Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

శాస్త్రములు - స్వాతంత్ర్యము

జె. డబ్ల్యూ. ఎల్డర్‌. -అమెరికా దేశస్థుడు. 'మాసిడన్‌' నగరానికి చెందిన 'విస్కాన్సిన్‌' విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్రాధ్యాపకుడు. ఆయన కామకోటి స్వాముల వారిని మధురకు సమీపములో ఉండగా దర్శించారు. అప్పుడు స్వాములవారికి ఆయనకు ఈ క్రిందివిధంగా సంభాషణ జరిగినది.

ఎల్డర్‌ :- స్వాతంత్ర్యము వచ్చిన పిదప ఈ పదిహేను ఇదివదియేండ్లలో భారతదేశము పురోగమించిందనే చెప్పాలి. దానితోపాటు చైనా దండయాత్ర కూడ భారతదేశాన్ని కుదిపింది. ఈ రెంటిని దృష్టిలో ఉంచుకొని హిందుమతం నొక్కి చెప్పవలసిన విషయాలు ఏవిగా తాముపేర్కొంటారు?

స్వామి :- స్వాతంత్య్రము రాకమునుపు ఈ దేశంలో ప్రజలలో నిజాయితీ ఉండేది. నిజాయితీ లేనివారు బహుశః పదిశాతం కూడ ఉండేవారు కారేమో! పైగా గ్రామీణులు కృషి మీదనే ఆధారపడి ఉండేవారు. వారు వ్యవసాయమును చేసేవారు; వారు అసత్యం పలికేవారు కారు. వారి లక్ష్యాలు కూడ సామాన్యంగా ఉండేవి. ఇతర దేశాలలో పోల్చిచూచిప్పుడు వీరిలో దగాకోరుతనం చాల తక్కువగా ఉండేది. స్వాతంత్య్రం వచ్చేసరికి ప్రతి పౌరునకు ఓటింగుహక్కు వచ్చింది. ఈ హక్కును అందరకు- అక్షరం వచ్చినవారికి రానివారికి కూడ ఇచ్చారు. ఎన్నికలలో నిరక్షరాస్యులైన ఓటర్లకు డబ్బు యిచ్చి ఓటు వేయుమంటారు. వారు కూడ డబ్బు తీసుకొని తోచినవారికి ఓటులు వేస్తున్నారు.

తరువాత గ్రామాలకు కూడ విద్యుచ్ఛక్తి వచ్చింది. దీనితో సేద్యం చేసేవారు 'ఎలక్ట్రిక్‌ పంపులు' పట్టుకొని పుంజభూములను నంజభూములుగా మార్చుకొన్నారు. పుంజభూములకు నీటి అవసరం తక్కువ. గ్రామీణులకు రాగులు, జొన్నలు ముఖ్యమైన ఆహారపదార్థాలుగా ఉండేవి. పుంజ భూముల నుండి పప్పుదినుసులను కూడ పండించేవారు. ఇప్పుడు డబ్బు ఎక్కువగా వస్తూ ఉన్నదని వరినే ఎక్కువగా నాటుట వల్ల కొంతకాలానికి బావులద్వారా జరిగే నీటి సరఫరా కూడ ఆగిపోయే అవకాశము ఉన్నది. అంతేకాదు! జీవన విధానములో కూడ వ్యయం ఎక్కువ చేస్తూ అప్పులపాలవుతూ ఉన్నారు. బీదవారు కూడ 'సూటు' వేయాలని కోరుతున్నారు. ఏవి అవసరాలో ఏవి ఐశ్వర్యాలో ఎవరూ గమనించుటలేదు. కట్టుకొనుటకు బట్ట, తినుటకు తిండి, నివాసానికి పంచ-ఇవి ముఖ్యమైనవి. స్వాతంత్ర్యానికి ముందు జీవనంలో పొదుపు ఉండేది. ఆ వ్యవస్థ తిరిగి నెలకొనడానికి ప్రభుత్వం దోహదం చెయ్యాలి. మనుష్యులు అవసరాలను అనవసరాలను గుర్తించగలగాలి. అంతవరకు ప్రభుత్వ నియమాలు అవసరం. ఉత్పాదనలో మనం మనకాళ్ళపై నిలువబడినప్పుడు రష్యా- అమెరికాలవలె ఇతరదేశాలకు సాయం చేయవచ్చును. కాని అట్టి సాయానికి సౌహార్ధమే కారణంగా ఉండాలి. ఇతర విషయాలు కారణం కారాదు.

వర్తకంలో కూడ ఈ మధ్య మోసం ప్రబలింది. ఈ దగాకోరుతనం ఎగుమతులలో ఎక్కువగా ఉంది. పంపే నమూనా ఒకటి, అసలు సరకులు మరొకరకం. దీనివలన దేశానికే అపఖ్యాతి వస్తూ ఉన్నది. అందువలన దేశములోని ప్రస్తుత పరిణామదశలో హిందూమతానుసారం నొక్కి చెప్పవలసిన విషయాలు-ప్రజలలో నిజాయితీ, సత్యసంధత వృద్ధి చెందుట; వ్యవహరించుట అయిఉన్నాయి.

ఎల్డరు :- ఈ మధ్య మధురలో వ్యయప్రయాసలతో కూడిన ఒక పెద్ద కుంభాభిషేకం జరిగింది. ఖర్చు దాదాపు ఇరవైలక్షలని అంచనా వేస్తున్నారు. ఈ కుంభాభిషేకమును గురించి, దానికైన వ్యయాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి?

స్వామి :- ప్రతిమతానికి కొన్ని నిర్మాణాలు ఉంటాయి. ముస్లీములకు మసీదులు, క్రిష్టియన్లకు చర్చిలు, హిందువులకు ఆలయాలు ఉన్నాయి. హిందువుల ఆలయాలలో గోపుర నిర్మాణం ఒక విశిష్టత. ఏత్తైన ఆ గోపురశిఖరాలను దర్శించినప్పుడైనా హృదయంలో ఉన్నతభావస్పందన కలిగి కొంచెం సేపు భగవంతుని స్మరించుటకు అవకాశం కలుగుతుంది. శాస్త్రాలుకాని, గ్రంథాలుకాని ఈ గోపురాలవలె భగవత్స్మృతిని సులభంగా కలిగించలేవు. అందుచేతనే శాస్త్రాలు వీనిని స్థూలలింగాలని సార్థకంగా వర్ణిస్తున్నాయి. భగవత్‌ స్మరణతో గడిపిన భవ్యక్షణాలు మాత్రమే మానవునితో స్థిరంగా నిలచే మంచి. అందుచేత ఈ గోపురాలను శిథిలం కాకుండ అపుడపుడు మరమ్మతు చేస్తూ ఉంటారు. జీర్ణోద్ధరణచేసే సమయాలలో కొంత పుణ్యకార్యకలాపం చెయ్యాలి. దానిని శాస్త్రాలు నిర్దేశిస్తాయి. నలుగురు పెద్దలూచేరి పెండ్లిండ్లు చేసేవిధంగా ఈ కుంభాభిషేకాలను కూడ సాముదాయికంగా కలిసి సాగిస్తూ ఉంటారు.

ఎల్డరు :- ఈ మధ్య దక్షిదేశంలో చాలచోట్ల, కుంభాభిషేకాలు జరుగుట భారతదేశంలో మతవిషయక చైతన్యం మరల తలయెత్తుతూ ఉన్నదనడానికి సూచనగా ఉన్నదని మిరు అంగీకరిస్తారా?

స్వామి :- కుంభాభిషేకాలు ముప్ప దేండ్లకు ఒకమారు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్య వరుసగా కుంభాభిషేకాలు జరిగినందువలన మతవిషయమై శ్రద్ధ తీసుకొంటూ ఉన్నట్లు కనబడుతుంది. అంతేకాని ఇది అనూచానంగా వస్తూ ఉన్న వ్యవస్థయే. కాని 1947 వరకు ప్రజలు బ్రిటిషు పరిపాలనను అంతం చేయుటయందే నిమగ్నులై ఉన్నందున ఈ మధ్య కొంత శ్రద్ధ తగ్గిందని అనిపించింది. స్వాతంత్ర్యం వచ్చిన పిదప కమ్యూనిజం, ద్రావిడకజగం, ద్రావిడమున్నేట్రకజగం నాస్తికతను బోధించి విఫలమయ్యాయి. పూర్వము వేయిరూపాయలతో జరిగే పనికి ఇప్పుడు పదివేలు కావలసి వస్తూ ఉన్నది. ఇన్ని కారణాలుగా కుంభాభిషేకాలకు ఎక్కువ సొమ్ము ఖర్చు అవుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది. ఐతే ఈ రోజులలో విరాళాలు కూడా ధారాళంగానే వస్తున్నాయని చెప్పాలి.

6-6)

ఎల్డర్‌ :- హిందూమతం అహింసను ప్రధానంగా బోధిస్తూ ఉన్నది కదా! ఈ అహింసా వాదం చైనా దురాక్రమణ దృష్ట్యా ఎంతవరకు సాధ్యమని మీ అభిప్రాయం?

స్వామి :- మీరు గాంధీగారు బోధించిన అహింసా విషయం దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతూ ఉన్నట్లు ఉంది. ఈ విషయంలో గాంధీగారు బుద్ధుని భావాలను అనుకరించారు.

అహింసా విషయంలో ఇరువురు (గాంధీజీ-బుద్దుడు) కూడా కృతకృత్యులు కాలేదనియే చెప్పాలి. 1947 సం||లో గాంధీగారి అనుమతి తీసుకొనియే నెహ్రూగారు కాశ్మీరానికి సైన్యం పంపేరు. ఇక్కడ గాంధీగారి అహింస విఫలం అయిందనే అనాలి. బుద్ధుడు సూకరమాంసం తిన్నప్పుడు గొంతులో శల్యం గ్రుచ్చుకొని మరణించినాడని అంటారు. ఇప్పుడు చైనా, మలయా, సిలోను దేశాలలో ఉన్న బౌద్ధ భిక్షువులందరు మాంసాశనులే. అందుచేత బుద్ధుని అహింస లక్ష్యము కూడా విఫలం అయింది. బ్రాహ్మణ సంన్యాసికి మాత్రమే పరిపూర్ణమైన అహింసాచరణ సాధ్యం అవుతుంది. సంన్యాసి యే ప్రాణికి హింస కలుగ జేయరాదు. కడకు ఆకునైన అతడు గిల్లరాదు. ఎవరైనా అతనిని కొడితే అతడు ప్రతీకారము తలపెట్టక సంతోషంగా బాధలను సహించుకొనాలి. అయితే ఈ అహింస దేశాలకు, దేశనాయకులకు అనువుపడేది కాదు. ఈ దేశానికి స్వాతంత్ర్యం అహింస ద్వారా వచ్చిందని అంటారు. కాని ఇంగ్లీషువారు స్వాంతంత్ర్యము ఇచ్చారు అంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆ పరిస్థితుల వలన అహింస పాటించినా పాటించకపోయినా స్వాతంత్ర్యం వచ్చి ఉండేదే!

శాస్త్రాలు అహింసను ప్రభుత్వానికి విధించలేదు. అట్లే అది ప్రభుత్వనాయకులకు కూడా వర్తించదు. దేశరక్షణ రాజ ధర్మం. ఒక్కచైనాయే కాదు, ఏ దేశం దండెత్తినా మనం దురాక్రమణను ప్రతిఘటించ వలసినదే! ఐతే దురాక్రమణకు మనం మాత్రము పూనుకోరాదు. అట్లే మరియొక దేశం దండెత్తివస్తే నేను అహింసావాదిని అని కూర్చొనరాదు. ఒక పౌరునిపై మరియొక పౌరుడు ఘాతుకం తలపెడితే ఎంత కఠిన శిక్ష వేసి అయినా సరే! పౌరరక్షణ చేయడం ప్రభుత్వము యొక్క ధర్మం. ఎవరెవరు ఎంతవరకు అహింసను పాటించ వలెను? అన్న విషయం శాస్త్రాలు నిర్దేశించాయి.

అగర్వాల్‌ :- (అక్కడ ఉన్న వారిలో ఒకరు)

మీరు అహింస ఒక్క బ్రాహ్మణసంన్యాసులు మాత్రమే పాటించదగినది అన్నారు. ఈ బ్రాహ్మణత్వాన్ని పుట్టుక నిర్ణయిస్తుందా? లేక వైదుష్యం నిర్ణయిస్తుందా?

స్వామి :- శాస్త్రాలు హిందువులను వివిధ వర్గాలుగా విభాగించాయి. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం విధించబడినది. మానవుడు పుట్టుక చేత ఒక జాతికి చేరుతూ ఉన్నాడు. బ్రాహ్మణునకు జ్ఞానాన్వేషణమే ధర్మమని శాస్త్రం విధించింది. అందుచేత బ్రాహ్మణరక్షణం బ్రాహ్మణతరుల విధి. ఈకారణముచేతనే భూదాన గోదానాలకు బ్రాహ్మణులే పాత్రులన్న ఆచారం ఉండేది. జ్ఞానం సిద్ధించిన తరువాత బ్రాహ్మణుడు సన్యసించి, బంధముక్తు డయ్యేవాడు. అప్పుడతనికి ఇతరులను రక్షించవలసిన అవసరం లేదు. దేహ ధారణకు మాత్రం ఆతడు బిచ్చ మెత్తేవాడు. జ్ఞానాన్వేషణ వదలిన బ్రాహ్మణుడు జాతిభ్రష్టు డవుతాడు; అంతేకాని మరొక జాతికిపోయి చేరడు. బ్రాహ్మణతరులు కూడా వారి వారి ధర్మాలను పాటిస్తూ జ్ఞానసముపార్జన కొరకై వారి జీవితాలను వినియోగిస్తే వారు కూడా అంతిమలక్ష్యమైన జ్ఞానాన్ని పొందగలరు. అప్పడు బ్రాహ్మణులు, బ్రాహ్మణతరులు, అందరు ఆ జ్ఞాని సమక్షమున లాభము పొందగలరు. అటువంటి వారిని బ్రాహ్మణులు కూడా పూజిస్తారు. అంటే జ్ఞాని కూడా సంన్యాసివలె జ్ఞానముతో ఉన్నత భూమికను అధిరోహించగల డన్నమాట. రాముడు, కృష్ణుడు క్షత్రియులై తమ ధర్మాన్ని పాటిస్తూ జ్ఞానులైన కారణముచేత వారిని అందరూ- బ్రాహ్మణులు కూడా పూజిస్తారు. సంన్యాసిపొందు జ్ఞానమునే జ్ఞానికూడా పొంది అన్నిటియందు ఆత్మదర్శనం చేస్తూ ఉన్నత అహింసాలక్ష్యాన్ని పాటించగలడు.

ఎల్డరు :- నాయకులు శాస్త్రాలను పాటించవలెనని మీరు అంటున్నారు. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాజ్య విస్తరణ రాజధర్మమని అన్నాడు. దానిని ఈ కాలపు నాయకులు పాటించవలెనని మీరు అంటారా? లేక శాస్త్రంలో చెప్పిన దానిని పాటించుటకు, పాటించక పోవుటకు వేరే ఏదైనా ప్రమాణం ఉన్నదా?

స్వామి :- క్రీస్తు చెప్పినది ఒకటి. మెషివెల్లీ చెప్పినది మరియొకటి. అట్లే శాస్త్రాలలో కూడా విరుద్ధాలు కనబడవచ్చును. అర్ధశాస్త్రం చెప్పిన విషము ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది. అందుచేత దానిని అంగీకరించను. కాని ఒక పొరుగుదేశంలో ప్రజ అరాచకముతో బాధపడుతూ ఉంటే వారి సుఖశాంతులకై యుద్ధము చేయుట, ఆవిధంగా రాజ్య విస్తరణ మంచివే అవుతాయి.

ఎల్డరు :- అయితే మీరు దేశనాయకులు ధర్మశాస్త్రాలను పాటించాలని అంటారా?

స్వామి :- ప్రస్తుతం భారతప్రభుత్వం 'సెక్యులర్‌ ప్రభుత్వం కనుక ధర్మశాస్త్రాలను పాటించుటకు వీలులేదు. అందుచేతనేఈవిషయంలోమతసంస్థలకు మతానుయాయులకు మరింత బాధ్యత ఉన్నది. ధర్మశాస్త్రాలు చెప్పే ఉన్నత ప్రమాణాల జ్ఞానం ప్రజలలో ఉంటే అంతవరకు అది ప్రభుత్వములో పాల్గొనే ప్రజలలో ఒక ధర్మప్రవర్తనకు కారకము అవుతుంది. అందుచేతనే మతసంస్థలు, మతాచార్యులు, నైతిక ప్రబోధానికి పూనుకొనవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఎల్డరు :- అయితే మీరు నాయకులు శాస్త్రాలను పాటించాలని, శాస్త్రాలు విరుద్ధాలుగా ఉన్నప్పుడు ధర్మ శాస్త్రం పాటించాలని, ధర్మశాస్త్రాలకు, కానిష్ట్యుషనుకు భేదం ఉంటే, కానిష్ట్యూషను పాటించాలని అభిప్రాయపడుతూ ఉన్నారన్నమాట! నాయకులకు ఇప్పుడు కానిష్ట్యూషను ఒక పరమ శాస్త్రంగా తయారైన దన్నమాట!

స్వామి :- (నవ్వుతూ) ఔను! ప్రస్తుతం నాయకులకు కానిష్ట్యూషను ఒక సమకాలిక శాస్త్రమే అయిఉన్నది.

ఎల్డరు :- మంచిది! మీ కాలాన్ని చాలా తీసు కొన్నాను. నే నడిగిన ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానాలకు నా ధన్యవాదాలు.

స్వామి :- అమెరికన్లు ఇంగ్లాండు నుండి వలస వెళ్ళి ఎన్నో శ్రమలకు ఓర్చి ముందుకు వచ్చారు. ఇంగ్లండుతో యుద్ధానికి కూడా వెరవకుండా పోరాడి, సుఖసౌభాగ్యాలను సంతరించుకొన్నారు. అందువల్లనే బహుశః అమెరికనులకు భారత దేశ ప్రజల కష్టసుఖాలయందు సానుభూతి, వారి అభ్యుదయంలో ఆసక్తి ఉన్నట్లు తోస్తుంది. ఈ విషయంలో అమెరికన్లను చూస్తే నాకు చాలా సంతోషం.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page