Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది రెండవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అథాతః సర్వతీర్థానాం వైభవం ప్రపదామ్యహం | సేతుమధ్యనివిష్టానాం అనుక్తానాం మునీశ్వరాః || 1 ||

అస్తి తీర్థం మహాపుణ్యం నామ్నాతు ఋణమోచనం | ఋణాని త్రీణి నశ్యంతి నరాణామత్రమజ్జనాత్‌ || 2 ||

ద్విజస్యజాయమానస్య ఋణాని త్రీణి సంతిహి | ఋషీణాం దేవతానాంచ పితౄణాంచ ద్విజోత్తమాః || 3 ||

బ్రహ్మచర్యాననుష్ఠానా దృషీణాం ఋణవాన్భవేత్‌ | యజ్ఞాదీనా మకరణా ద్దేవానాంచ ఋణీభ##వేత్‌ || 4 ||

పుత్రాను త్పాదనాచ్చైవ పితౄణాం ఋణవాన్భవేత్‌ | వినాపి బ్రహ్మచర్యేణ వినాయాగం వినాసుతం || 5 ||

ఋణమోక్షాభిధే తీర్థే స్నానమాత్రేణ మానవాః | ఋషి దేవపితౄణాంతు ఋణభ్యోముక్తిమాప్నుయుః || 6 ||

బ్రహ్మచర్యేణయజ్ఞేన తథాపుత్రోద్భవేనచ | నైవ తుష్యంతి ఋషయోదేవాః పితృగణాస్తథా || 7 ||

ఋణమోక్షేయథాస్నానా దతులాం తుష్టిమాప్నుయుః | కించాత్రమజ్జనాత్తీర్థే దరిద్రా అధమర్ణినః || 8 ||

ముక్తా ఋణభ్యఃసర్వేభ్యోధనినః స్యుర్నసంశయః | యదత్రమజ్జనాత్సుంసాం ఋణముక్తిః ప్రజాయతే || 9 ||

తస్మాదుక్తమిదం తీర్థ మృణమోచన సంజ్ఞయా | అతోత్ర ఋణిభిన్సర్వైః స్నాతవ్యం తద్విముక్తయే || 10 ||

ఏతత్తీర్థసమంతీర్థం స భూతం స భవిష్యతి | పాండవైః కృతమప్యత్ర తీర్థమస్త్య వరం మహత్‌ || 11 ||

యత్రేష్టం ధర్మ పుత్రాద్యైః పాండవైః పంచభిః పురా | తదే తత్తీర్థముద్దిశ్య భుక్తిముక్తి ఫలప్రదం || 12 ||

దశకోటి సహస్రాణి తీర్థాన్యన్నుత్తమానిహి | పంచ పాండవతీర్థేస్మన్సాన్నిద్ధ్యం కుర్వతే సదా || 13 ||

ఆదిత్యావనవోరుద్రాః సాధ్యాశ్చ సమరుద్గణాః | పాండవానాం మహాతీర్థే నిత్యం సన్నిహితాస్తథా || 14 ||

అత్రాభిషే కంయః కుర్యాత్పితృదేవాంశ్చతర్పయేత్‌ | సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే సపూజ్యతే || 15 ||

అప్యేకం భోజయేద్విప్రం ఏతత్తీర్థతటేమలే | తేనాసౌకర్మణాత్వత్ర పరత్రాపిచమోదతే || 16 ||

తా || శ్రీ సూతులు ఇట్లన్నారు - ఇక ఇక్కడి నుండి సర్వతీర్థముల వైభవాన్ని , సేతుమధ్యంలో ఉన్న, ఇంతకు ముందు చెప్పని సర్వతీర్థముల గూర్చి నేను చెప్తాను. ఓ మునీశ్వరులార! వినండి (1) మహాపుణ్యప్రదమైన ఋణమోచనమను పేరుగల తీర్థముంది. ఇక్కడ మునగటం వల్ల నరుల మూడు ఋణములు ముక్తమౌతాయి (2) బ్రాహ్మణుడుగా పుట్టినవానికి మూడు ఋణములుంటాయి. ఋషుల దేవతల, పితరుల, ఋణములు (3) బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించనందువల్ల ఋషుల ఋణంలో పడతాడు. యజ్ఞాదులు చేయనందువల్ల దేవతల ఋణంలో పడతాడు (4) సంతానాన్ని పొందనందువల్ల పితరుల ఋణంలో పడతాడు. బ్రహ్మచర్యం లేకుండ, యాగం లేకుండ, సంతానం లేకుండ (5) ఋణమోక్షమను ఈ తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత నరులు ఋషి దేవ పితరుల ఋణముల నుండి ముక్తిని పొందుతారు (6) బ్రహ్మ చర్యంతో యజ్ఞంతో సంతానోత్పత్తితో ఋషులు దేవతలు పితృగణాలు అంత సంతోష పడరు (7) కాని ఋణమోక్షంలో స్నానం చేయటం వల్ల అంతులేని ఆనందాన్ని పొందుతారు. ఇంక ఈ తీర్థంలో స్నానం చేయటంవల్ల దరిద్రులు, అప్పుతీసుకొన్న వారు (8) అన్ని ఋణముల నుండి ముక్తులై ధనవంతులౌతారు అనుమానంలేదు. ఇక్కడ స్నానం చేయటంవలన నరులకు ఋణముక్తి కలుగుతుంది. (9) కనుక ఈ తీర్థాన్ని ఋణమోచన తీర్థమని అంటారు. అందువల్ల ఇక్కడ ఋణము కల అందరు ఆ విముక్తి కొరకు స్నానం చేయాలి (10) ఈ తీర్థంలో సమానమైన తీర్థము గతంలో లేదు. భవిష్యత్తులో కలగదు. ఇక్కడ పాండవులు ఏర్పరచిన మరొక గొప్ప తీర్థముంది (11) ధర్మపుత్రాదులు పాండవులు ఐదుగురు పూర్వము ఈ తీర్థాన్నుద్దేశించి యాగం చేశారు. ఇది భుక్తిముక్తి ఫలముల నిచ్చేది (12) ఈ తీర్థము కంటే వేరైన ఉత్తమమైన దశకోటి సహస్ర తీర్థములు, ఈ పంచపాండవ తీర్థంలో ఎప్పుడూ సన్నిధిలో ఉంటాయి. (13) ఆదిత్యులు, పసువులు, రుద్రులు, మరుద్గణములతో పాటు సాధ్యులు పాండవుల మహాతీర్థంలో ఎల్లప్పుడు సన్నిహితులై ఉంటారు (14) ఇక్కడ స్నానం చేసి పితృదేవతలకు తర్పణ చేసిన వారు అన్ని పాపముల నుండి ముక్తులై బ్రహ్మలోకంలో పూజింపబడుతారు (15) ఈస్వచ్ఛమైన తీర్థ తీరమందు ఒక బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. దీని వలన ఈ లోకంలో పరలోకంలో ఆనందపడతారు (16).

మూ || బ్రాహ్మణః క్షత్రియోవైశ్యఃశూద్రోవాప్యన్య ఏవవా | అస్మిం స్తీర్థపరే స్నాత్వా వియోనిం నప్రయాతివై || 17 ||

పాండవానాంమహాతీర్థే పుణ్యయేగేషుయోనరః | స్నాయాత్సమనుజ శ్రేష్ఠోన రకం నైవ పశ్యతి || 18 ||

పాండవానాం మహాతీర్థం సాయంప్రాతశ్చయః స్మరేత్‌ | సస్నాతః సర్వతీర్థేషు గంగాదిషు నసంశయః || 19 ||

ఇంద్రాది దేవతాభిశ్చ యత్రేష్టం దైత్యశాంతయే | తదన్యద్దేవతీర్థాఖ్యం విద్యతే గంధమాదనే || 20 ||

దేవతీర్థేనరః స్నాత్వా సర్వపాపవిమోచితః | ప్రాప్నుయా దక్షయాన్‌లోకాన్సర్వకామసమన్వితాన్‌ || 21 ||

జన్మప్రభృతి యత్పావంస్త్రియా వాపురుషేణవా | కృతంతద్దేవకుండేస్మిన్నృఆనాత్సద్యో వినశ్యతి || 22 ||

యథానురాణాం సర్వేషా మాదిర్వైమధుసూదనః | తథాదిః సర్వతీర్థానాం దేవకుండ మనుత్తమం || 23 ||

యస్తువర్షశతం పూర్ణమగ్నిహోత్రము పానతే | యస్త్వేకోదేవకుండేస్మిన్కదాచిత్స్నాన మాచరేత్‌ || 24 ||

సమమేవతయోః పుణ్యం నాత్ర సందేహకారణం | దుర్లభం దేవతీర్థేస్మిన్దానం వానశ్చదుర్లభః || 25 ||

దేవతీర్థాభిగమనం స్నానం చాప్యతి దుర్లభం | దేవతీర్థం సమాసాద్యదేవర్షి పితృసేవితం || 26 ||

అశ్వమేధమవాప్నోతి విష్ణులోకంచగచ్ఛతి | ద్విదినం త్రిదినం చాపి పంచవాథషడేవవా || 27 ||

ఉషిత్వాదేవకుండస్థతీరే నరకనాశ##నే | నమాతృయోనిమాప్నోతి సిద్ధించాప్నోత్యనుత్తమాం || 28 ||

త్రిరాత్రస్నానతోహ్యత్ర వాజపేయ ఫలం భ##వేత్‌ | దేవతీరథస్మృతేః సద్యః పాపేభ్యో ముచ్యతే నరః || 29 ||

అర్చయిత్వాపితౄన్దేవానేతత్తీర్థతటేనరః | సర్వకామనమృద్ధిః స్యాత్సర్వయజ్ఞ ఫలం లభేత్‌ || 30 ||

ఏతత్తీర్థ సమం పుణ్యం సభూతం స భవిష్యతి | తస్మాద వశ్యం స్నాతవ్యం దేవతీర్థే మముక్షుభిః || 31 ||

ఐహికాముష్మిక ఫలప్రాప్తి కామైశ్చ మానవైః | దేవతీర్థస్యమాహాత్మ్యం సంక్షిప్య కథితం ద్విజాః || 32 ||

విస్తరేణాన్యమాహాత్మ్యం మయావక్తుంసపార్యతే |

తా || బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇతరులైనా ఈ శ్రేష్ఠ తీర్థమందు స్నానం చేసిన వివిధ యోనులను(జన్మలను) పొందడు (17) పాండవుల మహాతీర్థమందు పుణ్య దినములలో స్నానం చేసిన నరుడు మనుజ శ్రేష్ఠుడు నరకాన్ని చూడడు (18) పాండవుల మహాతీర్థాన్ని ప్రాతః సాయం సమయములందు స్మరించినవాడు అన్ని తీర్థములలో గంగాదులలో స్నానం చేసినట్లే అనుమానంలేదు (19) దైత్యుల శాంతి కొరకు ఇంద్రాది దేవతలు యజ్ఞము చేసినది దేవతీర్థమను పేరుగలది గంధమాదనంలో మరొకటుంది. (20) నరుడు దేవ తీర్థంలో స్నానం చేసి సర్వపాపముల నుండి విముక్తుడై అన్ని కోరికలతో కూడిన అక్షయ లోకములను పొందుతాడు (21) పుట్టుకనుండి స్త్రీగాని పురుషుడుగాని చేసిన పాపము ఈ దేవకుండంలో స్నానం చేయటం వల్ల వెంటనే నశిస్తుంది (22) దేవతలందరికి మధు సూదనుడు తొలివాడైనట్లే సర్వతీర్థములకు ముఖ్యమైన దేవతీర్థము అట్లాగే అది (23) నూరు సంవత్సరములు నిండుగా అగ్ని హోత్ర ఉపాసన చేసిన వాడు, ఈ దేవకుండంలో ఒక్కసారి స్నానమాచరించిన వాడు (24) ఈ ఇద్దరికి పుణ్యము సమానంగానే లభిస్తుంది. ఇందులో అనుమానంలేదు. ఈ దేవతీర్థంలో దానము, నివాసము దుర్లభము. (25) దేవతీర్థమునకు వెళ్ళటం స్నానం చేయటం కూడా మిక్కిలి దుర్లభము. దేవ తీర్థమునకు వచ్చి దేవర్షి పితృదేవతలను సేవించినవాడు (26) అశ్వమేధ పలాన్ని పొందుతాడు. విష్ణులోకమునకు వెళ్తాడు కూడా. రెండు రోజులు, మూడు రోజులు ఐదు లేదా ఆరు రోజులు కాని (27) నరక నాశకమైన దేవకుండ తీర్థ తీరమందుండిన వారు మాతృయోనిని పొందరు (జన్మించరు). ప్రధానమైన సిద్ధిని పొందుతారు. (28) ఇక్కడ మూడు రోజులు స్నానం చేయటం వలన వాజపేయ ఫలము లభిస్తుంది. దేవతీర్థస్మరణం వల్ల వెంటనే పాపముల నుండి నరుడు ముక్తుడౌతాడు (29) ఈ తీర్థతట మందు నరుడు పితరులను దేవతలను పూజించిన సర్వకామములతో నిండిన వాడౌతాడు. సర్వ యజ్ఞముల ఫలితాన్ని పొందుతాడు (30) ఈ తీర్థముతో సామానమైన పుణ్య తీర్థము గతంలో కాని భవిష్యత్తులో కాని లేదు ఉండదు. మోక్ష కాములు అందువల్ల తప్పకుండా ఈ తీర్థంలో స్నానం చేయాలి. (31) ఐహికాముష్మిక ఫలప్రాప్తి కాములైన నరులు కూడా స్నానం చేయాలి. దేవ తీర్థ మాహాత్మ్యాన్ని సంక్షేపంగా చెప్పాను. ఓ బ్రాహ్మణులార ! (32) దీని మాహాత్మ్యాన్ని గురించి వివరించి చెప్పటం నాకు సాధ్యం కాదు

మూ || సుగ్రీవ తీర్థం పక్ష్యామి రామసేతౌ విముక్తిదే || 33 ||

అత్ర స్నాత్వానరోభక్త్యా సూర్యలోకం నమశ్నుతే | సుగ్రీవతీర్థేస్నానేన హయమేధ ఫలం భ##వేత్‌ || 34 ||

బ్రహ్మహత్యాది పాపానాం నిష్కృతిశ్చా పిజాయతే | సుగ్రీవతీర్థ గమనా ద్గోసహస్రఫలం లభేత్‌ || 35 ||

స్మరణాత్తస్య వేదానాం పారాయణ ఫలం లభేత్‌ | దినోపవాసమాత్రేణ తస్యతీర్థస్య తీరతః || 36 ||

మహాపాతకనాశః స్యాత్ర్పాయశ్చిత్తం వినాద్విజాః | తత్రాభిషేకం కుర్వాణః పితృదేవాం శ్చతర్పయేత్‌ || 37 ||

ఆప్తోర్యామస్య ఫలమష్టగుణం భ##వేత్‌ | సుగ్రీవ తీర్థస్నానేన నరమేధ ఫలం లభేత్‌ || 38 ||

సుగ్రీవ తీర్థస్నానేన నరోజాతి స్మరోభ##వేత్‌ | సుగ్రీవ తీర్థంభోవిప్రాః ప్రమాతాభీష్ట సిద్ధయే || 39 ||

సుగ్రీవ తీర్థమాహాత్మ్య మేవం వః కథితం ద్విజాః | వైభవం నల తీర్థస్య త్విదానీం ప్రబ్రవీమివః || 40 ||

నలతీర్థేనరః స్నాత్వాస్వర్గలోకం నమశ్నుతే | సలతీర్థే సకృత్స్నాత్వాసర్వపాపవిమోచితః || 41 ||

అగ్నిష్టోమాతి రాత్రాది ఫలమాప్నోత్యనుత్తమం | త్రిరాత్రముషితస్తస్మింస్తర్పయన్పితృదేవతాః || 42 ||

సూర్యవద్భాసతే విప్రా వాజిమేధఫలం లభేత్‌ | నీల తీర్థం ప్రవక్ష్యామి మహాపాతక నాశనం || 43 ||

అగ్నిపుత్రేణ నీలేన కృతం సేతౌ విముక్తిదం | నీల తీర్థే నరః స్నానా త్సర్వ పాపవిమోచితః || 44 ||

బహువర్ణ్యస్య యాగస్య ఫలం శత గుణం లభేత్‌ | నీల తీర్థేనరః స్నాత్వా సర్వాభీష్ట ప్రదాయిని || 45 ||

అగ్నిలోకమవాప్నోతి సర్వకామ సమృద్ధిమాన్‌ | గవాక్షేణ కృతం తీర్థం గంధమాదన పర్వతే || 46 ||

విద్యతేస్నానమాత్రేణ నరకం నైవయాతిసః | అంగదేనకృతం తీర్థమస్తిసేతౌ విముక్తిదే || 47 ||

అత్రస్నానేన మనుజో దేవేంద్రత్వం నమశ్నుతే|

తా || రామసేతువు యందు ముక్తినిచ్చే సుగ్రీవ తీర్థాన్ని గూర్చి చెప్తాను (33) భక్తితో ఇక్కడ స్నానం చేసిన నరుడు సూర్యలోకాన్ని పొందుతాడు. సుగ్రీవ తీర్థంలో స్నానం వల్ల అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు (34) బ్రహ్మహత్యాది పాపముల నుండి నిష్కృతి కల్గుతుంది. సుగ్రీవ తీర్థానికి వెళ్ళటం వలన గోసహస్రము దాన ఫలము లభిస్తుంది. (35) దానిని స్మరించటం వలన వేద పారాయణ ఫలము లభిస్తుంది. ఆ తీర్థ తీరంలో ఒక రోజు ఉపవాసం చేయటం వలన (36) ప్రాయశ్చిత్తం లేకుండానే మహా పాతకముల నాశం సంభవిస్తుంది. ఓ బ్రాహ్మణులార ! అక్కడ స్నానం చేసిన వారు పితృదేవతల తర్పణ కూడా చేయాలి (37) స్నానం వల్ల యామకాల యజ్ఞం వల్ల కలిగే ఫలం కన్న ఎనిమిదింతలం ఫలం ఎక్కువ లభిస్తుంది. సుగ్రీవ తీర్థ స్నానం వల్ల నరమేధ ఫలం లభిస్తుంది (38) సుగ్రీవ తీర్థ స్నానం వల్ల నరుడు పూర్వజన్మ స్మృతి కలవాడౌతాడు. అందువల్ల ఓ విప్రులార! అభీష్ట సిద్ధి కొరకు సుగ్రీవ తీర్థానికి వెళ్ళండి (39) ఓ విప్రులార ! ఈ విధంగా మీకు సుగ్రీవ తీర్థ మాహాత్మ్యాన్ని చెప్పాను. ఇప్పుడు మీకు నల తీర్థ మాహాత్మ్యాన్ని చెప్పుచున్నాను. (40) నరుడు నల తీర్థంలో స్నానం చేసిన స్వర్గలోకం పొందుతాడు. నల తీర్థంలో ఒక సారి స్నానం చేయటం వలన అన్నిపాపముల నుండి విముక్తుడై (41) అగ్నిష్టోమ అతిరాత్ర మొదలగు యజ్ఞముల ముఖ్య ఫలాన్ని పొందుతాడు. మూడు రాత్రులు అక్కడ ఉండి పితృదేవతల తర్పణ చేస్తే (42) సూర్యుని లాగా వెలిగి పోతాడు. వాజిమేధ ఫలాన్ని పొందుతాడు. ఇప్పుడు మహాపాతక నాశకమైన నీలతీర్థాన్ని గూర్చి చెప్తున్నాను (43) ఈ తీర్థము అగ్ని పుత్రుడైన నీలుడు సేతువు యందు నిర్మించాడు. ఇది ముక్తినిచ్చేది. నీల తీర్థంలో నరుడు స్నానం చేసిన సర్వ పాపముల నుండి విముక్తుడై (44) బహు వర్ణ్య యాగ ఫలం కన్న నూరింతలెక్కువ ఫలాన్ని పొందుతాడు. సర్వాభీష్టముల తీర్చే నల తీర్థంలో నరుడు స్నానం చేసి (45) సర్వకామ సమృద్ధుడై అగ్నిలోకానికి చేరుకుంటాడు. గంధమాదన పర్వతమందు గవాక్షుడు చేసిన తీర్థము (46) ఉంది. అక్కడ స్నానం చేసిన మాత్రం చేతనే నరుడు నరకానికి పోడు. సేతువు యందు ముక్తినిచ్చే అంగదుడేర్పరచిన తీర్థముంది. (47) ఇక్కడ స్నానం చేయటంవలన దేవేంద్ర పదవిని పొందుతాడు.

మూ || గజేనగవయేనాత్ర శరభేణ మహౌజసా || 48 ||

కుముదేసహరేణాపి పనసేన బలీయసా | కృతానియాని తీర్థాని తథాన్యైః సర్వవానరైః || 49 ||

రామసేతౌ మహాపుణ్య గంధమాదన పర్వతే | తేషు తీర్థేషు యః స్నాతి సోమృతత్వం నమశ్నుతే || 50 ||

విభీషణ కృతం తీర్థమస్తి పాపవిమోచనం | మహాదుఃఖ ప్రశమనం మహారోగ నిబర్హణం || 51 ||

మహాపాతక సంఘానాం అనలోపమముత్తమం | కుంభీపాకాది నరకక్లేశనాశన కారణం || 52 ||

దుః స్వప్న నాశనం ధన్యం మహా దారిద్య్ర బాధనం | తత్రయోమనుజః స్నాయాత్‌ తస్యనాస్తీ హపాతకం || 53 ||

సవైకుంఠమవాప్నోతి పునరావృత్తి వర్జితం | విభీషణస్యసచివైః కృతం తీర్థచతుష్టయం || 54 ||

తత్రస్నానే స మనుజః సర్వపాపైః ప్రముచ్యతే | సరయూశ్చన దీవిప్రా గంధమాదన పర్వతే || 55 ||

రామనాథం మహాదేవం సేవితుం వర్తతే సదా | తత్ర స్నాత్వానరాః సర్వే సర్వపాతక వర్జితాః || 56 ||

సర్వయజ్ఞత వస్తీర్థ సేవాఫల మవాప్నుయుః | దశకోటి సహస్రాణి తీర్థాని ద్విజసత్తమాః || 57 ||

వసంత్యస్మిన్మహాపుణ్య గంధమాదన పర్వతే | గంగాద్యాః సరితః సర్వాస్తథావై సప్తసాగరాః || 58 ||

ఋష్యాశ్రమాణి పుణ్యానితథాపుణ్యవనానిచ | అనుత్తమానిక్షేత్రాణి హరిశంకరయోస్తథా || 59 ||

సాన్నిధ్యం కుర్వత్‌ నిత్యం గంధమాదన పర్వతే | ఉపవీతాంతరం తీర్థం ప్రోక్తవాంశ్చతురాననః || 60 ||

త్రయస్త్రింశత్కోట యోత్రదేవాః పితృగణౖః సహ

సర్వైశ్చమునిభిః సార్థంయక్షైః సిద్ధైశ్చకిన్నరైః | వసంతిసేతౌ దేవస్యరామచంద్రస్యచాజ్ఞయా || 61 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవ ముక్తం ద్విజశ్రేష్ఠాః తీర్థానాం వైభవం మయా || 62 ||

ఇదం పఠన్వాశృణ్వన్వాదుఃఖ సంఘాద్విముచ్యతే | కైవల్యంచ సమాప్నోతి పునరావృత్తి వర్జితం || 63 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే సకల తీర్థ ప్రశంసాయాం ఋణమోచనాది తీర్థ మాహాత్మ్య వర్ణనం నామ ద్విచత్వారింశోధ్యాయః || 42 ||

తా || గజుడు, గవయుడు, శరభుడు, మహౌజసుడు (48) కుముదుడు, హరుడు, బలవంతుడైన వనసుడు వీరందరు ఏర్పరచిన తీర్థములలో అట్లాగే ఇతరులైన వానరులందరితో (49) మహాపుణ్యమైన గంధమాదన పర్వతమందలి రామసేతువు యందు ఏర్పరచిన తీర్థములలో స్నానం చేసినవారు అమృతత్వాన్ని పొందుతారు (50) విభీషణుడేర్పరచిన పాపవిమోచకమైన తీర్థముంది. అది మహాదుఃఖములను శమింపచేసేది. మహారోగములను తొలగించేది (51) మహాపాతక సమూహములకు అగ్నిలాంటిది. ఉత్తమమైనది. కుంభీపాకాది నరకముల క్లేశములను నశింపచేయగలిగేది (52) దుఃస్వప్నముల నశింపచేసేది. ధన్యమైనది. మహా దరిద్రమును తొలగించేది. అక్కడ స్నానం చేసిన నరునకు ఇక్కడ పాతకం లేదు (53) పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని ఆతడు పొందుతాడు. విభీషణుని మంత్రులు నాల్గు తీర్థముల నేర్పాటు చేశారు (54) అక్కడ స్నానం చేయటం వలన నరుడు సర్వ పాపముల నుండి ముక్తుడౌతాడు. గంధమాదన పర్వతమందు సరయూనది (55) రామనాథుడైన మహాదేవుని సేవించుటకు ఎల్లప్పుడూ ఉంటుంది. అక్కడ నరులందరు స్నానం చేసి పాతకములన్ని తొలగినవారై (56) సర్వయజ్ఞ తపః తీర్థముల సేవా ఫలాన్ని పొందుతారు ఓ బ్రాహ్మణులార ! దశకోటి సహస్ర తీర్థములు (57) ఈ పుణ్యమైన గంధమాదన పర్వత మందున్నాయి. గంగాది సర్వసరిత్తులు అట్లాగే సప్త సాగరములు (58) పుణ్యమైన ఋష్యాశ్రమములు అట్లాగే పుణ్యవనములు అట్లాగే హరిశంకరుల ప్రధానక్షేత్రములు (59) గంధమాదన పర్వతమందు ఎప్పుడూ సన్నిధిలో ఉంటాయి. బ్రహ్మతీర్థమును మరొక యజ్ఞోపవీతముగా చెప్పాడు. (60) ముప్పది మూడు కోట్ల దేవతలు పితృగణములతో సహమునులు యక్షులు సిద్ధులు కిన్నురులందరు దేవుడైన రామచంద్రుని ఆజ్ఞతో సేతువు యందున్నారు (61) సూతుని వచనము - ఓ బ్రాహ్మణులార! ఈ విధముగా తీర్థముల వైభవాన్ని నేను మీకు వినిపించాను. (62) దీనిని విన్నవారు, చదివినవారు దుఃఖ సంఘముల నుండి విముక్తులౌతారు. పునరావృత్తి రహితమైన కైవల్యమును పొందుతారు (63) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు సకల తీర్థ ప్రశంస యందు ఋణమోచనాది తీర్థమాహాత్మ్య వర్ణనమనునది నలుబది రెండవ అధ్యాయము || 42 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters