Sri Koorma Mahapuranam    Chapters   

పఞ్చదశో7ధ్యాయః.

అధదక్షయజ్ఞ విధ్వంసనమ్‌

నైమిషేయాఊచుః:-

దేవానాం దానవానాం చ గన్ధర్వోరగరక్షసామ్‌ | ఉత్పత్తిం విస్తరా ద్ర్బూహి సూత వైవస్వతే7న్తరే || || 1 ||

15వ అధ్యాయము

దక్షయజ్ఞ విధ్వంసనము

నైమిశేయ మునులు పలికిరి :-

ఓ సూతుడా! వైవస్వతమన్వంతరములోని దేవతల యొక్క దానవులయొక్క గంధర్వుల, నాగుల, రాక్షసుల యొక్క పుట్టుకను గూర్చి విపులముగా చెప్పుము. (1)

స శప్తః శమ్భునా పూర్వం దక్షః ప్రాచేతసో నృపః | కిమకార్షీ న్మహాబుద్ధే శ్రోతు మిచ్ఛామ సాంప్రతమ్‌ || || 2 ||

సూత ఉవాచ :-

వక్ష్యే నారాయణ నోక్తం పూర్వకల్పానుషఙ్గికమ్‌ | త్రికాలబద్ధం పాపఘ్నం ప్రజాసర్గస్య విస్తరమ్‌ || || 3 ||

స శప్తః శమ్భునా పూర్వం దక్షః ప్రాచేతసో నృపః | వినిన్ద్య పూర్వవైరేణ గజ్గా ద్వారే7 యజ ద్భవమ్‌ || || 4 ||

దేవాశ్చ సర్వే భాగార్థ మాహృతా విష్ణునా సహ | సహైవ మునిభిః సర్వై రాగతా మునిపుంగావాః || || 5 ||

దృష్ట్వా దేవకులం కృత్స్నం శంకరేణ వినాగతమ్‌ | దధీచో నామ విప్రర్షిః ప్రాచేతస మథా బ్రవీత్‌ || || 6 ||

శివునిచేత పూర్వము శపించబడిన దక్షుడు ప్రాచేతసుడను రాజుగా పుట్టి ఏమిచేసినాడు? గొప్ప బుద్ధికల సూతుడా! మేము దానిని ఇప్పుడు విన గోరుచున్నాము. (2)

సూతుడిట్లు చెప్పెను :-

నారాయణనిచేత చెప్పబడినది, పూర్వకల్పమునకు సంబంధించినది, మూడు కాలములతో సంబంధము కలది, పాపములను నశింప జేయునది అగు ప్రజాసృష్టి యొక్క విస్తరమును చెప్పుదును. (3)

పూర్వము శివునిచేత శపించబడిన దక్షుడు ప్రాచేతసరాజుగా పుట్టి పూర్వపు విరోధ భావముతో శంకరుని దూషించి గంగా ద్వారమను ప్రదేశములో యజ్ఞమును చేసెను. (4)

ఆ యజ్ఞములో భాగమును స్వీకరించుటకుగాను విష్ణువుతో సహ దేవతలందరు ఆహ్వానింపబడిరి. అందరు మునులతో కూడి ముని శ్రేష్ఠులు అక్కడికి వచ్చిరి. (5)

శివుడు లేకుండా అక్కడికి వచ్చిన సమస్త దేవతాసమూహమును చూచి దధీచుడను పేరుగల బ్రాహ్మణముని ప్రాచేతసుని గూర్చి ఇట్లు పలికెను. (6)

దధీచ ఉవాచ :-

బ్రహ్మాద్యాస్తు పిశాచాన్తా యస్యాజ్ఞానువిధాయినః | స దేవః సాంప్రతం రుద్రో విధినా కిం న పూజ్యతే || || 7 ||

దక్ష ఉవాచ :-

సర్వేష్వేవ హి యజ్ఞేషు న భాగః పరికల్పితః | న మన్త్రా భార్యయా సార్థే శంకరస్యేతి నేజ్యతే || || 8 ||

విహస్య దక్షం కుపితో వచః ప్రాహ మహామునిః | శ్రుణ్వతాం సర్వదేవానాం సర్వజ్ఞానమయః స్వయమ్‌ || || 9 ||

దధీచ ఉవాచ :-

యతః ప్రవృత్తి ర్విశ్వాత్మా యశ్చాసౌ పరమేశ్వరః | సంపూజ్యతే సర్వయజ్ఞై ర్విదిత్వాకిం న శంకరః | || 10 ||

న హ్యయం శంకరో రుద్రః సంహర్తా తామసో హరః | నగ్నః కపాలీ విదితో విశ్వాత్మానోపపద్యతే || || 11 ||

దధీచుడిట్లనెను :-

బ్రహ్మ మొదలుకొని పిశాచముల వరకు కలవారందరు ఎవని ఆజ్ఞననుసరించి ప్రవర్తింతురో, అటువంటి భగవంతుడైన రుద్రుడు ఎందుకు శాస్త్ర విధితో పూజింపబడడు? (7)

దక్షుడు పలికెను :-

అన్ని యజ్ఞములందు కూడా శివునికి భాగము కల్పించబడలేదు. భార్యతో కూడియున్న వానికి ఇవ్వదగిన యజ్ఞభాగము భార్యలేని శంకరున కీయదగదని అతనిని పూజించలేదు. (8)

ఆ మాటలకు దధీచుడు కోపించి నవ్వుచూ, అందరు దేవతలు వినుచుండగా సమస్త జ్ఞానమయుడై ఈ మాటలు పలికెను. (9)

ప్రపంచమే తన స్వరూపముగా కలవాడు, పరమేశ్వరుడైనవాడు, ఎవనివలన విశ్వము ప్రవర్తించుచున్నదో, అది తెలిసి సమస్త యజ్ఞముల చేత శంకరుడు పూజింపబడుట లేదా? (10)

దానికి దక్షుడిట్లు బదులిచ్చెను. ఈ రుద్రుడు శంకరుడు కాడు. ప్రపంచమును నశింపజేయు తామసుడైన హరుడు. ఇంకను దిగంబరుడు, కపాలమును ధరించువాడు. ఇతడు విశ్వాత్ముడనుట పొసగదు. (11)

ఈశ్వరో హి జగత్ర్సష్టా ప్రభు ర్నారాయణో హరిః | సత్త్వాత్మకో7సౌ భగవా నిజ్యతే సర్వకర్మసు || || 12 ||

దధీచ ఉవాచ :-

కిం త్వయా భగవా నేష సహస్రాంశు ర్న దృశ్యతే | సర్వలోకైకసంహర్తా కాలాత్మా పరమేశ్వరః || || 13 ||

యం గృహ్ణ న్తీహ విద్వాంసో ధార్మికా బ్రహ్మవాదినః | సో7యం సాక్షీ తీవ్రరుచిః కాలాత్మా పరమేశ్వరః || || 14 ||

ఏష రుద్రో మహాదేవః కపాలీ చ ఘృణీ హరః | ఆదిత్యో భగవా న్సూర్యో నీలగ్రీవో విలోహితః || || 15 ||

సంస్తూయతే సహస్రాంశుః సామగాధ్వర్యుహోతృభిః | పశ్యైనం విశ్వకర్మాణం రుద్రమూర్తిం త్రయీమయమ్‌ || || 16 ||

లోకములను సృజించినవాడు ప్రభువైన నారాయణుడే ఈశ్వరుడు. అతడు సత్త్వగుణ ప్రధానుడు. అన్ని కర్మలయందు ఆ భగవంతుడు పూజింపబడును. (12)

దధీచుడిట్లు పలికెను :-

సహస్ర కిరణములు కల భగవంతుడగు ఈ దేవుడు నీకు కన్పించుట లేదా? సమస్త లోకములను సంహరించువాడు, కాల స్వరూపుడైన పరమేశ్వరుడీతడు. (13)

ఈ విశ్వములో పండితులు, ధార్మికులు, బ్రహ్మమును గూర్చి బోధించువారు ఎవనిని స్వీకరింతురో, అట్టి యితడు సర్వసాక్షి, తీవ్రమైన ప్రకాశము కలవాడు, కాల స్వరూపమైన శంకర సంబంధి శరీర భేదము మాత్రమే. (14)

ఈ రుద్రుడు మహాదేవుడు, కపాలమును ధరించువాడు, దయాశీలుడగు హరుడు. ఇతడే ఆదిత్యుడు, భగవంతుడగు సూర్యుడు, నల్లని కంఠము కలవాడు, విలోహితుడు. (15)

సహస్ర కిరణములు కల సూర్యరూపుడగు దేవుడు సామ, యజుస్సులచేత ఋక్సూక్తములచేత స్తోత్రము చేయబడుచున్నాడు. విశ్వకర్మ, వేదత్రయరూపుడు, రుద్రరూపములోనున్న ఇతనిని చూడుము. (16)

దక్ష ఉవాచ :-

య ఏతే ద్వాదశాదిత్యా ఆగతా యజ్ఞభాగినః | సర్వే సూర్యా ఇతిజ్ఞేయా న హ్యన్యోవిద్యతే రవిః || || 17 ||

ఏవ ముక్తేతు మునయః సమాయాతా దిదృక్షవః | బాఢ మిత్యబ్రువ న్దక్షం తస్య సాహాయ్యకారిణః || || 18 ||

తమసా విష్ణమనసో న పశ్యన్తో వృషధ్వజమ్‌ | సహస్రశో 7థశతశో బహుశోభూ ఏవహి || || 19 ||

నిన్దన్తో వైదికా న్మన్త్రాన్‌ సర్వభూతపతిం హరమ్‌ | అపూజయ న్దక్షవాక్యం మోహితా విష్ణుమాయయా || || 20 ||

దేవాశ్చ సర్వే భాగార్ధ మాగతా వాసవాదయః | నాపశ్యన్దేవ మీశాన మృతే నారాయనం హరిమ్‌ || || 21 ||

దక్షుడిట్లనెను.

ఈ పండ్రెండుమంది ఆదిత్యుల ఎవరైతే యజ్ఞములో భాగమును పొందుటకు వచ్చినారో, వారందరు సూర్యులని తెలియవలెను. వీరుకాక మరొక రవి లేడు. (17)

దక్షుడిట్లుచెప్పగా, మునులందరు చూడగోరినవారై అక్కడికి వచ్చిరి. వారు అతనికి సహాయము చేయువారై దక్షునితో 'అట్లే' యని అంగీకారమును తెలిపిరి. (18)

వారందరు తమోగుణము ఆవరించిన మనస్సుకలవారై, వృషభధ్వజుడైన శివుని గమనించక, వందలు, వేలమార్లు మరల సమస్త భూతపతి యైనశివుని, వైదిక మంత్రములను నిందించుచు, విష్ణువు యొక్క మాయ చేత మోహమును పొందినవారై దక్షుని వాక్యమును గౌరవించిరి. (19, 20)

ఇంద్రుడు మొదలగు దేవతలందరు యజ్ఞభాగమునకు వచ్చినవారై నారాయణుడైన హరిని తప్ప, మహేశ్వరదేవుని చూడకపోయిరి. (21)

హిరణ్యగర్భో భగవాన్‌ బ్రహ్మా బ్రహ్మవిదాం వరః | పశ్యతా మేవ సర్వేషాం క్షణా దన్తరధీయత || || 22 ||

అన్తర్హితే భగవతి దక్షో నారాయణం హరిమ్‌ | రక్షకం జగతాం దేవం జగామ శరణం స్వయమ్‌ || || 23 ||

ప్రవర్తయామాస చ తం యజ్ఞ దక్షో7 థనిర్భయః | రక్షకో భగవా న్విష్ణుః శరణాగతరక్షకః || || 24 ||

పునః ప్రాహ చ తం దక్షం దధీచో భగవా నృషిః | సంప్రేక్ష్యర్షిగణా న్దేవాన్‌ సర్వాన్వై రుద్రవిద్విషః || || 25 ||

అపూజ్యపూజనే చైవ పూజ్యానాం చాప్యపూజనే | నరః పాప మవాప్నోతి మహద్వై నాత్ర సంశయః || || 26 ||

హిరణ్యగర్భుడు, భగవంతుడు, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అయిన బ్రహ్మదేవుడు అందరు చూచుచుండగనే క్షణకాలములో అంతర్ధానమాయెను. (22)

భగవంతుడైన బ్రహ్మ అదృశ్యముకాగా అప్పుడు దక్షుడు లోకములను రక్షించువాడు, దేవదేవుడైన నారాయణరూపియగు హరిని స్వయముగా శరణు పొందెను. (23)

తరువాత ఆ దక్షుడు భయరహితుడై ఆ యజ్ఞమును కొనసాగించెను. శరణు పొందినవారిని కాపాడువాడు, భగవంతుడగు విష్ణువు యజ్ఞమునకు రక్షకుడుగా ఉండెను. (24)

పూజ్యుడైన దధీచుడను ఋషి మరల ఆ దక్షునితో అక్కడ ఉన్న ఋషిగణాలను, దేవతలను, శివుని ద్వేషించు అందరిని చూచుచు ఇట్లు పలికెను. (25)

పూజింపదగని వారిని పూజించుట, పూజ్యులైన వారిని పూజింపకుండుట అను పనుల వలన మనుష్యుడు గొప్ప పాపమును పొందును. ఇందులో సందేహములేదు. (26)

అసతాం ప్రగ్రహో యత్ర సతాం చైవ విమాననా | దణ్డోదైవ కృతస్తత్ర సద్యః పతతి దారుణః || || 27 ||

ఏవ ముక్త్వాధ విప్రర్షిః శశాపే శ్వరవిద్విషః | సమాగతాన్‌ బ్రాహ్మణాం స్తా న్దక్షసాహాయ్యకారిణః || || 28 ||

యస్మా ద్బహిఃకృతో వేదా ద్భవద్భిః పరమేశ్వరః | వినిన్దితో మహాదేవః శంకరో లోకవన్దితః || || 29 ||

భవిష్యన్తి త్రయీభాహ్యాః సర్వే7 పీశ్వరవిద్విషః | నిన్దన్తీ హైశ్వరం మార్గం కుశాస్త్రాసక్తచేతసః || || 30 ||

మిథ్యాధీతసమాచారా మిథ్యాజ్ఞానప్రలాపినః | ప్రాప్య ఘోరం కలియుగం కలిజైః పరిపీడితాః || || 31 ||

ఎక్కడనైతే దుర్జనులను స్వీకరించి సాధువులను అవమానించుట జరుగునో, అక్కడ దైవముచేత చేయబడు శిక్ష భయంకరమైనదిగా ప్రవర్తించును. (27)

ఇట్లు పలికి ఆ బ్రాహ్మణ ఋషి శివద్వేషులైన వారిని ఆ యజ్ఞమునకు వచ్చిన బ్రాహ్మణులను, దక్షునికి సహాయము చేయుచున్న వారిని ఇట్లుశపించెను. (28)

ఏ కారణము వలన మీ చేత పరమేశ్వరుడైన శివుడు వేద సమ్మతమైన యజ్ఞమునుండి దూరము చేయబడినాడో, లోకముచే పూజింపబడు మహాదేవుడగు శంకరుడు మీ చేత దూషింపబడినాడో; (29)

ఆ కారణము వలన మీరందరూ వేదత్రయమునకు దూరులై, దుష్టములైన శాస్త్రములందాసక్తిగల మనస్సుతో కూడిన వారై ఈశ్వర సంబంధి మార్గమును నిందించిన శివద్వేషులుగా మీరు పుట్టగలరు. (30)

అసత్యమైన సమాచారమును అధ్యయనముచేసినవారుగా, అయధార్థజ్ఞానమును గూర్చి మాట్లాడు వారుగా, భయంకరమైన కలియుగమును పొంది, కలి జన్యములైన దోషములచేత పీడింపబడు వారుకాగలరు. (31)

త్యక్త్వా తపోబలం కృత్స్నం గచ్ఛధ్వం నరకా న్పునః | భవిష్యతి హృషీకేశః స్వాశ్రితో 7పి పరాఙ్ముఖః || || 32 ||

ఏవ ముక్త్వా థ విప్రర్షి ర్విరరామ తపోనిధిః | జగామ మనసా రుద్ర మశేషాఘవినాశనమ్‌ || || 33 ||

ఏతస్మి న్నన్తరే దేవీ మహాదేవం మహేశ్వరమ్‌ | పతిం పశుపతిం దేవం జ్ఞాత్వైత త్ర్పాహ సర్వదృక్‌ || || 34 ||

శ్రీదేవ్యువాచ:-

దక్షో యజ్ఞేన యజతే పితా మే పూర్వజన్మని | వినిన్ద్య భవతో భావ మాత్మానం చాపి శంకర || || 35 ||

దేవా మహర్షయ శ్చాసం స్తత్ర సాహాయ్యకారిణః | వినాశ యాశు తం యజ్ఞం వర మేతం వృణోమ్యహమ్‌ || || 36 ||

మీరు తపస్సుచేత సంపాదించిన బలమును పూర్తిగా వదులుకొని నరకలోకములకు వెళ్లుడు. మీచేత ఆశ్రయింపబడిన ఆ విష్ణువుకూడ మీకు వ్యతిరేకుడు కాగలడు. (32)

ఇట్లు పలికి బ్రాహ్మణ ఋషి అగు తపోనిధి దధీచుడు చాలించెను. తరువాత సమస్త పాపములను నశింపజేయునట్టి రుద్రుని, మనస్సుతో చేరుకొనెను. (33)

ఈ లోపల మహాదేవి, సమగ్రదృష్టి కలదై మహేశ్వరుడైన మహాదేవుని, పశుపతిగా, ప్రభువైన దేవునిగా తెలిసికొని యిట్లుపలికెను. (34)

ఓశంకరా! పూర్వజన్మలో నాకు తండ్రియగు దక్షుడు, మీ గొప్పతనమును నిందించి, నన్నుగూడ దూషించి యజ్ఞముతో దేవతలను పూజించినాడు. (35)

ఆ యజ్ఞములో దేవతలు, మహర్షులు కూడ అతనికి సహాయకారులుగా ఉండిరి. ఆ యజ్ఞమును శీఘ్రముగా నశింపజేయుము. నేనీ వరమును కోరుకొనుచున్నాను. (36)

ఏవం విజ్ఞాపితో దేవ్యా దేవదేవః పరః ప్రభుః | ససర్జ సహసా రుద్రం దక్షయజ్ఞజిఘాంసయా || || 37 ||

సహస్రశిరసం క్రుద్ధం సహస్రాక్షం మహాభుజమ్‌ | సహస్రపాణిం దుర్ధర్షం యుగాన్తానలసన్నిభమ్‌ || || 38 ||

దంష్ట్రాకరాలం దుప్ప్రేక్ష్యం శంఖచక్రధరం ప్రభుమ్‌ | దణ్డహస్తం మహానాదం శార్‌ఙ్గిణం భూతిభూషణమ్‌ || || 39 ||

వీరభద్ర ఇతి ఖ్యాతం దేవదేవసమన్వితమ్‌ | స జాత మాత్రో దేవేశ ముపతస్థే కృతాఞ్జలిః || || 40 ||

త మాహ దక్షస్య మఖం వినాశయ శివో7స్తుతే | వినిన్ద్య మాం స యజతే గఙ్గాద్వారే గణశ్వర || || 41 ||

ఈవిధంగా దేవిచేత విన్నవింపబడిన దేవదేవుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞమును నశింపజేయు కోరికతో వెంటనే రుద్రుని సృజించెను. (37)

ఆ రుద్రుడు వేయితలలు కలిగి, కోపముతో కూడిన వాడై, వేయికన్నులు కలిగి, గొప్పభుజములు వేయి చేతులు కలిగి, ఇతరులచేత ఎదిరించశక్యముకానివాడు, ప్రళయకాలపు అగ్నితో సమానుడైయుండెను. (38)

కోరలతో భయంకరుడై, చూచుటకు శక్యముకానివాడుగా, శంఖమును చక్రమును ధరించినవాడు, ప్రభువు, చేతియందు దండముకలవాడు, పెద్ద ధ్వనిచేయువాడు, శార్‌ఙ్గమును ధరించినవాడు, భస్మము అలంకారముగా కలవాడుగా ఆ రుద్రుడుండెను. (39)

దేవదేవుడైన ఈశ్వరునితో కూడి వీరభద్రుడని ప్రసిద్ధుడైన రుద్రుని సృజించగా, అతడు పుట్టిన వెంటనే, చేతులు జోడించినవాడై దేవతలకు ప్రభువైన పరమేశ్వరుని వద్దకు చేరెను. (40)

పరమశివుడు ఆ వీరభద్రునితో ఇట్లనెను. ''నీవువెళ్లి దక్షుడు చేయు యజ్ఞమును భంగము చేయుము, నీకు శుభముకలుగుతుంది. ఓ గణశ్వరా! ఆదక్షుడు నన్ను దూషించి గంగానదీ ముఖప్రాంతములో యజ్ఞము చేయుచున్నాడు. (41)

తతో బన్ధప్రముక్తేన సింహే నైకేన లీలయా | వీరభ##ద్రేణ దక్షస్య వినాశ మగమ త్క్రతుః || || 42 ||

మన్యునా చోమయా సృష్టా భద్రకాలీ మహేశ్వరీ | తయా చ సార్ధం వృషభం సమారుహ్య య¸° గణః || || 43 ||

అన్యే సహస్రశో రుద్రా నిసృష్టా స్తేన ధీమతా | రోమజా ఇతి విఖ్యాతా స్తస్య సాహాయ్యకారిణః || || 44 ||

శూలశక్తిగదాహస్తా దణ్డోపలకరా స్తథా | కాలాగ్నిరుద్రసంకాశా నాదయన్తో దిశో దశ || || 45 ||

సర్వే వృషభ మారూఢా సభార్యా శ్చాతి భీషణాః | సమావృత్య గణశ్రేష్ఠం యయు ర్దక్షమఖంప్రతి || || 46 ||

తరువాత వీరభద్రుని చేత బంధనము నుండి విడువబడిన ఒక సింహముచేత విలాసముతో వలె సులభముగా దక్షుని యజ్ఞము నాశము పొందెను. (42)

శివుని పత్నియగు ఉమచేతకూడ క్రోధముతో మహేశ్వరి అను భద్రకాళి సృష్టించబడినది. ఆమెతో కూడ కలసి వీరభద్రుని గణము ఎద్దునెక్కి వెళ్లెను. (43)

బుద్ధిమంతుడైన వీరభద్రునిచేత, తనకు సహాయము చేయువారుగా రోమజులు అనుపేరుతో ప్రసిద్ధులైన ఇతరరుద్రులు వేలకొలది సృజింపబడిరి. (44)

ఆ రుద్రులు శూలము, శక్తి గద అను ఆయుధాలను చేతులలో ధరించినవారు, కఱ్ఱలు, శిలలు చేతులందు కలవారు, ప్రళయకాలమందలి అగ్నితో సమానులు, పది దిక్కులయందు ధ్వనులను నింపుచున్నవారు అయి ఉండిరి. (45)

వారందరు తమభార్యలతో కూడి వృషభమునెక్కి యుండిరి. మిక్కిలి భయంకరరూపులై తమగణాధిపతి అయిన వీరభద్రుని చుట్టుచేరి దక్షుని యజ్ఞప్రదేశమును గూర్చి వెళ్లిరి. (46)

సర్వే సంప్రాప్య తం దేశం గఙ్గాద్వార మితి శ్రుతమ్‌ | దదృశు ర్యజ్ఞదేశం వై దక్షస్యా మితతేజసః || || 47 ||

దేవాఙ్గనాసహస్రాఢ్య మప్సరోగీతనాదితమ్‌ | వేణువీణానినాదాఢ్యం వేదవాదాభినాదితమ్‌ || || 48 ||

దృష్ట్వా సహర్షిభి ర్దేవైః సమాసీనం ప్రజాపతిమ్‌ | ఉవాచ సప్రియో రుద్రై ర్వీరభద్రః స్మయన్నివ || || 49 ||

వయం హ్యనుచరా స్సర్వే శర్వస్యా మితతేజసః | భాగార్ధం లిప్సయా భాగాన్‌ ప్రాప్తా యచ్ఛత్వ భీప్సితాన్‌ || || 50 ||

అథ చే త్కస్య చిదియం మాయా మునివరోత్తమాః | భాగో భవద్భ్యోదేయస్తు నాస్మభ్య మితి కథ్యతామ్‌ || || 51 ||

వారందరు గంగాద్వారమను పేరుతో ప్రసిద్ధమైన ఆ ప్రదేశమునుచేరుకుని, అధికమైన తేజస్సుకల దక్షుని యొక్కయజ్ఞముజరుగు చోటును చూచిరి. (47)

ఆ ప్రదేశము వేలకొలది దేవతాస్త్రీలతో నిండినది, అప్సరసల పాటలతో ధ్వనించునది, వేణువు, వీణవంటి వాద్యముల ధ్వనితోకూడినది, వేదమంత్రోచ్చారణతో ప్రతిధ్వనించునదిగా ఉండెను. (48)

ఋషులతో, దేవతలతో కూడ కూర్చుండియున్న దక్షప్రజాపతిని చూచి, వీరభద్రుడు రుద్రులతో గూడి నవ్వుచున్నవానివలె ఇట్లు పలికెను. (49)

మేమందరము అమితమైన తేజస్సుకల శివుని యొక్క అనుచరులము - యజ్ఞములో భాగమును పొందు కోరికతో ఇక్కడికి వచ్చినాము. ఈ దక్షుడు మాకు కోరిన యజ్ఞభాగములనిచ్చుగాక (50)

ఓ ముని శ్రేష్ఠులారా ! ''ఈ యజ్ఞములో భాగము మీకు మాత్రమీయదగినది, మాకీయదగదు'' అని ఎవరైనా మాయను ప్రయోగించినారా? తెలుపుడు. (51)

తంబ్రూతా జ్ఞాపయతి యో వేత్స్యామో హి వయం తతః | ఏవ ముక్తా గణశేన ప్రజాపతి పురస్సరాః || || 52 ||

దేవా ఊచుః :-

ప్రమాణం వో న జానీమో భాగే మన్త్రా ఇతి ప్రభుమ్‌ | మన్త్రా ఊచుః సురా యూయం తమోపహతచేతసః || || 53 ||

యే నాధ్వరస్య రాజానం పూజయేయు ర్మహేశ్వరమ్‌ | ఈశ్వరః సర్వభూతానాం సర్వదేవతను ర్హరః || || 54 ||

పూజ్యతే సర్వయజ్ఞేషు సర్వాభ్యుదయసిద్ధిదః | ఏవ ముక్త్వా మహేశానమాయయా నష్టచేతనాః || || 55 ||

న మేనిరే యయు ర్మన్త్రా దేవా న్ముక్త్వా స్వమాలయమ్‌ | తతః సభద్రో భగవాన్‌ సభార్యః సగణశ్వరః || || 56 ||

ఎవడు ఆ విధముగా ఆజ్ఞాపించుచున్నాడో అతనిని గూర్చి మాకు తెలుపుడు. మేము అతనివలన విషయము తెలిసికొందుము. ఈ రీతిగా గణనాధుడైన వీరభద్రునిచేత పలుకబడిన బ్రహ్మ మొదలగు దేవతలు ఇట్లు చెప్పిరి. (52)

''యజ్ఞములో మీకు భాగమిచ్చువిషయములో ప్రమాణములైన మంత్రమును మేమెరుగము''. అని దేవతలనగా, మంత్రములు ''దేవతలగు మీరు తమోగుణముచేత నష్టమైన మనస్సుకలవారు'' (53)

''యజ్ఞమునకు ప్రభువైన మహేశ్వరుని మీరు పూజింపరు - ఆయీశ్వరుడు సమస్త ప్రాణులకు అధిపతి. అందరు దేవతలు తన శరీరముగా కలవాడు హరుడు''. (54)

''అన్నివిధముల అభ్యుదయమును, కార్యసిద్ధిని కలిగించు ఆ శివుడు అన్ని యజ్ఞములందు పూజింపబడుచున్నాడు''. అని పలికి ఆ మంత్రములు మహేశ్వరుని మాయచేత చైతన్యమును కోల్పోయినవి. (55)

ఆ మంత్రములు దేవతలను విడిచి తమస్థానములకు వెళ్లినవి. తరువాత పూజ్యుడగు ఆ భద్రుడు, భార్యతో, గణశ్వరునితో కూడినవాడై (56)

స్పృశ న్కరాభ్యాం విప్రర్షిం దధీచం ప్రాహ దేవహా | మన్త్రాః ప్రమాణం న కృతా యుష్మాభి ర్బలదర్వితైః || || 57 ||

యస్మా త్ప్రసహ్య తస్మా ద్వో నాశయా మ్యద్య గర్వితాన్‌ | ఇత్యుక్త్వా యజ్ఞశాలాం తాం దదాహ గణపుఙ్గవః || || 58 ||

గణశ్వరాశ్చ సంక్రుద్ధా యూపా నుత్పాట్య చిక్షిపుః | ప్రస్తోత్రా సహహోత్రాచ అశ్వం చైవ గణశ్వరాః || || 59 ||

గృహీత్వా భీషణాః సర్వే గఙ్గాస్రోతసి చిక్షిపుః | వీరభద్రో7పి దీప్తాత్మా శక్రసై#్యవో ద్యతం కరమ్‌ || || 60 ||

వ్యష్టమ్భయ దదీనాత్మా తథా న్యేషాం దివౌకసామ్‌ | భగనేత్రే తథోత్సాట్య కరాగ్రేణౖవ లీలయా || || 61 ||

బ్రాహ్మణ మునియగు దధీచుని తనచేతితో తాకుచు ఇట్లు పలికెను. బలముతో గర్వించిన మీచేత మంత్రములు ప్రమాణముగా గ్రహించబడలేదు. (57)

ఏకారణముచే మీరట్లు చేసితిరో, అందువలన గర్వముకల మిమ్ములను బలాత్కారముగ నశింపజేయుదును. ఇట్లుపలికి ఆ గణశ్రేష్ఠుడు దక్షుని యజ్ఞశాలను కాల్చివేసెను. (58)

ఇతర గణపతులు కూడ కోపించినవారై యూపస్తంభాలను పెకిలించి విసరివేసిరి. ప్రస్తోత, హోతలతో కూడ యజ్ఞాశ్వమును గూడ, (59)

వశము చేసుకొని, భయంకరరూపులై గంగాప్రవాహములోపడవైచిరి. వీరభద్రుడు కూడ మండుచున్న హృదయము కలవాడై, ఇంద్రుని యొక్క ఎత్తబడినచేతిని, (60)

స్తంభింపజేసెను. ఇతరదేవతలు పోరుటకు పైకెత్తిన చేతులను గూడఅట్లే కదలకుండ చేసెను. ఆ వీరభద్రుడు తనచేతికొనతో సులభముగా భగునికన్నులను పెరికివైచి; (61)

నిహత్య ముష్టినా దన్తాన్‌ పూష్ణ శ్చైవ మపాతయత్‌ | తథా చన్ద్రమసం దేవం పాదాఙ్గుష్ఠేన లీలయా || || 62 ||

ధర్షయామాస బలవాన్‌ స్మయమానో గణశ్వరః | వహ్నే ర్హస్తద్వయం ఛిత్వా జిహ్వా ముత్పాట్య లీలయా || || 63 ||

జఘాన మూర్ధ్ని పాదేన మునీనపి మునీశ్వరాః | తథా విష్ణుం సగరుడం సమాయాన్తం మహాబలః || || 64 ||

వివ్యాధ నిశితై ర్బాణౖః స్తమ్భయిత్వా సుదర్శనమ్‌ | సమాలోక్య మహాబాహు రాగత్య గరుడో గణమ్‌ || || 65 ||

పూష యొక్క దంతములను తన పిడికిలితో కొట్టి అతనిని పడవేసెను. అదేవిధముగా చంద్రదేవుని తనకాలిబొటనవేలితో విలాసముగా; (62)

బలవంతుడైన ఆ గణాధిపతి నవ్వుచు బెదిరించెను. అగ్నిహోత్రుని రెండుచేతులను నరికి, నాలుకను విలాసముతో పెకలించి; (63)

ఓ మునీశ్వరులారా! అతడు మునులనుగూడ తనకాలితో శిరస్సులపై కొట్టెను. అట్లే గరుత్మంతునితో కూడ వచ్చుచున్న విష్ణువును గొప్పబలముకల అతడు; (64)

విష్ణువు చక్రమును స్తంభింప జేసి వాడిబాణములతో బాధించెను. గొప్పభుజములు కల గరుడుడు వచ్చి ఆ వీరభద్రుని గణమును చూచి; (65)

తనరెక్కలతో అకస్మాత్తుగా కొట్టెను. తరువాత సముద్రము వలె ధ్వని చేసెను. తరువాత రుద్రుడు స్వయముగా వేలకొలది గరుడులను సృజించెను. (66)

వైనతేయా దభ్యధికాన్‌ గరుడం తే ప్రదుద్రువుః | తాన్‌ దృష్ట్వా గరుడో ధీమాన్‌ పలాయత మహాజవః || || 67 ||

విసృజ్య మాధవం వేగా త్త దద్భుత మివా భవత్‌ | అన్తర్హితే వైనతేయే భగవాన్‌ పద్మసమ్భవః || || 68 ||

ఆగత్య వారయామాస వీరభద్రం చ కేశవమ్‌ | ప్రసాదయామాస చ తం గౌరవా త్పరమేష్ఠినః || || 69 ||

సంస్తూయ భగవా నీశం శమ్భు స్తత్రా గమ త్స్వయమ్‌ | వీక్ష్య దేవాధిదేవం త ముమాం సర్వగుణౖ ర్వృతామ్‌ || || 70 ||

గరుత్మంతునికంటె అధికబలవంతులను సృజింపగా వారు గరుత్మంతుని తరిమివేసిరి. వారిని చూచి బుద్ధిమంతుడైన గరుడుడు గొప్పవేగముకలవాడై పారిపోయెను. (67)

నారాయణుని - విడిచి అతడు వెళ్లగా అది ఆశ్చర్య కరమాయెను. వినతా పుత్రుడైన గరుత్మంతుడు అదృశ్యముకాగా భగవంతుడైన బ్రహ్మదేవుడు; (68)

వచ్చి వీరభద్రుని, విష్ణువును గూడ పోరాటమునుండి విరమింపజేసెను. పరమేష్ఠియగు బ్రహ్మయందలి గౌరవభావము వలన, అతనిని ప్రసన్నునిగా చేసెను. (69)

భగవంతుడగు శంభుడు స్వయముగా అక్కడికి వచ్చెను. దేవాధిదేవుడైన యీశ్వరుని సమస్తగుణములతో కూడి యున్న పార్వతిని చూచి భగవంతుడగు బ్రహ్మదేవుడు, దక్షుడు, దేవతలందరు ఈశ్వరుని అర్ధశరీరమును ధరించిన పార్వతీదేవిని విశేషముగా స్తుతించిరి. (70, 71)

స్తోత్రై ర్నానావిధై ర్దక్షః ప్రణమ్య చ కృతాఞ్జలిః | తతో భగవతీ దేవీ ప్రహసన్తీ మహేశ్వరమ్‌ || || 72 ||

ప్రసన్నమనసా రుద్రం వచః ప్రాహ ఘృణానిధిః | త్వమేవ జగతః స్రష్టా శాసితాచైవ రక్షితా || || 73 ||

అనుగ్రాహ్యో భగవతా దక్ష శ్చాపి దివౌకసః | తతః ప్రహస్య భగవాన్‌ కపర్దీ నీలలోహితః || || 74 ||

ఉవాచ ప్రణతా న్దేవాన్‌ ప్రాచేతస మథో హరః | గచ్ఛధ్వం దేవతా స్సర్వాః ప్రసన్నో భవతా మహమ్‌ || || 75 ||

సంపూజ్యః సర్వయజ్ఞేషు న నిన్ద్యో 7హం విశేషతః | త్వం చాపి శృణు మే దక్ష వచనం సర్వరక్షణమ్‌ || || 76 ||

దక్షుడు అనేక విధములైన స్తోత్రములతో, దోసిలి పట్టి నమస్కరించెను. తరువాత పూజ్యురాలైన దేవి నవ్వుచున్నదై, మహేశ్వరుడగు; (72)

రుద్రుని గూర్చి ప్రసన్నమైన మనస్సుతో, దయకునిధివంటిది కావున, ''నీవేయీ లోకమునకు సృష్టికర్తవు, కాపాడువాడవు, శాసించువాడవు కూడ; (73)

పూజ్యుడవైన నీ చేత దక్షుడు మరియుదేవతలు కూడ దయ చూపబడదగినవారు.'' అనిదేవి పలుకగా భగవంతుడు, జటాజూటము కలవాడు, నీలలోహితుడును అగు శివుడు నవ్వి; (74)

తనకు నమస్కరించుచున్న దేవతలను గూర్చి, ప్రాచేతసుని గూర్చి కూడ ఇట్లు పలికెను. ''దేవతలు మీరందరు వెళ్లుడు. మీకు నేను ప్రసన్నుడనైనాను. (75)

అన్ని యజ్ఞములయందును పూజింపదగిన నేను, విశేషముగా దూషింపబడుటకు తగను. దక్షుడా! నీవుకూడ, అందరిని రక్షించగలనామాటను వినుము. (76)

త్యక్త్వా లోకైషణా మేతాం మద్భక్తోభవ యత్నతః | భవిష్యసి గణశానః కల్పాన్తే7నుగ్రహా న్మమ || || 77 ||

తావత్తిష్ఠ మమాదేశా త్స్వాధికారేషు నిర్వృతః | ఏవ ముక్త్వా తు భగవాన్‌ సపత్నీకః సహానుగః || || 78 ||

అదర్శన మనుప్రాప్తో దక్షస్యామితతేజసః | అన్తర్హితే మహాదేవే శంకరే పద్మసమ్భవః || || 79 ||

వ్యాజహార స్వయం దక్ష మశేషజగతో హితమ్‌ | || 80 ||

బ్రహ్మోవాచ :-

కిం చాయం భవతో మోహః ప్రసన్నో వృషభధ్వజే ||

యదా చ స స్వయం దేవః పాలయే త్త్వా మతన్ద్రితః | సర్వేషా మేవ భూతానాం హృద్యేష పరమేశ్వరః || || 81 ||

లోకాధిపత్యముపై ఈ కోరికను వదిలి ప్రయత్నపూర్వకముగా నాభక్తుడవు కమ్ము. ఈ కల్పము యొక్క సమాప్తి కాగా నీవు నా దయవలన గణాధిపతివి కాగలవు. (77)

అంతవరకు నా ఆజ్ఞవలన నీ అధికారబాధ్యతలయందు సుఖముగా ఉండుము. ఇట్లు పలికి భగవంతుడగు రుద్రుడు భార్యతో, అనుచరులతో కూడినవాడై; (78)

అధికమైన తేజస్సుకల దక్షునికి అదృశ్యుడాయెను. మహాదేవుడైన శివుడు అంతర్ధానము చెందగా కమలసంభవుడైన బ్రహ్మ; (79)

దక్షునుద్దేశించి, సమస్తలోకములకు మేలుకలిగించుమాటను స్వయముగా ఇట్లు పలికెను. వృషభధ్వజుడగు శంకరుడు నీకు ప్రసన్నుడుకాగా, ఇంక నీకీమోహమెందులకు? (80)

ఆ దేవుడే స్వయముగా జాగరూకతతో నిన్ను రక్షించును. లోకములోని సమస్త ప్రాణులయొక్క హృదయములందు ఈ పరమేశ్వరుడు వసించుచున్నాడు. (81)

పశ్యన్తి యం బ్రహ్మభూతా విద్వాంసో వేదవాదినః | స చాత్మా సర్వభూతానాం స బీజం పరమాగతిః || || 82 ||

స్తూయతే వైదికై ర్మన్త్రైః దేవదేవో మహేశ్వరః | త మర్చయన్తి య రుద్రం స్వాత్మనా చ సనాతనమ్‌ || || 83 ||

చేతసా భావయుక్తేన తే యాన్తి పరమంపదమ్‌ | తస్మా దనాదిమధ్యాన్తం విజ్ఞాయ పరమేశ్వరమ్‌ || || 84 ||

కర్మణా మనసా వాచా సమారాధయ యత్నతః | యత్నా త్పరిహరేశస్య నిన్దాం స్వాత్మవినాశనీమ్‌ || || 85 ||

భవన్తి సర్వదోషాయ నిన్దకస్య క్రియా హి తాః | యస్తు చైష మహాయోగీ రక్షకో విష్ణు రవ్యయః || || 86 ||

ఎవనిని పండితులు, వేదములను ప్రవచించువారు, బ్రహ్మస్వరూపులైనవారు చూచుచున్నారో, అతడు సమస్త భూతములకు ఆత్మరూపుడు, బీజభూతుడు, ఉత్తమమైన గమ్యమైయున్నాడు. (82)

దేవతలకు దేవుడైన ఆ మహేశ్వరుడు వేదసంబంధములైన మంత్రములచే కొనియాడబడుచున్నాడు. సనాతనుడైన రుద్రుని ఎవరైతే తమ హృదయపూర్వకముగా పూజింతురో; (83)

శ్రద్ధాభావముతో కూడిన మనస్సుతో అర్చించువారు శ్రేష్ఠమైన పరమాత్మస్థానమును పొందుదురు. అందువలన ఆది మధ్యాంతములు లేని పరమేశ్వరుని గూర్చి తెలుసుకొని; (84)

మనస్సుతో, కర్మతో, వాక్కుతో గూడ ప్రయత్నపూర్వకముగా పూజింపుము. ఆత్మవినాశనమును కలిగించు ఈశ్వరుని నిందను ప్రయత్న పూర్వకముగా విడిచిపెట్టుము. (85)

ఈశ్వరనిందకుడైన వాని ఆక్రియలు సమస్తదోషములకు కారణములగుచున్నవి. గొప్పయోగీశ్వరుడగు, రక్షకుడైన, నాశరహితుడైన యీ విష్ణువు; (86)

స దేవో భగవాన్రుద్రో మహాదేవో న సంశయః | మన్యన్తే యే జగద్యోనిం విభిన్నం విష్ణు మీశ్వారత్‌ || || 87 ||

మోహా దవేదనిష్ఠత్వా త్తే యాన్తి తి నరకం నరాః | వేదానువర్తినో రుద్రం దేవం నారాయణం తథా || || 88 ||

ఏకీభావేన పశ్యన్తి ముక్తిభాజో భవన్తి తే | యో విష్ణుః స స్వయం రుద్రో యోరుద్రః స జనార్దనః || || 89 ||

ఇతి మత్వా భ##జే ద్దేవం స యాతి పరమాం గతిమ్‌ || సృజత్యేష జగత్సర్వం విష్ణు స్తత్పశ్యతీశ్వరః || || 90 ||

ఇత్థం జగ త్సర్వమిదం రుద్రనారాయణోద్భవమ్‌ | తస్మాత్త్పక్త్వాహరే ర్నిన్దాం హరే చాపి సమాహితః || || 91 ||

భగవంతుడైన రుద్రుడు, మహాదేవుడు. దానిలో సందేహములేదు - ఎవరైతే జగత్తునకు కారణభూతుడైన విష్ణువును ఈశ్వరుని కంటె వేరైన వానిగా తలతురో; (87)

మోహమువలన, వేదమునందు విశ్వాసములేనందువలన అటువంటి మనుష్యులు నరకమునకు వెళ్లుదురు. వేదమార్గముననుసరించు వారు దేవుడైనశివుని, అట్లే నారాయణుని గూడ; (88)

అభేదభావముతో చూతురు. అట్టివారు మోక్షమును పొందుదురు. ఎవరు విష్ణువో, అతడు స్వయముగా రుద్రుడే. ఎవడు శివుడో అతడు జనార్దనుడగు విష్ణువే. (89)

అని తలచి ఆదేవుని సేవించవలెను. అట్టివాడు ఉన్నతమైన గతిని పొందగలడు. ఈలోకమునంతటిని విష్ణువు సృజించుచున్నాడు. దానిని ఈశ్వరుడు కాపాడుచున్నాడు. (90)

ఈవిధముగా ఈప్రపంచమంతయు శివనారాయణుల వలన పుట్టినది. అందువలన విష్ణువుయొక్క నిందను విడిచి శివునియందు కూడ శ్రద్ధకలవాడవై; (91)

సమాశ్రయ మహాదేవం శరణ్యం బ్రహ్మవాదినామ్‌ | ఉపశ్రుత్యాథ వచనం విరిఞ్చస్య ప్రజాపతిః || || 92 ||

జగామ శరణం దేవం గోపతిం కృత్తివాససమ్‌ | యే7న్యే శాపాగ్నినిర్దగ్ధాః దధీచస్య మహర్షయః || || 93 ||

ద్విషన్తో మోహితా దేవం సంబభూవుః కలిష్వథ | త్యక్త్వా తపోబలం కృత్స్నం విప్రాణాం కులసమ్భవాః || || 94 ||

పూర్వసంస్కారమాహాత్మ్యా ద్ర్మహ్మణో వచనా దిహ | ముక్తశాపా స్తతః సర్వే కల్పాన్తే రౌరవాదిషు || || 95 ||

నిపాత్యమానాః కాలేన సంప్రాప్యా దిత్యవర్చసమ్‌ | బ్రహ్మాణం జగతా మీశ మనుజ్ఞాతాః స్వయంభువా || || 96 ||

బ్రహ్మవాదులైన వారికి శరణుపొంద దగినవాడగు మహాదేవునాశ్రయింపుము''. అప్పుడు బ్రహ్మదేవుని మాటనువిని దక్షప్రజాపతి (92) గోవులకు ప్రభువు, చర్మమువస్త్రముగా ధరించిన ఈశ్వరదేవుని శరణుపొందెను. దధీచుని శాపాగ్ని చేత కాల్చివేయబడినయే ఇతర మహర్షులు కలరో; (93) మోహవశులై శివుని ద్వేషించుచు కలియుగమునందు జన్మించినవారై, బ్రాహ్మణకులములో జన్మించి, సమస్తమైన తపోబలమును విడిచిపెట్టిరి; (94) పూర్వజన్మ సంస్కారము గొప్పతనమువలన, బ్రహ్మదేవునిమాటవలన, శాపము నుండి విముక్తులై అందరు కల్పాంత కాలములో రౌరవము మొదలుగా గల నరకములయందు; (95) త్రోయబడుచు కొంతకాలముగడువగా, సూర్యునివంటి తేజస్సుకలిగిన, లోకములకు ప్రభువైన బ్రహ్మనుచేరి ఆబ్రహ్మదేవునిచే అనుజ్ఞపొందినవారై; (96)

సమారాధ్య తపోయోగా దీశానం త్రిదశాధిపమ్‌ | భవిష్యన్తి యథాపూర్వం శంకరస్య ప్రసాదతః || || 97 ||

ఏత ద్వః కధితం సర్వం దక్షయజ్ఞనిషూదనమ్‌ | శ్రుణుధ్వం దక్షపుత్రీణాం సర్వాసాం చైవ సన్తతిమ్‌ || || 99 ||

ఇతి శ్రీ కూర్మపురాణ దక్షయజ్ఞవిధ్వంసోనామ పఞ్చదశో7ధ్యాయః

దేవతలకు ప్రభువైన ఈశానుని పూజించి, తపశ్శక్తివలన శంకరుని అనుగ్రహమువలన మరల పూర్వము వలె అగుదురు. (97)

దక్షయజ్ఞవినాశనముకు సంబంధించిన యీవిషయమంతయు మీకు చెప్పబడినది. ఇక దక్షపుత్రికలందరి యొక్క సంతాన వివరములను వినుడు. (98)

శ్రీ కూర్మపురాణములో దక్షయజ్ఞ విధ్వంసమను పదునైదవ అధ్యాయము సమాప్తము.

అథదక్షకన్యావంశకథనమ్‌

Sri Koorma Mahapuranam    Chapters