Sri Koorma Mahapuranam    Chapters   

ఏకత్రింశో7ధ్యాయః

అధ వారాణాసీ మాహాత్మ్యమ్‌

ఋషయ ఉవాచ ః

ప్రాప్య వారాణసీం దివ్యాం కృష్ణద్వైపాయనో మునిః | కి మకార్షీ న్మహాబుద్ధిః శ్రోతుం కౌతూహలం హి నః || || 1 ||

సూత ఉవాచ :-

ప్రాప్య వారాణసీం దివ్యా ముపస్పృశ్య మహామునిః | పూజయామాస జాహ్నవ్యాం దేవం విశ్వేశ్వరం శివమ్‌ || || 2 ||

ముపై#్పఒకటవ అధ్యాయము

వారాణసి మాహాత్మ్యము

ఋషులిట్లు పలికిరి

గొప్ప బుద్ధికల కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని దివ్యమైన వారాణసి పురిని చేరి ఏమి చేసినాడు? అది వినుటకు మాకు చాల కుతూహలముగా ఉన్నది. (1)

సూతుడిట్లు బదులు పలికెను :-

మహాముని యగు వ్యాసుడు వారాణసిని చేరి గంగానది యందు స్నానమాడి, ఆచమించి విశ్వేశ్వరుడైన శివుని పూజించెను. (2)

త మాగతం మునిం దృష్ట్వా తత్ర యే నివసన్తి వై | పూయాంచక్రిరే వ్యాసం మునయో మునిపుఙ్గవమ్‌ || || 3 ||

పప్రచ్ఛుః ప్రణతా స్సర్వే కథాం పాపప్రణాశినీమ్‌ | మహాదేవాశ్రయాం పుణ్యాం మోక్షధర్మా న్సనాతనాన్‌ || || 4 ||

స చాపి కథయామాస సర్వజ్ఞో భగవా నృషిః | మాహాత్మ్యం దేవదేవస్య ధర్మ్యం వేదనిదర్శనాత్‌ || || 5 ||

తేషాం మధ్యే మునీన్ద్రాణాం వ్యాసశిష్యో మహామునిః | పృష్టవా ఞ్జైమిని ర్వ్యాసం గూఢ మర్ధం సనాతనమ్‌ || || 6 ||

జైమినిరువాచ :-

భగవ న్సంశయం చైకం ఛేత్తు మర్హసి సర్వవిత్‌ | న విద్యతే హ్యవిదితం భవతః పరమర్షిణః || || 7 ||

ఆ వారాణసిలోనివసించు మునులు తమవద్దకు వచ్చిన వ్యాసమునిని చూచి, మునులలో శ్రేష్ఠుడైన అతనిని గౌరవముతో పూజించిరి (3)

వారందరు ఆ మునికి నమస్కరించి, పాపములను నశింపజేయునది, శివునకు సంబంధించినదియు అగుకథను, అతిపురాతనములైన మోక్ష ధర్మములను తెలుపుమని ప్రశ్నించిరి. (4)

అన్ని విషయములు తెలిసిన మహాత్ముడగు ఆ వేదవ్యాసఋషికూడ, దేవదేవుడగు శివుని గొప్పతనమును, ధర్మయుక్తమైన దానిని వేదమంత్రప్రదర్శనపూర్వకముగా వారికి తెలిపెను. (5)

ఆ మునిశ్రేష్ఠులలో నుండి వ్యాసుని శిష్యుడు, గొప్పమునియునగు జైమిని, వ్యాసమునిని గూర్చి అనాది సిద్ధము, రహస్యము అగు తత్త్వమును గూర్చి యిట్లు ప్రశ్నించెను. (6)

జైమిని పలికెను :-

సర్వజ్ఞుడవైన ఓ మహాత్మా ! మా సంశయమునొకదానిదని నివారించదగి యున్నావు. మహర్షులగు మీకు తెలియని విషయమేదియులేదు కదా! (7)

కేచి ద్ధ్యానం ప్రవంసన్తి ధర్మమేవా పరే జనాం | అన్యే సాంఖ్యం తథా యోగం తప శ్చాన్యే మహర్షయః | || 8 ||

బ్రహ్మచర్య మథో నూన మన్యే ప్రాహు ర్మహర్షయః | అహింసాం సత్య మప్యన్యే సన్న్యాస మపరే విదుః || || 9 ||

కేచి ద్దయాం ప్రశంసన్తి దాన మధ్యయనం తథా | తీర్ధయాత్రాం తథా కేచి దన్యే చేన్ద్రియనిగ్రహమ్‌ || || 10 ||

కిమేషాంచ భ##వే చ్ఛ్రేయః ప్రబ్రూహి ముని పుఙ్గవ | యదివా విద్యతే 7ప్యన్య ద్గుహ్యం తద్వక్తుమర్హసి || || 11 ||

శ్రుత్వా స జైమినే ర్వాక్యం కృష్ణద్వైపాయనో మునిః | ప్రాహ గమ్భీరయా వాచా ప్రణమ్య వృషకేతనమ్‌ || || 12 ||

కొంతమంది ధ్యానమును గొప్పదని పొగడుదురు. మరి కొందరు ధర్మమే శ్రేష్ఠమందురు. ఇతరులు సాంఖ్యము, యోగము, తపస్సు గొప్పవని వేరువేరుగా ఆయాఋషులు చెప్పుచున్నారు. (8)

ఇతరులగు మహర్షులు బ్రహ్మచర్యమే నిశ్చయముగా గొప్పదని చెప్పుదురు. కొందరు అహింసను, ఇతరులు సత్యమును, మరికొందరు సన్న్యాసమును శ్రేష్ఠముగా గుర్తించుదురు. (9)

కొంతమంది దయను ప్రశంసింతురు, దానమును, వేదాధ్యయనమును తీర్ధయాత్రను, ఇంద్రియనిగ్రహమును ఉత్తమధర్మములుగా ఆయా పండితులు చెప్పుచున్నారు. (10)

ఓ మునీశ్వరా ! పైన తెలిపిన వానిలో ఏది ఎక్కువశ్రేయస్కరమో తెలుపుము. ఇవి కాక మరేదైన రహస్య తత్త్వమున్నచో దానిని మాకు దయతో తెలుపుము (11)

జైమిని యొక్క మాటనువిని కృష్ణద్వైపాయనుడగు వ్యాసమహాముని వృషభధ్వజుడైన శివునకు మనస్సులో మనస్కరించి గంభీరమైన కంఠధ్వనితో ఇట్లుపలికెను. (12)

శ్రీ భగవానువాచ :-

సాధు సాధు మహాభాగ! యత్పృష్టం భవతా మునే | వక్ష్యే గుహ్యతమా ద్గుహ్యం శృణ్వ న్త్యన్యే మహర్షయః || || 13 ||

ఈశ్వరేణ పురాప్రోక్తం జ్ఞాన మేతత్స నాతనమ్‌ | గూఢ మప్రాజ్ఞవిద్విష్టం సేవితం సూక్ష్మదర్శిభిః || || 14 ||

నా శ్రద్దధానే దాతవ్యం నాభ##క్తే పరమేష్ఠినః | నా వేదవిదుషే దేయం జ్ఞానానాం జ్ఞాన ముత్తమమ్‌ || || 15 ||

మేరుశృఙ్గే మహాదేవ మీశానం త్రిపురద్విషమ్‌ | దేవాసనగతా దేవీ మహాదేవ మపృచ్ఛత || || 16 ||

శ్రీదేవ్యువాచ :-

దేవదేవ మహాదేవ భక్తానా మార్తినాశన | కథం త్వాం పురుషో దేవ మచిరాదేవ పశ్యతి || || 17 ||

మహాత్ముడగు వ్యాసుడిట్లు పలికెను. ఓ మహానుభావా! నీచేత అడుగబడిన విషయము చాలబాగున్నది. రహస్యములన్నింటిలో మిక్కిలి రహస్యమైన ఆ విషయమును చెప్పుదును. ఇతర మహర్షులుకూడ విందురుగాక. (13)

ఈ అతిపురాతనమైన జ్ఞానమార్గము పూర్వము ఈశ్వరుని చేత చెప్పబడినది. ఇది చాల రహస్యమైనది. బుద్ధిమంతులు కానివారి చేత ద్వేషింపబడినది. సూక్ష్మదృష్టి కలవారిచేత సేవింపబడినది. (14)

జ్ఞానములన్నిటిలో ఉత్తమ జ్ఞానమైన యీరహస్యమును శ్రద్ధలేని వారికీయదగదు. శివుని యందు భక్తిలేనివానికుపదేశింపదగదు. వేదములను తెలియనివానికీయదగదు. (15)

త్రిపురాసురులకు శత్రువు, మహాదేవుడు అగు శివుడు మేరు పర్వత శిఖరమందుండగా, దేవాసనమునధిష్టించి యున్నపార్వతీదేవి శివుని ఇట్లు ప్రశ్నించెను. (16)

దేవతలకు దేవుడవైన ఓ మహాదేవా! భక్తుల బాధలను నశింపజేయువాడా! లోకములో మనుష్యుడు నిన్ను శీఘ్రకాలములో ఎట్లు దర్శింపగలడు? (17)

సాంఖ్యయోగ స్తపో ధ్యానం కర్మయోగశ్చ వైదికః | ఆయాసబహులా న్యాహు ర్యానిచాన్యాని శఙ్కర || || 18 ||

యేన విభ్రాన్తచిత్తానాం విజ్ఞానాం యోగినా మపి | దృశ్యో హి భగవా న్సూక్ష్యః సర్వేషా మపి దేహినామ్‌ || || 19 ||

ఏత ద్గుహ్యతయం జ్ఞానం గూఢం బ్రహ్మాది సేవితమ్‌ | హితాయ సర్వభక్తానాం బ్రూహి కామాఙ్గనాశన || || 20 ||

ఈశ్వర ఉవాచ :-

అవాచ్య మేత ద్గూఢార్ధం జ్ఞాన మజ్ఞై ర్బహిష్కృతమ్‌ | వక్ష్యదే తవ యథాతత్త్వం యదుక్తం పరమర్షిభిః || || 21 ||

పరం గుహ్యతమం క్షేత్రం మమ వారాణసీ పురీ | సర్వేషా మేవ భూతానాం సంసారార్ణవతారిణీ || || 22 ||

సాంఖ్యయోగము, తపస్సు, ధ్యానము వేదప్రతిపాదితమైన కర్మయోగము కూడ అధిక శ్రమచేత సాధ్యములనిచెప్పుదురు. ఓ శంకరా! ఇతరములైన ఉపాయములు కూడ అటువంటివే (18)

యే ఉపాయముచేత భ్రాంతికి లోనై మనస్సులు కల జ్ఞానవంతులైన యోగులకు, ఇతర సమస్తప్రాణులకు గూడ సూక్ష్మరూపుడైన భగవంతుడు సాక్షాత్కరించునో, అటువంటి మిక్కిలి రహస్యమైనది, గూఢమైనది, బ్రహ్మమొదలగు వారిచేత సేవింపబడునది అగు జ్ఞానమును ఓ మన్మథ సంహారకా ! సమస్త భక్తుల యొక్క మేలు కొరకు మాకు బోధింపుము. (19, 20)

ఈశ్వరుడిట్లు చెప్పెను.

ఈ జ్ఞానము, గూఢమైన అర్ధము కలది, అజ్ఞానుల చేత దూరము చేయబడినది; అందరికిని చెప్పదగనిది. దానిని నీకు, మహర్షులు, ప్రతి పాదించిన రీతిలో యధాతథముగా చెప్పుదును. (21)

ఈ వారాణసి పట్టణము మిక్కిలి రహస్యమైన మహిమగలక్షేత్రము. ఇది నా నివాసస్థానము. సమస్తప్రాణులను సంసారసముద్రము నుండి దాటించునది యీ క్షేత్రము. (22)

తస్మి న్భక్తా మహాదేవి! మదీయం వ్రత మాస్థితాః | నివసన్తి మహాత్మానః పరం నియమ మాస్థితాః || || 23 ||

ఉత్తమం సర్వతీర్థానాం స్థానానా మత్తమం చ యత్‌ | జ్ఞానానాముత్తమం జ్ఞానమవిముక్తం పరం మమ || || 24 ||

స్థానాన్తరే పవిత్రాణి తీర్థా న్యాయతనాని చ | శ్మశానే సంస్థితా న్యేవ దివి భూమిగతాని చ || || 25 ||

భూలోకే నైవ సంలగ్న మన్తరిక్షే మమాలయమ్‌ | అవిముక్తా న పశ్యన్తి ముక్తాః పశ్యన్తి చేతసా || || 26 ||

శ్మశాన మేత ద్విఖ్యాత మవిముక్త మితి స్మృతమ్‌ | కాలో భూత్వా జగదిదం సంహరామ్యత్ర సున్దరి || || 27 ||

ఓ మహాదేవీ! నా యొక్క భక్తులు, ఆ క్షేత్రమునందు నా వ్రతమునవలంబించిన మహానుభావులు, గొప్పనియమములను పాటించువారై వసింతురు. (23)

సమస్తతీర్థములలో శ్రేష్ఠమైనది, ప్రదేశములన్నింటిలో ఉత్తమమైనది, జ్ఞానములలో శ్రేష్ఠమైన జ్ఞానస్వరూపము అయిన అవిముక్త క్షేత్రము నాకు చాలా ప్రియమైనది. (24)

ఇతర స్థలములలో పవిత్రములైన తీర్థములు, స్థలములు ఆకాశమందలివి, భూమిపైనున్నవి అన్నియును శ్మశానరూపమైన అవిముక్త క్షేత్రములోనున్నవియే. (25)

భూలోకముతో సంబంధములేక, అంతరిక్షములోనున్న నా నివాసస్థానము ముక్తులు కానివారు చూడలేరు. మోక్షమును పొందినవారు మనోదృష్టితో చూడగలరు. (26)

ఈ అవిముక్తక్షేత్రము శ్మశాన మనుపేరుతో ప్రసిద్ధమైయున్నది. ఓ దేవీ! నేను ఇక్కడ కాలరూపుడుగా మారి ప్రళయకాములో ఈ లోకమును నశింపజేయుదును. (27)

దేవీదం సర్వగుహ్యానాం స్థానం ప్రియతమం మమ | మద్భక్తా యత్ర గచ్ఛన్తిమా మేవ ప్రవిశన్తి తే || || 28 ||

దత్తం జప్తం హుత ఞ్చేష్టం తపస్తప్తం కృతం చ యత్‌ | ధ్యాన మధ్యయనం జ్ఞానం సర్వం తత్రాక్షయం భ##వేత్‌ || || 29 ||

జన్మాన్తరసహ స్రేషు యత్పాపం పూర్వసఞ్చితమ్‌ | అవిముక్తే ప్రవిష్టస్య తత్సర్వం వ్రజతి క్షయమ్‌ || || 30 ||

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా యే వర్ణసఙ్కరాః | స్త్రియో వ్లుెచ్ఛాశ్చయే చాన్యే సఙ్కీర్ణాః పాపయోనయః || || 31 ||

కీటాః పిపీలికా శ్చైవ యే చాన్యే మృగపక్షిణః | కాలేన నిధనం ప్రాప్తా అవిముక్తే వరాననే || || 32 ||

ఓదేవీ! ఈస్థలము అన్ని తత్త్వరహస్యములకు ఆధారము. ఇది నాకు చాల ప్రియమైనది. నా భక్తులు ఎక్కడికి వెళ్లినను వారు నన్నే చేరుకొందురు. (28)

ఈ క్షేత్రములో చేసినదానము, జపము, హోమము, తపస్సు, ఇతరమైన పుణ్యకర్మ, ధ్యానము, చదువు, జ్ఞానము, అన్నియు నాశరహితములై యుండును. (29)

పూర్వపు వేలకొలది జన్మలయందు చేయబడిన పాపము ఏదికలదో, అదియంతయు అవిముక్తక్షేత్రములో ప్రవేశించిన వానికి పూర్తిగా నశించును. (30)

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వర్ణసంకరముకలవారు, స్త్రీలు, వ్లుెచ్ఛులు,ఇంకను ఇతరులైన సంకీర్ణజాతులు, పాపకర్ములు ఎవరు కలరో; కీటకములు, చీమలు, ఇతరములైన మృగములు, పక్షులు అవిముక్తక్షేత్రములో అవసానకాలములో ప్రాణములు విడువగా; (31, 32)

చన్ద్రార్ధ మౌలయ స్త్ర్యక్షా మహావృషభవాహనాః | శివే మమ పురే దేవి జాయన్తే తత్ర మానవాః || || 33 ||

నా విముక్తే మృతః కశ్చి న్నరకం యాతి కిల్బిషీ | ఈశ్వరానుగృహీతా హి సర్వే యాన్తి పరాం గతిమ్‌ || || 34 ||

మోక్షం సుదర్లభం జ్ఞాత్వా సంసారం చాతిభీషణమ్‌ | అశ్మనా చరణౌ హత్వా వారాణస్యాం వసే న్నరః || || 35 ||

దుర్లభా తపసో7వాప్తి ర్భూతస్య పరమేశ్వరి | యత్ర తత్రమ విపన్నస్య గతిః సంసారమోక్షణీ || || 36 ||

ప్రసాదా ద్దహ్యతే హ్యేనో మమ శైలేన్ద్రనన్దిని | అత్రా బుధా న పశ్యన్తి మమ మాయావిమోహితాః || || 37 ||

ఓదేవీ! అక్కడ మంగళకరమైన నాపట్టణమందు అర్థచంద్రులు తలయందుకలవారు, మూడుకన్నులుకలవారు, గొప్పఎద్దు వాహనముగా కలవారును అగు మనుష్యులు జన్మింతురు. (33)

అవిముక్తక్షేత్రములో మరణించిన యే పాపాత్ముడు కూడ నరకమునకు వెళ్లడు. అక్కడ మరణించిన అందరు కూడ ఈశ్వరుని అనుగ్రహమును పొంది మోక్షపదమును పొందుదురు. (34)

మోక్షము మిక్కిలి కష్టముతో పొందదగినదని, సంసారము చాల భయంకరమైనదని తెలుసుకొని మనుష్యుడు పాదములను శిలతో ఖండించుకొని కాశీలో నివసించవలెను. (35)

ఓ పరమేశ్వరీ! ప్రపంచములో ప్రాణికి తపస్సుచేయు అవకాశము దుర్లభ##మైనది. అటువంటి లోకములో ఆపదను పొందినవానికి సంసారబంధమునుండి విడిపించు ఉపాయమైనది కాశీపట్టణవాసము. (36)

పర్వతరాజపుత్రీ! నా అనుగ్రహమువలన మానవుల పాపమునశించును. ఈ విషయమును పండితులు కానివారు నామాయచే మోహితులై తెలిసికొనజాలరు. (37)

అవిముక్తం న పశ్యన్తి మూఢా యే తమసా వృతాః | విణ్మూత్రరేతసాం మధ్యే సంవిశన్తి పునః పునః || || 38 ||

హన్యమానో7పి యో దేవి విశే ద్విఘ్నశ##తై రపి | స యాతి పరమం స్థానం యత్ర గత్వా న శోచతి || || 39 ||

జన్మమృత్యుజరాముక్తం పరం యాతి శివాలయమ్‌ | అపునర్మరణానాం హి సా గతి ర్మోక్షకాంక్షిణామ్‌ || || 40 ||

యం ప్రాప్య కృతకృత్యః స్యాదితి మన్యేత పణ్డితః | న దాన్నైర్న తపోభిశ్చ న యజ్ఞై ర్నాపి విద్యయా || || 41 ||

ప్రాప్యతే గతి రుత్కృష్టా యా విముక్తే తు లభ్యతే | నానావర్ణవివర్ణా శ్చ చణ్డాలాద్యా జుగుప్సితాః || || 42 ||

తమోగుణముచే ఆవరింపబడిన యే అజ్ఞానులు అవిముక్తక్షేత్రమును చూడరో, వారు మలమూత్రములు, శుక్రముల మధ్యమాటిమాటికి ప్రవేశింతురు. (38)

ఓదేవీ! ఎవడు వందల కొలది ఆటంకములచేత బాధింపబడుచు గూడ అవిముక్తమును ప్రవేశించునో, అట్టివాడు దుఃఖమున కవకాశములేని పరమపదమును పొందును. (39)

పుట్టుక, మరణము, ముసలితనములలేని శ్రేష్ఠమైన శివసాయుజ్యమును చేరును. మోక్షమును కోరుచున్న వారికి జననమరణములులేని గమ్యస్థానము అదియేకదా! (40)

పండితుడైనవాడు అటువంటి అవిముక్తక్షేత్రమునుచేరి కృతార్థుడనైతినని తలచును. దానములచేతగాని, తపస్సులచేతకాని, యజ్ఞములచేత, పాండిత్యముచేతకాని; (41)

అవిముక్తక్షేత్రములో వసించుటవలన కలుగునటువంటి శ్రేష్ఠమైన ముక్తిపదము లభించదు. అనేక వర్ణములవారు, వర్ణహీనులు, అసహ్యించు కొనబడు చండాలురు మొదలగువారు; (42)

కిల్బిషైః పూర్ణదేహా యే ప్రకృష్టై స్తాపకై స్తథా | భేషజం పరమం తేషా మవిముక్తం విదు ర్బుధాం || || 43 ||

అవిముక్తం పరం జ్ఞాన మవిముక్తం పరం పదమ్‌ | అవిముక్తం పరం తత్త్వ మవిముక్తం పరం శివమ్‌ || || 44 ||

కృత్వా వై నైష్ఠికీం దీక్షా మవిముక్తే వసన్తి యే | తేషాం త త్పరమం జ్ఞానం దదా మ్యన్తే పరం పదమ్‌ || || 45 ||

ప్రయాగం నైమిషం పుణ్యం శ్రీశైలో7థ హిమాలయః | కేదారం భద్రకర్ణఞ్చ గయా పుష్కర మేవ చ || || 46 ||

కురుక్షేత్రం రుద్రకోటి ర్నర్మదా హాటకేశ్వరమ్‌ | శాలిగ్రామ ఞ్చ పుష్పాగ్రం వంశం కోకాముఖం తథా || || 47 ||

పాపములతో నిండిన శరీరములు కలవారు, బాధను కలిగించు గొప్ప రోగాదులతో కూడినవారెవరో, అట్టివారికి అవిముక్తము ఉత్త మౌషధమని పండితులు తెలిసికొందురు. (43)

అవిముక్త క్షేత్రము గొప్ప జ్ఞాన రూపమైనది. అది సర్వశ్రేష్ఠమైన స్థానము. అవిముక్తము శ్రేష్ఠమైన తత్త్వ స్వరూపము, అది పరమ మంగళదాయకమైనది. (44)

నిష్ఠతో కూడిన ధీక్షను ధరించి ఎవరైతే అవిముక్త క్షేత్రములో నివసింతురో అటువంటి వారికి శ్రేష్ఠమైన ఆత్మజ్ఞానమును కలిగించి, చివరకు వారికి మోక్ష పదము ననుగ్రహింతును. (45)

ప్రయాగక్షేత్రము, నైమిషారణ్యము, శ్రీశైలము, హిమాలయ పర్వతము, కేదారము, భద్రకర్ణము, గయ మరియు పుష్కరక్షేత్రము; (46)

కురుక్షేత్రము, రుద్రకోటి, నర్మదానది, హాటకేశ్వరము, శాలిగ్రామము, పుష్పాగ్రము, వంశము మరియు కోకాముఖము కూడ (47)

ప్రభాసం విజయేశానం గోకర్ణం శఙ్కు కర్ణకమ్‌ | ఏతాని పుణ్యస్థానాని త్రైలోక్యే విశ్రుతాని చ || || 48 ||

యాస్యన్తి పరమం మోక్షం వారాణస్యాం యథా మృతాః | వారాణస్యాం విశేషేణ గఙ్గా త్రిపథగామినీ || || 49 ||

ప్రవిష్టా నాశ##యే త్పాపం జన్మాన్తరశ##తైః కృతమ్‌ | అన్యత్ర సులభా గఙ్గా శ్రాద్ధం దానం తథా జపః || || 50 ||

వ్రతాని సర్వమే వైత ద్వారాణస్యాం సుదుర్లభమ్‌ | యజేత్తు జుహుయా న్నిత్యం దదాత్యర్చయతే7పరాన్‌ || || 51 ||

వాయుభక్షశ్చ సతతం వారాణస్యాం స్థితో నరః | యది పాపో యది శఠో యది చా ధార్మికో నరః || || 52 ||

ప్రభాస తీర్థము, విజయేశానము, గోకర్ణక్షేత్రము, శంకుకర్ణము అనునవి ముల్లోకములలో ప్రసిద్ధములైన పుణ్యస్థలములు. (48)

కాశియందు మరణించిన వారు మోక్షమును పొందినట్లు పూర్వోక్తక్షేత్రములలో గూడ ముక్తిని పొందుదురు. వారణాసి యందు విశేషముగా మూడు మార్గముల ప్రవహించునదగు గంగ కలదు. (49)

గంగలో మునిగినంతనే వందల పూర్వజన్మలలో చేసిన పాపములను నశింపజేయును. గంగానది ఇతర స్థలములలో సులభముగా అందును. శ్రాద్ధము, దానము, జపము కూడా. (50)

వ్రతములు, ఇవి అన్నియూ ఇతరత్ర పొందవచ్చును. వారణాసి యందు పొందుట మిక్కిలి కష్టము, యాగము, హోమము ఎల్లప్పుడు చేయవలెను. దానము చేయుట, ఇతరులను పూజించుట; (51)

వాయుభక్షణము చేయుచూ ఎల్లప్పుడు వారణాసి యందు నివసించు మనుష్యుడు, పాపాత్ముడైనను, మొండి వాడైనను అధార్మికుడైనప్పటికిని; (52)

వారాణసీం సమాసాద్య పునాతి స కులత్రయమ్‌ | వారాణస్యాం మహాదేవం యే స్తువ న్త్యర్చయన్తి చ || || 53 ||

సర్వపాపవినిర్ముక్తా స్తే విజ్ఞేయా గణశ్వరాః | అన్యత్ర యాగా ద్జాఞనాద్వా సన్యాసా దథవా న్యతః || || 54 ||

ప్రాప్యతే తత్పరం స్థానం సహస్రే ణౖవ జన్మనా | యే భక్తా దేవదేవేశే వారాణస్యాం వసన్తి వై || || 55 ||

తే విన్దన్తి పరం మోక్ష మేకే నైవ తు జన్మనా | యత్ర యోగ స్తథా జ్ఞానం ముక్తి రేకేన జన్మనా || || 56 ||

అవిముక్తం సమాసాద్య నాన్య ద్గచ్ఛే త్తపోవనమ్‌ | యతో మయా న ముక్తం త దవిముక్త మితి స్మృతమ్‌ || || 57 ||

అతడు వారణాసిని చేరుకొని మూడు వంశములను పవిత్రము చేయును. ఎవరైతే వారణాసి యందు మహాదేవుడగు శివుని స్తోత్రము చేయుదురో, పూజింతురో; (53)

వారు అన్ని పాపముల నుండి విడుదల పొందినవారై గణశ్వరులగుదురని తెలియవలెను. ఇతర విధాల యాగము వలన కాని, జ్ఞానయోగము వలన, సన్యాసము వలన, మరే ఉపాయము వలన కాని; (54)

పరమమైన ఆ స్థానము పొందబడదు. వేయి జన్మలతో గూడా అది సాధ్యము కాదు. ఎవరు మహాదేవుని యందు భక్తి కలవారై వారణాసి యందు నివసింతురో; (55)

వారు ఒక్క జన్మముతోనే పరమమైన మోక్ష పదమును పొందుదురు. ఎక్కడ ఒక్క జన్మచేతనే యోగము, జ్ఞానము, మోక్షము లభించునో అది అవిముక్తము; (56)

అవిముక్త క్షేత్రమును చేరి మరల ఇంకొక తపోవనమునకు వెళ్ళరాదు. అందువలన నాచేత అది విడువబడనిదై అవిముక్తమని ప్రసిద్ధమైనది. (57)

తదేవ గుహ్యం గుహ్యానా మేత ద్విజ్ఞాయ ముచ్యతే | జ్ఞాన ధ్యాన నివిష్టానాం పరమానన్ద మిచ్ఛతామ్‌ || || 58 ||

యా గతి ర్విహితా సుభ్రు సా విముక్తే మృతస్య తు | యాని కా న్యవిముక్తాని దేవై రుక్తాని నిత్యశః || || 59 ||

పురీ వారాణసీ తేభ్యః స్థానేభ్యో7 ప్యధికా శుభా | యత్ర సాక్షా న్మహాదేవో దేహాన్తే7క్షయ్య మీశ్వరః || || 60 ||

వ్యాచష్టే తారకం బ్రహ్మ తథైవ హ్యవిముక్తకమ్‌ | యత్త త్పరతరం తత్త్వ మవిముక్త మితి స్మృతమ్‌ || || 61 ||

ఏకేన జన్మనా దేవి వారాణస్యాం త దాప్యతే | భ్రూమధ్యే నాభిమధ్యే చ హృదయే7పి చ మూర్థని || || 62 ||

అదియే రహస్యములలో మిక్కిలి రహస్యమైనది. దీనిని తెలిసికొని ముక్తిని పొందవచ్చును. సర్వోత్తమమైన ఆనందమును కోరుచు, జ్ఞానము నందు, ధ్యానము నందు నిమగ్నులైనవారికి; (58)

ఓదేవీ! ఏ పుణ్యగతి చెప్పబడినదో, అది అవిముక్త క్షేత్రములో మరణించిన వానికి లభించును. ఏవైతే అవిముక్త స్థలములుగా దేవతలచేత నిత్యముగా తెలుపబడినవో; (59)

వానిలో అన్నిటికంటె వారణాసి పట్టణము ఎక్కువ శుభదాయకమైనది. అచ్చట సాక్షాత్తుగా మహాదేవుడు నివసించుచున్నాడు. దేహావసానము కలిగినప్పుడు నాశరహితమైన స్థానమున ఈశ్వరుడు ఎచట తారక బ్రహ్మమును ఉపదేశించునో, అట్లే అవిముక్త క్షేత్రమును గూర్చి, అది అన్నిటికంటె ఉత్తమమైన తత్త్వ స్వరూపము కావున అవిముక్తమని చెప్పబడుచున్నది; (60, 61)

దేవీ! ఒక్క జన్మతోనే వారాణసి యందు అది పొందబడును. కనుబొమ్మల మధ్య యందు, నాభి మధ్య భాగములో, రొమ్మునందు, శిరస్సు నందు కూడా; (62)

యథా విముక్త మాదిత్యే వారాణస్యాం వ్యవస్థితమ్‌ | వరణాయా స్తథా హ్యస్యా మధ్యే వారాణసీ పురీ || || 63 ||

తత్రైవ సంస్థితం తత్త్వం నిత్య మే వా ముక్తికమ్‌ | వారాణస్యాః పరం స్థానం న భూతం న భవిష్యతి || || 64 ||

యథా నారాయణో దేవో మహాదేవా దివే శ్వరాత్‌ | తత్ర దేవాః సగన్థర్వాః సయక్షోరగరాక్షసాః || || 65 ||

ఉపాసతే మాం సతతం దేవదేవః పితామహః | మహాపాతకినో యే చ యే తేభ్యః పాపకృత్తమాః || || 66 ||

వారాణసీం సమాసాద్య తే యాన్తి పరమాం గతిమ్‌ | తస్మా న్ముముక్షు ర్నియతో వసే చ్చామరణాన్తి కమ్‌ || || 67 ||

సూర్యమండలము నందు ఉన్నట్లుగానే వారాణసియను అవిముక్త క్షేత్రమందు ఆ పరతత్త్వము నిలిచియున్నది. వరణ మరియు అసి అనునదుల మధ్య వారాణసి అను పట్టణమున్నది. (63)

అక్కడనే పరతత్త్వమైన అవిముక్తకము నెలకొని ఉన్నది. వారాణసి కంటే శ్రేష్ఠమైన స్థానము ఇంతకు పూర్వము లేదు, ఇక ముందు ఉండబోదు. (64)

భగవంతుడగు నారాయణుడు మహాదేవుడగు ఈశ్వరుని వలన నిలిచియున్నట్లు అక్కడ గంధర్వులు, యక్షులు, నాగులు రాక్షసులతో కూడిన దేవతలు; (65)

నన్ను ఎల్లప్పుడు సేవింతురు. దేవదేవుడగు పితామహుడు అక్కడ వసించును. గొప్ప పాపము చేసినవారు, వారికంటె అధిక పాపాత్ములు కూడా ఎవరు కలరో; (66)

వారు వారాణసిని చేరుకొని ఉత్తమమైన ముక్తి పదమును పొందుదురు. అందువలన మోక్షమును కోరుచున్న మానవుడు నియమబద్ధుడై మరణ పర్యంతము కాశిలో నివసించవలెను. (67)

వారాణస్యాం మహాదేవి జ్ఞానం లబ్ధ్వావిముచ్యతే | కిన్తు విఘ్నా భవిష్యన్తి పాపోపహతచేతసామ్‌ || || 68 ||

తతో నైవ చరే త్పాపం కాయేన మనసా గిరా | ఏత ద్రహస్యం వేదానాం పురాణానాం ద్విజోత్తమాః || || 69 ||

అవిముక్తాశ్రయం జ్ఞానం న కిఞ్చి ద్వేద్మి తత్పరమ్‌ | దేవతానా మృషీణాఞ్చ శృణ్వతాం పరమేష్ఠినామ్‌ || || 70 ||

దేవ్యై దేవేన కథితం సర్వపాపవినాశనమ్‌ | యథా నారాయణః శ్రేష్ఠో దేవానాం పురుషోత్తమః || || 71 ||

యథేశ్వరాణాం గిరిశః స్థానానాం చైత దుత్తమమ్‌ | యైః సమారాధితో రుద్రః పూర్వస్మి న్నేవ జన్మని || || 72 ||

ఓ మహాదేవీ! వారాణసి పట్టణములో మనుష్యుడు జ్ఞానమును పొంది విముక్తుడగును. కాని పాపముచేత ఆక్రమింపబడిన మనస్సు కల మానవులకు ఆటంకములు కలుగును. (68)

అందువలన శరీరముతోకాని, మనస్సుతోకాని, మాటతోకాని పాపమును చేయనే చేయరాదు. బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఇది వేదముల, పురాణముల యొక్క సారభూతమైన రహస్యము. (69)

జ్ఞానమనునది అవిముక్త స్థలము నాశ్రయించి యున్నది. దానికంటె భిన్నమైనది ఏదియు నేనెరుగను. శ్రేష్ఠులైన దేవతలు, ఋషులు వినుచుండగా; (70)

ఈశ్వరునిచేత దేవి కొరకు, అన్ని పాపములను నశింపజేయునదగు ఈ జ్ఞానము తెలుపడినది. దేవతలందరిలో పురుషోత్తముడగు నారాయణుడు ఎట్లుశ్రేష్ఠుడో; (71)

ప్రభువులందరిలో పరమేశ్వరుడెట్లు శ్రేష్ఠుడో, అట్లే అన్ని స్థానములలో అవిముక్తము ప్రశస్తతమము. ఎవరిచేతనైతే రుద్రుడు పూర్వజన్మమందే బాగుగా పూజింపబడెనో; (72)

తే విన్దన్తి పరం క్షేత్ర మవిముక్తం శివాలయమ్‌ | కలికల్మష సమ్భూతా యేషాముపహతా మతిః || || 73 ||

న తేషాం వీక్షితుం శక్యం స్థానం త త్పరమేష్ఠినః | యే స్మరన్తి సదా కాలం విన్దన్తి చ పురీ మిమామ్‌ || || 74 ||

తేషాం వినశ్యతి క్షిప్ర మిహాముత్ర చ పాతకమ్‌ | యాని చేహ ప్రకుర్వన్తి పాతకాని కృతాలయాః || || 75 ||

నాశ##యే త్తాని సర్వాణి తేన కాలతనుః శివః | ఆగచ్ఛతా మిదం స్థానం సేవితుం మోక్షకాంక్షిణామ్‌ || || 76 ||

మృతానాం వై పునర్జన్మ న భూయో భవసాగరే | తస్మా త్సర్వప్రయత్నేన వారాణస్యాం వసే న్నరః || || 77 ||

అట్టివారు శివునికి నివాసమైన అవిముక్తమును గొప్ప క్షేత్రముగా తెలిసికొందురు. ఎవరి యొక్క బుద్ధి కలియుగపు పాపముల ప్రభావముచే కలుషితమైనదో; (73)

అటువంటి వారికి పరమేశ్వరుని యొక్క అవిముక్త స్థానము చూచుటకు శక్యము కాదు. కాల రూపుడైన శివుని ఎవరు ఎల్లప్పుడు స్మరింతురో వారు ఈ పురమును చేరుకొందురు. (74)

వారికి ఈ లోకములోను, పరలోకములోను సంభవించిన పాపమంతయు నశించును. ఇక్కడ నివాస మేర్పరచుకొన్న వారు కూడా ఏ పాపముల నాచరింతురో, (75)

వానినన్నింటిని కూడా కాల స్వరూపుడైన పరమశివుడు నశింపజేయును. మోక్షమునందు కోరిక గలిగి, సేవించుట కొరకు ఈ క్షేత్రమునకు వచ్చు వారికి, (76)

ఇక్కడ మరణించిన వారికి మరల సంసార బంధమనెడు సముద్రములో పుట్టుకలేదు. అందువలన అన్ని విధముల ప్రయత్నముతో మనుష్యుడు వారాణసిలో నివసించవలెను. (77)

యోగీ వా ప్యథవా7 యోగీ పాపీ వా పుణ్యకృత్తమః | న లోక వచనా త్పిత్రో ర్నచైవ గురువాదతః || || 78 ||

మతి రుత్ర్క మణీయా స్యా దవిముక్తాగతిం ప్రతి | || 79 ||

సూత ఉవాచ :-

ఏవ ముక్త్వా థ భగవాన్‌ వ్యాసో వేద విదాం వరః | సహైవ శిష్యప్రవరై ర్వారాణస్యాం చచార హ ||

ఇతి శ్రీ కూర్మ పురాణ వారాణసీ మాహాత్మ్యం నామ ఏకత్రింశో7ధ్యాయః

యోగము కలవాడు కాని, అయోగి కాని, పాపాత్ముడైనను, పుణ్యవంతులలో శ్రేష్ఠుడైనప్పటికి, జనుల మాట ననుసరించియైనను, తల్లిదండ్రులు లేక గురువు యొక్క మాటవలన కాని అవిముక్త క్షేత్రపు పుణ్యగతిని గూర్చి బుద్ధిని సంశయ మార్గమునకు మరలించగూడదు.'' అని చెప్పి వేద విదులలో శ్రేష్ఠుడు, భగవంతుడు అగు వేదవ్యాసుడు శిష్య సమూహముతో గూడ వారణాసి పట్టణమునందు సంచరించెను. (78, 79)

శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యము అనడు ముప్పది యొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters