Sri Vamana Mahapuranam    Chapters   

ఆరవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

హృద్భవో బ్రహ్మణో యోసౌ ధర్మో దివ్యవపుర్మునే |

దాక్షాయణీ తస్యభార్యా తస్యా మజనయ త్పుతాన్‌. 1

హరిం కృష్ణంచ దేవర్షే నారాయణనరౌ తథా | యోగాభ్యాసరతౌ నిత్యం హరికృష్ణౌ బభూవతుః. 2

పులస్త్య వచనముః మునివరా ! బ్రహ్మమానస పుత్రుడు దివ్యశరీరి యగు ధర్ముడు. దాక్షాయణి ఆయన భార్య. ఆ దంపతులకు హరి, కృష్ణుడు. నరుడు నారాయణుడను నలుగురు కుమారులు. వారిలో హరికృష్ణులు యోగాభ్యాస నిరతులైనారు.

నరనారాయణౌ చైవ జగతో హితకామ్యయా | తప్యేతాంచ తపః సౌమ్యౌ పురాణా వృషినత్తమౌ. 3

ప్రాలేయాద్రిం సమాగమ్య తీర్థే బదరికాశ్రమే | గృణంతౌ తత్పరం బ్రహ్మ గంగాయా విపులేతటే. 4

కాగా పురాణ ఋషిసత్తములయిన నరనారాయణులు లోకకళ్యాణార్థం హిమాలయాలలో బదరికాశ్రమాన గంగా తీరాన పరబ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేశారు.

నరనారాయణాభ్యాంచ జగదేత చ్చరాచరమ్‌ | తాపితం తపసా బ్రహ్మన్‌ శక్రః క్షోభం తదా య¸°. 5

సంక్షుబ్దః తపసా తాభ్యాం క్షోభణాయ శతక్రతుః | రంభాద్యాస్సరసః శ్రేష్ఠాః పై#్రషయత్సమహాశ్రమమ్‌. 6

కందర్పశ్చ సుదుర్దర్ష శ్చూతాంకురమహాయుధః | సమం సహచరేణౖవ వసంతే నాశ్రమం గతః 7

వారలు గాంచిన ఘోరతపస్సుకు చరాచర జగత్తంతా తల్లడిల్లినది. అది చూచి ఇంద్రుడు కలవరపాటొందెను. వారల తపస్సు భంగపరచుకై దేవరాజు రంభాది అప్సరో కామినులను వారి కడకు పంపెను. వారితో బాటు ఆమ్రపల్లవాద్యయుధాలు ధరించి, సహచరుడైన వసంతునితో కలిసి మన్మథుడు కూడ వారల ఆశ్రమానికి వెళ్ళెను.

తతో మాధవకందర్పౌ తాశ్చైవాప్సరసో వరాః | బదర్యాశ్రమమాగత్య విచిక్రీడుర్యథేచ్చయా. 8

తతో వసంతే సంప్రాప్తే కింశుకా జ్వలనప్రభాః | నిష్పత్రాః సంతంరేజుః శోభయంతో ధరాతలమ్‌. 9

శిశిరం నామ మాతంగం విదార్య నఖరైరివ | వసంతకేసరీ ప్రాప్త పలాశకుసుమైర్మునే. 10

మయాతుషారౌఘకరీ నిర్జితః స్వేన తేజసా | తమేవ హసతే త్యుచ్చైః వసంతః కుందకుడ్మలైః . 11

వనాని కర్ణికారాణాం పుష్పితాని విరేజిరే | యత్రా నరేంద్రపుత్రాణి కనకాభరణాని హి. 12

తేషా మనుతథా నీపాః కింకరాఇవ రేజిరే | స్వామిసంలబ్దసంమానా భృత్యా రాజసుతానివ. 13

రక్తాశోకవనా భాంతి పుష్పితాః సహసోజ్వలాః | భృత్యావసంతనృపతేః సంగ్రామేసృక్‌ ప్లుతా ఇవ. 14

వారందరు బదరికాశ్రమము ప్రవేశించి యిష్టము వచ్చినట్టుగా విహరించసాగిరి. వసంతాగమనంతో ఆకులూడ్చుకొని పుష్పించిన మోదుగచెట్లు, అగ్ని శిఖల్లాగ భూమికి అలంకారంగా వెలుగొందినవి. శిశిరమనే ఏనుగును మోదుగపూలనే గోళ్ళతో చీల్చుచున్నదోయన్నట్లు వసంతకేసరి విజృంభించింది. నా కాంతితో తుషార సముదాయమనే ఏనుగు జయించాననే దర్పంతో మల్లె మొగ్గల ధావళ్య మిషతో వసంతుడు వెక్కిరించుచుండెను. సర్వాభరణభూషితులై వెలుగొందే రాజకుమారుల వలె పుష్పించిన కర్ణికార ఉద్యానాలు శోభిల్లెను. వాని ప్రక్కనే నీప (కడిమి) వృక్షములు ప్రభు సమ్మాన లబ్ధకింకరుల వలె శోభించినవి. మరొకవైపు పుష్పితాశోకవనాలు తమ ప్రభువైన వసంతునికై పోరాడి క్షతగాత్రులై నిలచిన సేవకుల వలె విరాజిల్లినవి.

మృగవందాః పింజరితా రాజంతే గహనే వనే | పులకాభిర్వృతా యద్వత్‌ సజ్జనాః సుహృదాగమే. 15

మంజరీభి ర్విరాజంతే నదీకూలేషు వేతసాః | వక్తుకామా ఇవాంగుళ్యా కోస్మాకం సదృశో నగః . 16

తెల్లని మచ్చలు గల లేళ్ళ గుంపులు గహనకాననాల్లో, సన్మిత్రులేతెంచినపుడు ఆనందపులకాంకితులగు సజ్జనుల వలె తిరుగసాగినవి. "మముబోలిన వృక్షములెవ్వి?" యని అంగుళి చాలనంతో ప్రశ్నించుచున్నవో యన్నట్లు నదీ తీరాల్లో పుష్ప మంజరులతో వేతస (పేము) లతలు వెలసినవి.

రక్తశోకకరా తన్వీ దేవర్షే కింశుకాంఘ్రికా | నీలోశోకకచా శ్యామా వికాసికమలాననా. 17

నీలేందీవరనేత్రాచ బ్రహ్మన్‌ బిల్వఫలస్తనీ | ప్రపుల్లకుందదశనా మంజరీ కరశోభితా. 18

బంధుజీవాధరా శుభ్రా సిందువారనఖాద్బుతా | పుంస్కోకిలన్వనా దివ్యా అంకోలవసనా శుభా. 19

బర్హివృందకలాపాచ సారసస్వరనూపురా | ప్రాగ్వంశరసనా బ్రహ్మన్‌ మత్తహంసగతి స్తథా. 20

పుత్రజీవాంశుకా భృంగరోమరాజివిరాజితా | వసంత లక్ష్మీః సంప్రాస్తా బ్రహ్మన్‌ బదరికాశ్రమే. 21

తతో నారాయణో దృష్ట్వా ఆశ్రమస్యానవద్యతామ్‌ | సమీక్ష్యచ దిశఃసర్వా స్తతోనంగ మపశ్యత. 22

ఓ నారద ! వసంతలక్ష్మి రక్తాశోక హస్తాలతో, అరుణ కింశుక చరణాలతో, నీలాశోక కచభారంతో, వికసిత పద్మముఖంతో, నీ లేందీవర నేత్రాలతో, మారేడుపండ్ల చనుకట్టతో, వికసిత కుంద దంతాలతో, బంధు జీవాధరాలతో, తెల్లని సిందువారనఖ కాంతులతో, అంకోల వస్త్రధారణంతో, గండు కోయిలల కల స్వనాలతో, నెమళ్ళ గుంపుల అలంకారాలతో, నీటిబెగ్గురు స్వరనూపుర ఘలంఘలలతో, ప్రాగ్వంశకటి సూత్రాలతో, మదమరాళ గమనంతో, పుత్రజీవాంబరంతో, భ్రమరరోమావళితో సకల జన మనోభిరామమైన సౌందర్యాన్ని పుణికి పుచ్చుకుని బదరికాశ్రమంలో ప్రవేశించింది. తమ ఆశ్రమాన్ని ఆవరించిన ఆ అనపద్య శోభను తిలకిస్తూ నారాయణ ఋషి అచట అనంగుని చూచెను.

నారద ఉవాచః

కోసా వనంగో బ్రహ్మర్షే తస్మిన్‌ బదరికాశ్రమే | యం దదర్శ జగన్నాధో దేవో నారాయణోవ్యయః.

నారద వచనము ః బ్రహ్మర్షే! అవ్యయుడు జనన్నాథుడునగు నారాయణర్షి దర్శించిన ఆ మన్మథు (ఆనంగు) డెవ్వరు?

పులస్త్య ఉవాచ ః

కందర్పోహర్షతనయో యోసౌ కామో నిగద్యతే | స శంకరేణ సందగ్దో హ్యనంగత్వ ముపాగతః . 24

పులస్త్యవచనముః ఆ అనంగుడు హర్షతనయుడగుకాముడు. శంకరునిచే దగ్ధ శరీరుడై అనంగు (శరీర రహితుఁడైనాడు.

నారద ఉవాచః

కిమర్థం కామదేవోసౌ దేవదేవేన శంభునా | దగ్దస్తు కారణ కస్మిన్నే తద్వ్యాఖ్యాతు మర్హసి. 25

నారదవచనము ః ఏ కారణమున కామదేవుని దేవదేవుడగు శంకరుడు భస్మము గావించెను. ఆ విరణము తెలుపుము.

పులస్త్య ఉవాచః

యదా దక్షసుతా బ్రహ్మన్‌ సతీ యాతా యమక్షయమ్‌ | వినాశ్య దక్షయజ్ఞంతం విచచార త్రిలోచనః. 26

తతోవృషధ్వజం దృష్ట్వా కందర్పః కుసుమాయుధః | అపత్నీకం తదాస్త్రేణ ఉన్మాదేనాభ్యతాడయత్‌. 27

తతో హరః శ##రేణాథ ఉన్మాదేనాశు తాడితః | విచచార మదోన్మత్తః కాననాని సరాంసిచ. 28

స్మరన్‌ సతీం మహాదేవః తదోన్మాదేన తాడితః |న శర్మ లేభే దేవర్షే బాణవిద్ధ ఇవ ద్విపః . 29

తతః పపాత దేవేశః కాళిందీసరితం మునే | నిమగ్నే శంకరే ఆపో దగ్ధాః కృష్ణత్వ మాగతాః . 30

తదాప్రభృతి కాళింద్యా భృంగాంజననిభం జలమ్‌ | ఆన్యందత్‌ పుణ్యతీర్థా సా కేశపాశ మివావనేః. 31

తతో నదీషు పుణ్యాసు సరస్సుచ నదేషుచ | పులినేషుచ రమ్యేషు వాపీషు నలినీషుచ. 32

పర్వతేషుచ రమ్యేషు కాననేషుచ సానుషు | విచరన్‌ స్వేచ్ఛయా నైవ శర్మలేభే మహేశ్వరః. 33

క్షణంగాయతి దేవర్షే క్షణం రోదితి శంకరః | క్షణం ధ్యాయతి తన్వంగీం దక్షకన్యాం మనోరమామ్‌. 34

ధ్యాత్వా క్షణం ప్రస్వపితి క్షణం స్వప్నాయతే హరః |

స్వప్నే తథేదం గదతి తాం దృష్ట్వా దక్షకన్యకామ్‌. 35

నిర్ఘృణ తిష్ఠ కింమూఢే త్యజసే మా మనిందితే | ముగ్ధే త్వయా విరహితో దగ్ధోస్మి మదనాగ్నినా. 36

సతి సత్యం ప్రకుపితా మా కోపం కురు సుందరి | పాద ప్రణామావనత మభిభాషితు మర్హసి. 37

శ్రూయసే దృశ్యసే నిత్యం స్పృశ్యసే పంద్యసే ప్రియే |

ఆలింగ్యసే చ సతతం కిమర్థం నాభిభాషసే 38

విలపంతం జనం దృష్ట్వా కృపా కస్య న జాయతే | విశేషతః పతిం బాలేః నను త్వ మతినిర్ఘృణా. 39

త్వయోక్తాని వచాంస్యేవం పూర్వం మమ కృశోదరి|

వినా త్వయా న జీవేయం తదసత్యం త్వయాకృతమ్‌. 40

ఏహ్యేహి కామసంతప్తం పరిష్వజ సులోచనే | నాన్యథా నశ్యతే తాపః సత్యేనాపి శ##పేప్రియే 41

ఇత్థం విలప్య స్వప్నాంతే ప్రతిబుద్ధస్తు తత్‌ క్షణాత్‌ | ఉత్కూజతి తథారణ్య ముక్తకంఠం పునః పునః 42

పులస్త్యవచనముః నారదాః వినుము. దక్షపుత్రి సతీదేవి మరణానంతరం త్రిలోచనుడు దక్షయజ్ఞం ధ్వంసం గావించి సంచరించుచుండగా, ఆపత్నీకుడగు నా వృషకేతనుని చూచి కుసుమాయుధుడగు కందర్పుడున్మాద నాస్త్రంతో ప్రహరించెను. ఆ ఉన్మాదనాస్త్ర ప్రభావం వల్ల హరుడు పిచ్చివానివలె అడవుల్లో నదీతీరాల్లో తిరుగాడ సాగెను. తన భార్య సతీదేవి స్మరణకు రాగా, బాణందెబ్బతిన్న మదగజంలాగ మనోనిబ్బరాన్ని కోలుపోయెను. ఆతాపాన్ని భరించలేక హరుడు యమునా నదిలో దుమికెను. ఆ విరహానలానికి క్రాగి యమునాజలాలు నల్లబడెను. అప్పటినుంచీ కాటుక రంగు నీరు కలిగిన యమున "కాలింది" యయ్యెను. ఆ ప్రవాహం భూదేవికేశపాశంలాగ ప్రవహించి పవిత్ర తీర్థ మాయెను. ఆవిధంగా ఎన్నో పవిత్రనదుల్లో సరస్సులలో వాపీకూపాల్లోమునుగుతూ నదీ తీరాల్లో పర్వత భూముల్లో అరణ్యాల్లో స్వచ్ఛందంగా తిరుగాడుచున్నను శివునకు మనశ్శాంతి కలుగలేదు. కొంతసేపు ఏమోపాడుతూ, కొంతసేపు ఏడుస్తూ, కొంతసేపు ధ్యానంలో ఉంటూ, అందాల బరిణ అయిన దక్షకన్యనే స్మరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కపుడు ఆమెను గురించి కల కంటూ యిలా కలువరించెడివాడు " ఓ నిర్దయురాలా! నిలువుము. ఓముగ్దా! అనింద్యురాలా! నన్ను విడువకుము. నీ వియోగం వల్ల మదనానలంతో దగ్ధమగుచున్నాను. ఓ సతీ, సుందరీ నామీదకోపమా ? కోపింపకుము. నీపాదములకు మ్రొక్కెదను. నాతో మాటాడుము. ప్రియురాలా! నిన్నునుక్షణం చూచుచున్నాను. వినుచున్నాను. స్పృశిస్తున్నాను, కౌగిలించుచున్నాను, నీకు నమస్కరిస్తున్నాను. అట్టి నాతో ఏల మాటాడవు? ఇలా విలపించే వానిని చూచ ఎవని గుండె కరుగదు? అందులోనూ భర్త అయిన వాని పట్ల యింతటి కాఠిన్యమా? నిన్ను వదలినేను జీవించజాలను" అంటూ నీవిదివరకు చేసిన బాసలు ఏమైనవి? ఎంతటి అసత్యవాదినివి ? ఓ సునేత్రీః ఇంతటి నిర్దయవలదు. రమ్ము. నన్ను కౌగలించుకొనుము. లేనిచో ఈ కామాగ్ని చల్లారదు. నేను దగ్దమగుట తథ్యము. నిజము చెప్పుచున్నాను" ఇలా ఇలా కలవరించి స్వప్న భంగం కావడంతోటే తెలివి తెచ్చుకొని అడవుల్లో భోరున నేడ్చుచు పర్యటించును.

తం కూజమానం విలపంత మారాత్‌ సమీక్ష్య కామో వృషకేతనం హి |

వివ్యాధ చాపం తరసా వినామ్య సంతాపనామ్నాతు శ##రేణ భూయః. 43

సంతాపనాస్త్రేణ తదా స విద్దో భూయః స సంతప్తతరో బభూవ |

సంతాపయంశ్చాపి జగత్సమగ్రం పూత్కృత్య పూత్కృత్య వివాసతేస్మ. 44

తంచాపి భూయో మదనో జఘాన విజృంభణాస్త్రేణ తతో విజృంభే|

తతో భృశం కామశ##రైర్వితున్నో విజృంభమాణః పరితో భ్రమంశ్చ. 45

దదర్శ యక్షాధిపతే స్తనూజం పాంచాలికం నామ జగత్ర్పధానమ్‌|

దృష్ట్వా త్రినేత్రో దనదస్య పుత్రం పార్శ్వం సమభ్యేత్య వచోబబాషే.

భ్రాతృవ్య వక్ష్యామి వచో యదద్య తత్త్వం కురుష్వామిత విక్రమోసి. 46

పాంచాలిక ఉవాచ ః

యన్నాథః మాం వక్ష్యసి తత్కరిష్యే సుదుష్కరం యద్యపి దేవనం ఘైః

ఆజ్ఞాపయస్వాతులవీర్య శంభోః దాసోస్మితే భక్తియుత స్తథేశ. 47

ఇలాదీనదీనంగా విలపిస్తున్న హరునిచూచి కాముడు సంతాపనమనే మరొక బాణముతోగొట్టెను. ఆదెబ్బకుశంకరుడు మరింత సంతప్తుడై ఆగ్నేయ నిశ్వాసాలు వూత్కారాలుగావిస్తూ ప్రపంచాన్నంతటినీ తీవ్రతాపంలో ముంచెను. ఆదేసమయాన మరల కాముడు విజృంభణమనే బాణాన్ని వదలెను. దానితో శివుడు విపరీతంగా ఆవులించుచూ నలుదిశలు కలయజూచెను అప్పుడతనికి కుబేర పుత్రుడు పాంచాలికుడనువాడు కనుపించెను. వెంటనే వానిని సమీపించి శివుడు - "బాబూ; నీవు మహావీరుడవు. నేను చెప్పునట్లు చేయుము". అనెను. అంతట పాంచాలికుడు- " ప్రభు! మీరు అసమాన పరాక్రములు. మీకు దాసుడను. మీరు చెప్పునది దేవతలకు అసాధ్యమైననూ సరే, నేను తప్పక చేయుదును. ఆజ్ఞాపింపు" డనెను.

ఈశ్వర ఉవాచః

నాశంగతాయాం వరదాంబికాయాం కామాగ్ని నాప్లుష్ట సువిగ్రహోస్మి |

విజృంభణోన్మాదశ##రై ర్విభిన్నో దృతిం నవిందామి రతిం సుఖం వా. 48

విజృంభణం పుత్రః తథైవ తాప మున్మాదముగ్రం మదన ప్రణున్నమ్‌ |

నాన్యః పుమాన్‌ దారయితుంహి శక్తో ముక్త్వా భవంతం హి తతః ప్రతీచ్ఛ. 49

ఈశ్వరవచనము ః "పుత్రా! వరదాంబిక మరణానంతరం కామాగ్నిదగ్ధుడనై విజృంభణ ఉన్మాదన బాణాలకు గురియై విలవిల లాడుచున్నాను. మదన చోదితాలయిన ఈ జృంభణ మాదన సంతాప నాస్త్రాల వేడిమిని తట్టుకొనగలవాడు నీవు దక్కమరొకడులేడు. కనుక వీనిని గ్రహించి నాకు శాంతి కలిగించుము.

పులస్త్య ఉవాచః

ఇత్యేవ ముక్తో వృషభధ్వజేన యక్షః ప్రతీచ్ఛత్‌ సవిజృంభణాదీన్‌ |

తోషం జగామాశు తతస్త్రిశూలీ తుష్టస్తదైవం వచనం బభాషే. 50

పులస్త్యవచనముః ఈశ్వరుని వచనములు విని యక్షపుత్రుడా జృంభణ మాదనాది అస్త్రాలను గ్రహించెను. అంతట సంతోషించినవాడై శూలి అతని కిట్లనెను.

హర ఉవాచః

యస్మాత్త్వయా పుత్రః సుదుర్ధరాణి విజృంభణాదీని ప్రతీచ్ఛితాని |

తస్మాద్వరం త్వాం ప్రతిపూజనాయ దాస్యామి లోకస్యచ హాస్యకారి. 51

యస్త్వాం యదా పశ్యతి చైత్రమాసే స్పృశేన్నరో వార్చయతే చ భక్త్యా|

వృద్ధోథ బాలోథ యువాథ యోషిత్‌ సర్వే తదోన్మాదధరా భవంతి. 52

గాయంతి నృత్యంతి రమంతి యక్ష వాద్యాని యత్నాదపి వాదయంతి |

తవాగ్రతో హాస్యవచోభిరక్తా భవంతితే యోగయుతాస్తు తేస్యుః . 53

మమైవ నామ్నా భవితాసి పూజ్యః పాంచాలికేశః ప్రథితః పృథివ్యామ్‌|

మమ ప్రసాదాద్వరదో నరాణాం భవిష్య సే పూజ్యతమోభిగచ్ఛ. 54

హరుని వచనముః బిడ్డా ! దుస్సహములయిన జృంభణాది అస్త్రముల తాపమును స్వీకరించిన నీయందు ప్రీతుడనైతిని. అందుకు బదులుగా నీకు అనుకూలించునదియు లోకులకు సంతోషకరమైనదియునైన వరమొకటి యిచ్చు చున్నాను. చైత్రమాసంలో నిన్ను చూచినను తాకినను, భక్తితో అర్చించినను, అట్టివారు వృద్ధులైనా, బాలురైనా, స్త్రీలైనా పురుషులైనా సరే వారందరు ఉన్మత్తులగుదురు. వారు అస్థితిలో నాట్యగానాలు చేయుదురు. వివిధ వాద్యాలు నేర్పుతో వాయింతురు. నీముందర హాస్యోక్తులు పలుకుచుందురు. అయితే వారందరకు దివ్యశక్తులు లభించును. ఇక నీవూ, భూలోకంలో నా పేరుతో పాంచాలికేశ్వరుడవుగా విఖ్యాతుడవై నిన్ను గొలిచినవారలకు వరములోసంగెదవు. ఎల్లరకు పూజ్యుడవగుదువు.

ఇత్యేవముక్తో విభునా సయక్షో జగామ దేశాన్‌ సహసైవ సర్వాన్‌|

కాలంజరస్యోత్తరతః సుపుణ్యో దేశో హిమాద్రేరపి దక్షిణస్థః. 55

తస్మిన్‌ సుపుణ్య విషయే నివిష్టో రుద్రప్రసాదా దభిపూజ్యతేసౌ |

తస్మిన్‌ ప్రయాతే భగవాంస్త్రినేత్రో దేవోపి వింధ్యంగిరి మభ్యగచ్ఛత్‌. 56

తత్రాపి మదనో గత్వా దదర్శ వృషకేతనమ్‌ | దృష్ట్వా ప్రహర్తుకామంచ తతః ప్రాదుద్రవద్దరః. 57

తతో దారువనం ఘోరం మదనాభిసృతో హరః | వివేశ ఋషయో యత్ర సపత్నీకా వ్యవస్థితాః. 58

తేచాపి ఋషయ స్సర్వే దృష్ట్వా మూర్ధ్నా నతాభవన్‌ |

తతస్తాన్‌ ప్రాహ భగవాన్‌ భిక్షా మే ప్రతిదీయతామ్‌. 59

హరునిచే వరము పొంది ఆ పాంచాలికుడు సమస్తదేశాలలో పరిభ్రమించెను. కాలింజరానికి ఉత్తరాన, హిమవత్పర్వతానికి దక్షిణాన గల పవిత్రదేశంలో ఆయక్ష పుత్రుడు శివానుగ్రహం వల్ల పాంచాలికేశ్వరుడుగ పూజలందుకుంటున్నాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ముక్కంటి కూడ వింధ్యగిరికి పయనించెను. అయితే మదనుడాయనవచటకు గూడ వెంబడించి మరల ప్రహరింపనుద్యుక్తుడు కాగా హరుడచటనుండి పలాయితు డయ్యెను. అట్లు పరుగిడి అనేకులు ఋషులకు తత్పత్నులకు నావాసమైన భయంకరమగు దారుకావనమున ప్రవేశించెను. అట్లు కామునిచే తరుమబడి తమ ఆశ్రమాలలో బ్రవేశించిన శివుని జూచి ఋషులు తమ తలలువంచుకొనిరి శివుడు వారలను భిక్షపెట్టుడని అడిగెను.

తతస్తే మౌనిన స్తస్థుః సర్వఏవ మహర్షయః | తదాశ్రమాణి సర్వాణి పరిచక్రామ నారద. 60

తంప్రవిష్టం తదాదృష్ట్వా భార్గవాత్రేయయేషితః | ప్రక్షోభ మగమన్‌ సర్వా హీనసత్వాః సమంతతః . 61

ఋతే త్వరుంధతీ మేకా మనసూయంచ భామినీమ్‌|

ఏతాభ్యాం భర్తృపూజాసు తచ్చింతాసు స్థితం మనః. 62

తతః సంక్షుభితా స్సర్వా యత్ర యాతి మహేశ్వరః |

తత్రప్రయాంతి కామార్తా మదవిహ్వలితేంద్రియాః. 63

త్యక్త్వాశ్రమాని శూన్యాని స్వాని తా మునియోషితః | అనుజగ్ము ర్యథా మత్తం కరిణ్య ఇవ కుంజరమ్‌. 64

తతస్తు ఋషయో దృష్ట్వా భార్గవాంగిరసో మునే | క్రోధాన్వితా బ్రువన్‌ సర్వే లింగోస్య పతతాం భువి.

తతః పపాత దేవస్య లింగం పృథ్వీం విదారయన్‌ | అంతర్ధానం జగామాథ త్రిశూలీ నీలలోహితః. 66

నారదా ! అంతట ఋషులు మౌనంగా ఉండుట చూచి హరుడు వారల ఆశ్రమముల నంతట కలయదిరిగెను. అట్లు తిరుగుచున్న శివుని చూచి భార్గవ, ఆత్రేయ ఋషుల భార్యలందరు విమోహితులై నిగ్రహాన్ని కోల్పోయి కామార్తలై శివుడెచటకు పోయిన నచటకు వెంటబడి పోసాగిరి. అయితే పరమపతి వ్రతలగు అరుంధతీ అనసూయలు మాత్రము ఆ వికారమునకు లోను గాకుండిరి. తమ ఆశ్రమాలు యిండ్లు వదలి మదించిన ఏనుగు వెంబడించు కరిణుల వలె పరమ శివుని వెంట పరుగిడు తమ భార్యల చేష్టలు చూచి క్రోధోన్మత్తులైన అంగిరసాది ఋషులు శివుని లింగము నేలబడునట్లుగ శపించిరి. వెంటనే శివుని లింగము భూమిని బ్రద్దలు చేయుచు నేలబడెను. అంతట త్రిశూలియగు శివుడంతర్హితుడాయెను.

తతః స పతితో లింగో విభిద్య వసుధాతలమ్‌ | రసాతలం వివేశాశు బ్రహ్మాండం చోర్ధ్వతోభినత్‌. 67

తత శ్చచాల పృథివీ గిరయః సరితోనగాః | పాతాలభువనాః సర్వే జంగమాజంగమైర్వృతాః. 68

సంక్షుబ్ధాన్‌ భువనాన్‌ దృష్ట్వా భూర్లోకాదీన్‌ పితామహః |

జగామ మాధవం ద్రష్టుం క్షిరోదం నామసాగరమ్‌. 69

తత్ర దృష్ట్వా హృషీకేశం ప్రణిపత్యచ భక్తితః | ఉవాచదేవః భుపనాః కిమర్ధం క్షుభితా విభో. 70

అథోవాచ హరి ర్బ్రహ్మన్‌ శార్వో లింగో మహర్షిభిః | పాతిత స్తస్య భారార్తా సంచచాల వసుంధరా. 71

తతస్తదద్భుతతమం శ్రుత్వా దేవః పితామహః | తత్రగచ్ఛామ దేవేశ ఏవమాహ పునఃపునః. 72

తతఃపితామహో దేవః కేశవశ్చ జగత్పతిః | ఆజగ్మతు స్తముద్దేశం యత్రలింగం భవస్యతత్‌. 73

తతోనంతం హరిర్లింగం దృష్ట్వారుహ్య ఖగేశ్వరమ్‌ | పాతాళం ప్రవివేశాథ విస్మయాంతరితో విభుః. 74

బ్రహ్మా పద్మవిమానేన ఊర్ధ్వమాక్రమ్య సర్వతః | నైవాంత మలభద్‌ బ్రహ్మన్‌ విస్మితః పునరాగతః. 75

విష్ణుర్గత్వాథ పాతాలాన్‌ సప్తలోకపరాయణః | చక్రపాణి ర్వినిష్క్రాంతో లేభేంతం నమహామునే. 76

విష్ణుః పితామహ శ్చోభౌ హరలింగం సమేత్యహి | కృతాంజలిపుటౌ భూత్వా స్తోతుం దేవం ప్రచక్రతుః. 77

అట్లునేలబడిన లింగము భూమిని బ్రద్ధలు చేసుకొని పాతాళానికి పైన బ్రహ్మాండాన్ని భేదించుకొని ఊర్ధ్వలోకాలకూ వ్యాపించెను. అంతట నదీనద సముద్ర పర్వతాలతో నిండిన భూగోళము కంపించెను. పాతాళాది భువనాలన్నీ ఘూర్లిల్లి పోయినవి, అట్లు సంక్షుభితాలయిన భువనాలను చూచి బ్రహ్మవిస్మితుడై క్షీరసాగరశాయి అయిన మాధవుని చూడ బోయెను. అచట హృషీకేశుని చూచి భక్తితో స్తోత్రముచేసి, "ప్రభో ! ఈ మహోపద్రవ మెట్టిది? అని అడిగెను. అప్పుడు శ్రీహరి- విరించీ! మహర్షుల శాపకారణాంగా శర్వుని లింగము ఊడిపడినది. ఆ భారము వహించలేక భూమి కంపించి పోవుచున్నదనెను. ఆ అద్భుతానికి విస్మితుడై బ్రహ్మ మనమచ్చటకు పోవుదమని విష్ణువును తొందరపెట్టెను. అంతట బ్రహ్మ విష్ణువు లిద్దరు శివలింగము పడిన చోటుకు చేరిరి. తుద మొదలు కనుపించని ఆ లింగమును చూచినంతనే విష్ణువు గరుడునిపై నెక్కి ఆశ్చర్యంతో పాతాళానికి వెళ్ళిపోయెను. బ్రహ్మ పద్మవిమానాన్నెక్కి ఊర్ధ్వ లోకాలన్నీ గాలించాడు. కాని లింగపు కొన కనుగొన జాలక ఆశ్చర్య చకితుడై తిరిగి వచ్చాడు. అట్లే సప్త పాతాళాలను శోధించిన విష్ణువు కూడ లింగపు మొదలు కనుగొన జాలక తిరగి వచ్చాడు. అంతట విధి విష్ణు లిద్దరూ లింగమును సమీపించి చేతులు జోడించి ఆ మహాదేవుని ఈ విధంగా స్తోత్రం చేయ మొదలిడిరి.

హరి బ్రహ్మాణావూచతుః :

నమోస్తుతే శూలపాణః నమోస్తు వృషభధ్వజ | జీమూతవాహన కవే శర్వ త్ర్యంబకః శంకరః . 78

మహేశ్వర మహేశానః సువర్ణాక్ష మహాకపే | దక్షయజ్ఞక్షయకరః కాలరూప సమోస్తుతేః. 79

త్వమాదిరస్య జగత స్త్వం మధ్యం పరమేశ్వర | భవానంతశ్చ భగవాన్‌ సర్వగస్త్వం నమోస్తుతే. 80

వులస్త్య ఉవాచః

ఏవం సంస్తూయమానస్తు తస్మిన్‌ దారువనేహరః | స్వరూపీ తావిదం వాక్య మువాచ వదతాం వరః . 81

హరి రువాచ ః

కిమర్థం దేవతానాథౌ పరిభూతక్రమం త్విహ?| మాం స్తువాతే భృశాస్వస్థం కామతాపితవిగ్రహమ్‌. 82

దేవా వూచతుః:

భవతః పాతితం లింగం యదేతత్‌ భువి శంకర | ఏతత్‌ ప్రగృహ్యతాం భూయ ఆతో దేవ స్తువావహే . 83

"ఓ శూలపాణీ ! నీకు నమస్కారం! వృషభధ్వజా, నీకు వందనము! జీమూతవాహనా! కవీ ! శర్వా! త్ర్యంబకా! శంకరా! నమస్కారము ! మహేశ్వరా, మహేశానా, సువర్ణాక్షా, వృషాకపీ, దక్షాధ్వరనాశకా, కాల రూపా, నీకు నమస్సులు ! ఈ జగత్తుకు మొదలు, మధ్య, తుది నీవే ! పరమేశ్వరా! భగవాన్‌! నీవు సర్వగుడవు! నీకు వందనములు!"

పులస్త్యవచనము: ఆ స్తోత్రమునకు సంతసించి ఆదారుకావనంలో వాక్యవిశారదుడగు ఈశ్వరుడు హరిబ్రహ్మలకు ప్రత్యక్షమై, "ఓ దేవాధిపులారాః కామ సంతప్తుడనై విధి క్రమాలు విసర్జించి, చిత్తశాంతి లేకుండా ఉన్ననన్నెందు స్తోత్రము చేయుచున్నారనెను. అందులకా హరిబ్రహ్మ లిట్లనిరి. మహాదేవా! ఇచట భూపతితమైన భవదీయ లింగాన్ని తిరిగి పరిగ్రహించండి. ఇదే మా ప్రార్థనము.

హర ఉవాచ :

యద్యర్చయంతి త్రిదశా మమ లింగం సురోత్తమౌ | తదేత త్ర్పతిగృహ్ణీయాం నాన్యథేతి కథంచన. 84

హరుని వచనము: "ఓదేవోత్తములారా ! దేవతలందరు నాలింగమును పూజించుచో నేను దీనిని తీసికొందును లేనిచో తీసికొనను.

తతః ప్రోవాచ భగవా నేవమస్త్వితి కేశవః | బ్రహ్మా స్వయంచ జగ్రాహ లింగం కనకపింగళమ్‌. 85

తతశ్చకార భగవాం శ్చాతుర్వర్ణ్యం హరార్చనే | శాస్త్రాణి చైషాం ముఖ్యాని నానోక్తివిదితానిచ. 86

ఆద్యం శైవం పరిఖ్యాత మన్యత్‌ పాశుపతం మునేః | తృతీయం కాలవదనం చతుర్థంచ కపాలికమ్‌. 87

శైవశ్చాసీత్‌ స్వయంశక్తి ర్వసిష్ఠస్య ప్రియః సుతః | తస్యశిష్యోబభూవాథ గోపాయన ఇతి శ్రుతః. 88

మహాపాశుపత శ్చాసీ ద్బరద్వాజ స్తపోధనః | తస్యశిష్యో7ప్యభూద్రాజా ఋషభః సోమకేశ్వరః. 89

కాలాస్యో భగవానాసీ దాపస్తంబ స్తపోధనః | తస్యశిష్యో7భవద్వైశ్యో నామ్నా క్రాథేశ్వరో మునే. 90

మహావ్రతీచ ధనద స్తస్య శిష్యశ్ఛ వీర్యవాన్‌ | కర్ణోదర ఇతి ఖ్యాతో జాత్యా శూద్రో మహాతపాః . 91

ఏవం స భగవాన్‌ బ్రహ్మా పూజనాయ శివస్య తు | కృత్వాతు చాతురాశ్రమ్యం స్వమేవ భవనం గతః . 92

గతే బ్రహ్మణి శర్వో7పి ఉపసంహృత్య తం తదా | లింగం చిత్రవనే సూక్ష్మం ప్రతిష్ఠాప్య చచారహ. 93

అందులకు కేశవుడంగీకరించగా బ్రహ్మ స్వయంగా నా బంగారు వికారముగల లింగమును తీసికొదెను. అనంతరం భగవానుడు నాలుగు వర్ణముల వారిని హరార్చన పరుల నొనర్చెను. అందులకు వలసిన ముఖ్యశాస్త్రముల ప్రవర్తింపజేసెను. వానిలో మొదటిది శైవము. రెండవది పాశుపతము, మూడవది కాలవదనము నాలవది కాపాలికము. వశిష్ఠుని ప్రియపుత్రుడు శక్తి శైవుడు. ఆయన శిష్యుడు గోపాయనుడని తెలియుచున్నది. ఇక భరద్వాజుడు మహాపాశుపతుడు. ఆతపస్వి శిష్యుడు ఋషభ సోమకేశ్వరుడను నరపతి. తపోధనుడగు నావస్తంబుడు కాలాముఖ భక్తుడు. ఆయన శిష్యుడు క్రాథేశ్వరుడను వైశ్యుడు. కుబేరుడు మహావ్రత దీక్షితుడు. కాగా అకని శిష్యుడు మహాతపస్వియగు కర్ణోదరుడను శూద్రుడు. ఈ విధంగా బ్రహ్మ చతుర్వర్ణముల వారిని శివపూజకైనియోగించి తనలోకమునకు తిరిగి పోయెను. బ్రహ్మ వెళ్ళిన తర్వాత శివుడు లింగమునుపసంహరించుకొని సూక్ష్మరూపమున దానిని చిత్రవనమున ప్రతిష్ఠించి వెడలిపోయెను.

విచరంతం తదా భూయో మహేశం కుసుమాయుధః |

ఆరాత్‌ స్థిత్వా7గ్రతో ధన్వీ సంతాపయితు ముద్యతః. 94

తతస్తమగ్రతో దృష్ట్వా క్రోధాధ్మాతదృశా హరః | స్మరమాలోక యామాస శిఖాగ్రా చ్చరణాంతికమ్‌. 95

ఆలోకిత స్త్రినేత్రేణ మదనో ద్యుతిమానపి | ప్రాదహ్యత తదా బ్రహ్మన్‌ పాదాదారభ్య కక్షవత్‌. 96

ప్రదహ్యమానౌ చరణౌ దృష్ట్వా7సౌ కుసుమాయుధః | ఉత్ససర్జ ధనుఃశ్రేష్ఠం తజ్జగామాథ పంచధా. 97

యదాసీ న్ముష్టిబంధంతు రుక్మపృష్టం మహాప్రభమ్‌ | స చంపక తరు ర్జాతః సుగంధాఢ్యో గుణాకృతిః. 98

నాహస్థానం శుభాకారం యదాసీ ద్వజ్రభూషితమ్‌ | తజ్జాతం కేసరారణ్యం వకుళం నామతో మునే. 99

యాచ కోటీ శుభా హ్యాసీ దింద్రనీలవిభూషితా | జాతా సా పాటలా రమ్యా భృంగరాజవిభూషితా. 100

నాహోపరి తథా ముష్టౌ స్థానం శశిమణిప్రభమ్‌ | పంచగుల్మా7భవజ్జాతీ శశాంకకిరణోజ్జ్వలా. 101

ఊర్ధ్వం ముష్ట్యా అథఃకోట్యోః స్థానం విద్రుమభూషితమ్‌|

తస్మా ద్బహుపుటా మల్లీ సంజాతా వివిధామునే. 102

పుష్పోత్తమాని రమ్యాణి సురభీణి చ నారద | జాతియుక్తాని దేవేన స్వయ మాచరితానిచ. 103

ముమోచ మార్గణాన్‌ భూమ్యాం శరీరే దహ్యతి స్మరః | ఫలోపగాని వృక్షాణి సంభూతాని సహస్రశః. 104

చూతాదీని సుగంధీని స్వాదూని వివిధానిచ | హరప్రసాదాజ్జాతాని భోజ్యాన్యపి సురోత్తమైః. 105

ఏవం దగ్ధ్వా స్మరం రుద్రః సంయమ్య స్వతనుం విభుః | పుణ్యార్థీ శిశిరాద్రిం స జగామ తపసే7వ్యయః.

ఏవం పురా దేవవరేణ శంభునా కామస్తు దగ్ధః సశరః సచాపః |

తతస్త్వనంగేతి మహాధనుర్ధరో దేవైస్తు గీతః | సురపూర్వపూజితః. 107

ఇతి శ్రీ వామన మహాపురాణ షష్ఠో7ధ్యాయః.

మహేశ్వరుడట్లు మరల తిరుగుటచూచి కుసుమాయుధుడాయనను మరల ప్రహరించుటకై ధనుష్పాణియై ఎదుట నిలచెను. వానిని చూచినంతనే కోపంతో కనుల నిప్పులు రాల్చుచు శివుడాతనిని నఖశిక పర్యంతము వీక్షించెను. తేజస్వి యైనను మదనుడా వేడిమికోర్వ లేక పోగా నతని పాదముల నుండి నడుమువరకు గల భాగము దగ్ధమయ్యెను. పాదములట్లు తగులబడగా మదనుడు తన ధనుస్సును వదలివేయగా నది అయిదు ఖండములాయెను. బంగార వలె మెరయుచున్నదాని ముష్టిబంధము సువాసనలు వెదజల్లే సంపంగి వృక్షమాయెను. రత్నము పొదిగిన దాని సుందర నాహస్థానం, కేసరవనంలో చక్కని వకుళ (పొగడ) చెట్టుగమారెను. మునీ! ఇంద్రనీలమణులు పొదగిన ఆ ధనుస్సు కోటి (అగ్రం) తుమ్మెదలతో నిండిన అందమైన పాటల తరువైనది. వాహస్థానానికిపైన చంద్రకాంతమణులు పొదిగిన పిడి (ముష్టి) చంద్రకాంతివలె తెల్లనైన అయిదురేకల మల్లెపూవయ్యెను. పిడిపైన, వంపు దిరిగిన చివరలకు దిగువ పగడములతో అలంకరించబడిన దొంతరలుగల వివిధ (వన) మల్లికలయినవి. నారదా ! యీ విధంగా పరమేశ్వరుని ద్వారా మంచి వాసనలు వెదజల్లే మల్లె మొదలయిన పుష్పాలు సృష్టింపబడినాయి. శరీరంతగలబడడం చూచి మన్మథుడు తన బాణాలను గూడ పారవైచెను. వానినుండి వేలాది ఫలవృక్షాలు పుట్టినవి. శంకరుని కృపవల్ల దేవతలందరకు రుచికరములగు మామిడి మొదలయిన పలురకముల ఫలములేర్పడినవి. ఇట్లు మన్మథుని దగ్ధంచేసి తన శరీరాన్ని అదుపులో నుంచుకొని శివుడు పుణ్యార్జనకై కైలాసమున తపస్సు కొరకై వెళ్ళిపోయెను. ఈ విధంగా పురాసమయాన దేవశ్రేష్ఠుడగు శివుడు ధనుర్భాణాలతో సహా మదనుని దగ్ధము కావించగా ఆ మహా ధానుష్కుడా నాటినుండియు అవంగుడని పిలువబడెను.

ఇది శ్రీ వామన మహాపురాణంలో ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters