Sri Vamana Mahapuranam    Chapters   

ఓం

నమో భగవతే వాసుదేవాయ

శ్రీ వామన మహాపురాణము

(ఆంధ్రానువాదము)

అనువాదకుడు:

డా. వారణాసి రామమూర్తి 'రేణు'

(ఎం.ఎ., డి.లిట్‌.,)

''గురుకరుణ''

నెం. 10-5-22/ఎ, మాసాబ్‌ ట్యాంక్‌

హైదరాబాదు-500 028.

ప్రకాశకులు:

శ్రీవేంకటేశ్వర ఆర్ష భారతీ ట్రస్ట్‌

''గురుకృప''

1-10/140/1, అశోక్‌ నగర్‌, హైదరాబాదు 500 020.

ప్రథమ ముద్రణ 1994 సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

ప్రతులు 2000

మూల్యము రు.99/-

ప్రతులకు:

శ్రీవేంకటేశ్వర ఆర్ష భారతీ ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1

అశోక్‌ నగర్‌

హైదరాబాదు - 500 020.

ముద్రణ:

ఆర్‌.కె.ప్రింటర్స్‌

1-8-725/c

నల్లకుంట

హైదరాబాదు - 500 044.

ఓం

నమో భగవతే వాసుదేవాయ

ఆముఖము

ప్రాచీన భారతీయ వాజ్మయాన్ని స్థూలంగా మూడు శ్రేణులలో విభజించవచ్చు. బ్రహ్మాదులచే స్మరింపబడిన స్మృత వాజ్మయము. బ్రహ్మముఖం నుండి నిర్గమించిన 'శ్రుతు' సాహిత్యము. ఇక పోతే మూడవది లౌకిక రచయితలచేత నిర్మింపబడిన 'కృతి' రచనలు. అనేక పురాణాల్లో ఈ శ్లోకం కనిపిస్తుంది మనకు-

''పురాణం సర్వ శాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్‌

అనంతరం చవక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః||''

అన్ని శాస్త్రాల్లో ప్రథమంగా 'పురాణం' బ్రహ్మస్మృతిలో వెలసినది. తర్వాత ఆయన చతుర్ముఖాల నుండి శ్రుతి రూపాన వినిర్గతమైనవి వేదాలు. యిక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. పురాణాలు, వేదాలు స్మృతి పథాన మెదిలాయనీ, బ్రహ్మనోటినుండి బహిర్గతమైనాయని చెప్పబడిందే కాని అవి ఫలానా వారి కర్తృకాలు 'కృతు' లని శ్లోకం చెప్పదు. అయితే ఇక్కడ విచారణీయమేమంటే, పురాణానికి 'స్మృత' మనీ వేదాలకు 'శ్రుత' మనే మాటలు ఎందులకు వ్యవహరింపబడినాయి. కృతాలని ఎందుకు చెప్పబడలేదు?ఒక్క సంస్కృత వాజ్మయాన్ని తప్పిస్తే యితర భాషాసాహిత్యాల్లో యీ విధమైన 'స్మృత' 'వినిర్గత' రచనలు కనిపించవు. కాళిదాసు భవభూతి ఇత్యాదుల రచనలను స్మృతులని కాని శ్రుతులనికానీ అనరు. అవి కృతులు. ప్రతిభావంతులగు మానవుల రచనలు. వాటి అర్థాలు కవి కల్పనా ప్రసూతాలు. రఘువంశాదుల కథలు రామాయణపురాణాదుల్లో నుంచి గ్రహించబడినా, వానిని సహృదయ సంవేద్యాలు కావించేందుకు ఆయా కవులు వాని భావార్థాలను తమ కల్పనా శక్తి ద్వారా రూపాయితాలు గావించారు. కాళిదాసు తన కావ్య రచనలు, ఆయా కథలను రామాయణాదుల నుంచి చదివీ, వినీ ఆ విధంగా తెలుసుకొని, రచించాడేకాని వానిని, ఋతంభరప్రజ్ఞ ద్వారా స్మరించి యుండలేదు. కనుకనే వాల్మీకి రామాయణానికి వలె రఘువంశ కావ్యానికి 'స్మృతి' గ్రంథంగా ఖ్యాతి లేదు. అలాగే యితర సంస్కృత కావ్య, నాటకాది రచనలు కూడ విద్వత్కవుల కృతులుగానే నిలచి పోయినవి.

ప్రాచీన శాస్త్రాలు రెండు విధాలు- ఒకటి 'శ్రుతి' (వేదం) రెండవది 'స్మృతి' వేదాలను తప్పించి, పురాణ, ఉపపురాణ, ధర్మశాస్త్రాదులన్నీస్మరణ ద్వారా సాధించబడినవగుట చేత స్మృతులనబడుతున్నవి. పంకజ శబ్ధం కమలమనే అర్థంలో రూఢమైనట్లు ఈ 'స్మృతి' శబ్ధం కూడా, తపోశక్తి ద్వారా, ఋతంభరప్రజ్ఞ ద్వారా స్మరింపబడి అనంతరం శబ్ధాలలో బంధింపబడిన శాస్త్ర రచనల విషయంలోనే రూఢమైనది. ఆ విధంగా పురాణాలు స్మృతగ్రంథాలు; నిత్యనూతనార్థ స్ఫోరకాలు. వానిలోని శబ్ధాలు బ్రహ్మ, వ్యాస, గౌతమాది తపోధనులకు చెందినవైనా అవి బ్రహ్మమేధస్సు నుండి కాని, వ్యాసుని ప్రతిభనుండి కాని పుట్టినవి కావు. స్మృత పురాణాల కర్తృత్వం వ్యాసాదులకు చెందనేరదు.

ఇక 'వినిర్గత' గ్రంథాల విషయానికి వస్తే, వాని అర్థాలు, శబ్దాలు, ఉచ్చారణా, ఏ పురుషుడూ నిర్మించినవి కావు. అవి శ్రుతులు. 'శ్రుతి' కూడ యోగ రూఢ శబ్దమో. ''శ్రూయత ఏవ, నకేనచిత్‌ క్రియత ఇతి శ్రుతిః'' వినబడిన, చెవి ద్వారా గ్రహీతమైన వాక్యసమూహమే శ్రుతి, ఏ మానవుని ద్వారా నిర్మింపబడినది కాదు. ఆ విధంగా ఆ శబ్దం, వేదరూప గ్రంథాల పట్లనే రూఢమైంది. ఉదాహరణకు, మనమీనాడు రేడియోలో ఏదేని మంచి కార్యక్రమం ప్రసారమైనపుడు దానిని రికార్డు చేసుకుంటాము. తర్వాత విని యధాతధంగా వ్రాసుకుంటాము. అంత మాత్రాన మనమే ఆ రేడియో కార్యక్రమ కర్తల మని చెప్పుకోగలమా? చెప్పుకోలేము. కారణం అందులోని మాటలుగాని, వాని భావాలు కాని, ఉచ్చారణ కాని, మనవి కావు. అవన్నీ రేడియోనుండి వినిర్గతాలయినవి. కాగా ఆ కార్యక్రమానికి మనం కర్తలమూ కాము, స్మర్తలమూ కాము. కేవలం లిపి కర్తలం మాత్రమే. అదేవిధంగా బ్రహ్మ తదితర ఋష్యాదులు శ్రుతి వాక్యాలకు స్మర్తలుగారు, కర్తలు గారు, అనువారకులూగారు. కాగా మానవకృత రచనలు అనిత్యాలు. బ్రహ్మ ద్వారా స్మరింపబడిన అర్థాలూ ఆయన ముఖాలనుంచి వినిర్గతాలయిన వాక్యాలు నిత్య నూతనాలు, చిరంతనాలు, సనాతనాలు. ఈ విషయంల్లో యింకా సందేహాలేమైనా ఉంటే అందుకు సమాధానంగా, బ్రహ్మ ఏ పరిస్థితిలో పురాణాలను స్మరించినదీ, ఏ దశలో వేదాలు ఆయన ముఖాలనుండి వెలువడినదీ చూడవలసి ఉంది.

మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం, భూత సృష్టికి పూర్వం నలువైపులా మహా ప్రళయం వ్యాపించింది. బ్రహ్మతత్వం తప్ప మరొక దానికి చోటులేక పోయింది. నిస్తరంగ, నిస్పంద సాగరం వలెనున్న ఆ ప్రలయంలో జీవరాసుల ఉనికి మనుకులు మచ్చుకు గూడ లేవు.

సృష్టి సంకల్పం కలగడంతో పరబ్రహ్మ భూత సృష్టిగావించిన మీదట ప్రథమంగా చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు. శిశు ప్రాయుడైన విధాతకు తానెవరో, తన్నెవరు ఎందుకు సృష్టించారో తెలియక తికమకలో ఉండగా ఆకాశవాణి ద్వారా తపస్సు చేయమని ఆదేశించాడు పరమాత్మ. ఆ ఆదేశప్రకారం తపం చేసి బ్రహ్మ తాను శ్రీమన్నారాయణుని నాభి కమలం నుంచి పుట్టినట్లునూ, సృష్టి నిర్మాణము తన కర్తవ్యమనియూ తెలుసుకున్నాడు. సృష్టి అంటే ఏమో తెలియని విధాత, అది ఎట్టిదో వివరించమని భగవంతుని అర్థించాడు. అందులకు విష్ణువు మరల తపస్సు గావించమని ఆదేశించాడు. ఆ సుదీర్ఘ తపః ప్రభావం వల్ల అతనికి పురాణాలు జ్ఞప్తికి రావడం మొదలయింది. ఈ విషయాన్నే పై శ్లోకంలో ''పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్‌'' అని చెప్పడం జరిగింది. అయితే చతుర్ముఖుడి తపస్సు అప్పటికి పూర్తిగా పరాకాష్ఠ నందుకోలేదు. ఆయన హృదయం సర్వత్రా వ్యాపించి ఉన్న ఈశ్వరవాణిని గ్రహించి బహిర్గతం గావించగల రేడియో యంత్రంగా రూపొందలేదు. అనంతరం తపస్సు పూర్తికావడంతో భగవత్ప్రేరితమైన వేద వాజ్మయం ఆయన హృదయంలో ప్రతిఫలించి చతుర్ముఖాలద్వారా ఉచ్చరింపబడింది. ఈ తథ్యాన్నే శ్వేతాశ్వతరోపనిషత్తు చాటుతుంది.

'' యోబ్రహ్మాణం విద థాతి పూర్వమ్‌

యోవైవేదాంశ్చ ప్రహిణోతి తసై#్మ'' అంటూ.

అనగా పరబ్రహ్మ మొదట చతుర్ముఖ బ్రహ్మను పుట్టించి అనంతరం అతని తపస్సు పూర్తికాగానే ఆయన వద్దకు వేదాలను పంపించెను. 'ప్రహిణోతి' శబ్దం, నేడు మనం రేడియో సందర్భంలో ప్రయోగించే 'ప్రసారణ' అనే అర్ధాన్ని సూచిస్తుంది. ఎట్లా శబ్దాల రూపంలో కార్యక్రమాలను ప్రసారం చేసే రేడియో, ఆ శబ్దాలకూ, ఉచ్చారణకు తాను కర్తకాజాలదో అలాగే బ్రహ్మనోటినుండి వెలువడిన శ్రుతి సమూహంయొక్క శబ్దార్థాలకు గానీ, ఉచ్చారణకు గాని చతుర్ముఖుడు కర్తకాడు. శబ్దార్థ ఉచ్చారణల రూపం దాల్చిన పరబ్రహ్మయే ఆ వాజ్మయం. భగవత్తత్వ మనే రేడియో స్టేషన్‌ నుంచి పంపబడిన శబ్ద సమూహాన్ని, చతుర్ముఖుడుడనే రేడియో యంత్రం వినిర్గతం కావిస్తుంది. బ్రహ్మనిత్యతత్వం. అట్లే ఆయన ఎందరెందరి ద్వారానో స్మృతుడై కూడ సదానిత్యుడు. అలాగే వేదాలు పురాణాలు, వినిర్గతాలు స్మృతాలై శాశ్వతంగా ఉండిపోతాయి. ఋగ్యజు స్సామాదులు పురాణాలు బ్రహ్మరూపాలే అంటుంది అధర్వశ్రుతి -

'' ఋచః సామాని ఛందాంసి పురాణం యజుషాసహ||''

(అధ|| 11-7-24)

అంతే కాదు స్వయంగా పురాణమే తనను తాను 'బ్రహ్మ' గా వర్ణించుకుంది. పురాణం నిజానికి ఒకటే. దాని పద్దెనిమిది ప్రకరణాలే పద్దెనిమిది పురాణాలు. పద్మపురాణం 'బ్రహ్మ' ను పురాణ రూపిగా చెబుతుంది. బ్రహ్మ అనంత రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. ఆ రూపాల్లో ఒకటి పురాణం కూడాను.'' ఏకంపురాణం రూపంవై|'' అంతే కాదు పరబ్రహ్మ శరీరంలో, ఏ పురాణం ఏ అంగమో కూడా నిర్దేశిస్తుంది, పద్మపురాణం స్వర్గ ఖండంలో (62-2 నుంచి 7 శ్లోకాలు)'.

''ఏకం పురాణం రూపంవై, తత్ర పాద్యం పరంమహత్‌|

బ్రాహ్మం మూర్దాహరేరేవ, హృదయం పద్మ సంజ్ఞితమ్‌||

వైష్ణవం దక్షిణోబాహుః శైవం వామోమహేశితుః|

ఊరూ భాగవతం ప్రోక్తం, నాభిః స్యాన్నారదీయకమ్‌||

మార్కండేయంచదక్షాంఘ్రిర్వామోహ్యాగ్నేయముచ్యతే

భవిష్యం దక్షిణో జానుర్విష్ణోరేవ మహాత్మనః||

బ్రహ్మవైవర్త సంజ్ఞం తు వామజానూరు దాహృతః|

లైంగం గుల్ఫకం దక్షం, వారాహం వామగుల్ఫకమ్‌||

స్కాందం పురాణంలోమాని, త్వగ స్యవామనం స్మృతమ్‌|

కౌర్మం పృష్ఠం సమాఖ్యాతం, మాత్స్యం మేదః ప్రకీర్త్యతే||

మజ్ఞాతుగారుడం పోక్తం,బ్రహ్మాండ మస్థి గీయతే|

ఏవమో వాభవద్విష్ణుః పురాణా వయవోహరిః||

ఇలా వేద పురాణాలు బ్రహ్మస్వరూపాలు కాగా వానిని అనిత్యాలనీ, వానలో కొన్ని భాగాలు ప్రక్షిప్తాలనీ వాదించడం సత్యదూరం, అపచారం. మహాప్రలయంలో బ్రహ్మ యొక్క చిదంశ##మే వేద పురాణరూపంలో ఉండగా, అనంతరం భూతసృష్ఠి, బ్రహ్మ (విధాత) సృష్టి జరిగి, తపశ్శక్తి వల్ల విధాత పొందిన బుద్ది వికాసాన్ననుసరించి మొదట, పరబ్రహ్మ రూపమైన పురాణం స్పష్టాస్పష్టంగా స్మరణకు రాగా, అనంతరం వేదరూపంలో వినిర్గతమౌతుంది. ప్రారంభంలో సృష్టికార్యమనగా ఏమో తెలియని చతుర్మఖుడు, పురాణ వేదాలు ప్రాప్తించుటతో సృష్టి రచనాసామర్ధ్యం సాధించాడు. మొదట్లో ధాత స్మరించిన పురాణం శతకోటి ప్రవిస్తరమని మత్స్యపురాణోక్తి-(3-2, 3శ్లో||)

తపశ్చ కార ప్రథమ మమరాణాంపితామహః||

x x x x

పురాణం సర్వ శాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణా స్మృతమ్‌|

నిత్యం, శబ్దమయం, పుణ్యం, శతకోటి ప్రవిస్తరమ్‌||

కృతయుగాదిలో శతకోటి గ్రంథ సంఖ్యగల బృహత్పురాణ పఠనాసామర్ధ్యం, కాలక్రమేణ మానవుల ఆయుః ప్రమాణం క్షీణిస్తూ పోవుటతో ద్వాపరాంతానికి హీన స్థితికి చేరుకుంది. దానితో పరమాత్మ యొక్క జ్ఞానశక్తితో అవతరించిన వ్యాసభట్టారకులు, బ్రహ్మద్వారా స్మృతమైన మూల పురాణాన్ని కుదించి నాలుగు లక్షల శ్లోకాల్లో నిబద్దించుట సంభవించింది. నేడు మనకు లభ్యమౌతున్న పురాణభాష వ్యాస భట్టారకులది. విధాత ద్వారా స్మరింపబడిన పురాణం నేడు కనిపించదు. పురాణావిర్భావం విధాత స్మృతి రూపాన మొదట జరిగి, అనంతరం వేద రూపంలో వెలువడినంతమాత్రాన స్పష్టాస్పష్టమైన పురాణం, స్పష్టంగా అవిర్భవించిన తర్వాతిదైన ఆ వేదం కన్న శ్రేష్టం కానేరదు. బ్రహ్మరూపమైన ఆవాజ్మయం, పుర్ణత్వ ప్రాప్తికి ముందు 'స్మృత'మై పూర్ణత్వానంతరం స్వష్టంగా 'శ్రుత' మైనది. కనుక సర్వాధిక ప్రామాణ్యం వేదానిదే.

సర్గశ్చ ప్రతిసర్గశ్చవంశో మన్వంతకాణిచ|

వంశాను చరితం చైవ పురాణం పంచలక్షణమ్‌||

సర్గ (సృష్టి) ప్రతి సర్గ, వంశ ( చరిత్ర), మన్వంతర (కథ), వంశాను చరిత్రలను నీ ఆయిదూ పురాణ లక్షణాలు; అయినప్పటికీ పురాణాల ముఖ్యవిషయం సృష్టి విద్యమే, మిగతా నాలుగు దానికి ఉపోద్ఘాత రూపాలు. భగవంతుని నాభినుండి పుట్టిన కమలమే పృథ్వి. ఆపద్మాన్నే 'రసా' లేక భూమి అంటారు. భగవద్రూనమైన పురాణం ఒకటేననీ, దాని విభిన్న ప్రకరణాలే, అంగాలే, పద్దెనిమిది పురాణాలని తెలిసికొనియున్నాము. అవి బ్రాహ్మం, పాద్యం, వైష్ణవం(విష్ణు), వాయవ్యం, (వాయు, శైవ) భాగవతం, నారదపురాణం, మార్కండేయం, అగ్నిపురాణం, భవిష్యపురాణం, బ్రహ్మవైవర్తం, లింగపురాణం, వారాహపురాణం, స్కాందపురాణం, వామనపురాణం, కూర్మపురాణం, మత్స్యపురాణం, గరుడపురాణం, బ్రహ్మండపురాణం అనే పద్దెనిమిది. వీనిలో పదునాలుగవది వామనపురాణం ప్రకృతం మనకు అను సంధేయం.

వామనపురాణం : కొన్ని విశే షాలు

శ్రీమహావిష్ణువు అయిదవ అవతారం, వామనావతారం ఆధారంగా దీనిని వామనపురాణమని అంటారు. ఇందులో త్రివిక్రమ దేవుని మహిమ వర్ణింపబడినది. పదివేల శ్లోక సంఖ్యతో పూర్వభాగం, ఉత్తరభాగంగా విభజింపబడినది. అయితే 'బృహద్వామనమ' నే దీని ఉత్తర భాగం ఈనాడు దొరుకుట లేదు. పూర్వభాగంగా మాత్రమే లభ్యమౌతోంది. ఇందులో శ్లోకాలేకాక కొన్ని గద్యభాగములు కూడ ఉన్నవి. మొత్త 97అధ్యాయములుండగా వానిలో యిరువది యెనిమిదధ్యాయాలు 'సరోమాహాత్మ్యం' అనే పేరుతో కురుక్షేత్రంలోని బ్రహ్మసరోవరాన్ని విశేషంగా వర్ణిస్తాయి. వానిలో కురుక్షేత్రం, తదంతర్గతాలయిన కురుజాంగల, పృధూదకాది తీర్థముల మహిమ విస్తారంగా వర్ణింపబడినది. బలిచక్రవర్తియజ్ఞం కురుక్షేత్రంలో జరిగినట్లీ పురాణం పేర్కొంటుంది. కాగా పద్మపురాణం ఆ యజ్ఞం పుష్కర తీర్థంలో జరిగినట్లు, అగ్ని పురాణం హరిద్వారంలో, స్కాందపురాణం ప్రభాస క్షేత్రంలో, శ్రీమద్భాగవతపురాణం నర్మదాతీరంలోను జరిగినట్లు చెబుతాయి. ఈ పురాణానికి మూలవక్త పులస్త్యబ్రహ్మకాగా, శ్రోత నారద మహాముని, అనంతరం నారదుడు వ్యాసునికి, వ్యాసుడు లోమహర్షణసూతునికి, సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మునులకూ దీనిని వినిపిస్తారు.

ఇది పరమ పవిత్రమైన పురాణం. పరమాత్మ పురాణ శరీరమునకుత్వక్‌ స్థానీయం. ఇందులో త్రివిక్రమరూపం దాల్చిన, వామనదేవుని కథతో బాటు, నరనారాయణోపాఖ్యానం, జగన్మాత దుర్గాదేవి చరిత్ర, ప్రహ్లాద వృత్తాంతం, శ్రీదాముడు మొదలగు పరమభక్తుల కథలు కడు మనోహరంగా వర్ణింపబడినాయి. బలిదానవేంద్రుని చరిత్రయేకాక మరొక దైత్యరాజు 'ధుంధు' కు సంబంధించిన మరొక వామన అవతార కథ కూడ, కనిపిస్తుంది. గజేంద్రమోక్షణ కథకు మూల మీగ్రంథంలో కనిపిస్తుంది. ప్రధానంగా విష్ణుపారమ్యము కలిగియున్నప్పటికీ ఈ పురాణంలో శైవశాక్తాది సంప్రదాయాల శ్రేష్ఠత్వంగూడ వర్ణితమై సర్వత్ర ఒక చక్కని ఐక్యతా సిద్దాంతం గోచరిస్తుంది. 'సర్వదేవనమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి' అనే సమతా సూత్రం కనిపిస్తుంది.

ముఖ్యాంశాలు : ఆకర్షణలు

మొదట పులస్త్యుడు నారదునకు వినిపించిన, వామనావతార కథ, అనంతరం శివలీలలు, జీమూతవాహన కథ, బ్రహ్మమస్తక ఖండనం, కపాలమోచన కథ, దక్షయజ్ఞ ధ్వంసము, హరియొక్కకాల రూపం, కామదహనం, ప్రహ్లాదనారామణ యుద్ధం, భువనకోశం, దుర్గా చరిత్రం, కురుక్షేత్ర వర్ణన, సత్యామాహాత్మ్యం, పార్వతి జననం, గౌరీ ఆఖ్యానం, స్కందచరిత్ర, అంధకాసురవధ, జాబాలికథ, మరుద్గణాల ఉత్పత్తి, బలిచరిత్ర, లక్ష్మీచరిత్ర, త్రివిక్రమ చరిత్ర, ప్రేతోపాఖ్యానం, నక్షత్ర పురుషాఖ్యానం మొదలయిన చక్కని పఠితల హృదయాలు ఆకట్టు కునే ఘట్టాలు వర్ణింపబడినాయి. యితర పురాణల్లో సాధారణంగా కనిపించని విషయాలెన్నో యిక్కడ లభిస్తాయి. శివుడు తన వేర్వేరు అంగాలలో ధరించే సర్పాల పేర్లు, బదరికాశ్రమంలో నరనారాయణులతో భక్త ప్రహ్లాదుడు చేసే యుద్ధం, దేవదానవులుపయోగించే వివిధములయిన వాహనాల పేర్లు వాని వర్ణనలు, కర్కాటక చవితి వ్రతం, కాయజ్ఞలి వ్రతం, గంగా మానసిక స్నానం, గంగామాహాత్మ్యం, దధివామన స్త్రోత్రం, వరాహమాహాత్మ్యం, వేంకటేశగిరి మహిమ, సుకేశి చరిత్ర, త్రవిక్రముని ద్వారా ధుంధువధ, ప్రహ్లాదుని తీర్థయాత్ర, వామనమూర్తి వివిధ రూపాలు, ఆయన ఉండే వేర్వేరు ప్రదేశాల వర్ణన యిత్యాదులు. చివరగా ప్రహ్లాదుడు తన మనుమడగు బలికి చేసే విష్ణు భక్తిమహిమోపదేశము, విష్ణపూజా విధానం, విష్ణ్వాలయ నిర్మాణం, విష్ణు దీక్షా గ్రహణ పద్ధతి మొదలగు విషయాలతో గ్రంథం పరిసమాప్త మవుతుంది. పాపనాశనం,'తద్విష్ణోః పరమపద ప్రాప్తీ' ఈ పురాణ శ్రవణ ఫలాలు. చివరగా మోక్షప్రదాతయగు శ్రీ వామన ఏకాదశాక్షర మంత్రంతో గ్రంథ సమాప్తి - ''నమోనమః కారణవామనాయ!''

వామన పురాణంలో ఎన్నో చిత్రవిచిత్రాలయిన విశేషాలున్నట్లు తెలుసుకున్నాము. పాఠకుల మనో రంజనం కోసం వానిలో ఒక్క ఉదంతాన్ని మాత్రమే, ఉదాహరణ రూపాన, విపులీకరించి మిగతా విషయాలు గ్రంథంలో చూడవలసినదిగా కోరుతున్నాను.

సుదర్శనచక్ర కథ

సుదర్శనచక్రం విష్ణుభగవానుని ఆమోఘమైన ఆయుధ మని అందరకు తెలియును. అయితే ఆ ఆయుధం నారాయణునకు ఎప్పుడు ఎవరి ద్వారా లభించినదనే విషయం చాలామందికి తెలియక పోవచ్చును. సకల రాక్షస సంహారి అజేయం అమోఘం అయిన ఆ దివ్యాస్త్రాన్ని గురించిన ఆసక్తికరమైన గాధ మనకు శ్రీ వామనపురాణంలో కనిపిస్తుంది.

ప్రాచీన కాలాన వేదవేదాంగ విద్యలలో పారంగతుడు తపస్సంపన్నుడు నైన ' వీతమన్యు' వనే గృహస్థ బ్రాహ్మణుడుండేవాడు. అతనికి పతివ్రత పరమ శీలవతి అయిన ఆత్రేయి అనే భార్య ఉండేది. వారి కుమారుడు ఉపమన్యువు. దరిద్రంతో కొట్టుమిట్టాడే ఆ కుటుంబం దీనాతిదీనంగా రోజులు వెళ్లదీసుకుంటూ ఉండేది. పసివాడైన ఉపమన్యువు పాలకోసం పోరు పెడితే ఆ తల్లి బియ్యపు పిండి కలిపిన నీటిని పాలని త్రాగిస్తూ ఉండేది. తల్లిమాటలు నమ్మిన ఆ పసివాడు అవే నిజమైన పాలని తృప్తినడేవాడు. ఇలా ఉండగా ఒక నాడాబాలుడు తన తండ్రి వెంట ఒక విందు భోజనానికి వెళ్ళాడు. అచట పలువిధాలయిన భక్ష్య భోజ్యాలతో పాటు క్షీరాన్నం కూడా వడ్డించారు. ఆ పాయసం రుచికి ఎంతో అబ్బుర పడిన ఉపమన్యువు తన తల్లి తనకు రోజూ ఇచ్చునవి నిజమైన పాలు కావని తెలుసికొని ఆ మరునాటి నుండీ, పిండిపాలు త్రాగేందుకు నిరాకరస్తాడు. నిజమైన పాలు యివ్వమని మారాము చేస్తాడు. బిడ్డను తృప్తి పరచజాలని తన అశక్తతకూ దారిద్ర్యానికి కలత చెందిన ఆసాధ్వి ఆత్రేయి, కళ్లనిండానీరు నింపుకొని బిడ్డతో - 'బాబూ!ఒక్క పాలేమిటి, పరమేశ్వరుని ఆరాధిస్తే నీకు పాలకన్న కొన్ని వేలరెట్లు తీయనైన అమృతమే లభిస్తుందనుచు శోక సంతప్తురాలవుతుంది. అది విని ఆ బాలుడు 'అమ్మా నీవు చెప్పే ఆ మహాదేవుడు విరూపాక్షుడెవరమ్మా ఎక్కడ ఉంటాడమ్మా' ? అని అడుగుతాడు. అందులకా ధర్మశీల ఆత్రేయి యిలా చెబుతుంది.

బాబూ! పూర్వకాలాన శ్రీదాముడనే మహాపరాక్రమశాలి అయిన రాక్షస రాజు ఉండేవాడు. అతడు ప్రపంచాన్నంతటినీ జయించి లక్ష్మీదేవిని కూడ వశపరచుకున్నాడు. అంతటితో ఆగక విష్ణుమూర్తి శ్రీవత్సాన్ని గూడ కాజేయవలెనని ప్రయత్నించాడు. వాడి బౌద్ధత్యం చూచి వాడి వధోపాయం తెలుసుకునేందుకు మహావిష్ణువు మహేశ్వరుని వద్దకు, కైలాసానికి, పరమశివునకు తన గోడు చెప్పుకొనుటకు వెళ్లాడు. ఆ సమయంలో యోగమూర్తి మహాదేవుడు కైలాస శిఖరాన యోగ సమాధిలో మునిగి ఉన్నాడు. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకునేందుకు విష్ణువు వేయి సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తాడు. తన నేత్రాన్నే సమర్పించుకుంటాడు. ఆ తపస్సుకు సంతోషించి పరమశివుడాయనకు సుదర్శనమనే చక్రం యిస్తూ దాని మహిమ యిలా వర్ణించాడు. -'జగన్నాధా! సుదర్శన మనే ఈ ఉత్తమోత్తమ మగు ఆయుధము, పన్నెండు ఆకులు ఆరు నాభులు, రెండు యుగాలు (కాడి) కలిగి అసాధారణమైన వేగంతో సమస్తమైన ఆయుధాలను భస్మం చేయగల చక్రరాజము. సజ్జనులను రక్షించేందుకు గాను దీని పన్నెండు అర (ఆకు) లలో సకల దేవతలు, రాశులు, ఋతువులు, అగ్ని, సోముడు, మిత్రావరుణులు, ఇంద్రుడు, విశ్వేదేవతలు, ప్రజాపతి, హనుమంతుడు, ధన్వంతరి, తపస్సు, మరియు చైత్రం మొదలు ఫాల్గునం వరకు గల మాసాలు ప్రతిష్ఠితాలయి ఉన్నాయి! దీని శక్తి అజేయం. దీనిని తీసుకునివెళ్లి నిర్భయంగా శత్రు సంహారం గావించండి.

శివుని మాటలు విని నారాయణుడిలా అన్నాడు-' ప్రభో' యీ చక్రమునకు అమోఘశక్తి కలదని నాకెలా తెలియగలదు? దీని శక్తి సామర్థ్యం పరీక్షించేందుకు దీనిని మీమీదనే ప్రయోగించి చూడవలెనని సంకల్పం కలుగుతున్నది. దీని ప్రభావం మీమీద కనబడినచో నాకు నమ్మకము కలుగ గలదు. అందులకు అనుమతించ వలసినదిగా ప్రార్థన.' యోగేశ్వరుడగు మహాదేవుడు మందహాసంతో తన మీదకు చక్రప్రయోగానికి అనుమతించాడు. విష్ణువు ప్రయోగించిన ఆ ఆయుధం అజరామరుడైన మహాదేవుని శరీరాన్ని గూడ మూడు ఖండాలుగా వేరుచేసింది. అవి విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడుగా వ్యవహరింపబడినాయి. మూడు ఖండాలుగా తెగిపడిన ఈశ్వరుని చూచి నారాయణుడు సిగ్గుపడి తల దించుకున్నాడు. మాటి మాటికి ఆయన ముందు సాష్టాంగ పడసాగినాడు. విష్ణువు ఖిన్న వదనాన్ని చూచి పరమశివుడిలా అన్నాడు.

'ఓ మహాభుజా! ఈ చక్రపుటంచులు నా ప్రాకృత, వికృత శరీరాన్నే ఖండించాయి. అంతేగాని నన్నూ నాతత్వాన్ని స్పృశించలేకపోయాయి. నాస్వభావం, తత్వం అభేద్యమైనది అదాహ్యమైనది. కేశవా! ఈ రోజునుంచీ నాయీ మూడు అంశాలు హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరూపాక్షకులుగా వ్యవహరింపబడతాయి. ఇవి తమ ఆరాధకులకు అనంతఫలాలు పుణ్యాలు వర్షిస్తాయి. నీవు ఎట్టి దిగులు, విచారము లేక ఈ చక్రరాజంతో శత్రుసంహారం చేయుము'.

అంతట శ్రీ విష్ణువు సుదర్శన చక్రంతో రాక్షసరాజు, శ్రీదాముని సంహరించి లోకకల్యాణం గావించాడు. కనుక బాబూ నీవు వెళ్లి విరూపాక్ష దేవుని ఆరాధించుము. నీ కోరికలన్నీ ఫలిస్తాయి. తల్లి ధర్మశీల చెప్పిన ప్రకారం ఉపమన్యువు విరూపాక్ష మహాదేవు నారాధించి శివ భక్తులలో అగ్రగణ్యుడైనాడు. సకల సంపచ్ఛక్తులు స్వాయత్తం చేసుకున్నాడు. ఆ ఉపమన్యు కృత శివస్తుతి మహామహిమాన్వితమైన స్తోత్రరాజము.

కాలాతీతమయిన శివతత్వ ప్రదత్తమైన సుదర్శన చక్రము అత్యంత వేగమును, అమోఘశక్తినీ గలిగిన 'మహాకాలు'నకు ప్రతీక కాలకాలుడైన పరమశక్తి ప్రసాదము.

సుదర్శనచక్రప్రాప్తి లాంటి ఎన్నో విచిత్ర ఉపాఖ్యానాలతో కూడికొని శ్రధ్ధాశువులగు పఠితలకు శ్రోతలకు ఐహిక ఆముష్మిక సుఖాలు వర్షించే గ్రంథరాజం, ఈ వామన పురాణాన్ని సేవించి ధన్యులు కాగలరని తెలుగు పాఠకలోకానికి విజ్ఞప్తి.

విధేయుడు

డా. వారణాసి రామమూర్తి 'రేణు'

(ఎం.ఎ., డి.లిట్‌.)

శరత్పూర్ణిమ, సౌమ్యవారము

భావసంవత్సరము

ది. 19.10.94.

'గురుకరుణ'

10.5.22/ఎ, మాసాబ్‌ ట్యాంక్‌

హైదరాబాద్‌ - 500 028.

Sri Vamana Mahapuranam    Chapters