Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

నిత్య జీవనము - వైదిక కర్మానుష్ఠానము

లోక సంగ్రహార్థమై శంకర భగవత్పాదులు బ్రహ్మ సూత్రములపై ఉపనిషత్తులపై మేరునగ శృంగ సముత్తుంగములైన అనర్ఘ వ్యాఖ్యాన పరంపరలను వెలయింప జేయుటయే కాక భక్తిరస భరితములైన శ్లోక శతపత్రమాలలను సైతము పెక్కింటిని రచించారు. ప్రజలలో ఈశ్వరభక్తిని పాదుకొల్పి తద్‌ద్వారా వారికి జ్ఞానోదయము, పరమేశ్వర సాక్ష్యాత్కారము ప్రసాదించుటయే వారి ఈ రచనల పరమోద్దేశము.

'భజగోవింద శ్లోకమాల' ఇట్టిదే. ఇందులో సత్ర్పవర్తన కూడ ఉపదేశింపబడినది.

శ్రీశంకర భగవత్పాదులు శరీరత్యాగానికైన ఆయత్తులు అవుతూఉన్న తరుణములో శిష్యబృందము వారిని చుట్టుముట్టి వారి ఉపదేశసారాన్ని అనుదిన జీవనోపయోగిగా మరింత సంగ్రహించి చెప్పవలసినదని ప్రార్థించగా వారికి ఆదిశంకరులు 'సోపాన పంచకమును' అనుగ్రహించారు.

6-4)

సోపాన పంచకములో 'వేదో నిత్య మధీయతాం'- అన్నది 'మొదటి సోపానము, నిత్యము వేదాధ్యయనము చెయ్యాలి' 'అవ్వయ్యార్‌' కూడ ఇట్టి ఉపదేశ##మే చేసింది. అధ్యయన రహితముగా నక్కరోజైన వృధాకారాదని ఆమె ఉద్బోధించినది. ఇక్కడకూడ అధ్యయనమంటే వేదాధ్యయనమనియే భావము. వేదాధ్యయనము వలననే జ్ఞాన ప్రాప్తి, ఆత్మసాక్షాత్కారము సాధ్యం అవుతాయి. వేదాధ్యయన శీలురకు ఆత్మసాక్ష్యాత్కారము అప్రయత్నముగా లభిస్తుంది.

'తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్‌'- అనునది రెండవ మెట్టు. వేదచోదిత కర్మానుష్ఠానము రెండవ అనుశాసనము. ఎవరికి ఏ కర్మ నిర్దేశింపబడినదో వారాకర్మను చెయ్యాలి. వీలైనంతవరకే కర్మలు చేస్తాను- అనడం కూడదు. విధి విహిత కర్మలను పూర్తిగా ఆచరించి తీరాలి.

''తేన ఈశస్య విధీయతా మపచితిః''-అనునది మూడవ అనుశాసనము-సర్వము ఈశ్వరార్పణదృష్టితో, శివారాధన బుద్ధితో చెయ్యాలి. దీనినే' కృష్ణార్పణము'లేక బ్రహ్మార్పణముఅని అంటూ ఉంటారు. అప్పుడు కలిదోషతుషారసంహతినిన్నంటదు.

తమిళభక్త శిరోమణి తిరుజ్ఞాన సంబంధర్‌ కూడ సరిగా ఇదే అభిప్రాయాన్ని తనకీర్తనలలో వెల్లడించారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తే పాపము అంటదని, కలి మనము ఉన్న తావులకు రాలేదని ఆయన అన్నారు.

ప్రజలకు ఎన్నోపనులు చేయడానికి కాలవసినంత కాలము ఉన్నది. ఎన్నో గ్రంథాలు చదువుతారు. ఎన్నో పరీక్షలకు హాజరవుతారు. ప్రపంచమంతా పరిభ్రమించివస్తారు.

నేను వేదవిహిత కర్మానుష్ఠానము చేస్తూ ఉన్నానా? లేదా అను ఆత్మపరిశీలనకు వలసిన కతిపయక్షణ పరిమితమైన విశ్రాంతి కూడ వారికి నిజంగానే లేదా? వేదవిహిత కర్మానుష్ఠానము నుండి తొలగి సంచరిస్తూ ఉన్నట్లు వారి అంతరాత్మ వారిని ప్రబోధిస్తే ఇంతకాలము ఉపేక్షించిన కర్మానుష్ఠానాన్ని వారు నేటినుండి తిరిగి ఎందుకు ప్రారంభించకూడదు.

సంప్రాదాయబద్ధంగా వేదాధ్యయనము చేసిన పెద్దలు ఈ దేశములో పెక్కుమంది ఉన్నారు. అట్టి వేదాధ్యయన పరుల కుమారరత్నాలు కారణాంతరాలవల్ల అవైదిక విద్యాలాలసులై పోయారు. కాని అట్టివారికి తల్లిదండ్రులు కనీసము వేదాంగమైనమంత్రప్రశ్నభాగాన్ని, తత్ర్పయోగ విధానాన్ని అయినా, విధిగా ఉపదేశించాలి.

ఇతరవృత్తుల నవలంబించి బ్రదుకుతూ ఉన్న తండ్రులకు కూడ ఇట్టిదే మరొక విధి ఉన్నది.

బాల్యములో కొద్దిపాటి శిక్షణ ఇస్తే పిల్లలు పెరిగి పెద్దవారై దేవతలయెడ పితృదేవతలయెడ తమ విధులను అత్యంత శ్రద్ధాసక్తులతో నిర్వర్తించగలరు.

విధినిర్వహణలో కృతార్థమైన సమాజానికి విజయము, ఆయువు, ఆరోగ్యము మొదలగు సమస్తములైన సంపదలకు కొంత ఉండదని గీత అనుశాసిస్తూ ఉన్నది.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page