Sri Koorma Mahapuranam    Chapters   

చతుర్ధశో7ధ్యాయః

సూత ఉవాచ -

ప్రియవ్రతోత్తానపాదౌ మనోః స్వాయమ్భువస్య తు | ధర్మజ్ఞౌ తౌ మహావీర్యౌ శతరూపా వ్యజీజనత్‌ || || 1||

చతుర్ధశాధ్యాయము

స్వాయంభువ మను వంశము

స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు ధర్మము తెలిసినవారు, గొప్ప పరాక్రమము కలవారు అగు పుత్రులను 'శతరూప' కనెను (1)

తత స్తూత్తానపాదస్య ధ్రువో నామ సుతో 7భవత్‌ | భక్త్యా నారాయణ దేవే ప్రాప్తవాన్‌ స్థాన ముత్తమమ్‌ || || 2 ||

ధ్రువా చ్ఛిష్టిశ్చ భావ్యశ్చ భావ్యా చ్ఛమ్భుర్వ్యజాయత | శిష్టే రాధత్త సుచ్ఛాయా పఞ్చ పుత్రా నకల్మషాన్‌ || || 3 ||

వసిష్ఠవచనా ద్దేవీ తప స్తప్త్వా సుదుశ్చరమ్‌ | ఆరాధ్య పురుషం విష్ణుం శాలగ్రామే జనార్దనమ్‌ || || 4 ||

రిపుం రిపుఞ్జయం విప్రం కపిలం వృషతేజనమ్‌ | నారాయణపరా న్శుద్ధాన్‌ స్వధర్మపరిపాలకాన్‌ || || 5 ||

రిపో రాధాత్త మహిషీ చాక్షుషం సర్వతేజసమ్‌ | సో 7జీజన త్పుష్కరిణ్యాం సురూపం చాక్షుషం మనుమ్‌ || || 6 ||

తరువాత ఆ ఉత్తానపాదునికి ధ్రువుడను కుమారుడు కలిగెను. అతడు భగవంతుడైన నారాయణుని యందలి భక్తి చేత శ్రేష్ఠమైన స్థానమును పొందెను. (2)

ఆ ధ్రువుని వలన శిష్టి, భావ్యుడు అను వారు జన్మించగా, భావ్యుని వలన శంభువు పుట్టెను. శిష్టి వలన అతని భార్య సుచ్ఛాయ పాపరహితులైన అయిదుగురు కుమారులను కనెను. (3)

ఆ సుచ్ఛాయ వసిష్ఠుని మాట ప్రకారం మిక్కిలి కష్ట సాధ్యమైన తపస్సు చేసి, శాలగ్రామ క్షేత్రము వద్ద జనార్దనుడైన విష్ణుదేవుని పూజించి, (4)

రిపువు, రిపుంజయుడు, విప్రుడు, కపిలుడు, వృషతేజసుడు అనువిష్ణుభక్తులు, నిర్మలులు, స్వధర్మమును పరిపాలించువారును అగు పుత్రులను పొందినది. (5)

రిపువు వలన అతని భార్య, సంపూర్ణ తేజస్సు కలిగిన, చక్కని రూపము కలిగిన చాక్షుష మనువును పుష్కరిణి యందు పుత్రునిగా పొందెను. (6)

ప్రజాపతే రాత్మజాయాం వీరణస్య మహాత్మనః | మనో రజాయన్త దశ సుతా స్తే సమహౌజసః || || 7 ||

కన్యాయాం సుమహావీర్యో వైరాజస్య ప్రజాపతేః | ఊరుః పురుః శతద్యుమ్నస్తపస్వీ సత్యవా క్ఛుచిః || || 8 ||

అగ్నిష్టు రతిరాత్రశ్చ సుద్యమ్న శ్చాభిమన్యుకః| ఊరో రజనయ త్పుత్రాన్‌ షడాగ్నేయీ మహాబలాన్‌ || || 9 ||

అజ్గం సుమనసం ఖ్యాతిం క్రతు మాజ్గిరసం శివమ్‌ | అజ్గా ద్వేనో 7భ వ త్ప శ్చాద్వై న్యో వేనా దజాయత || || 10 ||

యో 7సౌ పృథురితి ఖ్యాతః ప్రజాపాలో మహాబలః | యేన దుగ్థా మహీ పూర్వం ప్రజానాం హితకామ్యయా || || 11 ||

మహాత్ముడగు వీరణుడను మనువుకు ప్రజాపతి యొక్క కూతురి యందు చాల గొప్ప బలము కలిగిన పదిమంది కుమారులు కలిగిరి. (7)

విరాట్పుత్రుడైన ప్రజాపతి యొక్క కన్యయందు గొప్పపరాక్రమము కల ఊరువు, పురువు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, శుచి, అగ్నిష్టుత్తు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అభిమన్యుడు అని ఆ పది మంది కుమారుల పేర్లు - ఆగ్నేయి అనునామె, ఊరువు వలన ఆరుగురు కుమారులను, గొప్పబలవంతులను కనెను. (8,9)

అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, ఆంగిరసుడు, శివుడు అని వరుసగా వారి పేర్లు. అంగుని వలన వేనుడను పుత్రుడు కలుగగా, అతనికి వైన్యుడను వాడు జన్మించెను. (10)

ఏ యీ వేనపుత్రుడు పృథువను పేరుతో ప్రసిద్ధుడు, గొప్పబలము కలవాడు ప్రజలను పాలించెనో, ఎవని చేత పూర్వము ప్రజల యొక్క మేలును కోరి భూమి పితుక బడినదో ; (11)

నియోగా ద్బ్రహ్మణః సార్థం దేవేన్ద్రేణ మహౌజసా | వేనపుత్రస్య వితతే పురా పైతామ హే మఖే || || 12 ||

సూతః పౌరాణికో జజ్ఞే మాయారూపః స్వయం హరిః | ప్రవక్తా సర్వశాస్త్రాణాం ధర్మజ్ఞో గురువత్సలః || || 13 ||

తం మాం విత్త ముని శ్రేష్ఠాః పూర్వోద్భూతం సనాతనమ్‌ | అస్మి న్మన్వన్తరే వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్‌ || || 14 ||

శ్రావయామాస మాం ప్రీత్యా పురాణః పురుషో హరిః | మదన్వయే తు యే సూతాః సంభూతా వేదవర్జితాః || || 15 ||

తేషాం పురాణవక్తృత్వం వృత్తి రాసీ దజాజ్ఞయా | స చ వైన్యః పృధుర్దీమా న్సత్యసన్ధో జితేన్ద్రియః || || 16 ||

బ్రహ్మదేవుని శాసనమువలన గొప్పబలవంతుడైన ఇంద్రునితో కూడ, వేనుని కుమారుడైన పృధువుతో, పూర్వము బ్రహ్మదేవుని చేత చేయించబడిన యజ్ఞము నందు, (12)

సూతుడను పౌరాణికుడుగా మాయారూపుడగు విష్ణువే స్వయముగా అవతరించెను. అతడు అన్ని శాస్త్రములను గూర్చి బోధించువాడు, ధర్మము తెలిసినవాడు, పెద్దల యందాదరము కలవాడుగా ఉండెను. (13)

ఓ మునిశ్రేష్ఠులారా ! ఆ సూత పౌరాణికుని, పూర్వమే అవతరించిన, అతి పురాతనుడనైన నన్నుగా తెలిసికొనుడు. ఈ మన్వంతరమందు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు, (14)

పురాణ పురుషుడైన హరియొక్క రూపాంతరమైన వాడు, స్వయముగా ప్రేమతో నాకు వినిపించినవాడు (పురాణకథలను ) నావంశములో జన్మించిన వేదాధికారము లేని యే సూత వంశ.జులు కలరో (15)

వారికి బ్రహ్మదేవుని ఆజ్ఞ చేత పురాణములను ప్రవచించుట వృత్తిగా ఏర్పడినది. పూర్వము చెప్పబడిన వేన పుత్రుడైన ఆ పృథువు బుద్ధి మంతుడు, సత్యవ్రతము కలవాడు, ఇంద్రియములను జయించినవాడుగా ఉండెను. (16)

సార్వభౌమో మహాతేజాః స్వధర్మపరిపాలకః | తస్య బాల్యాత్‌ ప్రభృత్యేవ భక్తి ర్నారాయణ 7భవత్‌ || || 17 ||

గోవర్ధనగిరిం ప్రాప్త స్తప స్తేపే జితే న్ద్రియః | తపసా భగవా న్ప్రీతః శంఖచక్రగదాధరః || || 18 ||

ఆగత్య దేవో రాజానం ప్రాహ దామోదరః స్వయమ్‌ | ధార్మికౌ రూపసమ్పన్నౌ సర్వశస్త్ర భృతాం వరౌ || || 19 ||

మత్ప్రసాదా దసన్దిగ్ధౌ పుత్రౌ తవ భవిష్యతః | ఏవ ముక్త్వా హృషీకేశః స్వకీయాం ప్రకృతిం గతః || || 20 ||

వైన్యో 7పి వేదవిధినా నిశ్చలాం భక్తి ముద్వహన్‌ | సో 7పాలయ త్స్వకం రాజ్యం చిన్తయ న్మధుసూదనమ్‌ || || 21 ||

విశాలమైన భూమిని పాలించువాడు, గొప్ప తేజస్సు కలవాడు, తన ధర్మమును చక్కగా పరిపాలించువాడు ఆ పృధువు. అతనికి చిన్నతనము నుండి యే నారాయణుని యందు భక్తి కలిగినది. (17)

అతడు గోవర్ధనపర్వతమును చేరుకొని, ఇంద్రియములను జయించిన వాడై తపస్సు చేసెను. అతని తపస్సు చేత శంఖ చక్రములను, గదను ధరించిన భగవంతుడగు విష్ణువు సంతోషించెను. (18)

దామోదరుడగు ఆ విష్ణువు స్వయముగా వచ్చి రాజును గూర్చి ఇట్లు పలికెను. "ధర్మమును పాలించువారు, సౌందర్యముతో ఒప్పువారు, ఆయుధములు ధరించిన వారందరిలో శ్రేష్ఠులు. (19)

అగు ఇద్దరు కుమారులు నా అనుగ్రహము వలన నీకు నిశ్చయముగా కలుగుదురు" ఈ విధముగా చెప్పి నారాయణుడు మరల తననివాసమున కరిగెను. (20)

వేనపుత్రుడైన పృథువు కూడ వేదములందు చెప్పబడిన పద్ధతి ప్రకారము నిశ్చలమైన భక్తిని కలిగి, మధుసూదనుడైన విష్ణువును ధ్యానించుచు తన రాజ్యమును పరిపాలించెను. (21)

అచిరాదేవ తన్వజ్గీ భార్యా తస్య శుచిస్మితా | శిఖణ్దినం హవిర్ధాన మన్తర్థానా ద్వ్యజాయత || || 22 ||

శిఖణ్దినో 7భవ త్పుత్రః సుశీల ఇతి విశ్రుతః | ధార్మికో రూపసమ్పన్నో వేదవేదాజ్గపారగః || || 23 ||

సో 7ధీత్యవిధివ ద్వేదాన్‌ ధర్మేణ తపసిఃస్థిత | మతిం చక్రే భాగ్యయోగా త్సన్యాసంప్తతి ధర్మవిత్‌ || || 24 ||

స కృత్వా తీర్థసంసేవాం స్వాధ్యాయే తపసి స్థితః | జగామ హిమవత్పృష్ఠం కదాచి త్సిద్ధసేవితమ్‌ || || 25 ||

తత్ర ధర్మవనం నామ ధర్మసిధ్థిప్రదం వనమ్‌ | అపశ్య ద్యోగినాం గమ్య మగమ్యం బ్రహ్మవిద్విషామ్‌ || || 26 ||

తత్ర మన్దాకినీ నామ సుపుణ్యా విమలా నదీ | పద్మోత్పలవనోపేతా సిద్ధాశ్రమవిభూషితా || || 27 ||

కొద్దికాలమునకే సన్నని శరీరము కలది, స్వచ్ఛమైన చిరునవ్వు కలది అగు అతని భార్య అగ్నిహోత్రరూపుడైన శిఖండిని హవిర్ధానుని అంతర్ధానమై పుత్రునిగా పొందెను. (22)

ఆ శిఖండికి సుశీలు డని ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతడు ధర్మము నాచరించువాడు, సౌందర్యము కలవాడు, వేదములు వేదాంగముల యొక్క పారమును చూచిన వాడుగా ఉండెను. (23)

అతడు శాస్త్రము ప్రకారము వేదములను చదివి ధర్మమార్గముతో తపస్సునందు పూనిక కలవాడై, అదృష్ట వశముచే ధర్మవిదుడైన వాడై సన్న్యాసమునందు బుద్ధిని నిలిపెను. (24)

ఆ సుశీలుడు తీర్ధ స్థలములను సేవించి, వేదాధ్యయనము నందు, తపస్సునందు నిష్ఠకలవాడై ఒక సమయమున సిద్ధులచేత సేవించబడుచున్న హిమాలయశిఖరమును చేరెను. (25)

అక్కడ ధర్మవచనమను పేరుగల ధర్మసిధ్దిని కలిగించునది, యోగులకు పొందదగినది, వేదశత్రువులకు గోచరము కానిది అగు వనము నాతడు చూచెను. (26 )

అక్కడ పుణ్యవతి, నిర్మలమైనది, కమలములు, కలువలతో కూడినది, సిద్ధుల ఆశ్రమాలచే అలంకరింపబడిన మందాకిని అనునది; (27) (ఉండెను)

స తస్యా దక్షిణ తీరే మునీన్ద్రై ర్యోగిభి ర్యుతమ్‌ | సుపుణ్య మాశ్రమం రమ్య మపశ్య త్ర్పీతిసంయుతః || ||28 ||

మాన్దాకినీజలే స్నాత్వా సన్తర్ప్యపితృదేవతాః | అర్చయిత్వా మహాదేవం పుషై#్పః పద్మోత్పలాదిభిః || || 29 ||

ధ్యాత్వార్కసంస్థ మీశానం శిరస్యాధాయ చాఞ్చిలిమ్‌ | సంప్రేక్షమాణో భాస్వన్తం తుష్టావ పరమేశ్వరమ్‌ || || 30 ||

రుద్రాధ్యాయేన గిరిశం రుద్రస్య చరితేన చ | అన్యైశ్చ వివిధైః స్తోత్రైఃశామ్భవై ర్వేదంసంభ##వైః || || 31 ||

అథాస్మిన్నన్తరే 7పశ్య త్సమాయాన్తం మహామునిమ్‌ | శ్వేతాశ్వతరనామానం మహాపాశుపతోత్తమమ్‌ || || 32 ||

అతడు దానియొక్క దక్షిణతీరమందు ముని శ్రేష్ఠులతో, యోగులతో కూడియున్న మిక్కిలి పుణ్యప్రదమైన, అందమైన ఆశ్రయమును ప్రీతితో చూచెను.(28)

ఆమందాకిని నీటిలో స్నానముచేసి, పితృదేవతలకు తర్పణములిచ్చి, తామరలు కలువలు మొద|| పుష్పములతో మహాదేవుని పూజించి; (29)

సూర్యమండలములో నివసించుదేవుని ధ్యానించి, తలపై దోసిలి ఒగ్గి సూర్యునివైపు చూచుచు, పరమేశ్వరుని స్తోత్రము చేసెను. (30)

వేదములోని రుద్రాధ్యాయముతో, రుద్రుని చరిత్ర పఠనముతో, ఇతరములైన అనేక విధముల స్తోత్రములతో, వేదములందు చెప్పబడిన శివునికి సంబంధించిన మంత్రముతో, స్తుతించెను. (31)

ఇంతలో తన వద్దకు వచ్చుచున్న శ్వేతాశ్వతరుడను పేరుగల, పాశుపతులలో గొప్పవాడైన మహామునిని ఆ సుశీలుడు చూచెను. (32)

భస్మసన్దిగ్ధసర్వాజ్గం కౌపీనాచ్ఛాదనాన్వితమ్‌ | తపసా కర్శితాత్మానం శుక్లయజ్ఞోపవీతినమ్‌ || || 33 ||

సమాప్య సంస్తవం శంభోరానన్దాస్రావిలేక్షణః | వవన్దే శిరసా పాదౌ ప్రాంజలి ర్వాక్య మబ్రవీత్‌ || || 34 ||

ధన్యో 7స్మ్యనుగృహీతో 7స్మి యన్మే సాక్షా న్మునీశ్వర | యోగీశ్వరో 7ద్య భగవాన్‌ దృష్టో యోగవిదాం వరః || || 35 ||

అహో మే సుమహ ద్భాగ్యం తపాంసి సఫలాని మే | కిం కరిష్యామి శిష్యో 7హం తవ మాం పాలయానఘ || || 36 ||

సో 7నుగృహ్యాధ రాజానం సుశీలం శీలసంయుతమ్‌ | శిష్యత్వే ప్రతిజగ్రాహ తపసా క్షీణకల్మషమ్‌ || || 37 ||

భస్మము లేపనము చేయబడిన సమస్తావయవములు కలవాడు, కౌపీనమను ఆచ్ఛాదన వస్త్రముతో కూడి యున్నవాడు, తపస్సుచేత కృశించిన శరీరము కలవాడు, తెల్లని యజ్ఞోపవీతము ధరించినవాడు అగు మునిని చూచెను. (33)

అతడు శివుని స్తోత్రమును ముగించి, ఆనంద బాష్పములతో తడిసిన కన్నులు కలవాడై తన తలతో అతని పాదములకు ప్రణామము చేసెను. చేతులు జోడించి యీ వాక్యము పలికెను. (34)

ఓ మునీశ్వరా! యోగీశ్వరుడవు, యోగవేత్తలలో శ్రేష్ఠుడవు, భగవంతుడవగు నీవు సాక్షాత్కరించినావు. అందువలన నేను ధన్యుడనైనాను. అనుగ్రహింపబడినాను.(35)

ఆహా! ఏమి నా యొక్క గొప్ప అదృష్టము! నాతపస్సులు ఫలవంతములైనవి. నీ శిష్యుడనైన నేను మీకు ఏమి సేవచేయవలెనో చెప్పి, పుణ్యాత్ముడా! నన్ను రక్షింపుము. (36)

ఆశ్వేతాశ్వతరమహాముని శీలవంతుడు. రాజు అగు సుశీలుని అనుగ్రహించి, తపస్సు చేత నశించిన పాపములు కల అతనిని తన శిష్యుడుగా స్వీకరించెను. (37)

సాన్న్యాసికం విధిం కృత్న్సం కారయిత్వా విచక్షణః | దదౌ తదైశ్వరం జ్ఞానం స్వశాఖావిహితవ్రతమ్‌ || || 38 ||

అశేషం వేదసారం త త్పశుపాశ విమోచనమ్‌ | అన్త్యాశ్రమ మితిఖ్యాతం బ్రహ్మాదిభి రనుష్ఠితమ్‌ || || 39 ||

ఉవాచ శిష్యా న్సంప్రేక్ష్య యే తదాశ్రమవాసినః | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా బ్రహ్మచర్యపరాయణాః || || 40 ||

మయా ప్రవర్తితాం శాఖా మధీత్యై వేహ యోగినః | సమాసతే మహాదేవం ధ్యాయన్తో విశ్వ మైశ్వరమ్‌ || || 41 ||

ఇహ దేవో మహాదేవో రమమాణః సహోమయా | అధ్యాస్తే భగవానీశో భక్తానా మనుకమ్పయా|| || 42 ||

సన్యాసమునకు సంబంధించిన శాస్త్రవిధిని సంపూర్ణముగా జరిపించి, వివేకవంతుడైన అతడు తమ శాఖయందు విధింపబడిన వ్రతనియమముకల ఈశ్వర విషయక జ్ఞానము నతనికుపదేశించెను. (38)

ఆ జ్ఞానము సమస్త వేదములందలి సారభూతము, ప్రాణుల బంధ రూపాలైన పాశములను విడిపించునది. బ్రహ్మ మొదలగు వారిచే ఆచరింపబడిన చివరి ఆశ్రమమని ప్రసిద్థమైనది. (39)

ఆ ముని ఆశ్రమములో నివసించు వారు బ్రాహ్మణ క్షత్రియ వేశ్యులు, బ్రహ్మచర్య వ్రతమును పాటించువారును అగు యే శిష్యులు కలరో, వారిని చూచి ఆ ముని ఇట్లనెను. (40)

ఇక్కడ యోగులు, నాచేత ప్రవర్తింప జేయబడిన శాఖను అధ్యయనము చేసియే, ఈశ్వర నిర్మితమైన విశ్వమును ధ్యానించుచు మహాదేవుడగు శివుని సేవించుచున్నారు. (41)

ఇక్కడ మహాదేవుడగు శివుడు పార్వతీదేవితో విహరించుచు, భక్తుల యందలి దయాగుణముతో నివసించి ఉన్నాడు. (42)

ఇహాశేషజగద్ధాతా పురా నారాయణః స్వయమ్‌ | ఆరాధయ న్మహాదేవం లోకానాం హితకామ్యయా || || 43 ||

ఇహైనం దేవ మీశానం దేవానా మపి దైవతమ్‌ | ఆరాధ్య మహాతీం సిద్ధిం లేభిరే దేవదానవాః || || 44 ||

ఇహైవ మునయ స్సర్వే మరీచ్యాద్యా మహేశ్వరమ్‌ | దృష్ట్వా తపోబలాద్‌ జ్ఞానం లేభిరే సార్వకాలికమ్‌ || || 45 ||

తస్మాత్త్వమపి రాజేన్ద్ర తపోయోగసమన్వితః | తిష్ఠ నిత్యం మయాసార్ధం తతః సిద్ధి మవాప్స్యసి || || 46 ||

ఏవ మాభాష్య విప్రేన్ద్రో దేవం ధ్యాత్వా పినాకినమ్‌ | ఆచచక్షే మహామస్త్రం యథావ త్సర్వసిద్ధయే || || 47 ||

ఈ ప్రదేశములో పూర్వము సమస్త లోకములను సృష్టించిన నారాయణుడు స్వయముగా, లోకముల మేలునుకోరి, మహాదేవుని పూజించెను. (43)

ఇక్కడ దేవతలకు గూడ దేవుడైన ఈశాన దేవుని ఆరాధించి దేవతలు, రాక్షసులు కూడ గొప్ప సిద్ధిని పొందిరి(44)

ఇచ్చటనే మరీచి మొదలగు మునులందరు మహేశ్వరుని దర్శించి, తమ తపస్సు యొక్క బలమువలన సర్వకాలీనమైన జ్ఞానమును పొందినారు. (45)

ఓ రాజా! అందువలన నీవు కూడ తపస్సు, యోగముతో కూడిన వాడవై నాతో కూడ ఎల్లప్పుడు ఉండుము. దాని వలన నీవు సిద్ధినిపొందగలవు. (46)

ఆ బ్రాహ్మణోత్తముడీవిధముగా పలికి, భగవంతుడైన శివుని ధ్యానించి, అతనికి సర్వసిధ్ధులు కలుగుటకు గాను మహా మంత్రమును విధి ప్రకారమునుపదేశించెను. (47)

సర్వపాపోపశమనం వేదసారం విముక్తిదమ్‌ | అగ్ని రిత్యాదికం పుణ్య మృషిభిః సంప్రవర్తితమ్‌ || || 48 ||

సో7పి తద్వచనా ద్రాజా సుశీలః శ్రద్ధయాన్వితః | సాక్షా త్పాశుపతో భూత్వా వేదాభ్యోసరతో 7భవత్‌ || || 49||

భస్మోద్ధూలితసర్వాజ్గః కన్దమూలఫలాశనః | శాన్తో దాన్తో జితక్రోధః సంన్యాసవిధి మాశ్రితః || || 50 ||

హవిర్ధాన స్తథాగ్నేయ్యాం జనయామాస వై సుతమ్‌ | ప్రాచీనబర్హిషం నామ్నా ధనుర్వేదస్య పారగమ్‌ || || 51 ||

ప్రాచీనబర్హిర్భగవాన్‌ సర్వశస్త్రభృతాంవరః | సముద్రతనయాయాం వైదశపుత్రా నజీచనత్‌ || || 52 ||

ఆ మంత్రము సమస్త పాపములను తొలగించునది, వేదముల సారభూతమైనది, మొక్షమునిచ్చునది, "అగ్నిః" అనునది ఆదియందుకలిగి ఋషులచేత ప్రవర్తింప జేయబడిన పుణ్యమైనది. (48)

ఆ సుశీలుడను రాజుకూడ, అతని మాటలవలన శ్రద్ధతో కూడినవాడై, సాక్షాత్తుగా పాశుపతుడై వేదాభ్యాసమునందు నిమగ్నుగాడాయేను.(49)

భస్మము చేత పూయబడిన సమస్త శరీరము కలవాడు, దుంపలు, వేర్లు, పండ్లు ఆహారముగా కలవాడై, శాంతడు, ఇంద్రియముల నణచినవాడు, కోపమును జియించినవాడు, సంన్యాసవిధి నాశ్రయించినవాడుగా ఆయెను. (50)

హవిర్ధానుడు ఆగ్నేయి యనుభార్యయందు విలువిద్యయందు పారంగతుడైన ప్రాచీనబర్హిషుడను పేరుగల కుమారుని పొందెను. (51)

పూజనీయుడైన ప్రాచీనబర్హి, ఆయుధములను ధరించిన వారందరిలో శ్రేష్ఠుడై సముద్రతనయ యగు తన భార్య యందు పదుగురు కుమారులను కనెను. (52)

ప్రచేతస స్తే విఖ్యాతా రాజానః ప్రథితౌజసః | అధీతవన్తః స్వం వేదం నారాయణపరాయణాః || || 53 ||

దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః | దక్షో జజ్ఞే మహాభాగో యః పూర్వం బ్రహ్మణః సుతః || || 54 ||

స తు దక్షో మహేశేన రుద్రేణ సహ ధీమతా | కృత్వా వివాదం రుద్రేణ శప్తః ప్రాచేతసో7భవత్‌ || || 55 ||

సమాయాన్తం మహాదేవో దక్షం దేవ్యా గృహం హరః | దృష్ట్వా యథోచితాం పూజాం దక్షాయ ప్రదదౌ స్వయమ్‌ || || 56 ||

తదావై తమసావిష్టః సో7ధికాం బ్రహ్మణః సుతః | పూజా మనర్హా మన్విచ్ఛన్‌ జగామ కుపితో గృహమ్‌ || || 57 ||

ఆ కుమారులు ప్రసిద్ధమైన బలముకల రాజులుగా, ప్రచేతసులు అని ప్రఖ్యాతులైరి. తమ శాఖ వేదము నధ్యయనము చేసి నారాయణుని యందు భక్తి కలవారుగా ఉండిరి. (53)

ఆ పదిమంది ప్రచేతసుల వలన మారిష అను స్త్రీ యందు పూర్వము బ్రహ్మదేవుని కుమారుడుగా నుండిన మహానుభావుడైన దక్షప్రజాపతి జన్మించెను. (54)

ఆ ప్రాచేతసుడగు దక్షుడు ధీమంతుడైన మహేశ్వరునితో వివాదము కలిగించుకొని, అతనిచేత శపింపబడెను. (55)

మహాదేవుడైన శివుడు తన దేవియొక్క ఇంటికి వచ్చుచున్న దక్ష ప్రజాపతిని చూచి, అతనికి తగిన అతిథి సత్కారమును స్వయముగా చేసెను. (56)

అప్పుడు బ్రహ్మదేవుని కుమారుడైన దక్షుడు క్రోధముచే ఆక్రమింపబడినవాడై, తనకు జరిగిన సత్కారము తగినదిగా లేదని భావించి తన యింటికి వెళ్ళిపోయెను. (57)

కదాచి త్స్వగృహం ప్రాప్తాం సతీం దక్షః సుదుర్మనాః | భర్త్రా సహ వినింద్యైనాం భర్త్పయామాస వై రుషా || || 58 ||

అన్యే జామాతరః శ్రేష్ఠా భర్తు స్తవ పినాకినః | త్వ మప్యసత్సుతా స్మాకం గృహా ద్గచ్ఛ యథాగతమ్‌ || || 59 ||

తస్య త ద్వాక్య మాకర్ణ్య సా దేవీ శంకరప్రియా | వినిన్ద్య పితరం దక్షం దదా హాత్మాన మాత్మనా || || 60 ||

ప్రణమ్య పశుభర్తారం భర్తారం కృత్తివాససమ్‌ | హిమవద్దుహితా సా భూ త్తపసా తస్య తోషితా || || 61 ||

జ్ఞాత్వా తాం భగవా న్రుద్రః ప్రపన్నార్తిహరో హరః | శశాప దక్షం కుపితః సమాగత్యాథ తద్గృహమ్‌ || || 62 ||

తరువాత ఒక సమయమున తన యింటికి వచ్చిన తన పుత్రికయగు సతీదేవిని దక్షుడు, మిక్కిలి చెడ్డ మనస్సు కలవాడై భర్తతో కూడ ఆమెను నిందించి బెదరించెను. (58)

నీ భర్తయగు శివునికంటె నా తక్కిన అల్లుండ్లందరు శ్రేష్ఠులైనవారు. నీవు కూడా మా పుత్రికలలో దుష్టురాలవు. అందువలన ఇక్కడి నుండి వచ్చిన దారిలో వెళ్ళుము. (59)

ఆ దక్షుని వాక్యమును విని శంకరుని భార్యయగు సతీదేవి, తన తండ్రియగు దక్షుని దూషించి, తన శరీరమును అగ్నిలో దహించు కొనెను. (60)

పశుపతి, చర్మమును వస్త్రముగా ధరించిన భర్తయగు శివునకు నమస్కరించి ఆత్మత్యాగము కావించుకొనెను. తరువాత ఆ సతీదేవి హిమవంతుని తపస్సుచే సంతోషించినదై అతనికి పుత్రికగా జన్మించెను. (61)

ఆశ్రయించిన వారి బాధలను తొలగించు భగవతుడగు రుద్రుడు, ఆమెను తన భార్యగా గుర్తించి, ఆమె మరణమునకు కారణమైన దక్షుని యింటికి వచ్చి అతనిని శపించెను. (62)

త్యక్త్వా దేహ మిమం బ్రాహ్మం క్షత్రియాణాం కులే భవ | స్వస్యాం సుతాయాం మూఢాత్మా పుత్ర ముత్పాదయిష్యసి || || 63 ||

ఏవ ముక్త్వా మహాదేవో య¸° కైలాసపర్వతమ్‌ | స్వాయంభువో7పి కాలేన దక్షః ప్రాచేత సో7భవత్‌ || || 64 ||

ఏత ద్వః కథితం సర్వం మనోః స్వాయమ్భువస్య తు | నిసర్గం దక్షపర్యన్తం శ్రుణ్వతాం పాపనాశనమ్‌ || || 65 ||

ఇతి శ్రీ కూర్మపురాణ రాజవంశానుకీర్తనే చతుర్దశో7ధ్యాయః.

ఈ బ్రహ్మ సంబంధమైన శరీరాన్ని విడిచిపెట్టి క్షత్రియ వంశములో పుట్టుము. నీవు మూఢబుద్ధి కలవాడవై నీ పుత్రిక యందే కుమారునికి జన్మనీయగలవు. (63)

ఇట్లు పలికి మహాదేవుడగు శివుడు కైలాస పర్వతమునకు వెళ్ళెను. ఆ స్వాయంభువుడగు దక్షుడు కూడా కొంతకాలమునకు ప్రాచేతసుడుగా పుట్టెను. (64)

ఇది అంతయు స్వాయంభువ మనువు యొక్క చరిత్ర, దక్షుని వరకు జరిగిన దానిని విను వారి పాపములను తొలగించు దానిని మీకు చెప్పినాను.

శ్రీ కూర్మపురాణములో రాజవంశానుకీర్తన మందు పదునాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters