Sri Koorma Mahapuranam    Chapters   

అథచతుస్త్రింశో7ధ్యాయః

సూత ఉవాచ :-

ఉషిత్వా తత్ర భగవాన్‌కపర్దీశాన్తికే పునః | య¸° ద్రష్టుం మధ్యమేశం బహువర్షగణా న్ప్రభుః || || 1 ||

తత్ర మన్దాకినీం పుణ్యా మృషిసఙ్ఘనివషేవితామ్‌ | నదీం విమలపానీయాం దృష్ట్వా హృష్టో7 భవ న్మునిః || || 2 ||

స తా మన్వీక్ష్య మునిభిః సహ ద్వైపాయనః ప్రభుః | చకార భావపూతాత్మా స్నానం స్నానవిధానవిత్‌ || || 3 ||

ముప్పది నాలుగవ అధ్యాయము

పూజనీయుడగు వ్యాసుడక్కడ కపర్దీశ్వరుని సమీపములో నివసించి చాలా సంవత్సరముల తరువాత మధ్యమేశ్వరుని దర్శించుటకు వెళ్ళెను. (1)

అక్కడ మునుల సమూహముచేత సేవింపబడినది, నిర్మలమైన జలము కలది, పుణ్యకరమయినది అగు గంగా నదిని చూచి వ్యాసముని సంతోషము కలవాడాయెను. (2)

ఆ వ్యాసముని మునులతో కూడా ఆ గంగానదిని చూచి భక్తిభావముచేత పవిత్రమైన హృదయము కలవాడై, స్నాన విధానము నెరిగిన అతడు విధిప్రకారము స్నానము చేసెను. (3)

(పూజయామాస లోకాదిం పుషై#్ప ర్నానావిధై ర్భవమ్‌ | ప్రవిశ్య శిష్యప్రవరైః సార్థం సత్యవతీసుతః ||)

సన్తర్ష్య విధివద్దేవా నృషీ న్పితృగణాం స్తథా | మధ్యమేశ్వర మీశాన మర్చయామాస శూలినమ్‌ || || 4 ||

తతః పాశుపతాః శాన్తా భస్మో ద్ధూలితవిగ్రహాః | ద్రష్టుం సమాగతా రుద్రం మధ్యమేశ్వర మీశ్వరమ్‌ || || 5 ||

ఓఙ్కారాసక్తమనసో వేదాధ్యయనతత్పరాః | జటిలా ముణ్డితా శ్చాపి శుద్ధయజ్ఞోపవీతినః || || 6 ||

కౌపీనవసనాః కేచి దపరే చాప్యవాససః | బ్రహ్మచర్యరతాః శాన్తా దాన్తా వై జ్ఞానతత్పరాః || || 7 ||

(లోకములకు మూలభూతుడైన శివుని మందిరమున ప్రవేశించి శిష్యులతో కూడి వెళ్ళిన వ్యాసముని, అనేక విధ పుష్పములతో పూజించెను.)

అక్కడి దేవతలను, ఋషులను, పితృదేవతలను శాస్త్ర విధి ప్రకారము తర్పణముతో పూజించి, శూలధారి, ఈశానుడు అగు మధ్యమేశ్వరుని అర్చించెను. (4)

తరువాత అక్కడి మధ్యమేశ్వర దేవుని దర్శించుటకు శాంత స్వభావులు, భస్మముతో పూయబడిన శరీరములు కలవారు అగు పాశుపతులు వచ్చి చేరిరి. (5)

ఓంకారము నందాసక్తి కల మనస్సు కలిగి, వేదముల నధ్యయనము చేయుట యందు శ్రద్ధ కలవారు, జటలను ధరించినవారు, శిరోముండనము చేయించుకున్నవారు, స్వచ్ఛమైన యజ్ఞోపవీతమును ధరించినవారు వారిలో నుండిరి. (6)

కొందరు కౌపీనములను మాత్రము ధరించిరి. మరికొందరు దిగంబరులుగా నుండిరి. వారందరు బ్రహ్మచర్య వ్రతములో నిమగ్నులై, శమము, ఇంద్రియ నిగ్రహము కలిగినవారు, జ్ఞానమునందు ఆసక్తి కలిగి యుండిరి. (7)

దృష్ట్వా ద్వైపాయనం విప్రాః శిషై#్యః పరివృతం మునిమ్‌ | పూజయిత్వా యథాన్యాయ మిదం వచన మబ్రువన్‌ || || 8 ||

కో భవాన్‌ కుత ఆయాతః సహశిషై#్య ర్మహామునే | ప్రోచుః పైలాదయః శిష్యా స్తా నృషీ న్ధర్మభావితాన్‌ || || 9 ||

అయం సత్యవతీసూనుః కృష్ణద్వైపాయనః ప్రభుః | వ్యాసః స్వయం హృషీకేశో యేన వేదాః పృథ క్కృతాః || || 10 ||

యస్య దేవో మహాదేవః సాక్షా ద్దేవః పినాకధృక్‌ | అంశాంశే నాభవ త్పుత్రో నామ్నా శుక ఇతి ప్రభుః || || 11 ||

యో వై సాక్షా న్మహాదేవం సర్వభావేన శఙ్కరమ్‌ | ప్రపన్నః పరయా భక్త్యా యస్య త ద్జాఞన మైశ్వరమ్‌ || || 12 ||

ఆ బ్రాహ్మణులు శిష్యులతో కూడియున్న వేదవ్యాసమునిని చూచి, సంప్రదాయము ననుసరించి పూజించి ఈ వాక్యమును పలికిరి. (8)

ఓ మహామునీ! మీరెవరు? శిష్యులతో గూడ ఎక్కడి నుండి వచ్చితిరి. అని ప్రశ్నించగా వ్యాసుని శిష్యుడు పైలుడు మొదలగువారు, ధర్మ స్వభావులైన ఆ ఋషులను గూర్చి యిట్లు పలికిరి. (9)

ఈయన సత్యవతి కుమారుడైన వేదవ్యాస మహాముని. ఇతడు స్వయముగా నారాయణ స్వరూపుడు. ఈయన చేతనే వేదములు విభాగము చేయబడినవి. (10)

ఎవనికి, పినాకమును ధరించిన మహాదేవుడు స్వయముగా శుకుడను పేరుతో అంశావతారముగా కుమారుడై మహానుభావుడుగా జన్మించినాడో, (11)

ఎవడు శుభకరుడైన మహాదేవుని అన్నివిధముల భావనతో స్వయముగా, గొప్ప భక్తితో ఆశ్రయించి యున్నాడో, ఆ వ్యాసుని జ్ఞానము ఈశ్వర విషయకమైనది. (12)

తతః పాశుపతాః సర్వే తేచ హృష్టతనూరుహాః | ఊచు రవ్యగ్ర మనసో వ్యాసం సత్యవతీసుతమ్‌ || || 13 ||

భగవన్‌ భవతా జ్ఞాతం విజ్ఞానం పరమేష్ఠినః | ప్రసాదా ద్దేవదేవస్య యత్త న్మాహేశ్వరం పరమ్‌ || || 14 ||

తద్వ దస్మాక మవ్యగ్రం రహస్యం గుహ్య ముత్తమమ్‌ | క్షిప్రం పశ్యేమ తం దేవం శ్రుత్వా భగవతో ముఖాత్‌ || || 15 ||

విసర్జయిత్వా తా ఞ్ఛిష్యా న్సుమన్తు ప్రముఖాం స్తదా | ప్రోవాచ తత్పరం జ్ఞానం యోగిభ్యో యోగవిత్తమః || || 16 ||

తత్‌క్షణా దేవ విమలం సమ్భూతం జ్యోతి రుత్తమమ్‌ | లీనా స్త త్రైవ తే విప్రాః క్షణా దన్తరధీయత || || 17 ||

తరువాత ఆ పాశుపతులందరు కూడా సంతోషముతో పులకించినవారై, సత్యవతీదేవి కుమారుడైన వ్యాసుని గూర్చి సావధాన మనస్కులై ఇట్లనిరి. (13)

మహాత్మా! పరమేష్ఠికి సంబంధించిన జ్ఞానము, దేవదేవుడైన శివుని యనుగ్రహము వలన నీచేత తెలియబడినది. అది మహేశ్వర సంబంధమైనది, ఉత్తమమైనది. (14)

ఆ విధముగానే, నిశ్చలము, రహస్యము, శ్రేష్ఠము అగు ఆ జ్ఞానమును మీరు మాకుపదేశించినచో, మీ ముఖము నుండి విని శీఘ్రముగా ఆ దేవుని దర్శింతుము. (15)

అప్పుడు వ్యాసుడు సుమంతుడు మొదలుగా గల శిష్యులను పంపించి, యోగవేత్తలలో శ్రేష్ఠుడైన ఆయన ఆ మునుల కొరకు ఉత్తమమైన ఆ జ్ఞానమును గూర్చి వివరించెను. (16)

వెంటనే ఆ యోగులకు స్వచ్ఛము, శ్రేష్ఠతమము అగు జ్ఞానతేజము సాక్షాత్కరించెను. ఆ బ్రాహ్మణులందరు ఆ తేజస్సులోనే లీనమైపోయిరి. ఆ తేజము క్షణములో అదృశ్యమాయెను. (17)

తతః శిష్యా న్సమాహృత్య భగవాన్‌ బ్రహ్మవిత్తమః | ప్రోవాచ మధ్యమేశస్య మాహాత్మ్యం పైలపూర్వకాన్‌ || || 18 ||

అస్మిన్‌ స్థానే స్వయం దేవో దేవ్యాసహ మహేశ్వరః | రమతే భగవా న్నిత్యం రుద్రైశ్చ పరివారితః || || 19 ||

అత్ర పూర్వం హృషీకేశో విశ్వాత్మా దేవకీసుతః | ఉవాస వత్సరం కృష్ణః సదా పాశుపతై ర్వృతః || || 20 ||

భస్మోద్ధూలితసర్వాఙ్గో రుద్రారాధనతత్పరః | ఆరాధయన్‌ హరిః శమ్భుం కృత్వా పాశుపతం వ్రతమ్‌ || || 21 ||

తస్య వై బహవః శిష్యా బ్రహ్మచర్యపరాయణాః | లబ్ధ్వా తద్వచనా జ్జాఞనం దృష్టవన్తో మహేశ్వరమ్‌ || || 22 ||

తరువాత బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, భగవంతుడును అగు వేదవ్యాసముని పైలుడు మొదలగు శిష్యులందరిని సమావేశపరచి, మధ్యమేశ్వరుని యొక్క మాహాత్మ్యమును వారికి వివరించెను. (18)

ఈ ప్రదేశము నందు భగవంతుడైన మహేశ్వరుడు, రుద్రగణముతో కూడినవాడై, పార్వతీదేవితో ఎల్లప్పుడువిహరించుచుండును. (19)

ఇక్కడ పూర్వకాలములో నారాయణాంశుడు, విశ్వరూపుడు, దేవకి కుమారుడును అగు శ్రీకృష్ణుడు పాశుపత గణములతో కూడి సంవత్సరకాలము నివసించినాడు. (20)

ఆ కృష్ణుడు అన్ని అవయవములకు భస్మలేపనము చేసినవాడై, శివుని పూజించుట యందు శ్రద్ధ కలవాడై, పాశుపత వ్రతమును చేసి శివపూజ చేసెను. (21)

అతని యొక్క శిష్యులు చాలా మంది బ్రహ్మచర్య వ్రతమును పాటించువారై, కృష్ణుని మాట వలన జ్ఞానమును పొంది మహేశ్వరుని సాక్షాత్కరించుకొనిరి. (22)

తస్య దేవో మహాదేవః ప్రత్యక్షం నీలలోహితః | దదౌ కృష్ణస్య భగవా న్వరదో వర ముత్తమమ్‌ || || 23 ||

యే7 ర్చయిష్యన్తి గోవిన్దం మద్భక్తా విధిపూర్వకమ్‌ | తేషాం తదైశ్వరం జ్ఞాన ముత్పత్స్యతి జగన్మయ || || 24 ||

త్వ మీశో7 ర్చయితవ్యశ్చ ధ్యాతవ్యో మత్పరైర్జనైః | భవిష్యసి న సన్దేహో మత్ర్పసాదా ద్ద్విజాతిభిః || || 25 ||

యే చ ద్రక్ష్యన్తి దేవేశం ధ్యాత్వా దేవం పినాకినమ్‌ | బ్రహ్మహత్యాదికం పాపం తేషా మాశు వినశ్యతి || || 26 ||

ప్రాణాం స్త్యజన్తి యే విప్రాః పాపకర్మరతా అపి | తే యాన్తి పరమం స్థానం నాత్ర కార్యా విచారణా || || 27 ||

ఆ శ్రీకృష్ణునికి నీలలోహితుడు, భగవంతుడును అగు మహాదేవుడు ప్రత్యక్షమై వరములనిచ్చు స్వభావము కల అతడు ఉత్తమమైన వరమునిచ్చెను. (23)

నా భక్తులైనవారు ఎవరైతే శాస్త్ర విధి ప్రకారము గోవిందుని పూజింతురో, వారికి ఈశ్వర విషయకమైన సత్యజ్ఞానము అనుభవ గోచరము కాగలదు. (24)

ఓ కృష్ణా! నీవు నా భక్తులైన జనులచేత, విప్రులచేత పూజింపదగినవాడవు, ధ్యానింపదగినవాడవుగా నా అనుగ్రహము వలన కాగలవు. దీనిలో సందేహము లేదు. (25)

ఎవరైతే పినాకధారియగు శంకరుని ధ్యానించి దర్శించు కొందురో, వారి యొక్క బ్రహ్మహత్య మొదలుగా గల మహాపాపములు కూడా శీఘ్రముగా నశించును. (26)

ఈ వారణాసీ క్షేత్రములో, ఎంత పాపకర్మ పరాయణులైనప్పటికి మృతి చెందిన యెడల అట్టివారు సర్వోత్తమమైన పుణ్యగతిని పొందుదురు. ఈ విషయములో సందేహించ వలసిన పనిలేదు. (27)

ధన్యా స్తథ్యన్తు తే విప్రా మన్దాకిన్యాం కృతోదకాః | అర్చయన్తి మహాదేవం మధ్యమేశ్వర ముత్తమమ్‌ || || 28 ||

స్నానం దానం తపః శ్రాద్ధం పిణ్డనిర్వపణం త్విహ | ఏకైకశః కృతం విప్రాః పునా త్యాసప్తమం కులమ్‌ || || 29 ||

సన్నిహత్యా ముపస్పృశ్య రాహుగ్రస్తే దివాకరే | యత్ఫలం లభ##తే మర్త్యస్తస్మా ద్దశగుణం త్విహ || || 30 ||

ఏవ ముక్త్వా మహాయోగీ మధ్యమేశాన్తి కే ప్రభుః | ఉవాస సుచిరం కాలం పూజయ న్వై మహేశ్వరమ్‌ || || 31 ||

ఇతి శ్రీ కూర్మపురాణ వారాణసీ మాహాత్మ్యం నామ చతుస్త్రింశో7ధ్యాయః

ఓ భూసురులారా! గంగానది యందు స్నానమాచరించి మహాదేవుడు, సర్వశ్రేష్ఠుడు, మధ్యమేశ్వర నామకుడైన దేవుని పూజించినవారు నిజముగా ధన్యజీవులు. (28)

ఈ క్షేత్రములో స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధకర్మ, పితరులకు పిండ ప్రదానము జరుపుట అను కార్యములు ఒక్కొక్కటిగా చేయబడినవై తమ వంశములోని ఏడు తరముల వారిని పవిత్రులుగా చేయును. (29)

సూర్యుడు రాహువుచే గ్రహింపబడిన గ్రహణ సమయములో 'సన్నిహత్య' అను తీర్థములో స్నానము చేసి మనుష్యుడు ఏ ఫలమును పొందునో, దానికి పదిరెట్లు ఫలమును ఈ స్థలములో పొందగలడు. (30)

ఈ విధముగా చెప్పి ఆ మహాయోగియగు వ్యాసుడు ఆ మధ్యమేశ్వరుని సన్నిధిలో, మహేశ్వరుని పూజించుచు చాలా కాలము నివసించెను.

శ్రీ కూర్మపురాణములో వారాణసీ మాహాత్మ్యము అను ముప్పది నాలుగవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters