరితః కీటకాముకః | పఞ్చబాణాభితప్తాఙ్గ స్సగద్గద మువాచ హ. 29

న త్వయా సదృశీ లోకే కామనీ విద్యతే క్వచితే | మధ్యే క్షామా7తిజఘనా బృహద్వక్షోరుగామినీ. 30

సువర్ణవర్ణా సుశ్రోణీ మద్భక్తా చారుహాసినీ | సులక్షనేత్రర దనా గుడశర్క రవత్సలా. 31

భోక్ష్యసే మయి భు క్తే త్వం స్నాసి స్నా తే తథా మయి | ప్రోషితే సతి దీనా త్వం క్రుద్ధేపి భయచంచలా.

కిమర్థం వద కల్యాణి సరోషవదనా స్థితా | సా తమాహ సకోపా తు కిమాలపసి మాం శఠ. 33

త్వయా మోదకచూర్ణంతు మాంవిహాయాభిలష్యతా |ప్రమత్తేన వ్యతిక్రాన్తే దినే 7న్యస్యా స్సమర్పితమ్‌.

పిపీలికః : త్వత్సాదృశ్యా న్మయా దత్త మన్యస్యా వరవర్ణిని | తదేక మపరాధం మే క్షన్తు మర్హసి భామిని.

నైతదేవం కరిష్యామి వునఃక్వాపీహ సువ్రతే | స్పృశామి పాదౌ సత్యేన ప్రసీద ప్రణతస్య మే. 36

సూతః : ఇతి తద్వచనం శ్రుత్వా సాప్రసన్నా7భవ త్తతః| ఆత్మాన మర్పయామాస మోహనాయ పిపీలికా.

బ్రహ్మదత్తో ప్యశేషంతద్‌జ్ఞా త్వా విస్మయమాగమత్‌ | సర్వస త్త్వరుతజ్ఞత్వా త్ప్రభావా చ్చక్రపాణినః.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ మత్స్యమనుపసంవాదే స్వసీపాదికృతశ్రాద్ధ

ఫలానుభవథనం నామ వింశతితమో7ధ్యాయః.

కౌశిక పుత్త్రులు జరిపిన శ్రాద్ధమున ఉపయోగింపబడినదగు గర్గుని కపిలగోవును ఈ కాలమున దేవలుడను రాజునకు కుమార్తెగా సన్న తి అను పేరుతో జన్మించెను. పితృకార్యమున ఉపయోగింపబడిన ఫలమున ఆమె వేదత త్త్వ వేత్త్రి యయ్యెను. విభ్రాజరాజు పాలనము చేయుచుండెను.

ఒకనాడు బ్రహ్మదత్తునకు ఉద్యానవనమున కామ ప్రవృత్తి హేతువుగా కలహించుకొనుచున్న చీమల దంపతులు కనబడెను. మగచీమ కామబాణముల తాకిడిచే తన శరీరము కంపించుచుండ డగ్గుత్తికతో సరిగి మాట రాకపోగా ఆడు చీమను బ్రతిమాలుచు ఇట్లు పలికెను: ''నీతో సమానురాలగు స్త్రీ లోకమునందు ఎవ్వతెయు ఎక్కడను లేదు. నీ నడుము సన్ననిది. నీ కటి ప్రదేశము విశాలమయినది. నీ వక్షోజములు చాల పెద్దవి. నీ నడక ధీరమయినది. నీది బంగారు ఛాయ. నీ పిరుదులు చక్కనివి. నా యందు భక్తి కలదానవు. చక్కని చిరునవ్వు చక్కగా కనబడు కన్నులు దంతములు కలదానవు. నీకు బెల్లము మీదను చక్కెర మీదను ప్రీతి ఎక్కువ. నేను భుజించనిదే నీవు భుజించవు. నేను స్నానము చేయనిదే స్నానమాడవు. నేను దూర దేశమునకు పోయినచో నీవు దీనురాలై యుందువు. నేను కోపించినచో భయముతో వణకిపోదువు. కల్యాణీ! ఇట్టి నీవు ఇపుడు ముఖమున రోషముతో ఏల ఉన్నావు?''

మగచీమ మాటలు విని ఆడుచీమ కోపముతో ఇట్లు పలికెను: ''ఇతరుల మనస్సును నొప్పించువాడా! నీవు నన్నెందులకు పలుకరింతువు? (పలుకరించకుము.) నీవు నిన్నటి దినమున చాల మ త్తతతో లడ్డు పొడిని నాకు ఈయక మరియొక ఆడుచీమను అభిలషించి ఆమెకు ఇచ్చినావు.''

మగచీమ మరల ఇట్లు పలికెను: ''ఓ సుందరీ! నీ పోలికతో ఉండుటచే తెలియక నేను ఆ లడ్డు పొడి వేరొక చీమకు ఇచ్చితిని. నీవు కోపింపకుము. నీవు నేను చేసిన ఈ ఒక అపరాధమును క్షమింపుము. ఈ జీవితములో మరి ఇంకెప్పుడును ఇటువంటి తప్పు చేయను. సత్యము ప్రమాణముగా నీ పాదములు పట్టుకొనుచున్నాను. నమస్కరించు చున్నాను. నన్ననుగ్రహించుము.''

ఇట్లు పలికిన మగచీమ మాటలు విని ఆ ఆడుచీమ కోపము విడిచి ప్రసన్నురాలయ్యెను. తన్ను తాను ఆమె తన ప్రియునకు సమర్పించుకొనెను.

బ్రహ్మదత్తుడును ఈ విషయమంతయు ఎరిగి ఆశ్చర్యము పొందెను. విష్ణుదేవుని అనుగ్రహమున సర్వప్రాణుల ధ్వనులను వాటి అర్థమును అతడు ఎరిగియుండుటయే ఇందులకు హేతువు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్ధ ఫలానుభవ కథనమను ఇరువదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters