Sri Koorma Mahapuranam    Chapters   

చతుర్థోధ్యాయః

అథ ప్రాకృతసర్గః ||

సూతఉవాచ :-

శ్రుత్వా శ్రమవిధిం కృత్స్న మృషయో హృష్టచేతసః | నమస్కృత్య హృషీకేశం పునర్వచన మబ్రువన్‌ || || 1 ||

మునయ ఊచుః-

భాషితం భవతా సర్వం చాతురాశ్రమ్య ముత్తమమ్‌ | ఇదానీం శ్రోతు మిచ్ఛామో యథాసమ్భవతో జగత్‌ || || 2 ||

కుతః సర్వ మిదం జాతం కస్మింశ్చ లయ మేష్యతి | నియన్తా కశ్చ సర్వేషాం వదస్వ పురుషోత్తమ || || 3 ||

శ్రుత్వా నారాయణో వాక్య మృషీణాం కూర్మరూపధృక్‌ | ప్రాహ గమ్భారయా వాచా భూతానాం ప్రభవోవ్యయః || || 4 ||

కూర్మ ఉవాచ :-

మహేశ్వరః పరోవ్యక్తః చతుర్వ్యూహః సనాతనః | అనన్తశ్చాప్రమేయశ్చ నియన్తా సర్వతోముఖః || || 5 ||

చతుర్థాధ్యాయము

ప్రాకృత సర్గము -

సూతుడిట్లుపలికెను - సంపూర్ణమైన ఆశ్రమ విధానమునువిని సంతోషించిన మనస్సులుగల ఋషులు, నారాయణునికి నమస్కరించి మరల ఈ మాటలు పలికిరి. (1)

నీచేత ఉత్తమమైన నాలుగు ఆశ్రమాల వివరమంతయు చెప్పబడినది. ఇప్పుడిక ప్రపంచము యొక్క ఉత్పత్తి విధానమును వినుటకు కోరుతున్నాము. (2)

ఈ సమస్తము దేనినుండి పుట్టినది? దేనిలో నాశము పొందగలడు? ఈ యన్నిటిని నియమించు వాడెవడు? ఓ పురుషోత్తమా! మాకు తెల్పుము (3)

కూర్మరూపమును ధరించిన నారాయణుడు ఋషుల మాటనువిని, భూతములకు మూలకారణము, నాశములేనివాడు అగు అతడు గంభీరమైన వాక్కుతో ఇట్లు పలికెను. (4)

కూర్మస్వామి పలికెను :- పరమేశ్వరుడు, పరమపురుషుడు, వ్యక్తముకానివాడు, నాలుగు వ్యూహములుకలవాడు, సనాతనుడు, అంతములేనివాడు, కొలుచుటకు శక్యముకానివాడు, అంతట వ్యాపించినవాడు, నియమించువాడు కూడ. (5)

అవ్యక్తం కారణం యత్త న్నిత్యం సదసదాత్మకం | ప్రధానం ప్రకృతి శ్చేతి య మాహు స్తత్వచిన్తకాః || || 6 ||

గన్థవర్ణరసై ర్హీనం శబ్దస్పర్శవివర్జితమ్‌ | అజరం ధృవ మక్షయ్యం నిత్యం స్వాత్మన్యవస్థితమ్‌ || || 7 ||

జగద్యోని ర్మహాభూతం పరబ్రహ్మ సనాతనమ్‌ | విగ్రహః సర్వభూతానా మాత్మనా ధిష్ఠితం మహత్‌ || || 8 ||

అనాద్యన్త మజం సూక్ష్మం త్రిగుణం ప్రభవావ్యయమ్‌ | అసామ్ర్పత మవిజ్ఞేయం బ్రహ్మాగ్రే సమవర్తత || || 9 ||

గుణసామ్యే తదా తస్మిన్‌ పురుషేచాత్మని స్థితే | ప్రాకృతః ప్రళయో జ్ఞేయో యావ ద్విశ్వసముద్భవః || || 10 ||

వ్యక్తరూపముకాని కారణమేదో అది, నిత్యము సత్తు అసత్తు రూపాలలో ఉండునది, దేనిని తత్త్వవేత్తలు ప్రధానమని, ప్రకృతి అని వ్యవహరింతురో; (6) వాసన, రంగు, రుచిలేని, ధ్వని, స్పర్శలచే విడువబడినది, ముసలితనము, తరుగుదల లేనిది, శాశ్వతము, ఆత్మయందే నిలిచిఉన్నది; (7) ప్రపంచమునకు మూలకారణము, మహాభూతస్వరూపము, అతిపురాతనము, పరబ్రహ్మరూపము, సమస్తభూతములకు మూర్తివంటిది, ఆత్మచే అధిష్ఠించబడినది మహత్తత్త్వము. (8)

ఆది, అంతములేనిది, పుట్టుకలేనిది, సూక్ష్మరూపము, త్రిగుణాత్మకము, ఉత్పత్తికారణము, నాశములేనిది, ఏకాంతము, తెలియరానిది అగు బ్రహ్మరూపము ముందుగా ఆవిర్భవించెను. (9)

ఆత్మరూపుడైన ఆపురుషునియందు సత్త్వాది త్రిగుణముల సామ్యము సంభవించునప్పుడు, మరల విశ్వసృష్టిజరుగు పర్యంతము ప్రాకృత ప్రళయమని తెలియవలెను. (10)

బ్రాహ్మీ రాత్రి రియం ప్రోక్తా హ్యయః సృష్టి రుదాహృతా | అహ ర్నవిద్యతే తస్య న రాత్రిర్హ్యుపచారతః || || 11 ||

నిశాన్తే ప్రతిబుద్ధోసౌ జగదాదిరనాదిమాన్‌ | సర్వభూతమయోవ్యక్తా దన్తర్యామిశ్వరః పరః || || 12 ||

ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాశు మహేశ్వరః | క్షోభయామాస యోగేన పరేణ పరమేశ్వరః || || 13 ||

యథా మదో నరస్త్రీణాం యథా వా మాధవోనిలః | అనుప్రవిష్టః క్షోభాయ తథా సౌ యోగమూర్తిమాన్‌ || || 14 ||

స ఏవ క్షోభకో విప్రాః క్షోభశ్చ పరమేశ్వరః | స సంకోచవికాసాభ్యాం ప్రధానత్వే వ్యవస్థితః || || 15 ||

ఇది బ్రాహ్మీరాత్రి అని చెప్పబడినది. ఇనుము మయమైన సృష్టిగా పేర్కొనబడినది. దానికి వ్యవహారరీత్యాపగలుకాని, రాత్రికానిలేదు. (11)

రాత్రి ముగిసిన తరువాత, లోకాలకు ఆదిపురుషుడు, మొదలులేనివాడు, సమస్తభూతమయుడు, అన్నిటియందు వ్యాపించి ఉన్న పరమపురుషుడైన ఈశ్వరుడు మేల్కొన్నాడు. (12)

మహేశ్వరుడు ప్రకృతిని, పురుషునిగూడ ప్రవేశించి శీఘ్రముగా తనశ్రేష్టమైన యోగబలముతో కలతచెందించెను. (13)

పురుషులకు స్త్రీలకు మదము ఎట్లో, వసంతకాలపు మలయమారుతము ఎట్లో, యోగమూర్తినిధరించిన పరమేశ్వరుడు కూడా అట్లే ప్రవేశించి క్షోభమును కలిగించెను.(14)

ఓ బ్రాహ్మణులారా! క్షోభింపజేయువాడు అతడే, క్షోభకుగురి అయ్యే పరమేశ్వరుడు కూడా అతడే. సంకోచ వికాసములనే కర్మల ద్వారా అతడు ప్రధాన కారకుడుగా నిలిచి ఉన్నాడు.(15)

ప్రధానాత్‌క్షోభ్యమానాచ్చ తథా పుంసః పురాతనాత్‌ | ప్రాదురాసీ న్మహద్భీజం ప్రధానపురుషాత్మకమ్‌ || || 16 ||

మహా నాత్మా మతిర్ర్బహ్మా ప్రబుద్ధిః ఖ్యాతి రీశ్వరః | ప్రజ్ఞా ధృతిః స్మ్రతిః సంవి దేతస్మాదితి తత్స్మృతమ్‌ || || 17 ||

వైకారిక సై#్తజసశ్చ భూతాది శ్చైవ తామసః త్రివిధోయ మహంకారో మహతః సంబభూవ హ || || 18 ||

అహంకారోభిమాన శ్చ కర్తా మన్తా చ స స్మృతః | ఆత్మాచ మత్పరో జీవో యతః సర్వాః ప్రవృత్తయః || || 19 ||

పఞ్చభూతా న్యహంకారా త్తన్మాత్రాణి చ జజ్ఞిరే | ఇంద్రియాణి చ సర్వాణి సర్వం తస్యాత్మజం జగత్‌ || || 20 ||

క్షోభింపజేయబడిన ప్రధాన తత్వమునుండి, పురాతనుడైన పురుషుని నుండి, ప్రధాన పురుష స్వరూపమైన గొప్ప బీజము ప్రాదుర్భ వించినది. (16)

మహాత్తత్వము, బుద్ధి, బ్రహ్మ, ప్రబుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, ధృతి, స్మృతి, సంవిత్తు అనునవి యీప్రధాన పురుష బీజము నుండి కలిగినవి.(17)

వికారజన్యమైనది, తేజస్సంబంధి, తామసమైన భూతాదికము అని మూడు విధములైన అహంకారము మహత్తు నుండి ఆవిర్భవించినది. (18)

అహంకారము, అభిమానము అనబడు ఈతత్త్వము కర్తగా, ఆలోచించునదిగా పేర్కొనబడినది. ఆత్మమత్పరమైన జీవుడని, దానివలన ప్రవృత్తులు జరగునని తెలియవలెను.(19)

అహంకారమునుండి పంచభూతములు, తన్మాత్రలు కూడా జనించినవి. అన్ని ఇంద్రియములు, లోకమంతయుదాని నుండి కలిగినదే.(20)

మనస్త్వ వ్యక్తజం ప్రోక్తం వికారః ప్రథమః స్మృతః యేనాసౌ జాయతే కర్తాభూతాదీం శ్చానుపశ్యతి || || 21 ||

వైకారికా దహంకారా త్సర్గో వైకారికోభవత్‌ | తైజసా నీంద్రియాణి స్వుర్దేవా వైకారికా దశ || || 22 ||

ఏకాదశం మన స్తత్ర స్వగుణ నోభయాత్మకమ్‌ | భూతతన్మాత్రసర్గోయం భూతాదే

రభవ ద్ద్విజా ః || || 23 ||

భూతాది స్తు వికుర్వాణః శబ్దమాత్రం ససర్జ హ | అకాశో జాయతే తస్మాత్తస్య శబ్దో గుణోమతః || || 24 ||

ఆకాశస్తు వికుర్వాణ ః స్పర్శమాత్రం ససర్జ హ | వాయు రుత్పద్యతే తస్మాత్తస్య స్పర్శం గుణం విదుః || || 25 ||

మనస్సు అవ్యక్తతత్త్వము నుండి పుట్టినది. ఇది మొదటి వికారమని చెప్పబడినది. దానిచేత కర్తయగు పురుషుడు కలిగి భూతములు మొదలగు వానిని చూచుచున్నాడు. (21)

వికారజన్యమైన అహంకారమునుండి వైకారిక స్వర్గము జరిగినది. ఇంద్రియములు తేజస్సునుండి జనించినవి. ఓ దేవతలారా ! ఇవి పది వికార జన్యములైన సర్గములు. (22)

మనస్సు పదునొకండవది. అది తన స్వభావముచేత ఉభయ విధమైనది. బ్రాహ్మణులారా ! పంచభూతములు, వానితన్మాత్రముల యొక్క సృష్టియైన యీ మనస్సు భూతాదుల నుండి పుట్టినది. (23)

వికారమును పొందుచున్న భూతాదికము మొట్టమొదట శబ్దమును మాత్రము సృష్టించెను. ఆ శబ్దమునుండి ఆకాశముపుట్టుచున్నది. శబ్దము ఆకాశగుణమని గుర్తించబడినది. (24)

ఆకాశము కూడ వికారమును చెందుచు స్పర్శమును మాత్రము సృష్టించెను. ఆ స్పర్శమునుండి వాయువు పుట్టినది. స్పర్శము వాయుగుణమని తెలియదురు.(25)

వాయూ శ్చాపి వికుర్వాణో రూపమాత్రం ససర్జ హ | జ్యోతి రుత్పద్యతే వాయో స్తద్రూప గుణముచ్యతే || || 26 ||

జ్యోతి శ్చాపి వికుర్వాణం రసమాత్రం ససర్జ హ | సమ్భవన్తి తతో మ్భాంసి రసాధారాణి తాని చ || || 27 ||

ఆప శ్చాపి వికుర్వాణా గన్థమాత్రం ససర్జిరే | సజ్ఘాతో జాయతే తస్మాత్తస్య గన్దో గుణో మతః || || 28 ||

ఆకాశం శబ్దమాత్రం తు స్పర్శమాత్రం సమావృణోత్‌ | ద్విగుణ స్తు తతో వాయుః శబ్దస్పర్శాత్మకో భవత్‌ || || 29 ||

రూపం తథైవా విశతః శబ్దస్పర్శౌ గుణా వుభౌ | త్రిగుణ ః స్వాత్తతో వహ్ని ః స శబ్దస్పర్శరూపవాన్‌ || || 30 ||

వాయువుకూడ వికారమును చెందుచు రూపమును తన్మాత్రను సృజించినది. వాయువువలన తేజస్సు పుట్టుచున్నది. అది రూపము గుణముగా కలదని చెప్పబడినది. (26)

తేజస్సు కూడా వికారమును చెంది రసమను తన్మాత్రను సృజించినది. దాని నుండి జలములు పుట్టినవి. రసమునీటియొక్క గుణమై యున్నది. (27)

జలములు కూడ వికారము పొంది గంధతన్మాత్రను సృష్టించినవి. గంధము నుండి సంఘాతము జనించినది. దానికి గంధము గుణముగా గుర్తింపబడినది. (28)

ఆకాశము శబ్దమాత్రను, స్పర్శమాత్రము ఆవరించెను. దానికి రెండురెట్లుగా వాయువు శబ్దస్పర్శాత్మకమైనది. (29)

అట్లే శబ్దస్పర్శగుణములు రెండు, రూపము కూడ కలిగియున్న త్రిగుణాత్మకుడు అగ్ని అయినాడు. (30)

శబ్దః స్పర్శశ్చ రూపఞ్చ రసమాత్రం సమావిశత్‌ | తస్మా చ్చతుర్గుణా అపో విజ్జేయాస్తు రసాత్మికాః || || 31 ||

శబ్ద ః స్పర్శ శ్చ రూప ఞ్చ రసో గస్థం సమావిశత్‌ | తస్మా త్పఞ్చగుణా భూమిః స్థూలా

భూతేషు శబ్ద్యతే || || 32 ||

శాన్తా ఘోరాశ్చ మూఢాశ్చ విశేషా స్తేన తే స్మృతా ః | పరస్పరాను ప్రవేశా ద్ధారయన్తి పరస్పరమ్‌ || || 33 ||

ఏతే సప్త మహాత్మానో హ్యన్యోన్యస్య సమాశ్రయాత్‌ | నాశక్నువన్‌ ప్రజా ః స్రష్టు మసమాగమ్య కృత్న్సశ ః || || 34 ||

పురుషాదిష్ఠితత్వాచ్చ అవ్యక్తానుగ్రహేణ చ | మహదాదయో విశేషాన్తా హ్యణ్డ ముత్పాదయన్తితే || || 35 ||

శబ్దము, స్పర్శము, రూపము కూడ రసమను తన్మాత్రలో చేరగా జలములు శబ్దస్పర్శరూపరసములను నాలుగు గుణములు కలవైనవి. (31)

శబ్దము, స్పర్శము, రూపము, రసము కలిసి గంధమునుచేరగా, భూమి శబ్దాది పంచగుణములు కలదిగా, భూతములన్నిటి యందు స్థూలమైనదిగా చెప్పబడుచున్నది. (32)

అ పంచభూతములు శాంతములు, ఘోరములు, మూఢములు అని మూడు విశేషములు కలిగి యున్నవి. అవి ఒకదానిలో మరొకటి ప్రవేశించుటవలన పరస్పరము ఆధారమగుచున్నవి. (33)

ఈయేడుగురు మహాత్ములు పరస్పరము ఆశ్రయించుకొని యుండుటవలన సంపూర్ణముగా మిలితము కాకుండా ప్రజలను సృజించుట కసమర్థులైరి. (34)

పురుషునిచేత అధిష్టింపబడి యుండుటవలన, అవ్యక్తతత్వము యొక్క అనుగ్రహముచేతను మహత్తునుండి విశేషమువరకు గల తత్త్వములు బ్రహ్మాండమును పుట్టించుచున్నవి. (35)

ఏకకాలసముత్పన్నం జలబుద్బువచ్చ తత్‌ | విశేషేభ్యోణ్ద మభవ ద్బృహత్తదుదకేశయమ్‌ || || 36 ||

తస్మిన్‌ కార్యస్య కరణమ్‌ సంసిద్దం పరమేష్ఠినః ప్రకృతే ణ్డ వివృద్దే తు క్షేత్రజ్ఞో బ్రహ్మసంజ్ఞితః || || 37 ||

సవై శరీరీ ప్రథమః స వై పురుష ఉచ్యతే | ఆదికర్తాస భూతానాం బ్రహ్మగ్రే సమవర్తత || || 38 ||

యమాహుః పురుషం హంసం ప్రధానా త్పరతః స్థితమ్‌ | హిరణ్యగర్భం కపిలం ఛన్దోమూర్తిం సనాతనమ్‌ || || 39 ||

మేరురుల్బ మభూ త్తస్య జరాయుశ్చాపి పర్వతాః | గర్భోదకం సముద్రాశ్చ తస్యాస స్పరమాత్మనః || || 40 ||

అది నీటిబుడగ వలె ఏకకాలములో సంభవించింది. విశేషముల నుండి అండము కలిగినది. అది బృహద్రూపమై నీటిలో వసించును. (36) దాని యందు పరమేష్టియొక్క కార్యము, కరణముకూడ సిద్దమైయుండును. ఆ అండము వృద్ధిపొందగా బ్రహ్మసంజ్ఞకలిగిన క్షేత్రజ్ఞుడు మొదటి శరీరధారిగా, పురుషుడుగా చెప్పబడువాడు, ప్రాణుల సృష్టికర్తయగు ఆ బ్రహ్మ అట్లు ప్రాదుర్భవించెను. (37, 48)

ఎవనిని ప్రధానముకంటే పరముగా నున్న పురుషుడని, హంసుడని, హిరణ్యగర్బుడు, కపిలుడు, ఛందోమూర్తి సనాతనుడు అని అందురో, అతడే ఆ బ్రహ్మ. (39)

ఆ పరమాత్మకు మేరువు మావిగాను, పర్వతములు జరాయువుగాను, సముద్రములు గర్భోదకములుగాను ఆయెను (40)

తస్మిన్నణ్డ భవ ద్విశ్వం సదేవాసురమానుషమ్‌ | చన్ద్రాదిత్యౌ సనక్షత్రౌ సగ్రహౌ సహవాయునా || || 41 ||

అద్భి ర్దశగుణాభిశ్చ బాహ్యతోణ్దం సమావృతమ్‌ | ఆపో దశగుణనైవ తేజసా బాహ్యతో వృతాః || || 42 ||

తేజో దశగుణనైవ బాహ్యతో వాయునావృతమ్‌ | ఆకాశేనా వృతో వాయుః ఖంతు భూతాదినా వృతమ్‌ || || 43 ||

భూతాది ర్మహతా తద్వత్‌ అవ్వక్తేనా వృతో మహాన్‌ | ఏతే లోకా మహాత్మానః సర్వే తత్వాభిమానినః || || 44 ||

వసన్తి తత్ర పురుషాః తదాత్మానో వ్యవస్థితా ః | ఈశ్వరా యోగధర్మాణో యే చాన్యే తత్త్వచిన్తకాః || || 45 ||

ఆ అండంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన ప్రపంచము, నక్షత్రాలతో కూడ సూర్యచంద్రులు, ఇతరగ్రహాలు, వాయువుకూడ ప్రభవించాయి.(41)

పదిరెట్లు పరిమాణం కల నీళ్లచేత అండం ఆవరించబడింది. దానికి పదిరెట్ల పరిమాణపు తేజస్సు చేత వెలుపలి నుండి నీళ్లు కప్పబడ్డాయి. (42)

దానికి పదిరెట్ల వాయువుచేత తేజస్సుకప్పబడింది. ఆ వాయువు ఆకాశంచేత, ఆకాశము భూతములు మొదలగు వానిచేత ఆవరించబడ్డాయి. (43)

దానివలెనే భూతాదులు మహత్తుచేత, మహత్తు అవ్యక్తముచేత ఆవరించబడ్డాయి. ఓ మహాత్ములారా! ఈ లోకాలు అన్నీ తత్త్వాన్ని అభిమానించేవి. (44) దానిలో పురుషులు తత్స్వరూపులుగా నివసిస్తారు. యోగ స్వభావులు, తత్త్వచింతకులైన ఇతరులు కూడ నియతులై ఉంటారు. (45)

సర్వజ్ఞాః శాస్తరజసో నిత్యం ముదితమానసాః ఏతై రావరణౖ రణ్డం ప్రాకృతైః సప్తభి ర్వృతమ్‌ || ||46||

ఏతావ చ్ఛక్యతే వక్తుం మాయైషా గహనా ద్విజాః | ఏత త్ప్రాధానికం కార్యం యన్మయా బీజ మీరితమ్‌ || || 47 ||

ప్రజాపతిః పరామూర్తి రితీయం వైదికీశ్రుతిః బ్రహ్మాణ్డ మేత త్సకలం సప్తలోకబలాన్వితమ్‌ || || 48 ||

ద్వితీయం తస్య దేవస్య శరీరం పరమేష్టినః హిరణ్యగర్భో భగవాన్‌ బ్రహ్మావై కనకాణ్డజః || || 49 ||

తృతీయం భగవద్రూపం ప్రాహు ర్వేదార్థవేదినః | రజోగుణమయం చాన్య ద్రూపం తసై#్యవ ధీమతః || || 50 ||

సర్వజ్ఞులు, రజోగుణము తొలగినవారు, ఎల్లప్పుడు సంతుష్టచిత్తము కలవారు, ఈశ్వరులగువారు ఆఅవ్యక్తత్త్వంలో నివసిస్తారు. ఆ అండము ప్రాకృతములైన ఈ ఏడు ఆవరణాలతో కూడి ఉంటుంది. (46)

ఓ బ్రాహ్మణులారా ! ఇంతవరకే చెప్పుటకు వీలవుతుంది. ఈ మాయా స్వరూపము గహనమైనది. నాచేత బీజమని చెప్పబడినది యీ మాయ ప్రధానంగాల కార్యరూపము. (47)

ఈసమస్త బ్రహ్మాండము, సప్తలోక బలములతోకూడినది. సృష్టికర్త ప్రజాపతి యొక్క ''పరామూర్తి'' అని వేదములతో వర్ణించబడినది. (48)

ఆ దేవునియొక్క రెండవ శరీరభాగము, హిరణ్యగర్భుడుగా సువర్ణపు అండము నుండి పుట్టిన భగవంతుడగు బ్రహ్మదేవుడు. (49)

వేదార్థము తెలిసిన పండితులు, రజోగుణమయమైన మరొకరూపము ఈ ధీమవంతుడైన దేవుని మూడవరూపముగా చెప్పుదురు. (50)

చతుర్ముఖ స్తు భగవాన్‌ జగత్సృష్టౌ ప్రవర్తతే| సృష్టం చ పాతి సకలం విశ్వత్మా విశ్వతోముఖః || || 51 ||

సత్త్వం గుణ ముపాశ్రిత్య విష్ణు ర్విశ్వేశ్వరః స్వయమ్‌ | అంతకాలే స్వయం దేవః సర్వాత్మా పరమేశ్వరః || || 52 ||

తమోగుణం సమాశ్రిత్య రుద్రః సంహరతే జగత్‌ | ఏకో పి స న్మహాదేవ స్త్రిధాసౌ సమవస్థితః || || 53 ||

సర్గరక్షాలయగుణౖః నిర్గుణోపి నిరఞ్జన || ఏకథా స ద్విధా చైన త్రిధాచ బహుధా గుణౖః || || 54 ||

యోగీశ్వరః శరీరాణి, కరోతి వికరోతి చ | నానాకృతిక్రియారూపనామవంతి స్వలీలయా || || 55 ||

భగవంతుడైన చతుర్ముఖబ్రహ్మ లోకాలను సృష్టించుటలో నిమగ్నుడై ఉన్నాడు. అతనిచే సృజించబడిన సమస్త విశ్వాన్ని విశ్వరూపుడు, విశ్వవ్యాప్తుడు అయినట్టి (51) విశ్వేశ్వరుడగు విష్ణువు సత్త్వగుణాన్నాశ్రయించి స్వయంగా కాపాడుతాడు. కల్పాంతంలో సర్వాత్ముడైన పరమేశ్వరుడు స్వయముగా (52) తమోగుణాన్నాశ్రయించి రుద్రరూపుడై జగత్తును సంహరిస్తాడు. ఆమహాదేవు డొక్కడే అయినప్పటికి మూడు భిన్నప్రకారాలతో ఉంటాడు. (53)

నిర్గుణుడు, నిర్వికారుడు అయినప్పటికి ఆభగవంతుడు సృష్టి, స్థితి లయములనే మూడుగుణాలతో ఒకడుగా, ఇద్దరుగా, ముగ్గురుగా, బహురూపుడుగా కూడ ఆయాగుణాలతో ఒప్పుచున్నాడు. (54)

యోగేశ్వరుడైన ఆదేవుడు శరీరాలను సృష్టించుట, లయింపజేయుట, అనేక విధాలైన వికారాలకు గురిచేయుట అను వాటిని తనలీలలతో జరుపుతున్నాడు. (55)

హితాయ చైవ భక్తానాం స ఏవ గ్రసతే పునః | త్రిధా విభజ్య చాత్మానం త్రైలోక్యే సంప్రవర్తతే || || 56 ||

సృజతే గ్రసతే చైవ వీక్షతే చ, విశేషతః | యస్మా త్సృష్ట్వా నుగృహ్ణాతి గ్రసతేచ పునః ప్రజాః || || 57 ||

గుణాత్మకత్వా త్త్రైకాల్యే తస్మాదేకః స ఉచ్యతే | అగ్రే హిరణ్యగర్భః స ప్రాదుర్భూత స్సనాతనః || || 58 ||

ఆదిత్వా దాదిదేవో సావజాత త్వా దజః స్మృతః | పాతి యస్మా త్ప్రజాః సర్వాః ప్రజాపతి రితి స్మృతః || || 59 ||

దేవేషు చ మహాదేవో మహాదేవ ఇతి స్మృతః | బృహత్త్వాచ్చ స్మృతోబ్రహ్మా పరత్వాత్పరమేశ్వరః || 60 ||

భక్తుల మేలు కొరకే ఆదేవుడు మరల లోకాలను మ్రింగుతున్నాడు. తనను మూడు ప్రకారాలుగా విభజించుకొని ముల్లోకాలలో ప్రవర్తిస్తున్నాడు. (56)

ప్రపంచాన్ని సృజిస్తూ, దాన్ని కాపాడుతూ, చివరకు తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. సృష్టికర్మ, అనుగ్రహము, విలయము అనే మూడు కర్మలకు ప్రజలను వశం చేస్తున్నాడు. (57)

పైమూడు విధాలైన గుణాలు కలిగిఉన్నందువల్ల ఆదేవు డొక్కడే అని చెప్పబడుతున్నాడు. మొదట అతడు సనాతనుడైన హిరణ్యగర్భుడుగా అవతరించినాడు. (58)

ఆదిపురుషుడు కనుక ఆదిదేవుడని, జన్మలేనివాడు కనుక అజుడని, ప్రజలనందరిని రక్షిస్తున్నందువలన ప్రజాపతి అని అతడు చెప్పబడుతున్నాడు. (59)

దేవతలలో గొప్పవాడు కనుక మహాదేవుడని, బృహత్త్వ గుణము వలన బ్రహ్మ అని, పరమ పురుషుడు కనుక పరమేశ్వరుడని పిలువబడుతున్నాడు. (60)

వశిత్వా దస్య వశ్యత్వా దీశ్వరః పరిభాషితః | ఋషిః సర్వత్రగత్వేన హరిః సర్వహరోయతః || || 61 ||

అనుత్పాదాచ్చ పూర్వత్వాత్‌ స్వయమ్భూరితి స స్మృతః | నరాణా మయనం యస్మాత్తేన నారాయణః స్మృతః || || 62 ||

హరః సంసారహరణా ద్విభుత్వా ద్విష్ణు రుచ్యతే | భగవా న్సర్వవిజ్ఞానాత్‌ అవనా దోమితిస్మృతః || 63 ||

సర్వజ్ఞః సర్వవిజ్ఞానాత్‌ సర్వః సర్వమయో యతః | శివః స్యాన్నిర్మలో యస్మాత్‌ విభుః

సర్వగతో యతః || || 64 ||

తారణా త్సర్వదుఃఖానాం తారకః పరిగీయతే | బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్‌ || || 65 ||

తనకు తాను అధీనుడై ఉండుట, ఇతరులకు వశుడుకాకుండుటవలన ఇతడు ఈశ్వరుడని చెప్పబడుతున్నాడు. అంతట గమనం కలవాడై నందున ఋషిఅని, సమస్తమును తన అధీనంలోకి హరించేవాడు కనుక హరి అని చెప్పబడుతున్నాడు. (61)

పుట్టుకలేకపోవుట, అన్నిటికి పూర్వమందే ఉండుట అనే కారణాలవలన అతడు స్వయంభువు అని చెప్పబడినాడు. మనుష్యులకు పొందదగిన మార్గస్వరూపుడు కనుక నారాయణుడుగా తలచబడుతున్నాడు. (62)

సంసారబంధాన్ని నశింపజేసేవాడు కనుక హరుడని, అంతట వ్యాపించి ఉన్నందువలన విష్ణువు అని చెప్పబడుతున్నాడు. సమస్త విషయ విజ్ఞానం కలవాడు కనుక భగవంతుడని, లోక రక్షణ చేయటంవలన ఓంకారస్వరూపుడని తలచబడుచున్నాడు. (63)

సమస్త విజ్ఞానమయుడు కావున సర్వజ్ఞుడని, సర్వప్రపంచస్వరూపుడు కనుక సర్వుడని అతడు చెప్పబడుతున్నాడు. నిర్మల రూపుడైనందు వలన శివుడని, అంతట వ్యాపించినందున విభువని పిలువబడుతున్నాడు. (64)

సమస్త దుఃఖాలనుండి దాటించువాడు కనుక తారకుడని చెప్పబడుతున్నాడు. పెక్కు మాటలతో పనియేమి? ఈసమస్తలోకముకూడ బ్రహ్మమయమే. (65)

అనేకభేదభిన్న స్తు క్రీడతే పరమేశ్వరః | ఇత్యేష ప్రాకృతః సర్గః సంక్షేపా త్కథితో మయా ||

అబుద్ధిపూర్వకాం విప్రా బ్రాహ్మీం సృష్టిం నిబోధత | ఇతి శ్రీకూర్మపురాణ ప్రాకృతసర్గ వర్ణనం నామ చతుర్థోధ్యాయః || || 66 ||

ఆ పరమేశ్వరుడు అనేకాలైన భేదాలతో వేర్వేరు రూపాలతో క్రీడిస్తూ ఉంటాడు. ఈవిధంగా ప్రాకృత సృష్టి క్రమము నాచేత సంగ్రహంగా చెప్పబడింది. (66)

ఓ బ్రాహ్మణులారా! బుద్ధిపూర్వకము కానిదానిగా ఈబ్రహ్మచేత చేయబడిన సృష్టిని తెలిసికొనండి. అవిద్యామూలమని భావము.

ఇది శ్రీకూర్మమహాపురాణంలో ప్రాకృతసర్గవర్ణ మనబడు నాలుగవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters