Sri Koorma Mahapuranam
Chapters
అథద్వావింశో7ధ్యాయః సూతఉవాచ:- ఐలః పురూరవా శ్చాథ రాజా రాజ్య మపాలయత్ | తస్య పుత్రా బభూవు ర్హిషడి న్ద్రసమతేజసః ||
|| 1 || ఆయు ర్మాయు రమాయుశ్చ విశ్వాయు శ్చైవ వీర్యవాన్ | శతాయు శ్చ శ్రుతాయుశ్చ దివ్యా శ్త్చేవోర్వశీసుతాః ||
|| 2 || ఆయుషస్తనయా వీరాః పఞ్చైవాస న్మహౌజసః | స్వర్భానుతనయాయాం వై ప్రభాయా మితి నః శ్రుతమ్ ||
|| 3 || నహుషః ప్రథమ స్తేషాం ధర్మజ్ఞో లోకవిశ్రుతః | నహుషస్య తు దాయాదాః పఞ్చే న్ద్రోపమతేజసః ||
|| 4 || ఉత్పన్నాః పితృకన్యాయాం విరజాయాం మహాబలాః | యాతి ర్యయాతి స్సంయాతి రాయాతిః పఞ్చమో7శ్వకః || || 5 || తేషాం యయాతిః పఞ్చానాం మహాబలపరాక్రమః | దేవయానీ ముశనసః సుతాం భార్యా మవాప సః ||
|| 6 || ఇరువదిరెండవ అధ్యాయము సూతుడిట్లు చెప్పెను. ఇల కుమారుడైన పురూరవుడు రాజై రాజ్యమును పాలించెను. అతనికి ఇంద్రసమాన తేజులగు ఆరుగురు కుమారులు కలిగిరి. (1) ఆయువు, మాయువు, అమాయువు, వీర్యవంతుడైన విశ్వాయువు, శతాయువు, శ్రుతాయువు అను ఈ ఆరుగురు దివ్యులైన ఉర్వశీపుత్రులు. (2) వారిలో ఆయువునకు గొప్పబలముకల ఐదుగురు కుమారులు కలిగిరి. స్వర్భానువుకుమార్తె యగు ప్రభయగు భార్యయందు ఆపుత్రులు పుట్టిరని మేము విన్నాము. (3) వారిలో ధర్మము తెలిసినవాడు, లోకములో ప్రసిద్ధుడైన నహుషుడనువాడు మొదటివాడు. నహుషునికి ఇంద్రునితో సమానతేజస్సుకలిగిన అయిదుగురు సంతానము కలిగిరి. (4) వారు పితృదేవతల కన్యయగు విరజయను నామెయందు జన్మించిన యాతి, యయాతి, సంయాతి, ఆయాతి అశ్వకుడు అను గొప్ప బలవంతులు. (5) వారు అయిదుగురిలో యయాతి అనువాడు గొప్ప పరాక్రమము కలవాడు. అతడు శుక్రాచార్యుల పుత్రిక అగు దేవయానిని భార్యగా పొందెను. (6) శర్మిష్ఠా మాసురీం చైవ తనయాం వృషపర్వణః | యదుం చతుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత ||
|| 7 || ద్రుహ్యుఞ్చానుం చ పూరుం చ శర్మిష్ఠా చాప్యజీజనత్ | సో7భ్యషిఞ్చ దతిక్రమ్య జ్యేష్ఠం యదు మనిన్దితమ్ ||
|| 8 || పురు మేవ కనీయాంసం పితు ర్వచనపాలకమ్ | దిశి దక్షిణపూర్వస్యాం తుర్వసుం పుత్ర మాదిశత్ ||
|| 9 || దక్షిణాపరయో రాజా యదుం శ్రేష్ఠం న్యయోజయత్ | ప్రతీచ్యా ముత్తరాయా ఞ్చ ద్రుహ్యుఞ్చాను మకల్పయత్ ||
|| 10 || తై రియం పృథివీ సర్వా ధర్మతః పరిపాలితా | రాజాపి దారసహితో వనం ప్రాప మహాయశాః ||
|| 11 || యదో రప్యభవ న్పుత్రాః పఞ్చ దేవసుతోపమాః | సహస్రజి త్తధా శ్రేష్ఠః క్రోష్టు ర్నీలో జినో రఘుః ||
|| 12 || రాక్షసరాజైన వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను కూడ పత్నిగా స్వీకరించినాడు. వారిలో దేవయాని యదు, తుర్వసులను పుత్రులుగా పొందెను. (7) ద్రుహ్యుంచానుడు, పూరువు అనువారికి శర్మిష్ఠ జన్మనిచ్చెను. ఆ యయాతి పెద్దవాడైన, దోషరహితుడైన యదువును అతిక్రమించి; (8) చిన్నవాడైన పురువునే, తండ్రిమాటను పాటించినందువలన పట్టాభిషిక్తుని చేసెను. ఆగ్నేయదిక్కునందు తుర్వసుడనుపుత్రుని పాలకుడుగా ఉండుమని ఆజ్ఞిపించెను. (9) దక్షిణ పశ్చిమదిక్కులయందు శ్రేష్ఠుడైన యదువును రాజు నియమించెను. ఉత్తర పశ్చిమభాగములలో ద్రుహ్యుంచానుని నియమించినాడు. (10) వారిచేత ఈభూమి మొత్తము ధర్మము ప్రకారము పరిపాలించబడినది. గొప్పకీర్తిగలరాజుకూడ భార్యతో కూడి అడవికి వెళ్లివాన ప్రస్థము నవలంబించెను. (11) యదువునకు దేవకుమారునితో సమానులైన అయిదుగురు పుత్రులు కలిగిరి. సహస్రజిత్తు, క్రోష్టువు, నీలుడు, జినుడు, రఘువు, అని క్రమముగా వారిపేర్లు (12) సహస్రజిత్సుత స్తద్వ చ్చతజిన్నామ పార్థివః | సుతాః శతజితో7 ప్యాసం స్త్రయః పరమధార్మికాః ||
|| 13 || హైహయశ్చ హయ శ్చైవ రాజా వేణుహయశ్చ యః | హైహయస్యా భవ త్పుత్రో ధర్మ ఇత్యభివిశ్రుతః ||
|| 14 || తస్య పుత్రో7భవ ద్విప్రా ధర్మనేత్రః ప్రతాపవాన్ | ధర్మనేత్రస్య కీర్తిస్తు సఞ్చిత స్తత్సుతో7భవత్ || || 15 || మహిష్మః సఞ్చితస్యాభూ ద్భద్రశ్రేణ్య స్తదన్వయః | భద్రశ్రేణస్య దాయాదో దుర్దమోనామపార్థివః ||
|| 16 || దుర్దమస్య సుతో ధీమా నన్థకో నామ వీర్యవాన్ | అన్ధకస్య తు దాయాదా శ్చత్వారో లోకసమ్మతాః ||
|| 17 || సహస్రజిత్తు కుమారుడుగా శతజిత్తు అనురాజు పుట్టెను. ఆశతజిత్తుకు మిక్కిలి ధర్మస్వభావము కల ముగ్గురు కుమారులు కలిగిరి. (13) హైహయుడు, హయుడు, వేణుహయుడు అనువారు ఆ ముగ్గురు కుమారులు. వారిలో హైహయుడను వానికి ధర్ముడనుపేరుతో ప్రసిద్ధుడైన పుత్రుడు పుట్టెను. (14) బ్రాహ్మణులారా! ఆ ధర్మునికి ప్రతాపవంతుడైన ధర్మనేత్రుడను కుమారుడు జన్మించెను. ధర్మనేత్రునకు కీర్తి అనుపుత్రుడు, అతనికి సంచితుడను కుమారుడు కలిగిరి. (15) ఆ సంచితునకు మహిష్ముడను పుత్రుడు కలిగెను. అతనికి భద్రశ్రేణ్యుడనువాడు సంతతిగా జన్మించెను. ఆభద్రశ్రేణ్యునకు దుర్దముడను పేరుగలరాజు దాయాదుడుగా పుట్టెను. (16) దుర్దమునికి బుద్ధిమంతుడు, పరాక్రమముకలవాడును అగు అంధకుడను వాడు పుత్రుడైపుట్టెను. అంధకునకు లోకమునకు అభిమాన పాత్రులైన నలుగురు కుమారులు జన్మించినారు. (17) కృతవీర్యః కృతాగ్నిశ్చ కృతవర్మా చ తత్సుతః | కృతౌజాశ్చచతుర్థో7భూ త్కార్తవీర్య స్తధార్జునః ||
|| 18 || సహస్రబాహు ర్ద్యుతిమా న్ధనుర్వేదవిదాం వరః | తస్య రామో7భవ న్మృత్యు ర్జామదగ్న్యో జనార్దనః ||
|| 19 || తస్య పుత్రశతా న్యాస న్పఞ్చ తత్ర మహారథాః | కృతాస్త్రా బలినః శూరా ధర్మాత్మానో మనస్వినః ||
|| 20 || శూరశ్చ శూరసేనశ్చ కృష్ణో ధృష్ట స్తథైవచ | జయధ్వజశ్చ బలవా న్నారాయణపరో నృపః ||
|| 21 || శూరసేనాదయః పూర్వే చత్వారః ప్రథితౌజసః | రుద్రభక్తా మహాత్మానః పూజయన్తి స్మ శంకరమ్ ||
|| 22 || కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని ఆనలుగురిపేర్లు. నాలుగవవాడైన కృతౌజుడనువాడు కార్తవీర్యార్జునుడు అనికూడ ప్రఖ్యాతుడు. (18) అతడు వేయిభుజములు కలవాడు, తేజోవంతుడు, విలువిద్యనేర్చినవారిలో శ్రేష్ఠుడనై యుండెను. అతనికి విష్ణువు అవతారము, జమదగ్ని కుమారుడు అయిన పరశురాముడు మరణ కారకుడైనాడు. (19) ఆ కార్తవీర్యార్జునునికి వందలమంది కుమారులు కలిగిరి. వారిలో మహారథులు, అస్త్రవిద్యలనెరిగినవారు, బలవంతులు, శూరులు, ధర్మ స్వభావముకలవారు, బుద్ధిమంతులైన వారు 5 గురు ఉండిరి. (20) శూరుడు, శూరసేనుడు, కృష్ణుడు మరియు ధృష్ణుడు అనువారు ముఖ్యులు. బలవంతుడు, నారాయణుని యందు భక్తి కలవాడును అగు జయధ్వజుడనువాడు కూడ వారిలో ముఖ్యుడుగా ఉండెను. (21) పూర్వము చెప్పబడిన శూరుడు మొదలగు నలుగురు ప్రఖ్యాతమైన బలముకలవారై, గొప్పస్వభావముకలిగి శివునియందు భక్తికలవారై, శంకరుని పూజించుచుండిరి. (22) జయధ్వజస్తు మతిమా న్దేవం నారాయణం హరిమ్ | జగామ శరణం విష్ణుం దైవతం ధర్మతత్పరః ||
|| 23 || త మూచు రితరే పుత్రా నాయం ధర్మ స్తవానఘ | ఈశ్వరారాధన రతః పితా స్మాక మితి శ్రుతిః ||
|| 24 || తా నబ్రవీ న్మహాతేజా హ్యేష ధర్మః పరో మమ | విష్ణో రంశేన సంభూతా రాజానో యే మహీతలే ||
|| 25 || రాజ్యం పాలయితావశ్యం భగవా న్పురుషోత్తమః | పూజనీయో7జితో విష్ణుః పాలకో జగతాం హరిః ||
|| 26 || సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చ స్వయం ప్రభుః | తిస్రస్తు మూర్తయః ప్రోక్తాః సృష్టిస్థిత్యన్తహేతవః ||
|| 27 || సత్త్వాత్మా భగవా న్విష్ణుః సంస్థాపయతి సర్వదా | సృజే ద్బ్రహ్మా రజోమూర్తిః సంహరే త్తామసో హరః ||
|| 28 || బుద్ధిమంతుడు, ధర్మమునందాసక్తిలవాడును అగు జయధ్వజుడు భగవంతుడగు నారాయణదేవుని శరణుపొందెను. (23) ఆ కార్తవీర్యుని తక్కిన కుమారులు నలుగురు జయధ్వజునితో ఇట్లనిరి. పుణ్యాత్ముడా! ఇది నీకు ధర్మముకాదు. మన తండ్రి శివుని ఆరాధించుటలో శ్రద్ధకలవాడని ప్రసిద్ధికదా! (24) గొప్పతేజస్సుకల జయధ్వజుడు వారితో ఇట్లు పలికెను. ఇది నాకు గొప్ప ధర్మము. భూమండలముమీద రాజులందరు విష్ణువు యొక్క అంశ చేత జన్మించినవారే. (25) రాజ్యమును పాలించువాడు తప్పక పురుషోత్తముడైన విష్ణువే. లోకములను పాలించువాడు, ఎవరిచేత జయింపబడనివాడు అగు విష్ణువు పూజింపదగినివాడు. (26) ఆ ప్రభువు స్వయముగా సాత్త్వికి, రాజసి, తామసి అను మూడు మూర్తులను, సృష్టిస్థితి లయకారణభూతములైనవానిని ధరించి ఉండును. (27) భగవంతుడగు విష్ణువు సత్త్వస్వరూపుడై లోకములను కాపాడుచుండును. రజోగుణమూర్తి యగు బ్రహ్మ ప్రపంచమును సృజించును. తామసరూపుడగు శంకరుడు లోకములను లయముపొందించును. (28) తస్మా న్మహీపతీనాం తు రాజ్యం పాలయతా మిదమ్ | ఆరాధ్యో భగవా న్విష్ణుః కేశవః కేశిమర్దనః ||
|| 29 || నిశమ్య తస్య వచనం భ్రాతరో7న్యే మనస్వినః | ప్రోచుః సమహారకో రుద్రః పూజనీయో ముముక్షుభిః ||
|| 30 || అయం హి భగవా న్రుద్రః సర్వం జగ దిదం శివః | తమోగుణం సమాశ్రిత్య కాలాన్తే సంహరే త్ర్పభుః ||
|| 31 || యా సా ఘోరతమా మూర్తి రస్య తేజోమయీ పరా | సంహరే ద్విద్యయా పూర్వం సంసారం శూలభ్య త్తయా ||
|| 32 || తత స్తా నబ్రవీ ద్రాజా విచిన్త్యాసౌ జయధ్వజః | సత్త్వేన ముచ్యతే జన్తుః సత్త్వాత్మా భగవా న్హరిః ||
|| 33 || అందువలన రాజ్యమును పరిపాలించుచున్న రాజులందరికి, కేశి అనురాక్షసుని చంపినవాడు, భగవంతుడు, కేశవుడు అగు విష్ణువు పూజింపదగినవాడు. (29) అతని మాటనువిని, బుద్ధిమంతులైన తక్కిన సోదరులు ''సంహార కారకుడైన రుద్రుడు మోక్షము కోరువారిచేత పూజింపదగినవాడు'' అని పలికిరి. (30) భగవంతుడైన యీ రుద్రుడు సమస్త విశ్వమయరూపుడు. ప్రళయకాలములో తమోగుణము నాశ్రయించి లోకములను సంహరించును. (31) ఈ రుద్రుని మిక్కిలిభయంకరమైన తామసరూపము గొప్పతేజోమయమైనది. ఇతడు శూలమును ధరించియుండుట చేత జ్ఞానముతో సంసారబంధమును నశింపజేయును. (32) అని వారు పలుకగా, రాజగు జయధ్వజుడు బాగుగా ఆలోచించి వారితో ఇట్లు పలికెను. ''సత్త్వగుణముతోప్రాణికి మోక్షము లభించును. సత్త్వగుణము స్వరూపముగా కలవాడు భగవంతుడైన విష్ణువు. (33) త మూచు ర్ర్భాతరో రుద్రః సేవితః సాత్వికై ర్జనైః | మోచయే త్సత్త్వసంయుక్తః పూజయే త్సతతం హరమ్ ||
|| 34 || అథా బ్రవీ ద్రాజపుత్రః ప్రహసన్వై జయధ్వజః | స్వధర్మో ముక్తయే యుక్తో నాన్యో మునిభి రిష్యతే ||
|| 35 || తథా చ వైష్ణవీం శక్తిం నృపాణాం దధతాం సదా | ఆరాధనం పరో ధర్మో మురారే రమితౌజసః ||
|| 36 || త మబ్రవీ ద్రాజపుత్రః కృష్ణో మతిమతాం వరః | య దర్జునో7స్మజ్జనకః స ధర్మం కృతవా నితి ||
|| 37 || ఏవం వివాదే వితతే శూరసేనో7బ్రవీ ద్వచః | ప్రమాణ మృషయో హ్యత్ర బ్రూయన్తే త త్తథైవ తత్ ||
|| 38 || అతని సోదరులు జయధ్వజునితో ఇట్లనిరి. ''సాత్వికగుణము గల జనులచేత సేవించబడిన శివుడు మోక్షము ప్రసాదించును. అందువలన సత్త్వగుణము కలవాడు ఎల్లప్పుడు శివుని పూజించవలెను'' అని. (34) అప్పుడు రాజకుమారుడైన జయధ్వజుడు పెద్దగా నవ్వుచు ఇట్లు పలికెను. ''మోక్షము కొరకు ఎవరికి వారి ధర్మమే తగినది. ఇతరుల ధర్మము స్వీకరించుట మునులకు సమ్మతము కాదు. (35) రాజ్యభారమును వహించుచున్న, విష్ణుసంబంధి శక్తిని కలిగియున్న రాజులకు, అంతులేని మహిమ కలిగిన విష్ణుమూర్తియొక్క ఆరాధనము గొప్పధర్మము.'' (36) అది విని రాజకుమారుడై, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన కృష్ణుడను సోదరుడు అతనితో ఇట్లనెను. ''మన తండ్రియగు అర్జునుడు శివారాధన రూపమైన ధర్మము నాచరించినందున మనకది కర్తవ్యము''. (37) ఈ రీతిగా వారిలో వివాదము సాగుచుండగా, శూరసేనుడను సోదరుడిట్లనెను. ''ఈ విషయములో మనకు ఋషులే ప్రమాణము. వారు ఆధర్మమును అట్లే ప్రతిపాదింతురు. కనుక ఋషుల వద్దకు వెళ్లి వారివద్ద కర్తవ్యము విషయములో ఉపదేశమును పొందుదము''. (38) తత స్తే రాజశార్దూలాః పప్రచ్ఛు ర్బ్రహ్మవాదినః | గత్వా సర్వే సుసంరబ్ధాః సప్తర్షీణాం తదాశ్రమమ్ ||
|| 39 || తా నబ్రువం స్తే మునయో వసిష్ఠాద్యా యథార్థతః | యా యస్యాభిమాతా పుంసః సా హిత తసై#్యవ దేవతా ||
|| 40 || కిన్తు కార్యవిశేషేణ పూజితా చేష్టదా నృణామ్ | విశేషా త్సర్వదా నాయం నియమో హ్యన్యథా నృపాః ||
|| 41 || నృపాణాం దైవతం విష్ణు స్తథేశశ్చ పురన్దరః | విప్రాణా మగ్ని రాదిత్యో బ్రహ్మాచైవ పినాకధృక్ ||
|| 42 || దేవానాం దైవతం విష్ణు ర్దానవానాం త్రిశూలధృక్ | గన్థర్వాణాం తథా సోమో యక్షాణా మపి కథ్యతే ||
|| 43 || తరువాత రాజశ్రేష్ఠులైన, బ్రహ్మవాదులగు ఆ అయిదుగురు కుమారులు గొప్ప ఉత్సాహము కలవారై, సప్తర్షులయొక్క ఆశ్రమమునకు వెళ్లి, తమకు కలిగిన సందేహమును గూర్చి ప్రశ్నించిరి. (39) వసిష్ఠుడు మొదలగు ఆ ఋషులు రాజకుమారులతో యథార్థతత్త్వమునిట్లు చెప్పిరి. ఏ పురుషునికి ఎవరు ప్రీతిపాత్రులవుతారో ఆదేవతయే అతనిని పూజించదగినది. (40) కాని, ఆయా ప్రత్యేక కార్య సందర్భములలో పూజింపబడిన దేవతలు మనుష్యులకు ఇష్టసిద్ధిని కలిగింతురు. ఇది విశేషవిధి. రాజకుమారు లారా! ఈ నియమము అన్ని కాలాలకు వర్తించదు. (41) రాజులకు దైవతము విష్ణువు. అట్లే శివుడు, ఇంద్రుడు కూడ దేవతలే. బ్రాహ్మణులకు అగ్నిహోత్రుడు, సూర్యుడు, బ్రహ్మదేవుడు, పినాకధారి యగు శివుడు దేవతలు. (42) దేవతలకు దేవుడు నారాయణుడు. రాక్షసులకు త్రిశూలధారియైన శివుడు దేవుడు. గంధర్వులకు, యక్షులకు కూడ సోముడు దేవత అని చెప్పబడినది. (43) విద్యాధరాణాం వాగ్దేవీ సిద్ధానాం భగవా న్హరిః | రక్షసాం శంకరో రుద్రః కిన్నరాణాం చ పార్వతీ ||
|| 44 || ఋషీణాం భగవాన్ బ్రహ్మా మహాదేవ స్త్రిశూలభృత్ | మాన్యా స్త్రీణా ముమాదేవీ తథా విష్ణ్వీశభాస్కరాః ||
|| 45 || గృమస్థానాం చ సర్వేస్యు ర్బ్రహ్మావై బ్రహ్మచారిణామ్ | వైఖానసానా మర్కః స్యా ద్యతీనాం చ మహేశ్వరః ||
|| 46 || భూతానాం భగవా న్రుద్రః కూష్మాణ్డానాం వినాయకః | సర్వేషాం భగవాన్ బ్రహ్మా దేవదేవః ప్రజాపతిః ||
|| 47 || ఇత్యేవం భగవాన్ బ్రహ్మా స్వయం దేవో హ్యభాషత | తస్మా జ్జయధ్వజో నూనం విష్ణ్వారాధాన మర్హతి ||
|| 48 || విద్యాధరులకు దేవత సరస్వతి, సిద్ధులకు భగవంతుడగు విష్ణువు దేవత. రాక్షసులకు దేవుడు శంకరుడగు రుద్రుడు. కిన్నరులకు పార్వతీ దేవి దేవత. (44) ఋషులకు భగవంతుడగు బ్రహ్మ దేవత; త్రిశూలధారియైన మహాదేవుడు కూడ దేవుడు. స్త్రీలకు పార్వతీదేవి, విష్ణు, రుద్ర, సూర్యులు పూజింపదగినవారు. (45) సమస్తభూతములకు రుద్రుడు దేవత, కూష్మాండులకు వినాయకుడు అధిదేవత. దేవదేవుడు, ప్రజాపతి, భగవంతుడగు బ్రహ్మ అందరికి పూజనీయుడగు దేవత. (47) ఈ విధముగా భగవంతుడగు బ్రహ్మదేవుడు స్వయముగా పలికెను. అందువలన జయధ్వజుడు నిశ్చయముగా నారాయణుని పూజించుటకు తగియున్నాడు. (48) కిన్తు రుద్రేణ తాదాత్మ్యం బుద్ధ్వా పూజ్యో హరి ర్నరైః | అన్యథా నృపతేః శత్రుం న హరిః సంహరే ద్యతః ||
|| 49 || సంప్రణమ్యా థ తే జగ్ముః పురీం పరమశోధనామ్ | పాయాంచక్రిరే పృథ్వీం జిత్వా సర్వా న్రిపూ న్రణ ||
|| 50 || తతః కదాచి ద్విప్రేన్ద్రా విదేహో నామ దానవః | భీషణః సర్వసత్త్వానాం పురీం తేషాం సమాయ¸° ||
|| 51 || దంష్ట్రాకరాళో దీప్తాత్మా యుగాన్తదహనోపమః | శూల మాదాయ సూర్యాభం నాదయన్వైదిశో దశ ||
|| 52 || తన్నాదశ్రవణా న్మర్త్యా స్తత్ర యే నివసన్తి తే | తతస్యజు ర్జీవితం త్వన్యే దుద్రువు ర్భయవిహ్వలాః ||
|| 53 || కాని శివునితోగల అభేదభావాన్ని గుర్తించి మనుష్యులచేత విష్ణువు పూజింపదగినవాడు. అట్లుకాని యెడల హరి రాజు యొక్క శత్రువును చంపకుండును. (49) తరువాత వారు అతనికి నమస్కరించి మిక్కిలి మంగళకరమైన తమపట్టణమునకు వెళ్లిరి. తమ శత్రువులందరిని యుద్ధములో గెలిచి భూమిని పరిపాలించిరి. (50) ఓ బ్రాహ్మణోత్తములారా! తరువాత ఒకప్పుడు విదేహుడను పేరుకల రాక్షసుడు, సమస్త ప్రాణులకు భయమును కలిగించువాడు, వారి పట్టణమునకు వచ్చెను. (51) ఆ రాక్షసుడు భయంకరములైన దంతములు కలిగి, ప్రళయకాలపు అగ్నితో సమానుడై ప్రకాశించుచు సూర్యునివంటి తేజస్సుకల శూలమును తీసుకొని పదిదిక్కులను ప్రతిధ్వనింపజేయుచు వచ్చెను. (52) ఆ ధ్వనిని వినుటవలన అక్కడ నివసించు మానవులు భయముతో ప్రాణములు విడిచిరి. ఇతరులు భయముతో కలతచెంది పారిపోయిరి. (53) తతః సర్వే సుసంయత్తాః కార్తవీర్యాత్మజా స్తదా | శూరసేనాదయః పఞ్చ రాజాన స్తు మహాబలాః ||
|| 54 || యుయుధు ర్దానవం శక్తిగిరికూటాసిముద్గరైః | తా న్సర్వాన్ సహి విప్రేన్ద్రాః శూలేన ప్రహస న్నివ ||
|| 55 || యుద్ధాయ కృతసంరంభా విదేహం త్వభిదుద్రువుః | శూరో7స్త్రం ప్రాహిణో ద్రౌద్రం శూరసేనస్తు వారుణమ్ ||
|| 56 || ప్రాజాపత్యం తథా కృష్ణో వాయవ్యం ధృష్ణ ఏవచ | జయధ్వజశ్చ కౌబేర మైన్ద్ర మాగ్నేయ మేవచ ||
|| 57 || భఞ్జయామాస శూలేన తా న్యస్త్రాణి స దానవః | తతః కృష్ణో మహావీర్యో గదా మాదాయ భీషణామ్ ||
|| 58 || తరువాత కార్తవీర్యుని కుమారులు శూరసేనుడు మొదలగు అయిదుగురు గొప్పబలవంతులైన రాజులు యుద్ధమునకు బాగా సిద్ధమైరి. (54) వారు శక్తి, పర్వతశిఖరములు, ఖడ్గము, అను ఆయుధములతో ఆరాక్షసునెదుర్కొని యుద్ధము చేసిరి. ఓ ద్విజులారా! ఆ దానవుడు వారందరిని శూలముతో నవ్వుచు ఎదుర్కొనెను. (55) రాజకుమారులు యుద్ధమునకు సన్నాహము చేసికొని విదేహరాక్షసుని ఎదుర్కొనిరి. శూరుడనువాడు రౌద్రాస్త్రమును ప్రయోగించగా, శూరసేనుడు వారుణాస్త్రమును అతనిపై ప్రయోగించినాడు. (56) అట్లే కృష్ణుడను వాడు ప్రాజాపత్యాస్త్రమును, ధృష్ణుడు వాయవ్యాస్త్రమును, జయధ్వజుడు కౌబేరాస్త్రమును, ఐంద్రాస్త్ర, ఆగ్నేయాస్త్రములను ప్రయోగించిరి. (57) ఆరాక్షసుడా అస్త్రములన్నిటిని తనశూలముతో విఫలము చేసెను. తరువాత గొప్పపరాక్రమముగల కృష్ణుడు భయంకరమైన గదను తీసుకొని. (58) స్పృష్టమాత్రేణ తరసా చిక్షేప చ ననాద చ | సంప్రాప్య సాగదా స్యోరో విదేహస్య శిలోపమమ్ ||
|| 59 || న దానవం చాలయితుం శశాకా న్తకసన్నిభమ్ | దుద్రువు స్తే భయగ్రస్తా దృష్ట్వా తస్యా తిపౌరుషమ్ ||
|| 60 || జయధ్వజస్తు మతిమాన్ సస్మార జగతః పతిమ్ | విష్ణుం జయిష్ణుం లోకాది మప్రమేయ మనామయమ్ ||
|| 61 || త్రాతారం పురుషం పూర్వం శ్రీపతిం పీతవాససమ్ | తతః ప్రాదురభూ చ్చక్రం సూర్యాయుతసమప్రభమ్ ||
|| 62 || ఆదేశా ద్వాసుదేవస్య భక్తానుగ్రహణాత్తదా | జగ్రాహ జగతాం యోనిం స్మృత్వా నారాయణం నృపః ||
|| 63 || దానిని స్పృశించినంతనే వేగముతో విసరివైచి పెద్దనాదము చేసెను. ఆగద విదేహునియొక్క రాతితో సమానమైన వక్షస్థలమును చేరుకొని; (59) యమధర్మరాజుతో సమానుడైన ఆరాక్షసుని కదలించలేకపోయెను. అతని అధికమైన పరాక్రమమును చూచి, వారందరు భయముతో కూడినవారై పారిపోయిరి. (60) బుద్ధిమంతుడైన జయధ్వజుడు మాత్రము లోకములకు ప్రభువు, జయశీలుడు, లోకములన్నింటి కాది పురుషుడు, జ్ఞానముతో కొలువ శక్యముకానివాడు, దోషరహితుడును అయిన విష్ణువును స్మరించెను. (61) రక్షకుడు, పురాణపురుషుడు, లక్ష్మీదేవికి భర్త, పచ్చని వస్త్రము ధరించినవాడు అగు విష్ణువును స్మరించగానే, అక్కడ పదివేల సూర్యులతో సమానమైన కాంతిగల సుదర్శన చక్రము సాక్షాత్కరించెను. (62) భక్తులను అనుగ్రహించు స్వభావముకల విష్ణువుయొక్క ఆజ్ఞ వలన ప్రత్యక్షమైన ఆచక్రమును, రాజు ప్రపంచమునకు కారణభూతుడైన నారాయణుని స్మరించి స్వీకరించెను. (63) ప్రాహిణో ద్వైవిదేహాయ దానవేభ్యో యథా హరిః | సంప్రాప్య తస్య ఘోరస్య స్కన్ధదేశం సుదర్శనమ్ ||
|| 64 || పృథివ్యాం పాతయామాస శిరో7ద్రిశిఖరాకృతి | తస్మిన్ హతే దేవరిపౌ శూరాద్యా భ్రాతరో నృపాః ||
|| 65 || తద్ధి చక్రం పురా విష్ణు స్తపసారాధ్య శంకరమ్ | యస్మా దవాప తత్తస్మా దసురాణాం వినాశకమ్ ||
|| 66 || సమాయయుః పురీం రమ్యాం భ్రాతరం చాప్యపూజయన్ | శ్రుత్వా జగామ భగవా ఞ్జయధ్వజపరాక్రమమ్ ||
|| 67 || కార్తవీర్యసుతం ద్రష్టుం విశ్వామిత్రో మహామునిః | త మాగత మథో దృష్ట్వా రాజా సంభ్రాన్తలోచనః ||
|| 68 || ఆ చక్రమును గ్రహించి రాజు, రాక్షసులమీదికి విష్ణువు ప్రయోగించినట్లు విదేహునిపైకి వదలెను. ఆ సుదర్శన చక్రము భయంకరుడైన ఆరాక్షసుని మూపును చేరుకొని; (64) అతని తలను, పర్వత శిఖరము వంటి ఆకారము కలదానిని నేలమీద పడవైచెను. దేవతల శత్రువైన విదేహుడు చంపబడగా, రాజు సోదరులు శూరుడు మొదలగు రాజులు; (65) ఆ చక్రమును పూర్వము విష్ణువు, తపస్సుతో శంకరుని ఆరాధించి పొందినందువలన అది రాక్షసుల సంహారమునకు కారణమైనది. (66) శూరుడు మొదలగు సోదరులు మనోహరమైన తమపట్టణమునకు వచ్చి చేరిరి. తమ సోదరుడైన జయధ్వజుని పూజించిరి. జయధ్వజుని పరాక్రమమును గూర్చివిని మహాత్ముడైన (67) విశ్వామిత్ర మహాముని, కార్తవీర్యుని పుత్రుడగు అతనిని చూచుటకు వచ్చెను. తన వద్దకు వచ్చిన ఆ విశ్వామిత్రునిచూచి రాజు జయధ్వజుడు తత్తర పడిన కన్నులు కలవాడై; (68) సమావేశ్యాస నేరమ్యే పూజయామాస భావ తః | ఉవాచ భగవన్ ఘోరః ప్రసాదా ద్భవతో7సురః || || 69 || నిపాతితో మయా సో7థ విదేహో దానవేశ్వరః | తద్వాక్యా చ్ఛిన్నసన్దేహో విష్ణుం సత్యపరాక్రమమ్ ||
|| 70 || ప్రపన్నః శరణం తేన ప్రసాదో మే కృతః శుభః | యక్ష్యామి పరమేశానం విష్ణుం పద్మదళేక్షణమ్ ||
|| 71 || కథం కేన విధానేన సంపూజ్యో హరి రీశ్వరః | కోయం నారాయణో దేవః కింప్రభావశ్చ సువ్రత ||
|| 72 || సర్వ మేత న్మమాచక్ష్వ పరం కౌతూహలం హి మే | జయధ్వజస్య వచనం శ్రుత్వా శాన్తో ముని స్తతః ||
|| 73 || దృష్ట్వా హరౌ పరాం భక్తిం విశ్వామిత్ర ఉవాచ హ ||
|| 74 || అందమైన ఒక ఆసనమందాయనను కూర్చుండబెట్టి శ్రద్ధాబావముతో పూజించెను. తరువాత ఇట్లు పలికెను ''మహాత్మా! మీ అనుగ్రహము వలన భయంకరుడైన ఆరాక్షసుడు. (69) విదేహుడనువాడు నాచేత చంపబడినాడు. అతనిమాటవలన సంశయములన్నియు తొలగింపబడినవాడై, సత్యమైన పరాక్రమముకల విష్ణువును, (70) శరణము పొందినాను. ఆ విష్ణువుచేత నాకు మంగళదాయకమైన అనుగ్రహము చేయబడినది. పరమేశ్వరుడు, తామర రేకుల వంటి కన్నులు గల విష్ణువును యాగముతో పూజింపగలను. (71) భగవంతుడగు ఆ విష్ణువు ఎట్లు, ఏ పద్ధతితో పూజింపదగినవాడు? మంచి నిష్ఠ కల మునీ! ఈ నారాయణదేవుడెవరు? అతని ప్రభావ మెటువంటిది? (72) ఈ విషయమంతయు నాకు తెలియజెప్పుము. నాకు చాల కుతూహలమున్నది''. అను జయధ్వజుని మాటను విని శాంతుడైన ఆ విశ్వామిత్రముని, (73) నారాయణుని యందతినకున్న భక్తిని గుర్తించి ఇట్లు పలికెను. విశ్వామిత్ర ఉవాచ :- యతః ప్రవృత్తి ర్భూతానాం యస్మి న్సర్వం యతో జగత్ || స విష్ణుః సర్వభూతాత్మా త మాశ్రిత్య విముచ్యతే | య మక్షరా త్పరతరా త్పరం ప్రాహు ర్గుహాశ్రయమ్ ||
|| 75 || ఆనన్దం పరమం వ్యోమ స వై నారాయణః స్మృతః | నిత్యోదితో నిర్వికల్పో నిత్యానన్దో నిరఞ్జనః ||
|| 76 || చతుర్వ్యూహధరో విష్ణు రవ్యూహః ప్రోచ్యతే స్వయమ్ | పరమాత్మా పరంధామ పరంవ్యోమ పరం పదమ్ ||
|| 77 ||ఔ త్రిపాద మక్షరం బ్రహ్మ త మాహు ర్ర్బహ్మవాదినః | స వాసుదేవో విశ్వాత్మా యోగాత్మా పురుషోత్తమః ||
|| 78 || ఎవనివలన సమస్త భూతములు ప్రవర్తించునో, ఎవనియందు సర్వముచేరి యున్నదో, ఎవని నుండి ప్రపంచము పుట్టినదో, (74) అతడు సర్వభూతములు ఆత్మగాకల విష్ణుదేవుడు, అతని నాశ్రయించి మోక్షమును పొందవచ్చును. గుహాశ్రయుడైన ఏ విష్ణువును, మిక్కిలి శ్రేష్ఠమైన అక్షరము కంటె ఉన్నతమైనదిగా చెప్పుదురో; (75) ఆనంద స్వరూపమైన పరమాకాశ రూపుడగు అతడే నారాయణుడని పేర్కొనబడినాడు. ఎల్లప్పుడు ఉదయమునందువాడు, వికారము లేనివాడు, సదా ఆనందము ననుభవించువాడు, మాలిన్యము లేనివాడు, (76) ఆ విష్ణువు స్వయముగా నాలుగు వ్యూహములను ధరించువాడైనను అవ్యూహుడని చెప్పబడుచున్నాడు. అతడు పరమాత్మరూపుడు, సర్వోన్నతస్థానము, పరమాకాశము, పరమ పదరూపుడు. (77) బ్రహ్మజ్ఞానముకల పండితులు అతనిని త్రిపాదుడు, నాశరహితుడైన బ్రహ్మ అని చెప్పుదురు. ఆవాసుదేవుడు విశ్వమే ఆత్మగాకల, యోగ స్వరపుడైన పురుషోత్తముడు. (78) యస్యాం శసమ్భవో బ్రహ్మా రుద్రో7పి పరమేశ్వరః | స్వవర్ణాశ్రమధర్మేణ పుంసాం యః పురుషోత్తమః ||
|| 79 || అకామా ద్ర్వతభావేన సమారాధ్యో నచాన్యథా | ఏతావ దుక్త్వా భగవా న్విశ్వామిత్రో మహాతపాః ||
|| 80 || శూరాద్యైః పూజితో విప్రో జగామా థ స్వమాశ్రమమ్ | అథ శూరాదయో దేవ మయజన్త మహేశ్వరమ్ ||
|| 81 || యజ్ఞేన యజ్ఞగమ్యం తం నిష్కామా రుద్ర మవ్యయమ్ | తా న్వసిష్ఠ స్తు భగవా న్యాజయామాస ధర్మవిత్ ||
|| 82 || గౌతమో7గస్తి రత్రిశ్చ సర్వే రుద్రపరాక్రమాః | విశ్వామిత్రస్తు భగవా ఞ్జయధ్వజ మరిన్దమమ్ ||
|| 83 || బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడైన శివుడుకూడ ఎవనియొక్క అంశమువలన జన్మించిరో, పురుషోత్తముడైన ఏ విష్ణువు పురుషులకు తమతమ వర్ణాశ్రమ ధర్మముననుసరించి, (79) కోరికలు లేకుండా, వ్రతనియమమను భావముతో పూజింపదగినవాడో, అతడు మరొక రీతిగా పూజించుటకు తగడు. అని ఇంతమాత్రము చెప్పి గొప్పతపస్సుకల, భగవంతుడగు విశ్వామిత్రముని, (80) శూరుడు మొదలగువారిచేత సత్కరింపబడి తన ఆశ్రమమునకు వెళ్లెను. అనంతరము శూరాది సోదరులు మహేశ్వరుడైన దేవుని యజ్ఞముతో పూజించిరి. (81) యజ్ఞముచేత తెలియదగిన, నాశరహితుడైన రుద్రుని, కోరికలను వదలినవారై యజ్ఞముద్వారా అర్చించిరి. ధర్మములు తెలిసిన వసిష్ఠమహాముని వారితో యజ్ఞమును చేయించెను. (82) గౌతముడు, అగస్త్యుడు, అత్రి అనువారు, అందరును రుద్రుని వంటి మహిమ కలవారు. భగవంతుడగు విశ్వామిత్రుడు శత్రు విజయియైన జయధ్వజుని ద్వారా; (83) యాజయామాస భూతాది మాదిదేవం జనార్దనమ్ | తస్య యజ్ఞే మహాయోగీ సాక్షా ద్దేవః స్వయం హరిః ||
|| 84 || ఆవిరాసీ త్స భగవా న్తదద్భుత మివా భవత్ | జయధ్వజో7పి తం విష్ణుం రుద్రస్య పరమాం తనుమ్ ||
|| 85 || ఇత్యేవం సర్వదా బుద్ధ్వా యత్నేనాయజ దచ్యుతమ్ | య ఇమం శ్రుణుయా న్నిత్యం జయధ్వజపరాక్రమమ్ ||
|| 86 || సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి || ఇతి శ్రీ కూర్మపురాణ సోమవంశానుకీర్తనం నామ ద్వావింశో7ధ్యాయః సమస్తభూతములకాదిభూతుడు, మొట్టమొదటి భగవంతుడైన నారాయణుని గూర్చి, యజ్ఞము చేయించెను. ఆజయధ్వజుని యజ్ఞములో గొప్పయోగీశ్వరుడు, సాక్షాత్తు భగవంతుడగు విష్ణువు, (84) ప్రత్యక్షమాయెను. ఆ సంఘటన చాలా ఆశ్చర్యకరమైనదివలె జరిగెను. జయధ్వజుడుకూడ శివుని యొక్క శ్రేష్ఠశరీరభూతుడైన ఆ విష్ణువును (85) ఎల్లప్పుడు పూర్వోక్తవిధముగా తెలిసికొని ప్రయత్నపూర్వకముగా పూజించెను. ఎవడైతే ఈ జయధ్వజుని పరాక్రమవృత్తాంతమును ఎల్లప్పుడు వినునో, అతడు అన్నిపాపములనుండి విడువబడినవాడై విష్ణులోకమును పొందును''. శ్రీ కూర్మపురాణములో సోమవంశానుకీర్తనమను ఇరువదిరెండవ అధ్యాయము సమాప్తము.