Sri vishnudharmothara Mahapuranam-1    Chapters   

నలుబది రెండవ యధ్యాయము - మోహిని అవతారము-అమృత విభాగము

రాహు రువాచ :

బభూవ నారీ కల్యాణీ సదేవో మధుసూదనః | అనిర్దేశ్య వయోరూపా సర్వ లక్షణ పూజితా || 1

సమాంగుళితతా శ్లక్షే రక్తతుంగ నఖౌ శుఖౌ | బిభృతే చరణౌ శుభ్రౌ గూఢ గుల్ఫౌ మనోహరౌ || 2

జంఘే మనోహరే శుభ్రే స్పష్టే లోమ వివర్జితే | గూఢ సంధ్యస్థితే శ్లక్షే జానునీచ తథా శుభే || 3

ఊరూ కరికరాకారౌ కదళీ దళ కోమలౌ | ఘన మా భోగి జఘనం మధ్యం కులిశ సన్నిభమ్‌ || 4

త్రివళీ త్రిపథాధారి నాభీ పుష్కర మండితమ్‌ | గూఢ స్ఫికేసమే పార్శ్వే సమం పృష్ఠం మనోరమమ్‌ || 5

సమౌ సుసంహితౌ పీనౌ కోమలా వగ్ర చూచుకౌ | ఆభోగినౌ మండలినౌ స్తనౌ కనక సన్నిభౌ || 6

మృణాలా సదృశౌ బాహూ కరౌ కోమల కోమలౌ | కంబుతుల్యం శుభం కంఠం చోన్నతా చ కృకాటికా || 7

ముఖం పూర్ణేందు సంకాశం ద్విజాః కుందసమప్రభాః | అధరౌ విద్రుమాకారౌ నా సా స్పష్ట మనోరమా || 8

మధూక పుష్ప సంకాశౌ కపోతా లలితా వుభౌ | భ్రూయుగ్మం కామ చాపాన్త సదృశం సుమనోహరమ్‌ || 9

నాతి ప్రలంబౌ శ్రవణౌ నాత్య చారూచ కుండలౌ | చిబుకం చ మనోహారి లలాటం శశి సుప్రభమ్‌ || 10

కృష్ణమధ్యే సురక్తాన్తే నయనే శ్వేత భూమికే | నీలోత్పల దళాకారే దీర్ఘే చాతి మనోరమే || 11

కోకిలాళి కులాకారం భిన్నాంజనచయ ప్రభమ్‌ | కేశపాశం తథా కించి ద్దథార కుటిలం శుభమ్‌ || 12

చంద్రరశ్మి ప్రకాశేన వస్త్రయుగ్మేన భూషితా || 13

రూపేణాప్రతిమా రాజన్‌ ! సర్వాలంకార భూషితా | యత్ర యత్ర పదన్యాసం కరోతి గజగామినీ || 14

తత్ర తత్రైవ వసుధా స పద్మేవోపలక్ష్యతే | యత్ర యత్రాతి మధురాం దృష్టింక్షిపతి భామినీ || 15

సితాసితోత్పలై స్తత్ర కిరతీవ వసుంధరామ్‌ | యత్ర యత్ర స్థితా భాతి దేశే కనక వర్ణినీ | 16

తత్ర తత్రైవ సౌవర్ణం సా కరోతి నభస్తలమ్‌ | తాం దృష్ట్వా చారు సర్వాంగీం మన్మథా విష్టచేతసః || 17

ప్రహ్లాద రహితా స్సర్వే బభూవు ర్దానవాస్తదా | పాదయోః పృథివీం తస్యా ధృతిం దేవీంచ జంఘయోః || 18

జానుభ్యాం చ తథా క్షాన్తిం కాన్తి మూరుయుగేశుభే | ఆయతిం నియతిం లక్ష్మీం వేలాం తు జఘనే తథా ||19

మధ్యే వాహాం సతీం పృష్ఠే, పార్శ్వమో శ్చ సుధాం ముఖే |

రతిం ప్రీతిం కుచయుగే కంఠే వాణీం తథైవచ || 20

జయాంచ విజయాంచైవ కరయోఃభుజయో స్తథా | శోభాంప్రభాం వక్షసి చ శ్రియం దేవీం మనోరమామ్‌ || 21

అరుంధతీం చ చుబుకే జిహ్వాయాం చ సరస్వతీమ్‌ | జ్యోత్స్నాం కపోలయోర్దేవీం నిద్రాం నేత్రయుగే తథా || 22

కేశపాశే తథా రాత్రిం దిశః శ్రోత్ర యుగే తథా | భద్రకాళీం లలాటేచ నాసాయాం చ తథా శచీమ్‌ || 23

సర్వాంగ సంధిగా నద్యో లోమస్వథ వనస్పతిమ్‌ | పార్శ్వయోః పర్వతా శ్చైవదైత్యేశః సర్వదేవతాః || 24

దృష్టవాన్‌ స్త్రీతనుం తత్ర ప్రహ్లాదోరికులాంతకః |

విశ్వరూవధరాం దృష్ట్వా ప్రహ్లాద స్తాంచయోషితమ్‌ || 25

విష్ణుం మత్వా విశాలాక్షీం జ్ఞాత్వా చైవామృతార్థినీమ్‌ |

కామర్తదైత్యానుమతః ప్రహ్లాదో ధైత్యసత్తమః || 26

ప్రదదా వమృతంతసై#్య ప్రణిపత్య ప్రసాద్యచ | స్త్రీ రూప మాస్థితై ర్దేవై సై#్త్రలోక్యం సచరాచరమ్‌ || 27

స్త్రీ చేష్టమభవత్‌ సర్వం తస్మిన్‌ కాల ఉపస్థితే |

11

రాహువనియె : విష్ణుదేవుండు కల్యాణియగునొక స్త్రీ యయ్యెను. ఆమె వయస్సు రూపము నిట్టిదనరాదయ్యెను. సర్వ శుభలక్షణములచే నామె పూజనీయ యయ్యెను, ఆమె పాదముల వ్రేళ్లొండొంటినొత్తుకొనియుండెను. పాదతలము లవనితలము నత్తుకొని సున్నితములై యెరుపును యెగువునుగల నఖములు, బొద్దుగ చీలమండలుంగల్గి శుభలక్షణములు సుమనోహరములయియుండెను. జంఘలు (పిక్కల) రోమములులేమి నచ్చపు కాంతి నతి స్పష్టములై పుష్టిగొనియుండెను. మోకాళ్ళు నునుపై నిగూఢ సంధ్యస్థికములై యింపునింపెను. ఊరువులు కరికరాకారములు అరటిబోదెలట్లతి మృదులములు. జఘనము(మొల) ఒత్తునుం విరివియు దిటవుంగొనియుండెను. నడుమింద్రధనువట్లు వర్తులము సన్నమునయి యుండెను. త్రివళి (కడుపుమీది మూడు ముడుతలు) అనెడిత్రిపథయందు (గంగానదియందు) నాభి తామరపూవు సొంపుగొని యుండెను. స్ఫిక్కు (శ్రోణి=పిరుదులమీది భాగము) గూఢమయి (ఒత్తుగలిగినదయి) పార్శ్వములు సమములయి పృష్ఠము సమమయి మనోహరమయియుండెను. ఒండొకటి సమమయి యొత్తుకొని (ఎడమీక) బలిసి కోమలములై మొనలుదేరి విశాలములు వర్తులములు బంగారముసొంపున నింపగులుకు కుచయుగమును తామరతూడట్లు మృదువైన బాహువులు మృదులాతిమృదులములయిన కరములు శంఖమువోలు కంఠము ఎత్తైన ముచ్చిలిగుంట (కృకాటిక) పెడతల (తల వెనుకభాగమందలి గుంట) నిండుచుందురునిబోలు నెమ్మోము మొల్లమొగ్గలట్టి పలువరుస పవడమువోలు పెదవులు చక్కనిముక్కు ఇప్పపూవు వంటి చెక్కిళులు మన్మథుని విల్లువలె మనోహరాకారములయిన కనుబొమలు ఇంచుకగ వ్రేలువీనులు మిక్కిలి చక్కని కుండలములు సుందరమగు చిబుకము (గడ్డము) చంద్రునట్లు తళుకొందు నెన్నుదురు నల్లని కనుపాపలు మిగుల నెర్రని కనుగొనలు తెల్లని భూమిక గల్గి నల్లగలువరేకులట్లు చక్కనైవెడదలైన కన్నులు కోకిలలు తుమ్మెదలు విరిసిన కాటుకకు నెనయైన వంకకొప్పును చంద్రకాంతి కెనయగు నచ్చపు తెలికట్టుచీరలుం దాల్చిసాటిలేని రూపమున సర్వాలంకారములుం గైసేసి యుయ్యింతి గజగమనయై యెటనెట నడుగులానించు నటనట నా వసుంధర యరవిందసుందరమై కానిపించెను. ఆ భామిని యెందతి మధురమగు చూపువిసరు నందందాంభూమిని తెలుపునలుపుగలువ పూలం జిమ్మినట్లుండెను. ఎందెందా కనకాంగి నిలుచు నందందా గగనతలము కనకమయ మొనరించెను. ఆ సర్వాంగసుందరిని జగన్మోహినింగని ప్రహ్లాదుడొక్కడుగాక మరియెల్లరు దానవులు మదనవశులైరి. ఆమె పాదము లందు పృథివిని పిక్కలందు ధృతి దేవతను (ధైర్యాధిష్ఠానదేవతను) మోకాళ్ళయందు క్షాంతిని (ఓరిమిని) తొడలయందు కాంతిని జఘనమందు ఆయతిని=ప్రభావమునులక్ష్మిని వేలను చెలియలికట్ట), నెన్నడుమునందు వాహాదేవిని, పిరుదునం బార్శ్వములందును సతీదేవిని, ముఖమున అమృతమును కుచయుగమున రతిని ప్రీతిని, కంఠమందు వాణిని, చేతులందు జయను, విజయను, భుజము లందును శోభను, ప్రభను ఱొమ్మునందు పరమసుందరిని శ్రీదేవిని అరుంధతిని చిబుకము (గడ్డమందు) నాలుకపై సరస్వతిని చెక్కిళ్ళయందు వెన్నెలను కనుగవయందు నిద్రాదేవిని, కొప్పునందు రాత్రిని, వీనులందు దిశలను వెన్నుదుట భద్రాకాళిని నాసిక యందు శచీదేవిని సర్వాంగసంధులందు నదులను లోమములందు వనస్పతిని, పార్శ్వములందు బర్వతములను, దైత్యరాజు సర్వ దేవతలుం దర్శించెను. అరి మర్దనుడైన ప్రహ్లాదు డయ్యెడ స్త్రీమూర్తిని జూచెను. చూడగనే విశ్వరూపము ధరించివచ్చిన యా దేవిని విష్ణువు నెరింగి యామే యమృతముం గోరుచున్నట్లెరింగి కామార్తులై దైత్యులనుమతింప దైత్యోత్తముడు ప్రహ్లాదు ఆమె కెఱిగి ప్రసన్నురాలిం గావించికొని యమృత కుంభము నా సుందరిచేతి కందించెను. అత్తరి నెల్లవేల్పులు నాడు రూపుగలవారైరి. దాన చరాచర భువనత్రయమెల్ల స్త్రీ చేష్టమయ్యెను.

ఉవాచ సాస్త్రీ ప్రహ్లాదం దైత్యత్వ మమృతం వినా || 28

బ్రాహ్మ మేక మహఃసౌమ్య ! జీవితా న్న విమోక్ష్యసే | యోద్ధుమభ్యుదితా దైత్య ! దేవై ర్దితి జ కారణాత్‌ || 29

న ప్రబోధ్యా స్తమోయుక్తాః త్వయా దైత్య ! జనార్దనాః |

భక్తోసిమే సదావత్స ! సదైవ విజితేంద్రియః || 30

తేన తే దర్శితా సౌమ్య ! ప్రకృతిర్యా పరా మమ | ఇత్యేవముక్త్వా ప్రహ్లాదం సోమ మాదాయ సత్వరా || 31

కామార్తాన్‌ దితిజాన్‌ త్యక్త్వా జగామ సురమందిరమ్‌ |

స్త్రీరూపం తత్ర సంత్యజ్య దేవరూప ముపాశ్రితః || 32

పాయయామాస తత్సర్వం సురాన్‌ సర్వాన్‌ సమాహితాన్‌ |

మయాపి మధ్యే దేవానాం పీతం తత్‌ సూర్యరూపిణా || 33

ఆదిత్యరూపే దైత్యోయం జ్ఞాతోహం శశిభాస్కరైః | నివేదిత శ్చ దేవాయ తేనాపిలఘు కారిణా || 34

చక్రేణ పాతితం వత్స ! సభుజం మస్తకంమమ | అమృత ప్రాశనాత్‌; ప్రాణౖర్నవిముక్తోస్మి దానవ ! 35

నమే కంఠా దధోభాగ మాగతం మమ చక్రిణా | శిరఃఛిన్నం మహరాజ ! తత్ర ప్రాణస్తతః స్థితాః || 36

శిరసఃఛేదనా ద్దీనం మాం దృష్ట్వా మధుసూదనః | జాతానుకంపో భగవానిదం వచన మబ్రవీత్‌ || 37

అప్పుడా యొప్పులకుప్ప ప్రహ్లాదునితో సౌమ్యుడా ! నీవమృతములేకయే బ్రహ్మయొక్క యొక్కపగదు (బ్రహ్మకల్పము) జీవితము బాయకుందువు. దేవతలకొరకేను దైత్యులతో బోరుట కావిర్బవించితిని. జనఘాతుకులు తామసులునగు నీ రాక్షసుల మేల్కొలుపవలదు. వత్స ! నీవు నాభక్తుడవు. జితేంద్రియుడవు. అందుచే నా పరా ప్రకృతి (నైజరూపము) నీకు జూపితిని. అని పలికి జగన్మోహిని తొందరగ నా సోమమును (అమృతము) జేకొని కామార్తులయిన దైత్యులను విడిచి సురమందిరమునకేగెను. అందాడురూపు విడిచి దేవరూపముంగొని యట సమాహితులైన (పంక్తిదీరి కూర్చున్న) దేవతలను అమృతముంద్రావించెను. నేనును (రాహువన్నమాట) సూర్యునిరూపముంగొని అమరుల నడుమ నయ్యమృతముం ద్రావితిని. సూర్యచంద్రులాదిత్యరూపమున నున్న దైత్యుడని నన్ను గ్రహించిరి. విష్ణుదేవుని కెరింగించిరికూడ. లఘుకారి (అవలీలగ నేపనినైన చేయగలవాడు) అగు హరి చక్రముచే నా భుజములతోగూడ తల నరికెను. అమృతప్రాశనము చేసితిని గావున ప్రాణములు వాయనైతిని. నాకంఠము క్రిందిభాగము నాతో రాలేదు. చక్రాయుధుడు నా తలను నరికెను. ప్రాణము లందు నిలిచెను. తల తెగి దీనుడనై (బిక్కమొగమువెట్టిన) నన్ను గని భగవంతుడు హరి కనికరించి యిట్లనియె :

పీతామృతస్య దైత్యస్య మరణం నాస్తి కర్హిచిత్‌ | మమ హస్తవినష్టానాంగతి ర్భవతి శోభనా || 38

అమరత్వం త్వ మాసాద్య వరం వరయ కాంక్షితమ్‌ | తతో మయోక్తో భగవాన్‌ ప్రణమ్య మధుసూదనః || 39

లభేయాతాం హి సోమార్కౌ మత్తో దేవ ! పరాభవమ్‌ |

పూజాంచ ప్రార్థయే లోకాత్‌ గ్రహత్వంచ జనార్దన | 40

ఏవముక్తస్స భగవాన్‌ మామువాచ తదాహరిః | గ్రహస్త్వం భవితా దైత్య ! పూజాం చైవోపలప్స్యసే || 41

పర్వకాలే చ సంప్రాప్తే చంద్రార్కౌ ఛాదయిప్యసి || 42

తమో మూర్తిరదృశ్యశ్చ విపరీతం చరిష్యసి | భూమిచ్ఛాయా గతశ్చంద్రం, చంద్ర గోర్కంచ దానవః || 43

యస్యోదయిష్యసి యదా తదా భాగ మవాప్స్యసి | స్నానే జాప్యే తథా హోమే దానే శ్రాద్ధే సురార్చనే || 41

పుణ్య స్సకాలో భవితా నిత్యమేవాసురేశ్వర | ఏవముక్తా స భగవాన్‌ తత్రైవాన్త రధీయత || 45

పీత శేష మథా೭೭దాయ సోమం సురగణశ్వర! | సురలోకే సన్నిహితం చకార బలవృత్రహా || 46

మచ్ఛీర్ష పాతాభి వివృద్ధకోపా హృతామృతా దైత్యగణా స్సమస్తాః |

వ్యర్థభ్రమా దేవగణా న్నిహంతుం సన్నద్ధ సైన్యాః ప్రయయుస్తదానీమ్‌ || 47

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే-ప్రథమఖండే మార్కండేయ వజ్ర సంవాదే అమృత విభాగో నామ ద్విచత్వారిం శత్తమోధ్యాయః.

అమృతముం ద్రావిన దైత్యుని కెన్నడును మరణమురాదు. నాచేత హతులైనవారికి నుత్తమగతి కల్గును. నీవమరత్వ మంది వలచిన వరమడుగుము. అన హరి పలుకు విని నేను భగవంతుని కెరగి దేవా ! నావలన సూర్యచంద్రులు పరాభవమందు దురుగాక ! లోకమందు గ్రహములలో నేనొకడనై పూజింపబడుదుంగాక ! అన విష్ణుభగవానుడు నాతో నయ్యెడ ఓ దైత్యుడ ! నీవు గ్రహ మగుదువు. పూజయునందెదవు గాక ! పర్వ కాలము వచ్ఛినతరి నీవు సూర్య చంద్రుల గప్పి వేయుదువు. తమోమూర్తివై (చీకటిపై) ఏరికిం గానరాక విపరీతగతిం జరించుచుందువు. భూమి నీడయం దీవుండినీవు చంద్రుని, చంద్రునియందుండి సూర్యుని గప్పుచుందువు. ఎవనికెప్పుడుదయింతు వప్పుడు ఆ భాగము నీవు పొందుదువు స్నానమందు జపమందు హోమమందు దానమందు శ్రాద్ధమందు దేవతార్చనమందు ఆ గ్రహణ సమయము పుణ్యకాలము కాలగదు. అనిపలికి భగవంతుడు హరి యటనే యంతర్ధానమయ్యెను. అందరు ద్రావగామిగిలిన సోమము (అమృతముం) జేకొనిసురపతి సురలోకమందు దానిం భద్రపరచెను. నా తల తరిగి పడగొట్టుట వలనను అమృతము గోల్పోవుటవలనను చెరిగినకోపముచే నెల్లదైత్యుల గుంపులును పడిన శ్రమయెల్ల వమ్మువోగా దేవగణముం జంప బలమ్ములం గూర్చికొనపి యప్పుడు దండెత్తిరి.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అమృతవిభాగమను నలుబదిరెండవ యధ్యాయము.

Sri vishnudharmothara Mahapuranam-1    Chapters