Sri Koorma Mahapuranam    Chapters   

ద్వాదశోధ్యాయః

అథదేవీమాహాత్మ్యమ్‌

సూత ఉవాచ-

ఇత్యా కర్ణ్యాథ మునయః కూర్మరూపేణ భాషితమ్‌ | విష్ణునా పున రేవేమం పప్రచ్ఛుః ప్రణతా హరిమ్‌ || || 1 ||

బుషయ ఊచుః-

కైషా భగవతీ దేవీ శంకరార్థశరీరిణీ | శివా సతీ హైమవతీ యథావద్ర్బుహి పృచ్ఛతామ్‌ || || 2 ||

తేషాం తద్వచనం శ్రుత్వా మునీనాం పురుషోత్తమః | ప్రత్యువాచ మహాయోగీ ధ్యాత్వా స్వం పరమం పదమ్‌ || || 3 ||

కూర్మ ఉవాచ: -

పురా పితామహే నోక్తం మేరుపృష్ఠే సుశోభ##నే | రహస్యమేత ద్విజ్ఞానం గోపనీయం విశేషతః || || 4 ||

సాంఖ్యానాం పరమం సాంఖ్యం బ్రహ్మవిజ్ఞాన ముత్తమమ్‌ | సంసారార్ణపమగ్నానాం జన్తూనా మేకమోచనమ్‌ || || 5 ||

ఈ విధముగా కూర్మ రూపి అయిన భగవంతుని చేత చెప్పబడిన విషయమును విని మునులు నమస్కరించి మరల ఆయనను ఇట్లు ప్రశ్నించిరి (1)

''శంకరుని సగము శరీరమును వహించిన భగవతి, హిమవంతుని పుత్రిక, సతీదేవి, శివరూపిణి అగు ఈ దేవి ఎవరు? ఈ విషయమును ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము'' అని (2)

ఆ మునుల యొక్క మాటను విని పురుషోత్తముడైన విష్ణువు, గొప్ప యోగీశ్వరుడు కనుక తన పరమపదమును గూర్చి ధ్యానించి వారికిట్లు బదులు పలికెను. (3)

పూర్వము బ్రహ్మ దేవునిచేత మిక్కిలి మనోహరమైన మేరు పర్వత శిఖర భాగమున చెప్పబడిన యీ విజ్ఞానము రహస్యమైనది. ప్రత్యేకముగా దాచదగినది. (4)

సాంఖ్య యోగులకు ముఖ్యమైన సాంఖ్య తత్త్వము, శ్రేష్ఠమైన బ్రహ్మ విజ్ఞానము, సంసారమను సముద్రములో మునిగి పోవుచున్న ప్రాణులను కాపాడు ఏకైక సాధనమైనది ఇది. (5)

యా సా మహేశ్వరీ శక్తి ర్జ్నాన రూపా తిలాలసా | వ్యోమసంజ్ఞా పరాకాష్ఠా సేయం హైమవతీ మతా || || 6 ||

శివా సర్వగతా సన్తా గుణాతీతా తినిష్కలా! ఏకానేకవిభాగస్థా జ్ఞానరూపా తి లాలసా || || 7 ||

అనన్యా నిష్కలే తత్త్వే సంస్థితా తస్య తేజసా | స్వాభావికీ చ తన్మూలా ప్రభా భానో రివామలా || || 8 ||

ఏకా మహేశ్వరీ శక్తి రనే కోపాధి యోగతః | పరావరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిథౌ || || 9 ||

సేయం కరోతి సకలం తస్యాః కార్యమిదం జగత్‌ | స కార్యం నాపి కరణ మీశ్వర స్యేతి సూరయః || || 10 ||

మహేశ్వర సంబంధిని అగు ఏ శక్తి కలదో అది జ్ఞానరూపమైనది, మిక్కిలి అనురాగము కలది, ఆకాశ సంజ్ఞకలది, అత్యున్నత గమ్యస్థానము, అగు ఈ హైమవతి అని పేర్కొనబడినది (6)

శివస్వరూపిణి, అంతట వ్యాపించి యున్నది, నాశనము లేనిది, త్రిగుణముల కతీతమైనది, మిక్కిలి విభాగ రహిత, ఏక రూప, అనేక విభాగముల యందుండునది, జ్ఞాన స్వరూప, మిక్కిలి కోరికలు కలది (7)

భేద రహితమైన తత్త్వము నందున్నది, సాటియైన మరియొకటి లేనిది, స్వభావ సిద్ధమైనది, పరతత్త్వ తేజస్సుతో తన్మూలమైన, సూర్యుని కాంతి వలె స్వచ్ఛమైన ప్రభారూపమైనది (8)

ఒకటైన మహేశ్వర సంబంధిని శక్తి, అనేకములైన ఉపాధి భేదముల వలన ఆ పరమేశ్వర సన్నిధిలో, పర అవరరూపములతో క్రీడించుచుండును (9)

ఆ యీ మహేశ్వర శక్తి సమస్తమును చేయుచున్నది. ఈ ప్రపంచము ఆమె చే నిర్మితము. ఈశ్వరునకు కార్యభావము కాని, కారణ భావము కాని లేదని పండితులు చెప్పుదురు. (10)

చతస్రః శక్తయో దేవ్యాః స్వరూపత్వేన సంస్థితాః | అధిష్ఠానవశా త్తస్యాః శ్రుణుధ్వం మునిపుజ్గవాః || || 11 ||

శాన్తి ర్విద్యా ప్రతిష్ఠా చ నివృత్తి శ్చేతి తాః స్మృ తాః | చతుర్వ్యూహ స్తతో దేవః ప్రోచ్యతే పరమేశ్వరః || || 12 ||

అనయా పరయా దేవః స్వాత్మానం హి సమశ్నేతే | చతుర్ష్వ పి చ వేదేషు చతుర్మూర్తి ర్మహేశ్వరః || || 13 ||

సైషా సర్వేశ్వరీ దేవీ సర్వభూతప్రవర్తికా | ప్రోచ్యతే భగవా న్కాలో హరిః ప్రాణో మహేశ్వరః || || 14 ||

ఆ దేవి యొక్క నాలుగు శక్తులు ఆధార భేదమును బట్టి ఆయా స్వరూపములతో ఉన్నవి. మునిశ్రేష్ఠులారా! వానిని గూర్చి వినుడు. (11)

అవి శాంతి, విద్య, ప్రతిష్ఠ, నివృత్తి అను పేర్లు కలిగి ఉన్నవి. ఈ నాలుగు శక్తులతో కూడి యున్నందుననే పరమేశ్వరుడు చతుర్వ్యూహుడు అని పిలువబడుచున్నాడు. (12)

ఈ పరాశక్తి చేత భగవంతుడు తనను తాను నిలుపుకొనుచున్నాడు. నాలుగు మూర్తులు ధరించి మహేశ్వరుడు నాలుగు వేదముల యందు నిలిచియున్నాడు. (13)

ఈ దేవి యొక్క ఐశ్వర్యము అనాదికాలమునుండి సిద్ధమై యున్నది. అది సాటి లేని గొప్పతనము కలది. పరమాత్మయగు రుద్రుని సంబంధము వలన ఈ దేవి అంతము లేనిది. (14)

ఆ యీ దేవి సమస్త భూతములను ప్రవర్తింప చేయునది, సర్వేశ్వరి అయి ఉన్నది. పూజనీయమైన కాలరూపుడు హరి అని, ప్రాణరూపుడు మహేహశ్వరుడు అని చెప్పబడుచున్నాడు. (15)

తత్ర సర్వ మిదం ప్రోత మోతం చైవాఖిలం జగత్‌ | స కాలాగ్ని ర్హరో దేవో గీయతే వేదవాదిభిః || || 16 ||

కాలః సృజతి భూతాని కాలః సంహరతి ప్రజాః | సర్వే కాలస్యవశగా స కాలః కస్యచిద్వశః || || 17 ||

ప్రధానం పురుష స్తత్త్వం మహా నాత్మా త్వహంకృతిః | కాలేనాన్యాని తత్త్వాని సమావిష్టాని యోగినః || || 18 ||

తస్వ సర్వజగన్మూర్తిః శక్తి ర్మాయేతి విశ్రుతా | తదేయం భ్రామయే దీశో మాయావీ పురుషోత్తమః || || 19 ||

సైషా మాయాత్మికా శక్తిః సర్వాకారా సనాతనీ | విశ్వరూపం మహేశస్య సర్వదా సంప్రకాశ##యేత్‌ || || 20 ||

అన్యాశ్చ శక్తయో ముఖ్యా స్తస్య దేవస్య నిర్మితాః | జ్ఞానశక్తిః క్రియాశక్తిః ప్రాణశక్తి రితిత్రయమ్‌ || || 21 ||

ఈ సమస్త ప్రపంచము అతనియందు అడ్డముగా, నిలువుగా విస్తరించబడినది. అతడు కాలాగ్ని, హరుడు, దేవుడు అని వేదవాదులచేత కొనియాడబడుతున్నాడు. (16)

కాలము భూతములను సృజించును. కాలము ప్రజలను సంహరించును కూడా. లోకములో అన్నియు కాలమునకు అధీనములైనవి కాలము దేనికిని అధీనము కాదు (17)

ప్రధానత్త్వము, పురుషుడు, మహత్తత్త్వము, అహంకారము, ఇతరములైన తత్త్వములు కూడా యోగియగు పరమాత్మ చేత కాలము ద్వారా పరస్పరము సమన్వయము చెందినవి (18)

ఆ పరమపురుషుని యొక్క శక్తి, సమస్త లోక స్వరూప, మాయ అను పేరుతో ప్రసిద్ధమైనది. (19)

మాయాత్మిక, సర్వాకారములు కలది, అతిపురాతనమైనది అగు నీ శక్తి పరమేశ్వరుని విశ్వరూపమును ఎల్లప్పుడు ప్రకాశింప జేయగలదు. (20)

ఆ దేవుని యొక్క మరికొన్ని శక్తులు ముఖ్యములైనవి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ప్రాణశక్తి అని మూడు నిర్మింపబడినవి. (21)

సర్వాసా మేవ శక్తీనాం శక్తిమాన్తో వినిర్మితాః | మాయయై వాధ విప్రేన్ద్రాః సా చానాది రనశ్వరా || || 22 ||

సర్వశక్త్యాత్మికా మాయా దుర్నివారా దురత్యయా | మాయావీ సర్వశక్తీశః కాలః కాలకరః ప్రభుః || || 23 ||

కరోతి కాలః సకలం సంహరే త్కాల ఏవ హి | కాలః స్థాపయతే విశ్వం కాలాధీన మిదం జగత్‌ || || 24 ||

లబ్ధ్వా దేవాధి దేవస్యసన్నిధిం పరమేష్ఠినః | అనన్త స్యాఖిలేశస్య శంభోః కాలాత్మనః ప్రభోః || || 25 ||

ప్రధానం పురుషో మాయా మాయా సైవ ప్రపద్యతే | ఏకా సర్వగతా సన్తా కేవలా నిష్కలాశివా || || 26 ||

ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఆ శక్తులన్నింటికి వానిని ధరించువారు కూడా సృజించబడిరి. అవి యన్నియు మాయచేతనే కల్పితములు. ఆ మాయకు ఆది లేదు. అంతము కూడా లేదు. (22)

ఆ మాయ సమస్త శక్తుల స్వరూపము కలది, వారించుటకు శక్యము కానిది, నాశము లేనిదైయున్నది. కాలము మాయ కలది, సర్వ శక్తులకు ప్రభువు - ఆ కాలమును చేయువాడు పరమాత్మ. (23)

సమస్తమును కాలము చేయుచున్నది. కాలమే అన్నిటిని నశింప చేయుచున్నది. కాలము ప్రపంచమును నిలుపు చున్నది. ఈ విశ్వమంతయు కాలమునకు వశ##మై యున్నది. (24)

దేవతలకు అధిపతియైన నాశము లేని వాడు, సమస్తమునకు ప్రభువు, కాలస్వరూపుడు, ప్రభువు, పరమేష్ఠియు నగు శివుని యొక్క సాన్నిధ్యము ను పొంది; (25)

ప్రధానతత్త్వము, పురుషుడు, మాయ అనునవి మూడు ముఖ్యతత్త్వములు. ఆ మాయ ఏకరూప, అన్నిటిని పొందినది, అంతము లేనిది. కేవలరూప, భేద రహిత, మంగళరూప అయినది (26)

ఏకా శక్తిః శివైకోపి శక్తి మా నుచ్యతే శివః | శక్తయః శక్తిమన్తో న్యే సర్వశక్తి సముద్భవాః || || 27 ||

శక్తిశక్తిమతోర్భేదం వదన్తి పరమార్థతః | అభేదం చాను పశ్యన్తి యోగిన స్తత్త్వచిన్తకాః || || 28 ||

శక్తయో గిరిజాదేవీ శక్తిమా నధ శజ్కరః | విశేషః కథ్యతే చాయం పురాణ బ్రహ్మవాదిభిః || || 29 ||

భోగ్యా విశ్వేశ్వరీ దేవీ మహేశ్వరపతివ్రతా | ప్రోచ్యతే భగవా న్భోక్తా కపర్డీ నీలలోహితః || || 30 ||

మన్తా విశ్వేశ్వరో దేవః శజ్కరో మన్మథాన్తకః | ప్రోచ్యతే మతి రీశానీ మన్తవ్యా చ విచారతః || || 31 ||

ఒకటే శక్తి శివ, శక్తి మంతుడు శివుడు ఒక్కడే అని చెప్పబడుచున్నది. ఇతరములైన శక్తులు, శక్తి మంతులు సర్వశక్తి నుండి జనించినవే. (27)

శక్తికి, శక్తి మత్తునకు పరమార్ధ రూపములో భేదమును చెప్పుదురు. తత్త్వమును విచారించు యోగులు మాత్రము ఆ రెండింటిక భేదమును చూచుచున్నారు. (28)

శక్తులు హిమవత్పుత్రిక యగు పార్వతి రూపములు శక్తిమంతుడు శంకరుడు. ఈ విశేషము బ్రహ్మవేత్తల చేత పురాణములందు చెప్పబడుచున్నది.

మహేశ్వరుని విషయమున పతివ్రత, విశ్వమునకు ప్రభ్వి అగుపార్వతీ దేవి భోగాను భవమునకు యోగ్యురాలు. కపర్దమను జటాజూటము కలవాడు, నీలలోహితుడునగు భగవంతుడగు శంకరుడు అనుభవించువాడు (భోక్త) అని చెప్పబడినది. (30)

మన్మథుని సంహరించిన వాడు, విశ్వమునకు ప్రభువు అగు శంకర దేవుడు మననము చేయువాడు, అతని భార్య పార్వతి, బుద్ధి రూపిణి, ఆలోచన వలన తెలిసికొనదగిన దని చెప్పబడుచున్నది (31)

ఇత్యేత దఖిలం విప్రాః శక్తి శక్తి మదుద్భవమ్‌ | ప్రోచ్యతే సర్వవేదేషు మునిభి స్తత్త్వదర్శిభిః || || 32 ||

ఏత త్ర్పదర్శితందివ్యం దేవ్యా మాహాత్మ్య ముత్తమమ్‌ | సర్వవేదాన్త వాదేషు నిశ్చితం బ్రహ్మవాదిభిః || || 33 ||

ఏకం సర్వగతం సూక్ష్మం కూటస్థ మచలం ధ్రువమ్‌ | యోగినస్తత్ర్పపశ్యన్తి మహాదేవ్యాః పరంపదమ్‌ || || 34 ||

ఆనన్ద మక్షరం బ్రహ్మ కేవలం నిష్కలం పరమ్‌ | యోగిన స్తత్ర్పపశ్యన్తి మహాదేవ్యాః పరంపదమ్‌ || || 35 ||

పరా త్వరతరం తత్త్వం శాశ్వతం శివ మచ్యుతమ్‌ | అనన్తప్రకృతౌ దేవ్యా స్తత్పరమం పదమ్‌ || || 36 ||

ఓ బ్రాహ్మణులారా! శక్తి, శక్తిమంతము అనువాని పుట్టుకకుసంబంధించిన యీ విషయమంతయు అన్ని వేదముల యందు ప్రతిపాదింపబడినదై, తత్త్వమును దర్శించిన మునులచే వివరింపబడినది. (32)

దివ్యము, ఉత్తమము అయిన ఈ దేవి యొక్క మహాత్మ్యము బ్రహ్మ వాదులైన ఋషుల చేత వేదాంత చర్చల యందు నిశ్చయింప బడి చక్కగా నిరూపించబడినది. (33)

అద్వితీయము, అంతట ఉన్నది, సూక్ష్మరూపము, మూలస్థానీయము, చలనము లేనిది, స్థిరమైనది యునగు దేవి యొక్క సర్వోన్నతస్థానమును యోగులు చూడగల్గుచున్నారు. (34)

ఆనందరూపము, నాశము లేనిది, కేవలము, భేదరహితము, పరబ్రహ్మరూపము అగు మహాదేవి యొక్క ఉన్నత పదమును యోగులు దర్శింతురు (35)

పరము కంటే మిక్కిలి పరమైనతత్త్వము, శాశ్వతమైనది, మంగళరూపము, నాశరహితము, అంతము లేని ప్రకృతి యందు లీనమైనది దేవి యొక్క ఆ పరమపదము. (36)

శుభం నిరఞ్జనం శుద్ధం నిర్గుణం ద్వైతవర్జితమ్‌ | ఆత్మోవలబ్దివిషయం దేవ్యా స్తత్పరమం పదమ్‌ || || 37 ||

సైషా ధాత్రీ విధాత్రీ చ పరమానన్ద మిచ్ఛతామ్‌ | సంసారతాపా సఖిలా న్నిహన్తీశ్వపరసంశ్రయాత్‌ || || 38 ||

తస్మా ద్విముక్తి మన్విచ్ఛన్‌ పార్వతీం పరమేశ్వరీమ్‌ | ఆశ్రయే త్సర్వభూతానా మాత్మభూతాం శివాత్మికామ్‌ || || 39 ||

లబ్ద్వాచ పుత్రీం శర్వాణీం తప స్త ప్త్వా సుదుశ్చరమ్‌ | సభార్యః శరణం యాతః పార్వతీం పరమేశ్వరీమ్‌ || || 40 ||

తాం దృష్ట్యా జాయమానాఞ్చ స్వేచ్ఛయైవ వరాననామ్‌ | మైనా హిమవతః పత్నీ ప్రాహేదం పర్వతేశ్వరమ్‌ || || 41 ||

దేవి యొక్క ఆ పరమపదము శుభకరము, మాలిన్యము లేనిది, నిర్మలమైనది, గుణరహితము, భేదశూన్యము, ఆత్మసాక్షాత్కారమునకు విషయమైనదైయున్నది. (37)

ఆ యీ దేవీ పరమానందమును పొందు వారికి ధాత్రి, విధాత్రి కూడా అగుచున్నది. ఈశ్వరుని సంబంధము వలన సమస్తములైన సంసార సంబంధతాపములను నశింప జేయుచున్నది. (38)

అందువలన మోక్షమును పొందగోరువాడు పరమేశ్వరియగు పార్వతిని, సర్వప్రాణులకు ఆత్మస్వరూపురాలు, శివస్వరూపిణి అగు నామెను ఆశ్రయించవలెను. (39)

హిమవంతుడు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసి, పార్వతిని పుత్రికగా పొంది, భార్యతో కూడిన వాడై పరమేశ్వరియైన ఆమెను శరణము పొందెను. (40)

తన ఇష్టపూర్వకముగా జన్మించుచున్న, శ్రేష్ఠమైన ముఖముకల పుత్రికను చూచి, హిమవంతుని భార్యమైనాదేవి పర్వతరాజుతో ఇట్లనెను (41)

మేనోవాచ :-

పశ్య బాలా మిమాం రాజ న్రాజీవసదృశాననామ్‌ | హితాయ సర్వభూతానాం జాతా చ తపసా వయోః || || 42 ||

సో పి దృష్ట్వా తతో దేవీం తరుణాదిత్యసన్నిభామ్‌ | కపర్దినీం చతుర్వక్త్రాం త్రినేత్రా మతిలాలసామ్‌ || || 43 ||

అష్టహస్తాం విశాలాక్షీం చన్ద్రావయవభూషణమ్‌ | నిర్గుణాం సగుణాం సాక్షాత్స దనద్వక్తి వర్జితామ్‌ || || 44 ||

ప్రణమ్య శిరసా భూమౌ తేజసాచాతి విహ్వలః | భీతః కృతాఞ్జలి స్తస్యాః ప్రోవాచ పరమేశ్వరీమ్‌ || || 45 ||

హిమవానువాచ: -

కాత్వం దేవి విశాలాక్షి! శశాజ్కావయవాజ్కితే | స జానే త్వా మహం వత్సే! యథావ ద్బ్రూహి పృచ్ఛతే || || 46 ||

మేనక పలికెను :-

రాజా! కమలముతో సమానమైన ముఖముకల యీ బాలికను చూడుము. మనయొక్క తపస్సు చేత, సమస్త ప్రాణుల యొక్క మేలు కొరకు గూడ ఈమె జన్మించినది (42)

ఆ హిమవంతుడు ఉదయించుచున్న సూర్యునితో సమానముగా నున్న, జటాజాటము కల, నాలుగు ముఖములు కలిగిన, మూడు కన్నులు కల, మిక్కిలి అనురాగము కలిగిన, ఎనిమిది చేతులు కలిగి విశాలమైన కన్నులు కలదై, చంద్ర కళ అలంకారముగా ధరించిన, గుణ రహిత, గుణ యుక్తయు, సత్తు అసత్తు అను విభాగము లేనటువంటి ఆ దేవిని చూచి, శిరస్సుతో భూమిపై వంగి నమస్కరించి, ఆమె తేజస్సుతో మిక్కిలి కలత చెందినవాడై, భయపడి ఆమెకు దోసిలి జోడించి పరమేశ్వరిని గూర్చి యిట్లు పలికెను. (43, 44, 45)

విశాలములైన కన్నులు కల ఓ దేవీ! నీవెవరవు? చంద్రుని భాగమైన కళతో అలంకరింపబడిన దానా! వత్సా! నీవెవరో నేనెఱుగను అడుగుచున్న నాకు యథార్థమును తెలుపుము. (46)

గిరీన్ద్ర వచనం శ్రుత్వా తతః సా పరమేశ్వరీ! వ్యాజహార మహాశైలం యోగినా మభయప్రదా || || 47 ||

శ్రీ దేవ్యువాచ:-

మాం విద్ధి పరమాం శక్తిం మహేశ్వరసమాశ్రయామ్‌ | అనన్యా మవ్యయా మేకాం యాం పశ్యన్తి ముముక్షవః || || 48 ||

అహం హి సర్వభావానా మాత్మా సర్వాత్మనా శివా | శాశ్వతైశ్వర్య విజ్ఞాన మూర్తిః సర్వప్రవర్తి కా || || 49 ||

అనన్తా నన్తమహిమా సంసారార్ణవతారిణీ | దివ్యం దదామి తే చక్షుః పశ్య మే రూప మైశ్వరమ్‌ || || 50 ||

ఏతావ దుక్త్వా విజ్ఞానం దత్వా హిమవతే స్వయమ్‌ | స్వం రూపం దర్శయామాస దివ్యం తత్పరమేశ్వరమ్‌ || || 51 ||

పర్వత రాజగు హిమవంతుని వాక్యమును విని, అప్పుడా పరమేశ్వరి, యోగులకు అభయము నిచ్చు నట్టిది, పర్వత రాజునుద్దేశించి ఇట్లు చెప్పెను. (47)

నన్ను మహేశ్వరుని ఆశ్రయించి యుండు పరమశక్తిగా తెలిసికొనుము. ఏ నన్ను, మోక్షమును కాంక్షించు వారు, ఇతరాపేక్షలేనిదానిగా, నాశరహితురాలిగా, ముఖ్యురాలిగా దర్శింతురో, అట్టిదానిగా గుర్తింపుము (48)

నేను లోకములోని అన్ని భాషములకు ఆత్మయగుదానను, అన్ని విధముల శివరూపను, శాశ్వతమైన ఐశ్వర్యము, విజ్ఞానము అకారముగా కలదానను, సమస్తమును ప్రవర్తింపజేయుదానను. (49)

అంతములేని, అనంతమహిమలు కలదానను, సంసారమను సముద్రమును దాటించుదానను. నీకు దివ్యమైన నేత్రమునిత్తును. నా యొక్క ఈశ్వర సంబంధి రూపమును దానితో చూడుము. (50)

ఇంత మాత్రము పలికి, హిమవంతునకు స్వయముగా విజ్ఞానమును కలిగించి, దివ్యమైన పరమేశ్వర సంబంధమైన, తన రూపమును చూపించెను. (51)

కోటి సూర్యప్రతీకాశం తేజోబిమ్బం నిరాకులమ్‌ | జ్వాలామాలా సహస్రాధ్యం కాలనాలశతోపమమ్‌ || || 52 ||

దంష్ట్రాకరాళం దుర్ధర్షం జటామణ్డలమణ్డితమ్‌ | కిరీటినం గదాహస్తం శంఖచక్రధరం తథా || || 53 ||

త్రిశూలవరహస్తం చ ఘోరరూపం భయానకమ్‌ | ప్రశాన్తం సౌమ్యవదన మనన్తాశ్చర్య సంయుతమ్‌ || || 54 ||

చన్ద్రావయవలక్ష్మాణం చన్ద్రకోటిసమప్రభమ్‌ | కిరీటినం గదాహస్తం నూపురై రుపశోభితమ్‌ || || 55 ||

శంఖచక్రధరం కామ్యం త్రినేత్రం కృత్తివాససమ్‌ ||

ఆదివ్యరూపము కోటి సూర్యుల సమాన తేజము కలది, వికారము లేనిది, వేల కొలది జ్వాలల పరంపరతో కూడినది, వందల కొలది కాలనాశికలతో పోల్చదగినదిగా నుండెను. (52)

దంష్ట్రలతో భయంకరమై, ఎదుర్కొన శక్యము కానిది, జటల సమూహముచే అలంకరించబడినది, కిరీటము కలది, చేతి యందు గధను ధరించినది, శంఖచక్రములను ధరించినదిగా నుండెను. (53)

త్రిశూలమును చేతియందు ధరించినది భయంకరమైన రూపము కలిగి భీతి గొలుపు చున్నది, ప్రశాంతముగా నున్నది, ప్రసన్నమైన ముఖము కలది, అంతులేని ఆశ్చర్యములతో కూడి యుండెను. (54)

చంద్ర కళ చిహ్నముగా ధరించినది, కోటిచంద్రులతో సమానమైన కాంతి కలది, కిరీటము కలిగి గదను చేతి యందు ధరించి నది, కాలి యందెలతో ప్రకాశించుచున్నది ఆ రూపము (55)

దివ్యములైన పుష్పహారములను, వస్త్రములను ధరించినది, శ్రేష్ఠమైన చందనము లేపనము చేయబడినది, శంఖచక్రములను ధరించినది, కోరదగినది, మూడు నేత్రములు కలది, చర్మము వస్త్రముగా కలిగి యున్నది ఆ రూపము. (56)

అండస్థం చాణ్డబాహ్యస్థం బాహ్య మాభ్యన్తరం పరమ్‌ | సర్వశక్తిమయం శుభ్రం సర్వాకారం సనాతనమ్‌ || || 57 ||

బ్రహ్మేన్ద్రోపేన్ద్రయోగీన్ద్ర ర్వంద్యమానపదామ్బుజమ్‌ | సర్వతః పాణిపాదాన్తం సర్వతో క్షిశిరోముఖమ్‌ || || 58 ||

సర్వ మావృత్య తిష్ఠన్తీం దదర్శ పరమేశ్వరీమ్‌ | దృష్ట్వాతదీదృశం రూపం దేవ్యా మహేశ్వరం పరమ్‌ || || 59 ||

భ##యేన చ సమావిష్టః స రాజా హృష్టమానసః | ఆత్మ న్యాధాయ చాత్మాన మోంకారం సమనుస్మరమ్‌ || || 60 ||

నామ్నా మష్ట సహస్రేణ తుష్టావ పరమేశ్వరీమ్‌ | || 61 ||

హిమవానువాచ:-

శివోమా పరమాశక్తి రనన్తా నిష్కలా మలా ||

అండములో నున్నది, అండమునకు వెలుపల నుండునది, బయట, లోపల కూడా నుండునది, ఉత్తమమైనది, అన్ని శక్తులతో కూడినది. నిర్మలమైనది, అన్ని ఆకారములు కలది, అతిపురాతనమైనది (57)

బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యోగీంద్రులు మొదలగు వారి చేత పూజింపబడు పాదకమలములు కలది, అన్ని వైపుల చేతులు, కాళ్లు వ్యాపించి యుండునది, అంతట కన్నులు, తలలు, ముఖములు కలది (58)

సమస్తము నావరించి ఉన్నటువంటి పరమేశ్వరిని హిమవంతుడు చూచెను. ఆ దేవి యొక్క మహేశ్వర సంబంధియగు శ్రేష్ఠమైన ఇటువంటి రూపమును చూచి, భయముతో కూడుకున్నవాడై ఆ రాజు సంతోషించిన మనస్సు కలవాడై ఆత్మను ఆత్మ యందు నిలుపుకొని ఓం కారమును స్మరించుచు, ఒక వేయి ఎనిమిది నామములతో పరమేశ్వరిని ఇట్లు స్తోత్రము చేసెను.

శివ, ఉమ, ఉత్తమమైన శక్తి, అంతము లేనిది, విభాగములు లేనిది, నిర్మలమైనది. (59, 60, 61)

శాన్తా మహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా | అచిన్త్యా కేవలానన్త్యా శివాత్మా పరమాత్మికా || || 62 ||

అనాది రవ్యయా శుద్ధా దేవాత్మా సర్వగా చలా | ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా || || 63 ||

మహామహేశ్వరీ సత్యా మహాదేవీ నిరఞ్జనా | కాష్ఠా సర్వాస్తర స్థాచ చిచ్ఛక్తి రతిలాలసా || || 64 ||

సన్దా సర్వాత్మికా విద్యా జ్యోతీ రూపా మృతాక్షరా | శాన్తిః ప్రతిష్ఠా సర్వేషాం నివృత్తి రమృతప్రదా || || 65 ||

వ్యోమమూర్తి ర్య్వోమలయా వ్యోమాధారా చ్యుతామరా | అనాదినిధనా మోఘా కారణాత్మా కులాకులా || || 66 ||

శాంతురాలు, మహేశ్వర సంబంధిని, నిత్యురాలు, శాశ్వత మైనది, ఉత్తమము, నాశరహితమైనది, విచారించుటకు శక్యము కానిది, కేవల రూపిణి, చివరిది కానిది, శివాత్మకురాలు, పరమాత్మ రూపిణి, మొదలు లేనిది, నాశము లేనిది, స్వచ్ఛమైనది, దేవతల కాత్మయైనది. అన్నిటిని చెందినది, చంచలమైనది, అద్వితీయమైనది, అనేక విభాగములు కలది, మాయకతీతమైనది, మిక్కిలి నిర్మలమైనది. (62, 63)

గొప్ప మహేశ్వరి, సత్యస్వరూప, మహాదేవి, మాలిన్యము లేనిది, దిగ్రూపము, అన్నిటియందు వ్యాపించియున్నది. జ్ఞానశక్తి రూప, మిక్కిలి ప్రీతి భావము కలది (64)

సంతోషమయి, అన్నిటి నాత్మగా కలది, విద్యారూపిణి, తేజోరూపము కలది, అమృత స్వరూప, అక్షర, శాంతి రూపిణి, అందరికి ప్రతిష్ఠాహేతువు, నివృత్తి కారిణి, అమృతమునిచ్చునది (65).

ఆకాశస్వరూప, ఆకాశమునందులయించునది, అకాశ##మే ఆధారముగా కలది, నాశనము లేనిది, మరణరహిత, ఆద్యంతములు లేనిది. సార్ధకయైనది, కారణరూపురాలు, వంశము కలది, వంశరహిత కూడ (66)

స్వతః ప్రథమజా నాభి రమృత స్యాత్మ సంశ్రయా | ప్రాణశ్వరప్రియా మాతా మహామహిష వాసినీ || || 67 ||

ప్రాణశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ | మహామాయా సుదుష్పూరా మూల ప్రకృతి రీశ్వరీ || || 68 ||

సర్వశక్తి కలాకారా జ్యోత్స్నాద్యౌర్మ హిమాన్మదా | సర్వకార్య నియన్త్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ || || 69 ||

సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా | సంసార పోతా దుర్వారా దుర్నిరీక్ష్యా దురాసదా || || 70 ||

ప్రాణశక్తిః ప్రాణవిద్యా యోగినీ పరమా కలా | మహావిభూతిదుర్ధర్షా మూలప్రకృతిసమ్భవా || || 71 ||

స్వయముగా మొదట జన్మించినది, అమృతమునకు నాభి వంటిది, ఆత్మకాశ్రయమైనది, ప్రాణశ్వరునకు ప్రియమైనది, తల్లి, గొప్పమహిషముపై వసించునది. (67)

ప్రాణములకు ఈశ్వరి, ప్రాణస్వరూపమైనది, ప్రధాన పురుషునకు ఈశ్వరియైనది, గొప్ప మాయారూపిణి, పురించుటకు మిక్కిలి శక్యము కానిది, మూలప్రకృతి, ఈశ్వరి అయినది (68)

సమస్తశక్తుల కళలు ఆకారముగా కలది, వెన్నెల, ఆకాశరూప, మహిమలకు స్థానమైనది, అన్ని కార్యములను నియమించునది. అన్ని ప్రాణుల ప్రభువులకు ప్రభ్వి అయినది. (69)

సంసారమునకు హేతుభూత, సర్వరూపిణి, అన్ని శక్తుల కుత్పత్తిస్థానము, సంసారమును దాటించువావ, వారించుటకు శక్యము కానిది చూచుటకు సాధ్యము కానిది, కష్టముతో పొందదగినది. (70)

ప్రాణములకు శక్తి యైనది, ప్రాణముల విద్య, యోగము కలది, గొప్ప కళారూపము, గొప్ప ఐశ్వర్యము చేత ఎదుర్కొనుటకు శక్యము కానిది, మూల ప్రకృతి నుండి జన్మించినది. (71)

అనాద్యసస్తవిభవా పరమా ద్వాపకర్షణీ | సర్గస్థీత్యస్తకరణీ సుదుర్వాచ్యా దురత్యయా || || 72 ||

శబ్దయోనిః శబ్దమయీ నాదాఖ్యా నాదవిగ్రహా | అనాది దవ్యక్తగుణా మహానన్దా సనాతనీ || || 73 ||

ఆకాశయోని ర్యోగస్థా మహాగీశ్వరేశ్యవరీ| మహామాయా సుదుష్పారా మూలప్రకృతి రీశ్వరీ || || 74 ||

ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా | పురాణా చిన్మయీ పుంసా మాదిపూరుషరూపిణీ || || 75 ||

భూతాస్తరస్థా కూటస్థా మహాపురుషసంజ్ఞితా | జన్మమృత్యజరాతీతా సర్వశక్తిసమన్వితా || || 76 ||

పుట్టుక లేనది, అనంతమైన వైభవము కలది, అన్నిటికి ప్రారంభ##మైనది, సృష్టి, స్థితిలయములను కల్గించునది, మాటలతో వర్ణించుటకు శక్యము కానిది, అతిక్రకమింప రానిది, అపకర్షముకను కలిగించునది. (72)

శబ్దమునకు కారణము, శబ్దమయము, నాదము పేరుగా కలది, నాదమే శరీరముగా కలది, ప్రారంభము లేనిది, వ్యక్తము కాని గుణములు కలది, గొప్ప ఆనందము కలది, అతిపురాతనమైనది (73)

ఆకాశము ప్రభవస్థానమైనది, యోగము నధిష్టించినది, గొప్పయోగేశ్వరులకు ప్రభ్వి, అధికమైన మాయలు కలది, మిక్కిలి అధిగమింప సాధ్యము కానిది, మూలప్రకృతి అయినది ఈశ్వరి (74)

ప్రధాన, పురుషుల కతీతురాలు, ప్రధాన పురుష స్వరూపురాలు, పురాతన, జ్ఞానమయి, పురుషులకు అదిపురుషస్వరూపిణి (75)

సర్వప్రాణులయం దంతర్యామి, మూలస్థానమందుండునది, మహాపురుష సంజ్ఞకలది, జననము, మరణము, వార్ధకము అనువాని కతీతురాలు, అన్ని శక్తులతో కూడి యున్నది. (76)

వ్యాపినీ చానవచ్ఛిన్నా ప్రధానానుప్రవేశినీ | క్షేత్రజ్ఞశక్తి రవ్యక్త లక్షణా మలవర్జితా || || 77 ||

అనాదిమాయాసంభిన్నా త్రితత్త్వా ప్రకృగ్రహా| మహామాయా సముత్పన్నా తామసీ పౌరుషీ ధ్రువా || || 78 ||

వ్యక్తావ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా ప్రసూతికా | అకార్యా కార్యజనీన నిత్యం ప్రసవధర్మిణీ || || 79 ||

సర్గప్రలయనిర్ముక్తా సృష్టి స్థిత్యస్తధర్మిణీ | బ్రహ్మగర్భా చతుర్వింశా పద్మనాభాచ్యుతాత్మికా || || 80 ||

వైద్యుతీ శాశ్వతీ యోని ర్జగన్మాతేశ్వరప్రియా | సర్వాధారా మహారూపా సర్వైశ్వ్ర్యసమన్వితా || || 81 ||

వ్యాపించియుండనది, దేనికిని బద్దురాలు కానిది, ప్రధాన తత్త్వము నందు ప్రవేశించునది, క్షేత్రజ్ఞశక్తి గలది, వ్యక్తము కాని లక్షణములు కలది, మాలిన్యము లేనిది (77)

అనాదిగా నున్న మాయ కతీతమైనది, మూడు తత్త్వములు కలది, ప్రకృతిని అధీన మందుంచుకొనునది, గొప్ప మాయనుండి అవతరించినది. తమో గుణము కలది, పౌరుషపతి, నిశ్చలయైనది. (78)

వ్యక్తావ్యక్త స్వరూపము కలది, నల్లనిది, ఎరుపురంగు, తెలుపు కలది, జననకారణము, కార్యభూతురాలు కానిది, కార్యములను పుట్టించునది, ఎల్లప్పుడు ప్రసవ కార్యమును కల్గించు స్వభావము కలది (79)

సృష్టి, ప్రళయములనుండి విడువబడినది, సృష్టి స్థితిలయములను చేయునది, బ్రహ్మము గర్భమున కలది, ఇరువది నాలుగు తత్త్వముల స్వరూపము కలది, కమలము నాభియందున్నది, విష్ణుస్వరూప. (80)

విద్యత్ర్ప భారూపిణి, శాశ్వతమైన మూలకారణము, లోకములకు మాత, ఈశ్వరునకు ప్రియురాలు, అన్నింటి కాధారమైనది, గొప్పరూపము కలది, అన్ని యైశ్వర్యములతో కూడినది. (81)

విశ్వరూపా మహాగర్భా విశ్వేశేచ్ఛానువర్తినీ | మహీయసీ బ్రహ్మయోనిః మహాలక్ష్మీసముద్భవా || || 82 ||

మహావిమానసమధ్యస్థా మహానిద్రాత్మహేతుకా | సర్వసాధారణీ సూక్ష్మా హ్యవిద్యా పార మార్థికా || || 83 ||

అనస్తరూపా నస్తస్థా దేవీ పురుషమోహినీ | అనేకాకారసంస్థానా కాలత్రయ వివర్జితా || || 84 ||

బ్రహ్మజన్మా హరేర్మూర్తి ర్ర్బహ్మ విష్ణు శివాత్మికా | బ్రహ్మేశవిష్ణుజననీ బ్రహ్మాఖ్యా బ్రహ్మసంశ్రయా || || 85 ||

వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహతీ బ్రహ్మరూపిణీ | వైరాగ్యైశ్వర్య ధర్మాత్మా బ్రహ్మమూర్తి ర్హ్రదిస్థితా || || 86 ||

ప్రపంచమే స్వరూపముగా కలది, గొప్ప గర్భము కలది, జగత్తునకు ప్రభువైన పరమేశ్వరుని ఇచ్ఛననుసరించి ప్రవర్తించునది, చాలా గొప్పతనముకలది, బ్రహ్మకు జన్మకారణమైనది, మహాలక్ష్మినుండి ఉద్భవించినది; (82)

పెద్ద విమానము యొక్క మధ్య భాగమందున్నది, మహానిద్రరూపమైనది, ఆత్మకారణముగా కలది, అందరికి సులభ##మైనది, సూక్ష్మరూప, అవిద్య పరమార్థముగా కలది; (83)

అనంతములైన రూపములుకలది, అనంతునిపై నివసించునది, పురుషులకు మోహింపజేయుదేవి, అనేకములైన ఆకారములు, సంస్థానములు కలది, మూడుకాలముల భేదములేనిది. (84)

బ్రహ్మమునుండి పుట్టినది, విష్ణువు యొక్క ఆకారము, బ్రహ్మవిష్ణు శివస్వరూప, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మకారణము, బ్రహ్మనామము కలది, బ్రహ్మము నాశ్రయించినది. (85)

వ్యక్తరూపముకలది, మొదట జనించినది, బ్రహ్మమయము, గొప్పనైనది, బ్రహ్మస్వరూపిణి, వైరాగ్యము, ఐశ్వర్యము, ధర్మము ఆత్మలుగాకలది, బ్రహ్మమూర్తి, హృదయమందుండునది. (86)

అపాం యోనిః స్వయమ్భూతి ర్మానసీ తత్త్వసమ్భనా | ఈశ్వరాణీ చ శర్వాణీ శంకరార్థశరీరణీ || || 87 ||

భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీ రథా మ్భికా | మహేశ్వరసముత్పన్నా భుక్తిముక్తి ఫలప్రదా || || 88 ||

సర్వేశ్వరీ సర్వసన్ద్యా నిత్యం ముదిత మానసా | బ్రహ్మేన్ద్రోపేన్ద్రనమితా శంకరేచ్ఛానువర్తినీ || || 89 ||

ఈశ్వరార్ధాసనగతా మహేశ్వరపతివ్రతా | సకృద్విఖాతా సర్వర్తి సముద్రపరిశోషిణీ || || 90 ||

పార్వతీ హిమవత్పుత్రీ పరమానన్ధదాయినీ | గుణాఢ్యా యోగజా యోగ్యా జ్ఞానమూర్తి ర్వకాసినీ || || 91 ||

జలములకు ఉత్పత్తి కారణము, స్వయముగా ఆవిర్భవించినది, మనస్సుకు గోచరమగునది, మూలతత్త్వమునుండి సంభవించినది. ఈశ్వరుని భార్య, శర్వాణి, శంకరుని సగము శరీరమును ధరించినది; (87)

భవాని, రుద్రాణి, మహాలక్ష్మి మరియు అంబికా రూపిణి, మహేశ్వరుని వలన జనించినది, భోగానుభవము, మోక్షము అను ఫలముల నిచ్చునది. (88)

సమస్తమునకు ప్రభ్వి, అందరిచే నమస్కరింపదగినది, ఎల్లప్పుడు సంతోషించు మనస్సు కలది, బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు అను వారిచేత నమస్కరింపబడునది, శంకరుని కోరిక ననుసరించి ప్రవర్తించునది; (89)

ఈశ్వరుని ఆసనములో సగభాగమును పొందినది, మహేశ్వరుని విషయములో పాతివ్రత్యమును ధరించునది, ఒక్కసారిగా ప్రకాశించునది, సర్వజనుల బాధలనెడి సముద్రమును శోషింపజేయునది. (90)

హిమంతుని పుత్రిక యగు పార్వతి గొప్ప ఆనందమును కలిగించునది, గుణములతో సంపన్నమైనది, యోగమువలన జనించినది, యోగ్యత కలది, జ్ఞాన స్వరూపురాలు, వికసించు స్వభావముకలది; (91)

సావిత్రీ కమలా లక్ష్మీః శ్రీ రసన్తోరసి స్థితా | సరోజనిలయా గజ్గా యోగనిద్రా7 సురార్దినీ || || 92 ||

సరస్వతీ సర్వ విద్యా జగజ్జ్యేష్ఠా సుమంగళా | వాగ్దేవీ వరదా వాచ్యా కీర్తి ః సర్వార్థసాధికా || || 93 ||

యోగీశ్వరీ బ్రహ్మవిద్యా మహావిద్యా సుశోభనా | గుహ్యవిద్యా త్మవిద్యా చ ధర్మ విద్యా త్మభావితా || || 94 ||

స్వాహా విశ్వమ్భరా సిద్ధిః స్వధా మేధా ధృతిః శ్రుతిః | నీతి ః సునీతిః సుకృతి ర్మాధవీ నరవాహనీ || || 95 ||

పూజ్యా విభావతీ సౌమ్యా భోగినీ భోగశాయినీ | శోభా చ శంకరీ లోలా మాలినీ పరమేష్టినీ || || 96 ||

త్రైలోక్యసున్దరీ కామచారిణీ | మహానుభావా సత్త్వస్థా మహామహిషమర్దినీ || || 97 ||

సావిత్రి, కమల, లక్ష్మి, నారాయణుని వక్షః స్థలమందున్న శ్రీదేవి, కమలము నివాసముగా కలది, గంగా రూపిణి, యోగనిద్ర,రాక్షసులను పీడించునది. (92)

సరస్వతి, అన్ని విద్యల సారము, ప్రపంచమునకు జ్యేష్ఠురాలు, మిక్కిలి మంగళరూప యైనది, వాక్కులదేవత, వరములనిచ్చునది, మాటలతోవర్ణింప దగినది,కీర్తి, అన్ని కార్యములను సాధించునది(93)

యోగులకు ప్రభ్వి,వేదాంత విద్యా స్వరూప, గొప్పవిద్య, మిక్కిలి మంగళకారి, రహస్య విద్య, ఆత్మ విద్యారూపిణి, ధర్మవిద్య ఆత్మయందు భావింపబడునది. (94)

స్వాహా, విశ్వమును భరించునది, సిద్ధిరూప, స్వధ, మేధ, ధృతి, శ్రుతి, నీతి, సునీతి, సుకృతి, మాధవుని పత్ని, నరవాహనముకలది. (95)

పూజింపదగినది, తేజస్సు కలది, సాధు స్వరూప, భోగముకలది, సర్పముపై శయనించునది, సౌందర్య రూప, శంకరి, చంచల, మాలను ధరించునది, పరమేష్ఠిని. (96)

ముల్లోకముల యందు అందమైనది, నమస్కరింపదగినది, సుందర రూపిణి, ఇష్టనుసారము చరించునది, మహానుభావురాలు, సత్త్వగుణము నందునిలిచినది, మహిషాసురుని మర్దించినది. (97)

పద్మనాభా పాపహరా విచిత్రముకుటాంగదా | కాన్తా చిత్రామ్భరధరా దివ్యాభరణభూషితా || || 98 ||

హంసాఖ్యా వ్యోమనిలయా జగత్సృష్టివివర్ధినీ | నియన్త్రీ యస్త్రమధ్యస్థా నన్దినీ భద్రకాలికా || || 99 ||

ఆదిత్యవర్ణా కౌబేరీ మయురవరవాహనా | వృషాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా || || 100 ||

అదితి ర్నియతా రౌద్రా పద్మగర్భా వివాహనా | నిరూపాక్షీ లేలిహానా మహాసురవినాశినీ || || 101 ||

మహాఫలా నవద్యాజ్గీ కామరూపా విభావరీ | విచిత్రరత్నముకుటా ప్రణతార్తిప్రభఞ్జనీ || || 102 ||

కమలము నాభియందు కలది, పాపములను తొలగించునది, విచిత్రములైన కిరీటము, అంగదములు కలది, మనోహర, విచిత్ర వస్త్రములను ధరించునది, శ్రేష్ఠములైన ఆభరణములతో అలంకరింప బడునది. (98)

హంస పేరుకలది, ఆకాశ నివాసిని, ప్రపంచము యొక్క సృష్టిని పెంపొందించునది, నియమించునది, యంత్ర మధ్యములో నుండునది, సంతోష పరచునది, భద్రకాళి స్వరూప. (99)

సూర్యునివంటి కాంతి కలది, కుబేరునికి సంబంధించినది, శ్రేష్ఠమైన నెమలి వాహనము కలది, వృషభాసనమును పొందినది, గౌరి, మహాకాళి, దేవతలచే పూజింపబడునది.(100)

అదితి, నియమముకలది, రౌద్రస్వరూప, పద్మము గర్భమునందుకలది, పక్షివాహన, విరూపాక్షి ఆస్వాదించునది. గొప్పరాక్షసులను నశింప జేయునది. (101)

గొప్ప ఫలము కలది, దోషరహిత శరీరము కలది, స్వేచ్ఛారూపమును ధరించునది, రాత్రి స్వరూపిణి, అద్భుతములైన రత్నముల కిరీటముకలది, ఆశ్రయించినవారికి బాధలను తొలగించునది. (102)

కౌశికీ కర్షణీ రాత్రి స్త్రిదశార్తివినాశినీ | బహురూపా స్వరూపా చ విరూపా రూప వర్జితా || || 103 ||

భక్తా ర్తిశషునీ భవ్యా భవతాపవినాశినీ | నిర్గుణా నిత్యవిభవా నిస్సారా నిరపత్రపా || || 104 ||

తపస్వినీ సామగీతి ర్భవాంకనిలయాలయా | దీక్షా విద్యాధరీ దీప్తా మహేన్ద్రవినిపాతినీ || || 105 ||

సర్వాతిశాయినీ విశ్వా సర్వసిద్ధి ప్రదాయినీ | సర్వేశ్వరప్రియా భార్యా సముద్రాన్తరవాసినీ || || 106 ||

అకలంకా నిరాధారా నిత్యసిద్ధా నిరామయా | కామధేను ర్బృహద్గర్భా ధీమతీ మోహనాశినీ || || 107 ||

కౌశికి, కర్షణము చేయునది, రాత్రిరూప, దేవతల ఆర్తిని నశింపజేయునది, అనేకరూపములు కలది, నిజరూపము కలది, రూపము లేనిది, రూపము చే విడువబడినది. (103)

భక్తుల ఆపదలను పోగొట్టునది, భవ్యురాలు, సంసారతాపమును నశింపజేయునది, గుణములు లేనిది, శాశ్వత వైభవము కలది, సారములేనిది, లజ్జారహితయైనది (104)

తపస్సుకలది, సామగానరూప, శంకరుని అంకము నివాసముగా కలది, నాశములేనిది, దీక్ష, విద్యలనుధరించునది, ప్రకాశించునది, మహేంద్రుని పదవి నుండి తొలగించునది. (105)

అన్నిటిని అతిశయించునది, ప్రపంచరూప, అన్ని సిద్ధులను ఇచ్చునది, సర్వేశ్వరునకు ప్రియమైన భార్య, సముద్ర మధ్యమునందు నివసించునది, (106)

కలంకములేనిది, ఆధార రహితమైనది, శాశ్వత సిద్ధికలది, రోగబాధలేనిది, కామధేనువు, పెద్ద గర్భముకలది, బుద్ధి కలది, మోహమును నశింప జేయునది. (107)

నిఃసంకల్పా నిరాతఙ్కా వినయా వినయప్రియా | జ్వాలామాలాసహస్రాఢ్యా దేవదేవీ మనోమయీ || || 108 ||

మహాభగవతీ భర్గా వాసుదేవసముద్భవా | మహేన్ద్రోపేన్ద్ర భగినీ భక్తిగమ్యా పరావరా || || 109 ||

జ్ఞానజ్ఞేయా జరాతీతా వేదాస్తవిషయా గతిః | దక్షిణా దహతీ దీర్ఘా సర్వభూతనమస్కృతా || || 110 ||

యోగమాయా విభాగజ్ఞా మహామోహా గరీయసీ | సన్ధ్యా సర్వసముద్భూతి ర్బ్రహ్మవిద్యాశ్రయాదిభిః || || 111 ||

బీజాఙ్కురసముద్భూతి ర్మహాశక్తి ర్మహామణి ః | క్షాన్తి ః ప్రజ్ఞా చితిః సచ్చి న్మహాభోగీన్ద్రశాయినీ || || 112 ||

సంకల్పరహిత, భయములేనిది, వినయస్వరూప, వినయమునందుప్రీతికలది, వేలకొలది జ్వాలా పరంపరతో కూడినది, దేవులకు దేవి, మనోమయ స్వరూప (108)

మిక్కిలి పూజనీయురాలు, భర్గ, వాసుదేవునివలన జనించినది, మహేంద్రునకు, ఉపేంద్రునకు సోదరి, భక్తిచేత పొంద దగినది, ఉత్తమ న్యూనరూపమైనది. (109)

జ్ఞానముచేత తెలియదగినది, జరకు అతీతమైనది, వేదాంతమునకు విషయమైనది, గమ్యము, దక్షిణ, దహించునది, పొడవైనది, అందరు ప్రాణులచేత నమస్కరింపబడునది. (110)

యోగమాయ, విభాగములను తెలిసినది, గొప్పమోహముకలది, మిక్కిలి గొప్పది, సంధ్యారూప. అన్నిటికి ఉత్పత్తి స్ధానము, ఆశ్రయాదుల చేత బ్రహ్మవిద్యవంటిది. (111)

బీజముల అంకురములకు జన్మస్థానము, గొప్పశక్తిరూప, గొప్ప బుద్ధికలది, క్షమాస్వరూప, స్వయంప్రకాశము, జ్ఞానాత్మక, సత్యజ్ఞానరూప, పెద్దసర్పరాజుపై శయనించునది. (112).

వికృతిః శాజ్కరీ శన్తి ర్గణగస్థర్వసేవితా | వైశ్యసరీ మహాశాలా మమాసేనా గుహా ప్రియా || || 113 ||

మహారాత్రి ః శివానన్దా శచీ దుఃస్వప్ననాశినీ | ఇజ్యా పూజ్యా జగద్ధాత్రీ దుర్వినేయా సురూపిణీ || || 114 ||

తపస్వినీ సమాధిస్థా త్రినేత్రా దివి సంస్థితా | గుహామ్బికా గుణోత్పత్తి ర్మహాపీఠా మరుత్సుతా || || 115 ||

హవ్యహవాస్తరాగాదిః హవ్యవాహసముద్భవా | జగద్యోని ర్జగన్మాతా జన్మమృత్యు జరాతిగా || || 116 ||

బుద్ది ర్మహాబుద్ధిమతీ పురుషాన్తరవాసినీ | తరస్వినీ సమాధిస్థా త్రినేత్రా దివిసంస్థితా || || 117 ||

వికార రూప, శంకర సంబంధిని, శాంతి, గణములచే, గంధర్వులచే సేవింపబడునది, అగ్నిహోత్ర స్వరూప, గొప్పశాల మహాసేనకలది, కుమారస్వామికిష్టమైనది. (113).

దీర్ఘరాత్రి, శివునకానందము కలిగించునది, శచీదేవి చెడ్డకలలను నశింపజేయునది, హోమము, పూజచేయదగినది, జగత్తుధరించునది, కష్టముచే తెలిసికొనదగినది, చక్కని రూపముకలది. (114).

తపస్సు చేయునది, సమాధియుందున్నట్టిది, మూడు కన్నులుకలది, స్వర్గమందుండునది, గుహునకు తల్లి, గుణములకుత్పత్తి స్థానము, గొప్పపీఠముకలది, మరత్తుకు పుత్రిక. (115).

హవ్యవాహుని యందంతమగు రాగాదులుకలది, అగ్నహోత్రుని నుండి పుట్టినది, ప్రపంచమునకు కారణభూత, జగత్తులకు తల్లి , జననమరణ జరలనతిక్రమించినది. (116)

బుద్ధిరూప, గొప్పబుద్ధి కలది, జీవుల హృదయములందుండునది, వేగముకలది, సమాధియందుండునది, మూడు నేత్రములు కలది, స్వర్గలోకము నందుండునది. (117).

సర్వేన్ద్రియమనోమాతా సర్వభూత హృది స్థితా | సంసారతారిణీ విద్యా బ్రహ్మవాదిమనోలయా || || 118 ||

బ్రహ్మాణీ బృహతీ బ్రహ్మీ బ్రహ్మభూతా భవారణీ | హిరణ్మయీ మహారాత్రిః సంసారపరివర్తికా || || 119 ||

సుమాలినీ సరూపా చ భావినీ హారిణీ ప్రభా | ఉన్మీలనీ సర్వసహా సర్వప్రత్యయసాక్షిణీ || || 120 ||

సుసౌమ్యా చన్ద్రవదనా తాణ్దవాసక్తమానసా | సత్త్వశుద్ధికరీ శుద్ధి ర్మలత్రయవినాశినీ || || 121 ||

జగత్ర్పియా జగన్మూర్తి స్త్రిమూర్తి రమృతాశ్రయా | నిరాశ్రయా నిరాహారా నిరంకుశ పదోద్భవా || || 122 ||

అన్ని ఇంద్రియములకు, మనస్సుకు తల్లి వంటిది, సమస్త ప్రాణుల హృదయములందుండునది, సంసారమునందుడి తరింపజేయు విద్య, బ్రహ్మవాదుల మనస్సులందు లీనమైయుండునది.(118).

బ్రహ్మకు సంబంధించినది, విస్తార రూపముకలది, బ్రహ్మమయము, బ్రహ్మస్వరూప, సంసార బంధమునకు అరణి వంటిది, హిరణ్మయరూప, మహారాత్రి, సంసారమును పరిణమింపజేయునది. (119).

చక్కని మాలను ధరించినది, మంచిరూపముకలది, భావించునది, హరించునది, కాంతి స్వరూప, వికసించునది, అన్నిటిని సహించునది, సమస్త ప్రత్యయములకు సాక్షిణి. (120).

మిక్కిలి సౌమ్యరూప, చంద్రుని వంటి ముఖముకలది, తాండవ మందాసక్తమైన మనస్సుకలది, సత్వశుద్ధి కలిగించునది, శుద్ధిస్వరూప, మూడువిధముల మాలిన్యాన్ని నశింపజేయునది. (121).

లోకములకు ప్రియమైనది, ప్రపంచమే ఆకారముగా కలది, మూడు మూర్తులు కలది, అమృతమునకాశ్రయమైనది, ఆధారము లేనిది, ఆహారములేనిది, నిరంకుశ స్థానము ఉత్పత్తిగాకలది; (122).

చన్ద్రహస్తా విచిత్రాజ్గీ స్రగ్విణీ పద్మధారిణీ |పరావరవిధానజ్ఞా మహాపురుషపూర్వజా || || 123 ||

విశ్వేశ్వరప్రియా విద్యు ద్విద్యుజ్జిహ్వా జితశ్రమా | విద్యామయీ సహస్రాక్షీసహస్రవదనాత్మజా || || 124 ||

సహస్రరశ్మిః సత్త్వస్థా మహేశ్వరపదాశ్రయా | క్షాలినీ మృణ్మయీ న్యాప్తా తైజసీ పద్మబోధికా || || 125 ||

మహామాయాశ్రయా మాన్యా మహదేవమనోరమా | వ్యోమలక్ష్మీః సింహరథా చేకితానా మితప్రభా || || 126 ||

వీరేశ్వరీ విమానస్థా విశోకా శోకనాశినీ | అనాహతా కుణ్డలినీ నలినీ పద్మభాసినీ || || 127 ||

చంద్రుడు హస్తమందుకలది, విచిత్రమైన శరీరముకలది, పుష్పహరమును ధరించినది, కమలమును ధరించినది, పర - అపర విధానములను తెలిసినది, మహాపురుషునికి పూర్వమందు పుట్టినది. (123).

విశ్వేశ్వరునకు ప్రియమైనది, మెరుపుతీగరూపమైనది, విద్యుత్తునాలుకగా కలది, శ్రమను జయించినది, విద్యలమయమైనది, అనంతమైన కన్నులు కలది, అనంతముఖములు కలది, స్వయముగా అవతరించినది. (124).

వేలకొలది కిరణములు కలది, సత్త్వము నందున్నది, మహేశ్వరస్థానమునాశ్రయించినది. క్షాళన చేయునది, మృత్తికామయ, వ్యాపించి యున్నది, తేజోమయి పద్మములను వికసింపజేయునది, (125).

గొప్ప మాయనాశ్రయించినది. పూజింపదగినది, మహాదేవుని మనస్సును రంజింపజేయునది, ఆకాశలక్ష్మి సింహమువాహనముగా కలది, అమితమైన కాంతికలది, అధికజ్ఞానము కలది. (126).

వీరేశ్వరి, విమానమందుండునది, శోకములేనిది, శోకమునునశింపజేయునది, అనాహతయోగరూప, కుండలిని, కమలముకలది, పద్మమువలె ప్రకాశించునది. (127).

సదాసన్దా సదాకీర్తిః సర్వభూతాశ్రయస్థితా | వాగ్దేవతా బ్రహ్మకలా కలాతీతా కలారణీ || || 128 ||

బ్రహ్మశ్రీ ర్ర్బహ్మహృదయా బ్రహ్మవిష్ణుశివప్రియా | వ్యోమశక్తిః క్రియాశక్తి జ్ఞానశక్తిః పరాగతి ః || || 129 ||

క్షోభికా బన్థికా భేద్యా భేదాభేదవివర్జితా | అభిన్నా భిన్నసంస్థానా వశినీ వంశహారిణీ || || 130 ||

గుహ్యశక్తి ర్గుణాతీతా సర్వదా సర్వతోముఖీ | భగినీ భగవత్పత్నీ సకలా కాలహారిణీ || || 131 ||

సర్వవిత్‌ సర్వతోభద్ర గుహ్యాతీతా గుహావలి ః | ప్రక్రియా యోగమాతా చ గజ్గా విశ్వేశ్వరేశ్వరీ || || 132 ||

ఎల్లప్పుడు ఆనందముతో కూడినది, శాశ్వతకీర్తికలది, సమస్తభూతముల కాశ్రయస్థానముగా నున్నది, వాగ్రూపమైన దేవత, బ్రహ్మయొక్క కళ, కళల కతీతమైనది. (128).

బ్రహ్మము యొక్క సంపద, బ్రహ్మహృదయమునగలది, బ్రహ్మవిష్ణుశివులకు ముగ్గురికి ఇష్టమైనది, ఆకాశ శక్తిరూపిణి, క్రియా శక్తి, జ్ఞానరూపశక్తి, సర్వోత్తమమైన ప్రాప్యస్థానము, (129)

క్షోభము కలిగించునది, మంధించునదడి, భేదించుటకు శక్యము కానిది, భేదము - అభేదము అనువానిచే విడువబడినది, భిన్నముకానిది, భిన్నములైన సంస్థానములకలది, వశమునందున్నది, వంశమును హరించునది, (130).

రహస్యశక్తిరూప, గుణత్రయమునకతీతురాలు, అన్నిటినిచ్చునది. అన్నివైపుల ముఖముకలది, ఐశ్వర్యము కలది, భగవంతుని భార్య కళలతో యుక్తమైనది, కాలుని నశింపజేయునది. (131).

అన్నివిషయములు తెలిసినది, అంతట భద్రము కలది, రహస్యములకతీతమైనది, గుహల సమూహముకలది, ప్రకృష్టమైనక్రియ, యోగమాత, గంగారూప, విశ్వేశ్వరుని పత్ని, (132).

కలిలా కపిలా కాన్తా కమలాభా కలాన్తరా | పుణ్యా పుష్కరిణీ భోక్త్రీ పురన్దరపురస్సరా || || 133 ||

పోషిణీ పరమైశ్వర్యభూతిదా భూతిభూషణా | పఞ్చబ్రహ్మసముత్పత్తి ః పరమార్థా ర్థవిగ్రహా || || 134 ||

ధర్మోదయా భానుమతీ యోగిజ్ఞేయా మనోజవా | మనోరమా మనోరస్కాతాపసీ వేదరూపిణీ || || 135 ||

వేదశక్తి ర్వేదమాతా వేదవిద్యా ప్రకాశినీ | యోగీశ్వరేశ్వరీ మాతా మహాశక్తి ర్మనోమయీ || || 136 ||

విశ్వావస్థా వియస్మూర్తి ర్విద్యున్మాలా విహాయసీ | కిన్నరీ సురభీ విద్యా నన్దినీ నన్డవల్లభా || || 137 ||

భారతీ పరమానన్దా పరాపరవిభేదికా | సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ || || 138 ||

సమూహరూప, కపిల వర్ణముకలది, మనోహరమైనది, పద్మము వంటికాంతికలది, కళల యొక్క విశేషముకలది, పుణ్యురాలు, తామరపూవును ధరించినది, భుజించునది, ఇంద్రునకు ముందు నడచునది, (133)

పోషించునది, గొప్ప ఐశ్వర్యము నిచ్చునది, భూతియే అలంకారముగాకలది, అయిదుగురు బ్రహ్మలకుత్పత్తి కారణము, పరమార్థ భూతురాలు, అర్థ శరీరము కలది, (134)

ధర్మము యొక్క ఉదయము కలది, కిరణములు కలది, యోగులచే తెలిసికొనదగినది, మనస్సు యొక్క వేగముకలది, మనస్సును రమింప జేయునది, తాపసరూపిణి, వేదస్వరూపురాలు. (135).

వేదముల శక్తిరూపిణి, వేదములకు తల్లి వంటిది, వేదవిద్యలను ప్రకాశింప జేయునది, యేగేశ్వరులకు ప్రభ్వి, గొప్పశక్తికల మనోమయియగు తల్లి, (136)

విశ్వము యొక్క అధిష్ఠానము, ఆకాశ రూపిణి, విద్యుత్తుల మాలవంటిది, వ్యాపించి యుండున్నది, కిన్నరి, సురభి స్వరూప విద్యాదేవత, నందిని, నందికి ప్రీతిపాత్రురాలు, (137).

భారతి, గొప్ప ఆనందరూపిణి, పరము అపరము అనువానిని భేదింప జేయునది, అన్ని ఆయుధాములతో కూడినది, కోరదగినది, కామేశ్వరునకు పత్నియైనది, (138)

అచిన్త్యా నస్తవిభవా భూలేఖా కనక ప్రభాః కూష్మాణ్దీ ధనరత్నాఢ్యా సుగన్థా గన్థదాయినీ || || 139 ||

త్రివిక్రమపదోధ్యూతా ధనుష్పాణిః శివోదయా | సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పిఙ్గలలోచనా || || 140 ||

శాన్తిః ప్రభావితీ దీప్తి ః పఙ్కజాయతలోచనా | ఆద్యాభూః కమలోద్భూతా గవాం మాతా రణప్రియా || || 141 ||

సత్ర్కియా గిరిశా శుద్ది ర్నిత్యపుష్టా నిరస్తరా | దుర్గా కాత్యాయనీ చణ్డీ చర్చితఙ్గీను సువిగ్రహా || || 142 ||

హిరణ్యవర్ణా జగతీ జగద్యన్త్రప్రవర్తికా | మన్దరాద్రినివాసాచ గరహా స్వర్ణమాలినీ || || 143 ||

ఆలోచించుటకు శక్యము కానిది, అనంతమైన విభవముకలది, భూమి యొక్క రేఖవంటిది బంగారము వంటి కాంతి కలది, కూష్మాండరూపిణి, ధనరత్నములతో సంపన్నమైనది, మంచి గంధము కలది, పరిమళము నిచ్చునది. (139).

త్రివిక్రముని పాదమునుండి పుట్టినది, ధనుస్సు చేతియందు కలది, మంగళకరమైన ఉదయము కలది, మిక్కిలి క్లేశముతో పొంద దగినది, ధనమునకధిపతి, ధన్యురాలు, పింగళ వర్ణపు కన్నులు కలది, (140).

శాంతిరూప, కాంతి కలది, తేజస్వరూప, పద్మముల వలె విశాలమైన కన్నులు కలది, మొదటి స్థానము, కమలమునుండి జన్మించినది, గోవులకు తల్లి, రణము నందు ప్రీతి కలది, (141).

మంచి అనుష్ఠానముకలది, గిరిశమున, శుద్దిరూప, ఎల్లప్పుడు పుష్పములు కలిగి యుండునది, భేదము లేనిది, దుర్గ, కాత్యాయని, చండి, అలంకృత శరీరముకలది, చక్కని విగ్రహము కలది. (142).

బంగారు రంగుకలది, లోకరూపిణి, ప్రపంచమను యంత్రమును నడుపునది, మందరపర్వతము నివాసముగా కలది, విషమును హరించునది, సువర్ణమాల ధరించునది. (143).

రత్నమాలా రత్నగర్భా పుష్టిర్విశ్వప్రమాధినీ | పద్మనిభా పద్మనాభా నిత్యరుష్టా7 మృతోద్భనా || || 144 ||

ధున్వతీ దుష్ప్రకమ్పాచ సూర్యమాతా దృషద్వతీ | మహేన్ద్రభగినీ సౌమ్యా వరేణ్యా వరదాయికా || || 145 ||

కల్యాణీ కమలావాసా పఞ్చచూడా వరప్రదా | వాచ్యా మరేశ్వరీ విద్యా దుర్జయా దురతి క్రమా || || 146 ||

కాలరాత్రి ర్మహావేగా వీరభద్రప్రియా హితా | భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ || || 147 ||

కరాలా పింగలాకారా కామభేదా మహాస్వనా | యశస్వినీ యశోదా చ షడద్వపరివర్తికా || || 148 ||

రత్నముల మాలను ధరించినది, రత్నములు గర్భమందు కలది, బలము కలిగించునది, విశ్వమును నిగ్రహించునది, కమలము నాభియందు కలది, పద్మముతో సమానమైనది, ఎల్లప్పుడు కోపించునది, అమృతము నుండి జనించినది, (144).

కంపింప జేయునది, ఇతరులచే కంపింప జేయరానిది, సూర్యునకు తల్లి, మహేంద్రునకు సోదరి, సాధుస్వభావము కలది, శ్రేష్ఠురాలు, వరముల నిచ్చునది, (145).

మంగళరూపిణి, కమలము నివాసముగా కలది, అయిదు శిఖలు కలది, వరముల నిచ్చునది, వర్ణించదగినది, దేవతలకు ప్రభ్వి, విద్యారూపిణి, జయించుటకు శక్యము కానిది, అతి క్రమించరానిది, (146).

ప్రళయ రాత్రి వంటిది, గొప్పవేగము కలది, వీరభద్రునకు ఇష్టురాలు, హితురాలు, భద్రమును కలిగించు కాళీదేవి, లోకములకు తల్లి, భక్తులకు శుభముల నిచ్చునది, (147).

భయంకర రూపము కలది, పింగళ వర్ణపు ఆకారము కలది, మన్మధుని భేదించినది, గొప్ప ధ్వని కలది, కీర్తికలది, కీర్తిని ఇచ్చునది, ఆరు మార్గములను ప్రవర్తింప జేయునది, (148).

శంఖినీ పద్మినీ సాంఖ్యా సాంఖ్యయోగ ప్రవర్తికా | చైత్రా సంవత్సరారూఢా జగత్సమ్పూరణీ ధ్వజా || || 149 ||

శమ్భారిః ఖేచరీ స్వస్థా కమ్బుగ్రీవా కలిప్రియా | ఖగధ్వజా ఖగారూఢా వారాహీ పూగమాలినీ || || 150 ||

ఐశ్వర్యపద్మనిలయా విరక్తా గరుడాసనా | జయన్తీ హృద్గుహాగమ్యా గహ్వరోష్ఠా గణాగ్రణీ ః || || 151 ||

సంకల్పసిద్ధా సామ్యస్థా సర్వవిజ్ఞానదాయినీ | కలిః కల్కవిహన్త్రీ చ గుహ్యోపనిష దుత్తమా || || 152 ||

నిష్ఠా దృష్టిః స్మృతిర్వ్యాప్తిః పుష్టి స్తుష్టిః క్రియావతీ | విశ్వామరేశ్వరేశానా భుక్తి ర్ముక్తిః శివామృతా || || 153 ||

శంఖమును ధరించినది, కమలముకలది, సాంఖ్యరూప, సాంఖ్యయోగమును ప్రవర్తింప జేయునది, చైత్రరూప, సంవత్సరమునధిరోహించునది, లోకములను పరిపూర్ణము చేయునది, ధ్వజరూపిణి, (149).

శుంభరాక్షసునకు శత్రువు, ఆకాశసంచారిణి, స్వస్థురాలు, శంఖము వంటిమెడ కలది, కలిపురుషునకిష్టమైనది, పక్షిధ్వజముగాకలది, పక్షి వాహనముకలది, పరాహరూపిణి, పోకలమాల ధరించునది, (150).

ఐశ్వర్యరూప పద్మము నివాసముగా కలది, వైరాగ్యము కలది, గరుడుడు వాహనముగా కలది, జయించునది, హృదయమను గుహయందు పొందదగినది, గుహవంటి పెదవులు కలది, గణమునకు అధీశ్వరురాలు. (151).

సిద్ధించిన సంకల్పములు కలది, సమభావమున నిలిచి యుండునది, సమస్తవిజ్ఞానముల నందించునది, శూరురాలు, పాపమును నశింపజేయునది, రహస్యములైన ఉపనిషత్తులలో చెప్పబడుశ్రేష్ఠురాలు. (152).

నిష్ఠారూపిణి, జ్ఞానరూప, స్మరణము, వ్యాప్తి, పుష్టి, తుష్టి, అనుష్ఠానము కలది, ప్రపంచమునకు , దేవేంద్రునకు గూడ అధికారిణి, భుక్తి ముక్తి కలిగించునది, మంగళరూప, అమృత స్వరూపిణి. (153)

లోహితా సర్పమాలచ భీషణీ వనమాలినీ | అనన్తశయనా సన్తా నరనారాయణోద్భవా || || 154 ||

నృసింహీ దైత్యమథనీ శంఖచక్రగదాధరా | సంకర్షణీ సముత్పత్తి రమ్బికాపాదసంశ్రయా || || 155 ||

మహాజ్వాలా మహామూర్తి ః సుముర్తిః సర్వకామధుక్‌ | శుభ్రా చ సుస్తనా గౌరీ ధర్మకామార్థమోక్షదా || || 156 ||

భ్రూమధ్య నిలయా పూర్వా పురాణపురుషారణిః | మహావిభూతిదా7 మధ్య సరోజనయనా సమా || || 157 ||

అష్టాదశభుజా నాద్యా నీలోత్పలదల ప్రభా | సర్వశక్త్వాసనారుఢా ధర్మాధర్మ వివర్జితా || || 158 ||

ఎఱ్ఱనిది, సర్పముల మాలను ధరించినది, భయంకరమైనది, వనమాలను తాల్చినది, అనంతుడు శయ్యగా కలది, నాశములేనిది, నరనారాయణుల వలన పుట్టుకకలది. (154).

నరసింహాకారముకలది, రాక్షసులను మధించునది, శంఖచక్రములను గదను ధరించునది శత్రువులను జయించునది, జగత్తుకు మూలకారణము, మాతృరూప, తనపాదములే లోకమునకాశ్రయముగా కలది. (155)

గొప్పతేజస్సుకలది, దివ్యమైన ఆకారముకలది, చక్కని రూపము కలది, అన్ని కోరికలను ఇచ్చునది. నిర్మలమైనది, సుందరమైన స్తనములు కలది, సూర్యునకు సంబంధించినది, ధర్మకామార్థములను మోక్షమును ఇచ్చునది. (156)

కనుబొమల మధ్య వసించునది, మొట్టమొదటిది, పురాణపురుషునకు అరణి వంటిది, గొప్పవిభూతి నిచ్చునది, మధ్యస్థురాలు, కమలములవంటి కన్నులు కలది, సాటిలేనిది. (157).

పదునెనిమిది భుజములు కలది, పుట్టుకలేనిది, నల్లకలువ రేకులవంటి కాంతి కలది, సమస్త శక్తులనెడు ఆసనములనధిరోహించునది. ధర్మాధర్మవిభేదమునకు దూరమైనది. (158).

వైరాగ్యజ్ఞాననిరతా నిరాలోకా నిరిన్ద్రియా | విచిత్రగహనాధారా శాశ్వతస్థాన వాసినీ || || 159 ||

స్థానేశ్వరీ నిరానన్దా త్రిశూలవరధారిణీ | అశేషదేవతామూర్తి ర్దేవతా వరదేవతా || || 160 ||

గణామ్బికా గిరేః పుత్రీ నిశుమ్భవినిపాతినీ | అవర్ణా వర్ణరహితా త్రివర్ణా జీవ సంభవా || || 161 ||

అనన్తవర్ణా సన్యస్థా శంకరీ శాస్తమానసా | అగోత్రా గోమతీ గోప్త్రీ గుహ్యరూపా గుణోత్తరా || || 162 ||

గౌ ర్గీ ర్గవ్యప్రియా గౌణీ గణశ్వరనమస్కృతా | సత్యభామా సత్యసన్థా త్రిసన్థ్యా సన్ధివర్జితా || || 163 ||

వైరాగ్యముతోకూడిన జ్ఞానము నందాసక్తి కలది, కాంతిని మించినది, ఇంద్రియముకలతీతురాలు, అద్బుతమైన గహనము ఆధారముగాకలది, శాశ్వతమైన స్థానమునందు వసించునది. (159)

స్థానములకు ప్రభ్వి, ఆనందమున కతీతురాలు, శ్రేష్ఠమైన త్రిశూలమును ధరించునది, సమస్త దేవతలు తన రూపముగా కలది, దేవతా శ్రేష్ఠురాలు. (160).

గణములకు తల్లి, పర్వతపుత్రిక, నిశుంభుని సంహరించినది, వర్ణములేనిది, భేదరహిత, మూడు అక్షరములచే ప్రతిపాద్యురాలు, ప్రాణులకు జన్మదాయిని. (161)

అనంతములైన వర్ణములు కలది, పరాధీనము కానిది, శంకరునికి సంబంధించినది, ప్రశాంతమైన మనస్సు కలది, వంశములేనిది, గోవులుకలది, రక్షకురాలు, రహస్యాకారముకలది, గుణములచే శ్రేష్ఠురాలు. (162).

గోరూపిణి, వాక్కు గవ్యము నందు ప్రీతి కలది, త్రిగుణములకు సంబంధించినది, గణశ్వరునిచేత నమస్కరింపబడునది, సత్యభామారూపిణి, సత్యమైన ప్రతిజ్ఞ కలది, మూడు సంధ్యలు కలది, విభాగములు లేనిది. (163).

సర్వవాధాశ్రయా సాంఖ్యా సాంఖ్యయోగ సముద్భనా | అసంఖ్యేయా7 ప్రమేయాఖ్యా శూన్యా శుద్దకులోద్భనా || || 164 ||

బిన్దునాదసముత్పత్తిః శమ్భువామా శశిప్రభా | పిశజ్గా భేదరహితా మనోజ్ఞా మధుసూదనీ || || 165 ||

మహాశ్రీః శ్రీ సముత్పత్తి స్తమఃపారే ప్రతిష్ఠితా | త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మ పదసంశ్రయా || || 166 ||

శాన్తా భీతా మలాతీతా నిర్వికారా శివాశ్రయా | శివాఖ్యా చిత్తనిలయా శివజ్ఞానస్వరూపిణీ || || 167 ||

దైత్యదానవనిర్మాథీ కాశ్యపీ కాలకర్ణికా | శాస్త్రయోనిః క్రియామూర్తి శ్చతుర్వర్గ ప్రదర్శికా || || 168 ||

అన్ని వాదముల కాశ్రయమైనది, ఆత్మజ్ఞానమునకు చెందినది, సాంఖ్యయోగము నుండి పుట్టినది, లేక్కించుటకు శక్యముకానిది, పరిమాణము తెలియరానిది, శూన్యరూప, నిర్మల వంశమున జన్మించినది. (164).

బిందునాదమునకుత్పత్తి స్థానము, శివునకు వామ భాగమందుండునది, చంద్రునివంటి కాంతి కలది, పిశంగవర్ణము కలది, భేదములు లేనిది, మనోహరమైనది, మధురాక్షసుని నశింపజేయునది. (165)

గొప్పలక్ష్మి, సంపదలకు జన్మస్థానము, తమస్సు యొక్క ఆవలి భాగమున స్థాపించబడినది, తత్త్వత్రయమునకు తల్లివంటిది, మూడు విధములైనది, మిక్కిలి సూక్ష్మములైన పదముల నాశ్రయించినది. (166).

శాంతురాలు, భయములేనిది, మాలిన్యమునకు దూరమైనది, వికారములు లేనిది, శివునాశ్రయించి యండునది, శివనామము కలది, మనస్సే మందిరముగా కలది, శివజ్ఞాన స్వరూపురాలు. (167).

దైత్యులను, దానవులను సంహరించింది. కశ్యపునకు సంబంధించినది, కాలమునకు కర్ణిక వంటిది, శాస్త్రములకు మూలకారణము, క్రియానుష్ఠానరూపిణి, నాలుగు వర్గములను ప్రదర్శించునది.(168).

నారాయణీ నరోత్పత్తిః కౌముది లిఙ్గధారిణీ | కాముకీ కలితా భావా పరావరవిభూతిదా || || 169 ||

పరాఙ్గజాతమహిమా బదబా వామలోచనా| సుభద్రా దేవకీ సీతా వేదవేదజ్గపారగా || || 170 ||

మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా | అమన్యు రమృతాస్వాదా పురుహూతా పురుష్టుతా || || 171 ||

అశోచ్యా భిన్నవిషయా హిరణ్య రజతప్రియా | హిరణ్యరజనీ హైమా హేమాభరణ భూషితా | || 172 ||

విభ్రాజమానా దుర్ఞేయ జ్యోతిష్టోమఫలప్రదా | మహానిద్రాసముద్భూతి రనిద్రా సత్యదేవతా || || 173 ||

నారాయణునకు సంబంధించినది, మనుష్యుల ఉత్పత్తి కారణము, వెన్నెల రూపమైనది, లింగమును ధరించునది, కామములు కలది, అభావయుక్తమైనది, పర, అపర అను విభూతుల నిచ్చునది. (169).

పరాంగము వలన కలిగిన మహిమ కలది, అశ్వరూపిణి, అందమైన కన్నులు కలది, మంచి భద్రములు కలది, దేవకీ సీతాస్వరూపిణీ, వేదముల వేదాంగముల సారమును చూచినది. (170).

అభిమానము కలది, మన్యువునకు తల్లి, గొప్పమన్యువు నుండి సంభవించినది, దుఃఖము లేనిది, అమృతమునాస్వాధించునది, యజ్ఞముల యందు పిలువ బడునది, స్తోత్రము చేయబడునది. (171).

శోకింపదగనిది, భిన్నవిషయములు కలది, సువర్ణము, వెండి ప్రియములుగా కలది, బంగారమును రంజింప జేయునది, బంగారు రంగు కలది, సువర్ణాభరణములచే అలంకరింపబడినది. (172).

ఎక్కువగా ప్రకాశించునది, తెలిసి కొనుట కష్టసాధ్యమైనది, జ్యోతి ష్టోమయాగము యొక్క ఫలమునిచ్చునది, గొప్ప నిద్రకు జన్మకారణము, నిద్రలేనిది, సత్యమైన దేవత (173).

దీర్ఘ కకుద్మినీ హృద్యా శాన్తిదా శాన్తి వర్ధినీ | లక్ష్య్మాదిశక్తి జననీ శక్తిచక్రప్రవర్తికా || || 174 ||

త్రిశక్తిజననీ జన్యా షడూర్మిపరివర్జితా | సుధౌతా కర్మకరణీ యుగాస్తదహనాత్మికా || || 175 ||

సంకర్షణీ జగద్ధాత్రీ కామయోనిః కిరీటిని | ఐన్ట్రీ త్రైలోక్యసమితా వైష్ణవీ పరమేశ్వరీ || || 176 ||

ప్రద్యుమ్నదయితా దాత్రీ యుగ్మదృష్టి స్త్రీలోచనా | మదోత్కటా హంసగతి ః ప్రచణ్డ చణ్డవిక్రమా || || 177 ||

వృషావేశా వియన్మాతా విస్థ్యపర్వతవాసినీ | హిమవన్మేరునిలయా కైలాసగిరి వాసినీ || || 178 ||

పొడవైనది, రాజచిహ్నములు కలది, మనోహరమైనది, శాంతి నిచ్చునది, శాంతిని పెంపొందించునది, లక్ష్మీ మొదలగు శక్తులకు తల్లి వంటిది, శక్తుల యొక్క చక్రమును ప్రవర్తింప జేయునది. (174).

మూడు శక్తులకు తల్లి, పుట్టుక కలది, ఆరువిధముల ఊర్ముల నుండి విడువబడినది, బాగుగా శుభ్రమైనది, కర్మలను చేయించునది, ప్రళయకాలపు అగ్ని వంటి స్వరూపముకలది. (175).

శత్రువులను జయించునది, లోకములను ధరించునది, కోరికలకు కారణ భూతురాలు, కిరీటము కలది, ఇంద్రునికి సంబంధించినది, ముల్లోకములచే నమస్కరింప బడునది, విష్ణు సంబంధముకల పరమేశ్వరి. (176).

ప్రద్యుమ్నునకు ప్రియురాలు, దానముచేయునది, జంట చూపులు కలది, మూడు కన్నులు కలది, మదముతో శొభించునది, హంసగమనము కలది, తీక్‌ష్ణ స్వభావము కలది, తీవ్ర పరాక్రమ వంతురాలు. (177).

వృషభము నావేశించినది, ఆకాశమునకు జనని, వింధ్య పర్వతమునందు నివసించునది, హిమాలయము, మేరుపర్వతము నివాసముగా కలది, కైలాస పర్వతము నందు వసించునది. (178).

చాణూరహస్తృతనయా నీతిజ్ఞా కారూపిణీ | వేదవిద్యావ్రతస్నాతా బ్రహ్మశైలనివాసినీ || | 179 ||

వీరభద్రప్రజా వీరా మహాకామసముద్భావా | విద్యాధరప్రియా సిద్ధా విద్యాధరనిరాకృతి ః || || 180 ||

అప్యాయనీ హరన్తీ చ పావనీ పోషణీ కలా | మాతృకా మన్మధోద్భూతా వారిజా వాహన ప్రియా || || 181 ||

కరీషిణీ సుధావాణి విణావాదన తత్పరా |సేవితా సేవికా సేవ్యా సినీవాలీ గరుత్మతీ || || 182 ||

అరున్థతీ హిరణ్యాక్షీ మృగాజ్కా మానదాయినీ | వసుప్రదా వసుమతీ వసోర్థారా వసున్ధరా || || 183 ||

చాణూరుని చంపిన వాని కూతురు. నీతిశాస్త్రము తెలిసినది, స్వేచ్ఛా రూపము ధరించునది, వేద విద్యల యందవబృధస్నానము జరిపినది, బ్రహ్మపర్వతమునందు నివసించునది. ( 179).

వీరభద్రుడు సంతతిగా కలది, వీరురాలు, గొప్పదైన కామమున కుత్పత్తి స్థానము , విద్యాధరులకు ప్రియమైనది, సిద్ధురాలు, విద్యాధరులను నిరాకరింపగలదీ. (180).

ప్రీతిని కలిగించునది, హరించునది, పవిత్రమైనది, పోషించు కళారూపయైనది, మాతృక, మన్మథునినుండి పుట్టినది, జలమునుండి పుట్టినది వాహనముందు ప్రీతి కలది. (181).

కరీషమును ధరించునది అమృతము వంటి మాటలు కలది, వీణను మ్రోగించుట యందాసక్తి కలది, సేవింపబడునది, సేవించునది, సేవింపదగినది, సినీవాలి రూప, రెక్కలు కలది. (182).

అరుంధతి, బంగారము వంటి కన్నులు కలది, మృగము గుర్తుగా కలది, గౌరవము నిచ్చునది, ధనమును కలిగించునది, ఐశ్వర్యముకలది, వసువు యొక్కధార, బంగారమును ధరించునది. (183).

ధారాధరా వరారోహా వరావాస సహస్రదా | శ్రీఫలా శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా శివాప్రియా || || 184 ||

శ్రీధరా శ్రీకరీ కల్యా శ్రీధరార్థశరీరిణీ | అనన్తదృష్టి రక్షుద్రా ధాత్రీశా ధనదప్రియా || || 185 ||

నిహన్త్రీ దైత్యసంఘానాం సింహికాం సింహవాహనా | సువర్చలా చ సుశ్రోణీ సుకీర్తి శ్ఛిన్నసంశయా || || 186 ||

రసజ్ఞా రసదా రామా లేలిహానా7 మృతస్రవా | నిత్యోదితా స్వయంజ్యోతి రుత్సుకా మృతజీవనా || || 187 ||

వజ్రదణ్డా వజ్రచిహ్నా వైదేహీ వజ్రవిగ్రహా | మఙ్గల్యా మఙ్గలా మాలా నిర్మలా మలహారిణీ || || 188 ||

ధారను ధరించునది, శ్రేష్ఠమైన ఊరువులు కలది, వేలకొలది ఉన్నతమైన ఆశ్రయముల నిచ్చునది, సంపద ఫలముగా కలది, సంపదకలది, సంపదకు ప్రభ్వి, శ్రీకి నివాసము, శివునకు ఇష్టమైనది, (184)

శ్రీని ధరించునది, సంపదను కల్గించునది, శ్రీధరుని సగము శరీరము కలది, అనంతమైన చూపులు కలది, క్షుద్రత్వము లేనిది, భూమికి అధికారిణి, కుబేరునకు ప్రియమైనది. (185).

రాక్షససమూహములను చంపునది, సింహము వాహనముగా కలది, సింహరూపిణి, మంచి తేజస్సుకలది, అందమైన నితంబము కలది, మంచి కీర్తి కలది, తొలగింపబడిన సంశయములు కలది. (186).

రసము నెరిగినది, రసము నిచ్చునది, రమించునది, అస్వాదించునది, అమృతమును స్రవించునది, మంగళమున కర్హమైనది, మంగళరూప, మాలారూప, నిర్మలమైనది, మాలిన్యమును హరించునది, (187).

గాన్థర్వీ కరుకా చాన్ద్రీ కమ్బలాశ్వతరప్రియా | సౌదామినీ జనాసన్దా భ్రకుటీకుటిలాననా || ||189 ||

కర్ణికారకరా కక్షా కంసప్రాణా సహారిణీ | యుగస్థరా యుగావర్తా త్రిసన్ధ్యా హర్షవర్ధినీ || || 190 ||

ప్రత్యక్షదేవతా దివ్యా దివ్యగన్థా దివః పరా | శుక్రాసనగతా శక్రీ సాధ్యా చారుశరాసనా || || 191 ||

ఇష్టా విశిష్టా శిప్టేష్టా శిష్టా శిష్టప్రపూజితా | శతరూపా శతవర్తా వినతా సురభిః సురా || || 192 ||

సురేన్ద్రమాతా సుద్యుమ్నా సుషుమ్నా సూర్యసంస్థితా | సమీక్ష్యా సత్ర్పతిష్ఠా చ నివృత్తి ర్జా నపారగా || || 193 ||

గంధర్వసంబంధిని, చంద్రునికి చెందినది, కంబలము, కంచర గాడిద ఇష్టముగా కలది, మెరుపుతీగ రూపము, జనులకానందము కలిగించునది, బొమముడి చేత వంకరయైనముఖము కలదు. (189).

కొండ గోగు పూవు చేతియందు కలది, కంసుని ప్రాణముల నపహరించినది, యుగములను ధరించునది, యుగములను మరలించునది. మూడు సంధ్యలు కలది, సంతోషమును పెంచునది. (190).

ప్రత్యక్షమైన దేవత, దివ్యురాలు, దివ్యమైన గంధము కలది, స్వర్గము కంటే విశిష్టమైనది, ఇంద్రుని అసనమునధిష్టించినది, శక్రునకు సంబంధించినది, సాధనయోగ్య దివ్యమైన ధనుస్సు కలది. (191).

ఇష్టమైనది, విశిష్టురాలు, శిష్టులైన వారి కభీష్టురాలు, శిష్టులచేత అశిష్టుల చేత కూడ పూజింపబడునది, అనేక రూపములు కలది, అనంతావర్తము కలది, వినత,సురభి దేవతారూపిణి. (192).

దేవేంద్రునకు తల్లి, మంచి శక్తి కలది, సుషుమ్న నాడీ స్వరూపిణి,సూర్యమండల మందధిష్టించి యుండునది, చక్కగా పరిశీలించి తెలియ దగినది, మంచి ప్రతిష్ట కలది, నివృత్తి రూపయైనది, జ్ఞానము యొక్క అంతమును పొందినది. (193).

ధర్మశాస్త్రార్థ కుశలా ధర్మజ్ఞా ధర్మవాహనా | ధర్మాధర్మవినిర్మాత్రీ ధార్మికాణాం శివప్రదా || || 194 ||

ధర్మశక్తి ర్ధర్మమయీ విధర్మా విశ్వధర్మిణీ | ధర్మస్తరా ధర్మమయీ ధర్మపూర్వా ధనావహా || || 195 ||

ధర్మోపదేష్ట్రీ ధర్మాత్మా ధర్మగమ్మా ధరాధరా | కాపాలీ శకలా మూర్తిః కలాకలితవిగ్రహా || || 196 ||

సర్వశక్తివినిర్ముక్తా సర్వశక్త్వాశ్రయాశ్రయా | సర్వా సర్వేశ్యరీ సూక్ష్మా సూక్ష్మజ్ఞానస్వరూపిణీ || || 197 ||

ప్రధాన పురుషే శేషా మహదేవైకసాక్షిణీ | సదాశివా వియస్మూర్తి ర్వేదమూర్తి రమూర్తికా || || 198 ||

ఏవం నామ్నాం సహస్రేణ స్తుత్వా సౌ హిమవా న్గిరిః | భూయః ప్రణమ్య భీతాత్మా ప్రోవాచే దం కృతాఞ్జలిః || || 199 ||

ధర్మ శాస్త్ర విషయములందు నేర్పు కలది, ధర్మము తెలిసినది, ధర్మమే వాహనముగా కలది, ధర్మాధర్మములను నిర్ధారించునది, ధర్మస్వభావము కలవారికి శుభముల నిచ్చునది; (194).

ధర్మము శక్తిగా కలది, ధర్మ స్వరూపిణి, ధర్మమున కతీతమైనది, విశ్వధర్మము కలది,

ధర్మమందు వసించునది, ధర్మమయి ధర్మహేతుకమైనది, ధనము నిచ్చునది; (195)

ధర్మమునుపదేశించునది, ధర్మ స్వభావము కలది, ధర్మముచేత పొంద దగినది, భూమిని ధరించునది, కపాలమును ధరించునది, అంశావతారమైనది, కళలతో కూడిన విగ్రహము కలది; (196).

అన్ని శక్తుల నుండి ముక్తురాలైనది, సమస్త శక్తుల కాశ్రయమైనది, ఆధారభూత, సర్వమునకీశ్వరి, సూక్ష్మరూపిణి, సూక్ష్మజ్ఞాన స్వరూపము కలది; (197).

ప్రధాన పురుషునికి శేషభూతురాలు, మహదేవునికి ముఖ్యసాక్షిణి, సదాశివరూప, ఆకాశ శరీరిణి, వేదరూపిణి మూర్తి రహిత; (198).

ఇట్లు హిమవంతుడు వేయినామాలతో స్తుతించి, మరల నమస్కరించి, భయముతో చేతులు జోడించి మరల ఇట్లనెను. (199).

యదేత దైశ్వరం రూపం ఘోరం తే పరమేశ్వరి | భీతో7 స్మి సాంప్రతం దృష్ట్యా రూప మన్య త్ప్రదర్శయ || || 200 ||

ఏవ ముక్తా థ సా దేవీ తేన శైలేన పార్వతీ | సంహృత్య దర్శయామాస స్వరూప మపరం పునః || || 201 ||

నీలోత్పలదలప్రఖ్యం నీలోత్పలసుగన్థిచ | ద్వినేత్రం ద్విభుజం సౌమ్యం నీలాలకవిభూషితమ్‌ || || 202 ||

రక్తపాదామ్బుజతలం సురక్తకరపల్లవమ్‌ | శ్రీ మద్విలాససద్వృత్త్వం లలాటతిలకోజ్జ్వలమ్‌ || || 203 ||

భూషితం చారు సర్వాఙ్గభూషణౖ రతికోమలమ్‌ | దధాన మురసా మాలాం విశాలాం హేమనిర్మితామ్‌ || || 204 ||

ఓ పరమేశ్వరీ ! భయంకరమైన , ఈశ్వర సంబంధియైన ఈ రూపమేది కలదో, దానిని చూచి ఇప్పుడు నేను భయము చెందినాను. అందువలన దీనికి భిన్నమైన రూపమును చూపుము. (200).

ఆ పార్వతీ దేవి పర్వత రాజుచేత ఇట్లు చెప్పబడినదై, తన అప్పటి రూపమును ఉపసంహరించి ఇతరమైన రూపమును మరల ప్రదర్శించెను. (201).

నల్లకలువ రేకులతో సమానమైనది, నల్లకలువల పరిమళము వంటి సుగంధము కలది, రెండు కన్నులు, రెండు చేతులు కలది, నల్లని ముంగురులతో కూడినది, ప్రసన్నమైనది. (202).

ఎఱ్ఱని పాద పద్మప్రదేశము కలది, మిక్కిలి ఎరుపైన చిగురాకుల వంటి చేతులు కలది, సంపదతో కూడిన విలాసము, సద్వర్తనము కలది, నొసటి యండు తిలకముతో ప్రకాశించుచున్నది. (203).

సమస్తావయవములందు అందమైన భూషణములతో అలంకరించబడినది, మిక్కిలి సుకుమారమైనది, బంగారముతో చేయబడిన, విశాలమైన హారమును వక్షఃస్థలములో ధరించినది. (204).

ఈషత్స్మతం సుబిమ్బోష్ఠం నూపురారావ సంయుతమ్‌ | ప్రసన్నవదనం దివ్య మనస్తమహిమాస్పదమ్‌ || || 205 ||

త దీదృశం సమాలోక్యస్వరూపం శైలసత్తమః || భీతిం సస్త్యజ్య హృష్టాత్మా బభాషే పరమేశ్వరీమ్‌ || || 206 ||

హిమవానువాచ

అద్య మే సఫలం జన్మ అద్య మే సఫలం తపః | యన్మే సాక్ష్యాత్త్వ మవ్వక్తా ప్రపన్నా దృష్టిగోచరమ్‌ || || 207 ||

త్వయా స్పష్టం జగత్సర్యం ప్రధానాద్యం త్వయి స్థితమ్‌ | త్వయ్యేవ లీయతే దేవి త్వమేవ పరమా గతి ః || || 208 ||

పదన్తి కేచి త్త్వామేవ ప్రకృతిం ప్రకృతేః పరామ్‌ | అపరే పరమార్థజ్ఞాః శివేతి శివసంశ్రయాత్‌ || || 209 ||

చిరునవ్వుతో కూడినది, చక్కని దొండపండు వంటి పెదవులు కలది, అందెల చప్పుడుతో యుక్తమైన, నిర్మలమైన ముఖము కలది, దేవతలకు సంబంధించినది, అంతులేని మహిమలకు నెలవైనది; (205).

ఇటు వంటి లక్షణాలతో కూడిన ఆ స్వరూపమును చూపి పర్వత శ్రేష్ఠుడు సంతోషించిన మనస్సు కలవాడై, భయమును విడిచిపెట్టి ఆ పరమేశ్వరిని గూర్చి ఇట్లు మాట్లాడెను. (206)

ఈ రోజు నా జన్మ సఫలమైనది, నా తపస్సు ఈనాడు సార్ధకమైనది. ఎందువలన అనగా అవ్యక్త స్వరూపము కల నీవు స్వయముగా నా చూపులకు సాక్షాత్కరించినావు. (207).

ఈ లోకమంతయు నీ చేసృజింపబడినది, ప్రధానము మొదలగు తత్త్వ సమూహము నీ యందు నిలిచి యున్నది., ఓ దేవీ ! ఈ విశ్వము నీ యందే లీనమగుచున్నది. నీవే మాకు గొప్ప ప్రాప్యస్థానము. (208).

కొందరు నిన్నే ప్రకృతి స్వరూపవని, ప్రకృతికి అతీతురాలవని చెప్పుదురు - మరికొందరు వాస్తవము నెరిగిన వారు నిన్ను శివునాశ్రయించి యున్నందున 'శివ' అని పలుకుదురు. (209).

త్వయి ప్రధానం పురుషో మహాన్‌ బ్రహ్మతథేశ్వరః | అవిద్యా నియతి ర్మాయా కలాద్యాః శతశో7 భవన్‌ || || 210 ||

త్వం హి సా పరమాశక్తి రనన్తా పరమేష్టినీ | సర్వభేదవినిర్ముక్తా సర్వభేదాశ్రయా శ్రయా || || 211 ||

త్వా మధిష్ఠాయ యోగేశి ! మహదేవో మహేశ్వరః | ప్రధానాద్యం జగ త్సర్యం కరోతి వికరోతి చ || || 212 ||

త్వయైవ సఙ్గతో దేవః స్వాత్మానందం సమశ్నుతే | త్వమేవ పరమావన్ద స్త్వమేవా నన్దదాయినీ || || 213 ||

త్వ మక్షరం పరం వ్యోమ మహా జ్జ్యోతి ర్నిరంజనమ్‌ | శివం సర్వగతం సూక్షం పరం బ్రహ్మ సనాతనమ్‌ || || 214 ||

నీ యందు ప్రధాన తత్త్వము , పురుషుడు, మహత్తు, బ్రహ్మ మరియు ఈశ్వరుడు, అవిద్య, నియతి, మాయ, కళలు మొదలగునవి వందల కొలది ఏర్పడినవి. (210).

నీవు శ్రేష్ఠమైన ఆ శక్తివి, అంతములేని పరమేష్ఠిరూపిణివి. సమస్తమైన భేదములచేత విడువబడినదానవు. భేదమునకాశ్రయములైన వాని కన్నింటికి ఆశ్రయభూతవు. (211)

ఓ యోగేశ్వరీ ! నిన్ను ఆధారముగా చేసుకొని మహాదేవుడగు మహేశ్వరుడు, ప్రధాన తత్త్వము మొదలైన లోకము నంతయు సృష్టించుచు, వికారమలు కలిగించును. (212)

నీతో చేరియున్న దేవుడు తననో ఆత్మానుభవానందమును పొందుచున్నాడు. నీవే గొప్ప ఆనంద స్వరూపము. నీవే ఆనందము కలించుదానవు. (213)

నీవు నాశరహితమైన పరమాకాశరూపము; వికారరహితమైన గొప్ప తేజోరూపము - మంగళకరము, అంతట వ్యాపించి యున్నది, సూక్ష్మరూపము, అనాది సిద్దమైన పరబ్రహ్మ స్వరూపమునై యున్నవు. (214).

త్వం శక్రః సర్వదేవానాం బ్రహ్మా బ్రహ్మవిదా మసి | వాయుర్బలవతాం దేవి యోగినాం త్వం కుమారకః || || 215 ||

ఋషీణాం చ వసిష్ఠం స్త్వం వ్యాసో వేదవిదామసి | సాంఖ్యానాం కపిలో దేవో రుద్రాణాం చా పి శఙ్కరః || || 216 ||

ఆదిత్యానా ముపేన్ద్రస్త్వం వసూనాం చైవ పావకః | వేదానాం సామవేద స్త్వం గాయత్రీ ఛన్దసా మసి || || 217 ||

అధ్యాత్మవిద్యా విద్యానాం గతీనాం పరమాగతి ః | మాయా త్వం సర్వశక్తీనాం కాలః కలయతా మసి || || 218 ||

ఓంకారః సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః | అశ్రమాణాం గృహస్థస్త్వ మీశ్వరాణాం మహేశ్వరః || || 219 ||

నీవు దేవతలందరిలో ఇంద్రుడవు. బ్రహ్మతత్త్వము తెలిసిన వారిలో నీవు బ్రహ్మవు. ఓ దేవీ ! నీవు బలవంతులతో వాయురూపవు - యోగులలో నీవు కుమారకుడవు. (215).

ఋషులలో నీవు వసిష్ఠడవు . వేద వేత్తలలో నీవు వ్యాసుడవు. సాంఖ్యులలో కపిల దేవుడవు. రుద్రులలో నీవు శంకరుడవు. (216).

అదితి కుమారులలో నీవు ఉపేంద్రుడవు. వసువులలో నీవు అగ్ని రూపుడవు. వేదములలో నీవు సామవేదస్వరూపము. ఛందస్సులోల నీవు గాయత్రివి. (217).

విద్యలలోనీవు ఆత్మ విషయకవిద్యవు. ప్రాప్యములలో నీవు సరోత్తమప్రాప్యవు. సమస్త శక్తులలో నీవు మాయారూపవు. లెక్కించు వారిలో నీవు కాలరూపమైన దానవు. (218).

సమస్త రహస్యములలో నీవు ఓంకార స్వరూపవు. వర్ణములలో నీవు ద్విజశ్రేష్ఠుడవు. ఆశ్రమములలో నీవు గృహస్థాశ్రమము. ఈశ్వరులలో నీవు మహేశ్వరుడవు. (219).

పుంసాం త్వ మేకః పురుషః సర్వభూతహృదిస్థితః | సర్వోపనిషదాం దేవి! గుహ్యోపనిష దుచ్యసే || ||220||

ఈశాన శ్చాపి కల్పానాం యుగానాం కృత మేవచ | ఆదిత్యః సర్వమార్గాణాం వాచాం దేవీ సరస్వతీ || ||221||

త్వం లక్ష్మీ శ్చారురూపాణాం విష్ణు ర్మాయావినా మసి | అరున్థతీ సతీనాం త్వం సుపర్ణః పతతా మసి || || 222 ||

సూక్తానాం పౌరుషం సూక్తం సామ జ్యేష్ఠంచ సామసు | సావిత్రీ చాపి జాప్యానాం యజుషాం శతరుద్రియమ్‌ || || 223 ||

పర్వతానాం మహామేరు రనన్తో భోగినా మపి | సర్వేషాం త్వం పరం బ్రహ్మ త్వన్మయం సర్వమేవహి || || 224 ||

పురుషులలో నీవు ముఖ్య పురుషుడవు, సమస్త భూతముల మనస్సుల యందున్నవాడవు. ఓ దేవీ ! సమస్తమైన ఉపనిషత్తులలో నీవు రహస్యమైన ఉపనిషత్తుగా చెప్పబడుచున్నావు. (220).

కల్పములలో నీవు ఈశాన కల్పమైన దానవు. యుగములలో కృతయుగము నీవే. సమస్తమైన మార్గములకు నీవు సూర్యుడవు. వాక్కులలో సరస్వతీ దేవివి. (221).

అందమైన ఆకారము కలవారిలో నీవు లక్ష్మివి. మాయావంతులలో నీవు విష్ణువు. పతివ్రతలలో నీవు అరుంధతివి. పక్షులలో నీవు గరుత్మంతుడవు. (222).

వేదసూక్తములలో నీవు పురుషసూక్తమవు. సామవేదములో నీవు జ్యేష్ఠసామభాగము. జపించదగిన మంత్రములలో నీవు గాయత్రీ మంత్రమవు. యజుర్వేద మంత్రములలో శతరుద్రియ భాగము నీవు. (223).

పర్వతములలో నీవు గొప్పదైన మేరు పర్వతము. సర్పములలో నీవు ఆది శేషుడవు. అన్నింటిలో నిండి యున్న పరబ్రహ్మవు నీవు. ఈ సమస్తము నీతో నిండి యున్నదే. (224).

రూపం తవా శేషవికారహీన మగోచరం నిర్మల మేకరూపమ్‌ | అనాదిమధ్యాన్త మనన్త మాద్యం నమామి సత్యం తమసఃపరస్తాత్‌ || || 225 ||

యదేవ పశ్యన్తి జగత్ర్పసూతిం వేదాన్తవిజ్ఞానవినిశ్చితార్థాః | ఆనన్దమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే || || 226 ||

అశేషభూతాన్తరసన్నివిష్టం ప్రధానపుంయోగవియోగహేతుమ్‌ | తేజోమయం జన్మవినాశహీం ప్రాణాభిధానం ప్రణతో స్మి రూపమ్‌ || || 227 ||

నీయోక్క రూపము అన్ని విధముల వికారములు లేనిది, సాధారణముగా గోచరముకానిది, నిర్మలమైనది, అవయవ రహితమై అఖండ మైనది, మొదలు, మధ్య, తుది అనునవి లేనిది, నాశము లేనిది, ఆది భూతమైనది. సత్యస్వరూపము, తమోగుణానికి దూరమైనది అగురూపమునకు నమస్కరింతును. (225).

వేదాంతశాస్త్రము చదివి ఆ విజ్ఞానము నందు నిశ్చయబుద్ధికల పండితులు దేనిని లోకముల ఉత్పత్తి కారణముగా దర్శించుచున్నారో, కేవలానందరూపము, ఓంకార వాచ్యము అయిన ఆ రూపమునే నేను శరణు పొందుచున్నాను. (226).

ప్రపంచములోని సమస్త ప్రాణుల లోపల వ్యాపించి యున్నది, ప్రధానతత్త్వము మరియు పురుషుని యొక్క సంయోగవియోగములకు కారణభూతమైనది, ప్రకాశముతో నిండి యున్నది, జనన మరణములు లేనిది, ప్రాణశబ్దవాచ్యమగు నీ రూపమునకు నమస్కరింతును. (227).

ఆద్యన్తహీనం జగదాత్మరూపం విభిన్నసంస్థం ప్రకృతేః పరస్తాత్‌ | కూటస్థ మవ్యక్తవపు స్తథైవ | నమామి రూపం పురుషాభిధానమ్‌ || ||228 ||

సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం జన్మవినాశహీనమ్‌| || 229 ||

సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రధానం నతో7స్మి తే రూప మరూపభేదమ్‌ ||

ఆద్యం మహాన్తం పురుషాభిధానం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజమ్‌ | ఐశ్వర్యవిజ్ఞానవిరోధధర్మైః సమన్వితం దేవి నతో7 స్మిం రూపమ్‌ ||| 230 ||

మొదలు, తుదలేనిది, లోకములకు ఆత్మస్వరూపమైనది, విలక్షణమై ప్రత్యేకమైన ఉనికి కలది, ప్రకృతి కతీతమైనది, మూలభూతము, స్పష్టముగా తెలియరాని శరీరము కలది అగు పురుష శబ్దవాచ్యమైన నీరూపమునకు నమస్కరించుచున్నాను. (228).

సమస్తమున కాశ్రయభూతము, అన్నిలోకములను సృజించునది, అన్నిచోట్లకు వ్యాపించునది, జననమరణములు లేనట్టిది, సూక్ష్మరూపము, ఆశ్చర్యకరము, సత్త్వాదిగుణత్రయము ప్రధానముగా కలది, రూపభేదములు లేనిది అగు నీరూపమునకు నమస్కరించుచున్నాను. (229)

మొట్టమొదటిది, గొప్పనైనది, పురుషనామకమైనది, ప్రకృతియందు వ్యాపించినిలిచియున్నది, గుణత్రయముతో కూడిన ఆత్మ బీజముగా కలది, ఐశ్వర్యము, విజ్ఞానము, విరుద్ధధర్మములు అనువానితో కూడియున్న నీ రూపానికి ఓదేవీ! ప్రణతుడనగుచున్నాను. (230)

ద్విసప్తలోకాత్మక మమ్బుసంస్థం విచిత్రభేదం పురుషైకనాథమ్‌ | అనేకభేదై రధివాసితం తే నతో7 స్మిరూపం జగదణ్డసంజ్ఞమ్‌ |||| 231 ||

అశేషవేదాత్మక మేక మాద్యం త్వత్తేజసా పూరితలోకభేదమ్‌ | త్రికాలహేతుం పరమేష్ఠిసంజ్ఞం నమామి రూపం రవిమణ్డలస్థమ్‌ |||| 232 ||

సహస్రమూర్థాన మనస్తశక్తిం సహస్రబాహుం పురుషం పురాణమ్‌ |

శయాన మన్తః సలిలే తవైవ నారాయణాఖ్యం ప్రణతో7స్మి రూపమ్‌ || || 233 ||

పదునాలుగులోకాలు స్వరూపముగాకలది, నీటిలో ఉన్నది, విచిత్రమైన భేదములు కలది, పరమపురుషుడేనాధుడుగా కలది, చాలాభేదములతో కూడి యున్నది అగు, అండ సంజ్ఞకల నీ రూపమునకు ప్రణమిల్లుచున్నాను. (231)

సమస్తవేదస్వరూపము, కేవలము, మొదటిది, నీతేజస్సుచేత నింపబడిన లోకముల భేదములు కలది, మూడు కాలములకు కారణభూతము, పరమేష్ఠిసంజ్ఞకలది అగు సూర్యమండలమందు వసించు నీరూపానికి నమస్కరించుచున్నాను. (232)

వేయి తలలు కలిగి, అంతములేని శక్తికలిగి, వేయిభుజములు కలిగి, మూడు కాలములకు కారణభూతము, పరమేష్ఠి సంజ్ఞకలది అగు సూర్యమండలమందు వసించు నీరూపానికి నమస్కరించుచున్నాను. (232)

వేయితలలు కలిగి, అంతములేని శక్తికలిగి, వేయిభుజములు కలిగి పురాణపురుషుడవు, సముద్రములో నీటియందు శయనించియున్న నీదే అగు నారాయణనామకమైన రూపమునకు ప్రణామము చేయుచున్నాను. (233)

దంఎ్టా్రకరాళం త్రిదశాభివన్ద్యం యుగాన్తకాలానలకర్తృరూపమ్‌ | అశేషభూతాణ్డవినాశ##హేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞమ్‌ |||| 234 ||

ఫణాసహస్రేణ విరాజమానం భోగీన్ద్రముఖ్యై రపి పూజ్యమానమ్‌ | జనార్దనారూఢతనుం ప్రసుప్త నతో7 స్మిరూపం తవ శేషసంజ్ఞమ్‌ || 235 ||

అవ్యాహతైశ్వర్య మయుగ్మనేత్రం బ్రహ్మామృతానన్ద రసజ్ఞ మేకమ్‌ |

యుగాస్తశేషం దివి నృత్యమానం నతో 7స్మి రూపం తవ రుద్రసంజ్ఞమ్‌ || ||236 ||

కోరలతో భయంకరముగా నున్నది, దేవతలచేత పూజింపదగినది, ప్రళయకాలమందలి తీవ్రమైన అగ్నిని పుట్టించునది, సమస్తప్రాణులతో కూడిన బ్రహ్మాండము లయమునకు కారణమైనది అగు కాలనామకమైన నీరూపమునకు నమస్కరించుచున్నాను. (234)

వేయి పడగలతో ప్రకాశించుచున్నది, సర్పరాజులలో ముఖ్యులైనవారిచేత కూడ పూజింపబడుచున్నది, విష్ణుమూర్తి చేత అధిష్ఠించబడిన శరీరము కలది, నిద్రావస్థలో నున్నది అగు శేషుడను పేరుకల నీ రూపమునకు ప్రణమిల్లుచున్నాను. (235)

కొట్టబడని ఐశ్వర్యముకలది, బేసి కన్నులు కలది, పరబ్రహ్మమను అమృతరసాస్వాదములోని రసమును గుర్తించునది, అద్వితీయము, ప్రళయకాలములో మిగిలియుండునది, ఆకాశములో నర్తనము చేయునది అగు రుద్రనామకమైన నీరూపమునకు మ్రొక్కుచున్నాను. (236)

ప్రహీణశోకం ప్రవిహీనరూపం సురాసురై రచ్చిత పాదపద్మమ్‌ | సుకోమలం దేవి! విభాసి శుభ్రం నమామి తేరూపమిదం భవాని |||| 237 ||

ఓం - నమస్తే 7స్తు మహాదేవి నమస్తే పరమేశ్వరి | నమో భగవతీశాని! శివాయై తే నమోనమః || || 238 ||

త్వన్మయో7 హంత్వదాధార స్త్వమేవ చ గతి ర్మమ | త్వామేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి || || 239 ||

మయా నాస్తి సమో లోకే దేవోవా దానవో 7పి వా | జగన్మాతైవ మత్పుత్రీ సమ్భూతా తపసా యతః || || 240 ||

ఏషా తవామ్బికేదేవి! కిలాభూ త్పితృకన్యకా | మేనా శేషజగన్మాతు రహో మే పుణ్యగేరవమ్‌ || || 241 ||

నశించినశోకముకలది, గ్రహించుటకు అగోచరమైన ఆకారముకలది, దేవదానవులచేత పూజింపబడిన కమలముల వంటి పాదములు కలది, మిక్కిలి సుకుమారమైనది, ప్రకాశించునది, స్వచ్ఛమైనది అగు నీరూపమునకు ఓ భవానీదేవీ! నమస్కరించుచున్నాను. (237)

ఓ మహాదేవీ! పరమేశ్వరీ! నీకు నా నమోవాకము. భగవతీ! ఈశానునిపత్నీ! శివస్వరూపవైన నీకు నమస్కారము. (238)

నేను నీకంటె అభిన్నుడను, నీవే ఆధారముగా కలవాడను. నీవే నాకుదిక్కు. ఓ పరమేశ్వరీ! నిన్నే శరణు పొందుతాను. నాకు ప్రసన్నురాలవు కమ్ము. (239)

లోకములో దేవజాతి, లేదా దానవులలో నాతో సమానుడు మరియొకడు లేడు. ఎందువలన అనగా లోకమాత వగు నీవు నాతపస్సు చేత పుత్రికగా జన్మించినావు. (240)

ఓ అంబికాదేవీ! ఈమేనక, సమస్తలోకములకు తల్లివైన నీ తండ్రికి పత్నియైనది. ఇది నాయొక్క పుణ్యములగొప్పతనము. (241)

పాపి మా మమరేశాని!మేనయా సహ సర్వదా | నమామి తవ పాదాబ్జం వ్రజామి శరణం శివమ్‌ || || 242 ||

అహో మే సుమహ ద్భాగ్యం మహాదేవీసమాగమాత్‌ | ఆజ్ఞాపయ మహాదేవి! కింకరిష్యామి శంకరి || || 243 ||

ఏతావ దుక్త్వా వచనం తదా హిమగిరీశ్వరః | సంప్రేక్షమాణో గిరిజాం ప్రాజ్ఞలిః పార్శ్వగో 7భవత్‌ || || 244 ||

అథ సా తస్య వచనం నిశమ్యజగతో7రణిః | సస్మితం ప్రాహ పితరం స్మృతా పశుపతిం పతిమ్‌ || || 245 ||

శ్రీదేవ్యువాచ -

శ్రుణుష్వ చైత త్ర్పథమం గుహ్య మీశ్వరగోచరమ్‌ | ఉపదేశం గిరిశ్రేష్ఠ! సేవితం బ్రహ్మవాదిభిః ||

దేవతలందరికీ ప్రభ్వి అగునీవు నాభార్యమేనకతో సహఎల్లప్పుడు నన్ను కాపాడుము. కమలము వంటి నీపాదమునకు నమస్కరింతును. మంగళకరమైన దానిని శరణుపొందుదును. (242)

మహాదేవి వగునిన్ను కలుసుకునే అవకాశము కలుగుట నాయొక్క గొప్ప అదృష్టము. ఓదేవీ!శంకరపత్నీ! నీకు ఏమి సేవచేయవలెనో ఆజ్ఞాపించుము. (243)

పర్వతరాజగు హిమవంతుడు ఈవిధముగా పలికి పార్వతివైపు చూచుచు దోసిలి ఒగ్గి ప్రక్కన నిలుచుండెను. (244)

లోకమునకు అరణివంటి ఆపార్వతీదేవి హిమవంతుని వాక్యమును విని, మనస్సుతో తనభర్తయగు శివుని స్మరించి చిరునవ్వుతో తండ్రిని గూర్చిఇట్లనెను. (245)

పర్వతశ్రేష్ఠమా! ముందుగా రహస్యమైనది, ఈశ్వరవిషయకమైనది, బ్రహ్మవాదులగు వేదంతుల చేత సేవింపబడుచున్నది అగు ఉపదేశ మును వినుము. (246)

యన్మే సాక్షా త్పరం రూప మైశ్వరం దృష్ట మద్భుతమ్‌ | సర్వశక్తిసమాయుక్త మనన్తం ప్రేరకం పరమ్‌ || || 247 ||

శాన్తః సమాహితమనాః మానాహంకారవర్జితః | తన్నిష్ఠ స్తత్పరో భూత్వా తదేవ శరణం వ్రజ || || 248 ||

భక్త్యాత్వనన్యయా తాత! మద్భావం పర మాశ్రితః | సర్వయజ్ఞతపోదానై స్త దేవార్చయ సర్వదా || || 249 ||

తదేవ మనసా పశ్య తద్ధ్యాయస్వ యజస్వ తత్‌ | మమో పదేశా త్సంసారం నాశయామి త వా నఘ || || 250 ||

అహం త్వాం పరయా భక్త్యా ఐశ్వరం యోగ మాస్థితమ్‌ | సంసారసాగరా దస్మాదుద్ధరా మ్యచిరేణ తు || || 251 ||

ఈశ్వరసంబంధి, ఆశ్చర్యకరమైనది, సమస్తవిధశక్తులతో కూడియున్నది, అంతములేనిది, ప్రేరణకలిగించునది, లోకాతీతమైనది అగు ఏనామహత్తరరూపము చూడబడినదో, (247)

సావధానమగు మనస్సుకలవాడవు, శాంతుడవు, అభిమానము అహంకారములను విడిచినవాడవు అయి ఆరూపమునందే శ్రద్ధకలవాడవై, దానియందే నిమగ్నుడవై దానినే శరణము పొందుము. (248)

ఓతండ్రీ!అసాధారణమైన భక్తితో శ్రేష్ఠమైన నాయందలి భావమును పొంది, ఎల్లప్పుడు యజ్ఞములు, తపస్సు, దానములు మొద|| అన్నింటితో అరూపమునే పూజింపుము. (249)

దానినే నీమనస్సుతో దర్శించుము. దానినే ధ్యానించుము. దానిని పూజింపుము. ఓపుణ్యాత్ముడా! నాయొక్క ఉపదేశమువలన నీ సంసార బంధమును నశింపజేయుదును. (250)

శ్రేష్ఠమైన భక్తితో ఈశ్వరసంబంధియగు యోగము నవలంబించిన నిన్ను, తొందరలోనే ఈ సంసారమనెడు సముద్రము నుండి ఉద్ధరింతును. (251)

ధ్యానేన కర్మయోగేన భక్త్యాజ్ఞానేన చైవహి | ప్రాప్యా హం తే గిరిశ్రేష్ఠ! నాన్యథా కర్మకోటిభిః || || 252||

శ్రుతిస్మృత్యుదితం సమ్య క్కర్మ వర్ణాశ్రమాత్మకమ్‌ | అధ్యాత్మజ్ఞానసహితం ముక్తయే సతతం కురు || || 253 ||

ధర్మా త్సంజాయతే భక్తి ర్భక్త్యా సంప్రాప్యతే పరమ్‌ | శ్రుతిస్మృతిభ్య ముదితో ధర్మో యజ్ఞాదికో మతః || || 254 ||

నాన్యతో జాయతే ధర్మో వేదా ద్ధర్మోహి నిర్బభౌ | తస్మా న్ముముక్షుధర్మార్ధీ మద్రూపం వేద మాశ్రయేత్‌ || || 255 ||

మమై వైషా పరాశక్తి ర్వేదసంజ్ఞా పురాతనీ | ఋగ్యజుఃసామరూపేణ సర్గాదౌ సంప్రవర్తతే || || 256 ||

తేషా మేవ చ గుప్త్యర్థం వేదానాం భగవా నజః | బ్రాహ్మణాదీ న్ససర్జాథ స్వేస్వే కర్మణ్య యోజయత్‌ || || 257 ||

ఓ పర్వతరాజా! ధ్యానమార్గముతో, కర్మయోగముతో, భక్తితో జ్ఞానయోగముతో నేను నీకు పొందుటకు శక్యురాలను. ఇతరరీతులలో కోట్ల కొలది కర్మలచేత కూడ అది సాధ్యముకాదు. (252)

వేదములలో, ధర్మశాస్త్రములలో చెప్పబడిన వర్ణాశ్రమ సంబంధియగు కర్మను, ఆత్మవిషయకజ్ఞానముతో కూడచేర్చి మోక్షము కొరకు ఎల్లప్పుడు చేయుము. (253)

ధర్మము వలన భక్తి కలుగును. భక్తిచేత పరమాత్మజ్ఞానము కలుగును. వేదములచేత, ధర్మశాస్త్రములచేత చెప్పబడిన యజ్ఞాదిక మే ధర్మమని చెప్పబడును. (254)

వేదమునుండి ధర్మము ప్రకాశించినది. ఇతరమునుండి అది కలుగదు. కావున మోక్షార్థియై ధర్మమును కోరువాడు నారూపమైన వేదము నాశ్రయించవలెను. (255)

వేదసంజ్ఞకల, ప్రాచీనమైన, యీఉత్కృష్టమైన శక్తినాకు చెందినదే. ఋక్కు, యజస్సు, సామము అను పేర్లతో సృష్టి ప్రారంభములో ప్రవర్తించినది ఈశక్తి. (256)

ఆవేదముల రక్షణ కొరకే భగవంతుడగు బ్రహ్మ, బ్రాహ్మణాదివర్ణములను సృష్టించి, వారిని తమతమకర్మలలో నియమించినాడు. (257)

యే న కుర్వన్తి మద్ధర్మం తదర్థం బ్రహ్మనిర్మితాః | తేషా మధుస్తా న్నరకాం స్తామిస్రాదీ నకల్పయత్‌ || || 258 ||

నచ వేదా దృతే కి ఞ్చిచ్ఛాస్త్రం ధర్మాభిధాయకమ్‌ | యో7న్యత్ర రమతే సో7 సౌ న సమ్భాష్యో ద్విజాతిభిః || || 259 ||

యాని శాస్త్రాణి దృశ్యన్తే లోకే7స్మి న్వివిధాని తు | శ్రుతిస్మృతివిరుద్ధాని నిష్ఠా తేషాం హి తామసీ || || 260 ||

కాపాలం భైరవం చైవ యామలం వామ మార్హతమ్‌ | ఏవంవిధాని చాన్యాని మోహనార్థాని తాని తు || || 261 ||

యే కుశాస్త్రాభియోగేన మోహయన్తీ హ మానవాన్‌ | మయా సృష్టాని శాస్త్రాణి మోహాయైషాం భవాన్తరే || || 262 ||

ఎవరైతే, అందుకొరకే బ్రహ్మచేత సృష్టింపబడిన నా ధర్మము నమష్ఠించరో అటువంటి వారికి తామిస్రము మొదలగు నరకలోకములను అధోభాగమున సృష్టించెను. (258)

వేదముకంటే ఇతరమైనది, ధర్మమును బోధించునది మరొకశాస్త్రమేదియులేదు. ఎవడు వేదములకంటె ఇతర విషయములందు ఆసక్తికల వాడై ప్రవర్తించునో, అట్టివాడు ద్విజాతి వారిచే భాషింపబడుటకు తగినవాడుకాదు. (259)

ఈలోకములో వేదములకు, ధర్మశాస్త్రములకు విరుద్ధములైన ఏశాస్త్రములు బహువిధములుగా చూడబడుచున్నవో, వాని యొక్క ప్రధాన లక్ష్యము తమోగుణమునకు సంబంధించినది. (260)

కాపాలము, భైరవము, యామలము, వామము, అర్హతము, ఇటువంటివే మరికొన్ని ఇతరశాస్త్ర సంప్రదాయములు లోకమును మోహింప జేయుటకుపయోగించునవిగా తెలియవలెను. (261)

ఎవరైతే దుష్టములైన శాస్త్రముల ప్రచారముతో ఈలోకములో మనుష్యులను మోహింపజేయుదురో, అటువంటివారిని జన్మాంతరములో మోహింపజేయుటకు ఈతామసశాస్త్రములు నాచే సృష్టింపబడినవి. (262)

వేదార్థవిత్తమైః కార్యం యత్స్మృతం కర్మ వైదికమ్‌ | తత్ర్పయత్నేన కుర్వన్తి మత్ర్పియా స్తే హియే నరాః || || 263||

వర్ణానా మనుకమ్పూర్థం మన్నియోగా ద్విరాట్‌ స్వయమ్‌ | స్వాయమ్భువో మనుర్థర్మా న్మునీనాం పూర్వ ముక్తవాన్‌ || || 264 ||

శ్రుత్వా చాన్యే7పి మునయ స్తన్ముఖా ద్ధర్మ ముత్తమమ్‌ | చక్రు ర్థర్మప్రతిష్ఠార్థం ధర్మశాస్త్రాణి చైవ హి || || 265 ||

తేషు చాన్తర్హితే ష్వేవం యుగాన్తేషు మహర్షయః | బ్రహ్మణో వచనా త్తాని కరిష్యన్తి యుగే యుగే || || 266 ||

అష్టాదశపురాణాని వ్యాసాద్యైః కథితాని తు | నియోగాద్‌ బ్రహ్మణో రాజం స్తేషు ధర్మః ప్రతిష్ఠితః || || 267 ||

వేదార్థమును తెలిసినశ్రేష్ఠులచేత చేయదగినదిగాయే వైదికకర్మ చెప్పబడినదో దానిని, నాకిష్టులైన మనుష్యులెవరో వారు ప్రయత్నపూర్వకముగా అనుష్ఠించుచున్నారు. (263)

వర్ణములయందు దయచూపుటకొరకు నా ఆజ్ఞవలన విరాట్పురుషుడగు స్వాయంభువమనువు పూర్వము మునులకు ధర్మములను బోధించెను. (264)

ఆయననోటినుండి శ్రేష్ఠమైన ధర్మమును విని ఇతర మునులు కూడ లోకములో ధర్మప్రతిష్ఠాపనకొరకు ధర్మశాస్త్రములను రచించిరి. (265)

అవి మరల యుగాంత ప్రళయకాలములో లుప్తములు కాగా, బ్రహ్మవచనము ననుసరించి మహర్షులు ప్రతియుగములో మరల మరల రచింతురు. (266)

బ్రహ్మయొక్క ఆదేశము ననుసరించి వ్యాసుడు మొదలగు మహర్షులచేత అష్టాదశపురాణములు చెప్పబడినవి. వానిలో ధర్మము ప్రతిష్ఠించ బడినది. (267)

అన్యా న్యుపపురాణాని తచ్ఛిషై#్యః కథితాని తు | యుగేయుగే7 త్ర సర్వేషాం కర్తావై ధర్మశాస్త్రవిత్‌ || || 268 ||

శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్ద ఏవచ | జ్యోతిఃశాస్త్రం న్యాయవిద్యా సర్వేషా ముపబృంహణమ్‌ || || 269 ||

ఏవం చతుర్దశైతాని తథా హి ద్విజసత్తమాః | చతుర్వేదైః సహోక్తాని ధర్మో నాన్యత్ర విద్యతే || || 270 ||

ఏవం పైతామహం ధర్మం మనువ్యాసాదయః పరమ్‌ | స్థాపయన్తి మమా దేశా ద్యావ దాభూతసంప్లవమ్‌ || || 271 ||

బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతి సఞ్చిరే | పరస్యాన్తే కృతాత్మనః ప్రవిశన్తి పరం పదమ్‌ || || 272 ||

ఇతరములైన ఉపపురాణములు ఆమహర్షుల శిష్యులచేత చెప్పబడినవి. ప్రతియుగములో కూడ ఈలోకములో ధర్మశాస్త్రములు తెలిసినవాడే కర్తగా ఉండును. (268)

శిక్ష, కల్పము, వ్యాకరము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషశాస్త్రము, న్యాయవిద్య అనునవి అన్ని విద్యలకు సహకరించునవి. (269)

ఈ విధముగా నాలుగు వేదములతో కలిపి యీపదునాలుగు విద్యలు చెప్పబడినవి. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ధర్మమువీని యందు కాక ఇతరములందు ఉండదు. (270)

ఇట్లు పితామహుని నుండి వచ్చుచున్న శ్రేష్ఠ ధర్మమును మనువు, వ్యాసుడు మొదలగువారు, నా ఆజ్ఞననుసరించి సర్వప్రాణులు నశించు ప్రళయకాల పర్యంతము స్థాపించుచున్నారు. (271)

వారందరుకూడ బ్రహ్మతోపాటు వారివారి నియతకాలపర్యంతము ప్రతిపర్యాయము తమవిధులను నిర్వర్తించి అవధియగు పరము సమాప్తముకాగా కృతార్థులైన పరమ పదమును చేరుకొందురు. (272)

తస్మా త్సర్వప్రయత్నేన ధర్మార్థం వేద మాశ్రయేత్‌ | ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశ##యేత్‌ || || 273 ||

యే తు సజ్గా న్పరిత్యజ్య మామేవ శరణం గతాః | ఉపాసతే సదా భక్త్యా యోగ మైశ్వర మాస్థితాః || || 274 ||

సర్వభూతదయావన్తః శాన్తా దాన్తా విమత్సరాః | అమానినో బుద్ధిమన్త స్తాపసాః శంసితవ్రతాః || || 275 ||

మచ్చిత్తా మద్గతప్రాణా మజ్ఞా నకథనే రతాః | సన్యాసినో గృహస్థాశ్చ వనస్థా బ్రహ్మచారిణః || || 276 ||

తేషాం నిత్యాభియుక్తానాం మాయాత్తత్వం సముత్థితమ్‌ | నాశయామి తమః కృత్స్నం జ్ఞానదీపేన నో చిరాత్‌ || || 277 ||

అందువలన సంపూర్ణ ప్రయత్నముతో ధర్మము కొరకు వేదమును ఆశ్రయించవలెను. ధర్మముతో కూడిన జ్ఞానము పరబ్రహ్మ స్వరూపమును వెల్లడి చేయును. (273)

ఎవరైతే సంసార సంబంధాలను విడిచి నన్నే శరణుపొందుదురో, ఎల్లప్పుడు భక్తితో ఈశ్వర విషయకమైన యోగము నవలంబించి సేవింతురో, (274)

అన్ని భూతముల యందు దయకలవారై, శాంత స్వభావము కలిగి ఇంద్రియ నిగ్రహము కలవారై, అసూయ లేనివారు, గర్వరహితులు, మంచి వివేకము కలవారు, శ్రేష్ఠమైన వ్రతము నవలంబించిన మునులు. (275)

నా యందు మనస్సు నిలిపినవారు, నా యందే తమ ప్రాణములను పొందించినవారు, నావిషయకమైన జ్ఞానమును బోధించుటలో ఆసక్తి కలవారు అగు సన్యాసులు, గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు ఎవరు కలరో (276)

అటువంటి ఎల్లప్పుడూ పూనికతో ఉండు వారియొక్క మాయా ప్రభావము వలన కలిగిన అజ్ఞానాంధకారమును జ్ఞానమను దీపముతో తొందరలోనే సమూలముగా నశింపజేయుదును. (277)

తే సునిర్థూత తమసో జ్ఞానేనై కేన మన్మయాః | సదానన్దా స్తు సంసారే న జాయన్తే పునః పునః || || 278 ||

తస్మా త్సర్వప్రకారేణ మద్భక్తో మత్పరాయణః | మా మేవార్చయ సర్వత్ర మనసా శరణం గతః || || 279 ||

అశక్తో యది మే ధ్యాతు మైశ్వరం రూప మవ్యయమ్‌ | తతో మే పరమం రూపం కాలాద్యం శరణం వ్రజ || || 280 ||

తద్య త్స్వరూపం మే తాత మనసో గోచరం తవ | తన్నిష్ఠ స్తత్పరో భూత్వా తదర్చనపరో భవ || || 281 ||

యత్తు మే నిష్కలం రూపం చిన్మాత్రం కేవలం శివమ్‌ | సర్వోపాధివినిర్ముక్త మనస్త మమృతం పరమ్‌ || || 282 ||

అట్టివారు ముఖ్యమైన జ్ఞానముచేత కడిగివేయబడిన చీకటి కలవారై నాయందే నిమగ్నులై సర్వదా ఆనందానుభవము పొందుచు మరల మరల జన్మించకుండా ముక్తిని పొందుదురు. (278)

అందువలన నీవు అన్నివిధముల నాయందు భక్తి కలగి, నన్నే ఆశ్రయించిన వాడవై, మనస్సుతోనన్ను శరణుపొంది అన్నిచోట్ల నన్నే పూజించుచుండుము. (279)

ఒకవేళ నాయొక్క ఈశ్వర సంబంధి, నాశరహితము అయిన రూపమును ధ్యానించుటకు శక్తుడవు కానిచో, అప్పుడు నాయొక్క కాలాది రూపమైన పరమ రూపమును శరణు పొందుము. (280)

ఓతండ్రీ! ఏనా స్వరూపము నీ చిత్తమునకు గోచారమగునో, దానియందే నిష్ఠకలవాడవై, దానియందు శ్రద్ధనుంచి, దానినే పూజించు ఆసక్తి కల వాడవుకమ్ము. (281)

భేదరహితము, జ్ఞానమాత్ర రూపము, అద్వితీయము, మంగళకరము అయిన నా రూపమేది కలదో, అది అన్నివిధముల ఉపాధుల నుండి దూరమైనది, అంతములేనిది, అమృత స్వరూపము, సర్వోన్నతము. (282)

జ్ఞానే నైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదమ్‌ | జ్ఞాన మేవ ప్రపశ్యన్తో మామేవ ప్రవిశన్తి తే || || 283 ||

తద్బద్ధయ స్తదాత్మన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః | గచ్ఛన్య పునరావృత్తిం జ్ఞాననిర్థూతకల్మషాః || || 284 ||

మా మనాశ్రిత్య పరమం నిర్వాణ మమలం పదమ్‌ | ప్రాప్యతే నహి రా జేన్ద్ర! తతో మాం శరణం వ్రజ || || 285 ||

ఏకత్వేన పృథక్త్వేన తథా చోభయథా పివా | మా ముపాస్య మహీపాల తతో యాస్యసి తత్పదమ్‌ || || 286 ||

మా మనాశ్రిత్య త త్తత్వం స్వభావవిమలం శివమ్‌ | జ్ఞాయతే నహి రాజేన్ద్ర! తతోమాం శరణం వ్రజ || || 287 ||

ఆ పరమ పదము ఒక్క జ్ఞాన సాధనముచేతనే అతికష్టముతో పొందుటకు శక్యమైనది. జ్ఞానమునే దర్శించునట్టివారు నన్నే చేరుకుందురు. (283)

ఆ పరమపదమునందే బుద్ధి నిలిపినవారై దానియందు నిష్ఠకలిగి, శ్రద్ధకలవారై అదియే స్వరూపముగా కలిగి, జ్ఞానముచేత తొలగించబడిన పాపములు కలవారై పునర్జన్మరాహిత్యమును పొందుదురు.(284)

ఓరాజోత్తమా!నన్ను ఆశ్రయించక శ్రేష్ఠము, నిర్మలము అగు మోక్షపదము పొందబడదు. అందువలన నన్నే శరణుపొందుము. (285)

అద్వైత భావనతోకాని, భేదభావముతోకాని రెండు విధములచేతగాని, ఓరాజా!నన్ను సేవించినచో తరువాత నీవు ఆ పరమపదమును పొందగలవు. (286)

ఓరాజశ్రేష్ఠుడా! సహజముగా స్వచ్ఛమైనది, మంగళకరము అగు ఆ పరతత్త్వము నన్నాశ్రయించక తెలియబడదు. అందువలన నన్ను శరణుపొందుము. (287)

తస్మాత్త్వ మక్షరం రూపం నిత్యం వా రూప మైశ్వరమ్‌ | ఆరాధయ ప్రయత్నేన తతో7న్థత్వం ప్రహాస్యపి || || 288 ||

కర్మణా మనసా వాచా శివం సర్వత్ర సర్వదా | సమారాధయ భావేన తతో యాస్యసి తత్పదమ్‌ || || 289 ||

న వై యస్యన్తి తం దేవం మోహితా మమ మాయయా | అనాద్యనన్తం పరమం మహేశ్వర మజం శివమ్‌ || || 290 ||

సర్వభూతాత్మభూతస్థం సర్వాధారం నిరఞ్చికమ్‌ | నిత్యానన్దం నిరాభాసం నిర్గుణం తమసః పరమ్‌ || || 291 ||

అద్వైత మచలం బ్రహ్మ నిష్కలం నిష్ప్రపఞ్చికమ్‌ | స్వసంవేద్య మవేద్యం త త్పరే వ్యోమ్ని వ్యవస్థితమ్‌ || || 292 ||

అందువలన నీవు నాశరహితము, నిత్యము అగు ఈశ్వరసంబంధి రూపమును ప్రయత్నపూర్వకముగా పూజింపుము. దానివలన నీవు అంధత్వమును పోగొట్టుకుందువు. (288)

కర్మాచరణచేత, మనస్సుచేత, వాక్కుచేత, అంతట ఎల్లప్పుడు మంగళరూపమైన ఆ తత్త్వమును శ్రద్ధాభావముతో ఆరాధించుము. అప్పుడు ఆ పరమపదమును చేరగలవు. (289)

నాయొక్క మాయచేత మోహము పొందింపబడివారు ఆ పరతత్త్వమును ఆద్యంతములు లేని శ్రేష్ఠమైన జన్మరహితుడైన దేవుడగు మహేశ్వరుని పొందజాలరు. (290)

సమస్తభూతముల ఆత్మలయందున్నది, అన్నింటికాధారభూతమైనది, మాలిన్యములేనిది, సదాఆనందరూపము, ఆభాసము లేనిది, గుణములు లేనిది, తమోగుణమున కతీతమైనది (291)

భేదరహితము, నిశ్చలము, బ్రహ్మరూపము, కలారహితము, ప్రపంచబంధములేని, స్వయముగా తెలియదగినది, తెలియరానిది, పరమాకాశమునందునిలిచియున్నది. (292)

సూక్ష్మేణ తమసా నిత్యం వేష్టితా మమ మాయయా | సంసారసాగరే ఘోరే జాయన్తే చ పునః పునః || || 293 ||

భక్త్యా త్వనన్యయా రాజన్‌ సమ్యగ్‌ జ్ఞానేన చైవ హి | అన్వేష్టవ్యం హి త ద్‌ బ్రహ్మ జన్మబన్ధనివృత్తయే || || 294 ||

అహంకారం చ మాత్సర్యం కామం క్రోధపరిగ్రహమ్‌ | అధర్మాభినివేశం చ త్యక్త్వా వైరాగ్య మాస్థితః || || 295 ||

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని | అవేక్ష్య చాత్మనా త్మానం బ్రహ్మభూయాయ కల్పతే || || 296 ||

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా సర్వభూతాభయప్రదః | ఐశ్వర్యం పరమాం భక్తిం విన్దేతా నన్యభావినీమ్‌ || || 297 ||

నాయొక్క మాయచేత ఎల్లప్పుడు సూక్ష్యమైన అజ్ఞానమను చీకటిచే కప్పబడినవారై భయంకరమైన సంసారమను సముద్రమునందు మాటిమాటికి జన్మించుచుందురు. (293)

ఓరాజా!అసాధారణమైన భక్తితో, శ్రేష్ఠమైన జ్ఞానముతో, జన్మలను బంధములనుండి విడుదలకొరకు ఆపరబ్రహ్మరూపము వెదుక దగి యున్నది (294)

అహంకారమును, అసూయను, కోరికను, కోపమును, అధర్మమునందు పూనికను గూడ వదలి వైరాగ్యభావము నవలంబించి; (295)

సమస్తభూతముల యందు తన ఆత్మను, తనయందు సర్వభూతములను చూచి, తనలో ఆత్మరూపాన్ని దర్మించి పరబ్రహ్మసాయుజ్యమున కర్హుడగును. (296)

పరబ్రహ్మస్వరూపుడై, నిర్మలమైన ఆత్మకలవాడై, సమస్తభూతముల కభయమునిచ్చువాడై, ఈశ్వరభావమును, అనితర సాధారణమైన గొప్ప భక్తిని పొందగలడు. (297)

వీక్ష్యతే తత్పరం తత్త్వ మైశ్వరం బ్రహ్మ నిష్కలమ్‌ | సర్వసంసారనిర్ముక్తో బ్రహ్మణ్య వావతిష్ఠతే || || 298 ||

బ్రహ్మణో7యం ప్రతిష్ఠానం పరస్య పరమః శివః | అనన్య శ్చావ్యయ శ్చైక శ్చాత్మాధారో మహేశ్వరః || || 299 ||

జ్ఞానేన కర్మయోగేన భక్త్యా యోగేన వా నృప | సర్వసంసారముక్త్యర్థ మీశ్వరం శరణం వ్రజ || || 300 ||

ఏష గుహ్యోపదేశ##స్తే మయా దత్తో గిరీశ్వర | అన్వీక్ష్య చైత దఖిలం యథేష్టం కర్తు మర్హసి || || 301 ||

అహం వై యాచితా దేవైః సంజాతా పరమేశ్వరాత్‌ | వినిన్ద్య దక్షం పితరం మహేశ్వరవినిన్దకమ్‌ || || 302 ||

కలారహితమై, ఈశ్వరసంబంధి ఆపరతత్త్వము దర్శింపబడును. అట్లు చూచినవాడు అన్ని సంసారబంధముల నుండి విడువబడి బ్రహ్మమునందే నివసించును. (298)

ఈ పరమశివుడు పరబ్రహ్మముయొక్క ఆశ్రయస్థానము. ఈ మహేశ్వరుడు అద్వితీయుడు, నాశరహితుడు, ఒంటరివాడు, ఆత్మలకాధార భూతమైనవాడునై ఉన్నాడు. (299)

ఓరాజా! జ్ఞానముచేతగాని, కర్మయోగముచేతగాని, భక్తిచే, యోగముచేతనైన అన్ని సంసారబంధములనుండి విడుదలకొరకు ఈశ్వరుని శరణుపొందుము. (300 )

ఓపర్వతరాజా!రహస్యమైన ఉపదేశము నాచేత నీ కొసగబడినది. దీని నంతయు చక్కగా ఆలోచించి, నీ యిష్ట ప్రకారము కర్తవ్యము నాచరింపుము. (301)

పరమేశ్వరుని వలన సంభవించిన నేను, మహేశ్వరుని దూషించిన నా తండ్రియగు దక్షుని నిందించి, దేవతలచేత ప్రార్థింపబడితిని. (302)

ధర్మసంస్థాపనార్థాయ తవా రాధనకారణాత్‌ | మేనాదేహసముత్పన్నా త్వామేవ పితరం శ్రితా || || 303 ||

స త్వం నియోగా ద్దేవస్య బ్రహ్మణః పరమాత్మనః | ప్రదాస్యసే మాం రుద్రాయ స్వయంవరసమాగమే || || 304 ||

తత్సమ్బన్థాన్తరే రాజన్‌ సర్వే దేవాః సవాసవాః | త్వాం నమస్యన్తి వైతాత! ప్రసీదతి చ శంకరః || || 305 ||

తస్మా త్సర్వప్రయత్నేన మాం విద్ధీ శ్వరగోచరామ్‌ | సంపూజ్య దేవ మీశానం శరణ్యం శరణం వ్రజ || || 306 ||

స ఏవ ముక్తో హిమవాన్‌ దేవదేవ్యా గిరీశ్వరః | ప్రణమ్య శిరసా దేవీం ప్రాంజలిః పునర బ్రవీత్‌ || || 307 ||

ధర్మమును స్థాపించుటకొరకు, నిన్నారాధించవలెనను కారణము వలన హిమవంతుని భార్యయగు మేనాదేవి శరీరమునుండి పుట్టి నిన్ను తండ్రిగా ఆశ్రయించితిని. (303)

నీవు పరమాత్మయగు బ్రహ్మదేవుని యొక్క శాసనమువలన స్వయంవర సమావేశములో నన్ను రుద్రునికి భార్యగా అర్పించగలవు. (304)

ఓరాజా! ఆసంబంధకారణమున ఇంద్రునితో కూడ దేవతలందరు నీకు నమస్కరింతురు - దానివలన శంకరుడు కూడ ప్రసన్నుడగును. (305)

అందువలన సంపూర్ణ ప్రయత్నముతో నన్ను ఈశ్వరునికి లక్ష్యమైన దానినిగా గుర్తించుము. భగవంతుడైన ఈశానుని పూజించి శరణు పొందదగిన అతనిని శరణు పొందుము. (306)

దేవతలకు దేవతయగు ఆపార్వతిచేత ఈ విధముగా చెప్పబడిన పర్వతరాజగు హిమవంతుడు దేవికి శిరస్సుతో నమస్కరించి చేతులు జోడించి మరల ఇట్లనెను. (307)

విస్తరేణ మహేశాని యోగం మహేశ్వరం పరమ్‌ | జ్ఞానం వై చాత్మనో యోగం సాధనాని ప్రచక్ష్యమే || || 308 ||

తసై#్య తత్పరమం జ్ఞాన మాత్మనా యోగ ముత్తమమ్‌ | యథావ ద్వ్యాజ హారేశా సాధనాని చ విస్తరాత్‌ || || 309 ||

నిశమ్య వదనామ్భోజా ద్గిరీన్ద్రోలోకపూజతః | లోకమాతుః పరం జ్ఞానం యోగాసక్తో భవ త్పునః || || 310 ||

ప్రదదౌ చ మహేశాయ పార్వతీం భాగ్యగౌరవాత్‌ | నియోగ ద్బ్ర హ్మణః సాధ్వీం దేవానాం చైవ సన్నిధౌ || || 311 ||

ఇమం యఃపఠతే ధ్యాయం దేవ్యామహాత్మ్యకీర్తనమ్‌ | శివస్య సన్నిథౌ భక్త్యా శుచి స్తద్భావ భావితః || || 312 ||

ఓ మహేశ్వరీ! శ్రేష్ఠమైన, మహేశ్వర సంబంధమైన యోగమును, జ్ఞానమును, ఆత్మయోగమును, వాని సాధనములను గూర్చి విస్తరముగా నాకు తెలుపుము. (308)

ఆ యీశ్వరుని యొక్క యీ గొప్ప జ్ఞానమును, ఉత్తమమైన ఆత్మయోగమును, వాని సాధనములను గురించి సమర్థురాలవైన నీవు ఉన్నదున్నట్లు వివరించి చెప్పుము. (309)

లోకమాతయగు పార్వతియొక్క ముఖ పద్మము నుండి ఉత్తమమైన జ్ఞానమార్గమును గూర్చి విని, లోకముచే పూజింపబడు పర్వతరాజు మరల యోగము నందాసక్తుడాయెను. (310)

ఆ హిమవంతుడు, అదృష్టము నందలి గౌరము వలన బ్రహ్మదేవుని ఆజ్ఞ వలన సాధ్వియగు పార్వతిని, దేవతల సన్నిధిలో మహేశ్వరునకు కన్యాదానము చేసెను. (311)

దేవి యొక్క మహాత్య్యమును వర్ణించునట్టి యీ అధ్యాయమును, శుచియై, శివుని సన్నిధి యందు, అతని యందే భావమును నిలిపి ఎవడు భక్తితో పఠించునో

సర్వపాపవినిర్ముక్తో దివ్యయోగసమన్వితః | ఉల్లంఘ్య బ్రహ్మణో లోకం దేవ్యాఃస్ధాన మవాప్నుయాత్‌ || || 313 ||

యశ్చైత త్పఠతి స్తోత్రం బ్రాహ్మణానాం సమీపతః | సమహితమనాః సో పి సర్వపాపైః ప్రముచ్యతే|| || 314 ||

నామ్నా మష్టసహస్రం తు దేవ్యా యత్సముదీరితమ్‌ | జ్ఞాత్వార్కమణ్దలగతా మావాహ్య పరమేశ్వరీమ్‌ || || 315 ||

అభ్యర్చ్య గన్థపుష్పాద్వై ర్భక్తియోగ సమన్వితః | సంస్మర న్పరమం భావం దేవ్యా మహేశ్వరం పరమ్‌ || || 316 ||

అనన్యమానసోని త్యం జపేదా మరణాద్ద్విజ | సో న్తకాలే స్మృతిం లబ్ధ్వా పరం బ్రహ్మాధి గచ్ఛతి || || 317 ||

దివ్యమైన యోగవిద్యతో కూడి, అన్ని పాపముల నుండి తొలగింపబడి, బ్రహ్మలోకమును దాటి దేవి యొక్క స్థానమును పొందగలడు. (313)

ఎవడు ఈస్తోత్రమును బ్రాహ్మణుల సమీపములో చదువునో, ఏకాగ్రత కలిగిన మనస్సుతో కూడి అతడు కూడా అన్ని పాపముల చేత విడువబడుచున్నాడు. (314)

దేవి యొక్క ఒక వేయి పైన ఎనిమిది నామములు ఏవైతే చెప్పబడినవో, వానిని, తెలిసికొని, సూర్యమండల మందు చేరి యున్న పరమేశ్వరిని ఆవాహనము చేసి (315)

భక్తియోగముతో కూడుకొని, చందనము పూలు మొదలగు వానితో పూజించి, దేవియొక్క మహేశ్వర సంబంధమైన దివ్యభావమును, ఆమె ఉన్నతస్థానమును స్మరించుచు, (316)

ఇతరము నందు మనస్సు నిలుపక బ్రాహ్మణుడైన వాడు మరణ పర్యంతము ఎల్లపుడు జపించవలెను. అట్టివాడు అవసాన కాలములో స్మరణను పొంది పరబ్రహ్మమును చేరుకుంటాడు. (317)

అథవా జాయతే విప్రో బ్రాహ్మణస్య శుచౌ కులే | పూర్వసంస్కారమహాత్మ్యాద్‌ బ్రహ్మవిద్యా మవాప్నుయాత్‌ || || 318 ||

సంప్రాప్య యోగం పరమం దివ్యం త త్పారమేశ్వరమ్‌ | శాన్తం సుసంయతో భూత్వా శివసాయుజ్య మాప్నుయాత్‌ || || 319 ||

ప్రత్యేకం చాథ నామాని జుహుయా త్సవనత్రయమ్‌ | మహామారికృతై ర్దోషై ర్గ్రహదోషైశ్చ ముచ్యతే || || 320 ||

జపేద్వా హరహ ర్నిత్యం సంవత్సర మతన్ద్రితః | శ్రీకామః పార్వతీం దేవీం పూజయిత్వా విధానతః || || 321 ||

సంపూజ్య పార్శ్వతః శమ్భుం త్రినేత్రం భక్తిసంయుతః | లభ##తే మహతీం లక్ష్మీం మహాదేవ ప్రసాదతః || || 322 ||

లేదా నిర్మలమైన బ్రాహ్మణుని వంశములో విప్రుడుగా జన్మించును. పూర్వజన్మ సంస్కారపు గొప్పతనము వలన వేదాంత విద్యను సాధించగలడు.(318)

ఉత్తమమైన, దివ్యమైన, పరమేశ్వర సంబంధియైన యోగవిద్యను పొంది, శాంతుడై, ఆత్మనిగ్రహమును పొంది చివరకు శివసాయుజ్యమును పొందును. (319)

త్రికాలముల హోమముల యందు ప్రత్యేకముగా నామాలతో హోమము చేయవలెను. దాని వలన మహామారి వ్యాధి వలన కలిగే దోషములనుండి, గ్రహ సంబంధములైన దోషముల నుండి కూడా విముక్తుడగును. (320)

ఒక సంవత్సరకాలము ప్రతిదినము ఏమరుపాటు లేక యీ నామాలను జపించుట ఐనా చేయవలెను. సంపదను కోరువాడు పార్వతీదేవిని పద్ధతి ప్రకారము పూజించి జపించవలెను. (321 )

ఆ దేవికి పార్శ్యభాగములో మూడు నేత్రములు కల శివుని భక్తిశ్రద్ధలతో పూజించి, ఆ మహాదేవుని అనుగ్రహము వలన గొప్ప సంపదను పొందగలడు. (322)

తస్మాత్సర్వప్రయత్నేన జప్తవ్యం హి ద్విజాతిభిః | సర్వపాపాపనోదార్థం దేవ్యా నామసహస్రకమ్‌ || || 323 ||

సూత ఉవాచ :-

ప్రసజ్గాత్కథితం విప్రా దేవ్యా మహాత్మ్య ముత్తమమ్‌ | అతఃపరం ప్రజాసర్గం భృగ్వాదీనాం నిబోధత|| || 324 ||

ఇతి శ్రీకూర్మపురాణ దేవ్యామహాత్య్మే ద్వాదశోధ్యాయః

అందువలన అన్ని విధముల ప్రయత్నముతో బ్రాహ్మణుల చేత, అన్ని పాపములను తొలగించుకొనుట కొరకు దేవి యొక్క వేయి నామములు జపించదగినవి. (323)

సూతుడు పలికెను -

బ్రాహ్మణులారా! దేవి యొక్క గొప్పనైన యీ మహాత్య్మము మీకు తెలుపబడినది. దీని తరువాత భృగువు మొదలగు వారి ప్రజాసృష్టి క్రమమును గూర్చి తెలిసికొనుడు (324 )

శ్రీకూర్మపురాణములో దేవీ మహాత్మ్యవర్ణనమను ద్వాదశాధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters