Sri Koorma Mahapuranam    Chapters   

త్రయోవింశో7ధ్యాయః

సూత ఉవాచ :-

జయధ్వజస్య పుత్రో 7భూ త్తాలజఙ్ఘ ఇతి స్మృతః | శతం పుత్రా స్తు తస్యాస న్తాలజఙ్ఘా ఇతి స్మృతాః || || 1 ||

తేషాం జ్యేష్ఠో మహావీర్యో వీతిహోత్రో 7భవన్నృపః | వృషప్రభృతయ శ్చాన్యే యాదవాః పుణ్యకర్మిణః || || 2 ||

వృషో వంశకర స్తేషాం తస్య పుత్రో7భవ న్మధుః | మధోః పుత్రశతం త్వాసీ ద్వృషణ సప్తస్య వంశభాక్‌ || || 3 ||

వీతిహోత్రసుత శ్చాపి విశ్రుతో 7నన్త ఇత్యతః | దుర్జయ స్తస్య పుత్రో7భూ త్సర్వశాస్త్రవిశారదః || || 4 ||

తస్య భార్యా రూపవతీ గుణౖః సర్వై రలంకృతా | పతివ్రతా సీ త్పతినా స్వధర్మపరిపాలకా || || 5 ||

ఇరువరి మూడవ అధ్యాయము

జయధ్వజునకు తాలజంఘుడను పేరుగల కుమారుడు కలిగెను. అతనికి నూరుగరు పుత్రులు కలిగిరి. వారందరు తాలజంఘులను పేరుతోనే పిలువ బడిరి. (1)

వారిలో పెద్దవాడు గొప్ప పరాక్రమము కల వీతిహోత్రుడనువాడు రాజాయెను. వృషుడు మొదలగు పుణ్య ప్రవర్తనకల ఇతర యాదవులు కూడ అతని సంతతిలోనివాడై ఉండిరి. (2)

వారికి వృషుడు వంశకర్తగా ఉండెను. అతనికి మధువను వాడు పుత్రుడుగా జన్మించెను. ఆ మధువుకు వందమంది కుమారులు కలిగిరి. వారిలో వంశకర్తగా వృషణుడుండెను. (3)

వీతిహోత్రుని కుమారుడు అనంతుడను పేర ప్రసిద్ధుడై ఉండెను. అతనికి అన్ని శాస్త్రముల యందు పాండిత్యము కలిగిన దుర్జయుడను పుత్రుడుండెను. (4)

ఆ దుర్జయుని భార్య సౌందర్యవతి, అన్ని గుణములచే అలంకరింపబడినది, పతియే దైవముగా భావించు వ్రతముకలది, భర్తతో కలిసి తమ ధర్మమునాచరించునదిగా ఉండెను. (5)

స కదాచి న్మహారాజః కాలిన్దీతీరసంస్థితామ్‌ | అపశ్య దుర్వశీం దేవీం గాయన్తీం మధురశ్రుతిమ్‌ || || 6 ||

తతః కామాహతమనా స్తత్సమీప ముపేత్య వై | ప్రోవాచ సుచిరం కాలం దేవి రన్తుం మయార్హసి || || 7 ||

సా దేవీ నృపతిం దృష్ట్వా రూపలావణ్యసంయుతమ్‌ | రేమే తేన చిరం కాలం కామదేవ మివాపరమ్‌ || || 8 ||

కాలా త్ర్పబుద్ధో రాజా తా ముర్వశీం ప్రాహ శోభనామ్‌ | గమిష్యామి పురీం రమ్యాం హసన్తీ త్య బ్రవీద్వచః || || 9 ||

న హ్యేతేనోపభోగేన భవతో రాజసున్దర | ప్రీతిః సఞ్జాయతే మహ్యం స్థాతవ్యం వత్సరం పునః || || 10 ||

ఆ దుర్జయ మహారాజు ఒకప్పుడు యమునానదీతీరములో ఉండి, మధురమైన కంఠస్వరముతో పాడుచున్న ఉర్వశీ దేవిని చూచెను. (6)

తరువాత మనస్సులో మన్మథ వికారము కలిగినవాడై, ఆమెదగ్గరకు వెళ్ళి ఇట్లనెను. ఓ దేవీ! నీవు చాలాకాలము నాతో కలిసి రమించుటకు తగియున్నావు. (7)

ఆ ఉర్వశీదేవి, అందము లావణ్యము కలిగిన ఆ రాజును చూచి రెండవ మన్మధునివలె నున్న అతనితో కలిసి చాలకాలము శృంగారక్రీడలతో రమించెను. (8)

చాల కాలము గడచిన తరువాత రాజు వివేకము కలవాడై చక్కనిదైన ఉర్వశితో, ''నా అందమైన పట్టణమునకు తిరిగి వెళ్లుదును'' అని యనగా ఆమె నవ్వుచు ఇట్లు పలికెను. (9)

ఓ అందమైన రాజకుమారా! నీతో అనుభవించిన ఈ సుఖభోగములతో నాకు తృప్తి కలుగలేదు. అందువలన నీవు ఇంకొక సంవత్సరము వరకు ఉండవలెను. (10)

తా మబ్రవీ త్స మతిమాన్‌ గ్తవా శీఘ్రతరం పురీమ్‌ | ఆగమిష్యామి భూయో7త్ర తన్మ్మే7ను జ్ఞాతుమర్హసి || || 11 ||

త మబ్రవీ త్సా సుభగా తథా కురు విశామ్పతే | నాన్యయా ప్సరసా తావ ద్రన్తవ్యం భవతా పునః || || 12 ||

ఓ మిత్యుక్త్వా య¸° తూర్ణం పురీం పరమశోభనామ్‌ | గత్వా పతివ్రతాం పత్నీం దృష్ట్వా భీతో7భవ న్నృపః || || 13 ||

సంప్రేక్ష్య సా గుణవతీ భార్యా తస్య పతివ్రతా | భీతం ప్రసన్నయా ప్రాహ వాచా పీనపయోధరా || || 14 ||

స్వామిన్‌ కిమత్ర భవతో భీతి రద్య ప్రవర్తతే | త ద్ర్బూహి మే యథాతత్త్వం న రాజ్ఞాం న రాజ్ఞాం కీర్తయే త్విదమ్‌ || || 15 ||

బుద్ధిమంతుడైన రాజు ఆమెతో ఇట్లు పలికెను. ''నేను పట్టణమునకు వెళ్ళి మరల శీఘ్రముగా నీవద్దకు రాగలను. అందువలన నీవు నాకు వెళ్లుటకనుమతించవలెను.'' (11)

ఆ ఉర్వశి అతని మాటవిని ఇట్లనెను. ''ఓరాజా అట్లే చేయుము. అంతవరకు నీవు మరియొక అప్సరసతో కలిసిరమించవలదు. (12) రాజు అట్లే అని పలికి మిక్కిలి మనోహరమైన తననగరమునకువెళ్లెను. వెళ్లి పతివత్రయగు భార్యను చూచి ఆరాజు భయపడెను. (13)

అతని భార్య పతివ్రత, గుణవంతురాలు. దృఢమైన స్తనములుకల ఆమె తనభర్తన భయపడినవానిగా చూచి, ప్రసన్నమైన వాక్కుతో ఇట్లనెను. (14)

స్వామీ! ఎందుకు మీకు ఇప్పుడు భయము కలుగుచున్నది? ఆకారణమును నాకు ఉన్నదున్నట్లుగా చెప్పుము. ఈ భయపరిస్థితి రాజులకు కీర్తిదాయకము కాదు. (15)

స తస్యా వాక్య మాకర్ణ్య లజ్జావనతమానసః | నోవాచ కించి న్నృపతి ర్ఞానదృష్ట్యా వివేద సా || || 16 ||

న భేతవ్యం త్వయా రాజన్‌ కార్యం పాపవిశోధనమ్‌ | భీతే త్వయి మహారాజ రాష్ట్రం తే నాశ మేష్యతి || || 17 ||

తతః స రాజా ద్యుతిమా న్నిర్గత్య తు పురా త్తతః | గత్వా కణ్వాశ్రమం పుణ్యం దృష్ట్వా తత్ర మహామునిమ్‌ || || 18 ||

నిశమ్య కణ్వవదనాత్‌ ప్రాయశ్చిత్త విధిం శుభమ్‌ | జగామ హిమవత్పృష్ఠం సముద్దిష్టం మహాబలః || || 19 ||

సో7ప శ్య త్పథి రాజేన్ద్రో గన్థర్వవర ముత్తమమ్‌ | భ్రాజమానం శ్రియా వ్యోమ్ని భూషితం దివ్యమాలయా || || 20 ||

ఆరాజు భార్యయొక్క మాటవిని, సిగ్గుతో క్రుంగిన మనస్సుకలవాడై ఏమియు బదులు పలుకకుండెను. ఆమె తనయొక్క జ్ఞానదృష్టితో విషయమును తెలిసికొనెను. (16)

మహారాజా! నీవు భయపడవలదు. పాపమునకు పరిహారము చేసికొనవలెను. నీవే భయపడినచో నీరాజ్యమంతయు వినాశముపొందగలదు. (17)

తరువాత ఆ రాజు తనపట్టణము నుండి బయలుదేరి కణ్వమహాముని ఆశ్రమమునకు వెళ్లి అక్కడ పుణ్యాత్ముడైన కణ్వమునిని చూచి (18)

కణ్వముని నోటినుండి పాపమునకు ప్రాయశ్చిత్త విధానమును విని, గొప్పబలవంతుడైన ఆరాజు ఆమునిచే సూచింపబడిన హిమాలయ పర్వతము పృష్ఠభాగమునకు వెళ్లెను. (19)

ఆ రాజు వెళ్లునప్పుడు దారిలో ఒక గంధర్వ శ్రేష్ఠుని చూచెను. అ తడు ఆకాశములో దివ్యమైన మాలతోఅలంకరించబడి గొప్పగా ప్రకాశించుచుండెను. (20)

వీక్ష్య మాలా మమిత్రఘ్నః సస్మారా ప్సరదసం వరామ్‌ | ఉర్వశీం తాం మన శ్చక్రే తస్యా ఏవేయ మర్హతి || || 21 ||

సో7తీవ కాముకో రాజా గన్ధర్వేణాధ తేన హి | చకార సుమహద్యుద్ధం మాలా మాదాతు ముద్యతః || || 22 ||

విజిత్య సమరే మాలాం గృహీత్వా దుర్జయో ద్విజాః | జగామ తా మప్సరసం కాలిన్దీం ద్రష్టు మాదరాత్‌ || || 23 ||

అదృష్ట్వా ప్సరసం తత్ర కామబాణాభిపీడితః | బభ్రామ సకలాం పృధ్వీ సప్తద్వీపసమన్వితామ్‌ || || 24 ||

ఆక్రమ్య హిమవత్వార్శ్వ ముర్వశీదర్శనోత్సుకః | జగామ శైలప్రవరం హేమకూట మితి శ్రుతమ్‌ || 25 ||

శత్రు సంహారకుడైన ఆ రాజు మాలను చూచి శ్రేష్ఠురాలైన ఉర్వశి అను అప్సరసను తలచుకొనెను. ఈ మాల ఆమెకే తగియుండునని అభిప్రాయపడెను. (21)

ఎక్కువకాముము కలవాడై ఆరాజు ఆమాలను గ్రహించుటకు పూనుకున్నవాడై, ఆగంధర్వునితో చాలగొప్పయుద్ధమును చేసెను. (22)

ఓ విప్రులారా! ఆదుర్జయరాజు యుద్ధములో గెలిచి గంధర్వుని నుండి మాలను స్వీకరించి, ఆ అప్సరసను చూచుటకు గాను ప్రేమతో యమునానదిని గూర్చివెళ్లెను. (23)

అక్కడ ఆ అప్సరసకన్పించక ఆ రాజు మన్మథుని బాణములచేత పీడింపబడినవాడై, ఆమెను చూచుటకు ఏడుద్వీపములతో కూడిన సమస్త భూమండలమును సంచరించెను. (24)

హిమాలయపర్వతము యొక్క ప్రక్కభాగమున ప్రవేశించి, ఉర్వశిని చూచుటకు కుతూహలము కలవాడై, హేమకూటమను పేరుతో ప్రసిద్ధమైన ఒక పర్వత శ్రేష్ఠమును చేరుకొనెను. (25)

తత్ర తత్రా ప్సరోవర్యా దృష్ట్వా తం సింహవిక్రమమ్‌ | కామం సన్దధిరే ఘోరం భూషితం చిత్రమాలయా || || 26 ||

సంస్మర న్నుర్వశీవాక్యం తస్యాం సంసక్తమానసః | న పశ్యతి స్మతాః సర్వా గిరేః శృఙ్గాణి జగ్మివాన్‌ || || 27 ||

తత్రాప్యప్సరసం దివ్యా మదృష్ట్వా కామపీడితః | దేవలోకం మహామేరుం య¸° దేవపరాక్రమః || || 28 ||

స తత్ర మానసం నామ సర సై#్త్రలోక్యవిశ్రుతమ్‌ | భేజే శృఙ్గ మతిక్రమ్య స్వబాహుబలభావితః || 29 ||

తస్య తీరేషు సుభగాం చరన్తీ మతిలాలసామ్‌ | దృష్టవా ననవద్యాఙ్గీం తసై#్య మాలాం దదౌ పునః || || 30 ||

ఆయా ప్రదేశాలలోని అప్సరసలు, సింహపరాక్రమముగల, చిత్రమైన మాలచేత అలంకరించబడిన రాజునుచూచి అతనియందు కామమును పొందిరి. (26)

ఆరాజు ఉర్వశి వాక్యమును తలచుచు, ఆమెయందులగ్నమైన మనస్సుకలవాడై ఆ అప్సరసలందరిని చూడకుండెను. తరువాత పర్వతశిఖరములను గూర్చివెళ్లెను. (27)

అక్కడ కూడా దివ్యాప్సరసయగు ఉర్వశిని చూడక, కామముచేత బాధింపబడినవాడై దేవతలతోసమాన పరాక్రమముగల రాజు దేవతలనివాస స్ధానమైన మహామేరు పర్వతమునకు వెళ్లెను. (28)

అతడక్కడ ముల్లోకములయందు మానసమనుపేరుతో ప్రసిద్ధమైన సరస్సును చేరుకొనెను. మేరుశిఖరమును దాటితనభుజబలముతో విశ్వాసముకలవాడై (29)

ఆ మానససరస్సు తట ప్రదేశములందు తిరుగుచున్న, మనోహరయైన, మిక్కిలి కోరికతో కూడియున్న, నిర్దుష్టమైన శరీరముకల ఉర్వశిని చూచెను. ఆమెకు మరల మాలనుఇచ్చెను. (30)

స మాలయా తదా దేవీం భూషితాం ప్రేక్ష్య మోహితః | రేమే కృతార్ధ మాత్మానం జానానః సుచిర న్తయా || || 31 ||

అథోర్వశీ రాజవ్యరం రతాన్తే వాక్య మబ్రవీత్‌ | కిం కృతం భవతా వీర పురీం గత్వా తదా నృప || || 32 ||

స తసై#్య సర్వ మాచష్ట పత్న్యా య త్సముదీరితమ్‌ | కణ్వస్వ దర్శనం చైవ మాలాపహరణం తథా || || 33 ||

శ్రుత్వైత ద్వ్యాహృతం తేన గచ్ఛేత్యాహ హితైషిణీ | శాపం దాస్యతి తే కణ్వో మమాపి భవతః ప్రియా || || 34 ||

తయా7 సకృ న్మహారాజః ప్రోక్తో7పి మదమోహితః | న చ తత్కృతవా న్వాక్యం తత్ర సంన్యస్తమానసః || || 35 ||

ఆ దుర్జయుడు మాలచేత అలకంకరింపబడిన ఊర్వశిని చూచి, మోహమును పొంది తనను ధన్యునిగా భావించినవాడై ఆమెతో చాలకాలము రమించెను. (31)

తరువాత ఊర్వశి రాజశ్రేష్ఠునితో ఒక వాక్యమును పలికెను. ''ఓవీరా! అప్పుడు నీవుపట్టణమునకు వెళ్లి ఏమి చేసితివి''? అని (32)

ఆరాజు ఊర్శశికి, తనభార్య పలికిన దంతయు చెప్పెను. కణ్వుని దర్శనమును, మాలనపహరించుటను కూడ ఆమెకుతెలిపెను. (33)

దుర్జయుడు పలికిన మాటవిని ఊర్వశి అతని హితమును గోరునదై వెళ్లుమని పలికెను. కణ్వుడు నీకు శాపమునీయగలడు. నీ ప్రియురాలుకూడ నన్ను శపించగలదు. కావున నీవు వెళ్లుము. (34)

ఆ మహారాజు ఆమెచేత చాలామార్లు చెప్పబడి కూడ, కామమదముచే మోహమను పొందినవాడై ఊర్వశియందే మనస్సు లగ్నము చేసినవాడై, ఆమె మాటను పాటించడాయెను.(35)

తదోర్వశీ కామరూపా రాజ్ఞే స్వం రూప ముత్కటమ్‌ | సురోమశం పిఙ్గలాక్షం దర్శయామాస సర్వదా || || 36 ||

తస్యాం విరక్తచేతస్కః స్మృత్వా కణ్వాభిభాషితమ్‌ | ధి ఙ్మామితి వినిశ్చిత్య తపః కర్తుః సమారభత్‌ || || 37 ||

సంవత్సరద్వాదశకం కన్దమూలఫలాశనః | భూయఏవ ద్వాదశకం వాయుభక్షో7భ వ న్నృపః || || 38 ||

గత్వా కణ్వాశ్రమం భీత్యా తసై#్మ సర్వం న్యవేదయత్‌ | వాస మప్సరసా భూయ స్తపోయోగ మనుత్తమమ్‌ || || 39 ||

వీక్ష్య తం రాజశార్దూలం ప్రసన్నో భగవా నృషిః | కర్తుకామో హి నిర్బీజం తస్యాఘ మిదమ బ్రవీత్‌ || || 40 ||

అప్పుడు స్వేచ్ఛారూపశక్తిగల ఊర్వశి, రాజునకు రోమములెక్కువగా కలిగి, పింగళవర్ణపుకన్నులు గల భయంకరమైన తనరూపుమను చూపించెను. (36)

అదిచూచి దుర్జయుడామె యందు విరక్తికలవాడై, కణ్వుని వచనమును తలచుకొని, 'ఛీ' అని తన్నునిందించుకొని తపస్సుచేయుటకు ప్రారంభించెను. (37)

పండ్రెండు సంవత్సరాల కాలము కందమూలములను, పండ్లనుతినుచు, మరొక పండ్రెండు వర్షములు వాయువును మాత్రము ఆహారముగా కలిగి ఆరాజుండెను. (38)

తరువాత కణ్వుని ఆశ్రమానికి వెళ్లి భయముతో ఆయనకంతయు తెలిపెను. అప్సరసతో కొంతకాలము కలిసి ఉండుట, తరువాత తపస్సు చేయుట అంతయు చెప్పెను. (39)

రాజశ్రేష్ఠుడైన ఆదుర్జయుని చూచి, పూజ్యుడైన కణ్వఋషి ప్రసన్నుడై, అతని పాపమును నిర్మూలన కావించదలచి ఇట్లు పలికెను. (40)

కణ్వ ఉవాచ:-

గచ్ఛ వారాణసీం దివ్యా మీశ్వరాధ్యుషితాం పురీమ్‌ | ఆస్తే మోచయితుం లోకం తత్ర దేవో మహేశ్వరః || || 41 ||

స్నాత్వా సన్తర్ప్య విధివ ద్గఙ్గాయాం దేవతాః పితౄన్‌ | దృష్ట్వా విశ్వేశ్వరం లిఙ్గం కిల్బిషా న్మోక్ష్యసే క్షణాత్‌ || || 42 ||

ప్రణమ్య శిరసా కణ్వ మనుజ్ఞాప్య చ దుర్జయః | వారాణస్యాం హరం దృష్ట్వా పాపా న్ముక్తో7భవ త్తతః || || 43 ||

జగామ స్వపురీం శుభ్రాం పాలయామాస మేదినీమ్‌ | యాజయామాస తం కణ్వో యాచితో ఘృణయా మునిః || || 44 ||

తస్య పుత్రో7థ మతిమా న్సుప్రతీక ఇతి స్మృతః | బభూవ జాతమాత్రం తం రాజాన ముపతస్థిరే || || 45 ||

ఉర్వశ్యా ఞ్చ మహావీర్యాః సప్త దేవసుతోపమాః | కన్యా జగృహిరే సర్వా గన్థర్వ్యో దయితా ద్విజాః || || 46 ||

కణ్వుడిట్లనెను :-

''ఈశ్వరునిచే నివాసముగా చేసికొనబడిన దివ్యమైన వారాణసి పట్టణమునకు వెళ్లుము. అక్కడ భగవంతుడైన మహేశ్వరుడు లోకమును సంసారబంధమునుండి విడిపించుటకు నిలిచియున్నాడు. (41)

గంగానదియందు స్నానముచేసి శాస్త్రవిధానము ప్రకారము దేవతలకు, పితరులకు సంతర్పణములిచ్చి, లింగరూపియైన విశ్వేశ్వరుని దర్శించుకొని క్షణకాలములో పాపమునుండి విముక్తుడవు కాగలవు''. (42)

అని చెప్పగావిని దుర్జయుడు కణ్వమునికి శిరస్సువంచి ప్రణామముచేసి ఆయనవద్ద సెలవును పొంది వారాణాసికి వెళ్లి శివుని దర్శించుకొని పాపములనుండి విముక్తుడాయెను. (43)

తరువాత నిర్మలమైన తనపట్టణమునకు వెళ్లి రాజ్యపాలనము చేసెను. పిమ్మట కణ్వుడాతని చేత ప్రార్థింపబడి దయతో యజ్ఞమునతని చేత చేయించెను. (44)

తరువాత అతనికి బుద్ధిమంతుడైన సుప్రతీకుడను కుమారుడు కలిగెను. అతడు పుట్టగానే రాజువద్దకు ఉర్వశియందు పుట్టిన, దేవకుమారునితో సమానులైన ఏడుగురు గొప్పపరాక్రమవంతులు చేరిరి. వారందరు గంధర్వకన్యలను తమ భార్యలుగా స్వీకరించిరి. (45, 46)

ఏష వః కథితః సమ్యక్‌ సహస్రజిత ఉత్తమః | వంశః పాపహరో నౄణాం క్రోష్టో రపి నిబోధత || || 47 ||

ఇతి శ్రీ కూర్మపురాణ రాజవంశానుకీర్తనే త్రయో వింశో7ధ్యాయః

ఇది యంతయు సహస్రజిత్తుయొక్క శ్రేష్ఠమైన వంశముయొక్క మనుష్యుల పాపములను నశింపజేయునది అగువృత్తాంతము మీకు చెప్పబడినది. ఇక క్రోష్టువు యొక్క వృత్తము చెప్పెదను వినుడు. (47)

శ్రీ కూర్మపురాణములో రాజవంశానుకీర్తనమునందు ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters