Sri Koorma Mahapuranam    Chapters   

త్రయస్త్రింశో7ధ్యాయః

సూత ఉవాచ :-

సమాభాప్య మునీ న్ధీమా న్దేవదేవస్య శూలినః | జగామ లిఙ్గం త ద్ద్రష్టుం కపర్దీశ్వర మవ్యయమ్‌ || || 1 ||

స్నాత్వా తత్ర విధానేన తర్పయిత్వా పితౄ న్ద్విజాః | పిశాచమోచనే తీర్థే పూజయామాస శూలినమ్‌ || || 2 ||

తత్రా శ్చర్య మపశ్యం స్తే మునయో గురుణా సహ | మేనిరే క్షేత్ర మాహాత్మ్యం ప్రణము ర్గిరిశం హరమ్‌ || || 3 ||

కశ్చి దభ్యాజగామేమం శార్దూలో ఘోరరూపధృక్‌ | మృగీ మేకాం భక్షయితుం కపర్దీశ్వర ముత్తమమ్‌ || || 4 ||

తత్ర సా భీతహృదయా కృత్వా కృత్వా ప్రదక్షిణమ్‌ | ధావమానా సుసంభ్రాన్తా వ్యాఘ్రస్య వశ మాగతా || || 5 ||

ముప్పది మూడవ అధ్యాయము

సూతుడిట్లనెను :-

బుద్ధిమంతుడైన వ్యాసముని మునులతో వీడ్కోలు పొంది దేవదేవుడైన శివుని యొక్క నాశరహితమైన కపర్దీశ్వర లింగమును చూచుటకువెళ్ళెను. (1)

విప్రులారా! అతడక్కడ విధి ప్రకారము స్నానము, పితృతర్పణముచేసి, పిశాచమోచనమనే పేరుగల తీర్థములో శివుని పూజించెను. (2)

అక్కడ ఆ మునులు తమ గురువుతో కూడ అద్భుతమును చూచిరి. క్షేత్ర మహాత్త్వముగా తలచి గిరిశుడైన శివునికి నమస్కారము చేసిరి. (3)

అప్పుడు వారి దగ్గరికి భయంకర రూపము కల ఒక పులి కపర్దీశ్వర లింగము దగ్గర ఒక ఆడ జింకను చంపుటకు వచ్చెను. భయముతో కూడిన మనస్సుకల ఆ జింక ప్రదక్షిణములు చేసి తత్తరపాటుతో పరుగెత్తుతూ పులిచేతిలో చిక్కెను. (4, 5)

తాం విదార్య నఖై స్తీక్షెణః శార్దూలః సుమహాలః | జగామ చాన్య ద్విజనం స దృష్ట్వా తాన్మునీశ్వరాన్‌ || || 6 ||

మృతమాత్రా చ సా బాలా కపర్దీశాగ్రతో మృగీ | అదృశ్యత మహాజ్వాలా వ్యోమ్ని సూర్యసమప్రభా || || 7 ||

త్రినేత్రా నీలకణ్ఠా చ శశాఙ్కాఙ్కితశేఖరా | వృషాధిరూఢా పురుషై స్తాదృశై రేవ సంయుతా || || 8 ||

పుష్పవృష్టిం విముఞ్చన్తి ఖేచరా స్తస్య మూర్థని | గణశ్వరః స్వయం భూత్వా న దృష్ట స్త త్‌క్షణా త్తతః || || 9 ||

దృషై#్వ త దాశ్చర్యవరం జైమిని ప్రముఖా స్తదా | కపర్దీశ్వర మాహాత్మ్యం పప్రచ్ఛు ర్గురు మచ్యుతమ్‌ || || 10 ||

చాలా ఎక్కువ బలము కల శార్దూలము వాడియైన తన గోళ్ళతో ఆ జింకను చీల్చి, ఆ మునులను చూచి మరొక నిర్జన ప్రదేశానికి వెళ్ళినది. (6)

ఆ హరిణి కపర్దీశ లింగము ముందు భాగంలో మరణించిన వెంటనే ఆకాశంలో సూర్యునితో సమాన కాంతిగల గొప్ప జ్వాలా రూపంలో కన్పించెను. (7)

అది మూడు కన్నులు కలిగి, నల్లని మెడకలదై, చంద్రకళతో కూడిన తల కలదై, వృషము నధిరోహించి అటువంటి ఆకారము కల పురుషులతోకలిసి ఉండెను. (8)

ఆకాశ చారులైన దేవతలు ఆ జింక తలపై అప్పుడు పుష్పవర్షము కురిపించిరి. తరువాత ఆ జ్వాల గణశ్వర రూపాన్ని పొంది అదృశ్యమైనది. (9)

ఈ గొప్ప అద్భుత దృశ్యాన్ని చూచి జైమిని మొదలగు వారు తమ గురువైన వేదవ్యాస మునిని కపర్దీశ్వర క్షేత్ర మాహాత్మ్యము తెలుపుడని ప్రశ్నించిరి. (10)

తేషాం ప్రోవాచ భగవా న్దేవాగ్రే చోపవిశ్య సః | కపర్దీశస్య మాహాత్మ్యం ప్రణమ్య వృషధ్వజమ్‌ || || 11 ||

(స్మృత్యైవా శేషపాపౌఘం క్షిప్ర మస్య వినశ్యతి | కామక్రోధాదయో దోషా వారాణస్యాం నివాసినః ||

విఘ్నాః సర్వే వినశ్యన్తి కపర్దీశ్వర పూజనాత్‌ | తస్మా త్సదైవ ద్రష్టవ్యం కపర్దీశ్వర ముత్తమమ్‌ ||)

ఇదం దేవస్య తల్లిఙ్గం కపర్దీశ్వర ముత్తమమ్‌ | పూజితవ్యం ప్రయత్నేన స్తోతవ్యం వైదికైః స్తవైః || || 12 ||

ధ్యాయతా మత్ర నియతం యోగినాం శాన్తచేతసామ్‌ | జాయతే యోగసిద్ధిశ్చ షణ్మాసేన న సంశయః || || 13 ||

భగవంతుడైన వ్యాసముని కపర్దీశ్వర స్వామి ఎదురుగా కూర్చుని వృష ధ్వజుడైన శివునికి నమస్కరించి, ఆ మునులను గూర్చి కపర్దీశుని గొప్పతనము నిట్లు వివరించెను. (11)

ఈ కపర్దీశ్వరుని స్మరణ మాత్రము చేతనే సమస్త పాప సమూహము వెంటనే నశిస్తుంది. కామము, క్రోధము మొదలుగ కల దోషాలు, సమస్త విఘ్నములు వారణాసి యందు నివసించే యీ దేవుని పూజించుట వలన నశించును. అందువలన ఎల్లప్పుడు కపర్దీశ్వరుణ్ణి దర్శించవలెను. (ఇది ప్రక్షిప్త భాగము)

ఇది ఉత్తమమైన కపర్దీశ్వర దేవుని లింగము. ప్రయత్నపూర్వకంగా పూజింపదగినది. వైదిక స్తోత్రాలతో కొనియాడదగినది. (12)

శాంతమైన మనస్సు కలిగి నిత్యముగా ధ్యానించు యోగులకు ఆరు నెలల కాలంలో యోగ సిద్ధి లభించును ఇందులో సందేహము లేదు. (13)

బ్రహ్మ హత్యాది పాపాని వినశ్య న్త్యస్య పూజనాత్‌ | పిశాచమోచనే కుణ్డ స్నాత స్యాత్ర సమీపతః || || 14 ||

అస్మిన్‌ క్షేత్రే పురా విప్రా స్తపస్వీ శంసిత వ్రతః | శఙ్కుకర్ణ ఇతి ఖ్యాతః పూజయామాస శూలినమ్‌ || || 15 ||

జజాప రుద్ర మనిశం ప్రణవం రుద్రరూపిణమ్‌ | పుష్పధూపాదిభిః స్తోత్రైః సమస్కారైః ప్రదక్షిణౖః || || 16 ||

ఉవాస తత్ర యోగాత్మాకృత్వా దీక్షాన్తు నైష్ఠికీమ్‌ | కదాచి దాగతం ప్రేతం పశ్యతి స్మ క్షుధాన్వితమ్‌ || || 17 ||

అస్థిచర్మపినద్థాఙ్గం నిశ్వసన్తం ముహుర్ముహుః | తం దృష్ట్వా స మునిశ్రేష్ఠః కృపయా పరయా యుతః || || 18 ||

బ్రహ్మ హత్య మొదలైన పాపములు ఈ దేవుని పూజించుట వలన నశించును. ఇక్కడికి సమీపములోని పిశాచమోచన మనుకుండములో స్నానము చేసినవానికి కూడా పాపములన్నీ తొలగును. (14)

ద్విజులారా! ఈ క్షేత్రములో పూర్వము ప్రశంసింపబడిన నియమము కల శంకుకర్ణుడని ప్రసిద్ధుడైన ఒక ముని నివసించి శంకరుని పూజించెను. (15)

ఆ ముని రుద్రుని గూర్చి, రుద్ర స్వరూపమైన ఓంకారమునుఎల్లప్పుడూ జపించెను. పుష్పములు, ధూపము మొదలగు ఉపచారములతో, స్తోత్రములతో, నమస్కార ప్రదక్షిణములతో అతడు పూజించెను. (16)

ఆ శంకుకర్ణుడు అక్కడ యోగసాధన పరుడై, నిష్ఠాపూర్వకమైన దీక్ష నవలంబించి అక్కడ ఉండెను. ఒకానొక సమయమున ఆకలితో కూడిన, చర్మముతో కప్పబడిన అవయవములు కలిగిన, మాటి మాటికి నిట్టూర్పులు విడుచుచున్న, తనవద్దకు వచ్చిన ఒక ప్రేతమును చూచెను. ఆ ప్రేతమును చూచి ముని శ్రేష్ఠుడైన అతడు మిక్కిలి దయతో కూడినవాడాయెను. (17, 18)

ప్రోవాచ కో భవా న్కస్మా ద్దేశా ద్దేశ మిమం గతః | తసై#్మ పిశాచః క్షుధయా పీడ్యమానో7బ్రవీ ద్వచః || || 19 ||

పూర్వజన్మన్యహం విప్రో ధనధాన్యసమన్వితః | పుత్రపౌత్రాదిభి ర్యుక్తః కుటుమ్బభరణోత్సుకః || || 20 ||

న పూజితా మయా దేవా గావో7ప్యతిథయ స్తదా | న కదాచి త్కృతం పుణ్య మల్పం వా స్వల్పమేవ వా || || 21 ||

ఏకదా భగవా న్రుద్రో గోవృషేశ్వరవాహనః | విశ్వేశ్వరో వారాణస్యాం దృష్టః స్పృష్టో నమస్కృతః || || 22 ||

తదా చిరేణ కాలేన పఞ్చత్వ మహ మాగతః | న దృష్టం త న్మహాఘోరం యమస్య వదనం మునే || || 23 ||

తరువాత నీవు ఎవరవు? ఏ ప్రదేశము నుండి ఇక్కడికి వచ్చితివి? అని ప్రశ్నించగా ఆ పిశాచము ఆకలి బాధతో పీడింపడుచున్నట్లు ఇట్లు పలికెను. (19)

పూర్వజన్మములో నేను ధన ధాన్యములతో కూడిన ఒక బ్రాహ్మణుడను. కొడుకులు, మనుమలతోకూడి, కుటుంబ భారమును వహించుట యందాసక్తి కలిగియుంటిని. (20)

నాచేత దేవతలు పూజింపబడలేదు. గోవులుకాని, అతిథులుకాని సత్కరింపబడలేదు. ఎప్పుడూ కూడా నాచేత కొంచెమైనను పుణ్యకార్యము చేయబడలేదు. (21)

ఒకప్పుడు వృషభవాహనుడైన భగవంతుడగు రుద్రుడు, విశ్వేశ్వరుడు వారణాసి యందు నాచేత చూడబడి స్పృశింపబడి నమస్కారముచే పూజింపతబడినాడు. (22)

తరువాత చాలా కాలమునకు నేను మరణమును పొందితిని. ఓ మునీశ్వరా! అయినప్పటికి నాచేత భయంకరమైన యమలోకము చూడబడలేదు. (ఒక్కమారు విశ్వేశ్వర దర్శన, నమస్కారములచేత యమలోకమునకు దూరుడనైతినని భావము)

ఈదృశీం యోని మాపన్నః పైశాచీం క్షుధయార్దితః | పిపాసయా పరిక్రాన్తో న జానామి హితాహితమ్‌ || || 24 ||

యది కఞ్చి త్సముద్ధర్తు ముపాయం పశ్యసి ప్రభో | కురుష్వ తం నమ స్తుభ్యం త్వా మహం శరణం గతః || || 25 ||

ఇత్యుక్తః శఙ్కుకర్ణో7థ పిశాచ మిదమ బ్రవీత్‌ | త్వాదృశో నహి లోకే7స్మి న్విద్యతే పుణ్యకృత్తమః || || 26 ||

యత్త్వయా భగవా న్పూర్వం దృష్టో విశ్వేశ్వరః శివః | సంస్పృష్టో వన్దితో భూయః కో7న్య స్త్వత్సదృశో భువి || || 27 ||

తేన కర్మవిపాకేన దేశ మేతం సమాగతః | స్నానం కురుష్వ శీఘ్రం త్వ మస్మిన్‌ కుణ్డ సమాహితః || || 28 ||

ఇటువంటి పుట్టుకను పిశాచ జాతికి సంబంధించిన దానిని పొంది ఆకలిచే పీడింపబడి, దాహముచే ఆక్రమింపబడి ఆ బాధతో మంచి చెడులను గుర్తించకపోతిని. (24)

ఓ మహాత్మా! నాకీ జన్మనుండి విముక్తి కలిగించుటకు నీవేదైన ఉపాయమును కునుగొన్న యెడల దానిని నా విషయములో అనుగ్రహింపుము. నీకు నమస్కారము. నిన్ను నేను శరణు పొందుచున్నాను. (25)

ఇట్లు పలుకబడిన ఆ శంకుకర్ణుడు పిశాచమును గూర్చి యిట్లు పలికెను. ఓయీ! ఈ లోకములో పుణ్యవంతులలో శ్రేష్ఠుడు నీ వంటివాడు మరియొకడు లేడు. (26)

ఎందుకనగా, నీచేత పూర్వము భగవంతుడు, ప్రపంచమున కధీశ్వరుడు అగు శివుడు స్వయముగా చూడబడినాడు, స్పృశింపబడి ప్రణామము స్వీకరించినాడు. భూమిమీద నీతో సమానుడు ఇతరుడెవ్వడున్నాడు? (27)

కావున పూర్వకర్మ ఫలరూపముగా నీవీ దేశమునకు వచ్చితివి. నీవు సావధానుడవై శీఘ్రముగా ఈ పుష్కరిణిలో స్నానమును చేయుము. (28)

యే నేమాం కుత్సితాం యోనిం క్షిప్ర మేవ ప్రహాస్యసి | || 29 ||

స ఏవ ముక్తో మునినా పిశాచో దయావతాదేవవరం త్రినేత్రమ్‌ | స్మృత్వా కపర్దీశ్వర మీశితారం చక్రే సమాధాయ మనో7 వగాహమ్‌ || || 30 ||

తదా వగాహా న్మునిసన్నిధానే మమార దివ్యాభరణోపపన్నః | అదృశ్యతా ర్కప్రతిమే విమానే శశాఙ్కచిహ్నాఙ్కితచారుమౌళిః || || 31 ||

దానితో నీవు తొందరలోనే నింద్యమైన యీ పిశాచ రూపమును విడువగలవు. (29)

ఆ పిశాచరూపుడు కరుణాళువైన శంకుకర్ణమునిచేత ఇట్లు చెప్పబడినవాడై, దేవతలలో శ్రేష్ఠుడు, మూడు కన్నులు కలవాడు, విశ్వప్రభువైన కపర్దీశ్వర దేవుని స్మరించి, మనస్సును సావధానము చేసికొని ఆ కుండములో స్నానము చేసెను. (30)

ఆ మునిసమీపములో కుండములో స్నానము చేయుట వలన పిశాచరూపము నశించిపోయెను. అప్పుడతడు శ్రేష్ఠములైన ఆభరణములతో అలంకరింపబడినవాడై సూర్యునితో సమానముగా ప్రకాశించుచున్న విమానమునందు చంద్రకళతో కూడియున్న అందమైన శిరోభాగము కలవాడై సాక్షాత్కరించెను. (31)

విభాతి రుద్రై రుదితో దివఃస్థైః సమావృతో యోగిభి రప్రమేయైః | స వాలఖిల్యాదిభి రేష దేవో యథోదయే భాను రశేషదేవైః || || 32 ||

స్తువన్తి సిద్ధా దివి దేవసంఘా నృత్యన్తి దివ్యాప్సరసో7 భిరామాః | ముఙ్చన్తి వృష్టిం కుసుమాలిమిశ్రాం గన్థర్వవిద్యాథరకిన్నరాద్యాః || || 33 ||

సంస్తూయమానో7థ మునీన్ద్రసంఘై రవాప్య బోధం భగవత్ప్రసాదాత్‌ |

సమావిశ న్మణ్డల మేవ మగ్ర్యం త్రయీమయం యత్ర విభాతి రుద్రః || || 34 ||

స్వర్గము నందున్నటువంటి రుద్రులతో, వర్ణించుటకు శక్యముకాని మహిమకల యోగులతో కూడియున్నవాడై ప్రకాశించెను. సూర్యుడు తన ఉదయ కాలములో వాఖిల్యాదిమునులతో, సమస్త దేవతలతో పరివృతుడై ఎట్లు ప్రకాశించునో, అతడట్లుండెను. (32)

ఆకాశమునందు సిద్ధులు స్తోత్రము చేయుచుండిరి. దేవతా సమూహములు కొనియాడినవి. అందమైన అప్సరసలు నాట్యము చేసిరి. గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు మొదలగు వారు పుష్పసమూహముతో కూడిన వర్షమును కురియించిరి. (33)

ఆ మునిసమూహములచేత కొనియాడబడినవాడై, భగవంతుని అనుగ్రహము వలన దివ్యజ్ఞానమును పొంది, శ్రేష్ఠమైనది, వేదత్రయాత్మకమైనది, రుద్రదేవుడు స్వయముగా ఎక్కడ ప్రకాశించునో ఆ దివ్యపదమును ప్రవేశించినాడతడు. (34)

దృష్ట్వా విముక్తం స పిశాచభూతం మునిః ప్రహృష్టో మనసా మహేశమ్‌ |

విచిన్త్య రుద్రం కవి మేవ మగ్ర్యం ప్రణమ్య తుష్టావ కపర్దినం తమ్‌ || || 35 ||

శఙ్కుకర్ణ ఉవాచ :-

నమామి నిత్యం పరతః పరస్తా ద్గోప్తార మేకం పురుషం పురాణమ్‌ | వ్రజామి యోగేశ్వర మీశితార మాదిత్య మగ్నిం కలిలాధిరూఢమ్‌ || || 36 ||

త్వాం బ్రహ్మపారం హృది సన్నివిష్టం హిరణ్మయం యోగిన మాదిహీనమ్‌ |

వ్రజామి రుద్రం శరణం దివిస్థం మహామునిం బ్రహ్మపరం పవిత్రమ్‌ || || 37 ||

పిశాచ రూపము నుండి విడుదల పొందిన అతనిని చూచి ఆ శంకుకర్ణముని సంతోషించినవాడై మహేశ్వరుడైన శివుని మనస్సుతో ధ్యానించి, సర్వశ్రేష్ఠుడు, కవి అయిన ఆ కపర్దీశ్వరునికి నమస్కరించి స్తోత్రము చేసెను. (35)

పరమునకంటె అధికుడవైన రక్షకుడవు, అసహాయుడవు, పురాణపురుషుడవగు నిన్ను గూర్చి నమస్కరించుచున్నాను. యోగమునకు ప్రభువు, ఈశ్వరుడు, అగ్ని సూర్యస్వరూపుడు, గహన స్థానము నధిష్ఠించిన దేవుని ఆశ్రయించుచున్నాను. (36)

వేదాంతగమ్యుడవు, హృదయమందు అధిష్ఠించినవాడవు, హిరణ్యయరూపుడవు, యోగివి, జన్మరహితుడవు, ఆకాశమందున్న గొప్ప మునీశ్వరుడవు, పవిత్రుడవు, బ్రహ్మకు అతీతుడవు అగురుద్రుని నిన్ను శరణము పొందుచున్నాను. (37)

సహస్రపాదాక్షిశిరో7 భియుక్తం సహస్రబాహుం తమసః పరస్తాత్‌ |

త్వాం బ్రహ్మపారం ప్రణమామి శమ్భుం హిరణ్యగర్భాధిపతిం త్రినేత్రమ్‌ || || 38 ||

యతః ప్రసూతి ర్జగతో వినాశో యేనా హృతంసర్వ మిదం శివేన | తం బ్రహ్మపారం భగవన్త మీశం ప్రణమ్య నిత్యం శరణం ప్రపద్యే|| || 39 ||

అలిఙ్గ మాలోకవిహీనరూపం స్వయంప్రభుం చిత్ర్పతిమైకరూపమ్‌ |

తం బ్రహ్మపారం పరమేశ్వరం త్వాం నమస్కరిష్యే న యతో7న్యదస్తి || || 40 ||

అనంతములైన పాదములు, కన్నులు, శిరస్సులతో కూడియున్నవాడవు, అనంతభుజములు కలవాడవు, తమో గుణమునకు అతీతుడవు, వేదముల యొక్క లక్ష్యమైనవాడవు, హిరణ్యగర్భుడగు బ్రహ్మకు అధిపతివి, మూడు కన్నులు కలవాడవును అగు శంభునకు నీకు ప్రణమిల్లు చున్నాను. (38)

ఎవనివలన ఈ విశ్వము యొక్క పుట్టుక, నాశము జరుగుచున్నదో, ఏ శివుని చేత ఈ సమస్తము కల్పించడినదో, అటువంటి వేదాంత వేద్యుడవైన, భగవంతుడగు ఈశ్వరునికి ప్రణామముచేసి ఎల్లప్పుడు శరణాగతుడనై యుందును. (39)

చిహ్నరహితుడు, వెలుతురున కందని రూపము కలవాడు, తనంతతాను ప్రభువు, జ్ఞాన ప్రతిమయే ముఖ్యరూపముగా కలవాడు, వేదాంత గమ్యుడు, పరమేశ్వరుడును అగు నీకు నమస్కరింతును. నీకంటె అన్యము మరియేదియు లేదు కదా. (40)

యం యోగిన స్త్యక్తసీజయోగా ల్లబ్ధ్వా సమాధిం పరమాత్మభూతాః |

పశ్యన్తి దేవం ప్రణతో7స్మి నిత్యం తద్ర్బహ్మపారం భవతఃస్వరూపమ్‌ || || 41 ||

న యత్ర నామాని విశేషతృప్తి ర్న సందృశే తిష్ఠతి యత్స్వరూపమ్‌ |

తం బ్రహ్మపారం ప్రణతో7స్మి నిత్యం స్వయంభువం త్వాం శరణం ప్రపద్యే || || 42 ||

యద్వేద వేదాభిరతావిదేహం సబ్రహ్మవిజ్ఞాన మభేద మేకమ్‌ | పశ్య న్త్యకేకం భవతః స్వరూపం తద్ర్బహ్మపారం ప్రణమామి నిత్యమ్‌ || || 43 ||

యోగులు విడువబడిన బీజ సంబంధము కలవారై, ధ్యానసమాధిని పొంది, పరమాత్మరూపులై ఏ పరబ్రహ్మమును దర్శింతురో, బ్రహ్మాతీతమైన నీయొక్క స్వరూపమునకు ఎల్లప్పుడు నమస్కరింతును. (41)

ఏ తత్త్వవిషయములో నామములు తృప్తిని కలిగించవో, ఏ స్వరూపము ఇంద్రియ జ్ఞానమునకు గోచరము కాదో, స్వయంభువు, బ్రహ్మపారము అగు నిన్ను శరణు పొంది, నిత్యము వందన మాచరింతును. (42)

వేదములందు శ్రద్ధకలవారు, దేహశూన్యము, భేదరహితము, అఖండము అగు ఏ తత్త్వమును అనేక విధములుగా దర్శింతురో, బ్రహ్మపారమైన నీ యొక్క స్వరూపమును ఎల్లవేళల నమస్కరింతును. (43)

యతః ప్రధానం పురుషః పురాణో వివర్తతే యం ప్రణమన్తి దేవాః |

నమామి తం జ్యోతిషి సంనివిష్టం కాలం బృహన్తం భవతః స్వరూపమ్‌ || || 44 ||

వ్రజామి నిత్యం శరణం మహేశమ్‌ స్థాణుం ప్రపద్యే గిరిశం పురాణమ్‌ | || 45 ||

శివం ప్రపద్యే హర మిన్దుమౌళిం పినాకినం త్వాం శరణం వ్రజామి || || 46 ||

స్తుత్వైవం శజ్కుకర్ణో7 సౌ భగవన్తం కపర్దినమ్‌ | పపాత దణ్డవ ద్భూమౌ ప్రోచ్చరన్‌ ప్రణవం శివమ్‌ || || 47 ||

తత్‌క్షణా త్పరమం లిఙ్గం ప్రాదుర్భూతం శివాత్మకమ్‌ | జ్ఞాన మానన్ద మద్వైతం కోటికాలాగ్నిసన్నిభమ్‌ || || 47 ||

ఎవరి నుండి ప్రధాన తత్త్వము, పురాణ పురుషుడు పరిణామము చెందుచుండునో, దేవతలు ఎవనికి నమస్కరింతురో, తేజోమయ రూపములో నిలిచియున్న, మహాకాలరూపమైన నీయొక్క స్వరూపమునకు నమస్కరించుచున్నాను. (44)

మహేశ్వరుని ఎల్లప్పుడు శరణము పొందుదును. పురాణ పురుషుడు, పర్వతము నందు శయనించు శివుని ఆశ్రయింతును. చంద్రుని శిరస్సున ధరించిన శివుని ఆశ్రయింతును. పినాకమును ధరించు నిన్ను శరణు పొందుచున్నాను. (45)

శంకుకర్ణుడు ఈ విధముగా భగవంతుడగు శివుని స్తోత్రము చేసి, మంగళకరమైన ఓంకారము నుచ్చరించుచు నేలమీద కఱ్ఱవలె పడిపోయెను. (46)

ఆ క్షణములో వెంటనే శివ స్వరూపమైన, జ్ఞానానందాత్మకము, భేదరహితము, ప్రళయకాలపు కోటి అగ్నులతో సమానమైన శ్రేష్ఠమైన లింగము ఆవిర్భవించినది. (47)

శఙ్కుకర్ణో7థ స తదా మునిః సర్వాత్మకో7 మలః | నిలీనో విమలే లిఙ్గే తదద్భుత మివా వత్‌ || || 48 ||

ఏత ద్రహస్య మాఖ్యాతం మాహాత్మ్యం చ కపర్దినః | న కశ్చి ద్వేత్తి తమసా విద్వాన ప్యత్ర ముహ్యతి || || 49 ||

య ఇమాం శృణుయా న్నిత్యం కథాం పాపప్రణాశినీమ్‌ | భక్తః పాపవిముక్తాత్మా రుద్రసామీప్య మాప్నుయాత్‌ || || 50 ||

పఠేచ్చ సతతం శుద్ధో బ్రహ్మపారం మహాస్తవమ్‌ | ప్రాత ర్మధ్యాహ్న సమయే సయోగం ప్రా యే న్నరః || || 51 ||

ఇహైవ నిత్యం వత్స్యామో దేవదేవం కపర్దినమ్‌ | ద్రక్ష్యామః సతతం దేవం పూజయామ స్త్రిలోచనమ్‌ || || 52 ||

ఇత్యుక్త్వా భగవా న్వ్యాసః శిషై#్యః సహ మహాద్యుతిః | ఉవాస తత్ర యుక్తాత్మా పూజయన్వై కపర్దినమ్‌ || || 53 ||

ఇతి శ్రీ కూర్మపురాణ వారాణసీ మాహాత్మ్యం నామ త్రయ స్త్రింశో7ధ్యాయః

అప్పుడు ఆ శంకు కర్ణముని దైవ సంబంధమైన నిర్మల లింగములో లీనమై సర్వాత్మకుడుగా, దోషరహితుడుగా రూపొందెను. అదిచాలా ఆశ్చర్యకరమువలె సంభవించినది. (48)

కపర్దీశ్వరుని యొక్క ఈ రహస్యము, మహిమ కూడా నాచేత తెలుపడినది. తమోగుణ ప్రభావముచేత దీనిని ఎవ్వడును తెలియలేడు. పండితుడు కూడా ఈ విషయములో మోహమునకు గురియగుచున్నాడు. (49)

పాపములను నశింపజేయునట్టి యీ కథను ఏ భక్తుడు ఎల్లప్పుడు వినునో, అతడు పాపముల చేత విడవబడిన ఆత్మకలవాడై శివుని సాన్నిధ్యమును పొందును. (50)

మనుష్యుడు పరిశుద్ధుడై ఎల్లప్పుడు బ్రహ్మపారమను గొప్ప స్తోత్రమును ఉదయ, మధ్యాహ్న కాలాలలో చదువవలెను. అట్టివాడు యోగసిద్ధిని పొందగలడు. (51)

ఇక్కడనే శాశ్వతముగా నివసింపగలము. దేవతలకు దేవుడైన కపర్దీశ్వరుని దర్శింపగలము. మూడు నేత్రములు కల ఆ దేవుని ఎల్లప్పుడు పూజింతుము. (52)

మహాత్ముడగు వ్యాసముని ఈ విధముగా పలికి, గొప్ప తేజస్సుతో కూడినవాడై, శిష్యులతో కూడ ఆత్మ సంయమము కలవాడై కపర్దీశ్వరుని పూజించుచు అక్కడ నివసించెను. (53)

శ్రీ కూర్మపురాణములో వారణాసీ మాహాత్మ్యము అను పేరుగల ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters