Sri Koorma Mahapuranam
Chapters
శ్రీ కూర్మమహాపురాణమ్ ప్రథమో೭ధ్యాయః అధ ఇంద్రద్యుమ్నస్య మోక్షప్రాప్తివర్ణనమ్ నమస్కృత్యా ప్రమేయాయ విష్ణవే కూర్మరూపిణ | పురాణం సంప్రవక్ష్యామి యదుక్తం విశ్వయోనినా ||
|| 1 || సత్రాన్తే సూత మనఘం నైమిషేయా మహర్షయః | పురాణసంహితాం పుణ్యాం పప్రచ్ఛూ రోమహర్షణమ్ ||
|| 2 || త్వయా సూత మహాబుద్ధే భగవాన్ బ్రహ్మవిత్తమః | ఇతిహాసపురాణార్థం వ్యాసః సమ్యగుపాసితః || || 3 || తస్య తే సర్వరోమాణి వచసా హృషితాని యత్ | ద్వైపాయనస్య తు భవాం స్తతోవై రోమహర్షణః || || 4 || భవన్త మేవ భగవాన్ వ్యాజహార స్వయం ప్రభుః | మునీనాం సంహితాం వక్తుం వ్యాసః పౌరాణికీం పురా || || 5 || అప్రమేయుడు, కూర్మావతారమును ధరించినట్టి శ్రీవిష్ణువుకు నమస్కరించి, బ్రహ్మచేత చెప్పబడిన పురాణాన్ని చెప్పబోవుచున్నాను (1) దీర్ఘకాల యాగం తరువాత నైమిశారణ్యంలో నివసించే మహామునులు పుణ్యాత్ముడైన రోమహర్షణుడను సూత పౌరాణికుని గూర్చి, పుణ్యదాయకమైన పురాణ సంహితను తెలుపుమని కోరినారు. (2) గొప్పబుద్ధికల సూతుడా! నీచేత బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడైన పూజ్యుడు వ్యాసమహర్షి ఇతి హాస పురాణతత్త్వమును గ్రహించటానికి బాగుగా సేవించబడినాడు కదా! (3) ఆవ్యాసమహర్షి వాక్కులతో నీశరీరంలోని రోమాలన్నీ సంతోష పారవశ్యం వలన పులకించినవి. అందువలననే నీవు రోమహర్షణుడని ప్రఖ్యాతుడవైనావు. (4) పూజ్యుడైన వ్యాసముని ముందుగా నీకే పురాణ సంహితను ఉపదేశించినాడు. ఆ పురాణాలలోని గాధలను మావంటి మునులకు వినిపించుటకు ఆమహర్షి పూర్వము నీకు అందజేసినాడు కదా! (5) త్వం హి స్వాయంభువే యజ్ఞే సుత్యాహే వితతేసతి | సంభూతః సంహితాం వక్తుం స్వాంశేన పురుషోత్తమః || || 6 || తస్మా ద్భవన్తం పృచ్ఛామః పురాణం కూర్మ ముత్తమమ్ | వక్తుమర్హసి చాస్మాకం పురాణార్థవిశారద || || 7 || నీవు పూర్వము బ్రహ్మదేవుని యజ్ఞములో అవబృథస్నానమునాడు పురాణ సంహితను ప్రవచించటానికి పురుషోత్తముడైన నారాయణుని అంశతో జన్మించితివి. (6) అందువలన మేము నిన్ను ఉత్తమమైన కూర్మపురాణమును వినిపించమని కోరుతున్నాము. పురాణార్థాలను బాగుగా తెలిసినవాడా! నీవు మాకు దానిని వివరించుము. (7) మునీనాం వచనం శ్రుత్వా సూతః పౌరాణికోత్తమః | ప్రణమ్య మనసా ప్రాహ గురుం సత్యవతీసుతమ్ || || 8 || రోమహర్షణ ఉవాచ :- నమస్కృత్య జగద్యోనిం కూర్మరూపధరం హరిమ్ | వక్ష్యే పౌరాణికీం దివ్యాం కథాం పాపప్రణాశినీమ్ || || 9 || యాం శ్రుత్వా పాపకర్మాపి గచ్ఛేత పరమాం గతిమ్ | న నాస్తికే కథాం పుణ్యా మిమాం బ్రూయాత్కదాచన || || 10 || శ్రద్దధానాయ శాన్తాయ ధార్మికాయ ద్విజాతయే | ఇమాం కథామనుబ్రూయా త్సాక్షాన్నారాయణరితామ్ || || 11 || ఆ మునుల మాటను విని పౌరాణికులలో శ్రేష్ఠుడైన రోమహర్షణుడు తనగురువైన వేదవ్యాసునికి మనఃపూర్వకంగా నమస్కరించి ఇట్లు పలికెను. (8) జగత్తుకు కారణభూతుడైన, కూర్మరూపధారి అయిన శ్రీవిష్ణువునకు నమస్కరించి, పాపాలను నశింపజేసే దివ్యమైన పురాణకథను చెప్పుతాను. (9) ఏ కథను విని పాపకర్మలు చేసిన వాడు కూడ ఉత్తమలోకాలకు చేరుకుంటాడో, అటువంటి పుణ్యమైన యీ పురాణకథను నాస్తికుని విషయంలో ఎప్పుడుకూడ చెప్పవద్దు. (10) శ్రద్ధకలవాడు, శాంతస్వభావుడు, ధర్మాత్ముడు అయిన ద్విజాతికి చెందిన వానికే సాక్షాత్తుగా నారాయణునిచేత చెప్పబడిన ఈ కథను వినిపించవలెను. (11) సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ | వంశానుచరితం చైవ పురాణం పఞ్చలక్షణమ్ || || 12 || బ్రాహ్మం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవ మేవచ | శైవం భాగవతం చైవ భవిష్యం నారదీయకమ్ || || 13 || మార్కణ్డయ మథాగ్నేయం బ్రహ్మవైవర్త మేవ చ | లైఙ్గంతథా చ వారాహం స్కాన్దం వామన మేవ చ || || 14 || కౌర్మం మాత్స్యం గారుడం చ వాయవీయ మనన్తరమ్ | అష్టాదశం సముద్దిష్టం బ్రహ్మాణ్డమితి సంజ్ఞితమ్ || || 15 || సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశముల చరిత్ర అనే అయిదులక్షణాలు కలది పురాణమనబడుతుంది. (12) బ్రాహ్మము, పాద్మము, విష్ణుపురాణము, శైవము, భాగవతము, భవిష్యము, నారదీయము (13) మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మవైవర్తము, లింగపురాణము, వారాహము, (14) స్కాన్దము, వామనము, కూర్మము, మాత్స్యము, గారుడము, వాయవ్యము, బ్రహ్మాండపురాణము అని పురాణాలు పదునెన్మిది సంఖ్యకలవిగా చెప్పబడ్డాయి (15) అన్యాన్యుపపురాణాని మునిభిః కథితానితు | అష్టాదశపురాణాని శ్రుత్వా సంక్షేపతోద్విజాః || || 16 || ఆద్యం సనత్కుమారోక్తం నారసింహ మతః పరమ్ | తృతీయం స్కాన్ద ముద్దిష్టం కుమారేణ తు భాషితమ్ || || 17 || చతుర్థం శివధర్మాఖ్యం సాక్షా న్నన్దీశభాషితమ్ | దుర్వాససోక్త మాశ్చర్యం నారదీయ మతః పరమ్ || || 18 || కాపిలం వామనం చైవ తథైవోశనసేరితమ్ | బ్రహ్మాణ్డం వారుణంచైవ కాలికాహ్వయ మేవ చ || || 19 || మాహేశ్వరం తథాసామ్బం సౌర సర్వార్థసఞ్చయమ్ | పరాశరోక్తం మారీచం తథైవ భార్గవాహ్వయమ్ || || 20 || ఇదన్తు పఞ్చదశకం పురాణం కౌర్మ ముత్తమమ్ | చతుర్థాసంస్థితం పుణ్యం సంహితానాం ప్రభేదతః || || 21 || అష్టాదశ మహాపురాణాలు కాకుండా, మునులచేత ఆపురాణాలను విని సంగ్రహంగా చెప్పబడిన ఉపపురాణాలు మరికొన్ని ఉన్నవి. (16) అవి క్రమంగా సనత్కుమారీయము, నారసింహము, స్కాన్దము (కుమారస్వామిచే చెప్పబడినది), (17) శివధర్మము, (నన్దీశ్వరుడు చెప్పినది), దుర్వాసముని చెప్పిన నారదీయము, (18) కాపిలము, వామనము, శుక్రాచార్యునిచే చెప్పబడిన బ్రహ్మాణ్డపురాణము, వారుణము, కాలకము (19) మాహేశ్వరము, సామ్బము, సకలవిషయ సముచ్చయరూపమైన సౌరము, పరాశరముని చెప్పిన మారీచము, భార్గవపురాణము, (20) ఈ కూర్మపురాణము ఉత్తమము, పదునైదవది, పుణ్యకరమైనది. ఇది సంహితాభేదాలను బట్టి నాలుగు భాగాలుగా ఉన్నది. (21) బ్రాహ్మీ భాగవతీ సౌరీ వైష్ణవీచ ప్రకీర్తితాః | చతస్రః సంహితాః పుణ్యాఃధర్మకామార్థ మోక్షదాః || || 22 || ఇయంతు సంహితా బ్రాహ్మీ చతుర్వేదైస్తు సమ్మితా | భవన్తి షట్ సహస్రాణి శ్లోకానా మత్ర సంఖ్యయా || || 23 || యత్ర ధర్మార్థకామానాం మోక్షస్యచ మునీశ్వరాః | మాహాత్మ్య మఖిలం బ్రహ్మ జ్ఞాయతే పరమేశ్వరః || || 24 || బ్రాహ్మి, భాగవతి, సౌరి, వైష్ణవి అని కూర్మపురాణంలో నాల్గుసంహితలపేర్లు - అవి పుణ్యములైనవి, ధర్మార్థకామమోక్షాలను ప్రసాదించేవి (22) ఈ సంహిత నాలుగు వేదాలననుసరించినది. ఆరువేల శ్లోకాల సంఖ్యతో కూడిఉన్నది. (23) దీనిలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాల గొప్పతనము, బ్రహ్మతత్త్వము, పరమేశ్వర రూపము తెలియబడుతున్నది. సర్గశ్చ ప్రతిసర్గ శ్చవంశో మన్వన్తరాణిచ | వంశానుచరితం దివ్యాపుణ్యాప్రాసంగికీకథా || || 25 || బ్రాహ్మణాద్యై రియంధార్యా ధార్మికై ర్వేద పారగైః | తా మహం వర్ణయిష్యామి వ్యాసేన కథితాం పురా || || 26 || దీనిలో సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశాసుచరితము అనే వానితో కూడిన పుణ్యకరమైనది, దివ్యమైనది అయిన ప్రాసంగిక కథ కలదు (25) ఈ సంహిత వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణాదులచేత ధరించదగినది. పూర్వము వ్యాసభగవానుని చేత చెప్పబడిన ఆ కథను మీకు చెప్పగలను. (26) పురామృతార్థం దైతేయదానవైః సహ దేవతాః | మన్థానం మన్దరం కృత్వా మమన్థుః క్షీరసాగరమ్ || || 27 || మథ్యమానే తదా తస్మి న్కూర్మరూపీ జనార్దనః | బభార మన్దరం దేవో దేవానాం హితకామ్యయా || || 28 || దేవాశ్చతుష్టువు ర్దేవం నారదాద్యా మహర్షయః | కూర్మరూపధరం దృష్ట్వా సాక్షిణం విష్ణుమవ్యయమ్ || || 29 || తదన్తరే೭భవ ద్దేవీ శ్రీ ర్నారాయణవల్లభా | జగ్రాహ భగవా న్విష్ణు స్తామేవ పురుషోత్తమః || || 30 || పూర్వము అమృత సంపాదన కొరకు దితి కుమారులు, దనుపుత్రులతో కూడ కలిసి దేవతలు, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీరసముద్రాన్ని చిలికిరి (27) సముద్ర మథనం జరుగుతుండగా విష్ణుమూర్తి, దేవతల మేలునుకోరి తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని ధరించినాడు. (28) దేవతలు, నారదుడు మొదలగు ఋషులు, కూర్మరూపాన్ని ధరించిన లోకసాక్షి, నాశరహితుడు అయిన శ్రీమహావిష్ణువును ప్రస్తుతించినారు (29) ఆ సాగరమథన సమయంలో సముద్రమునుండి నారాయణునికి వల్లభ అయిన లక్ష్మీదేవి ప్రాదుర్భవించినది. ఆమెను పురుషోత్తముడైన విష్ణువు స్వీకరించినాడు. (30) తేజసా విష్ణు మవ్యక్తం నారదాద్యా మహర్షయః | మోహితాః సహశ##క్రేణ శ్రేయోవచన మబ్రువన్ || || 31 || భగవన్ దేవదేవేశ! నారాయణ జగన్మయ | కైషా దేవీ విశాలాక్షీ యథావ ద్బ్రూహి పృచ్ఛతామ్ || || 32 || శ్రుత్వా తేషాం తదా వాక్యం విష్ణు ర్దానవమర్దనః | ప్రోవాచ దేవీం సంప్రేక్ష్య నారదాదీనకల్మషాన్ || || 33 || ఇయం సా పరమాశక్తి ర్మన్మయీ బ్రహ్మరూపిణీ | మాయా మమ ప్రియా నన్తా యయేదం ధార్యతే జగత్ || || 34 || అనయైవ జగత్సర్వం సదేవాసురమానుషమ్ | మోహయామి ద్విజశ్రేష్ఠా గ్రసామి విసృజామిచ || || 35 || తేజస్సుతోకూడి, స్పష్టముగా తెలియరాని విష్ణువును చూచి నారదాది మహర్షులు, ఇంద్రుడు మొదలగువారు కూడ మోహము చెందిన వారై మంచి మాటలు కొన్ని పలికిరి. (31) దేవతల కధినాయకుడా! భగవంతుడవైన నారాయణా! సర్వలోక స్వరూపా! విశాలమైన కన్నులుకల ఈమె ఎవరు? తెలుసుకొనగోరుతున్న మాకు యథార్థముగా తెలుపుము. (32) వారి మాటను విని, రాక్షస సంహారకుడైన మహావిష్ణువు, ఒకమారు లక్ష్మీదేవివైపుచూచి పాపరహితులైన నారదాదులనుగూర్చి ఈ విధముగా చెప్పినాడు (33) ఈమె గొప్పశక్తి స్వరూపిణి, నాతో అభిన్నమయినది, పరబ్రహ్మస్వరూపిణి. మాయారూపమైనది, అంతములేనిది, నాకత్యంత ప్రీతిపాత్రురాలు. ఈ లోకము ఈమె చేతనేధరించబడుతున్నది. (34) బ్రాహ్మణోత్తములారా! ఈమె సహాయముతోనే దేవ, దానవ, మానవులతో కూడిన సమస్త ప్రపంచమును మోహింపజేస్తున్నాను. నాలో లీనం చేసుకొని మరల సృజిస్తున్నాను (35) ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానా మాగతిం గతిమ్ | విద్యయా వీక్ష్యచాత్మానం తరన్తి విపులా మిమామ్ || || 36 || అస్యా స్త్వంశా నథిష్ఠాయ శక్తిమన్తో೭భవన్ సురాః | బ్రహ్మేశానాదయ స్సర్వే సర్వశక్తిరియం మమ || || 37 || సైషా సర్వజగత్సూతిః ప్రకృతి స్త్రిగుణాత్మికా | ప్రాగేవ మత్తః సంజాతా శ్రీః కల్పే పద్మవాసినీ || || 38 || చతుర్భుజా శంఖచక్రపద్మహస్తా స్రగన్వితా | కోటిసూర్యప్రతీకాశా మోహినీ సర్వదేహినామ్ || || 39 || నాలం దేవా న పితరో మానవా వాసవో೭పిచ | మాయా మేతాం సముత్తర్తుం యేచాన్యే భువి దేహినః || || 40 || లోకాలయొక్క సృష్టిని, వినాశాన్ని, ప్రాణుల జననమరణాలను ఆత్మస్వరూపాన్ని కూడ జ్ఞానముతో తెలుసుకొని పెద్దదైన యీమాయను దాటగలరు. (36) ఈమె యొక్క అంశాలను స్వీకరించుటచేతనే బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలందరు శక్తిమంతులైనారు. ఈమె నాయొక్క సకలశక్తి స్వరూపిణి (37) ఈ లక్ష్మి సమస్తలోకాలకు కారణభూతురాలు, సత్త్వరజస్తమోరూప గుణత్రయస్వరూపిణి, ప్రకృతిరూప, కమలనివాసిని ఐన ఈమె నాకంటె ముందు కల్పంలోనే ప్రభవించినది. (38) ఈమె నాల్గుభుజాలు కలది, శంఖము, చక్రము, పద్మములను చేతులలో ధరించేది, పుష్పహారముతో కూడినది, కోటిసూర్యుల తేజస్సుతో సమానకాంతి కలది. ప్రపంచంలోని ప్రాణులందరిని మోహింపజేసే శక్తికలది. (39) ఈమె మాయనతి క్రమించటానికి దేవతలు కాని, పితరులు కాని, మనుష్యులు కాని చివరకు ఇంద్రుడుకాని సమర్థులు కారు. భూలోకములోని శరీరధారులు మరెవ్వరు కాని లక్ష్మిమాయను దాటిపోలేరు. (40) ఇత్యుక్తా వాసుదేవేన మునయో విష్ణుమబ్రువన్ | బ్రూహి త్వం పుండరీకాక్ష యద్ధి కాలక్షయే೭పిచ || || 41 || అథోవాచ హృషీకేశో మునీ న్మునిగణార్చితః | అస్తి ద్విజాతిప్రవర ఇన్ద్రద్యుమ్న ఇతి శ్రుతః || || 42 || పూర్వజన్మని రాజాసా వధృష్యః శంకరాదిభిః | దృష్ట్వా మాం కూర్మసంస్థానం శ్రుత్వా పౌరాణికీం స్వయమ్ || || 43 || సంహితాం మన్ముఖా ద్దివ్యాం పురస్కృత్య మునీశ్వరాన్ | బ్రహ్మాణం చ మహాదేవం దేవాంశ్చాన్యాన్ స్వశక్తిభిః || || 44 || మచ్ఛక్తౌ సంస్థితాన్ బుద్ధ్వా మామేవ శరణం గతః | సంభాషితో మయాచార్థం విప్రయోనిం గమిష్యసి || || 45 || ఈరీతిగా విష్ణువుచేత చెప్పబడిన మునులు ఆయనతో ఇట్లన్నారు. ''పద్మముల వంటి కన్నులుగల నారాయణా! మాకు కాలాంతరములో జరిగిన సంఘటనలను గూర్చి తెలుపుము'' అని. (41) అప్పుడు మునిబృందముచే సేవింపబడే శ్రీవిష్ణువు ఆ మునులతో ఇట్లు చెప్పినాడు. ఇంద్రద్యుమ్నుడని ప్రసిద్ధుడైన బ్రాహ్మణశ్రేష్ఠుడు ఒకడుండెను. (42) గతజన్మలో అతడురాజుగా ఉండి శంకరాదులకు గూడ నిగ్రహించరానివాడై, కూర్మరూపంలో ఉన్న నన్నుచూచి, నావలన పురాణాలకు సంబంధించిన గాథను, (43) దివ్యమైన సంహితను మునిశ్రేష్ఠులతో కూడి విని, సృష్టికర్త బ్రహ్మను, రుద్రుణ్ణి, ఇతరదేవతలనుగూడ తమతమ అధికారాలతో కూడ; (44) నాయొక్కశక్తికి అధీనులై ఉండటాన్ని గుర్తించి, నన్నే శరణము పొందినాడు - అప్పుడే నేనతనితో మాట్లాడి, విప్రకులములో జన్మించగలవని చెప్పితిని. (45) ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతో జాతిం స్మరసి పౌర్వికీమ్ | సర్వేషా మేవ భూతానాం దేవానా మప్యగోచరమ్ || 46 || వక్తవ్యం యద్గుహ్యతమం దాస్యే జ్ఞానం తవానఘ | లబ్ధ్వా తన్మామకం జ్ఞానం మామేవా న్తే ప్రవేక్ష్యసి || || 47 || అంశాంతరేణ భూమ్యాం త్వం తత్ర తిష్ఠ సునిర్వృతః | వైవస్వతే೭న్తరే೭ తీతే కార్యార్థం మాం ప్రవేక్ష్యసి || || 48 || మాం ప్రణమ్య పురీం గత్వా పాలయామాస మేదినీమ్ | కాలధర్మం గతః కాలాచ్ఛ్వేతద్వీపే మయాసహ || || 49 || భుక్త్వా తాన్వైష్ణవా న్భోగాన్ యోగినా మప్యగోచరాన్ | మదాజ్ఞయా మునిశ్రేష్ఠాః జజ్ఞే విప్రకులే పునః || || 50 || ఇంద్రద్యుమ్నుడనే పేరుతో ప్రసిద్ధుడవై, పూర్వజన్మ స్మృతి కలిగి ఉంటావు. సమస్త ప్రాణులకు; దేవతలకు గూడ తెలియరానటువంటిది; (46) చెప్పదగినది, మిక్కిలిరహస్యమైనది అగు జ్ఞానాన్ని నీకు అందిస్తాను. ఓ పుణ్యపురుషా! నా వలన ఆజ్ఞానాన్ని పొంది చివరకు నాలో అంతర్లీనమవుతావు. (47) భూమిమీద ఇతరాంశతో నీవు నిశ్చింతగా చాలకాల మక్కడనివసించుము. వైవస్వత మన్వంతరము గడువగానే నీవు తిరిగి ప్రయోజనార్థము నన్ను చేరుకోగలవు (48) ఇట్లు చెప్పగా, నాకు నమస్కరించి భూమికి వెళ్లి రాజ్యాన్ని పాలించినాడు. కొంతకాలానికి శరీరాన్ని విడిచి శ్వేతద్వీపంలో ఉన్ననావద్దకు వచ్చి, (49) నాతో సహనివసించి, యోగులకు గూడ పొందరానివి, విష్ణులోక సంబంధులైన భోగాలననుభవించి, ఓ మునులారా! నా ఆజ్ఞతో మళ్లీ బ్రాహ్మణ కులంలో జన్మించినాడు (50) జ్ఞాత్వా మాం వాసుదేవాఖ్యం యత్ర ద్వే నిహితే೭క్షరే | విద్యావిద్యే గూఢరూపం యద్ర్బహ్మ పరమం విదుః || || 51 || సో೭ర్చయామాస భూతానా మాశ్రమం పరమేశ్వరమ్ | వ్రతోపవాసనియమై ర్హోమబ్రాహ్మణతర్పణౖః || || 52 || తసై#్యవం వర్తమానస్య కదాచి త్పరమా కలా | స్వరూపం దర్శయామాస దివ్యం విష్ణుసముద్భవమ్ || || 53 || వాసుదేవ నామము కల నన్ను గుర్తించి, ఎచ్చట నాశరహితములైన విద్య, అవిద్య అనునవి గాఢముగా ఉంచబడినవో, దేనిని పరబ్రహ్మ స్వరూపముగా తెలిసికొందురో, ఆ నా తత్త్వమును తెలిసికొని ఆ ఇంద్రద్యుమ్నుడు ప్రాణులకాధారభూతుడైన పరమేశ్వరుణ్ణి వ్రతాలు, ఉపవాసాలు, నియమాలతో, హోమాలు, బ్రాహ్మణ సమారాధనలతో పూజించినాడు. (51, 52) ఆ పరమేశ్వరుణి యందు నిష్ఠకలవాడై ఆయనకు నమస్కరిస్తూ ఆశీస్సులు పొందుతూ, అతనియందే ఆసక్తుడై, యోగులహృదయాల్లో నివసించే మహాదేవుణ్ణి పూజిస్తూ గడిపాడు (53) ఆ విధంగా కాలం గడుపుతున్న అతనికి కొంత కాలానికి శ్రేష్ఠమైన దివ్యకళ తన అపూర్వమైన, విష్ణుసంబంధమైన స్వరూపాన్ని దర్శింప జేసినది. (54) దృష్ట్వా ప్రణమ్య శిరసా విష్ణోర్భగవతః ప్రియామ్ | సంస్తూయ వివిధైః స్తోత్రైః కృతాంజలి రభాషత || || 55 || ఇంద్రద్యుమ్నఉవాచ కా త్వం దేవి విశాలాక్షి! విష్ణుచిహ్నాఙ్కితేశుభే | యాథాతథ్యేన వై భావం తవేదానీం బ్రవీహి మే || 56 || తస్య తద్వాక్య మాకర్ణ్య సుప్రసన్నా సుమంగళా | హసన్తీ సంస్మర న్విష్ణుం ప్రియం బ్రాహ్మణమబ్రవీత్ || 57 || శ్రీరువాచ న మాం పశ్యన్తి మునయో దేవాః శక్రపురోగమాః | నారాయణాత్మికా మేకాం మాయాహం తన్మయీ పరా || || 58 || న మే నారాయణా ద్భేదో విద్యతే హివిచారతః | తన్మయ్యహం పరంబ్రహ్మ సవిష్ణుః పరమేశ్వరః || || 59 || యే೭ర్చయన్తీహ భూతానా మాశ్రయం పురుషోత్తమమ్ | జ్ఞానేన కర్మయోగేన న తేషాం ప్రభవామ్యహమ్ || || 60 || భగవంతుడైన విష్ణువుకు ప్రియమైన ఆకళారూపాన్ని దర్శించి, శిరస్సుతో నమస్కరించి, అనేక స్తోత్రవాక్యాలతో కొనయాడి చేతులు జోడించి అతడిట్లు పలికెను. (55) ''విశాలమైన కన్నులు కల ఓదేవీ! నీవు ఎవరవు! నీవు విష్ణు సంబంధి చిహ్నాలతో కూడిఉన్నావు. నీ యథార్థ స్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా నాకు తెలుపుము''. (56) ఇంద్రద్యుమ్నుని ఆమాటను విని ప్రసన్నురాలై, మంగళస్వరూపిణి అయిన ఆకళామూర్తి చిరునవ్వుతో, విష్ణువును స్మరిస్తూ ఆబ్రాహ్మణునితో ప్రియముగా ఇట్లనెను. (57) ''మునులుకాని, ఇంద్రుడు మొదలగు దేవతలు కాని, నారాయణ స్వరూపిణినైన నన్ను చూడజాలరు. నేను ఆనారయణుని విశిష్టమైన మాయారూపమైన దానను. (58) విచారించినట్లైతే నాకు, నారాయణునికి భేదము లేదు. నేను ఆయన స్వరూపాంతర్భూతురాలనే. ఆవిష్ణువు పరబ్రహ్మతత్త్వము, పరమేశ్వరుడు కూడ (59) సమస్త ప్రాణులకాధారభూతుడైన, పురుషులలో శ్రేష్ఠుడైన ఆనారాయణుని జ్ఞానమార్గముతోకాని, కర్మయోగముతోకాని ఎవరు పూజింతురో వారిని నేను ఏమి చేయుటకుశక్తురాలను కాను (60) తస్మా డనాదినిధనం కర్మయోగపరాయణః | జ్ఞానే నారాధయా నన్తం తతో మోక్ష మవాప్స్యసి || || 61 || ఇత్యుక్తః స మునిశ్రేష్ఠ ఇన్ద్రద్యుమ్నో మహామతిః | ప్రణమ్య శిరసా దేవీం ప్రాంజలిః పునరబ్రవీత్ || || 62 || కథం స భగవా నీశః శాశ్వతో నిష్కలో೭ చ్యుతః | జ్ఞాతుం హి శక్యతే దేవి! బ్రూహి మే పరమేశ్వరి || || 63 || ఏవ ముక్తాధ విప్రేణ దేవీ కమలవాసినీ | సాక్షా న్నారాయణో జ్ఞానం దాస్యతీ త్యాహ తం మునిమ్ || || 64 || ఉభాభ్యా మథ హస్తాభ్యాం సంస్పృశ్య ప్రణతం మునిమ్ | స్మృత్వా పరాత్పరం విష్ణుం తత్రైవా న్తరధీయత || || 65 || అందువలన ఓ ఇంద్రద్యుమ్నా ! నీవు కర్మయోగమునందు శ్రద్ధకలవాడవై, తరువాత జ్ఞాన మార్గమవలంబించి ఆది మధ్యాంత శూన్యుడైన నారాయణునిపూజించుము. దానివలన నీవు మోక్షాన్ని పొందుతావు'' (61) ఈ విధముగా దేవిచేత చెప్పబడిన గొప్పబుద్ధికల ఇంద్రద్యుమ్నుడు దేవికి శిరస్సువంచి నమస్కరించి, చేతులు జోడించి మళ్లీ ఇట్లన్నాడు. (62) ''ఓ దేవీ! భగవంతుడు, ఈశ్వరుడు, శాశ్వతుడు, కళానాశనములేని వాడు అగు శ్రీమహావిష్ణువు ఎట్లు మాకు తెలుసుకోవటానికి సులభుడౌతాడో నాకు తెలుపుము'' (63) ఆ బ్రాహ్మణునిచేత ఈవిధముగా అడుగబడిన కమలనివాసిని అయిన లక్ష్మీదేవి, ఆతనితో నారాయణుడే స్వయంగా జ్ఞానాన్ని ప్రసాదించునని చెప్పినది (64) తరువాత తనరెండు చేతులతో, నమస్కరించిన ఆ ఇంద్రద్యుమ్నమునిని తాకి పరాత్పరుడైన విష్ణువును తలచుకొని ఆదేవి అక్కడనే అంతర్ధానము చెందినది (65) సోపి నారాయణం ద్రష్టుం పరమేణ సమాధినా | ఆరాధయ ద్ధృషికేశం ప్రణతార్తిప్రభంజనమ్ || || 66 || తతో బహుతిధే కాలే గతే నారాయణః స్వయమ్ | ప్రాదురాసీ న్మహాయోగీ పీతవాసా జగన్మయః || || 67 || దృష్ట్వా దేవం సమాయాన్తం విష్ణుమాత్మాన మవ్యయమ్ | జానుభ్యా మవనిం గత్వా తుష్టావ గరుడధ్వజమ్ || || 68 || ఇంద్రద్యుమ్నఉవాచ :- యజ్ఞేశాచ్యుత గోవింద మాధవా నన్త కేశవ | కృష్ణ విష్ణో హృషీకేశ తుభ్యం విశ్వాత్మనే నమః || || 69 || నమోస్తు೭తే పురాణాయ హరయే విశ్వమూర్తయే | సర్గస్థితివినాశానాం హేతవే೭నన్తశక్తయే || || 70 || ఆ ఇంద్రద్యుమ్నుడు శ్రేష్ఠమైన ధ్యానయోగముతో నారాయణుని సాక్షాత్కారం కొరకు, తనకు విధేయులైన వారి దుఃఖాలను పెనుగాలి వలె తొలగించే శ్రీ మహావిష్ణువును పూజించినాడు. (66) చాలా రోజులు గడచిన తరువాత, పసుపు పచ్చని వస్త్రము ధరించిన, విశ్వరూపుడు, గొప్పయోగీశ్వరుడైన నారాయణుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమైనాడు (67) నాశరహితుడు, ఆత్మ స్వరూపుడు అయిన విష్ణువు తన వద్దకు వచ్చుటను చూచి ఇంద్రద్యుమ్నుడు మోకాళ్లను నేలకానించి ప్రణతుడై గరుడధ్వజుడైన అతణ్ణి ఈ విధముగా ప్రస్తుతించినాడు (68) ''ఓ యజ్ఞపురుషా! నాశనములేనివాడా! గోవులను సంతోషపరచేవాడా! మాధవా, అంతములేనివాడా, కేశవా! కృష్ణా! విష్ణురూపా, ఇంద్రియాలకధీశుడా! జగత్స్వరూపుడవైన నీకు ప్రణామము (69) పురాణపురుషుడవు, లోకస్వరూపుడవు, హరివి, సృష్టిస్థితిప్రలయాలకు కారణభూతుడవు, అపరిమితశక్తికలవాడవు అయిన నీకు నమస్కారము. (70) నిర్గుణాయ నమ స్తుభ్యం నిష్కలాయ నమోనమః | పురుషాయ నమస్తే೭స్తు విశ్వరూపాయ తే నమః || || 71 || నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయో | ఆదిమధ్యాన్తహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః || || 72 || నమస్తే నిర్వికారాయ నిష్ప్రపఞ్చాయ తే నమః | భేదాభేదవిహీనాయ నమో೭స్త్వానన్దరూపిణ || || 73 || నమ స్తారాయ శాన్తాయ నమో೭ప్రతిహతాత్మనే | అనన్తమూర్తయే తుభ్య మమూర్తాయ నమోనమః || || 74 || నమస్తే పరమార్థాయ మాయాతీతాయ తే నమః | నమస్తే పరమేశాయ బ్రహ్మణ పరమాత్మనే || || 75 || గుణరహితుడవైన నీకు నమస్కారము. విభాగ శూన్యుడవై ప్రపంచస్వరూపుడగు పురుషుడైన నీకు అనేకనమస్కారములు. (71) వాసుదేవుడు, అంతటవ్యాపించి ఉన్నవాడు, జగత్తుకుమూలకారణమైనవాడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, జ్ఞానము చేత తెలుసుకొనదగినవాడు అగు నీకు నమోవాకము. (72) ఎటువంటి వికారము లేనివాడవు, ప్రపంచమున కతీతముగా నుండువాడవు, భేదముకాని అభేదముకానిలేని వాడవు, ఆనంద స్వరూపుడవు అయిన నీకు నమస్కారము (73) తరింపజేయువాడు, శాంతరూపుడు, అప్రతిహితమైన ఆత్మశక్తికలవాడు, అంతములేని రూపములుకలవాడు, మూర్తిరహితుడును అగునీకు నమస్కారములు. (74) పరమార్థరూపుడవైన నీకు ప్రణామము. మాయకు అతీతుడవగు నీకు వందనము. పరమేశ్వరుడవు, పరమాత్మవు, బ్రహ్మస్వరూపుడవునగు నీకు నమోవాకము. (75) నమో೭స్తుతే సుసూక్ష్మాయ మహాదేవాయ తే నమః | నమః శివాయ శుద్ధాయ నమస్తే పరమేష్ఠినే || || 76 || త్వయైత త్సృష్టమఖిలం త్వమేవ పరమాగతిః | త్వం పితా సర్వభూతానాం త్వం మాతా పురుషోత్తమ || || 77 || త్వమక్షరం పరం ధామ చిన్మాత్రం వ్యోమ నిష్కలమ్ | సర్వస్యాధార మవ్యక్త మనన్తం తమసఃపరమ్ || || 78 || ప్రపశ్యన్తి పరాత్మానం జ్ఞానదీపేన కేవలమ్ | ప్రపద్యే భవతో రూపం తద్విష్ణోః పరమంపదమ్ || || 79 || ఏవం స్తువన్తం భగవాన్ భూతాత్మా భూతభావనః | ఉభాభ్యా మథ హస్తాభ్యాం పస్పర్శ ప్రహసన్నివ || || 80 || మిక్కిలి సూక్ష్మరూపము కలవాడవు, గొప్పదేవాధిదేవుడవు, మంగళరూపుడవు, పరిశుద్ధుడవు, బ్రహ్మస్వరూపుడవు అయిననీకు నా నమస్కారము. (76) ఈ సమస్తవిశ్వము నీచేత సృజింపబడినది. నీవే అందరికి పరమగమ్యము. సమస్తప్రాణులకు పురుషోత్తముడవైన నీవే తల్లివి తండ్రివి కూడ అయి ఉన్నావు. (77) నీవు నాశరహితమైన, శ్రేష్ఠమైన ప్రాప్యస్థానము. జ్ఞానమాత్రస్వరూపుడవు. భాగరహితమైన ఆకాశరూపుడవు, సమస్తమున కాధారభూతుడవు, స్పష్టముగా తెలియరానివాడవు, అంతములేని వాడవు, అంధకారమునకతీతమైనవాడవు (78) పరమాత్మ రూపుడవైన నిన్ను కేవలము జ్ఞానమనే దీపముచేతనే చూడగలుగుదురు. విష్ణువైన నీ యొక్క రూపమును, శ్రేష్ఠమైన నీస్థానమును సేవించుచున్నాను'' (79) ఈవిధముగా తనను పొగడుచున్న ఇంద్రద్యుమ్నుని, భగవంతుడు, సర్వభూతస్వరూపుడు, భూతములను భావించువాడును అగు విష్ణువు నవ్వుచున్నవానివలె తనరెండు చేతులతో స్పృశించెను. (80) స్పృష్టమాత్రో భగవతా విష్ణునా మునిపుంగవః | యథావ త్పరమం తత్త్వం జ్ఞాతవాం స్తత్ర్పసాదతః || || 81 || తతః ప్రహృష్టమనసా ప్రణిపత్య జనార్దనమ్ | ప్రోవాచో న్నిద్రపద్మాక్షం పీతవాసస మచ్యుతమ్ || || 82 || త్వత్ర్పసాదా దసన్దిగ్ధ ముత్పన్నంపురుషోత్తమ | జ్ఞానం బ్రహ్మైకవిషయం పరమానన్దసిద్ధిదమ్ || || 83 || నమో భగవతే తుభ్యం వాసుదేవాయ వేధసే | కిం కరిష్యామి యోగేశ తన్మే వద జగన్మయ || || 84 || శ్రుత్వా నారాయణో వాక్య మింద్రద్యుమ్నస్య మాధవః | ఉవాచ సస్మితం వాక్య మశేషం జగతోహితమ్ || || 85 || భగవంతుడైన విష్ణువుచేత స్పృశింపబడినంతనే ఆఇంద్రద్యుమ్నముని ఆయన అనుగ్రహంవలన పరమాత్మతత్త్వాన్ని ఉన్నదున్నట్లుగా స్పష్టంగా తెలుసుకోగలిగినాడు. (81) తరువాత సంతోషించిన మనస్సుతో అతడు విష్ణుమూర్తికి నమస్కరించి, వికసించిన కమలములవంటి కన్నులు కలిగిన, పచ్చని వస్త్రముదరించిన నారాయణుని గూర్చి ఇట్లు పలికినాడు. (82) ''ఓ పురుషోత్తమా! నీ అనుగ్రహమువలన నాకు సంశయములు తొలగినవి, పరబ్రహ్మవిషయకమైనది, శ్రేష్ఠమైన ఆనందరూపసిద్ధిని కలిగించునది అగు జ్ఞానము సిద్ధించినది. (83) భగవంతుడవు, వాసుదేవుడవు, బ్రహ్మస్వరూపుడవు అగునీకు నమస్కారము. యోగేశ్వరుడవు, విశ్వమయుడవు అగుఓప్రభూ! నేను ఏమిచేయవలెనో, దానిని నాకు తెలుపుము!! (84) ఇంద్రద్యుమ్నుని యొక్కవాక్యమును విని, లక్ష్మీపతి అయిన నారాయణుడు చిరునవ్వుతో, లోకానికి హితకరమైన సంపూర్ణవాక్యమును ఇట్లు పలికెను. (85) శ్రీ భగవానువాచ :- వర్ణాశ్రమాచారవతాం పుంసాం దేవో మహేశ్వరః | జ్ఞానేన భక్తియోగేన పూజనీయో నచాన్యథా || || 86 || విజ్ఞాయ తత్పరం తత్త్వం విభూతిం కార్యకరాణమ్ | ప్రవృత్తిం చాపి మే జ్ఞాత్వా మోక్షార్థీశ్వర మర్చయేత్ || || 87 || సర్వసంగా న్పరిత్యజ్య జ్ఞాత్వా మాయామయం జగత్ | అద్వైతం భావయాత్మానం ద్రక్ష్యసే పరమేశ్వరమ్ || || 88 || త్రివిధాం భావనాం బ్రహ్మన్ ప్రోచ్యమానాం విభోద మే | ఏకా మద్విషయా తత్ర ద్వితీయా వ్యక్తసంశ్రయా || || 89 || అన్యాచ భావనా బ్రాహ్మీ విజ్ఞేయా సా గుణాతిగా | ఆసా మన్యతమాం చాధ భావనాం భావయే ద్బుధః || || 90 || వర్ణములు, ఆశ్రమాలకు సంబంధించిన ఆచారముకల పురుషులకు భగవంతుడైన మహేశ్వరుడు జ్ఞానయోగ భక్తియోగములతో పూజింప దగినవాడు: ఇతరపద్ధతులలో పూజార్హుడు కాడు. (86) ఆ పరతత్త్వమును తెలసుకొని, సమస్త కార్యసమూహమునకు కారణభూతమైన విభూతిని, నాయొక్క ప్రవృత్తినికూడ గ్రహించి మోక్షమును కోరువాడు ఈశ్వరుని పూజించవలెను. (87) ఈలోకము మాయతోనిండి ఉన్నదని తెలుసుకొని, ప్రపంచ సంబంధమైన అన్ని బంధాలను విడిచిపెట్టి జీవాత్మకు పరమాత్మతో అభేదాన్ని దర్శించి పరమేశ్వర సాక్షాత్కారము పొందగలవు (88) ఓ బ్రాహ్మణుడా! నాచేత చెప్పబడుమూడు విధముల భావనను గూర్చి తెలుసుకొనుము. వానిలో ఒకభావన నాకు సంబంధించినది. రెండవది వ్యక్త రూపములోకన్పించు జగత్తు విషయమైనది. (89) మూడవది బ్రహ్మవిషయకమైనది. అది గుణత్రయమున కతీతమైనదిగా తెలియవలెను. ఈ మూడింటిలో ఒకభావనను పండితుడు ఆశ్రయించి తత్త్వజ్ఞానము పొందవలెను. (90) అశక్తః సంశ్రయే దాద్యా మి త్యేషా వైదికీశ్రుతిః | తస్మాత్సర్వప్రయత్నేన తన్నిష్ఠ స్తత్పరాయణః | || 91 || సమారాధయ విశ్వేశం తతో మోక్ష మవాప్స్యసి | || 92 || ఇంద్రద్యుమ్నఉవాచ :- కిం తత్పరతరం తత్త్వం కా విభూతి ర్జనార్దన || కిం కార్యం కారణం కస్త్వం ప్రవృత్తి శ్చాపి కా తవ | || 93 || శ్రీభగవానువాచ:- పరా త్పరతరం తత్త్వం పరంబ్రహ్మైక మవ్యయమ్ నిత్యానన్దమయం జ్యోతి రక్షరం తమసః పరమ్ | ఐశ్వర్యం తస్య యన్నిత్యం విభూతి రితి గీయతే || || 94 || కార్యం జగ దథావ్యక్తం కారణం శుద్ధమక్షరమ్ | అహం హి సర్వభూతానా మన్తర్యామీశ్వరః పరః || || 95 || సామర్థ్యములేనివాడు మొదటిదైన భావన నాశ్రయించదగునని వేదములో చెప్పబడినది. అందువలన సంపూర్ణప్రయత్నముతో ఆమొదటిదైన మద్విషయకభావనయందు నిష్ఠకలిగి, దానియందే నిమగ్నుడవై, (91) విశ్వేశ్వరుడైన భగవంతుని బాగుగా పూజించుము. దానివలన నీవు మోక్షమును పొందగలవు'' ఇంద్రద్యుమ్నుడుపలికెను :- ఓ జనార్దనా! ఆపరతరమైన తత్త్వముఏది? ఆవిభూతియేది? (92) దానికి కారణమేది? నీవు ఎవరు? నీ ప్రవృత్తి ఎటువంటిది? భగవంతుడు చెప్పినాడు :- పరముకంటే మిక్కిలి శ్రేష్ఠమైన తత్త్వమది. ఏకము, నాశరహితమైన పరబ్రహ్మమది. (93) శాశ్వతానందమయమైన తేజస్సు, నాశరహితము, అంధకారానికి దూరమైనది ఆతత్త్వము. దానియొక్క నిత్యమైన ఐశ్వర్యమే విభూతి అని చెప్పబడును. (94) సర్గస్థిత్యన్తకర్తృత్వం ప్రవృత్తి ర్మమ గీయతే | ఏత ద్విజ్ఞాయ భావేన యథావ దఖిలం ద్విజ || || 96 || తత స్త్వం కర్మయోగేన శాశ్వతం సమ్య గర్చయ | || 97 || ఇంద్రద్యుమ్న ఉవాచ :- కే తే వర్ణాశ్రమాచారాః యైః సమారాధ్యతే పరః || జ్ఞానం చ కీదృశం దివ్యం భావనాశ్రయసంస్థితమ్ | కథం సృష్టమిదం పూర్వం కథం సంహ్రియతే పునః || || 98 || కియత్యః సృష్టయో లోకే వంశా మన్వన్తరాణిచ | కాని తేషాం ప్రమాణాని పావనాని వ్రతాని చ | || 99 || తీర్థా న్యర్కాదిసంస్థానం పృథివ్యాయామవిస్తరమ్ | కతి ద్వీపాః సముద్రాశ్చ పర్వతాశ్చ నదీనదాః || || 100 || బ్రూహి మే పుణ్డరీకాక్ష యధావ దధునా పునః | || 101 || సృష్టి, స్థితి, లయాలను నిర్వహించుట నాయొక్క ప్రవృత్తిగా చెప్పబడుచున్నది. ఓవిప్రుడా! ఈ విషయము సమస్తమును క్రమవిధానముతో తెలిసికొని, (96) తరువాత నీవు కర్మయోగముతో శాశ్వతుడైన పురుషుని పూజింపుము. ఇంద్రద్యుమ్నుడు పలికెను :- ఏ ఆచారాలతో పరమ పురుషుడు ఆరాధింపబడునో, ఆవర్ణాశ్రమాచారాలు ఏవి? (97) మూడు విధముల భావనల నాశ్రయించి ఉన్న జ్ఞానమెటువంటిది? ఈ విశ్వము పూర్వము ఎట్లు సృజించబడినది? మరల ఏవిధముగా లయము చేయబడును? (98) లోకములో ఎన్ని సృష్టులు, ఎన్నివంశాలు, మన్వంతరాలు ఉండును? వాటి ప్రమాణములెంత? పవిత్రములైన వ్రతములు. (99) పుణ్యతీర్థాలు, సూర్యుడు మొదలగు జ్యోతిర్మండలాల స్వరూపము, భూమియొక్క వైశాల్యము, ద్వీపముల, సముద్రాలసంఖ్య, పర్వతముల, నదీ నదముల వివరమును (100) ఓ నారాయణా! నాకు యథాతధముగా చెప్పుము. శ్రీకూర్మఉవాచ:- ఏవ ముక్తోథ తేనాహం భక్తానుగ్రహకామ్యయా || యథావ దఖిలం సమ్యగవోచం మునిపుంగవాః | వ్యాఖ్యాయా శేష మేవేదం యత్పృష్టో೭హం ద్విజేన తు || || 102 || అనుగృహ్య చ తం విప్రం తత్రైవా న్తర్హితో೭భవమ్ | సో೭పి తేన విధానేన మదుక్తేన ద్విజోత్తమాః || || 103 || ఆరాధయామాస పరం భావపూతః సమాహితః | త్యక్త్వాపుత్రాదిషు స్నేహం నిర్ద్వన్దో నిష్పరిగ్రహః || || 104 || సన్న్యస్య సర్వకార్మాణి పరం వైరాగ్య మాశ్రితః | ఆత్మనా త్మాన మన్వీక్ష్య స్వాత్మ న్యేవాఖిలం జగత్ || || 105 || సంప్రాప్య భావనా మన్త్యాం బ్రాహ్మీ మక్షర పూర్వికామ్ | అవాప మరమం యోగం యేనైకం పరిపశ్యతి || || 106 || శ్రీకూర్మస్వామి ఇట్లుచెప్పెను :- ఆ ఇంద్రద్యుమ్నునిచేత ఇట్లు అడుగబడిననేను భక్తులననుగ్రహించు కోరికకలవాడనై (101) ''ఓ మునులారా! అతనికి సమస్తవిషయాలను, అతడు ప్రశ్నించిన ప్రకారముగా, విశదముగా, స్పష్టముగా చెప్పినాను. (102) ఆ బ్రాహ్మణునికి ఆవిధముగా అనుగ్రహించినేను అక్కడనే అదృశ్యుడనైతిని. ఓ బ్రాహ్మణ వర్యులారా! ఆ ఇంద్రద్యుమ్నుడు కూడ నాచేత చెప్పబడిన పద్ధతితో (103) పరిశుద్ధ భావముకలవాడై, ఏకాగ్రచిత్తుడై, పుత్రాదుల యందు స్నేహభావాన్ని విడిచి, సుఖదుఃఖాది ద్వంద్వాల కతీతుడుగా, దేనియందు కోరికలేనివాడుగా పరబ్రహ్మరూపుడైన పురుషుని ఆరాధించినాడు. (104) అన్ని పనులను వదిలి, గొప్పవైరాగ్యభావమును పొంది, తనలో పరమాత్మను, సమస్త జగత్తును కూడ సాక్షాత్కరించుకొనుచు. చివరిదైన బ్రాహ్మీభావనను అక్షరపూర్వకమైనదానిని చేరుకొని, దేనితో పరమాత్మను దర్శింపగలడో, ఆగొప్ప యోగమును పొందగలిగెను. (106) యం వినిద్రా జితశ్వాసాః కాంక్షన్తే మోక్షకాంక్షిణః | తతః కదాచి ద్యోగీన్ద్రో బ్రహ్మాణం మవ్యయమ్ |7 || 107 || జగామా దిత్యనిర్దేశా న్మానసోత్తరపర్వతమ్ | ఆకాశేనైవ విప్రేన్ద్రో యోగైశ్వర్యప్రభావతః || || 108 || విమానం సూర్యసంకాశం ప్రాదుర్భూత మనుత్తమమ్ | అన్వగచ్చ న్దేవగణా గన్ధర్వాప్సరసాం గణాః || || 109 || దృష్ట్వాన్యే పథి యోగీన్ద్రం సిద్ధా బ్రహ్మర్షయో యయుః | తతః స గత్వానుగిరిం వివేశ సురవన్దితమ్ || || 110 || స్థానం సద్యోగిభి ర్జుష్టం యత్రాస్తే పరమః పుమాన్ | సంప్రాప్య పరమం స్థానం సూర్యాయుతసమప్రభమ్ || || 111 || వివేశ చాన్తర్భవనం దేవానాఞ్చ దురాసదమ్ | విచిన్తయామాస పరం శరణ్యం సర్వదేహినామ్ || || 112 || శ్వాసను జయించినవారు, నిద్రారహితులు అగు మోక్షకాములు ఏ స్థితిని కోరుదురో ఆ బ్రాహ్మణుడు దానిని పొందెను. తరువాత ఒకప్పుడా యోగీశ్వరుడు నాశరహితుడైన బ్రహ్మను చూచుటకై సూర్యుని సూచన ప్రకారము, యోగశక్తి మహిమవలన ఆకాశ మార్గముతో ప్రయాణించి మానసోత్తర పర్వతమును చేరుకున్నాడు. (108) సూర్యునివలె ప్రకాశించుచున్న, సర్వోత్తమమై ఆకాశంలో సాక్షాత్కరించిన ఆయోగీంద్రుని విమానాన్ని, దేవతాసమూహము, గంధర్వులు, అప్సరసలు వెంబడించిరి. (109) మరికొందరు సిద్ధులు, బ్రహ్మర్షులు కూడ అతని విమానమును చూచి మార్గములో అనుసరించిరి. అప్పుడాతడు దేవతలచేత పూజింపబడు మానసోత్తరపర్వతమునకు వెళ్లి (110) ఉత్తమ యోగులచే సేవింపడుచున్నది, పరమ పురుషుని నివాసస్థానము, పదివేల సూర్యులతో సమానకాంతి కలది అగు పరమపురుష స్థానమునుపొంది (111) దేవతలకు గూడ ప్రవేశించుటకు శక్యముకాని లోపలి భవనమును ప్రవేశించి, సమస్త ప్రాణులకు శరణ్యుడైన పరమాత్మరూపుని ధ్యానించెను. (112) అనాదినిధనం చైవ దేవదేవం పితామహమ్ | తతః ప్రాదు రభూ త్తస్మిన్ ప్రకాశః పరమాద్భుతః || || 113 || తన్మధ్యే పురుషం పూర్వమపశ్య త్పరమం పదమ్ | మహాన్తం తేజసోరాశి మగమ్యం బ్రహ్మవిద్విషామ్ || || 114 || చతుర్ముఖ ముదారాఙ్గ మర్చిర్భి రుపశోభితమ్ | సో೭పి యోగిన మన్వీక్ష్య ప్రణమన్త ముపస్థితమ్ || || 115 || ప్రత్యుద్గమ్య స్వయందేవో విశ్వాత్మా పరిషస్వజే | పరిష్వక్తస్య దేవేన ద్విజేన్ద్రస్యా ధ దేహతః || || 116 || నిర్గత్య మహతీ జ్యోత్స్నా వివేశాదిత్యమణ్డలమ్ | ఋగ్యజుస్సామసంజ్ఞం తత్పవిత్ర మమలం పదమ్ || || 117 || జననమరణాలులేనిట్టి, దేవతలకు దేవుడు, పితామహుడు అగుదేవుని ధ్యానించగా, అప్పుడక్కడ మిక్కిలి ఆశ్చర్యకరమైన ఒకగొప్ప తేజస్సు ఆవిర్భవించెను. (113) ఆకాంతిమధ్యలో ముందుగా ఒకపురుషుని, తేజోరాశిగా ఉన్నవానిని, బ్రహ్మ విరోధులకు పొందరాని, సర్వోత్తమ ప్రాప్యభూతుడైన వానిని చూచెను ఇంద్రద్యుమ్నుడు (114) నాలుగు ముఖములు కలిగి, ఉదాత్తములైన అవయవములతో, వెలుగులతో ప్రకాశించుచున్న దేవునిచూచి నమస్కరించుచు సమీపించు యోగిని ఆ భగవంతుడు చూచి (115) స్వయముగా ఎదుర్కొని అతనిని ఆలింగనము చేసికొనెను. పరమపురుషునిచే ఆలింగితుడైన ఆబ్రాహ్మణ శ్రేష్ఠుని శరీరమునుండి అప్పుడు (116) ఒక పెద్ద వెన్నెలవంటి తేజస్సు బయలుదేరి సూర్యమండలము ప్రవేశించినది. ఆతేజస్సు ఋక్కు, యజుస్సు, సామము అను పేర్లు కలది, పవిత్రమైన నిర్మలమైన స్థానము. (117) హిరణ్యగర్భో భగవాన్ యత్రాస్తే హవ్యకవ్యభుక్ | ద్వారం తద్యోగినా మాద్యం వేదాన్తేషు ప్రతిష్ఠితమ్ || || 118 || బ్రహ్మతేజోమయం శ్రీమ ద్ద్రష్టా చైవ మనీషిణామ్ | దృష్టమాత్రో భగవతా బ్రహ్మణా ర్చిర్మయో మునిః || || 119 || అపశ్య దైశ్వరం తేజః శాన్తం సర్వత్రగం శివమ్ | స్వాత్మాన మక్షరం వ్యోమ యత్ర విష్ణోః పరంపదమ్ || || 120 || ఆనన్ద మచలం బ్రహ్మ స్థానం తత్పరమేశ్వరమ్ | సర్వభూతాత్మభూతస్థః పరమైశ్వర్య మాస్థితః || || 121 || ప్రాప్తవా నాత్మనో ధామ యత్తన్మోక్షాఖ్య మవ్యయమ్ | తస్మా త్సర్వప్రయత్నేన వర్ణాశ్రమవిధౌ స్థితః || || 122 || హవ్యకవ్యములను భుజించువాడు, భగవంతుడు అగు హిరణ్యగర్భుడైన బ్రహ్మ ఎక్కడ నివసించునో, ఆస్థానము వేదాంతముల యందు స్థాపించ బడియున్న యోగీశ్వరుల మొదటి ద్వారము. (118) అది బ్రహ్మతేజముతో నిండినది, సంపద్యుక్తము; బుద్ధిశాలురైన వారిలో ద్రష్టయగువాడు, భగవంతుడగు బ్రహ్మచేత చూడబడినవాడై, తేజోమయుడైన ఆముని, ఈశ్వరసంబంధి, శాంతమైనది, అంతట వ్యాపించినది, మంగళకరమగునది అగు తేజస్సును చూచెను. ఆ తేజస్సు నాశములేనిది, ఆకాశాత్మకమైనది, స్వాత్మరూపమైన విష్ణువుయొక్క శ్రేష్ఠమగు స్థానము. (119, 120) అది ఆనందరూపము, నిశ్చలమైనది, పరమేశ్వర స్థానమైనది కూడ. అన్ని ప్రాణుల ఆత్మల యందుండువాడు, గొప్ప ఐశ్వర్యము నధిష్ఠించినవాడునై, మోక్షమను పేరుగల, నాశరహితమైన ఆత్మస్థానమును చేరెను. అందువలన అన్ని విధముల ప్రయత్నము చేత వర్ణాశ్రమ ధర్మము నందు నిలిచినవాడై; (121, 122) సమాశ్రిత్యాంతిమం భావం మాయాం లక్ష్మీం తరే ద్బుధః | || 123 || సూత ఉవాచ :- వ్యాహృతా హరిణా త్వేవం నారదాద్యా మహర్షయః | శ##క్రేణ సహితా స్సర్వే పప్రచ్ఛు ర్గరుడధ్వజమ్ || 124 || ఋషయ ఊచుః :- దేవదేవ హృషీకేశ ! నాథ నారాయణావ్యయ || తద్వ దా శేష మస్మాకం యదుక్తం భవతా పురా | ఇన్ద్రద్యుమ్నాయ విప్రాయ జ్ఞానం ధర్మాదిగోచరమ్ || || 125 || శుశ్రూషు శ్చాప్యయం శక్రః సఖా తవజగన్మయ | తతః స భగవా న్విష్ణుః కూర్మరూపీ జనార్దనః || || 126 || రసాతలగతో దేవో నారదాద్యై ర్మహర్షిభిః | పృష్టః ప్రోవాచ సకలం పురాణం కౌర్మ ముత్తమమ్ || || 127 || సన్నిధౌ దేవరాజస్య తద్వక్ష్యే భవతా మహమ్ | ధన్యం యశస్య మాయుష్యం పుణ్యం మోక్షప్రదం నృణామ్ || || 128 || చివరిదైన భావమును పొంది పండితుడు లక్ష్మీ రూపమైన మాయను దాటగలడు. సూతుడిట్లు పలికెను :- విష్ణువుచేత ఈ విధముగా చెప్పబడిన నారదుడు మొదలుగాగల మహర్షులు : (123) ఇంద్రునితో కూడ కలిసి అందరు, గరుడ ధ్వజుడైన నారాయణుని ఇట్లు ప్రశ్నించిరి. దేవతలకు దేవుడవైన ఓనారాయణా! ఇంద్రియముల కధీశుడవు, నాశములేని వాడవునగు ఓ ప్రభూ! (124) పూర్వము నీచేత బ్రాహ్మణుడైన ఇంద్రద్యుమ్నుని కొరకు చెప్ప బడిన, ధర్మాదులకు సంబంధించిన సమస్త జ్ఞానాన్ని మాకు తెలుపుము. 125. ఓ విశ్వరూపా! నీకు చెలికాడైన ఈ ఇంద్రుడు కూడ ఆ విషయములను విన గోరుచున్నాడు. అని పలుకగా అప్పుడు కూర్మరూపధరుడైన భగవంతుడు, జనార్దనుడగు విష్ణువు; (126) రసాతలమును చేరిన భగవంతుడు, నారదాదులచేత అడుగబడి సమస్తమైన ఉత్తమ కూర్మపురాణమును వారికి చెప్పెను. (127) ఇంద్రుని సమీపములో విష్ణువు చెప్పిన, ధన్యము, కీర్తికరము, ఆయుష్కారకము, మోక్షాన్నిచ్చునది, పుణ్యకరమైనదానిని నేను మీకు చెప్పుదును. (128) పురాణశ్రవణం విప్రాః కథనం చ వివేషతః | శ్రుత్వా చాధ్యాయ మేవైకం సర్వపాపైః ప్రముచ్యతే || || 129 || ఉపాఖ్యాన మథైకం వా బ్రహ్మలోకే మహీయతే | ఇదం పురాణం పరమం కౌర్మం కూర్మస్వరూపిణా || || 130 || ఉక్తం వై దేవదేవేన శ్రద్ధాతవ్యం ద్విజాతిభిః || || 131 || ఇతి శ్రీ కూర్మ పురాణ ఇన్ద్రద్యుమ్నమోక్షవర్ణనం నామ ప్రథమో ధ్యాయః బ్రాహ్మణులారా! పురాణములను వినుట, ప్రత్యేకముగా ప్రవచనము ప్రశస్తము. ఒక్క అధ్యాయమును విన్నంతనే అన్నిపాపములనుండి విముక్తుడగును. (129). ఏదో ఒక ఉపాఖ్యానమును విన్నప్పటికి బ్రహ్మలోకమున గౌరవించబడును. ఈ శ్రేష్ఠమైన కూర్మపురాణము కూర్మరూపమును ధరించిన దేవదేవుడైన నారాయణుని చేత చెప్పబడినది. ఇది బ్రాహ్మణాది ద్విజులచేత శ్రద్ధతో ఆదరించదగినది. ఇది శ్రీ కూర్మపురాణములో ఇంద్రద్యుమ్న మోక్షవర్ణన మనుప్రథమాధ్యాయము.