Sri Matsya Mahapuranam-1    Chapters   

షట్స ప్తతితమో7ధ్యాయః.

ఫలస ప్తమీవ్రతమ్‌.

ఈశ్వరః : 

అన్యా మపి ప్రవక్ష్యామి నామ్నా తు ఫలస ప్తమీమ్‌ | యా ముపోష్య నరః పాపా ద్విముక్త స్స్వర్గభా గ్భవేత్‌. 1

మార్గశీర్షే మాసి శుభే పఞ్చమ్యాం నియతవ్రతః |

షష్ఠీ ముపోష్య కమలం కారయిత్వా తు కాఞ్చనమ్‌. 2

శర్కరాసంయుతం దద్వా ద్ర్బాహ్మణాయ కుటుమ్బినే |

రూపం చ కాఞ్చనం కృత్వా పలసై#్యకస్య ధర్మవిత్‌. 3

దద్యా ద్ద్వికాలవేళాయాం భాను ర్మే ప్రీయతా మితి |

శక్త్యా చ విప్రా న్త్సమ్పూజ్య సప్తమ్యాం క్షీరభోజనమ్‌. 4

కృత్వా కుర్యా త్ఫలత్యాగం యావతా కృష్ణస ప్తమీ | తామప్యుపోష్య విధివ దనేనైవ క్రమేణతు. 5

తద్వ ద్ధేమఫలం దత్వా సువర్ణకమలాన్వితమ్‌ | శర్కరాపాత్రసంయుక్తం వస్త్రమాల్యసమన్వితమ్‌. 6

సంవత్సర మనేనైవ విధినోభయసప్తమీం | ఉపోష్య దద్యా త్ర్కమశ స్సూర్య మన్త్రా నుదీరయేత్‌. 7

భాను రర్కో రవి ర్ర్బహ్మా సూర్య శ్శక్రో హరి శ్శివః |

శ్రీమా న్విభావసు స్త్వష్ణా అరుణః ప్రీయతా మితి. 8

ప్రతిమాసంచ స ప్తమ్యా మేకైకం నామ కీర్తయేత్‌ | ప్రతిపక్షం ఫలత్యాగ మేతత్సర్వం సమాచరేత్‌. 9

వ్రతాన్తే విప్రమిథునం పూజయే ద్వస్త్రభూషణౖః | శర్క రాకలశం దద్యా ద్ధేఉమపద్మఫలాన్వితమ్‌. 10

యథా న విఫలాః కామా స్త్వద్భక్తానాం సదా రవే | తథా7నన్తఫలావా ప్తి ర్భవే జ్జన్మని జన్మని. 11

ఇమా మనన్త ఫలదాం కుర్యా ద్యః ఫలస ప్తమీమ్‌ | సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే. 12

సురాపానాదికం కించి ద్యదత్రాముత్ర వా కృతమ్‌ | తత్సర్వం నాశమాయాతి యః కుర్యా త్ఫలసప్తమీమ్‌.

కుర్వాణ స్సప్తమీ మేతాం సతతం సఙ్గవర్జితః | భూతభవ్యాంశ్చ పురుషాం స్తారయే దేకవింశతిమ్‌. 14

యశ్శృణోతి పఠేద్వాపి సోపి కల్యాణభా గ్భవేత్‌.

ఇతి శ్రీమపత్స్యమహాపురాణ ఫలస ప్తమీవ్రత కథనం నామ

షట్సప్తతితమో7ధ్యాయః

డెబ్బది యారవ యధ్యాయము.

ఫల స ప్తమీ వ్రతము.

ఈశ్వరుడు బ్రహ్మకిట్లు చెప్పెను: ఫల స ప్తమియను స ప్తమి విషయము తెలిపెదను. ఈ నాడుపవసించినవాడు పాపముక్తుడై స్వర్గమందును.

మార్గశిర శుక్ల పంచమినాడు వ్రత నియమములు పాటించి గడపి షష్ఠినాడు ఉపవసించవలెను. (విశోక స ప్తమివలెనే) స ప్తమినాడు బంగారు పద్మమును శర్కరను బంగారుతో ఫలపు బొమ్మను కుటుంబియగు బ్రాహ్మణునకు రెండు పూటలందును ధర్మత త్త్వము నెరిగి 'భానుర్మే ప్రీయతాం' 'భానుడు నాయందు ప్రీతుడగుగాక!' అనుచు దానమీయవలెను. యథాశ క్తిగా విప్రులను పరమాన్నముతో భుజింపజేసి తానునట్లే భుజించి ఫలత్యాగము చేయవలెను. ఇట్లు కృష్ణపక్ష స ప్తమివరకు చేయుచు మరల ఆ కృష్ణ (మార్గశిర) స ప్తమినాడును ఉపవసించి హేమఫలమును సువర్ణపద్మమును శర్కరా పాత్రమున వస్త్ర మాల్యములను దానమీయవలెను. ఈ విధముగ సంవత్సరకాలము ఉభయ సప్తములందును (శుక్ల స ప్తమితో ఆరంభించి కృష్ణ స ప్తమివరకు) ఉపవాన పూర్వకముగా (రెండు స ప్తములందును దానములు-నడుమ దినములలో నియమమును పాటించుట) క్రమముగా సూర్య దేవతాక మంత్రముల పఠించుచు చేయుచుండవలెను. ఫలత్యాగము చేయునపుడు మార్గశిరము మొదలు కా ర్తికమువరకు ప్రతి మాసముంనందును వరునగా-భానుఃప్రీయతాం-ఇట్లే-అర్కః-రవిః-బ్రహ్మా-సూర్యః-శక్రః-హరిః-శివః-శ్రీమాన్‌-విభావసుఃత్వష్టా-అరుణః-అను నామములను 'ప్రీయతాం' అను పదముతో చేర్చి పలుకవలయును. ప్రతిపక్షమునను-స ప్తమినాడు ఇట్లు దానమును ఫలత్యాగమును చేయవలయును.

వ్రతాంతమునందు విప్ర దంపతులను వస్త్రభూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలశమును సువర్ణఫల ప్రతిమను వారికి దానము ఈయవలెను. ''రవీ! భక్తుల కోరికల సఫలము చేయు నీ దయచేత నాకును జన్మజన్మమునందును అనంతఫలములు లభించుగాక!'' అని ప్రార్థించుచు దాన మీయవలయును.

అనంత ఫలప్రదయగు ఈ ఫల సప్తమీ వ్రతము చేసినవాడు సర్వపాపముక్తుడై పవిత్రతనొంది సూర్యలోకమున పూజితు డగును. వానికి సురాపానాది పాపము లేవైన ఎప్పటివైన ఉన్నను అవియు నశించును. అతని వెనుకముందు ఇరువదియొక తరముల వారును తరింతురు. దీనిని చదివిన-వినిన-వారికి కూడ ఈ ఫలము లభించును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలసప్తమీ వ్రత కథనమను డెబ్బదియారవ అధ్యాయము

Sri Matsya Mahapuranam-1    Chapters