Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

పదునాల్గవయధ్యాయము

ఇక్ష్వాకుకుల వర్ణనము

మార్కండేయ ఉవాచ :

వైవస్వతేనమనునా యేన సానిర్మితాపురీ సతుకృత్వా చిరం రాజ్యమిక్ష్వాకు మభిషిచ్య చ || 1

పుత్రేభారం సమావేశ్యస శరీరో దివంగతః తతస్థః పాలయన్నాస్తే త్రైలోక్యం సచరా చరమ్‌ || 2

తేనమన్వంతరం సర్వం పాలనీయ మిదం జగత్‌ | ఇక్ష్వాకు స్తస్యతనయః పాలయామాన మేదినీమ్‌ || 3

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాదీ జితేంద్రియః సుదర్శ స్సర్వ భూతానాం నయాపనయ కోవిదః || 4

బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ దీనానాధాను కంపనః | దైవమంత్ర ప్రభూత్సాహ శక్తిభిశ్చ సమన్వితః || 5

షాడ్గుణ్యవిస్మయోత్సాహః స్మితపూర్వాభి భాషణః | యుక్తదండోన నిర్దండో నచదండరతి స్తథా || 6

వేద వేదాంగ తత్వజ్ఞో యజ్ఞయాజీ తపోరతిః | అక్షుద్ర లీలో7భిమతః సర్వసత్త్వో న హింసకః || 7

మాన్యోమానయతాం శక్యః సుఖఃపూజ్య ప్రపూజకః కామః క్రోధో మదోమానో లోభోహర్ష స్తథైవచ || 8

నిత్యం శరీర ప్రభవా రిపవస్తేన షడ్జితాః | సర్వత్ర విధినా దృశ్యః సుభగః ప్రియదర్శనః || 9

బహుధాన్యో బహుధనో బహు నాగాశ్వపూరుషః | అయోధ్యానిలయో నిత్యం దేవారిగణ దర్పహా || 10

స తదా పాలయామాస పుత్రవత్‌ సకలాః ప్రజాః | నా7ధర్మః కశ్చిదప్యాసీత్‌ తస్మిన్‌రాజని మానవః || 11

దీనోవా వ్యాధితోపాపి స్వల్పాయుర్వాచ దుఃఖితః | మూర్ఖో వా మంద రూపోవా దుర్భగోవా నిరాకృతిః || 12

ఏకత్రదేహే సకలం గుణౌఘం ద్రష్టా హ మిత్యేవ విశిష్ట బుద్ధిః |

ససర్జతం రాజవరం మహాత్మాప్రజాపతిః సర్వజగత్ప్ర ధానః || 13

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే - ప్రథమఖండే - మార్కండేయ వజ్రసంవాదే ఇక్ష్వాకు కుల వర్ణనం నామ చతుర్దశో7ధ్యాయః

మార్కండేయుడనియె : వైవస్వతమనువా యయోధ్యాపుర నిర్మాణము సేసినవాడు. ఆతడు చిరకాలము పాలించి తన కుమారు నిక్ష్వాకువునకు బట్టాభిషేకము గావించి సశరీర స్వర్గమొందెను. అతడక్కడనుండి చరాచరమైన ముల్లోకము నేలుచున్నాడు. ఎల్ల మన్వంతర మతని యేలుబడిలో నీజగముండును. ఇక్ష్వాకువాతని పుత్రుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాది జితేంద్రియుడు సర్వభూతములకు దర్శనీయుడు నయానయ విచక్షణుడు బ్రహ్మణ్యుడు శరణ్యుడు దీనజనదయాళువు దేవ మంత్ర ప్రభుఉత్సాహశక్తులు గలవాడు (సాధారణముగా ప్రభుమంత్రోత్సాహ శక్తులు మూడే పేర్కొనబడుచుండును. ఇక్కడ దేవశక్తి నాల్గవదిగా వ్యాసులు పేర్కొనుట విశేషము) సంధివిగ్రహాది రాజనీతి ప్రసిద్ధి షాడ్గుణ్యము చక్కగనెరిగినవాడు చిరునవ్వు ముందుగ బలుకరించువాడు యుక్తదండుడు (నేరమునకు శాస్త్రము విధించిన దండనము సేయుచు నేరములేనివానిని శాస్త్రవిధి ననుసరించి విడచుట యుక్తదండనము) నిర్దండుడు గాడు (అందరిని దండించు రాజునకు పైని అతని శాసించునది ధర్మదండమున్నది అనగా రాజు స్వతంత్రముగా దండింపరాదు. ధర్మశాస్త్రమునకు లోబడి యా పని చేయవలయును. భారత భూమిలో వ్యక్తిపరిపాలన సంఘపరిపాలన నిషిద్ధమన్నమాట) దండరతియుంగాడు. రాజస తామస వృత్తులకు లోబడి దండించుట యనునది యొక వినోదముగా భావించువాడుగాడన్నమాట. వేదవేదాంగరహస్యములు దెలిసినవాడు. యజ్ఞయాజి. తపోనిరతుడు. క్షుద్రవిలాసపరుడుగాడు సర్వసత్వుడు. అహింసానిరతుడు మానవంతులగువారికి (అభిమానధనులకు) మాననీయుడు, శక్యుడు, ప్రజల కష్టములం జెప్పు కోనుటకు సులభుడు సుఖుడు. సుఖస్వరూపుడు. పూజ్యులం బూజించువాడు. జీవుల శరీరమందు నిత్యముంబొడముచుండు కామ క్రోధమదమానలోభహర్షములను శత్రువు లారింటి నాతడు జయించెను. ఎటనేని విధి ననుసరించి శాస్త్రమున కనువుగ దృశ్యుడు (దర్శనము సేయదగినవాడు) సుభగుడు (సుందరుడు) ప్రియదర్శనుడు ప్రజలకు జూడముచ్చటైనవాడు. బహుధాన్యుడు బహుధనుడు (రాష్ట్రములో ప్రజల జాతకము ధనధాన్య సమృద్ధిలో ఈతిబాధలు లేనివారగుటలో పరిపాలకుని జాతకముంబట్టి యుండునన్నమాట) చతురంగబల సమగ్రుడు అయోధ్య రాజధానిగ నిత్యము దేవశత్రువుల దుదముట్టించువాడు. ఆ మహానుభావుడు ప్రజల నందరను కన్నబిడ్డలట్లు పరిపాలించెను. ఇతడు రాజైనతరి అధర్మమనునది పేరునకైన లేకుండును. దీనుడు వ్యాధిగ్రస్తుడు అల్పాయువు దుఃఖితుడు మూర్ఖుడు మందరూపుడు (దిగులువడువాడు) దుర్భగుడు (దౌర్భాగ్యవశుడు) నిరాకృతి (నామరూపములు లేని వాడు) నతని రాజ్యమున లేరు. సర్వజగత్ప్రధానుడైన ప్రజాపతి మహాత్ముడు ఒక్క శరీరమందు సర్వగుణసముదాయమును నేను జూచెదగాకయని ముచ్చటపడి యీ యిక్ష్వాకు మహారాజును సృజించెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున ఇక్ష్వాకుకులవర్ణనమను పదునాల్గవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters