Sri Koorma Mahapuranam
Chapters
అధత్రివిక్రమచరితమ్ సప్తదశో7ధ్యాయః సూతఉవాచ అన్ధకే నిగృహీతే వై ప్రహ్లాదస్య మహాత్మనః | విరోచనో నామ బలీ బభూవ నృపతిః సుతః ||
|| 1 || దేవా ఞ్జిత్వా స దేవేన్ద్రాన్ బహూ న్వర్షా న్మహాసురః | పాలయామాస ధర్మేణ త్రైలోక్యం సచరాచరమ్ ||
|| 2 || తసై#్యవం వర్తమానస్య కదాచి ద్విష్ణుచోదితః | సనత్కుమారో భగవాన్ పురం ప్రాప మహామునిః ||
|| 3 || గత్వా సింహాసనగతో బ్రహ్మపుత్రం మహాసురః | ననామో త్థాయ శిరసా ప్రాంజలి ర్వాక్య మబ్రవీత్ || || 4 || పదునేడవ అధ్యాయము త్రివిక్రమచరితము అంధకాసురుడు నిగ్రహింపబడగా, మహాత్ముడైన ప్రహ్లాదునియొక్క కుమారుడు, బలవంతుడును అగు విరోచనుడనువాడు రాజాయెను. (1) ఆ విరోచనుడు ఇంద్రునితో కూడ దేవతలందరిని జయించి, చాలసంవత్సరములపాటు చరాచరయుక్తమైన ముల్లోకముల సమూహమును ధర్మమార్గముతో పాలించెను. (2) అతడిట్లు రాజ్యపాలన చేయుచుంగా, ఒకానొక సమయమున పూజ్యుడైన గొప్పముని సనత్కుమారుడు విష్ణువుచేత పంపబడి విరోచనుని పట్టణమునకు వచ్చెను. (3) అప్పుడు సింహాసనమధిష్ఠించి యున్న విరోచనుడు, బ్రహ్మకుమారుడైన సనత్కుమారునికి ఎదురుగా వెళ్లి తలవంచి నమస్కరించెను. తరువాత భక్తితో దోసిలియొగ్గి ఈమాటలుపలికెను. (4) ధన్యో7స్మ్య నుగృహీతో7స్మి సంప్రాప్తో మే పురోత్తమమ్ | యోగీశ్వరో7ద్య భగవా న్యతో7సౌ బ్రహ్మవి త్స్వయమ్ || || 5 || కిమర్థ మాగతో బ్రహ్మన్! స్వయందేవః పితామహః | బ్రూహి మే బ్రహ్మణః పుత్ర కింకార్యం కరవాణ్యహమ్ || || 6 || సో7బ్రవీ ద్భగవా న్దేవో ధర్మయుక్తం మహాసురమ్ | ద్రష్టు మభ్యాగతో7హం వై భవన్తం భాగ్యవానసి || || 7 || సుదర్లభా నీతి రేషా దైత్యానాం దైత్యసత్తమ | త్రిలోకే ధార్మికో నూనం త్వాదృశో7న్యో న విద్యతే || || 8 || ఇత్యుక్తో7సురరాజో7సౌ పునః ప్రాహ మహామునిమ్ | ధర్మాణాం పరమం ధర్మం బ్రూహి మే బ్రహ్మవిత్తమ || || 9 || యోగీశ్వరుడవు, భగవంతుడవు, స్వయముగా బ్రహ్మవేత్తవు అయిననీవు ఈనాడు నాపట్టణమును చేరినందువలన నేను ధన్యుడనైనాను; అనుగ్రహించబడినాను. (5) బ్రహ్మస్వరూపుడా! స్వయముగా బ్రహ్మదేవుడని చెప్పదగిన నీవు ఏకారణమున వచ్చితివి? ఓ బ్రహ్మమానసపుత్రుడా! నేను మీకు ఏమి పని ఏయవలెనో చెప్పుము. (6) అప్పుడు ధర్మాచరణకల ఆ అసురశ్రేష్ఠుని గూర్చి పూజనీయుడైన సనత్కుమారదేవుడిట్లనెను. ''నీవు భాగ్యవంతుడవు. నేను నిన్ను చూచుటకు వచ్చినాను. (7) రాక్షసశ్రేష్ఠుడా! నీవు అవలంబించుచున్న యీ చక్కని నీతి రాక్షసులకు మిక్కిలి దుర్లభ##మైనది. మూడులోకములయందు కూడ నీవంటి ధర్మమార్గవర్తనుడు మరొకడు లేడనుట నిశ్చయము. (8) ఇట్లు పలుకబడిన అసురరాజు ఆగొప్పమునినిగూర్చి మరల ఇట్లనెను. ''బ్రహ్మవేత్తలలో గొప్పవాడా! ధర్మములన్నిటిలో గొప్పధర్మమునుగూర్చి నాకు చెప్పుము!'' (9) సో7బ్రవీ ద్భగవా న్యోగీ దైత్యేన్ద్రాయ మహాత్మనే | సర్వగుహ్యతమం ధర్మ మాత్మజ్ఞాన మనుత్తమమ్ || || 10 || స లబ్ధ్వా పరమం జ్ఞానం దత్వా చ గురుదక్షిణామ్ | నిధాయ పుత్రే తద్రాజ్యం యోగాభ్యాసరతో7భవత్ || || 11 || స తస్య పుత్రో మతిమాన్ బలి ర్నామ మహాసురః | బ్రహ్మణ్యో ధార్మికో7త్యర్థం విజిగ్యే7ధ పురన్దరమ్ || || 12 || కృత్వా తేన మహ ద్యుద్థం శక్రః సర్వామరై ర్వృతః | జగామ నిర్జితో విష్ణుం దేవం శరణ మచ్యుతమ్ || || 13 || తదన్తరే7దితి ర్దేవీ దేవమాతా సుదుఃఖితా | దైత్యేన్ద్రాణాం వధార్థాయ పుత్రో మే స్యాదితి స్వయమ్ || || 14 || మహాత్ముడు, యోగిఅగు నా సనత్కుమారుడు ఉత్తముడైన రాక్షసరాజునుగూర్చి, రహస్యములన్నిటిలో మిక్కిలి శ్రేష్ఠము, సాటిలేని ఆత్మజ్ఞాన రూపధర్మమును చెప్పెను. (10) ఆ విరోచనుడు గొప్పజ్ఞానమును పొంది, మునికి గురుదక్షిణనిచ్చి, తరువాత తన కుమారునియందు రాజ్యభారమునుంచి యోగసాధనయందా సక్తుడాయెను. (11) విరోచనుని కుమారుడు, బుద్ధిమంతుడు బలియను గొప్పరాక్షసుడు, బ్రహ్మజ్ఞానము కలవాడు, మిక్కిలి ధర్మస్వభావము కలవాడు. అతడు తరువాత ఇంద్రుని జయించెను. (12) విరోచనునితో గొప్పయుద్ధముచేసి, అతనిచేత ఓడింపబడి, దేవతలందరితోకూడుకున్నవాడై ఇంద్రుడు, నాశరహితుడైన విష్ణుదేవుని శరణముపొందెను. (13) ఈలోపల దేవతలతల్లియగు అదితి చాలా దుఃఖమును పొందినదై రాక్షసుల సంహారముకొరకు సమర్థుడైన పుత్రుడు నాకు కలుగుగాక అని తలచి; (14) తతాప సుమహాఘోరం తపోరాశిం తతః పరమ్ | ప్రపన్నా విష్ణు మవ్యక్తం శరణ్యం శరణం హరిమ్ || || 15 || కృత్వా హృత్పద్మకిఞ్జల్కే నిష్కలం పరమం పదమ్ | వాసుదేవ మనాద్యన్త మానన్దం వ్యోమ కేవలమ్ || || 16 || ప్రసన్నో భగవా న్విష్ణుః శంఖచక్రగదాధరః | ఆవిర్బభూవ యోగాత్మా దేవమాతుః పురో హరిః || || 17 || దృష్ట్వా సమాగతం విష్ణుమదితి ర్భక్తిసంయుతా | మేనే కృతార్థ మాత్మానం తోషయామాస కేశవమ్ || || 18 || అదితిరువాచ :- జయాశేషదుఃఖౌఘనాశైకహేతో జయానన్తమాహాత్మ్యయోగాభియుక్త | జయానాదిమధ్యాన్తవిజ్ఞానమూర్తే జయాకాశకల్పామలానన్దరూప || || 19 || మిక్కిలి తీవ్రమైన, భయంకరమైన తపస్సునుచేసెను. అనంతరము అవ్యక్తరూపుడైన, శరణుపొందుటకు యోగ్యుడైన, విష్ణువును శరణము పొందెను. (15) తన హృదయకమలపు కేసరము నందు భేదశూన్యుడు, వాసుదేవుడు, ఆద్యన్తరహితుడు, ఆనందస్వరూపుడు, కేవలాకాశరూపుడు, సర్వోన్నత గమ్యమైన విష్ణువును గూర్చితపస్సుచేసెను. (16) అప్పుడు శంఖచక్రములను ధరించిన భగవంతుడైన విష్ణువు, యోగాత్మకుడు ప్రసన్నుడై దేవమాతయగు అదితికి ముందు సాక్షాత్కరించెను. (17) తనకు ప్రత్యక్షమైనవిష్ణువును చూచి, అదితిభక్తితో కూడినదై తనను ధన్యురాలుగా భావించుకొనెను. ఆనారాయణుని స్తోత్రముతో ప్రీతుని చేసెను. (18) సమస్తదుఃఖముల సమూహమును నశింపజేయుటకు ముఖ్యకారణమైనవాడా! అంతములేని గొప్పతనముల సంబంధముకలవాడా! ఆది మధ్యాంతములు లేని విజ్ఞానస్వరూపుడా! ఆకాశమువంటి నిర్మలానందస్వరూపుడా! దేవా, నీకు జయము. (19) నమో విష్ణవే కాలరూపాయ తుభ్యం నమో నారసింహాయ శేషాయ తుభ్యమ్ | నమః కాలరుద్రాయ సంహారకర్త్రే నమో వాసుదేవాయ తుభ్యం నమస్తే || || 20 || నమో విశ్వమాయావిధానాయ తుభ్యం నమో యోగగమ్యాయ సత్యాయతు భ్యమ్ | నమో ధర్మవిజ్ఞాననిష్ఠాయ తుభ్యం నమస్తేవరాహాయభూయోనమస్తే || || 21 || నమస్తే సహస్రార్కచన్ద్రాభమూర్తే నమోవేదవిజ్ఞానధర్మాభిగమ్య | నమో భూధరాయాప్రమేయాయ తుభ్యం ప్రభో విశ్వయోనే7ధ భూయో నమస్తే || || 22 || కాలస్వరూపుడైన విష్ణువుకు నీకు వందనము. శేషాత్మకుడవు, నరసింహరూపుడవు అగునీకు నమస్కారము. జగత్తులమయముచేయువాడవైన ప్రళయకాలరుద్రునికి నీకు నమస్కారము. వాసుదేవుడవగునీకు నానమోవాకము. (20) ప్రపంచమునందలి మాయనుకల్పించు నీకువందనము. సత్యరూపుడు, యోగసాధనచేతపొందదగినవాడవగునీకు నమస్కారము. ధర్మము, విజ్ఞానము అనువానియందు ప్రతిష్ఠితుడవైననీకు నమస్కారము. వరాహస్వరూపుడవైననీకు మరలమరల వందనము. (21) వేయిసూర్యుల, చంద్రులతో సమానమైనకాంతిగలవాడా! నీకువందనము. వేదమునందలివిజ్ఞానముచేత, ధర్మముచేత తెలియదగినవాడా, నమస్కారము. భూమినిధరించువాడవు, ఇంతఅనికొలుచుటకు శక్యముకానివాడగునీకు నమోవాకము. ప్రపంచమునకు మూలకారణభూతడైన వాడా! ప్రభూ! నీకు మరలమరల వందనము. (22) నమః శంభ##వే సత్యనిష్ఠాయ తుభ్యం నమో హేతవే విశ్వరూపాయ తుభ్యమ్ | నమోయోగపీఠాన్తరస్థాయ తుభ్యం శివాయైకరూపాయ భూయో నమస్తే || || 23 || ఏవం స భగవా న్విష్ణు ర్దేవమాత్రా జగన్మయః | తోషిత శ్ఛందయామాస వరేణ ప్రహసన్నివ || || 24 || ప్రణమ్య శిరసా భూమౌ సా వవ్రేవర ముత్తమమ్ | త్వా మేవ పుత్రం దేవానాం హితాయ వరయే వరమ్ || || 25 || తథాస్త్వి త్యాహ భగవాన్ ప్రపన్నజనవత్సలః | దత్త్వా వరానప్రమేయ స్తత్రైవా న్తరధీయత || || 26 || తతో బహుతిథే కాలే భగవన్తం జనార్దనమ్ | దధార గర్భం దేవానాం మాతా నారాయణం స్వయమ్ || || 27 || సత్యమందు నిష్ఠగల శంభురూపుడవైన నీకు నమస్కారము. జగద్రూపుడవు, కారణాత్మకుడవగునీకు వందనము. యోగవిద్యాపీఠమధ్యభాగ మందుండునీకు నమస్కారము. కేవలస్వరూపుడవు అగునీకుమరల నమోవాకము. (23) దేవతలతల్లియగు అదితిచేత ఈవిధముగా సంతోషపరచబడిన లోకమయుడైన భగవంతుడగు విష్ణువు నవ్వుచున్నవానివలె ఆమెను వరము కోరుకొమ్మని అనుగ్రహించెను. (24) ఆ అదితి శిరస్సుభూమికి వంచి నమస్కరించి, దేవతల మేలుకొరకు నిన్నే పుత్రునిగా జన్మించుమని వరమువేడుచున్నానని శ్రేష్ఠమైన వరమును కోరుకొనెను. (25) తననాశ్రయించినవారియందు వాత్సల్యముకల ఆభగవంతుడు, అట్లేయగుగాక అని పలికెను. ఇట్లు వరమునిచ్చి వర్ణింప శక్యముకాని విష్ణువు అక్కడనే అదృశ్యుడాయెను. (26) తరువాత చాలాకాలము గడువగా దేవతలమాతయగు అదితి, స్వయముగా భగవంతుడు, జనార్దనుడు అగునారాయణుని గర్భములో ధరించెను. (27) సమావిష్టే హృషీకేశే దేవమాతు రథోదరమ్ | ఉత్పాతా జజ్ఞిరే ఘోరా బలే ర్వైరోచనేః పరే || || 28 || నిరీక్ష్య సర్వా నుత్పాతాన్ దైత్యేన్ద్రో భయవిహ్వలః | ప్రహ్లాద మసురం వృద్ధం ప్రణమ్యాహ పితామహమ్ || || 29 || బలిరువాచ :- పితామహ మహాప్రాజ్ఞ జాయతే7స్మి న్పురాన్తరే | కిముత్పాతో భ##వే త్కార్య మస్మాకం కింనిమిత్తకః || || 30 || నిశమ్య తస్య వచనం చిరం ధ్యాత్వా మహాసురః | నమస్కృత్య హృషేకేశ మిదం వచనమబ్రవీత్ || || 31 || ప్రహ్లాదఉవాచ :- యో యజ్ఞై రిజ్యతే విష్ణు ర్యస్య సర్వ మిదం జగత్ | దధారాసురనాశార్థం మాతా తం త్రిదివౌకసామ్ || || 32 || హృషీకేశుడగువిష్ణువు అదితిదేవి యొక్క గర్భములో ప్రవేశించగా, విరోచనకుమారుడైన బలియొక్క పట్టణములో చాలాభయంకరములైన ఉత్పాతములు సంభవించెను. (28) సమస్తములైన ఉత్పాతమలను చూచి రాక్షసరాజగుబలి భయముతోకలతపడి, తనకుతాత, రాక్షసవృద్ధుడును అగు ప్రహ్లాదునివద్దకు వెళ్లి నమస్కరించి యిట్లు పలికెను. (29) మిక్కిలి వివేకశాలివగు ఓపితామహా! ఈపట్టణము ఈపట్టణము నందు ఉత్పాతము ఎందుకు కలుగుచున్నది? దీనివలన మనకు ఎటువంటి ఫలితము కలుగనున్నది? (30) ఆ బలియొక్క మాటను విని రాక్షసశ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు చాలాసేపు ఆలోచించి, తనమనస్సులో విష్ణువుకు నమస్కరించి ఈ విధముగా అతనితో పలికెను. (31) ఎవడు యజ్ఞములచేత పూజింపబడుచున్నాడో, ఈ సమస్త ప్రపంచము ఎవనికి చెందినదో, ఆభగవంతుడగు విష్ణువును దేవమాత అదితి, దైత్య సంహారము కొరకు తన గర్భములో ధరించినది. (32) యస్మా దభిన్నం సకలం భిద్యతే యో7ఖిలా దపి | స వాసుదేవో దేవానాం మాతు ర్దేహం సమావిశత్ || || 33 || న యస్య దేవా జానన్తి స్వరూపం పరమార్థతః | స విష్ణు రదితే ర్దేహం స్వేచ్ఛయాద్య సమావిశత్ || || 34 || యస్మా ద్భవన్తి భూతాని యత్ర సంయాన్తి సంక్షయమ్ | సో7వతీర్ణో మహాయోగీ పురాణపురుషో హరిః || || 35 || న యత్ర విద్యతే నామజాత్యాదిపరికల్పానా | సత్తామాత్రాత్మరూపో7సౌ విష్ణు రంశేన జాయతే || || 36 || యస్యసా జగతాం మాతా శక్తి స్తద్ధర్మధారిణీ | మాయా భగవతీ లక్ష్మీః సో7వతీర్ణో జనార్దనః || || 37 || ఈ సమస్తము ఎవనికంటె భిన్నముకాదో, ఎవడు సమస్తమునుండి తానుభిన్నముగా నుండునో, అటువంటి వాసుదేవుడైన విష్ణువు దేవమాత శరీరము నాశ్రయించినాడు. (33) ఎవని స్వరూపతత్త్వమును దేవతలుకూడ యథార్థముగ తెలియజాలరో, ఆ విష్ణువు స్వయముగా, తన ఇచ్ఛతో అదితి యొక్క శరీరమును ప్రవేశించినాడు. (34) ఎవనినుండి సమస్తప్రాణులు పుట్టుచున్నవో, తిరిగి ఎవని యందులయమును చెందుచున్నవో, అటువంటి గొప్పయోగీశ్వరుడు, పురాణ పురుషుడు అగుహరి అదితి గర్భమును చేరినాడు. (35) ఎవని విషయములో, పేరు, జాతి మొదలగువాని భేదభావముండదో, సత్తామాత్రమైన ఆత్మస్వరూపుడగు ఈవిష్ణువు అంశావతారముగా జన్మింపబోవుచున్నాడు (36) ఎవనియొక్కశక్తి లోకములకు మాతృస్వరూపమైయున్నదో. ఆశక్తి అతనిధర్మమును ధరించునది, మాయారూపిణి అగు భగవతి లక్ష్మదేవియై ఉన్నదో, ఆ విష్ణువు అవతరించుచున్నాడు. (37) యస్య సా తామసీ మూర్తిః శంకో రాజసీ తనుః | బ్రహ్మా సంజాయతే విష్ణు రంశే నైకేన సత్త్వధృక్ || || 38 || ఇతి సంచిన్త్య గోవిన్దం భక్తినమ్రేణ చేతసా | త మేవ గచ్ఛ శరనం తతో యాస్యసి నిర్వృతిమ్ || || 39 || తతః ప్రహ్లాదవచనా ద్బలి ర్వైరోచని ర్హరిమ్ | జగామ శరణం విశ్వం పాలయామాస ధర్మవిత్ || || 40 || కాలే ప్రాప్తే మహావిష్ణుం దేవానాం హర్షవర్ధనమ్ | అసూత కశ్యపా చ్చైనం దేవమాతా7దితిః స్వయమ్ || || 41 || చతుర్భుజం విశాలాక్షం శ్రీవత్సాఙ్కితవక్షసమ్ | నీలమేఘప్రతీకాశం భ్రాజమానం శ్రియా వృతమ్ || || 42 || ఏ పరమేశ్వరుని యొక్క తమోగుణప్రధానమైన రూపముకలదో అదియేశంకరుడు. రజోగుణాత్మకమైన శరీరము బ్రహ్మగాపుట్టినాడు. అతడే సత్త్వగుణమును ధరించినవాడై ఒకఅంశముతో విష్ణువగుచున్నాడు. (38) ఈ ప్రకారముగా ఆలోచించి, భక్తితో వినీతమైన మనస్సుతో ఆగోవిందుడైన నారాయణునే శరణముపొందుము. దానివలన శాశ్వతానంద రూపమైన ముక్తిని పొందగలవు. (39) తరువాత ప్రహ్లాదుని మాటననుసరించి విరోచనుని పుత్రుడైన బలి విష్ణువును శరణము పొందెను. తరువాత ధర్మమును తెలిసిన అతడు ప్రపంచమును పాలించెను. (40) కొంతకాలము గడువగా తగిన సమయములో దేవతల తల్లియైన అదితిదేవి కశ్యప ప్రజాపతివలన, దేవతలకు సంతోషమును పెంచువాడైన మహావిష్ణువును స్వయముగా పుత్రుడుగా పొందెను. (41) ఆ విష్ణువు నాలుగు భుజములు కలిగి, నేత్రములు కలవాడై, శ్రీవత్సమనుపేరుగల చిహ్నముతో కూడిన వక్షము కలవాడు, నల్లని మేఘము వంటి శరీరము కలిగి తేజస్సుతో ప్రకాశించువాడుగా ఉండెను. (42) ఉపతస్థుః సురాః సర్వేసిద్ధాః సాధ్యాశ్చ చారణాః | ఉపేన్ద్ర ఇన్ద్రప్రముఖా బ్రహ్మాచర్షిగణౖ ర్వృతః || || 43 || కృతోపనయనో వేదా నధ్యైష్ట భగవా న్హరిః | సదాచారం భరద్వాజా త్త్రిలోకాయ ప్రదర్శయన్ || || 44 || ఏవం చ లౌకికం మార్గం ప్రదర్శయతి స ప్రభుః | స యత్ర్పమాణం కురుతే లోక స్తదనువర్తతే || 45 || తతః కాలేన మతిమాన్ బలి ర్వైరేచనిః స్వయమ్ | యజ్ఞై ర్యజ్ఞేశ్వరం విష్ణు మర్చయామాస సర్వగమ్ || || 46 || బ్రాహ్మణా న్పూజయామాస దత్త్వా బహుతరం ధనమ్ | బ్రహ్మర్షయః సమాజగ్ము ర్యజ్ఞవాటం మహాత్మనః || || 47 || ఆ విష్ణువు దగ్గరకు దేవతలందరు, సిద్ధులు, సాధ్యులు, చారణులు ఉపేంద్రుడు, ఇంద్రుడు మొదలగువారు, ఋషిసమూహములతో గూడిన బ్రహ్మకూడ వచ్చి సేవించిరి. (43) ఆ విష్ణువు ఉపనయన సంస్కారమును పొంది వేదములను అధ్యయనము చేసెను. భరద్వాజముని వలన వేదములతోపాటు సదాచారమును గూడ ముల్లోకములకు ప్రదర్శించుచు అభ్యసించెను. (44) ఆ ప్రభువైన నారాయణుడు ఈ విధముగా లౌకికమైన మార్గమును లోకమునకు ప్రదర్శించినాడు. అతడు ఏ పద్దతిలో కర్మలనాచరించునో, ప్రపంచము దానినే అనుసరించి వర్తించును. (45) తరువాత కొంతకాలమునకు బుద్ధిమంతుడైన, విరోచనపుత్రుడగు బలి, స్వయముగా యజ్ఞములకధిపతి, అంతటవ్యాపించియుండు వాడును అగు విష్ణువును యజ్ఞములతో పూజించెను. (46) అధికమైన ధనమును దక్షిణగా ఇచ్చి బ్రాహ్మణులను ఆరాధించెను. మహాత్ముడైన బలిచక్రవర్తి యజ్ఞమంటపమునకు బ్రహ్మర్షులు విచ్చేసిరి. (47) విజ్ఞాయ విష్ణు ర్భగవాన్ భరద్వాజప్రచోదితః | ఆస్థాయ వామనం రూపం యజ్ఞదేశ మథాగమత్ || || 48 || కృష్ణాజినోపవీతాఙ్గ ఆషాఢేన విరాజితః | బ్రాహ్మణో జటిలో వేదా నుద్గిర న్సుమహాద్యుతిః || || 49 || సంప్రాప్యా సుర రాజస్య సమీపం భిక్షుకో హరిః | స్వపద్భ్యాంక్రమితం దేశ మయాచత బలిం త్రిభిః || || 50 || ప్రక్షాల్య చరణౌ విష్ణో ర్బలి ర్భావసమన్వితః | ఆచామయిత్వా భృంగార మాదాయ స్వర్ణనిర్మితమ్ || || 51 || దాస్యే తధేదం భవతే పదత్రయం ప్రీణాతు దేవోహరి రవ్యయాకృతిః | విచిన్త్య దేవస్య కరాగ్రపల్లవే నిపాతయామాస సుశీతలం జలమ్ || || 52 || భగవంతుడైన విష్ణువు, బలియొక్క యజ్ఞవిషయమును తెలిసికొని భరద్వాజముని చేతప్రేరణపొంది వామనరూపమును ధరించి అప్పుడు యజ్ఞప్రదేశమునకు వెళ్లెను. (48) ఆ వామనుడు కృష్ణాజినము, యజ్ఞోపవీతముతో గూడిన శరీరముకలవాడు, పాలాశదండముతో ప్రకాశించువాడు, జడలనుధరించి, గొప్పకాంతితో ప్రకాశించుచు వేదమంత్రములనుచ్చరించుచున్న బ్రాహ్మణ వటువుగా వచ్చెను. (49) రాక్షసరాజైన బలి సమీపమును చేరి వామనరూపుడైన విష్ణువు భిక్షము నర్థించువాడుగా, తన అడుగులతో కొలువబడుమూడడుగుల భూమిని యాచించెను. (50) వామనరూపియగు విష్ణువుయొక్క పాదములను కడిగి శ్రద్ధాభావముతో కూడిన బలి ఆచమనముచేసి, బంగారముతో చేయబడిన కలశమును చేతిలో ధరించి; (51) నీవడిగిన ప్రకారము మూడడుగుల ప్రదేశము నీకివ్వగలను. నాశరహితమైన రూపముకల విష్ణువు సంతోషించుగాక. అని మనస్సులో అనుకొని ఆ భగవంతుని చేతికొనలయందు చల్లని జలమును దానముకొరకు వదలెను. (52) విచక్రమే పృథివీ మేష చైతా మథాన్తరికక్షం దివ మాదిదేవః | వ్యపేతరాగం దివిజేశ్వర న్తం ప్రకర్తుకామః శరణం ప్రపన్నమ్ || || 53 || ఆక్రమ్య లోకత్రయ మీశపాదః ప్రాజాపత్యా ద్ర్బహ్మలోకం జగామ | ప్రణము రాదిత్యముఖాః సురేన్ద్రాః యే తత్ర లోకే నివసన్తి సిద్ధాః || || 54 |7 అథోపతస్థే భగవా ననాదిః పితామహ స్తోషయమాస విష్ణుమ్ | భిత్త్వా తదణ్డస్య కపాలమూర్ధ్యం జగామ దివ్యాభరణో7థ భూయః || || 55 || అప్పుడు ఆదిదేవుడైన హరి భూమిని ఒకపాదముతో కొలిచెను. తరువాత రెండవపాదముతదో అంతరిక్షమును స్వర్గమును కొలిచెను. కోరికలు తొలగిన, రాక్షసప్రభువైన బలిచక్రవర్తిని తనకు శరణాగతుడగునట్లు చేయగోరినవాడై, (53) తన పాదముతో ముల్లోకములనాశ్రమించి, ప్రాజాపత్యమునుండి బ్రహ్మలోకమును చేరెను. అప్పుడాయాలోకములలో నివసించు ఆదిత్యుడు మొదలగు దేవతలు, సిద్ధులు, ఆపాదమునకు నమస్కరించిరి. (54) ఆ సమయమున భగవంతుడు, ఆదిరహితుడునగు బ్రహ్మ అక్కడికివచ్చి నారాయణుని ప్రస్తుతించెను. తరువాత విష్ణుపాదము బ్రహ్మండమును భేదించి ఇంకను పైభాగమునక మరల వ్యాపించెను. (55) అధా ణ్డభేదా న్నిపపాత శీతలం మహాజలం పుణ్యకృ ద్భిశ్చజుష్టమ్ | ప్రవర్తితా చాపి సరిద్వరా సా గంగేత్యుక్త్వా బ్రహ్మణా వ్యోమసంస్థా || || 56 || గత్వామహాన్తం ప్రకృతిం బ్రహ్మయోనిం బ్రహ్మాణమేకం పురుషం విశ్వయోనిమ్ | అతిష్ఠ దీశస్య పదం తదవ్యయం దృష్ట్వా దేవా స్తత్రతత్ర స్తువన్తి || || 57 || ఆలోక్య తం పురుషం విశ్వకాయం మహా న్బలి ర్భక్తియోగేన విష్ణుమ్ | ననామ నారాయణ మేక మవ్యయం స్వచేతసా యం ప్రణమన్తి వేదాః || || 58 || అప్పుడు, బ్రహ్మాండమను భేదించుటవలన, అక్కడ పుణ్యవంతులచేత సేవింపబడుచల్లని గొప్ప ఉదకము స్రవించెను. ఆజలమే ప్రవహించి నదులలో శ్రేష్ఠమైనదిగా, బ్రహ్మచేత 'గంగ' అని పలుకబడినదై ఆకాశములో నిలిచెను. (56) ఆ విష్ణువుయొక్క పాదము విశాలమైన ప్రకృతిని వ్యాపించి, బ్రహ్మస్థానమును, ప్రపంచబీజభూతుడైన ఏకపురుషుని, బ్రహ్మరూపునిచేరి అక్కడ నిలిచెను. నాశరహితమైన ఆవిష్ణుపాదమునుచూచి అక్కడక్కడ కలదేవతలు కొనియాడిరి. (57) ప్రపంచమే శరీరముగా కల ఆమహాపురుషుడైన విష్ణువును చూచి, ఉత్తముడైన బలి భక్తియోగముతో ప్రణమిల్లెను. అద్వితీయుడు, నాశరహితుడు అగు ఏనారాయణుని వేదములుగూడ నమస్కరించి పూజించునో, ఆవిష్ణువునకు హృదయపూర్వకముగా నమస్కరించినాడు బలి. (58) త మబ్రవీ ద్భగవా నాదికర్తా భూత్వా పున ర్వామనో వాసుదేవః | మమైవ దైత్యాధిపతే7ధునేదం లోకత్రయం భవతా భావదత్తమ్ || || 59 || ప్రణమ్య మూర్థ్నా పునరేవ దైత్యో, నిపాతయామాస జలం కరాగ్రే | దాస్యే తవాత్మాన మనన్తధామ్నే, త్రివిక్రమాయా మితవిక్రమాయ || || 60 || ప్రగృహ్య సూనో రపి సంప్రదత్తం, ప్రహ్లాదసూనో రథ శంఖపాణిః | జగాద దైత్యం జగదన్తరాత్మా పాతాలమూం ప్రవిశేతి భూయః || || 61 || సమాస్యతాం భవతా తత్ర నిత్యం భుక్త్వాభోగా న్దేవతానా మలభ్యాన్ | ధ్యాయస్వ మాం సతతం భక్తియోగా త్ర్పవేక్ష్యసే కల్పదాహే పున ర్మామ్ || || 62 || మొదటి సృష్టకిర్త, భగవంతుడగు విష్ణుమూర్తి మరల వామనుడుగా మారి అతనితో ఇట్లనెను. ''ఓరాక్షసరాజా! ఇప్పుడు ఈ మూడులోకములు నీచేత సంకల్పదానముచేయబడినందున నా అధీనములోనివే'' (59) ఆ బలిచక్రవర్తి నారాయణునకు శిరస్సుతో నమస్కరించి మరల తనచేతిలోనికి నీటిని వంపుకొనెను. అనంతమైన తేజస్సుకలిగిన, గొప్ప పరాక్రమముకల, త్రివిక్రముడవగునీకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. (60) తరువాత శంఖముచేతియందు ధరించిన విష్ణువు ప్రహ్లాద కుమారుడగు విరోచనుని పుత్రుడైన బలివలన ఇవ్వబడిన దానమును స్వీకరించి పాతాళలోకముయొక్క మూలమును ప్రవేశించుమని మరల రాక్షసరాజును గూర్చిపలికెను. (61) అక్కడ నీవు దేవతలకుగూడ పొందశక్యముకాని భోగములననుభవించుచు ఎల్లప్పుడు సుఖముగా నివసించుము. భక్తియోగమునవలంబించి నన్ను సర్వదా ధ్యానించుము. చివరకు కల్పాంతకాలములో మరలనన్ను ప్రవేశించగలవు. (62) ఉక్త్వైవం దైత్యసింహం తం విష్ణుః సత్యపరాక్రమః | పురన్దరాయ త్రైలక్యం దదౌ జిష్ణు రురుక్రమః || || 63 || సంస్తువన్తి మహాయోగం సిద్ధా దేవర్షికిన్నరాః | బ్రహ్మా శక్రో ధ భగవాన్ రుద్రాదిత్యమరుద్గణాః || || 64 || కృత్త్వైత దద్భుతం కర్మ విష్ణు ర్వామనరూపధృక్ | పశ్యతా మేవ సర్వేషాం తత్రైవాన్త రధీయత || || 65 || సో7పి దైత్యవరః శ్రీమా న్పాతాలం ప్రాప నోదితః | ప్రహ్లాదేనాసురవై ర్విష్ణుభక్తస్తు తత్పరః || || 66 || అపృచ్ఛ ద్విష్ణుమాహాత్మ్యం భక్తియోగ మనుత్తమమ్ | పూజావిధానం ప్రహ్లాదం తదాహాసౌ చకార సః || || 67 || రాక్షసులలో శ్రేష్ఠుడైన ఆ బలిచక్రవర్తిని గూర్చి యిట్లుపలికి సత్యమైన పరాక్రమము కల విష్ణువు, జయశీలుడై ఇంద్రునికి మూడు లోకముల ప్రభుత్వమును దానముచేసెను. (63) గొప్పయోగమహిమకల విష్ణువును దేవతలు, ఋషులు, కిన్నరులు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు, ఆదిత్యులు, మరుద్గణములు స్తోత్రము చేయసాగిరి. (64) వామనరూపమును ధరించిన విష్ణువు, ఆశ్చర్యకరమైన యీపనినిచేసి, అందరు చూచుచుండగా అక్కడనే అంతర్థానమాయెను. (65) సంపద్యుక్తుడై ఆరాక్షసశ్రేష్ఠుడగు బలి విష్ణువుచే ప్రేరితుడై పాతాళమును చేరెను. ప్రహ్లాదునిచేత, ఇతరరాక్షస వరులచేత ప్రోత్సహించబడి, విష్ణువునందు భక్తికలవాడై, తత్పరుడైయుండెను. (66) విష్ణువుయొక్క మాహాత్మ్యమును, శ్రేష్ఠమైనభక్తి యోగమును గూర్చి, పూజావిధానమునుగూర్చి బలి, ప్రహ్లాదుని ప్రశ్నించెను. అప్పుడావిషయముల నాతడు చెప్పగా దాని ప్రకారమతడు చేసెను. (67) అథ రథచరణం సశంఖపాణిం సరసిజలోచన మీశ మప్రమేయమ్ | శరణ ముపయ¸° స భావయోగా త్ర్పణయగతిం ప్రణిధాయ కర్మయోగమ్ || || 68 || ఏషవః కథితో విప్రా వామనస్య పరాక్రమః | స దేవకార్యాణి సదా కరోతి పురుషోత్తమః || || 69 || ఇతి శ్రీ కూర్మపురాణ త్రివిక్రమచరిత వర్ణనం నామ సప్తదశో7ధ్యాయః తరువాత బలిచక్రవర్తి శంఖమును, చక్రమును చేతులయందు ధరించినట్టి, పద్మముల వంటి కన్నులు గలిగిన, ఇంతయని వర్ణించుటకు శక్యముకానట్టి, ప్రభువైన నారాయణుని, మనస్సునందు శ్రద్ధాపూర్వకముగానిలిపి, కర్మయోగము నుపేక్షించి భక్తితో శరణము పొందెను. (68) ఓ ద్విజవరులారా! ఈవామనావతారముయొక్క పరాక్రమము నాచే మీకు చెప్పబడినది. పురుషశ్రేష్ఠుడైన ఆనారాయణుడు ఎల్లప్పుడు దేవకార్యములను నెరవేర్చుచుండును. (69) శ్రీ కూర్మమహాపురాణములో త్రివిక్రమ చరితమనబడు పదునేడవ అధ్యాయము సమాప్తము.