Sri Koorma Mahapuranam
Chapters
వింశో7ధ్యాయః అధరాజ వంశకీర్తనమ్ సూతఉవాచ :- అదితిః సుషువే పుత్ర మాదిత్యం కశ్యపా త్ర్పభుమ్ | తస్యా దిత్యస్య చైవాసీ ద్భార్యాణాం తు చతుష్టయమ్ ||
|| 1 || సంజ్ఞా రాజ్ఞీ ప్రభా ఛాయా పుత్రాం స్తాసాం నిబోధతః | సంజ్ఞా త్వాష్ట్రీతు సుషువే సూర్యా న్మను మనుత్తమమ్ ||
|| 2 || యమ ఞ్చయమునాం చైవ రాజ్ఞీ రేవన్త మేవ చ | ప్రభా ప్రభాత మాదిత్యా చ్ఛాయా సావర్ణి మాత్మజమ్ ||
|| 3 || శనిం చ తపతీం చైవ విష్టిం చైవ యధాక్రమమ్ | మనో స్తు ప్రథమస్యాస న్నవపుత్రా స్తు తత్సమాం ||
|| 4 || ఇక్ష్వాకు శ్చైవ నాభాగో ధృష్టః శర్యాతి రేవచ | నరిష్యన్త శ్చ నాభాగో హ్యరిష్టః కరుష స్తథా ||
|| 5 || కశ్యపునివలన అదితిదేవి ఆదిత్యుని పుత్రునిగా పొందెను. ఆ ఆదిత్యునికి నలుగురు భార్యలుండిరి. (1) సంజ్ఞ, రాజ్ఞీ, ప్రభ, ఛాయ అని ఆనలుగురి పేర్లు. వారి కుమారులను గూర్చి తెలుపుదును వినుడు. వారిలో సంజ్ఞ అనునామె త్వష్టకుమార్తె. ఆమె సూర్యునివలన శ్రేష్ఠుడైన మనువును పుత్రుడుగా పొందెను. (2) రాజ్ఞి అనుభార్య యముని, రేవంతుని పుత్రులుగాను, యమునను పుత్రికగాను పొందెను. ప్రభ అనుభార్య ఆదిత్యునివలన ప్రభాతుని, ఛాయ సావర్ణిని కుమారులుగా పొందిరి. (3) ఆ ఛాయ శనిని, తపతిని, విష్టినికూడ క్రమముగా సంతతిగా పొందినది. ఆదిత్యుని మొదటికుమారుడైన మనువుకు ఆయనతో సమానులైన తొమ్మిదిమంది కుమారులు కలిగిరి. (4) ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, అరిష్టుడు, కరుషుడు, అనువారు; (5) పృషధ్రశ్చ మహాతేజా నవైతే శక్రసన్నిభాః | ఇలా జ్యేష్ఠా వరిష్ఠా చ సోమవంశం వ్యవర్థయత్ || || 6 || బుధస్య గత్వా భవనం సోమపుత్రేణ సఙ్గతా | అసూత సోమజా ద్దేవీ పురూరవస ముత్తమమ్ || || 7 || పితౄణాం తృప్తికర్తారం బుధా దితిహి నః శ్రుతమ్ | ప్రాప్య పుత్రం సువిమలం సుద్యమ్న ఇతి విశ్రుతమ్ || || 8 || ఇలా పుత్రత్రయం లేభే పునః స్త్రీత్వ మవిన్దత | ఉత్కలఞ్చ గయ ఞ్చైవ వినతం చ తథైవచ || || 9 || సర్వేతే7 ప్రతిమప్రఖ్యాః ప్రపన్నాః కమలోద్భవమ్ | ఇక్ష్వాకో శ్చాభవ ద్వీరో వికుక్షి ర్నామ పార్థివః || || 10 || గొప్పతేజస్సుకల పృషధ్రుడనువాడు, ఈతొమ్మిదిమంది ఇంద్రునితో సమానులైన మనువు కుమారులు. పెద్దది, శ్రేష్ఠురాలును అగు ఇల చంద్రుని వంశమును పెంపొందించెను. (6) ఇల చంద్రునికుమారుడైన బుధునికి గృహిణిగా వెళ్లి అతని సమాగమమువలన ఉత్తముడైన పురూరవసుని కుమారునిగా పొందెను. (7) ఆ పురూరవసుడు తనపితరులకు తృప్తికలిగించినవాడని మాచే వినబడినది. సుద్యుమ్నుడు అనుపేర ప్రఖ్యాతుడైన మిక్కిలి నిర్మలుడైన కుమారునిపొంది, (8) ఇలాదేవి మరల స్త్రీభావమును పొంది ఉత్కలుడు, గయుడు, వినతుడు అను ముగ్గురు కుమారులను పొందినది. (9) వారందరు సాటిలేని ప్రసిద్ధి కలవారు. బ్రహ్మదేవునాశ్రయించిరి. ఇక్ష్వాకువలన వీరుడు, వికుక్షిఅనుపేరుగలరాజు జన్మించెను. (10) జ్యేష్ఠపుత్రః స తస్యాసీ ద్దశపఞ్చచ తత్సుతాః | తేషాం జ్యేష్ఠః కకుత్థ్సో7భూ త్కాకుత్థ్స స్తు సుయోధనః || || 11 || సుయోధనా త్పృథుః శ్రీమా న్విశ్వకశ్చ పృథోః సుతః | విశ్వకా దార్ద్ర కో ధీమా న్యువనాశ్వ శ్చ తత్సుతః || || 12 || స గోకర్ణ మనుప్రాప్య యువనాశ్వః ప్రతాపవాన్ | దృష్ట్వా సౌ గౌతమం విప్రం తపన్త మనలప్రభమ్ || || 13 || ప్రణమ్య దణ్డవ ద్భూమౌ పుత్రకామో మహీపతిః | అపృచ్ఛ త్కర్మణా కేన ధార్మికం ప్రాప్నుయాం సుతమ్ || || 14 || గౌతమఉవాచ :- ఆరాధ్య పురుషం పూర్వం నారాయణ మనామయమ్ | అనాదినిధనం దేవం ధార్మికం ప్రాప్నుయా త్సుతమ్ || || 15 || ఆ వికుక్షి ఇక్ష్వాకునకు పెద్దకుమారుడుగా పుట్టెను. అతనికి పదునైదుమంది కుమారులు కలిగిరి. వారందరిలో జ్యేష్ఠుడు కకుత్థ్సుడను వాడుండెను. అతనికుమారుడు సుయోధనుడు. (11) సుయోధనుని వలన శ్రీమంతుడగు పృథువుపుట్టెను. ఆ పృథువుయొక్క పుత్రుడు విశ్వకుడనువాడు. అతనివలన బుద్ధిమంతుడగు ఆర్ద్రకుడు కలిగెను. అతనికుమారుడు యువనాశ్వుడనువాడు పుట్టెను. (12) ప్రతాపవంతుడైన ఆయువనాశ్వుడు గోకర్ణమను క్షేత్రమును చేరి, అక్కడ తపస్సుచేయుచున్న, అగ్నితోసమానమైన తేజస్సుకలిగిన గౌతముడను బ్రాహ్మణుని చూచి, (13) నేలమీద కర్రవలె వ్రాలి నమస్కరించి, పుత్రుని కోరుచున్న ఆరాజు, ఎటువంటి కర్మచేత నేను ధర్మమార్గాను యాయి అయిన కుమారుని పొందుదును? అని ప్రశ్నించెను. (14) గౌతముడిట్లు బదులు పలికెను. ''సనాతన పురుషుడు, దోషరహితుడు, ఆద్యంతములు లేనివాడు అగునారాయణదేవుని ఆరాధించి ధార్మికుడైన పుత్రుని పొందగలవు'' అని. (15) తస్య పుత్రః స్వయం బ్రహ్మా పౌత్రః స్యా న్నీలలోహితః | త మాది కృష్ణ మీశాన మారాధ్యా ప్నోతి సత్సుతమ్ || || 16 || న యస్య భగవాన్ బ్రహ్మా ప్రభావం వేత్త్వితత్త్వతః | త మారాధ్య హృషీకేశం ప్రాప్నుయా ద్ధార్మికం సుతమ్ || || 17 || స గౌతమవచః శ్రుత్వా యువనాశ్వో మహీపతిః | ఆరాధయన్ హృషీకేశం వాసుదేవం సనాతనమ్ || || 18 || తస్యపుత్రో7భవ ద్వీరః సావస్తిరితి విశ్రుతః | నిర్మితా యేన సావస్తిః గౌడదేశే మహాపురీ || || 19 || తస్మా చ్చ బృహదశ్వో7భూ త్తస్మాత్కువలయాశ్వకః | ధున్ధుమారః సమభవ ద్ధున్థుం హత్వా మహాసురమ్ || || 20 || ఆనారాయణుని తనయుడు స్వయముగా బ్రహ్మదేవుడు. నీలలోహితుడైన శంకరుడాయనకు మనుమడు. ఆది పురుషుడు, కృష్ణరూపుడు, ప్రభువైన ఆదేవుని పూజించి మంచిపుత్రుని పొందవచ్చును. (16) ఎవని ప్రభావమును భగవంతుడైన బ్రహ్మదేవుడు కూడ యథార్థముగా తెలియలేడో, అటువంటి హృషీకేశుడైన విష్ణువు నారాధించి ధార్మికుడైన కుమారుని పొందుదువు. (17) ఆయువనాశ్వమహారాజు గౌతముని మాటనువిని, హృషీకేశుడు, వాసుదేవుడు, సనాతనుడు అగునారాయణదేవుని ఆరాధించెను. (18) అతనికి వీరుడైన సావస్తి అనుపేరుతో ప్రసిద్ధుడైన కుమారుడు కలిగెను. అతనిచేత గౌడదేశములో సావస్తి అనుపేరుగల పెద్ద పట్టణము నిర్మించబడినది. (19) అతనివలన బృహదశ్వుడు జన్మించెను. అతనికి కువలయాశ్వకుడను పుత్రుడు కలిగెను. అతడు ధుంధుడు అనుగొప్పరాక్షసును చంపి ధుంధుమారుడనుపేరు కలవాడాయెను. (20) ధున్ధుమారస్య తనయా స్త్రయః ప్రోక్తా ద్విజోత్తమాః | దృఢాశ్వ శ్చైవ దణ్డాశ్వః కపిలాశ్వస్త ధైవచ || || 21 || దృఢాశ్వస్య ప్రమోద స్తు హర్యశ్వ స్తస్యచాత్మజః | హర్యశ్వస్య నికుమ్భస్తు నికుమ్భా త్సంహతాశ్వకః || || 22 || కృతాశ్వో7థ రణాశ్వ శ్చసంహితాశ్వస్య వై సుతౌ | యువనాశ్వో రణాశ్వస్య శక్రతుల్యబలో యుధి || || 23 || కృత్వా తు వారుణీ మిష్టి మృషీణాం వై ప్రాసాదతః | లేభే త్వప్రతిమం పుత్రం విష్ణుభక్త మనుత్తమమ్ || || 24 || మాన్ధాతారం మహాప్రాజ్ఞం సర్వశస్త్రభృతాం వరమ్ | మాన్ధాతుః పురుకుత్సో7భూ దమ్బరీషశ్చ వీర్యవాన్ || || 25 || ముచుకున్ద శ్చ పుణ్యాత్మా సర్వే శక్రసమా యుధి | అమ్బరీషస్య దాయాదో యువనాశ్వో7 పరః స్మృతః || || 26 || ఓ బ్రాహ్మణులారా! ఆ ధుంధుమారునికి దృఢాశ్వుడు, దండాశ్వుడు, కపిలాశ్వుడు అను పేర్లుకల ముగ్గురు కుమారులు కలిగిరి. (21) వారిలో దృఢాశ్వునికి ప్రమోదుడు, అతనికి హర్యశ్వుడు అనువారు పుత్రులుగా పుట్టిరి. హర్యశ్వునికి నికుంభుడు అనుపుత్రుడు, అతనికి సంహతాశ్వకుడు అనువాడు జన్మించిరి. (22) సంహితాశ్వునకు కృతాశ్వుడు, రణాశ్వుడు అను ఇద్దరు కుమారులు కలిగిరి. వారిలో రణాశ్వునికి యువనాశ్వుడను పుత్రుడు, యుద్ధములో ఇంద్రసమాన బలముకలవాడు. కలిగెను. (23) అతడు ఋషుల అనుగ్రహముతో వరుణదేవతాకమైన ఇష్టినిచేసి, సాటిలేని విష్ణుభక్తుడు, శ్రేష్ఠుడు అగు పుత్రుని పొందెను. (24) అతడే మిక్కిలి బుద్ధిశాలి, ఆయుధధారులందరిలో శ్రేష్ఠుడగు మాంధాత. అతనికి పురుకుత్సుడు, పరాక్రమవంతుడైన అంబరీషుడు కూడ జన్మించిరి. (25) పుణ్యాత్ముడైన ముచుకుందుడు కూడ అతనిని పుత్రుడే. వారందరు యుద్ధరంగములో ఇంద్రునితో సమానులు. అంబరీషునికి దాయాదుడైన మరొక యువనాశ్వుడు కలడు. (26) హరితో యువనాశ్వస్య హారిత స్తత్సుతోభవత్ | పురుకుత్సస్య దాయాద స్త్రసదస్యు ర్మహాయశాః || || 27 || నర్మదాయాం సముత్పన్నః సమ్భూతి స్తత్సుతః స్మృతః | విష్ణువృద్ధః సుత స్తస్య త్వనరణ్యో7భవ త్తతః || || 28 || బృహదశ్వో7నరణ్యస్య హర్యశ్వ స్తత్సుతో7భవత్ | సో7తీవ ధార్మికో రాజా కర్దమస్య ప్రజాపతేః || || 29 || ప్రసాదా ద్ధార్మికం పుత్రం లేభే సూర్యపరాయణమ్ | స తు సూర్యం సమభ్యర్చ్య రాజా వసుమనాః శుభమ్ || || 30 || లేభే త్వప్రతిమం పుత్రం త్రిధన్వాన మరిన్దమమ్ | అయజ చ్చాశ్వమేధేన శత్రూ ఞ్జిత్వా ద్విజోత్తమాః || || 31 || ఆయువనాశ్వునికి హరితుడు, అతనికి హారితుడు అనువారు పుత్రులుగా పుట్టిరి. పురుకుత్సుని దాయాదుడైన త్రసదస్యుడు అనుగొప్ప కీర్తికలవాడు, (27) నర్మద అనుస్త్రీయందు జన్మించెను. అతనికుమారుడు సంభూతిఅనువాడు, అతనికి విష్ణువృద్ధుడనుపుత్రుడు కలిగెను. వానివలన అనరణ్యుడు పుట్టెను. 928) అనరణ్యునికి బృహదశ్వుడు, అతనికి హర్యశ్వుడు అనువారు కుమారులుగా జన్మించిరి. మిక్కిలి ధర్మాత్ముడైన ఆహర్యశ్వుడనురాజు కర్దమ ప్రజాపతియొక్క; (29) అనుగ్రహమువలన సూర్యునియందు భక్తికల ధార్మికుడైన కుమారుని పొందెను. వసుమనసుడు అనబడు ఆరాజు శుభకరుడైన సూర్యుని పూజించి; (30) సాటిలేని, శత్రువులను జయించునట్టి త్రిధన్వుడను కుమారుని పొందెను. ఓ విప్రులారా! అతడు శత్రువులను గెలిచి అశ్వమేథయాగమును కూడ చేసెను. (31) స్వాధ్యాయవా న్దానశీల స్తితీర్షు ర్ధర్మతత్పరః | ఋషయ స్తు సమాజగ్ము ర్యజ్ఞవాటం మహాత్మనః || || 32 || వసిష్ఠకశ్యపముఖా దేవా శ్చేన్ద్రపురోగమాః | తా న్ర్పణమ్య మహారాజః పప్రచ్ఛవినయాన్వితః || || 33 || సమాప్య విధివ ద్యజ్ఞం వసిష్ఠాదీన్ ద్విజోత్తమాన్ | || 34|| వసుమనా ఉవాచ :- కిం హి శ్రేయస్కరతరం లోకే7స్మిన్ బ్రాహ్మణర్షభాః || యజ్ఞ స్తపో వా సంన్యాసో బ్రూత మే సర్వవేదినః | || 35 || వసిష్ఠఉవాచ:- అధీత్య వేదా న్విధివ త్సుతాం శ్చోత్పాద్య యత్నతః || ఇష్ట్వా యజ్ఞశ్వరః యజ్ఞైర్గచ్ఛే ద్వన మథా త్మవాన్ | || 36 || పులస్త్య ఉవాచ :- ఆరాధ్య తపసా దేవం యోగినం పరమేశ్వరమ్ || వేదముల నధ్యయనముచేసినవాడు, దానముచేయుస్వభావము కలవాడు, సంసార సముద్రమును దాటగోరువాడు, ధర్మమునందాసక్తి కలవాడుగా ఆరాజుండెను. ఆమహాత్ముని యజ్ఞమంటపమువద్దకు ఋషులు వచ్చిరి. (32) వసిష్ఠుడు కశ్యపుడు మొదలగు ఋషులు, ఇంద్రుడు మొదలైన దేవతలు తన యజ్ఞశాలకు రాగా, ఆరాజువారికి నమస్కరించి వినయముతో కూడినవాడై కుశలప్రశ్నలువేసెను. (33) విధానము ప్రకారము యజ్ఞమును పూర్తిచేసి, వసిష్ఠుడు మొదలగు బ్రాహ్మణశ్రేష్ఠులను వసుమనసుడు ఇట్లు ప్రశ్నించెను. ''ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈలోకములో ఏది ఎక్కువ శ్రేయస్సును కలిగించునది? (34) యజ్ఞము, తపస్సు, సంన్యాసము వీనిలో ఏది శ్రేష్ఠమో అన్ని తెలిసిన మీరు నాకు చెప్పుడు''. అని పలుకగా వసిష్ఠుడాతనితో, వేదములను నియమపూర్వకమగా అధ్యయనముచేసి, తరువాత గృహస్థుడై పుత్రులనుకని; (35) యజ్ఞములతో యజ్ఞేశ్వరుని పూజించి, తరువాత ఆత్మ బలము కలవాడై వనమునకు వెళ్లవలెను. అప్పుడు పులస్త్యుడిట్లు పలికెను. తపస్సుతో యోగియగు పరమేశ్వరుని పూజించి; (36) ప్రవ్రజే ధ్విధివ ద్యజ్ఞై రిష్ట్వా పూర్వం సురోత్తమాన్ | || 37 || పులహఉవాచ :- య మాహు రేకం పురుషం పురాణం పరమేశ్వరమ్ || త మారాధ్య సహస్రాంశు న్తపసో మోక్ష మాప్నుయాత్ | || 38 || జమదగ్నిరువాచ :- అజో విశ్వస్య కర్తా యో జగద్బీజం సనాతనః || అన్తర్యామీ చ భూతానాం స దేవ స్తపసేజ్యతే | || 39 || విశ్వామిత్ర ఉవాచ :- యోగ్నిః సర్వత్మకో7నన్తః స్వయమ్భూ ర్విశ్వతోముఖః || స రుద్ర స్తపసోగ్రేణ పూజ్యతే నేతరై ర్మఖైః | || 40 || భరత్వాజ ఉవాచ :- యో యజ్ఞై రిజ్యతే దేవో వాసుదేవః సనాతనః || శాస్త్రవిధితో యజ్ఞములు చేసి ముందుగా దేవతలను పూజించి సన్న్యసించవలెను'' పులహుడిట్లనెను'' ఎవనిని అద్వితీయుడైన పురాణపురుషుడని, పరమేశ్వరుడని అందురో (37) ఆ సహస్రకిరణుడగు భగవంతుని తపస్సుద్వారా పూజించి మోక్షము పొందవలెను.'' జమదగ్ని ఇట్లనెను. ''పుట్టుకలేనివాడు, ప్రపంచమును సృష్టించువాడు, జగత్తుకు బీజమువంటివాడు, సనాతనుడు, (38) సమస్త ప్రాణులలో వ్యాపించి యున్న ఆదేవుడు తపస్సుచేత పూజిపంబడును''. విశ్వామిత్రుడిట్లుపలికెను. ''ఏ అగ్ని సమస్తము తనరూపముగా కలవాడు, అంతములేనివాడు, తనంతట తాను ఆవిర్భవించినవాడు. ప్రపంచమంతట నిండినవాడో; (39) ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సుచేత పూజింపబడును. ఇతర యజ్ఞములచేత అతడు పూజింపబడడు.'' భరద్వాజుడనెను. ''సనాతనుడైన ఎవడు యజ్ఞములచేత పూజింపబడునో, భగవంతుడగు ఆవాసుదేవుడు; (40) స సర్వదైవతతనుః పూజ్యతే పరమేశ్వరః | || 41 || అత్రిరువాచ :- యతః సర్వ మిదం జాతం యస్యా పత్యం ప్రజాపతిః || తపః సుమహదాస్థాయ పూజ్యతే స మహేశ్వరః || || 42 || గౌతమ ఉవాచ :- యతః ప్రధానపురుషౌ యస్యశక్తి రిదం జగత్ || స దేవదేవస్తపసా పూజనీయః సనాతనః | || 43 || కశ్యప ఉవాచ :- సహస్రనయనో దేవః సాక్షీ శమ్భుః ప్రజాపతిః || ప్రసీదతి మహాయోగీ పూజిత స్తపసా పరః | || 44 || క్రతురువాచ :- ప్రాప్తాధ్యయనయజ్ఞస్య లబ్ధపుత్రస్య చైవహి || సమస్తదేవతలు శరీరముగా కల అతడు పరమేశ్వరుడుగా పూజింపబడును''. అత్రిఇట్లనెను. ''ఎవనివలన ఈసమస్తము పుట్టినదో, బ్రహ్మదేవుడు ఎవని సంతానమో; (41) ఆ మహేశ్వరుడు చాలాగొప్పతపస్సునవలంబించి పూజింపబడుచున్నావు''. గౌతముడిట్లుచెప్పెను :- ''ఎవని వలన ప్రధానతత్త్వము, పురుషుడు కలిగెనో, ఈ విశ్వమంతయు ఎవని శర్తిరూపమో; (42) ఆ సనాతనుడైన దేవదేవుడు తపస్సుచేత పూజింపదగినవాడు.'' కశ్యపముని ఇట్లు పలికెను :- ''వేయి కన్నులు కలదేవుడు, సమస్తమునకు సాక్షిభూతుడు, ప్రజాపతి, శంభుడు; (43) గొప్పయోగీశ్వరుడగు ఆదేవుడు తపస్సుచేత పూజింపబడి ప్రసన్నుడగును''. క్రతువు ఈవిధముగా అనెను :- వేదాధ్యయనమును యజ్ఞమును పొందిన వానికి, పుత్ర సంతానము కలిగిన వానికి కూడ; (44) నాన్తరేణ తపః కిశ్చి ద్ధర్మశాస్త్రేషు దృశ్యతే | ఇత్యాకర్ణ్య స రాజర్షి స్తాన్ ప్రణమ్యా తిహృష్టధీః || || 45 || విసర్జయిత్వా సంపూజ్య త్రిధన్వాన మథాబ్రవీత్ | ఆరాధయిష్యే తపసా దేవ మేకాక్షరాహ్వయమ్ || || 46 || ప్రాణం బృహన్తం పురుష మాదిత్యాన్తరసంస్థితమ్ | త్వ న్తుధర్మరతో నిత్యం పాలయైత దతన్ద్రితః || || 47 || చాతుర్వర్ణ్యసమాయుక్త మశేషం క్షితిమణ్డలమ్ | ఏవ ముక్త్వా స తద్రాజ్యం నిధాయా త్మభ##వే నృపః | || 48 || జగామా రణ్య మనఘ స్తప స్తప్తు మనుత్తమమ్ | హిమ వచ్ఛిఖరే రమ్యే దేవదారువనాశ్రయే || || 49 || తపమాచరించుటకన్న మరొకవిధి ధర్మశాస్త్రములందు కన్పించదు''. ఈ విధముగా ఆమునుల మాటలువిని రాజర్షి వారికి నమస్కరించి, మిక్కిలిసంతోషించిన మనస్సుకలవాడై; (45) వారిని పూజించి, వీడ్కొలిపి తరువాత త్రిధన్వునితో ఇట్లు పలికెను''. ఏకాక్షర ప్రణవ స్వరూపుడైన భగవంతుని నేను తపస్సుతో ఆరాధింతును. (46) సూర్యమండల మధ్యమందున్నవాడు, బృహత్ర్పాణస్వరూపుడు, అగు పరమ పురుషుని పూజింతును. నీవు మాత్రము ధర్మము నందాసక్తి కలవాడవై, ఎల్లప్పుడు సావధానుడవుగా ఈరాజ్యమును పాలింపుము. (47) నాలుగు వర్ణముల జనులతో కూడియున్న యీ సకల భూమండలమును పరిపాలించుము'' అని చెప్పి ఆ రాజు తనరాజ్యమును కుమారున కప్పగించి; (48) పుణ్యాత్ముడైన అతడు శ్రేష్ఠమైన తపస్సునాచరించుటకు దేవదారు వృక్షముల కాశ్రయమైన, మనోహరమైన, హిమాలయ శిఖర ప్రదేశ మందలి అరణ్యమునకు వెళ్లెను. (49) కన్దమూలఫలాహారై రుత్పన్నై రయజ త్సురాన్ | సంవత్సరశతం సాగ్రం తపోనిర్ధూతకిల్బిషః || || 50 || జజాప మనసా దేవీం సావిత్రీం వేదమాతరమ్ | తసై#్యవం తపతో దేవః స్వయమ్భూః పరమేశ్వరః || || 51 || హిరణ్యగర్భో విశ్వాత్మా తం దేశ మగమ త్స్వయమ్ | దృష్ట్వా దేవం సమాయాన్తం బ్రహ్మాణం విశ్వతోముఖమ్ || || 52 || ననామ శిరసా తస్య పాదయో ర్నామ కీర్తయన్ నమోదేవాధిదేవాయ బ్రహ్మణ పరమాత్మనే || || 53 || హిరణ్యమూర్తయే తుభ్యం సహస్రాక్షాయ వేధసే | నమో ధాత్రే విధాత్రే చ నమో దేవాత్మమూర్తయే || || 54 || సహజముగా లభ్యములైన దుంపలు, వేళ్లు, పండ్లు అను ఆహారములతో దేవతలను పూజించెను. ఈ విధముగా నూరు సంవత్సరముల కాలము తపస్సుచేసి, తన పాపములను తొలగించుకున్నవాడై; (50) వేదములకు మాతృరూపిణియగు సావిత్రీదేవిని మనః పూర్వకముగా జపించెను. ఇట్లు అతడు తపస్సు చేయుచుండగా స్వయంభువు, పరమేశ్వరుడును; (51) హిరణ్యగర్భుడు, విశ్వస్వరూపుడు అగు భగవంతుడా ప్రదేశమునకు వచ్చెను. అన్నివైపుల ప్రసరించిన ముఖముకల బ్రహ్మదేవుడు తనవద్దకు వచ్చుచుండగా, చూచి; (52) నామసంకీర్తనము చేయుచు శిరస్సువంచి ఆయన పాదములకు నమస్కరించెను. దేవతల కందరికి అధిపతివి, పరమాత్మస్వరూపుడవు, బ్రహ్మవుఅగు నీకు నమస్కారము. (53) హిరణ్యరూపముకలవాడవు, అనంతములైన కన్నులు కల బ్రహ్మవగు నీకు వందనము. ధాతవు, విధాతవు, దేవతలకాత్మ రూపుడవును అయిన నీకు నమస్కారము. (54) సాంఖ్యయోగాధిగమ్యాయ నమస్తే జ్ఞానమూర్తయే | నమ స్త్రిమూర్తయే తుభ్యం స్రష్ట్రే సర్వార్థవేదినే || || 55 || పురుషాయ పురాణాయ యోగినాం గురవే నమః | తతః ప్రసన్నో భగవా న్విరఞ్చి ర్విశ్వభావనః || || 56 || వరం వరయ భద్రం తే వరదో7స్మీ త్యభాషత | || 57 || రాజోవాచ :- జపేయం దేవదేవేశ గాయత్రీం వేదమాతరమ్ || భూయో వర్షశతం సాగ్రం తావ దాయు ర్భవే న్మమ | బాఢ మిత్యాహ విశ్వాత్మా సమాలోక్య నరాధిపమ్ || || 58 || స్పృష్ట్వా కరాభ్యాం సుప్రీత స్తత్రైవా న్తరధీయత | సో7పి లబ్థవరః శ్రీమాన్ జజాపా తిప్రసన్నధీః || || 59 || సాంఖ్యతత్త్వజ్ఞానముచే తెలిసికొనదగినవాడవు, జ్ఞానాకారుడవు, మూడుమూర్తులతో ప్రకాశించువాడవు, సృజించువాడవు, సమస్త విషయముల నెరిగినవాడవును అగునీకు ప్రణామము. (55) పురాణపురుషుడవు, యోగీశ్వరులకు గురువును అయిన నీకు నమస్కారము. అని వందనపూర్వకముగా స్తుతించగా విశ్వభావనుడు, భగవంతుడు బ్రహ్మ అతనికి ప్రసన్నుడై; (56) ''నీకు శుభమగుగాక! ఏదైన వరమును కోరుకొనుము. నేను నీకు వరమునిత్తును|| అని పలికెను. అప్పుడు రాజిట్లనెను. ''దేవతలకు దేవుడవైన ఓ ప్రభూ! వేదమాతయగు గాయత్రీదేవిని గూర్చి జపింతును. (57) మరల వందసంవత్సరముల కాలము జపించుటకుగాను నాకు అంతవరకు ఆయువుననుగ్రహించుము.'' అని పలుకగా విశ్వాత్ముడైన బ్రహ్మ రాజును చూచి'' అట్లేయగుగాక'' అని పలికెను. (58) మిగుల సంతోషించినవాడై భగవంతుడు చేతులతో రాజును తాకి అక్కడనే అదృశ్యమయ్యెను. రాజుకూడ వరమును పొంది నిర్మలబుద్ధికలవాడై గాయత్రీ మంత్రమును జపించెను. (59) శాన్త స్త్రిషవణస్నాయీ కన్దమూలఫలాశనః | తస్య పూర్ణే వర్షశ##తే భగవా నుగ్రదీధితిః || || 60 || ప్రాదురాసీ న్మహాయోగీ భానో ర్మణ్డలమధ్యతః | తం దృష్ట్వా వేదవపుషం మణ్డలస్థం సనాతనమ్ || || 61 || స్వయమ్భువ మనాద్యన్తం బ్రహ్మాణం విస్మయం గతః | తుష్టాన వైదికైర్మన్త్రైః సావిత్ర్యా చ విశేషతః || || 62 || క్షణా దపశ్య త్పురుషం తమేవ పరమేశ్వరమ్ | చతుర్ముఖం జటామౌళి మష్టహస్తం త్రిలోచనమ్ || || 63 || చన్ద్రావయవలక్ష్మాణం నరనారీతనుం హరమ్ | భాసయన్తం జగ త్కృత్స్నం నీలకణ్డం స్వరశ్మిభిః || || 64 || రక్తామ్బరధరం రక్తం రక్తమాల్యానులేపనమ్ | తద్భావభావితో దృష్ట్వా సద్భావేన పరేణ హి || || 65 || ఆకాలమున అతడు శంతచిత్తుడు, మూడు కాలములందు స్నానముచేయుచు, కందమూలములను, పండ్లను భుజించుచు జపము చేయగా నూరు సంవత్సరములు పూర్తికాగా భగవంతుడు, తీక్షణమైన ప్రకాశము కలిగినట్టి; (60) మహాయోగి స్వరూపుడు సూర్యమండల మధ్యభాగము నుండి సాక్షాత్కరించెను. వేద శరీరుడైన, మండలమందున్న, సనాతనుడైన ఆదేవుని, (61) స్వయంభువుని, ఆద్యంతములు లేనివానిని, బ్రహ్మను చూచి అతడు ఆశ్చర్యమును పొందెను. విశేషముగా స్తోత్రము చేసెను. (62) వెంటనే రాజు, ఆపరమేశ్వరరూపుమను పురుషునిగా నాలుగు ముఖములవానిగా, జడలు తలయందు ధరించినవానిగా, ఎనిమిది చేతులు, మూడుకన్నులు కలవానిగా చూచెను. (63) చంద్రభాగమును అంకముగా కలవాడు, స్త్రీ పురుషద్వయ శరీరము కలవాడు, కాంతులతో సమస్త లోకములను ప్రకాశింప జేయుచున్నవాడు, నల్లనికంఠముగలవాడుగా దేవుని దర్శించెను. (64) ఎఱ్ఱని వస్త్రము ధరించినవాడు, ఎఱ్ఱని హారమును ధరించినవాడు, రక్తవర్ణుడగు భగవంతుని చూచి, అతనియందే శ్రద్ధకలవాడై మంచి హృదయముతో; (65) ననామ శిరసా రుద్రం సావిత్ర్యా తేన చైవ హి | నమస్తే నీలకణ్డాయ భాస్వతే పరమేష్ఠినే || || 66 || త్రయీమయాయ రుద్రాయ కాలరూపాయ హేతవే | తదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీతమానసః || || 67 || ఇమాని మే రహస్యాని నామాని శృణు చానఘ | సర్వవేదేషు గీతాని సంసారశమనాని తు || || 68 || నమస్కురుష్వ నృపతే ఏభి ర్మాం సతతం శుచిః | అధీష్వ శతరుద్రీయం యజుషాం సార ముద్ధృతమ్ || || 69 || జపస్వా నన్యచేతస్కో మయ్యాసక్తమనా నృప | బ్రహ్మచారీ నిరాహారో భస్మనిష్ఠః సమాహితః || || 70 || జపేదా మరణా ద్రుద్రం స యాతి పరమం పదమ్ | ఇత్యుక్త్వా భగవా న్రుద్రో భక్తానుగ్రహకామ్యయా || || 71 || ఆరుద్రునికి శిరస్సుతో నమస్కరించి గాయత్రీ మంత్రముతో స్తుతించెను. నీలకంఠుడవు, ప్రకాశించువాడవు, పరమేష్ఠివి అగు నీకు నమస్కారము. (66) మూడువేదముల ఆత్మరూపుడవు, కాలరూపుడవు, కారణభూతుడవు, రుద్రుడవును అగునీకు వందనము.'' అప్పుడాతని స్తుతికి సంతోషించిన మనస్సుకల శివుడు రాజును గూర్చి ఇట్లుపలికెను. (67) పుణ్యాత్ముడా! ఇవి నా నామములు, రహస్యములైనవి. వేదములన్నిటి యందు కీర్తింపబడినవి, సంసారబంధమును తొలగించునవి వీనిని వినుము. (68) ఓ రాజా! ఈ నామములతో, శుచివై, ఎల్లప్పుడు నాకు నమస్కరింఉము. యజుర్వేద మంత్రములనుండి తీయబడిన సారభూతమైన శతరుద్రీయమును అధ్యయనము చేయుము. (69) రాజా! నాయందు ఆసక్తికల మనస్సుతో, ఏకాగ్రమైన మనస్సుకలవాడవై బ్రహ్మచర్యము నవలంబించి, నిరాహారుడవై, భస్మమును ధరించి, సావధానుడవై జపము చేయుము. (70) మరణపర్యంతము జపము చేసినచో అట్టివాడు పరమైన మోక్షపదమును పొందును. భగవంతుడైన రుద్రుడు, భక్తులననుగ్రహించు కోరికతో, ఇట్లుపలికి, మరల నూరు సంవత్సరముల కాలము; పునః సంవత్సరశతం రాజ్ఞే హ్యాయు రకల్పయత్ | దత్వాసై#్మ తత్పరం జ్ఞానం వైరాగ్యం పరమేశ్వరః || || 72 || క్షణా దన్తర్దధే రుద్ర స్తదద్భుత మివాభవత్ | రాజాపి తపసా రుద్రం జజాపా సన్యమానసః || || 73 || భస్మచ్ఛన్న స్త్రిషవణం స్నాత్వా శాన్తః సమాహితః | జపత స్తస్య నృపతేః పూర్ణే వర్షశ##తే పునః || || 74 || యోగప్రవృత్తి రభవ త్కాలా త్కాలపరం పదమ్ | వివేశై త ద్వేదసారం స్థానం వై పరమేష్ఠినః || || 75 || భానోః సుమణ్డలం శుభ్రం తతో యాతో మహేశ్వరమ్ | సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే || |7 76 || ఇతి శ్రీ కూర్మపురాణ రాజవంశకీర్తనే వింశో7ధ్యాయః రాజున కాయువును కల్పించెను. పరమేశ్వరుడు అతనికి ఉత్తమమైన జ్ఞానమునిచ్చి, వైరాగ్యమును కల్గించి, క్షణములో అంతర్థానము చెందెను. అదియొక ఆశ్చర్యముగా జరిగెను. ఆ రాజు కూడ అనన్యమనస్కుడై తపస్సుతో రుద్రుని గూర్చి జపించెను. (71, 72, 73) ఆ రాజు భస్మలేపనము చేసికొన్నవాడై మూడుకాలముల యందు స్నానము చేయుచు, శాంతుడై, సావధానుడై జపముచేయుచుండగా నూరు సంవత్సరములు పూర్తిగా గడవగా, యోగప్రవృత్తి కలిగెను. కాలవశమున కాలునికంటె భిన్నమైన గొప్పస్థానమును చేరెను. తరువాత వేదసారభూతమైన పరమేష్ఠియొక్క స్థానమును పొందెను. (74, 75) పిమ్మట సూర్యునియొక్క శుభ్రమైన మండలమును పొంది, తరువాత మహేశ్వరుని సాయుజ్యము నందెను. ఉత్తమమైన యీరాజు యొక్క చరిత్రను ఎవరు చదివినను, విన్నను అన్ని పాపములనండి విడుదల పొంది బ్రహ్మలోకమున గౌరవింపబడును. (76) శ్రీ కూర్మపురాణములో రాజవంశకీర్తనమను ఇరువదవ అధ్యాయము సమాప్తము.