Sri Koorma Mahapuranam
Chapters
ఏ కోనత్రింశోధ్యాయః అధయుగవంశాను కీర్తనమ్ వ్యాస ఉవాచ :- ఇదం కలియుగం ఘోరం సంప్రాప్తం పాణ్డునన్డన | తతో గచ్ఛామి దేవస్య పురీం వారాణసీం శుభామ్ ||
|| 1 || అస్మిన్ కలియుగే ఘోరే లోకాః పాపానువర్తినః | భవిష్యన్తి మహాబాహో వర్ణాశ్రమవివర్జితాః ||
|| 2 || నాన్య త్పశ్యామి జన్తూనాం ముక్త్వా వారాణసీం పురీమ్ | సర్వపాపోపశమనం ప్రాయశ్చిత్తం కలౌ యుగే || || 3 || కృతం త్రేతా ద్వాపరఞ్చ సర్వే ష్వేతేఘ వై నరాః | భవిష్యన్తి మహాత్మానో ధార్మికాః సత్యవాదినః || || 4 || త్వం హి లోకేషు విఖ్యాతో ధృతిమా ఞ్జనవత్సలః | పాలయా ద్య పరం ధర్మం స్వకీయం ముచ్యసే భయాత్ || || 5 || ఇరువది తొమ్మిదవ అధ్యాయము యుగవంశాను కీర్తనము వ్యాసుడు పలికెను - పాండుకుమారా! భయంకరమైన యీ కలియుగము భూమండలములో ప్రవేశించినది. అందువలన నేను, మంగళకరమైన యీశ్వరుని పట్టణమైన కాశీకి వెళ్లుచున్నాను. (1) క్రూరమైన యీ కలియుగములో, గొప్ప భుజములు కల అర్జునుడా! జనులు పాపమార్గమున వర్తించువారు, వర్ణాశ్రమ ధర్మములను విడుచువారు కాగలరు. (2) లోకములోని ప్రాణులకు అన్ని పాపములను నశింపజేయునది, ప్రాయశ్చిత్తము కలుగజేయునది, వారాణసి పురము కాక మరియొకటి యీ కలియుగములో కన్పించదు. (3) కృత, త్రేతా, ద్వాపరములను పేర్లు గల ఈ యుగము లన్నింటిలో మనుష్యులు ధర్మ స్వభావులు, సత్యము పలుకువారు, మహాత్ములుగా ఉండగలరు. (4) నీవు లోకము లందు ప్రసిద్ధుడవు, ప్రజలకు ప్రియమైన వాడవు, ధైర్యవంతుడవు, కావున నీవు స్వీయ ధర్మమును కాపాడుము. భయము నుండి విముక్తుడవగుదువు. (5) ఏవ ముక్తో భగవతా పార్ధః పరపురఞ్జయః | పృష్టవాన్ ప్రణిపత్యా సౌ యుగధర్మా న్ద్విజోత్తమాః || || 6 || తసై#్మ ప్రోవాచ సకలం మునిః సత్యవతీసుతః | ప్రణమ్య దేవ మీశానం యుగధర్మా న్సనాతనాన్ || || 7 || వ్యాసఉవాచ :- వక్ష్యామి తే సమాసేన యుగధర్మా న్నరేశ్వర | న శక్యతే మయా రాజన్ విస్తరేణా భిభాషితుమ్ || || 8 || ఆద్యం కృతయుగం ప్రోక్తం తత స్త్రేతాయుగం బుధైః | తృతీయం ద్వాపరం పార్ధ చతుర్థం కలి రుచ్యతే || || 9 || ధ్యానం తపః కృతయుగే త్రేతాయాం జ్ఞాన ముచ్యతే | ద్వాపరే యజ్ఞ మేవాహు ర్దాన మేకం కలౌ యుగే || || 10 || బ్రాహ్మణులారా ! భగవంతుడగు వ్యాసునిచేత ఇట్లు పలుకబడిన, శత్రువుపురములను జయించిన అర్జునుడు, ఆయనకు నమస్కరించి యుగధర్మములను గూర్చి ప్రశ్నించెను. (6) సత్యవతికుమారుడైన వ్యాసుడు, భగవంతుడైన శివునికి నమస్కరించి, అనాదిసిద్ధములగు యుగధర్మములను సంపూర్ణముగా ఆ అర్జునునకు తెలియజేసెను. (7) ఓ రాజా! యుగధర్మములను గూర్చి నీకు సంగ్రహముగా తెలియపరుతును. విస్తరముగా వర్ణించి చెప్పుటకు నాకు శక్యము కాదు. (8) యుగములో మొదటిది కృతయుగమని, తరువాత త్రేతాయుగమని పండితులచేత చెప్పబడినది. ఓ పార్థుడా! మూడవదిద్వాపరమని, నాలుగవది కలియుగమని చెప్పబడుచున్నది. (9) కృతయుగములో ధ్యానము, తపస్సు ముఖ్యమని, త్రేతాయుగములో జ్ఞానము ప్రధానమని చెప్పబడినది. ద్వాపరయుగములో యజ్ఞమును, కలియుగములో ఒక్కదానమునే ప్రధానముగా పండితులు చెప్పుదురు. (10) బ్రహ్మా కృతయుగే దేవ స్త్రేతాయాం భగవా న్రవిః | ద్వాపరే దైవతం విష్ణుః కలౌ దేవో మహేశ్వరః || || 11 || బ్రహ్మా విష్ణు స్తథా సూర్యః సర్వ ఏవ కలా వపి | పూజ్యన్తే భగవా న్రుద్ర శ్చతుర్ష్వపి పినాకధృక్ || || 12 || ఆద్యే కృతయుగే ధర్మ శ్చతుష్పాదః ప్రకీర్తితః | త్రేతాయుగే త్రిపాదః స్యా ద్ద్విపాదో ద్వాపరే స్థితః || || 13 || త్రిపాదహీన స్తుకలౌ సత్తా మాత్రేణ తిష్ఠతి | కృతే తు మిథునోత్పత్తి ర్వృత్తిః సాక్షా దలోలుపా || || 14 || ప్రజా స్తృప్తాః సదా సర్వాః సర్వానన్దాశ్చ భోగినః | అధమోత్తమత్వం నా స్త్యాసాం నిర్విశేషాః పురఞ్జయ || || 15 || తుల్య మాయుః సుఖం రూపం తాసు తస్మి న్కృతేయుగే | విశోకా స్తత్త్వబహులా ఏకాన్తబహులా స్తథా || || 16 || కృతయుగములో బ్రహ్మప్రధాన దేవతగా ఉండును. త్రేతాయుగమందు భగవంతుడగు సూర్యుడు ముఖ్యదైవము. ద్వాపరయుగములో విష్ణువు, కలియుగములో మహేశ్వరుడు ప్రధానదేవతలుగా నుందురు. (11) బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు వీరందరు కలియుగములోకూడ పూజింపబడుదురు. పినాకధారియగు భగవంతుడు శివుడు నాలుగు యుగములలో కూడ పూజింపబడుచున్నాడు (12) మొదటి దైన కృతయుగములో ధర్మము నాలుగు పాదములు కలదిగా చెప్పబడినది. త్రేతాయుగములో మూడు పాదములు కలదిగా, ద్వాపరములో రెండుపాదములు కలదైయుండును. (13) కలియుగములో మూడు పాదములు లేనిదై కేవలము తన ఉనికిని కాపాడుకొనుచు నిలిచి యుండును. కృతయుగములో దంపతుల సంతానోత్పత్తి విషయలోలత లేనిదిగా ఉండును. (14) ప్రజలు కృతయుగములో అందరు ఎల్లప్పుడు తృప్తి కలిగి, సమస్తానందములు, సుఖానుభవము కలవారై యుందురు. వారికి నీచత్వము, శ్రేష్ఠత్వము అనుభేదభావములు లేకుండును. (15) కృతయుగములో ఆ ప్రజలకు ఆయువు, సుఖము, రూపము అందరికి సమానముగా నుండును. జనులు శోకరహితులు, తత్త్వవిచారముకలవారు, ఏకాంతవాసము ప్రధానముగా కలిగి యుందురు. (16) ధ్యాననిష్ఠా స్తపోనిష్ఠా మహాదేవపరాయణాః | తా వై నిష్కామచారిణ్యో నిత్యం ముదితమానసాః || || 17 || పర్వతోదధివాసిన్యో హ్యనికేతాః పరన్తప | రసోల్లాసః కాలయోగా త్త్రేతాఖ్యే నశ్యతి ద్విజాః || || 18 || తస్యాం సిద్ధౌ ప్రణష్టాయా మన్యా సిద్ధి రవర్తత | అపాం సౌఖ్యే ప్రతిహతే తదా మేఘాత్మనా తువై || || 19 || మేఘేభ్యః స్తనయిత్నుభ్యః ప్రవృత్తం వృష్టిసర్జనమ్ | సకృదేవ తయా వృష్ట్యా సంయుక్తే పృథివీతలే || || 20 || ప్రాదురాస న్తథా తాసాం వృక్షా వై గృహసంజ్ఞితాః | సర్వః ప్రత్యుపయోగస్తు తాసాం తేభ్యః ప్రజాయతే || || 21 || వర్తయన్తి స్మ తేభ్య స్తా స్త్రేతాయుగముఖే ప్రజాః | తతః కాలేన మహతా తాసా మేవ విపర్యయాత్ || || 22 || కృతయుగములో ప్రజలు ధ్యానమునందు, తపస్సు చేయుట యందు నిష్ఠకలవారుగా, మహాదేవుడగు శివునియందు శ్రద్ధకలవారుగా, కోరికలులేక ప్రవర్తించువారుగా, ఎల్లప్పుడు సంతోషించిన మనస్సుకలవారుగా ఉందురు. (17) శత్రువులను తపింపజేయు అర్జునా! ఆ జనులు పర్వతములయందు, సముద్రప్రాంతములయందు నివసించువారు, గృహనివాసములేని వారుగా బ్రాహ్మణులు వర్తింతురు. తరువాత కాలక్రమమున త్రేతాయుగములో రసోల్లాసము నశించును (18) ఆ విధమైన సిద్ధి నశించిపోగా మరియొక విధమైన సిద్ధి సంభవించినది. ఆ సమయములో మేఘస్వరూపముచేత జల సౌఖ్యమునకు విఘాతముకలుగగా, (19) గర్జనముచేయు స్వభావముకల మేఘములనుండి వర్షపాతము ప్రారంభ##మైనది. ఆ వర్షముచేత ఒక్కసారిగా భూప్రదేశము తడుపబడగా, (20) అప్పుడా ప్రజలకు గృహములని పేర్కొనదగిన వృక్షములు ఆవిర్భవించినవి. ఆ వృక్షముల వలన ప్రజలకు అన్ని విధములైన అవసరముల వినియోగము కలుగుచుండెను. (21) ఆ త్రేతాయుగప్రారంభములో ప్రజలు ఆ వృక్షసంబంధిగృహములలో జీవనము సాగించిరి. తరువాత చాలకాలము గడువగా మరల మార్పుకలుగట వలన ఆజనులకు (22) రాగలోభాత్మకో భావ స్తదా హ్యాకస్మికో 7 భవత్ | విపర్యయేణ తాసాం తు తేన తత్కాలభావితా || || 23 || ప్రణశ్యన్తి తతః సర్వే వృక్షా స్తే గృహసంజ్ఞితాః | తత స్తేషు ప్రణష్టేషు విభ్రాన్తా మైధునోద్భవాః || || 24 || అభిధ్యాయన్తి తాం సిద్ధిం సత్యాభిధ్యానత స్తదా | ప్రాదుర్బభూవు స్తాసాంతు వృక్షాస్తే గృహ సంజ్ఞితాః || || 25 || వస్త్రాణి తే ప్రసూయన్తే ఫలా న్యాభరణాని చ | తేష్వేవ జాయతే తాసాం గన్ధవర్ణరసాన్వితమ్ || || 26 || అమాక్షికం మహావీర్యం పుటకే పుటకే మధు | తేన తా వర్తయన్తి స్మ త్రేతాయుగముఖే ప్రజాః || || 27 || ఆ సమయములో ఆ ప్రజలకు కాలపు ప్రభావముచేత అంతకుముందు కన్న భిన్నముగా, రాగము, లోభము ప్రధానముగాకల భావము ప్రవర్తించెను. (23) తరువాత గృహమను సంజ్ఞతో వ్యవహరింపబడువృక్షములన్నియు నశించును. అప్పుడవి యన్నియు నశించగా, దంపతుల వలన జన్మించిన ప్రజలు కలత చెందినవారై (24) అప్పుడు ఆ సిద్ధిని గూర్చి సత్యాభిధ్యానముతో ధ్యానము చేయుదురు. తరువాత వారికి గృహసంజ్ఞకములైన వృక్షములు మరల ప్రాదుర్భవించినవి. (25) ఆ వృక్షములు వస్త్రములను, పండ్లను, ఆభరణములను గూడ కలుగజేసెను. ఆ ప్రజలకు వానియందే వాసన, రంగు, రుచితో కూడినది (26) తేనెటీగలచే చేయబడని, గొప్పబలము కలిగించునది అగుతేనె చెట్లయొక్క ప్రతి భాగమునందు కలుగుచుండెను. త్రేతాయుగప్రారంభములో జనులు ఆ తేనెతో తమ జీవనమును గడపుచుండిరి. (27) హృష్టా స్తుష్టా స్తయా సిద్ధ్యా సర్వావై విగతజ్వరాః | పునః కాలాన్తరేణౖవ తతో లోభావృతా స్తదా || || 28 || వృక్షాం స్తాన్ పర్యగృహ్ణన్త మధు వా మాక్షికం బలాత్ | తాసాం తేనాపచారేణ పున ర్లోభకృతేన వై || || 29 || ప్రణష్టా మధునా సార్ధం కల్పవృక్షాః క్వచిత్ క్వచిత్ | శీతవర్షాతపై స్తీవ్రై స్తా స్తతోదుఃఖితా భృశమ్ || || 30 || ద్వన్ద్వైః సంపీడ్యమానా స్తు చక్రు రావణాని చ | కృత్వా ద్వన్ద్వవినిర్ఘాతాన్ వార్తోపాయ మచిన్తయన్ || || 31 || నష్టేషు మధునా సార్ధం కల్పవృక్షేషు వై తదా | తతః ప్రాదురభూ త్తాసాం సిద్ధి స్త్రేతాయుగే పునః || || 32 || ఆ సిద్ధిచేత ప్రజలందరు సంతోషించినవారు, తృప్తిపొందినవారును అయి, వ్యాధిపీడలేనివారై ఉండిరి. తరువాత కొంత కాలము గడువగా మరల లోభగుణముచే ఆవరింపబడినవారైరి. (28) వారు ఆవృక్షములను, తేనెటీగలచేత చేయబడిన తేనెను బలాత్కారముతో స్వీకరించిరి. లోభగుణముచేత చేయబడిన ఆ ప్రజల అపరాధము చేత మరల; (29) ఆ కల్పవృక్షములు తేనెతో గూడ అక్కడక్కడ నశించి పోయినవి. ఆ జనులు చలి, వర్షము, ఎండలు తీవ్రముగా బాధింపగా దుఃఖమును పొందిరి. (30) చలి, ఎండ మొదలగు జంట దుఃఖాలతో బాధింపడినవారై ప్రజలు తమనివాసమునకై ఆచ్ఛాదనతో కూడిన ఆవరణములు కల్పించుకొనిరి. శీతోష్ణాదులగు ద్వంద్వములకు నివారణోపాయములను ఏర్పరచుకొని జీవనోపాధిని ఆలోచించిరి. (31) ఆ సమయములో కల్పవృక్షములు తమఫలములు, తేనెపట్లతోగూడ నశించగా త్రేతాయుగములోని ప్రజలకు మరల ఒకమారు సిద్ధి సాక్షాత్కరించెను. (32) వార్తాయాః సాధికా హ్యన్యా వృష్టి స్తాసాం నికామతః | తాసాం వృష్ట్యుద కానీహ యాని నిమ్నై ర్గతాని తు || || 33 || అభవన్ వృష్టిసన్తత్యా స్రోతః స్థానాని నిమ్నగాః | యదా ఆపో బహుతరా ఆపన్నాః పృథివీతలే || || 34 || అపాం భూమేశ్చ సంయోగా దౌషధ్య స్తా స్తదా7 భవన్ | అఫాలకృష్టా శ్చానుప్తా గ్రామ్యారణ్యా శ్చతుర్దశ || || 35 || ఋతుపుష్పఫలై శ్చైవ వృక్షగుల్మాశ్చ జజ్ఞిరే | తతః ప్రాదురభూ త్తాసాం రాగో లోభశ్చ సర్వశః || || 36 || అవశ్యమ్భావితార్థేన త్రేతాయుగవశేన వై | తత స్తాః పర్యగృహ్ణన్త నదీక్షేత్రాణి పర్వతాః || || 37 || వృక్షగుల్మౌషధీ శ్చైవ ప్రసహ్య తు యధాబలమ్ | విపర్యయేణ తాసాం తా ఓషధ్యో వివిశు ర్మహీమ్ || || 38 || ఆజనుల జీవనోపాధికి సహాయకారిగా వర్షముఅనునది మిక్కిలి ఎక్కువగా ఉపకరించినది. పల్లపు ప్రదేశములవైపు ప్రవహించు ఏ వర్షోదకములు కలవో అవి ఆజనులకు; (33) వర్షముల సమూహముచేత ప్రవాహస్థానములైన నదులుగా అవతరించినవి. ఎప్పుడు భూప్రదేశముపైన జలములు అధికముగా వర్ష, నదీరూపములో వ్యాపించినవో (34) అప్పుడు భూమికి జలములకు సంయోగము కలిగినందున, నాగలిచేదున్నబడినవి, విత్తనములు వేయబడినవి, గ్రామసంబంధమైనవి, అడవులకు సంబంధించినవి అగు పదునాలుగు విధముల ఓషధులు మొలకెత్తినవి. (35) ఆయాఋతువులకు చెందిన పూవులు, పండ్లతో వృక్షములు, తీగలు జనించెను. అప్పుడుమరల ప్రజలకు అంతట కోరిక, లోభము అను గుణములు ప్రభవించినవి. (36) త్రేతాయుగప్రభావముచేత అవశ్యముగా కావలసియున్న రాగలోభవ్యాప్తిచేత ప్రజలు నదులను, పొలములను, పర్వతములను తమకు ఉపకరణముగా స్వీకరించిరి. (37) చెట్లు, పొదలు, ఓషధులు వాటిబలాన్ననుసరించి పరస్పర వినిమయముతో భూమిని ప్రవేశించినవి. (38) పితామహనియోగేన దుదోహ పృథివీం పృథుః | తత స్తా జగృహుః సర్వా హ్యన్యోన్యం క్రోథమూర్ఛితాః || || 39 || సదాచారే వినష్టే తు బలా త్కాలబలేన చ | మర్యాదాయాః ప్రతిష్ఠార్ధం జ్ఞాత్వైత ద్భగవా నజః || || 40 || ససర్జ క్షత్రియాన్ బ్రహ్మా బ్రాహ్మణానాం హితాయ వై | వర్ణాశ్రమవ్యవస్థా ఞ్చ త్రేతాయాం కృతవా న్ర్పభుః || || 41 || యజ్ఞప్రవర్తనం చైవ పశుహింసావివర్జితమ్ | ద్వాపరే7 ప్యథ విద్యన్తే మతిభేదా త్తథా నృణామ్ || || 42 || రాగో లోభ స్తథా యుద్ధం మత్వా బుద్ధివినిశ్చయమ్ | ఏవో వేద శ్చతుష్పాద స్త్రిధా త్విహ విభావ్యతే || || 43 || పితామహుడైన బ్రహ్మయొక్క ఆజ్ఞచేత పృథువు భూమిని పితికెను. అప్పుడు ఆ ప్రజలు పరస్పరము క్రోధావేశమును పొందినవారై ఆ ఓషధులను స్వీకరించిరి. (39) కాలప్రభావముచేత, జనుల బలప్రయోగముచేత సదాచారము క్షీణించిపోగా, ఈవిషయమును తెలిసికొని భగవంతుడగు బ్రహ్మ లోకమర్యాదను కాపాడుటకొరకు; (40) బ్రాహ్మణులయొక్క హితము కొరకు బ్రహ్మదేవుడు క్షత్రియులను సృజించెను. ఆ త్రేతాయుగములో బ్రహ్మ వర్ణముల, ఆశ్రమములయొక్క వ్యవస్థను కూడ నియమించెను. (41) పశువుల హింసతో సంబంధములేని యజ్ఞముల అనుష్ఠానమును గూడ బ్రహ్మ ఏర్పరచెను. తరువాత ద్వాపరయుగములోకూడ, వర్ణాశ్రమ ధర్మములు, యజ్ఞములు కొద్ది భిన్నాభి ప్రాయముతో ప్రవర్తించినవి. (42) అనురాగము, లోభము, యుద్ధము అనువానిని బుద్ధియొక్క నిశ్చయముగాతలచి, నాలుగు పాదములు కలవేదము ఇక్కడమూడు విధములుగా భావించబడుచున్నది. (43) వేదవ్యాసై శ్చతుర్థా చ న్యస్యతే ద్వాపరాదిషు | ఋషిపుత్రైః పున ర్వేదా భిద్యన్తే దృష్టివిభ్రమైః || || 44 || మన్త్రబ్రాహ్మణవిన్యాసైః స్వరవర్ణవిపర్యయైః | సంహితా ఋగ్యజుస్సామ్నాం ప్రోచ్యన్తే పరమర్షిభిః || || 45 || సామాన్యోద్భావనా చైవ దృష్టిభేదైః క్వచిత్ క్వచిత్ | బ్రాహ్మణం కల్పసూత్రాణి బ్రహ్మప్రవచనాని చ || || 46 || ఇతిహాసపురాణాని ధర్మశాస్త్రాణి సువ్రత | అవృష్టి ర్మరణం చైవ తథైవాన్యే హుపద్రవాః || || 47 || వాఙ్మనఃకాయజై ర్దోషై ర్నిర్వేదోజాయతే నృణామ్ | నిర్వేదా జ్జాయతే తేషాం దుఃఖమోక్షవిచారణా || || 48 || వేదవ్యాసమునులచేత ఆవేదము ద్వాపరాదియుగములందు నాలుగు భాగములుగా ఏర్పరచబడినది. మురల ఋషికుమారుల చేత వారివారి దృష్టిభేదములచేత వేదములు విభజించబడినవి. (44) మంత్ర, బ్రాహ్మణ భాగముల విన్యాసములు, స్వరముల, వర్ణములమార్పులచేత ఋక్కు, యజుస్సు, సామము అనువేదముల సంహితలుగా గొప్పఋషులచేత చెప్పబడుచున్నవి. (45) సాధారణమైన భావనకూడ, అక్కడక్కడ దృష్టిభేదములతో వివరించబడినది. బ్రాహ్మణభాగము, కల్పసూత్రములు బ్రహ్మవచనములను, (46) ఇతి హాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు, అనావృష్టి, మరణము, అట్లే ఇతరములైన ఉపద్రవములు (47) వాక్కు, మనస్సు, శరీరము అను త్రికరణముల వలన సంభవించిన దోషములచేత మనుష్యులకు నిర్వేదము కలుగుచుండును. అటువంటి వారికి విషయసుఖములందు విరక్తి కలిగినప్పుడు దుఃఖమునుండి మోక్షము పొందువిచారము కలుగును. (48) విచారణా చ్చవైరాగ్యం వైరాగ్యా ద్దోషదర్శనమ్ | దోషాణాం దర్శనా చ్చైవ ద్వాపరే జ్ఞానసమ్భవః || || 49 || ఏషా రజస్తమోయుక్తా వృత్తిర్వై ద్వాపరే ద్విజాః | ఆద్యే కృతేతు ధర్మో7స్తి స త్రేతాయాం ప్రవర్తతే || || 50 || ద్వాపరే వ్యాకులీభూత్వా ప్రణశ్యతి కలౌ యుగే || ఇతి శ్రీ కూర్మపురాణ యుగవంశానుకీర్తనం నామ ఏకోనత్రింశో7ధ్యాయః ఆలోచించుట వలన వైరాగ్యము, వైరాగ్యమువలన దానిలోని దోషాలను గ్రహించుట, దోషముల దర్శనం వలన ద్వాపరయుగంలో జ్ఞానము సంభవిస్తుంది. (49) విప్రులారా! ద్వాపరయుగంలో రజస్తమోగుణాలతో కూడిన ఇటువంటి వ్యవహారముంటుంది. మొదటి కృతయుగంలో ధర్మంప్రధానమై అది త్రేతాయుగంలో కూడ ప్రవర్తిస్తుంది. ద్వాపరయుగంలో ఆ ధర్మం వ్యాకులత చెంది, కలియుగంలో క్షీణదశను పొందుతుంది. (50) శ్రీకూర్మపురాణములో యుగవంశాను కీర్తనమను ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.