Sri Matsya Mahapuranam-1    Chapters   

అష్టావింశతితమో7ధ్యాయః.

శుక్రదేవయానీసంవాదః.

శుక్రః: యః పరేషాం నరో నిత్య మతివాదాం స్తతిక్షతి | దేవయాని! విజానీహి తేన సర్వ మిదం జితమ్‌. 1

య స్సముత్పతితం క్రోధం నిగృహ్ణాతి హయం యథా | నయన్తే త్యుచ్యతే సద్భి ర్హయో రశ్మిషు సజ్జతే. 2

య స్సముత్పతితం క్రోధం నియచ్ఛతి చ ధర్మతిః | దేవయాని విజానీహి తేన సర్వ మిదం జితమ్‌. 3

య స్సముత్పతితం కోపం క్షమయైన నిరస్యతి | యథోరగ స్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే. 4

యశ్చ భావయతే ధర్మం యో7తిమాత్రం తితిక్షతి | యశ్చ తప్తో న తపతి భృశం సో7ర్థస్య భాజనమ్‌. 5

యో యజే దశ్వమేధేన మాసి మాసి శతం సమాః | య స్తర్పయతి చాన్నేన తయో రక్రోధనో వరః. 6

యత్‌ కుమారాః కుమార్యశ్చ వైరం కుర్యు రచేతసః | న త త్రాజ్ఞస్తు కుర్వీత విదుస్తే న బలాబలమ్‌. 7

దేవయానీ: వేదాహం తాత బాలా7పి కార్యాణాం తు గతిం యతః |

క్రోధే చైవాతివాదే వా వేద చాపి బలాబలే. 8

శిష్య స్యాశిష్యవృత్తేర్హ న క్షన్తవ్యం బుభూషతా | అసత్సఙ్కీ ర్ణవృత్తేషు వాసో మమ న రోచతే. 9

పుంసో యే నాభినన్దన్తి వృత్తేనాభిజనేన చ | న తేషు నివసే త్ర్పాజ్ఞ శ్ర్శేయో7ర్థీ పాపబుద్ధిషు. 10

యే త్వేన మభిజాన న్తి వృత్తేనాభిజనేన చ | తేషు సాధుషు వస్తవ్యం స వాస శ్ర్శేష్ఠ ఉచ్యతే. 11

త న్మే మథ్నాతి హృదయ మగ్నికామ ఇవారణిమ్‌ | వా గ్దురు క్తం మహాఘోరం దుహితు ర్వృషపర్వణః.

న తస్మా ద్దుష్టవచనం మన్యే లోకేషు త్రిష్వపి | య త్సపత్న శ్రియం దీప్తాం హీనశ్రీః పర్యుపాసతే. 13

ఇది శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుసంవాదా న్తర్గత శౌనకశతానీకసంవాదే చన్త్రవంశానువర్ణనే యయాతిచరితే శుక్రదేవయానీ సంవాదకథనం నామాష్టావింశతితమో7ధ్యాయః.

ఇరువది ఎనిమిదవ అధ్యాయము

శుక్రదేవయానీ సంవాదము

శుక్రుడు ఇట్లనెను : ''దేవయానీ ! ఎవడు ఇతరులు పలికిన అతివాదములను (అనరాని మాటలను) ఓర్చుకొనునో అతడే ఈ సమస్త విశ్వమును జయించిన వాడని ఎరుగుము. ఎవడు పైకి ఎగిరి పడుచున్న క్రోధమును గుర్రమును వలె నిగ్రహించి పట్టుకొనునో అతనిని సత్పురుషులు యంత (నియమించుకొనువాడు-సారథి) అని వ్యవహరింతురు. గుర్రము పగ్గములయందు చిక్కుకొనియుండును. (పగ్గములు లాగినచో గుర్రము నిలిచిపోవును. చిత్తమును నిగ్రహించినచో క్రోధము నిలిచిపోవును.) పైకి ఎగిరి పడుచున్న క్రోధమును ధర్మముచే నిగ్రహించినవాడే ఈ విశ్వమంతయు జయించినవాడు. పైకి లేచుచున్న కోపమును కుబుసమును పాము దూరముగా త్రోసివేసినట్లు వడు త్రో వేయునో వాడే పురుషుడు. ఎవడు ధర్మమును అనుష్ఠించునో ఎవడు మిగుల ఓర్పుతో ఉండునో ఎవడు ఇతరులు తపింపజేసినను తపించడో అతడే ప్రయోజనము(శుభమును పొందును. నెలకు ఒకటి చొప్పున నూరేండ్లు అశ్వమేధములు చేసినవాని కంటెను నూరేండ్లు నిరంతరము అన్నదానము చేసిన వానికంటెను క్రోదమును అణచుకొన్నవాడే మేలు. విరోధము-ఓర్పు-అనువాని బలాబలములు తెలియనందున అవివేకముచే కుమారులును కుమారికలును (పసివారు) పరస్సరము కలహింతురు. కాని ప్రాజ్ఞులు అట్టిది చేయరు.''

దేవయాని ఇట్లు పలికెను : ''తండ్రీ! నా వయస్సు చిన్నదైనను నాకు కార్యగతి (ఏ పని చేయవలెనో) తెలియును. క్రోధము అతివాదము అనువాని బలాబలములును నాకు తెలియును. తన శుభము కోరినవాడు ఎవ్వడును తన శిష్యుడు శిష్యుడుగా నడుచుకొనకపోవుటకు సహించరాదు. సద్వర్తనము లేక ధర్మాధర్మముల సంకీర్ణపరచి నడుచు కొనువారి యొద్ద జీవించుట నాకిష్టముగాదు. సద్వర్తనము కలిగినవారిని మంచి వంశమున పుట్టిన వారిని ఎవరు తగినట్లు గౌరవించరో అటువంటి పాపబుద్ధులయొద్ద తన మేలుకోరిన ప్రాజ్ఞుడు నివసింపరాదు. ఎవరు తాము సద్వర్తనమును సద్వంశమును కలిగి అవి కలిగినవారిని గుర్తించి ఆదరింతురో అట్టి సాధుజనుల యొద్ద నివసించుట తగినపని. అదియే శ్రేష్ఠమగు నివాసము. ఇది ఇట్లుండగా వృషపర్వుని కూతురు పలికిన మహా ఘోరములగు దుర్వచనములు అగ్నిని సంపాదింవగోరిన వారు అరణిని మథించినట్లు నా హృదయమును మథించుచున్నవి. తన గొప్పతనము తరిగిపోవుచుండ ప్రజ్వ లించుచున్న శత్రుల గొప్పతనమును ఆశ్రయించి ఇతడు జీవించుచున్నాడు అనిపించుకొనుట కంటె దుష్టవచనము (ఆపకీర్తి కరమగు విషయము) లోకములో మరేదియు లేదని నా అభిప్రాయము.''

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్ర వంశానువర్ణనమున యయాతి చరిత్రమున శుక్రదేవయానీ సంవాదము అను ఇరువది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters