Sri Koorma Mahapuranam    Chapters   

పఞ్చవింశో7ధ్యాయః

అధయదువంశ కృష్ణకీర్తివర్ణనమ్‌

సూతఉవాచ:-

అథ దేవో హృషీకేశో భగవా న్పురుషోత్తమః | తతాప ఘోరం పుత్రార్థం నిధానం తపసస్తపః || || 1 ||

ఇరువది అయిదవ అధ్యాయము

యదువంశ కృష్ణకీర్తి వర్ణనము

తరువాత భగవంతుడు, విష్ణువుయొక్క అవతారము, ఇంద్రియములకధిపతి యగు కృష్ణుడు, తపస్సుకు తానేనిధి వంటి వాడైనను పుత్రలాభము కొరకు ఘోరమైన తపస్సును చేసెను. (1)

స్వేచ్ఛయా ప్యవతీర్ణో 7 సౌ కృతకృత్యో 7 పి విశ్వసృక్‌ | చచార స్వాత్మనో మూలం బోధయ న్పరమేశ్వరమ్‌ || || 2 ||

జగామ యోగిభి ర్జుష్టం నానాపక్షిసమాకులమ్‌ | ఆశ్రమం తూపమన్యోర్వై మునీన్ద్రస్య మహాత్మనః || || 3 ||

పతత్త్రిరాజ మారూఢః సుపర్ణ మతితేజసమ్‌ | శఙ్ఖచక్రగదాపాణిః శ్రీవత్సాఙ్కితలక్షణః || || 4 ||

నానాద్రుమలతాకీర్ణం నానాపుష్పోపశోభితమ్‌ | ఋషీణా మాశ్రమై ర్జుష్టం వేదఘోషనినాదితమ్‌ || || 5 ||

సింహర్‌క్షశరభాకీర్ణం శార్దూలగజసంయుతమ్‌| విమలస్వాదుపానీయైః సరోభిరుపశోభితమ్‌ || || 6 ||

తనఇచ్ఛాపూర్వకముగా భూమియందవతరించినవాడైనను, కృతార్థుడు, విశ్వమును సృజించువాడును అయినప్పటికి ఆ కృష్ణుడు పరమేశ్వరుడైన రుద్రుని తన యాత్మకు మూలమైనవానిగా తెలుపుచు తపస్సు చేసెను. (2)

ఆ కృష్ణుడు, యోగులచే నివసింపబడినది, వివిధపక్షి సమూహముతో కూడినది, మహాత్ముడైన ఉపమన్యువనుముని శ్రేష్ఠుని యొక్క ఆశ్రమమును గూర్చివెళ్లెను. (3)

అతడు మిక్కిలి తేజస్సుతో కూడిన పక్షిరాజైన గరుత్ముంతుని అధిరోహించి, శంఖము చక్రము గదలను చేతులయందు ధరించినవాడై, శ్రీ వత్సమను అంకముతో కూడియున్నవాడునై ఉండెను. (4)

అనేకములైన చెట్లతో, తీగలతో నిండియున్నది, వివిధములైన పుష్పములతో ప్రకాశించుచున్నది, ఋషులయొక్క ఆశ్రమాలతో కూడి యున్నది, వేదమంత్రోచ్చారణతో ప్రతిధ్వనించునది అగు ఆశ్రమానికి కృష్ణుడు వెళ్లెను. (5)

సింహములు, ఎలుగుబంట్ల, శరభములు అను మృగములతో కూడియున్నది, పెద్దపులులు, ఏనుగులతో కూడినది, నిర్మలములు రుచికరములైన జలములుగల కొలనులతో ఒప్పుచున్నదై ఆశ్రమప్రదేశముండెను. (6)

ఆరామై ర్వివిధై ర్జుష్టం దేవతాయతనైః శుభైః | ఋషిభి రృషిపుత్రై శ్చ మహామునిగణౖ స్తథా || || 7 ||

వేదాధ్యయనసమ్పన్నైః సేవితం చాగ్నిహోత్రిభిః | యోగిభి ర్ధ్వాననిరతై ర్నాసాగ్రన్యస్తలోచనైః || || 8 ||

ఉపేతం సర్వతః పుణ్యం జ్ఞానిభి స్తత్త్వదర్శిభిః | నదీభి రభితో జుష్టం జాపకై ర్ర్బహ్మవాదిభిః || || 9 ||

సేవితం తాపసైః పుణ్యౖ రీశారాధనతత్పరైః | ప్రశాన్తైః సత్యసంకల్పై ర్విశోకై ర్నిరుపద్రవైః || || 10 ||

భస్మావదాతసర్వాఙ్గైః రుద్రజాప్యపరాయణౖః | ముణ్డితై ర్జటిలైః శుద్ధై స్తథా న్యైశ్చ శిఖాజటైః || || 11 ||

అనేకవిధములైన తోటలతో, మంగళకరములైన దేవతామందిరాలతో కూడియున్నది; ఋషులు, వారికుమారులు, గొప్పమునుల సమూహములతో కూడియున్నది ఆ ఆశ్రమప్రదేశము. (7)

వేదముయొక్క అధ్యయనముతో పరిపూర్ణులైనవారు, నిత్యాగ్నిహోత్రులు, యోగులు, ధ్యానమందునిమగ్నులైనవారు, నాసికాగ్రభాగమున నిలిపిన చూపుకల వారితో కూడియున్నదా ఆశ్రమము. (8)

పరతత్త్వస్వరూపమును దర్శించిన జ్ఞానులైన వారితో కూడియున్నది, అంతట పుణ్యమయమైనది, చుట్టుపట్లనదులతో బ్రహ్మవాదులైన జపకర్తలతో సేవింపబడిన ఆశ్రమ స్థానము. (9)

ఈశ్వరుని ఆరాధించుటయందు శ్రద్ధకల పుణ్యాత్ముడైన మునులచేత సేవింపబడినది, మిక్కిలి శాంతప్రవృత్తి కలవారు, సత్యమైన సంకల్పము కలవారు, శోకరహితులు, ఉపద్రవరహితులు అగు మునులతో కూడినదాప్రదేశము. (10)

భస్మలేపనముతో తెల్లనైన సమస్తావయవములు కలవారు, రుద్రమంత్రజపమునందు ఆసక్తికలవారు, జడలనుధరించినవారు, కేశఖండనము చేయించుకున్నవారు, పరిశుద్ధులు, శిఖలను జడలను ధరించినవారును అగు మునులతో కూడిన ఆశ్రమమునకు కృష్ణుడు వెళ్లెను. (11)

సేవితం తాపసై ర్నిత్యం జ్ఞానిభి ర్ర్బహ్మవాదిభిః | తత్రా శ్రమవరే రమ్యే సిద్ధాశ్రమవిభూషితే || || 12 ||

గఙ్గా భగవతీ నిత్యం వహత్యే వాఘనాశినీ | స తత్ర వీక్ష్యవిశ్వాత్మా తాపసా న్వీతకల్మషాన్‌ || || 13 ||

ప్రణామే నాథ వచసా పూజయామాస మాధవః | తం తే దృష్ట్వా జగద్యోనిం శఙ్ఖచక్రగదాధరమ్‌ || || 14 ||

ప్రణము ర్భక్తిసంయుక్తా యోగినాం పరమం గురుమ్‌ | స్తువన్తి వైది కై ర్మన్త్రైః కృత్వా హృది సనాతనమ్‌ || || 15 ||

ప్రోచు రన్యోన్య మవ్యక్త మాదిదేవం మహామునిమ్‌ | అయం స భగవా నేకః సాక్షీ నారాయణః పరః || || 16 ||

ఆగచ్ఛ త్యధునా దేవః ప్రధానపురుషః స్వయమ్‌ | అయ మేవావ్యయః స్రష్టా సంహర్తా చైవ రక్షకః || || 17 ||

జ్ఞానవంతులు, వేదాంతబోధకులు అయిన మునులచేత ఎల్లప్పుడు సేవింపబడునది, సిద్ధుల ఆశ్రమములచేత అలంకరింపబడినదియు నగు మనోహరమైన ఆయాశ్రమమునందు; (12)

పాపములను నశింపజేయునట్టి గంగానది ఎల్లప్పుడు ప్రవహించుచుండును. విశ్వరూపుడైన ఆ కృష్ణుడు అక్కడ పాపములకు దూరులైన మునులను చూచి, (13)

నమస్కారముతో, వాక్కుతోగూడ వారిని గౌరవించెను. ఆమునులు, శంఖచక్రములను గదను ధరించువాడు, ప్రపంచమునకు మూలకారణమైనవాడును అగు అతనిని చూచి; (14)

యోగీశ్వరులకు గొప్పగురువైన అతనికి భక్తితో వందనము చేసిరి. సనాతనుడైన అతనిని తమహృదయాలలో నిలుపుకొని వైదిక మంత్రములతో స్తోత్రము చేయసాగిరి. (15)

వారు తమలోతాము కృష్ణునిగురించి ఆదిదేవుడని, అవ్యక్తరూపుడని, గొప్పమునీశ్వరుడని చెప్పుకొనిరి. ఇతడు సాక్షాత్తు అద్వితీయుడైన భగవంతుడని, సాక్షిభూతుడని, పరమపురుషుడైన నారాయణుడని కూడ ప్రశంసించిరి. (16)

ప్రధానపురుషుడైన భగవంతుడు ఇప్పుడు స్వయముగా ఇక్కడికి వచ్చియున్నాడు. ఇతడే నాశరహితుడు, సృష్టికర్త, రక్షించువాడు, లయకారకుడు కూడ అయియున్నాడు. (17)

అమూర్తో మూర్తిమాన్‌ భూత్వా మునీ న్ద్రష్టు మిహాగతః | ఏష ధాతా విధాతా చ సమాగచ్ఛతి సర్వగః || || 18 ||

అనాది రక్షయో 7 నన్తో మహాభూతో మహేశ్వరః | శ్రుత్వా బుద్ధ్వా హరి స్తేషాం వచాంసి వచనాతిగః || || 19 ||

య¸° స తూర్ణం గోవిన్దః స్థానం తస్య మహాత్మనః | ఉపస్పృశ్యాథ భావేన తీర్థేతీర్థే స యాదవః || || 20 ||

చకార దేవకీసూను ర్దేవర్షిపితృతర్పణమ్‌ | నదీనాం తీరసంస్థానే స్థాపితాని మునీశ్వరైః || || 21 ||

లిఙ్గాని పూజయామాస శమ్భో రమితతేజసః | దృష్ట్వా దృష్ట్వా సమాయాన్తం యత్ర యత్ర జనార్దనమ్‌ || || 22 ||

రూపరహితుడైన భగవంతుడు ఆకారమును ధరించి మునులను చూచుటకు ఇక్కడికి వచ్చినాడు. (18)

''ఈతడు మొదలులేనివాడు, నాశరహితుడు, అంతుములేనివాడు, మహాభూతస్వరూపుడు, మహేశ్వరుడుకూడ'' అని పలుకుచున్న ఆమునుల మాటలనువిని, వాక్కులు కగోచరుడైన మరిరూపుడగు కృష్ణుడు తన కర్తవ్యమును తలచి; (19)

శీఘ్రముగా మహాత్ముడైన ఆమునియొక్క ఆశ్రమమునకు బయలుదేరెను. దారిలో ప్రతి తీర్థస్థలములో మనః పూర్వకముగా ఆచమన పూర్వకముగా జలమును త్రాగి కృష్ణుడు ముందుకు సాగెను. (20)

దేవకీపుత్రుడైన కృష్ణుడు దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములు విడిచెను. ఆయానదులయొక్క తీర ప్రదేశముల యందు మునీశ్వరులచేత పూర్వము స్థాపించబడినటువంటి; (21)

అధిక తేజస్సుగల శివునియొక్క లింగములను పూజించెను. తమదగ్గరకు వచ్చుచున్న శ్రీకృష్ణుని ఆయాస్థలములలో చూచి, చూచి; (22)

పూజయాఞ్చక్రిరే పుషై#్ప రక్షతై స్తన్నివాసినః | సమీక్ష్య వాసుదేవం తం శార్‌ఙ్గ శంఖాసిధారిణమ్‌ || || 23 ||

తస్థిరే నిశ్చలాః సర్వే శుభాఙ్గాయతమానసాః | యాని తత్రా రురుక్షూణాం మనాసాని జనార్దనమ్‌ || || 24 ||

దృష్ట్వా సమాహితా న్యాస న్నిష్క్రామన్తి పురా హరిమ్‌ | అథా వగాహ్య గఙ్గాయాం కృత్వా దేవర్షితర్పణమ్‌ || || 25 ||

ఆదాయ పుష్పవర్యాణి మునీన్ద్రస్యా విశ ద్గృహమ్‌ | దృష్ట్వా తం యోగినాం శ్రేష్ఠం భస్మోద్థూలితవిగ్రహమ్‌ || || 26 ||

జటాచీరధరం శాన్తం ననామ శిరసా మునిమ్‌ | ఆలోక్య కృష్ణ మాయాన్తం పూజయామాస తత్త్వవిత్‌ || || 27 ||

ఆ ప్రాంతాలలో నివసించు జనులు, పూవులతో, అక్షతలతో పూజించిరి. శార్‌ఙ్గమను ధనుస్సును, శంఖమును, ఖడ్గమును ధరించిన ఆవాసుదేవుడగు కృష్ణుని చూచి; (23)

అందరు మంగళశరీరుడైన అతనియందు లగ్నమైనమనస్సు కలవారై చలనము లేనివారై నిలచిపోయిరి. ఉన్నతస్థానమును పొందగోరు వారి మనస్సులు ఆ శ్రీకృష్ణుని. (24) చూచి సమాధానమును పొందినవయ్యెను. పూర్వము హరినుండి విముఖముగా నున్న మనస్సులు ఇప్పుడు అభిముఖములాయెను. తరువాత గంగానదియందు స్నానముచేసి, దేవతలకు, ఋషుకు తర్పణములిచ్చి, (25) శ్రేష్ఠములైన పూవులను తీసుకొని మునీంద్రుని గృహమును ప్రవేశించెను. యోగులలో శ్రేష్ఠుని, భస్మముతో పూయబడిన శరీరముకల వానిని, జడలను, నారబట్టలను ధరించిన వానిని, శాంతుని ఆమునినిగూర్చి నమస్కరించెను. తత్త్వవేత్తయగు నతడు తన దగ్గరకు వచ్చుచున్న కృష్ణుని చూచి పూజించెను. (26)

ఆసనే వాసయామాస యోగినాం ప్రథమాతిథిమ్‌ | ఉవాచ వచసాం యోనిం జానీమః పరమం పదమ్‌ || || 28 ||

విష్ణు మవ్యక్తసంస్థానం శిష్యభావేన సంస్థితమ్‌ | స్వాగతం తే హృషీకేశ సఫలాని తపాంసి నః || || 29 ||

య త్సాక్షాదేవ విశ్మాత్మా మద్గేహం విష్ణు రాగతః | త్వాం న పశ్యన్తి మునయో యతన్తో 7 పీహ యోగినః || || 30 ||

తాదృశస్యా త్రభవతః కి మాగమానకారణమ్‌ | శ్రుత్వో పమన్యో స్తద్వాక్యం భగవా న్దేవకీసుతం || || 31 ||

వ్యాజహార మహాయోగీ ప్రసన్నం ప్రణిపత్య తమ్‌ | || 32 ||

కృష్ణ ఉవాచ :-

భగవ న్ద్రష్టు మిచ్ఛామి గిరీశం కృత్తివాససమ్‌ ||

యోగులకు మొదటి అతిథియగు కృష్ణుని ఆసనముందు కూర్చొన నియోగించెను. ''వాక్కులకు కారణభూతుడవు, సర్వోత్తమమైన స్థానభూతుడువుగా తెలిసికొనుచున్నాము'' అని పలికెను. (28)

ఇంద్రియములకు గోచరముకాని స్వరూపము కల విష్ణుడవని, శిష్యభావముతో ఇప్పుడు నిలిచియున్నావని గుర్తించినాము. ఇంద్రియముల కధీశ్వరుడైన స్వామీ! నీకు స్వాగతము. మాతపస్సులు సఫలములైనవి. (29)

జగద్రూపుడైన విష్ణువే స్వయముగా మా యింటికి వచ్చినాడు. ఎంత ప్రయత్నించినప్పటికి యోగీశ్వరులు, మునులు కూడ నిన్ను చూడ జాలకపోవుచున్నారు. (30)

అటువంటి మహాపురుషుడవగు నీకు ఇక్కడికి వచ్చుటలో కారణమేమిటి? అని పలికిన ఉపమన్యుముని యొక్క వాక్యమును విని భగవంతుడు, దేవకీకుమారుడైన శ్రీకృష్ణుడు; (31)

గొప్పయోగీశ్వరుడగునతడు నిర్మలుడైన ఆ మునికి నమస్కరించి ఇట్లనెను. ''మహాత్మా! నేను చర్మధారి, గిరీశుడు అగుశివుని దర్శింప గోరుచున్నాను. (32)

సంప్రాప్తో భవతః స్థానం భగవద్దర్శనోత్సుకః | కథం స భగవా నీశో దృశ్యో యోగవిదాం వరః || || 33 ||

మయా చిరేణ కుత్రాహం ద్రక్ష్యామి త ముమాపతిమ్‌ | ప్రత్యాహ భగవా నుక్తో దృశ్యతే పరమేశ్వరః || || 34 ||

భ##క్త్యై వోగ్రేణ తపసా తత్కురుష్వేహ సంయతః | ఇహే శ్వరం దేవదేవం మునీన్ద్రా బ్రహ్మవాదినః || || 35 ||

ధ్యాయ న్త్యారాథయ న్త్యేనం యోగిన స్తాపసాశ్చ యే | ఇహ దేవః సపత్నీకో భగవాన్‌ వృషభధ్వజః || || 36 ||

క్రీడతే వివిధై ర్భూతై ర్యోగిభిః పరివారితః | ఇహాశ్రమే పురా రుద్రం తపస్తప్త్వా సుదారుణమ్‌ || || 37 ||

భగవంతుని చూచుటయందు కుతూహలము కలవాడనై నీ వద్దకువచ్చినాను. యోగవేత్తలలో శ్రేష్ఠుడగు, భగవంతుడు శివుడు ఏ విధముగా చూచదగినవాడు? (33)

అచిరకాలములో ఆ ఉమాపతిని నేను ఎక్కడ చూడగలను? పూజ్యుడగు ముని బదులు పలికెను. పరమేశ్వరుడు భక్తిచేతనే కాని, తీవ్రమైన తపస్సుచేతగాని చూడబడును. అందువలన నీవు నియమవంతుడవై ఇక్కడ తపస్సుచేయుము. ఇక్కడ బ్రహ్మవాదులగు మునిశ్రేష్ఠులు దేవదేవుడగు ఈశ్వరుని (34, 35) ధ్యానింతురు, ఆరాధింతురు కూడ.యోగులు, మునులు కూడ ఆయన నర్చింతురు. వృషభధ్వజుడైన శివుడు ఇక్కడ భార్య యగు పార్వతితో కూడ, యోగులచేత పరివేష్టింపబడి భూతగణముతో క్రీడించుచుండును. ఈ ఆశ్రమమందు పూర్వము రుద్రునిగూర్చి మిక్కిలి తీవ్రమైన తపస్సును చేసి (37)

లేభే మహేశ్వరా ద్యోగం వసిష్ఠో భగవా నృషిః | ఇహైవ భగవా న్వ్యాసః కృష్ణద్వైపాయనః స్వయమ్‌ | || 38 ||

దృష్ట్వా తం పరమేశానం లబ్ధవాన్‌ జ్ఞాన మైశ్వరమ్‌ | ఇహా శ్రమపదే రమ్యే తపస్తప్త్వా కపర్దినః || || 39 ||

అవిన్ద న్పుత్రకా న్రుద్రా త్సూరయో భక్తిసంయుతాః | ఇహ దేవా మహాదేవీం భవానీఞ్చ మహేశ్వరీమ్‌ || || 40 ||

సంస్తువన్తో మహాదేవం నిర్భయా నిర్వృతిం యయుః | ఇహా రాధ్య మహాదేవం సావర్ణి స్తపతాం వరః || || 41 ||

లబ్ధవా న్పరమం యోగం గ్రన్థకారత్వ ముత్తమమ్‌ | ప్రవర్తయామాస స తాం కృత్వా వై సంహితాం శుభామ్‌ || || 42 ||

(ఇహైవ సంహితాం దృష్ట్వా కాపేయః శాంశపాయనః | మహాదేవం చకారే మాం పౌరాణీం తన్నియోగతః || || 43 ||

ద్వాదశైవ సహస్రాణి శ్లోకానాం పురుషోత్తమ | ఇహ ప్రవర్తితా పుణ్యా ద్వ్యష్టసాహస్రికోత్తరా ||

వాయవీయోత్తరం నామ పురాణం వేదసమ్మతమ్‌ ||)

ద్విజైః పౌరాణికం పుణ్యం ప్రసాదేన ద్విజోత్తమైః | ఇహైవ ఖ్యాపితం శిషై#్యః శాంశపాయనభాషితమ్‌ || || 43 ||

యాజ్ఞవల్క్యో మహాయోగీ దృష్ట్వా త్ర తపసా హరమ్‌ | చకార తన్నియోగేన యోగశాస్త్ర మనుత్తమమ్‌ || || 44 ||

ఇహైవ భృగుణా పూర్వం తప్త్వా పూర్వం మహాతపః | శుక్రో మహేశ్వరాత్పుత్రో లబ్థో యోగవిదాం వరః || || 45 ||

మహాత్ముడగు వసిష్ఠఋషి మహేశ్వరునివలన యోగవిద్యను పొందెను. ఇక్కడనే కృష్ణద్వైపాయనుడగు భగవంతుడు వ్యాసుడు స్వయముగా ఆ పరమేశ్వరుని దర్శించుకొని ఈశ్వర సంబంధి జ్ఞానమును పొందినాడు. శివునియొక్క మనోహరమైన ఈ యాశ్రమ స్థానంలో తపస్సుచేసి (39) భక్తితో కూడిన పండితులు రుద్రునివలన పుత్రులను పొందిరి. ఇక్కడ దేవతలు, మహాదేవి, మహేశ్వరి అగు పార్వతీదేవిని (40) స్తోత్రముచేయుచున్నవారై, మహదేవుని కూడ భజించి భయములేనివారై నిత్యానందమును పొందిరి. తపస్వులలో శ్రేష్ఠుడైన సావర్ణి ఇచ్చట మహాదేవుని పూజించి (41) ఉత్తమమైన యోగసిద్ధిని పొందెను. శ్రేష్ఠమైన గ్రంథకర్తృత్వమును గూడ లభించెను. ఆ సావర్ణి తాను రచించిన మంగళప్రదమైన సంహితను లోకమునందు ప్రవర్తింపజేసెను. (42) పురుషోత్తమా! ఈ ప్రదేశంలోనే కాపేయుడైన శాంశపాయనుడు మహాదేవుణ్ణి దర్శించి అతని ఆజ్ఞనుపొంది పన్నెండువేల శ్లోకాలు గలిగిన ఈ పురాణ సంహితను విరచించినాడు. వేదసమ్మితమైనది, పుణ్యమును కలిగించునది అయిన వాయవీయపురాణ సంహితయొక్క పదహారు వేల శ్లోకాలుగల ఉత్తరభాగము ఇక్కడే ప్రవర్తితమైనది. ఇక్కడనే విప్రులు, విప్రోత్తములు శాంశపాయనునిచేత చెప్పబడినది, పుణ్యమును కలిగించునది అయిన పురాణమును అతని అనుగ్రహముచే విస్తరించిరి. (43) మహాయోగి అయిన యాజ్ఞవల్క్యుడు ఇక్కడే తపస్సుచేసి పరమశివుని దర్శించి అతని ఆజ్ఞచేత అత్యుత్తమమైన యోగశాస్త్రమును రచించెను. (44) పూర్వము భృగుమహర్షి కూడా ఇక్కడే గొప్ప తపస్సుచేసి పరమశివుని అనుగ్రహముచేత యోగవేత్తలలో శ్రేష్ఠుడైన పుత్రుడిని పొందెను. (45)

తస్మా దిహైవ దేవేశ తప స్తప్త్వా సుదు శ్చరమ్‌ | ద్రష్టు మర్హసి విశ్వేశ ముగ్రం భీమం కపర్దినమ్‌ || || 46 ||

ఏవ ముక్త్వా దదౌ జ్ఞాన ముపమన్యు ర్మహామునిః | వ్రతం పాశుపతం యోగం కృష్ణాయా క్లిష్టకర్మణ || || 47 ||

స తేన మునివర్యేణ వ్యాహృతో మధుసూదనః | తత్రైవ తపసా దేవం రుద్ర మారాధాయ త్ర్పభుః || || 48 ||

భస్మోద్ధూలితసర్వాఙ్గో ముణ్డో వల్కలసంయుతః | జజాప రుద్ర మనిశం శివైకాహితమానసః || || 49 ||

తతో బహుతిథే కాలే సోమః సోమార్థభూషణః | అదృశ్యత మహాదేవో వ్యోమ్ని దేవ్యా మహేశ్వరః || || 50 ||

అందువలన దేవా! నీవు ఇక్కడనే మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు నాచరించి, ఉగ్రుడు, భయంకరుడు, కపర్దము కలవాడగు నీశ్వరుని చూచుటకు తగియున్నావు. (46)

ఇట్లు పలికి గొప్పమునియగు ఉపమన్యువు అద్భుతకర్మలు కలిగిన కృష్ణునకు జ్ఞానమును, నియమమును, పాశుపతయోగమును ఇచ్చెను. (47)

మధువును చంపిన ఆనారాయణుడు ఆ మునిశ్రేష్ఠునిచేత చెప్పబడినవాడై సమర్థుడగునాతడు అక్కడనే తపస్సుచేత రుద్రుని ఆరాధించెను. (48)

భస్మలేపనము చేయబడిన అన్ని అవయవములు కలవాడు, కేశఖండనము చేయించుకొని, నారబట్టలు ధరించినవాడై, శివునియందే లగ్నము చేయబడిన మనస్సుకలవాడై నిరంతరముగా శివుని గూర్చి జపించెను. (49)

తరువాత చాలా కాలము గడువగా, చంద్రకళను అలంకారముగా ధరించిన శివుడు ఆకాశమార్గమున దేవితో కూడ కృష్ణునకు సాక్షాత్కరించెను. (50)

కిరీటనం గదినం చిత్రమాలం పినాకినం శూలినం దేవదేవమ్‌| శార్దూలచర్మమ్బరసంవృతాఙ్గం దేవ్యా మహాదేవ మసౌ దదర్శ || || 52 ||

ప్రభుం పురాణం పురుషం పురస్తా త్సనాతనం యోగిన మీశితారమ్‌ | అణో రణీయాంస మనన్తశక్తిం ప్రాణశ్వరం శమ్భు మసౌ దదర్శ || || 52 ||

పరశ్వధాసక్తకరం త్రినేత్రం నృసింహచర్మావృతభస్మగాత్రమ్‌ | సముద్గిరన్తం ప్రణవం బృహన్తం సహస్రసూర్యప్రతిమం దదర్శ || || 53 ||

న యస్య దే వా న పితామహో 7 పి నేన్ద్రో న చాగ్నిర్వరుణో న మృత్యుః | ప్రభావ మద్యాపి వదన్తి రుద్రం త మాదిదేవం పురతోదదర్శ || || 54 ||

కిరీటము కలవాడు, గదను ధరించినవాడు, చిత్రమైన మాలకలవాడు, పినాకమనుధనుస్సును ధరించినవాడు, శూలము కలవాడు, దేవతలకుదేవుడు, పులిచర్మమనెడు వస్త్రముతో కప్పడిన శరీరముకలవాడు అగు మహాదేవుని దేవితో కూడ కృష్ణుడు దర్శించెను. (51)

ప్రభువు, పురాణపురుషుడు, సనాతనుడు, యోగి, ఈశ్వరుడు, అణువుకంటె చిన్ననైనవాడు, అనంతమైన శక్తికలవాడు, ప్రాణములకు ప్రభువు అగుశంభుని అతడు దర్శించెను. (52)

గండ్రగొడ్డలి చేతియందుధరించినవాడు, మూడు కన్నులు కలవాడు, నరసింహచర్మముచేత కప్పబడిన భస్మ శరీరము కలవాడు, ఓంకార నాదము చేయువాడు, వేయి సూర్యులతో సమాన తేజము కలవాడు, బృహద్రూపుడును అగు ఆదేవుని చూచెను. (53)

ఎవని ప్రభావమును బ్రహ్మదేవుడు కాని, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, మృత్యువు కాని ఇప్పటికిని చెప్పజాలరో, అటువంటి ఆదిదేవుడగు రుద్రుని తన యెదురుగా చూచెను. (54)

తదా న్వపశ్య ద్గిరిశస్య వామే స్వాత్మాన మవ్యక్త మనన్తరూపమ్‌ | స్తువన్త మీశం బహుభి ర్వచోభిః శఙ్ఖాసిచక్రాన్వితహస్త మాద్యమ్‌ || || 55 ||

కృతాఞ్జలిం దక్షిణతః సురేశం హంసాధిరూఢం పురుషం దదర్శ | స్తువాన మీశస్యపరం ప్రభావం పితామహం లోకగురుం దివిస్థమ్‌ || || 56 ||

గణశ్వరా నర్కసహస్రకల్పా న్నన్దీశ్వరాదీ నమితప్రభావాన్‌ | త్రిలోకభర్తుః పురతో 7న్వపశ్య త్కుమార మగ్నిప్రతిమం గణశమ్‌ || || 57 ||

మరీచి మత్రిం పులహం పులస్త్యం ప్రచేతసం దక్ష మథాపి కణ్వమ్‌ | పరాశరం తత్పరతో వసిష్ఠం స్వాయమ్భువం చాపి మనుం దదర్శ || || 58 ||

అప్పుడా కృష్ణుడు శివుని వామభాగములో, అవ్యక్తరూపుడు, అనంతరూపుమలు కలవాడు, ఈశ్వరుని స్తోత్రము చేయుచున్నవాడు, శంఖ చక్రములు ఖడ్గము చేతులయందు కలవాడు, ఆద్యుడు అగు తన రూపమును చూచెను. (55)

దక్షిణాభాగములో అంజలిపట్టి నిలచిన దేవేంద్రుని చూచెను. హంసనధిష్ఠించిన, ఈశ్వరుని గొప్ప ప్రభావమును పొగడుచున్న, లోకగురువైన పితామహుని ఆకాశమందు చూచెను. (56)

వేలకొలది సూర్యులతో సమానులైన గణశ్వరులను, నందీశ్వరుడు మొదలగు అమిత ప్రభావము కలవారిని, కుమారస్వామిని, అగ్నితో సమానుడైన గణశ్వరుని త్రిలోకభర్తయగు శివుని ముందు భాగమున చూచెను. (57)

మరీచిని, అత్రిని, పులహుని, పులస్త్యుని, ప్రచేతసుని, దక్షుని, కణ్వుని, పరాశరుని, వసిష్ఠుని, స్వాయంభువ మనువును కూడ అక్కడ క్రమముగా చూచెను. (58)

తుష్టాన మన్త్రై రమరప్రధానం బద్ధాఞ్జలి ర్విష్ణు రుదారబుద్ధిః | ప్రణమ్య దేవ్యా గిరిశం స్వభక్త్యా స్వాత్మ న్యథాత్మాన మసౌ విచిన్త్య || || 59 ||

కృష్ణఉవాచ :-

నమోస్తు తే శాశ్వత సర్వయోగ బ్రహ్మాదయస్త్వా మృషయో వదన్తి | తమశ్చ సత్త్వఞ్చ రజ స్త్రయంచ త్వామేవ సర్వం ప్రవదన్తి సన్తః || || 60 ||

త్వం బ్రహ్మా హరి రథ రుద్ర విశ్వకర్తా సంహర్తా దినకరమణ్డలాధికవాస |

ప్రాణ స్త్వం హుతవహవాసవాదిభేద స్త్వా మేకం శరణముపైమి దేవ మేకమ్‌ || || 61 ||

సాజ్ఖ్యా స్త్వా మగుణ మథాహురేకరూపం యోగస్థం సతత ముపాసతే హృదిస్థమ్‌ |

వేదా స్త్వా మభిదధతీహ రుద్ర మీఢ్యం త్వామేకం శరణ ముపైమి దేవ మీశమ్‌ || || 62 ||

అప్పుడు గొప్పబుద్ధి కలిగిన విష్ణువు అంజలి పట్టినవాడై దేవితోగూడ శివునకు భక్తితో నమస్కరించి, ఆత్మయందు ఆత్మ తత్త్వమును విచారించి, దేవతలలో ప్రధానుడైన ఈశ్వరుని మంత్రములతో స్తుతించెను. (59)

కృష్ణుడు పలికెను :-

శాశ్వతుడా! సమస్తయోగస్వరూపా! బ్రహ్మాదులు, ఋషులు నిన్నుగూర్చి సత్త్వరజస్తమోగుణాత్మకుడని, నీవే సమస్తవిశ్వమని చెప్పుదురు నీకు నమస్కారము. (60)

రుద్రా! నీవు బ్రహ్మవు, విష్ణుడవు, సృష్టికర్తవు, సంహరించువాడవు. సూర్యమండలము నధిష్ఠించినవాడవు. నీవు ప్రాణస్వరూపుడవు, అగ్నీంద్రాది భేదములతో కన్పించు అద్వితీయుడవైన నిన్ను శరణము పొందుచున్నాను. (61)

సాంఖ్యులు నిన్ను గుణరహితుడని, ఏకాకారుడవని, యోగస్థుడవని ఎల్లప్పుడు మనస్సులో ధ్యానింతురు. వేదమలు నిన్ను రుద్రుడని, నుతించదగిన వాడవని చెప్పుచున్నవి. అటువంటి దేవుడవు, ఈశుడవైన నిన్ను శరణు పొందుచున్నాను. (62)

త్వత్పాదే కుసుమ మథాపి పత్ర మేకం దత్వాసౌ భవతి విముక్తవిశ్వబన్ధః |

సర్వాద్యం ప్రణుదతి సిద్ధయోగిజుష్టం స్మృత్వా తే పదయుగలం భవత్ర్పసాదాత్‌ || || 63 ||

యస్యా శేషవిభాగహీన మమలం హృద్యన్తరావస్థితం | తే త్వాం యోని మనన్త మేకమచలం సత్యం పరం సర్వగమ్‌ |

స్థానం ప్రాహు రనాదిమధ్యనిధనం యస్మా దిదం జాయతే | నిత్యం త్వాహము పైమి సత్యవిభవం విశ్వేశ్వరం తం శివమ్‌ || || 64 ||

ఓం నమో నీలకణ్ఠాయ త్రినేత్రాయ చ రంహసే | మహాదేవాయ తే నిత్య మీశానాయ నమోనమః || || 65 ||

నమః పినాకినే తుభ్యం నమో ముణ్డాయ దణ్డినే | నమస్తే వజ్రహస్తాయ దిగ్వస్త్రాయ కపర్దినే || || 66 ||

నీపాదమునందు ఒక్కపుష్పముకాని, ఆకునుకాని అర్పించినవాడు సంసారబంధమునుండి విముక్తుడగును. సిద్ధులచే, యోగులచేత సేవింపబడు నీపాదములజంటను స్మరించి నీయనుగ్రహమువలన సర్వపాపములను తొలగించుకొనుము. (63)

బహువిభాగములులేనిది, నిర్మలమైనది, హృదయాంతరాళములో నుండునది, అంతములేనిది, అద్వితీయము, నిశ్చలము, సత్యస్వరూపము, అంతట వ్యాపించినది, శ్రేష్ఠమైనది, కారణభూతమైనది, ఆదిమధ్యాంతరహితమైనది అగు నీస్థానమును గూర్చి చెప్పుదురు. దేనివలన ఇదియంతయు జనించునో అది నీపదము. సత్యవిభవము కల, విశ్వేశ్వరుడగు శివుని నిన్ను నేను ఎల్లప్పుడు సేవింతును. (64)

నీల కంఠుడు, త్రినేత్రుడు, వేగముకలవాడు, మహాదేవుడు, ఈశానుడును అగు నీకు నమోవాకములు. (65)

పినాకధారియైన నీకునమస్కారము. దండముధరించిన సన్యాసివగునీకు వందనము. వజ్రము చేతియందుకల, దిగంబరుడు, కపర్దముకల వాడగు నీకు ప్రణామము. (66)

నమో భైరవనాదాయ కాలరూపాయ దంష్ట్రిణ | నాగయజ్ఞోపవీతాయ నమస్తే వహ్నిరేతసే || || 67 ||

నమో 7 స్తు తే గిరీశాయ స్వాహాకారాయ తే నమః | నమో ముక్తాట్టహాసాయ భీమాయ చ నమోనమః || || 68 ||

నమస్తే కామనాశాయ నమః కాలప్రమాధినే| నమో భైరవవేషాయ హరాయచ నిషఙ్గిణ || || 69 ||

నమో 7 స్తు తే త్ర్యమ్బకాయ నమస్తే కృత్తివాససే | నమో 7 మ్బికాధిపతయే పశూనాం పతయే నమః || || 70 ||

నమస్తే వ్యోమరూపాయ వ్యోమాధిపతయే నమః | నరనారీశరీరాయ సాంఖ్యయోగప్రవర్తినే || || 71 ||

భయంకరమైన నాదము కలిగిన, కాలరూపుడైన, దంష్ట్రలు కలిగియున్న, సర్పములు యజ్ఞోపవీతములుగా ధరించిన, అగ్నిరేతస్సుగా కలిగిన వాడవగు నీకు ప్రణామము. (67)

గిరీశుడవు, స్వాహాకార రూపుడవు అగునీకు నమస్కారము. అట్టహాసము కలిగిన, భీమరూపుడవగు నీకు వందనము. (68)

మన్మథ సంహారివి, యముని నిర్జించినవాడవు, భయంకర వేషముకలవాడవు, ధనుర్ధారివగు హరునకు నీకు నమోవాకము. (69)

మూడుకన్నులు కల నీకు వందనము. చర్మమును వస్త్రముగా ధరించిన నీకు ప్రణామము. పార్వతీపతిని, పశుపతివి అగు నీకు నమస్సులు. (70)

ఆకాశస్వరూపుడవైన నీకు నమస్కారము. ఆకాశమునకధిపతివైన నీకు వందనము. స్త్రీ పురుష శరీరభాగములు కలవాడవు, సాంఖ్య యోగమును ప్రవర్తింప జేసినవాడవగు నీకు నమస్కారము. (71)

నమో భైరవనాధాయ దేవానుగతలిఙ్గినే | కుమారగురవే తుభ్యం దేవదేవాయ తే నమః || || 72 ||

నమో యజ్ఞాధిపతయే నమస్తే బ్రహ్మచారిణ | మృగవ్యాధాయ మహతే బ్రహ్మాధిపతయేనమః || || 73 ||

నమో హంసాయ విశ్వాయ మోహనాయ నమోనమః | యోగినే యోగగమ్యాయ యోగమాయాయ తే నమః || || 74 ||

నమస్తే ప్రాణపాలాయ ఘణ్టానాదప్రియాయ చ | కపాలినే నమ స్తుభ్యం జ్యోతిషాం పతయే నమః || || 75 ||

నమోనమో 7 స్తు తే తుభ్యం భూయ ఏవ నమోనమః | మహ్యం సర్వాత్మనా కామాన్‌ ప్రయచ్ఛ పరమేశ్వర || || 76 ||

భైరవగణమునకధిపతివి, దేవతలచే పూజింపబడు లింగరూపివి, కుమారస్వామికి తండ్రివి దేవతలకు దేవుడవగు నీకు నమోవాకములు. (72)

యజ్ఞముల కధిపతివి, బ్రహ్మచర్యము కలవాడవు, మృగములను వేటాడు కిరాతరూపధారివి, బ్రహ్మమున కధిపతి అగు గొప్పవాడవగు నీకు ప్రణామము. (73)

హంస రూపుడవు, విశ్వాత్మకుడవు, మోహింపజేయు వాడవగునీకు నమస్సులు. యోగివి, యోగముచే తెలియదగినవాడవు, యోగ మాయా స్వరూపుడవు నగు నీకు వందనము. (74)

ప్రాణరక్షకుడవు, ఘంటానాదమునందు ప్రీతికలవాడవు, కపాలధారివి, జ్యోతిస్సులకు ప్రభువైన నీకు వందనము. (75)

ఓ దేవా! నీకు మరలమరల నమస్కారము లందించుచున్నాను. పరమేశ్వరా! నాకు అన్నివిధముల అభీష్టములను అనుగ్రహించుము. (76)

సూత ఉవాచ :-

ఏవం హి భక్త్వా దేవేశ మభిష్టూయ స మాధవః | పపాత పాదయో ర్విప్రా దేవదేవ్యోః సదణ్డవత్‌ || || 77 ||

ఉత్థాప్య భగవాన్‌ సోమః కృష్ణం కేశినిషూదనమ్‌ | బభాషే మధురం వాక్యం మేఘగమ్భీరనిఃస్వనః || || 78 ||

కిమర్థం పుణ్డరీకాక్ష తప్యతే భవతా తపః | త్వమేవ దాతా సర్వేషాం కామానాం కర్మణా మిహ || || 79 ||

త్వం హి సా పరమా మూర్తి ర్మమ నారాయణాహ్వయా | న వినా త్వాం జగ త్సర్వం విద్యతే పురుషోత్తమ || || 80 ||

వేత్థ నారాయణానన్త మాత్మానం పరమేశ్వరమ్‌ | మహాదేవం మహాయోగం స్వేన యోగేన కేశవ || || 81 ||

శ్రుత్వా తద్వచనం కృష్ణః ప్రహసన్వై వృషధ్వజమ్‌ | ఉవాచా న్వీక్ష్య విశ్వేశం దేవీం చ హిమశైలజామ్‌ || || 82 ||

సూతుడిట్లు చెప్పెను :-

విప్రులారా! ఆ మాధవుడు ఈ విధముగా భక్తితో దేవేశుని కొనియాడి పార్వతీపరమేశ్వరుల పాదములయందు దండవత్ర్పణామ మాచరించెను. (77)

కేశిరాక్షసుని సంహరించిన కృష్ణుని పైకిలేపి భగవంతుడగు శంకరుడు మేఘము వంటి గంభీర స్వరము కలవాడై, తీయని మాటలనిట్లు పలికెను. (78)

ఓ కృష్ణా! నీచేత ఎందుకొరకు తపము చేయబడుచున్నది? నీవు స్వయముగా అందరి కోర్కెలను, కర్మఫలములను ఇచ్చువాడవుకదా! (79)

నీవు నారాయణ నామముకల నాయొక్కశ్రేష్ఠమైన మూర్తి భేదము. ఓ పురుషోత్తమా! నీవు లేకుండా ఈ ప్రపంచము నిలువదు. (80)

కేశవా! నిన్ను అనంతుడుగా, పరమేశ్వరునిగా తెలిసికొనుము. నీ యోగముచేత మహాదేవునిగా, మహాయోగిగా గుర్తించుము. (81)

ఆ వాక్యమును విని కృష్ణుడు చిరునవ్వుతో పార్వతీదేవిని, విశ్వేశుడగు రుద్రుని చూచి యిట్లు పలికెను. (82)

జ్ఞాతం హి భవతా సర్వం స్వేన యోగేన శఙ్కర | ఇచ్చా మ్యాత్మసమం పుత్రం త్వద్భక్తం దేహి శఙ్కర || || 83 ||

తథా స్త్విత్యాహ విశ్వాత్మా ప్రహృష్టమనసా హరః | దేవీ మాలోక్య గిరిజాం కేశవం పరిషస్వజే || || 84 ||

తతః సా జగతాం మాతా శఙ్కరార్థశరీరిణీ | వ్యాజహార హృషీకేశం దేవీ హిమగిరీన్ద్రజా || || 85 ||

అహం జానే తవానన్త నిశ్చలాం సర్వదా చ్యుత | అనన్యా మీశ్వరే భక్తి మాత్మన్యపి చ కేశవ || || 86 ||

త్వం హి నారాయణః సాక్షా త్సర్వాత్మా పురుషోత్తమః | ప్రార్థితో దైవతైః పూర్వం సఞ్చాతో దేవకీసుతః || || 87 ||

పశ్య త్వ మాత్మనాత్మాన మాత్మానం మమ సమ్ర్పతి | నావయో ర్విద్యతే భేద ఏకం పశ్యన్తి సూరయః || || 88 ||

ఓ శంకరా! నీచేత స్వకీయ యోగముచేత సమస్తము తెలియబడునుకదా! నాతో సమానుడు, నీకు భక్తుడును అగుపుత్రుని కోరుచున్నాను. అను గ్రహించుము. (83)

విశ్వాత్మకుడైన శివుడు సంతోషించిన మనస్సుతో అట్లేయగు గాక అని పలికెను. తన భార్యయగు పార్వతివైపు చూచి విష్ణువు నాలింగనము చేసికొనెను. (84)

తరువాత, శంకరుని అర్థశరీరమును పొందినది, లోకమాత, హిమవంతుని పుత్రిక యగు పార్వతి హృషికేశుడగు కృష్ణుని గూర్చి యిట్లు పలికెను. (85)

అచ్యుతా! కేశవా! నీయొక్క నిశ్చలమైన, అనంతమైన, అనన్యమైన, ఈశ్వరుని యందు నాయందు కూడ గల భక్తిని నేను ఎరుగుదును. (86)

నీవు సాక్షాత్తు నారాయణుడవు, పురుషోత్తముడవు, సర్వాత్మకుడవు, పూర్వము దేవతలచేత ప్రార్థింపబడి దేవకీ పుత్రుడుగా జన్మించినావు. (87)

నీవు ఇప్పుడు ఆత్మతో ఆత్మ స్వరూపమును చూడుము. నన్నుగూడ దర్శించుము. మన ఇర్వురిలో భేదము లేదు. పండితులు మనను ఒక్క రూపముగానే చూతురు. (88)

ఇమా నిహ వరా నిష్టా న్మత్తో గృహ్ణీష్వ కేశవ | సర్వజ్ఞత్వం తథైశ్వర్యం జ్ఞానం త త్పారమేశ్వరమ్‌ || || 89 ||

ఈశ్వరే నిశ్చలాం భక్తి మాత్మన్యపి పరం బలమ్‌ | ఏవ ముక్త స్తయా కృష్ణో మహాదేవ్యా జనార్దనః || || 90 ||

ఆదేశం శిరసా గృహ్య దేవో7 ప్యాహ తథేశ్వరమ్‌ |

ప్రగృహ్య కృష్ణం భగవా నధేశః కరేణ దేవ్యాసహ దేవదేవః | సమ్బూజ్యమానో మునిభిః సురేశై ర్జగామ కైలాసగిరిం గిరీశః || || 91 ||

ఇతి శ్రీ కూర్మపురాణ యదువంశానుకీర్తనే కృష్ణ తపశ్చరణంనామ పఞ్చవింశో7ధ్యాయః.

కేశవా! నీకు ఇష్టములైన వరములను నానుండి స్వీకరించుము. సర్వజ్ఞత్వము, ఐశ్వర్యము, పరమేశ్వరసంబంధి యగు జ్ఞానము, ఈశ్వరుని యందునిశ్చలమైన భక్తి, నీ యందుసర్వోత్తమమైనశక్తి అను వరములను గ్రహించుము. ఇట్లు ఆ మహేదేవిచేతచెప్పబడిన జనార్దనుడగు కృష్ణుడు, ఆమె ఆదేశమును శిరసుతో స్వీకరించి ఈశ్వరుని గూర్చి అట్లేయనిపలికెను. (89, 90)

పిమ్మట భగవంతుడగు శంకరుడు పార్వతీదేవితో కూడినవాడై, తనచేతితో కృష్ణునిపట్టుకొని, మునులచేత, దేవతలచేత పూజింపబడుచు కైలాస పర్వతమును గూర్చి వెళ్లెను. (91)

శ్రీ కూర్మ పురాణములో యదువంశానుకీర్తనయందు కృష్ణుని తపశ్చరణమను ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters