Sri Koorma Mahapuranam
Chapters
దశమోధ్యాయః రుద్రసృష్టిః కూర్మ ఉవాచ- గతే మహేశ్వరే దేవే భూయ ఏవ పితామహః | తదేవ సుమహ త్పద్మం భేజే నాభిసముత్థితమ్ ||
|| 1 || అథ దీర్ఘేణ కాలేన తత్రా ప్రతిమ పౌరుషౌ | మహాసురౌ సమాయాతౌ భ్రాతరౌ మధుకైటభౌ ||
|| 2 || క్రోధేన మహతా విష్టౌ మహాపర్వతవిగ్రహౌ | కర్ణాస్తరసముద్భూతౌ దేవదేవస్య శార్‌ఙ్గిణః ||
3 తా వాగతౌ సమీక్ష్యాహ నారాయణ మజో విభుః | త్రైలోక్యకంటకావేతా వసురౌ హన్తు మర్హసి ||
|| 4 || తదస్య వచనం శ్రుత్వా హరి ర్నారాయణః ప్రభుః | ఆజ్ఞాపయామాస తయో ర్వ ధార్థం పురుషాపుభౌ ||
|| 5 || దశమాధ్యాయము (రుద్రసృష్టి) కూర్మస్వామి చెప్పెను - భగవంతుడైన మహేశ్వరుడు వెడలిపోగా, మరల పితామహుడైన బ్రహ్మ, నాభినుండి పుట్టిన విశాలమైన ఆ పద్మమునే చేరెను. (1) తరువాత చాలా కాలమునకు అక్కడికి సాటిలేని పౌరుషము కలవారు, సహోదరులు అగు మధు కైటభులు అను గొప్ప రాక్షసులు ఇద్దరు వచ్చిరి. (2) పెద్ద పర్వతముల వంటి శరీరములు కలవారు, తీవ్రమైన కోపముతో నిండిన వారగు ఆ అసురులు దేవదేవుడైన విష్ణువు యొక్క చెవుల మధ్య భాగము నుండి జన్మించినారు. (3) వచ్చినటు వంటి ఆ ఇద్దరిని చూచి బ్రహ్మ విష్ణువుతో ఇట్లనెను. ''ఈ అసురులు మూడు లోకములను కంటకముల వలె బాధించుచున్నారు. వీరిని చంపుట నీకు యుక్తము.'' (4) ఆ బ్రహ్మ మాటలు విని ప్రభువైన నారాయణుడు ఆ రాక్షసులను చంపుటకు ఇద్దరు పురుషులను ఆజ్ఞాపించెను. (5) తదాజ్ఞయా మహ ద్యుద్ధం తయోస్తాభ్యా మభూ ద్ద్విజాః | వ్యజయ త్కైటభం జిష్ణుః విష్ణుశ్చ వ్యజయ న్మధుమ్ || || 6 || తతః పద్మాసనాసీనం జగన్నాథః పీతామహమ్ | బభాషే మధురం వాక్యం స్నేహావిష్టమనా హరిః || || 7 || అస్మా న్మయోహ్యమాన స్త్వం పద్మా దవతర ప్రభో | నాహం భవన్తం శక్నోమి వోఢుం తేజోమయం గురుమ్ || || 8 || తతో పతీర్య విశ్వాత్మా దేహ మావిశ్య చక్రిణః | అవాప వైష్ణవీం నిద్రా మేకీభూతోథ విష్ణునా || || 9 || సహ తేన తథా విశ్య శంఖచక్రగదాధరః | బ్రహ్మా నారాయణాఖ్యోసౌ సుష్వాప సలిలే తదా || || 10 || విప్రులారా! ఆ విష్ణువు ఆజ్ఞతో ఆ పురుషులిద్దరికి మధుకైటభులతో గొప్ప యుద్ధము జరిగినది. కైటభుడను అసురుని జిష్ణుడు, మధువును విష్ణువు జయించిరి (6) తరువాత లోకములకు ప్రభువైన హరి పద్మాసనముపైన కూర్చుండి యున్న బ్రహ్మను గూర్చి,. ప్రీతితో కూడిన మనస్సు కలవాడై మధురమైన వాక్యము నిట్లు పలికెను. (7) ప్రభూ! నా చేత భరింప బడుచున్న నీవు ఈ పద్మము నుండి దిగుము. తేజోమయుడవు, బరువు గల నిన్ను మో యుటకు నేను శక్తుడను కాను. (8) అప్పుడు బ్రహ్మ కమలము నుండి దిగి విష్ణుమూర్తి శరీరము నావేశించి, అతనితో అభేదము పొంది విష్ణు కల్పితమైన నిద్రను పొందెను. (9) ఆ బ్రహ్మ, నారాయణుని ఆ విధముగా ఆవేశించి, శంఖచక్రములను, గదను ధరించి నారాయణనామధేయుడై అప్పుడు నీటి యందు నిద్రించెను. (10). సోనుభూయ చిరం కాల మానన్దం పరమాత్మనః | అనాద్యనస్త మద్వైతం స్వాత్మానం బ్రహ్మసంజ్ఞితమ్ || || 11 || తతః ప్రభాతే యోగాత్మా భూత్వా దేవ శ్చతుర్ముఖః | ససర్జ సృష్టిం తద్రూపాం వైష్ణవం భావ మాశ్రితః || || 12 || పురస్తా దసృజ ద్దేవః సనన్దం సనకం తథా | ఋభుం సనత్కుమారం చ పూర్వజం తం సనాతనమ్ || || 13 || తే ద్వన్ద్వమోహనిర్ముక్తాః పరం వైరాగ్య మాస్థితాః | విదిత్వా పరమం భావం జ్ఞానే విదధిరే మతిమ్ || || 14 || తేష్వేవం నిరపేక్షేషు లోకసృష్టౌ పితామహః | బభూవ నష్టచేతా వై మాయయా పరమేష్ఠినః | || 15 || తతః పురాణపురుషో జగన్మూర్తిః సనాతనః | వ్యాజహారా త్మనః పుత్రం మోహనాశాయ పద్మజమ్ || || 16 || అతడా విధముగా చాలా కాలము పరమాత్మతో ఆద్యన్తరహితము, భేదశూన్యము, బ్రహ్మ సంజ్ఞ కలది అగు ఆత్మానందము నను భవించి, (11) తరువాత ప్రాతః కాలము కాగా యోగ రూపుడైన చతుర్ముఖ రూపము కలవాడై, వైష్ణవ భావమును పొంది, తదను గుణమైన సృష్టిని కొనసాగించెను. (12) మొదట బ్రహ్మ సనందుని, సనకుని సృష్టించెను. తరువాత ఋభుని, సనత్కుమారుని సనాతనుడైన పూర్వపురుషునిగా సృజించెను. (13) వారందరు సుఖదుఃఖాదిద్వంద్వాల మోహము నుండి విడివడి, గొప్ప వైరాగ్యమును పొందిన వారై, జ్ఞాన మార్గము యొక్కశ్రేష్ఠత్వమును గుర్తించి దాని యందు బుద్ధిని నిలిపిరి (14) వారీ విధముగా వాంఛారహితులై యుండగా పితామహుడగు బ్రహ్మ పరమేష్ఠి యొక్క మాయ చేత, లోకసృష్టి యందు మనస్సు ప్రసరించని వాడాయెను. అప్పుడు పురాణపురుషుడు, సనాతనుడు అగు విష్ణువు, అతని మోహమును తొలగించుటకు కుమారుడైన బ్రహ్మతో ఇట్లు పలికెను. (16). విష్ణురువాచ :- కచ్చిన్ను విస్మృతో దేవః శూలపాణిః సనాతనః | యదుక్తో వై పురా శవ్ఖుుః పుత్రత్వే భవ శంకర || || 17 || ప్రయుక్తవాన్ మనో యోసౌ పుత్రత్వేన తు శంకరః | అవాప సంజ్ఞాం గోవిన్దా త్పద్మయోనిః పితామహః || || 18 || ప్రజాః స్రష్టుం మన శ్చక్రే తపః పరమదుస్తరమ్ | తసై#్యవం తప్యమానస్య న కించిత్సమవర్త || || 19 || తతో దీర్ఘేణ కాలేన దుఃఖా త్ర్కోథో భ్యజాయత | క్రోధావిష్టస్య నేత్రాభ్యాం ప్రాపతన్న శ్రుబిన్దవః || || 20 || తత స్తేభ్యః సముద్భూతాః భూతాః ప్రేతా స్తదాభవన్ | సర్వాం స్తా నగ్రతో దృష్ట్వా బ్రహ్మా త్మాన మవిన్దత || || 21 || జహౌ ప్రాణాం శ్చ భగవాన్ క్రోధావిష్టః ప్రజాపతిః | తదా ప్రాణమయో రుద్రః ప్రాదురాసీ త్ర్పభో ర్ముఖాత్ || || 22 || విష్ణువు పలికెనుః- శూలము చేతియందు కలవాడు, సనాతనుడు అగు భగవంతుడు మరువబడినాడా? పూర్వము శమ్భువు పుత్రభావమును పొందుమని చెప్పబడినాడు కదా! (17) ఆ శంకరుడు పుత్రత్వాన్ని పొందుటకు సంకల్పించెను. పుత్రుడుగా అవతరించిన శివుడు గోవిందుడనైన నా వలన పద్మయోని అని, పితామహుడని సంజ్ఞను పొందెను (18) అతడు ప్రజలను సృష్టించుటకు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసెను. అతడీ విధముగా తపస్సు చేయుచుండగా ఏమియు జరుగక స్తబ్ధముగా ఉండెను. (19) తరువాత చాలా కాలమునకు అతనికి దుఃఖము వలన క్రోధము జనించెను. కోపముతో కూడిన అతని కన్నుల నుండి బాష్పబిందువులు జారి పడెను. (20) అప్పుడా కన్నీటి బిందువుల నుండి భూతప్రేతములు జనించినవి. తన ముందు వానినన్నిటిని చూచి బ్రహ్మ తన స్వరూపమును గుర్తించెను. (21) కోపముతో నిండిన ప్రజాపతి తన ప్రాణములను విడిచెను. అప్పుడాయన ముఖమునుండి ప్రాణమయుడైన రుద్రుడు ఆవిర్భవించెను. (22) సహస్రాదిత్యసజ్వాశో యుగాన్తదహనోపమః | రురోద సుస్వరం ఘోరందేవదేవః స్వయం శివః || || 23 || రోదమానం తతో బ్రహ్మా మారోదీ రిత్య భాషత | రోదనా ద్రుద్ర ఇత్యేవం లోకే ఖ్యాతిం గమిష్యసి || || 24 || అన్యాని సప్తనామాని పత్నీః పుత్రాంశ్చ శాశ్వతాన్ | స్థానాని తేషా మష్టానాం దదౌ లోకపితామహః || || 25 || భవః శర్వ స్త థేశానః పశూనాం పతి రేవచ | భీమ శ్చోగ్రో మహాదేవ స్తాని నామాని సప్తవై || || 26 || సూర్యో జలం మహీ వహ్ని ర్వాయు రాకాశ మేవ చ | దీక్షితో బ్రాహ్మణ శ్చన్ద్ర ఇత్యేతా అష్టమూర్తయః || || 27 || స్థానే ష్వేతేషు యే రుధ్రా ధ్యాయన్తి ప్రణమన్తి చ | తేషా మష్టతను ర్దేవో దదాతి పరమంపదమ్ || || 28 || వేయి సూర్యులతో సమానుడు, ప్రళయ కాలపు అగ్ని వలె మండుచున్న దేవదేవుడైన శివుడు స్వయంగా ఉచ్చస్వరముతో భయంకరముగా రోదించెను. (23) ఏడ్చుచున్న అతనిని బ్రహ్మ రోదించవద్దని పలికెను. నీ రోదన కర్మ వలన 'రుద్రడు' అని లోకములో ప్రసిద్ధిని పొందగలవు అని కూడా చెప్పెను (24) ఇతరములైన ఏడు పేర్లను, భార్యలను, పుత్రులను, ఇచ్చి ఆ ఎనమండుగురికి శాశ్వతములైన స్థానములను లోకపితామహుడైన భగవంతుడు అప్పగించెను. (25) రుద్రనామము కాక తక్కిన ఏడు పేర్లు ఇవి. 'భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు' - అని (26) ఆ రుద్రుని యొక్క అష్టమూర్తులు క్రమముగా - సూర్యుడు, జలము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, యజ్ఞదీక్షితుడగు బ్రహ్మణుడు చంద్రుడు - అని ప్రసిద్ధములు. (27) ఈ స్థానములందు ఎవరైతే రుద్రులను ధ్యానింతురో, నమస్కరింతురో వారికి అష్టమూర్తి యగు శివుడు పరమ పదము నిచ్చును. (28) సువర్చలా తథైవోమా వికేశీ చ శివా తథా | స్వాహా దిశశ్చ దీక్షాచ రోహిణీ చేతి పత్నయః || || 29 || శ##నైశ్చర స్తథా శుక్రో లోహితాజ్గో మనోజపః | స్కన్దః సర్గో థ సన్తానో బుధ శ్చైషాంసుతాఃస్పృతాః || || 30 || ఏవం ప్రకారో భగవా న్దేవదేవో మహేశ్వరః | ప్రజాధర్మం చ కామం చ త్యక్త్వా వైరాగ్యమాశ్రితః || || 31 || ఆత్మ న్యాధాయ చాత్మాన మైశ్వరం భావ మాస్థితః || పీత్వా తదక్షరం బ్రహ్మ శాశ్వతం పరమామృతమ్ || || 32 || ప్రజాః సృజతి చాదిష్టో బ్రహ్మానా నీలలోహితః | స్వాత్మనా సదృశా న్రుద్రా న్ససర్జ మనసా శివః || || 33 || రుద్రుని యొక్క అష్టమూర్తులకు క్రమముగా - సువర్చల, ఉమ, వికేశి, శివ, స్వాహా, దిక్కులు, దీక్ష, రోహిణి అను వారు భార్యలుగా కల్పింపబడిరి (29). శ##నైశ్చరుడు, శుక్రుడు, లోహితాంగుడు, మనోజపుడు, స్కందుడు, సర్గుడు, సంతానుడు, బుధుడు అను వారు ఈ అష్టమూర్తలకు కుమారులుగా చెప్పబడినారు. (30) ఈ విధముగా ఉన్న, దేవతలకుదేవుడైన భగవంతుడగు మహేశ్వరుడు సృష్టిధర్మమును, కామమును కూడా వదిలి వైరాగ్యభావము నవలంభించెను. (31) ఆత్మను ఆత్మ యందే నిలిపి, ఈశ్వరభావము నాశ్రయించిన వాడై, అక్షరరూపమై శాశ్వతమైన బ్రహ్మమను గొప్ప అమృతమును పానము చేసి (32). బ్రహ్మ చేత ఆదేశింపబడి నీలలోహితుడైన శివుడు ప్రజలను సృజింప బూనుకొనెను. మొదట తన సంకల్పముతో తనతో సమానులైన రుద్రులను సృజించినాడు. (33). కపర్దినో నిరాతంకా న్నీలకంఠా న్పినాకినః | త్రిశూలహస్తానుద్రిక్తా న్సదానందాం స్త్రిలోచనాన్ || || 34 || జరామరణనిర్ముక్తాన్ మహావృషభవాహనాన్ | వీతరాగాం శ్చ సర్వజ్ఞాన్ కోటికోటి శతాన్ర్పభుః || || 35 || తాన్దృష్ట్వా వివిధా న్రుద్రా న్నిర్మలా న్నీలలోహితాన్ | జరామరణనిర్ముక్తాన్ వ్యాజహార హరం గురుః | || 36 || మాస్రాక్షీ రీదృశీ ర్దేవ ప్రజా మృత్యువివర్జితాః | అన్యాః సృజస్వ భూతేశ జన్మమృత్యుసమన్వితాః || || 37 || తత స్త మాహ భగవాన్ కపర్దీ కామశాసనః | నాస్తి మే తాదృశః సర్గః సృజ త్వం వివిధాః ప్రజాః || || 38 || కపర్డము అను జటాజూటము కలవారిని, భయరహితులను, నల్లని కంఠము కలవారిని, పినాకము ధరించిన వారిని, త్రిశూలము చేతిలో కలవారిని, ఉద్రేకము కలవారిని, మూడు కన్నులు కలిగి, ఎల్లప్పుడానందము కలిగియున్నవారిని. (34) ముసలితనము, చావులేని వారిని, పెద్ద వృషభము వాహనముగా కలవారిని, కోరికలను విడిచిన వారిని, సర్వజ్ఞులగు వారిని కోట్ల సంఖ్యలో ప్రభువు సృజించెను. (35). నిర్మలులు, నీలలోహితులు, జరామరణములు లేని వారు అగు ఆ రుద్రులను చూచి గురువగు ప్రజాపతి శివునితో ఇట్లు పలికెను. (36). ఓ దేవా! మరణ రహితులైన ఇటువంటి ప్రజలను నీవు సృష్టించకుము. జనన మరణాలతో కూడిన ఇతర విధములైన ప్రజలను సృజింపుము. (37) అప్పుడు కాముని జయించిన వాడగు శివుడు అతనితో ఇట్లు పలికెను. ''అటువంటి సర్గము నాకు ఇష్టము కాదు. నీవే విభిన్న ప్రజలను సృజింపుము.'' (38) అని. తతః ప్రభృతి దేవో సౌ న ప్రసూతే శుభాః ప్రజాః | స్వాత్మజై రేవ తైరుద్రై ర్నిర్వృతాత్మా హ్యతిష్ఠత || || 39 || స్థాణుత్వం తస్య తేనాసీ ద్దేవదేవస్య శూలినః | జ్ఞానం వైరాగ్య మైశ్వర్యం తపః సత్యం క్షమా ధృతిః || || 40 || ద్రష్టృత్వ మాత్మసంబోధో హ్యధిష్ఠాతృత్వమేవ చ | అవ్యయాని దశైతాని నిత్యం తిష్ఠన్తి శంకరే || || 41 || ఏవం స శంకరః సాక్షా త్పినాకీ పరమేశ్వరః | తతః స భాగవాన్ బ్రహ్మా వీక్ష్యదేవం త్రిలోచనమ్ || || 42 || సహైవ మానసై రుద్రైః ప్రీతివిస్ఫారలోచనః | జ్ఞాత్వా పరతరం భావ మైశ్వరం జ్ఞానచక్షుషా || || 43 || అప్పటి నుండి ఆ దేవుడు (రుద్రుడు) శుభ లక్షణపు ప్రజలను సృష్టించలేదు. తన పుత్రులైన రుద్రుల తోనే తృప్తినందినవాడై ఉండెను. ఆ కారణము చేత దేవదేవుడైన శూలధారి శివునికి స్థాణుత్వము కలిగినది. జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, తపస్సు, సత్యము, ఓర్పు, ధైర్యము. (40), దర్శన స్వభావము, ఆత్మజ్ఞానము, అధిష్ఠాన లక్షణము - అను నాశరహితములైన యీ పది లక్షణాలు శంకరుని యందు ఎల్లప్పుడు ఉండును. (41) ఇట్లు పినాకధారియైన ఆ శంకరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. పిమ్మట భగవంతుడగు బ్రహ్మ, మూడు కన్నులు గల శివుని చూచి (42) అతని మానసపుత్రులైన రుద్రులతో కూడ సంతోషముతో వికసించిన కన్నులు కలవాడై, జ్ఞాననేత్రముతో ఆ శివుని ఈశ్వర సంబంధియైన సర్వోత్కృష్టభావమును తెలుసుకొని, (43) తుష్టావ జగతా మీశం కృత్వాశిరసి చాంజలిమ్ | || 44 || బ్రహ్మోవాచ :- నమస్తే స్తు మహాదేవ నమస్తే పరమేశ్వర || || 45 || నమః శివాయ దేవాయ నమస్తే బ్రహ్మరూపిణ | నమోస్తు తే మహేశాయ నమః శాన్తాయ హేతవే || || 45 || ప్రధానపురుషేశాయ యోగాధిపతయే నమః | నమః కాలాయ రుద్రాయ మహాగ్రాసాయ శూలినే || || 46 || నమః పినాకహస్తాయ త్రినేత్రాయ నమోనమః | నమస్త్రిమూర్తయే తుభ్యం బ్రహ్మాణ జనకాయతే || || 47 || బ్రహ్మవిద్యాధిపతయే బ్రహ్మవిద్యాప్రదాయినే | నమో వేదరహస్యాయ కాలకాలాయతే నమః || || 48 || తలపై దోసిలి యొగ్గి ఆలోకేశ్వరుని స్తుతించెను. బ్రహ్మ పలికెను - ఓ మహాదేవా! పరమేశ్వరా! నీకు నమస్కారము (44) దేవుడైన శివునకు నమస్కారము. బ్రహ్మరూపినైన నీకు వందనములు. మహేశుడవైన నీకు నమస్సు. శాంతుడవు, కారణభూతుడవు అగు నీకు ప్రణామము. (45) ప్రధాన పురుషుడు, ఈశుడు, యోగమునకు అధిపతివి అగునీకు నమస్కారము, కాలుడు, రుద్రుడు, మహోభోజి, శూలధారియగు నీకు వందనము (46). పినాకము చేతిలో ధరించిన, మూడు కన్నులు గల నీకు నమస్కారము. త్రిమూర్తి స్వరూపుడవు, బ్రహ్మవు, తండ్రివి అగు నీకు వందనము (47). వేదాంత విద్యకు అధిపతివి, బ్రహ్మవిద్యనుపదేశించువాడవు. వేదముల రహస్యతత్త్వము కలవాడవు. కాలమునకు కాలుడవు అగు నీకు నమస్కారము. (48) వేదాన్తసారసారాయ నమోవేదాత్మమూర్తయే | నమో బుద్ధాయ రుద్రాయ యోగినాం గురవే నమః || || 49 || ప్రహీణశోకై ర్వివిధై ర్భూతైః పరివృతాయ తే | నమో బ్రహ్మణ్యదేవాయ బ్రహ్మాధిపతయే నమః || || 50 || త్ర్యమ్బకాయాదిదేవాయ నమస్తే పరమేష్ఠినే | నమో దిగ్వాససే తుభ్యం నమో ముణ్డాయ దణ్డినే || || 51 || అనాదిమలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః | నమ స్తారాయ తీర్థాయ నమో యోగర్థిహేతవే || || 52 || నమోధర్మాదిగమ్యాయ యోగగమ్యాయ తేనమః | నమస్తే నిష్ప్రపంచాయ నిరాభాసాయ తే నమః || || 53 || వేదాంతసారమునకు సారభూతుడవు, వేద స్వరూపుడవు, బుద్ధరూపుడవు, యోగులకు గురువవు, రుద్రుడవు అయిన నీకు నమస్కారము (49) శోకములు తొలగిన వివిధ భూతగణములతో చుట్టబడిన నీకు వందనము. బ్రహ్మకు హితుడైన దేవుడవు, బ్రహ్మకధిపతిని అగునీకు నమస్కారము. (50) త్రిలోచనుడవు, ఆదిదేవుడవు, పరమేష్ఠిని అగునీకు వందనము. దిగంబరుడవు, దండధారివి, సన్యాసియు అగు నీకు నమస్కారము (51) ఆదిలేనివాడవు, నిర్మలుడవు, జ్ఞానముచేత పొందదగినవాడవు అగు నీకు నమస్కారము - తీర్థభూతుడవు, యోగులవృద్ధికి మూల భూతుడవు, ప్రణవరూపుడగు అగునీకు వందనము. (52) ధర్మము మొదలగు పురుషార్థములచే పొందదగినవాడవు, యోగముచే సాధ్యుడవు, ప్రపంచమునకతీతుడవు, భ్రాంతిరహితుడవు అయిన నీకు నమోవాకము. (53) బ్రహ్మణ విశ్వరూపాయ నమస్తే పరమాత్మనే | త్వయైవ సృష్ట మఖిలం త్వయ్యేవ సకలం స్థితమ్ || || 54 || త్వయా సంహ్రియతే విశ్వం ప్రధానాద్యం జగన్మయ | త్వమీశ్వరో మహాదేవః పరం బ్రహ్మ మహేశ్వరః || || 55 || పరమేష్ఠీ శివః శాన్తః పురుషో నిష్కలో హరః | త్వమక్షరం పరం జ్యోతిస్త్వంకాలః పరమేశ్వరః || || 56 || త్వమేవ పురుషో೭ నన్తః ప్రధానం ప్రకృతి స్తథా | భూమి రాపో೭ నలో೭ వాయు ర్వ్యొమాహజ్కార ఏవచ || || 57 || యస్య రూపం నమస్యామి భవన్తం బ్రహ్మ సంజ్ఞితమ్ | యస్య ద్యౌరభవ న్మూర్థా పాదౌ పృథ్వీ దిశోభుజాః || || 58 || ఆకాశ ముదరం తసై#్మ విరాజే ప్రణమా మ్యహమ్ | సన్తాపయతి యో నిత్యం స్వభాభి ర్భాసయ న్దిశః || || 59 || ప్రపంచ స్వరూపుడవు, పరమాత్మవు, బ్రహ్మవు అగు నీకు నమస్కారము. ఈ సమస్తము నీ చేతనే సృజింపబడినది. సర్వము నీయందే నిలిచి ఉన్నది. (54) ఓ లోకమయుడా ! ఈ ప్రపంచము నీచేత లయము పొందింపబడుచున్నది. నీవు మహాదేవుడవు, ప్రభువువు, పరబ్రహ్మ స్వరూపుడవు. మహేశ్వరుడవు అయి ఉన్నావు (55) నీవు పరమేష్ఠివి, శివుడవు, శాంతరూపుడవు, భేదరహితుడగు పురుషుడవు, హరుడవు. నీవు నాశరహితమైన గొప్పతేజస్సువు. నీవు కాలరూపుడవు, పరమేశ్వరుడవు. (56) నీవే అంతములేని పురుషుడవు, ప్రధానతత్త్వము, ప్రకృతి రూపమునీవే. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము, అహంకారము కూడ నీవే. (57) బ్రహ్మనామము కలిగిన ఏ నీ రూపమునకు నమస్కరించుచున్నానో ఏ పురుషునికి స్వర్గము శిరస్సుగా, భూమి పాదములుగా, దిక్కులు చేతులు గా ఏర్పడినవో, (58) ఆకాశము పొట్టగా ఉండునో ఆ విరాడ్రూపపురుషునికి నమస్కరించుచున్నాను. ఎవడు తన కాంతులతో ఎల్లప్పుడు దిక్కులను ప్రకాశింపజేయుచున్నాడో, (59) బ్రహ్మతేజోమయం విశ్వం తసై#్మ సూర్యాత్మనే నమః | హవ్యం వహతి యో నిత్యం రౌద్రీ తేజోమయీ తనుః || || 60 || కవ్యం పితృగణానాం చ తసై#్మ వహ్న్యాత్మనే నమః | ఆప్యాయయతి యో నిత్యం స్వధామ్నా సకలం జగత్ || || 61 || పీయతే దేవతాసంఘై స్తసై#్మ చన్ద్రాత్మనే నమః | బిభర్త్య శేషభూతాని యాన్తశ్చరతి సర్వదా || || 62 || శక్తి ర్మాహేశ్వరీ తుభ్యం తసై#్మ వాయ్వాత్మనే నమః | సృజ త్యశేష మేవేదం యః స్వకర్మాసురూపతః || || 63 || ఆత్మ న్యవస్థిత స్తసై#్మ చతుర్వక్త్రాత్మనే నమః | యః శేతే శేషశయనే విశ్వ మావృత్య మాయయా || || 64 || బ్రహ్మతేజస్సురూపమైన ప్రపంచమును వెలుగుతోనింపుచున్న సూర్యస్వరూపుడైన అతనికి వందనము. రుద్రునికి సంబంధించిన తేజోమయ శరీర రూపుడైన ఎవడు ఎల్లప్పుడు హవ్యమును ధరించుచున్నాడో. (60) పితృగణములకు చెందవలసిన కవ్యమును గూడ మోయుచున్న అగ్నిరూపుడైన అతనికి నమస్కారము. ఎవ్వడు సర్వదా తన తేజస్సుతో సమస్త విశ్వమును ఆహ్లాదపరచుచున్నాడో. (61) దేవతల సమూహముచే ఎవడు త్రాగబడుచున్నాడో, ఆ చంద్ర స్వరూపుడైన పురుషునికి నమస్కారము. ఏ శక్తి ఎల్లప్పుడు సమస్త భూతములలో సంచరించుచు వానిని ధరించుచున్నదో. (62) మహేశ్వరుని శక్తి, వాయు స్వరూపమును అగు నీకు వందనము. ఎవడు వారి వారి కర్మలకు తగినట్లుగా ఈ సమస్త విశ్వమును సృజించునో, (63) తన యందే తాను ఆధారపడి యున్న నాలుగు ముఖములు కల బ్రహ్మ స్వరూపుణికి నమస్కారము. ఎవడు తన మాయతో ప్రపంచము నావరించి శేష సర్పరూపశయ్య యందు శయనించునో. (64) స్వాత్మానుభూతియోగేన తసై#్మ విష్ణ్వాత్మనే నమః | బిభర్తి శిరసా నిత్యం ద్విసప్త భువనాత్మకమ్ || || 65 || బ్రహ్మాణ్డం యో ఖిలాధార స్తసై#్మ శేషాత్మనే నమః | యః పరాన్తే పరానన్దం పీత్వాదేవ్యైక సాక్షికమ్ || || 66 || నృత్యత్య నన్త మహిమా తసై#్మ రుద్రాత్మనే నమః | యోన్తరా సర్వభూతానాం నియన్తా తిష్ఠతీశ్వరః | || 67 || యస్య కేశేషు జీమూతా నద్యః సర్వాజ్గసన్ధిషు | కుక్షౌ సముద్రా శ్చత్వార స్తసై#్మ తోయాత్మనే నమః || || 68 || తం సర్వసాక్షిణం దేవం నమస్యే విశ్వతస్తనుమ్ | యం వినిద్రా జితశ్వాసాః సన్తుష్టాః సమదర్శినః || || 69 || ఆత్మానుభవ రూపమైన యోగముతో కూడి యుండు విష్ణు రూపుడగు దేవునికి నమస్కారము, పదునాల్గు లోకముల రూపములో ఉన్న (65) బ్రహ్మాండమును ఎల్లప్పుడు శిరసుతో మోయుచు సమస్తమునకా ధారభూతుడైన శేషసర్పరూపునికి వందనము. ఎవడు ప్రళయకాలములో దేవి మాత్రమే సాక్షిగా కలిగి యుండగా పరమానందమును ఆస్వాదించి. (66) నృత్యము చేయునో, అంతులేని మహిమ కల రుద్రస్వరూపునికి నమస్కారము. ఎవడు సమస్త ప్రాణులకు అంతర్భూతుడై, నియమించువాడుగా ఉండునో (67) ఎవని రోమముల యందు మేఘములు, సమస్తావయవముల సంధి ప్రదేశములలో నదులు, ఉదరములో నాలుగు సముద్రములు చేరి ఉండునో, జలస్వరూపుడగు ఆ పురుషునికి నమస్కారము (68). సమస్తమునకు సాక్షిభూతుడు, ప్రపంచమంతట వ్యాపించిన శరీరము కలవాడు అగు ఆ దేవునికి నమస్కరింతును. నిద్రను విడిచిన వారు, శ్వాసను జయించిన వారు, సంతోషముతో ఉండువారు, అందరిని సమముగా చూచువారు ఎవనిని, (69) జ్యోతిః పశ్యన్తి యుఞ్జానా స్తసై#్మ యోగాత్మనే నమః | యయా సస్తరతే మాయాం యోగీ సంక్షీణకల్మషః | || 70 || అపారతరపర్యన్తాం తసై#్మ విద్యాత్మనే నమః | యస్య భాసా విభా త్యర్కోమహో యత్తమసః పరమ్ || || 71 || ప్రపద్యే తత్పరం తత్త్వం తద్రూపం పారమేశ్వరమ్ | నిత్యానన్దం నిరాధారం నిష్కలం పరమం శివమ్ || || 72 || ప్రపద్యే పరమాత్మానం భవన్తం పరమేశ్వరమ్ | ఏవం స్తుత్వా మహాదేవం బ్రహ్మాతద్భావభావితః || || 73 || ప్రాఞ్జలిః ప్రణత స్తస్థౌ గృణాన్ బ్రహ్మ సనాతనమ్ | తతస్తస్యమహాదేవో దివ్యం యోగ మనుత్తమమ్ || || 74 || ఐశ్వర్యం బ్రహ్మ సద్భావం వైరాగ్యం చ దదౌహరః | కరాభ్యాం కోమలాభ్యాం చ సంస్పృశ్య ప్రణతార్తిహా || || 75 || యోగమార్గమవలంబించి తేజోరూపముగా చూతురో, యోగాత్మకుడైన అతనికి నమస్కారము. దేని చేత యోగి తన పాపములు నశింపగా మాయను దాటుచున్నాడో. (70) అంతు తెలియక, దాటుటకు శక్యము కాని మాయను దాటుటకు సాధనమైన విద్యా రూపుడైన వానికి వందనము. ఎవని కాంతితో సూర్యుడు ప్రకాశించుచున్నాడో, ఏ తేజస్సు చీకటి కతీతమైనదో (71) పరమతత్త్వమైన, పరమేశ్వర సంబంధియైన, ఎల్లప్పుడు ఆనందయుక్తమైనది, ఆధారరహితము, భేద శూన్యము, శ్రేష్ఠము, మంగళకరము అయిన ఆ రూపమును ఆశ్రయించుచున్నాను. (72). పరమాత్మవు, పరమేశ్వరుడవు అయిన నిన్ను శరణు పొందుచున్నాను. బ్రహ్మ మహాదేవుని ఈ విధముగా కొనియాడి, ఆ దేవుని యందలి భావముచే ప్రభావితుడై (73) చేతులు జోడించి నమస్కరించుచు నిలిచెను. సనాతన మగు బ్రహ్మను కీర్తించుచుండెను. తరువాత మహాదేవుడతనికి గొప్పయోగమును, ఈశ్వర సంబంధి బ్రహ్మతత్త్వమును, మంచి శీలమును, వైరాగ్యమును కూడా ఇచ్చి, శివుడు తన కోమల హస్తములతో స్పృశించి నమస్కరించువారి బాధలను పొగొట్టువాడు కనుక అతనికిట్లు తెలియజేసెను. (74) వ్యాజహార స్మయన్నేవ సోను గృహ్య పితామహమ్ | యత్త్వయాభ్యర్థితం బ్రహ్మన్ పుత్రత్వేభవతా మయ || || 76 || కృతం మయా తత్సకలం సృజస్వ వివిధం జగత్ | త్రిధా భిన్నో స్మృహం బ్రహ్మన్ బ్రహ్మవిష్ణుహరాఖ్యయా || || 77 || సర్గరక్షాలయగుణౖ ర్నిష్కలః పరమేశ్వరం | స త్వం మమాగ్రజః పుత్రః సృష్టిహేతో ర్వినిర్మతః || || 78 || మమైవ దక్షిణాదజ్గా ద్వామాజ్గాత్పురుషోత్తమః | తస్య దేవాధి దేవస్య శవ్ఖూె రృదయదేశతః || || 79 || సంబభూవాధ రుద్రోవా సోహం తస్య పరాతనుః | బ్రహ్మవిష్ణుశివా బ్రహ్మన్ సర్గ స్థిత్యన్తహేతవః || || 80 || ఆ విష్ణువు బ్రహ్మదేవుని యందనుగ్రహించి నవ్వుచునే ఇట్లు పలికెను. ఓ బ్రహ్మా! నీచేత నాకు పుత్రుడవగు దశలో ఏదైతే కోరబడినదో, (76) అది యంతయు నా చేత ఆచరింప బడినది. నీవు నానా విధమైన ప్రపంచమును సృజించుము. ఓయీ విధాతా! నేను బ్రహ్మ విష్ణువు, శివుడు అను పేర్లతో మూడు విధముల భిన్న రూపములను పొందినాను. (77) సృష్టించుట, కాపాడుట, సంహరించుట అను మూడు గుణముల చేత పరమేశ్వరుడనైన నేను భాగముల కతీతుడను. నీవు నాకు పెద్ద కుమారుడవు. ప్రపంచ సృష్టికారణమునకు నాచే సృజింపబడినావు (78) నీవు నా శరీర దక్షిణ భాగము నుండి పుట్టగా, ఎడమ భాగము నుండి పురుషోత్తముడగు విష్ణువు ఏర్పడెను. దేవతలకు దేవుడైన శివుని యొక్క హృదయ ప్రదేశము నుండి (79) రుద్రుడు జనించెను. నేను ఆ శివుని యొక్క మరి యొక శరీరము వంటి వాడను. ఓ బ్రహ్మా! బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురు ప్రపంచము యొక్క సృష్టికి, నిలుకడకు, వినాశనానికి కారణభూతులై యున్నారు. సృష్టికర్త బ్రహ్మ, రక్షకుడు విష్ణువు. ప్రళయకారకుడు రుద్రుడు అని తెలియవలెను. (80) విభజ్యా త్మాన మేకోపి స్వేచ్ఛయా శంకరః స్థితః | తథా న్యాని చ రూపాణి మమ మాయా కృతాని చ || || 81 || అరూపః కేవలః స్వస్థో మహాదేవః స్వభావతః | య ఏభ్యః పరతో దేవ స్త్రి మూర్తిః పరమాత్మనుః || || 82 || మాహేశ్వరీ త్రినయనా యోగినాంశాన్తిదా సదా | తస్యా ఏవ పరాం మూర్తిం మా మవేహి పితామహ || || 83 || శాశ్వతైశ్వర్య విజ్ఞానం తెజో యోగసమన్వితమ్ | సోహం గ్రసామి సకల మధిష్ఠాయ తమోగుణమ్ || || 84 || కాలో భూత్వా న మనసా మా మన్యోభిభవిష్యతి | యదాయదాహి మాం నిత్యం విచిన్త్రయ సి పద్మజ || || 85 || శంకరుడు ఒక్కడే అయినను తనను విభజించుకొని తన యిష్ట ప్రకారము ఉన్నాడు. అట్లే ఇతరములైన రూపములు నా యొక్క మాయ చేత కల్పింపడినవి (81) మహాదేవుడు సహజముగా, రూపము లేని వాడు, అద్వితీయుడు, నిశ్చలముగా నుండువాడు. ఈత్రిమూర్తుల కంటే అతిశక్తుడైన దేవుడు త్రిమూర్తి స్వరూపుడు. శ్రేష్ఠమైన ఆకృతి కలవాడు. (82) మహేశ్వర సంబంధిని, మూడు కన్నులు కలది, ఎల్లప్పుడు యోగులకు శాంతిని కలిగించునది అగు త్రిమూర్త్యాత్మక శక్తి యొక్క మరొక అంశనుగా ఓపితామహా! నన్ను తెలిసి కొనుము. (83) శాశ్వతమైన ఐశ్వర్యము, విజ్ఞానము కలవానిగా, తేజస్సు, యోగబలముతో కూడిన వానిగా నన్ను గుర్తించుము. అటువంటి నేను తామసగుణాన్నవలంబించి కాలపురుషుడనై సమస్త విశ్వమును మ్రింగి వేయుదును. (84) ఇతరుడెవ్వడూ నన్ను మనస్సు చేత కూడా తిరస్కరించజాలడు. కమలము నుండి పుట్టిన ఓ బ్రహ్మా! ఎప్పుడెప్పుడు నీవు నన్ను ఎల్లప్పుడు ధ్యానింతువో, (85) తదాతదా మే సాన్నిధ్యం భవిష్యతి తవానఘ | ఏతావ దుక్త్వా బ్రహ్మాణం సో భివన్ద్య గురుం హరః || || 86 || సహైవ మానసైః పుత్రైః క్షణా దన్తరధీయతః సోపి యోగం సమాస్థాయ ససర్జ వివిధం జగత్ || || 87 || నారాయణాఖ్యో భగవా న్యథా పూర్వం ప్రజాపతిః | మరీచిభృగ్వజ్గిరసః పులస్త్యం పులహం క్రతుమ్ || || 88 || దక్ష మత్రిం వసిష్ఠం చ సోసృజ ద్యోగవిద్యయా | నవబ్రహ్మాణ ఇత్యేతే పురాణ నిశ్చయో మతః || || 89 || సర్వే తే బ్రహ్మణా తుల్యాః సాధకా బ్రహ్మవాదినః | సజ్కల్పం చైవ ధర్మం చ యుగధర్మాంశ్చ శాశ్వతాన్ || || 90 || స్థానాభిమానిన స్సర్వాన్ యథాతే కథితంపురా || ఇతి శ్రీకూర్మపూరాణ రుద్ర సృష్టిర్నామ దశమోధ్యాయః పాపములు లేని వాడా! ఆయా సమయాలలో నీకు నా సాక్షాత్కారము లభించును. ఆ శివుడు బ్రహ్మను గూర్చి ఇంతవరకు చెప్పి, గురువునకు ప్రణామము చేసి, (86) తన మానసపుత్రులతో కూడా క్షణ కాలములో అదృశ్యుడాయెను. ఆ బ్రహ్మ కూడా పరమపురుషుడు చెప్పిన యోగము నాశ్రయించి సమస్త ప్రపంచమును సృష్టించెను. (87) నారాయణుడను పేరు గల భగవంతుని ఆదేశము ప్రకారము ప్రజాపతి అగు బ్రహ్మ, పూర్వ కల్పములందు వలెనే మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనువారిని, (88) దక్షుని, అత్రిని, వసిష్ఠుని కూడా యోగవిద్య చేత సృజించెను. ఈ తొమ్మిది మంది నవబ్రహ్మలు అని పురాణములందు నిశ్చయయుగా చెప్పబడినది. (89) వారందరు కూడా బ్రహ్మతో సమానులు, సాధన, చేయువారు, పరబ్రహ్మను గూర్చి చెప్పువారు - పరమాత్మ సంకల్పమును, ధర్మ మార్గాన్ని, శాశ్వతాలైన యుగధర్మాలను పూర్వము నీకు చెప్పినట్లు అన్ని స్థానములనభిమానించువారు. శ్రీ కూర్మపురాణములో దశమాధ్యాయము సమాప్తము