Sri Matsya Mahapuranam-1    Chapters   

సప్తవింశతితమో7ధ్యాయః.

శర్మిష్ఠాదేవయాన్యోర్విరోధకారణమ్‌.

శౌనకః : 

కృతవిద్యే కచే ప్రాప్తే హృష్టరూపా దివౌకసః | కచా దధీత్య తాం విద్యాం కృతార్థా భరతర్షభ. 1

సర్వ ఏవ నమాగమ్య శతక్రతు మథాబ్రువ& | కాల స్స్యాద్విక్రమ స్యాద్య జహి శత్రూ న్పురందర. 2

ఏవ ముక్తస్తు నహితై స్త్రిదశై ర్దేవరా ట్తదా | తతేత్యుక్త స్సుసంక్రుద్ధ స్సో7పశ్య ద్విజనే స్త్రియః. 3

క్రీడన్తీనాం తు కన్యానాం వనే చైత్రరథోపమే | వాయుభూత స్స వస్త్రాణి సర్వాణ్యవా హ్యమిశ్రయత్‌. 4

తతో జలా త్సముత్పేతు స్తాః కన్యా స్సహితా స్తదా| వస్త్రాణి జగృహు స్స్వాని యథా నాన్య దనేకశః. 5

తత్ర వాసో దేవయాన్యా శ్శర్మిష్ఠా జగృ హే తదా | వ్యతిక్రమ మజానన్తీ దుహితా వృషపర్వణః. 6

తత స్తయో ర్మిత స్త్సత్ర విరోధ స్సమజాయత | దేవయాన్యాశ్చ రాజేన్ద్ర శర్మిష్ఠాయాశ్చ తత్కృతే. 7

దేవయానీ: యస్మా ద్గృహ్ణాసి మే వస్త్రం శిష్యా భూత్వా మమాసురి |

సముదాచారహీనాయా న తే శ్రేయో భవిష్యతి. 8

శర్మిష్ఠా : ఆసీనం చ శయానం చ పితా తే పితరం మమ | స్తౌతి పృచ్ఛతి చాభీక్షం నీచస్థ స్సువినీతవత్‌. 9

యాచత స్త్వం చ దుహితా స్తువతః ప్రతి గృహ్ణతః |

సుతా7హం స్తూయమానస్య దదతో న తు గృహ్ణతః. 10

అనాయుధా సాయుధాయాం కిం త్వం కుప్యసి భిక్షుకి |

లక్షణం ప్రతియోద్ధారం న చ త్వాం గణయా మ్యహమ్‌. 11

శౌనకః : సవిస్మయాం దేవయానీం నతాం సక్తాం చ వాససి |

శర్మిష్ఠా ప్రాక్షిప త్కూ పేతత స్స్వపుర మావ్రజత్‌. 12

హతేయ మితి విజ్ఞాయ శర్మిష్ఠా పాపనిశ్చయా | అసమ్ప్రేక్ష్య గతా తస్మా త్క్రోధవేగపరాయణా. 13

ఇరువది ఏడవ అధ్యాయము

శర్మిష్ఠా దేవయానీ విరోధకారణము

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను: కచుడు శుక్రుని వలన విద్యను సంపాదించికొని రాగా దేవతలు మిగుల సంతోషించి ఆ విద్యను కచునినుండి అధ్యయనము చేసి కృతార్థు లయిరి. తరువాత వారు అందరును ఇంద్రుని కడకు పోయి-ఇది మనము విక్రమము చూపదగిన సమయము. శత్రువులను చంపుదము-అనిరి. వారి మాటను వినుచునే క్రోధముతో చూచిన ఇంద్రునకు విజన ప్రదేశమున కుబేరుని చైత్రరథమువంటి వనమున జలమున క్రీడించుచున్న రాక్షస కన్యలు కనబడిరి. అతడు వాయువుగా నయి వారి వస్త్రములను అన్నిటిని కలిపివేసెను. కొంత సేపటికి నీటినుండి పైకి వచ్చిన ఆ కన్యలు అందరును చాల వరకు ఒకరిది మరియొకరికి రాకుండునట్లు వస్త్రములను తీసికొని ధరించిరి. వారిలో వృషపర్వుని కూతురు శర్మిష్ఠ వస్త్రముల మార్పిడి గుర్తించలేక తాను దేవయాని వస్త్రమును తీసికొని ధరించెను. అంతట దాని నిమిత్తమై శర్మిష్ఠా దేవయానులకు విరోధము ఏర్పడెను.

దేవయాని ''నీవు రాక్షస కన్యవు నాకు శిష్యురాలవు ఐయుండి నా వస్త్రమును ధరించితివి. కనుక నీకు శ్రేయస్సు కలుగకుండుగాక!''

శర్మిష్ఠ: మా నాయన ఉన్నత స్థానమున కూర్చున్న ప్పుడును పండుకొన్నప్పుడును ఆయనను మీ నాయన తాను క్రింద నిలువబడి మాటికిమాటికి వినీతుడై స్తుతించుచు యాచించుచు ఉండును. నీవు పొగడెడి-అడుగుకొనెడి-వాని కూతురవు. నేనో - పొగడబడెడి-యాచింపబడెడి-వాని కూతురను. నీవు నిరాయుధవు. నేను సాయుధను. బిచ్చగ త్తెవు నీవు నాపై ఏమి కోపింతువు? నీకు సాటియగు ప్రతియోద్ధ (ఎదిరించి యుద్ధము చేయువాడు) లభించును లెమ్ము. నేను మాత్రము నిన్ను నా సరిదానిగా లెక్కింపను.''

జరిగిన దానికి ఆశ్చర్యపడుచు దేవయాని వంగి తన వస్త్రమునకై పట్టుదలతో నుండెను. ఆమెను బావిలోత్రోసి శర్మిష్ఠ తన పురమునకు పోయెను. పాప సంకల్పము గలదియై ఆ శర్మిష్ఠ దేవయాని మరణించియుండునని తలంచుచు క్రోధవేగవశురాలయి తిరిగియైన చూడక అక్కడినుండి వెడలిపోయెను.

చేతవ్యం దేశ మభ్యాగా ద్యయాతి ర్నహుషాత్మజః | శ్రాన్తయుగ్యః శ్రాన్తహయో మృగలిప్సుః పిపాసితః.

నాహుషిః ప్రేక్షమాణో7థ సనిపానే గతోదకే | దదర్శ కన్యాం తాం తత్ర దీప్తా మగ్నిశిఖా మివ. 15

తా మపృచ్ఛ త్స తత్రైవ కన్యా మమరవర్ణినీమ్‌ | సాన్త్వయిత్వా నరశ్రేష్ఠ స్సామ్నా పరమవల్గునా. 16

కా త్వం చారుముఖీ శ్యామా సుమృష్టమణికుణ్డలా | దీప్తా ధ్యాయసి చాత్యర్థం కస్మా చ్చోచసి చాతురా. 17

కథం చ పతితా హ్యస్మి న్కూ పే వీరుత్తృణావృతే దుహితా చైవ కస్య త్వం వద సర్వం సుమధ్యమే. 18

దేవయానీ : యో7సౌ దేవై ర్హతా న్దైత్యా నుత్థాపయతి విద్యయా |

తస్య శుక్రస్య కన్యా7హం స మాంనూనం న మన్యతే. 19

ఏష మే దక్షిణో రాజ న్పాణి స్తామ్రనఖాఙ్గుళిః | నముద్ధర గృహీత్వా మాం కులీన స్త్వం హి మే మతః 20

జానామి త్వాం చ శంసన్తి వీర్యవన్తం యశస్వినమ్‌ |

తస్మా న్మాం పతితాం కూపా దస్మా దుద్ధర్తు మర్హసి. 21

శౌనకః : తా మథ బ్రాహ్మణీం స్త్రీంచ విజ్ఞాయ నహుషాత్మజః |

గృహీత్వా దక్షిణ పాణా వుజ్జహార తతో7వటాత్‌. 22

ఉద్ధృత్య చైనాం తరసా తస్మా త్కూపా న్నరాధిపః |

ఆమ న్త్రయిత్వా సుశ్రోణీం యయాతి స్స్వపురం య¸°. 23

అంతలో నహుష పుత్త్రుడగు యయాతి వేటకై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు మృగముల వెంటనంటిపోగా పోగా అతన రథపు గుర్రములును తానును అలసిపోయెను. దప్పిగొనెను. అతడు నీటికై వెదకుచు దగ్గరలో నీటితొట్టి ఉండియు నీరులేని గోతిలో ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలవలె ఉన్న కన్యను దేవయానిని చూచెను. ఆ నరశ్రేష్ఠుడు మహా మనోహరమగుమాటలతో ఆమెను ఓదార్చుచు దేవకన్యవంటి ఆ దేవయానిని ఇట్లు ప్రశ్నించెను: ''మనోహరముఖము చక్కని దేహచ్ఛాయ చక్కగా మెరుగు దీర్చిన మణికుండలములు కలిగి ప్రకాశించుచున్న నీవు ఎవరవు? ఏల చింతించుచు ఆతురురాలవయి శోకించుచున్నావు? తీగలతో గడ్డితో కప్పబడి ఉన్న ఈ గోతిలో ఎట్లు పడితివి? నీవు ఎవ్వరి కూతురవు? అంతయు నాకు విశదముగా చెప్పుము.''

దేవయాని: ''యుద్ధమున మరణించిన దానవులను తన విద్యతో బ్రతికించెడి శుక్రుని ఎరుగుదువు కదా! నే నాతని కూతురను. కాని ఆయన నన్ను లెక్క పెట్టుచున్నట్లు లేదు. నీవు ఉన్నత వంశమున జన్మించినవాడవని నాకు తెలియును. నీవు వీర్యవంతుడవును యశోవంతుడవును అని అందరును నిన్ను గురించి చెప్పుచున్నారు. కావున నీవు నన్ను అంటినను దోషము లేదు. ఇదుగో! ఏర్రని గోళ్లును వ్రేళ్లును కలిగి ప్రకాశించు నా కుడిచేయి. దీనిని గ్రహించి బావిలోనుండి నన్ను పైకి తీయుము.''

యయాతి ఆమె బ్రాహ్మణ స్త్రీయని ఎరిగి ఆమె కుడిచేతిని పట్టి ఆ గోతినుండి ఆమెను పైకి తీసెను. తరువాత ఆమె దగ్గర సెలవు తీసికొని అతడు తన పురమునకు పోయెను.

దేవయానీ : త్వరితం చూర్ణికే గచ్ఛ సర్వ మాచక్ష్వ మే పితుః |

నేదానీం తు ప్రవేక్ష్యామి నగరం వృషపర్వణః. 24

శౌనకః : సా త్వపి త్వరితం గత్వా చూర్ణికా7సురమన్దిరమ్‌ |

దృష్ట్వా కావ్య మువాచేదం కమ్పమానా విచేతనా. 25

ఆచచక్షే మహాభాగా దేవయానీ వనే హతా | శర్మిష్ఠయా మహాప్రాజ్ఞ దుహిత్రా వృషపర్వణః. 26

శ్రుత్వా దుహితరం కావ్య స్తదా శర్మిష్ఠయా హతామ్‌ |

త్వరయా | నిర్య¸° దుఃఖా న్మార్గమాణశ్చ తాం వనే. 27

బాహుభ్యాం సమ్పరిష్వజ్య దుఃఖితో వాక్య మబ్రవీత్‌| ఆత్మదోషై ర్నియచ్ఛన్తి సర్వే దుఃఖం సుఖం జానాః.

మన్వే దుశ్చరితం తే7స్తి తస్యేయం నిష్కృతిః కృతా |

దేవయానీ: నిష్కృతి ర్వాస్తు మా వా7స్తు శృణుష్వావహితో మమ. 29

శర్మిష్ఠయా య దుక్తా7స్మి దుహిత్రా వృషపర్వణః | సత్యం కిలేతి చ ప్రాహ హీనా చాస్మి న చాధికా. 30

సుతా7హం స్తూయమానస్య దదతో7 ప్రతిగృహ్ణతః | ఇతి మా మాహ శర్మిష్ఠా దుహితా వృషపర్వణః. 31

క్రోధసంరక్తనయనా దర్పపూర్ణాననా తతః | యద్యహం స్తువత స్తాత దుహితా ప్రతిగృహ్ణతః. 33

ప్రసాదయిష్యే శర్మిష్ఠా మిత్యుక్త శ్చాబ్రవీ త్పితా |

శుక్రః స్తువతో దుహితా న త్వం భ##ద్రే న ప్రతిగృహ్ణతః. 34

అత స్త్వం స్తూయమానస్య దుహితా దేవయాన్యసి | వృషపర్వైవ తద్వేద శక్రో రాజా చ నాహుషః. 35

అచిన్తన్యం బ్రహ్మ నిర్ద్వన్ద్వ మైశ్వరం హి బలం మమ.

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనకశతానీక సంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే దేవయానీ శర్మిష్ఠావిరోధాదికథనం నామ సప్తవింశతితమో7ధ్యాయః.

తరువాత ఆ దేవయాని చూర్ణికయను తన చెలిని చూచి నేను ఇక వృషపర్వుని పురము ప్రవేశించను. ఈ విషయమును నీవు పోయి మా తండ్రికి చెప్పుము అనెను. చూర్ణికయును త్వరితముగా పోయి వృషపర్వుని భవనమున శుక్రుని దర్శించి తెలివి తప్పి వణకుచు ''ఓ మహాప్రాజ్జా! మహాభాగురాలగు దేవయానిని వృషపర్వుని కూతురగు శర్మిష్ఠ కొట్టినది.'' అని చెప్పెను. అది విని శుక్రుడు దుఃఖముతో ఆమెను వెదకుచు అడవికి పోయెను. అడవిలో ఆమె కనపడగానే అతడామెను కౌగిలించుకొని దుఃఖముతో ఇట్లు పలికెను: ''ఎల్ల ప్రాణులును తమ దోషముల (కర్మముల) ఫలముగానే దుఃఖ మునుగాని సుఖమునుగాని పొందుచుందురు. నీవు ఏదో దుష్కర్మమును చేసియుందువు. దానికి ఇది ప్రాయశ్చిత్తము ఐయుండును.'' అనగా ''ఇది ప్రాయశ్చిత్తము కావచ్చును. కాకపోవచ్చును. నా మాట సావధానముగా వినుడు. వృషపరుని కూతురు శర్మిష్ఠ నేను తనకంటె హీనురాలనే కాని అధికురాలను కాదు అనినది. ఈ మాట నిజమేఅగునా? ఆమె తన కన్నులను క్రోధముతో మిగుల ఎర్రజేసి తీక్‌ష్ణముగను పరుషముగను మాట లాడినది. నీవు స్తుతించుచు యాచించుచు దానములు అందుకొనెడి వాని కూతురవు. నేను స్తోత్రములు అందుకొనుచు యాచింపబడుచు దానములు పట్టక ఉండెడి వాని కూతురను. అని శర్మిష్ఠ నన్ను తూలనాడినది. ఈ మాటలు పలుకునప్పుడు ఆమె మొగము ఎంత దర్పముతో నిండి యున్నదనుకొనుచున్నావు! నేను నిజముగ స్తుతించుచు యాచించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతుర నేమో నీవే చెప్పుము. అట్లయినచో నే నామెను వేడొకొని అనునగ్రహింపజేసికొందును.'' అని దేవయాని పలికెను. అది విని శుక్రుడు ఇట్లనెను: ''ప్రియపుత్త్రీ! నీవు స్తుతించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతురవు కావు. స్తుతింప బడువాని కూతురగు దేవయానివి నీవు. ఈ విషయము వృషపర్వునికే తెలియును. ఇంద్రునకును తెలియును. యయాతికిని తెలియును. ఊహింప అలవికానిదియు ఉత్పత్తి నాశములు అనెడి ద్వంద్వము లేక నిత్యమును ఈశ్వర సంబంధియునగు బ్రహ్మము (వేదము) నాకు గల బలము.''

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున శర్మిష్ఠా దేవయానీ విరోధాది కథనము అను ఇరువది ఏడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters