Sri Koorma Mahapuranam    Chapters   

అథత్రిచత్వారింశోధ్యాయః

భువనకోశ వర్ణనమ్‌

సూతువాచ :-

ఏవ మేష మహాదేవో దేవదేవః పితామహః | కరోతి నియతం కాలం కాలాత్మా హ్యైశ్వరీ తనుః || || 1 ||

తస్య యే రశ్మయో విప్రాః సర్వలోకప్రదీపకాః | తేషాం శ్రేష్ఠాః పునః సప్త రశ్మయో గృహమేధినః || || 2 ||

సుషుమ్నో హరికేశ శ్చ విశ్వకర్మా తథైవ చ | విశ్వశ్రవాః పున శ్చాన్యః సంయద్వసు రతః పరః || || 3 ||

అర్వావసు రితి ఖ్యాతః స్వరకః సప్త కీర్తితాః | సుషుమ్నః సూర్యరశ్మి స్తు పుష్టాతి శిశిరద్యుతిమ్‌ || || 4 ||

తిర్యగూర్థ్వప్రచారోసౌ సుషుమ్నః పరిపఠ్యతే | హరికేశ స్తు యః ప్రోక్తో రశ్మి ర్నక్షత్రపోషకః || || 5 ||

విశ్వకర్మా తథా రశ్మి ర్బుధం పుష్ణాతి సర్వదా | విశ్వశ్రవా స్తు యో రశ్మిః శుక్రం పుష్ణాతి నిత్యదా || || 6 ||

నలుబది మూడవ అధ్యాయము

ఈ విధముగా దేవదేవుడు, మహాదేవుడు అగు పితామహుడు కాలనియతిని చేయుచున్నాడు. ఈశ్వరశరీరము కాలాత్మకమైనది కదా. (1)

బ్రాహ్మణులారా! అతని కిరణములేవి కలవో అవి అన్ని లోకములను ప్రకాశింపజేయును. ఆ కిరణములలో శ్రేష్ఠములైనవి యేడు కలవు. (2)

సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవస్సు, సంయద్వసువు అనియు, (3)

అర్వావసువు స్వరకము అనుపేర్లతో ఆసప్తరశ్ములు ప్రఖ్యాతములైయున్నవి. సుషుమ్నము అను సూర్యరశ్మి తనకాంతితో చంద్రుని పోషించును. (4)

ఈ సుషుమ్నరశ్మి అడ్డముగా, నిలువుగా కూడ ప్రసరించు స్వభావము కలది. హరికేశము అనబడు రశ్మి నక్షత్రములకు బలము కలిగించును. (5)

విశ్వకర్మ అనబడు సూర్యరశ్మి బుధగ్రహమును ఎల్లవేళల పోషించుచుండును. విశ్వశ్రవస్సు అనుపేరుగల సూర్యరశ్మి సర్వకాలము శుక్రగ్రహమునకు ప్రకాశము కలిగించును. (6)

సంయద్వసు రితి ఖ్యాతో యః పుష్ణాతి స లోహితమ్‌ | బృహస్పతిం సుపుష్ణాతి రశ్మి రర్వానమః ప్రభుః || || 7 ||

శ##నైశ్చరం ప్రపుష్ణాతి సప్తమస్తు స్వర స్తథా | ఏవం సూర్యప్రభావేణ సర్వా నక్షత్రతారకాః || || 8 ||

వర్థన్తే వర్ధితా నిత్యం నిత్యమాప్యాయయన్తి చ | దివ్యానాం పార్థివానాఞ్చ నైశానాం చైవ నిత్యశః || || 9 ||

ఆదానా న్నిత్యమాదిత్య స్తేజసాం తమసా మపి | ఆదత్తే స తు నాడీనాం సహస్రేణ సమన్తతః || || 10 ||

నాదేయం చైవ సాముద్రం కౌప్యం చైవ సహస్రదృక్‌ | స్థావరం జఙ్గమ ఞ్చైవ యచ్చ కుల్యాదికం పయః || || 11 ||

సంయద్వసు వనుపేరుతో ప్రఖ్యాతమైన రశ్మి అంగారక గ్రహమును పోషించుచున్నది. సమర్థమైన అర్వావసువను రశ్మి బృహస్పతి గ్రహమును బాగుగాపోషించును. (7)

ఏడవదైవ స్వరమను రశ్మి శ##నైశ్చర గ్రహమును పోషించును. ఈ ప్రకారము సూర్యుని యొక్క ప్రభావముచేత అన్ని నక్షత్రములు వృద్ధి పొందుచున్నవి. పెంపొందినవై ఎల్లప్పుడు లోకమును సంతోషపరచుచున్నవి. దేవతలయొక్క, భూమికి సంబంధించినవారి యొక్క రాత్రిచరుల యొక్క తేజస్సులను, చీకట్లను స్వీకరించుట వలన ఆదిత్యుడనబడుచున్నాడు. ఆ సూర్యుడు తన వేయినాడులతో అన్నివైపులనుండి నదులకు చెందినది, సముద్రసంబంధి, బావుల లోనిది, నిలకడగా ఉండునది, ప్రవహించునది అగు కాలువలు మొదలగు వాని జలము ఏది కలదో, దానిని గ్రహించుచున్నాడు. (8, 9, 10, 11)

తస్య రశ్మిసహస్రన్తు శీతవర్షోష్ణ నిస్స్రవమ్‌ | తాసాం చతుశ్శతా నాడ్యో వర్షన్తే చిత్రమూర్తయః || || 12 ||

చన్ద్రగా శ్చైవ గాహా శ్చ కాఞ్చనాః శాతనా స్తథా | అమృతా నామతః సర్వా రశ్మయో వృష్టిసర్జనాః || || 13 ||

హిమోద్ధతా శ్చ తా నాడ్యో రశ్మయో నిఃసృతాః పునః | రేష్యో మేష్యశ్చ వాస్యశ్చ హ్రాదిన్యః సర్జనా స్తథా || || 14 ||

చన్ద్రా స్తా నామతః సర్వాః పీతా స్తా స్యు ర్గభస్తయః | శుక్లాశ్చ కుఙ్కుమా శ్చైవ గావో విశ్వభృత స్తథా || || 15 ||

శుక్లా స్తా నామతః సర్వా స్త్రివిధా ఘర్మసర్జనాః | సమం బిభర్తి తాభిః స మనుష్య పితృదేవతాః || || 16 ||

ఆ సూర్యుని వేయి రశ్ములు చలిని, వర్షమును, వేడిని ప్రసరింపజేయుచు, వానిలో నాలుగు వందల నాడులు చిత్రమైన రూపముకలవై వర్షము కురియించును. (12)

వర్షమునకు కారణభూతములైన రశ్ములుగా అన్నియు చంద్రగములు, గాహములు, కాంచనములు, శాతనములు, అమృతములు అనుపేర్లతో పేర్కొనబడినవి. (13)

మంచునుండి బయలుదేరిని ఆనాడులు, రశ్ములుగా బయలువెడలినవై, రేష్యము, మేష్యము, వాస్యము, మెరుపులు, వర్షకారకములు, చంద్రములు అనిపేర్లతో అవి యన్నియు పసుపుపచ్చని కాంతులుగా ఉండును. విశ్వభృత్తుయొక్క కిరణాలు తెల్లనివి, కుంకుమరంగు కలవిగాను ఉండును. (14, 15)

శుక్లములను పేరుగల ఆరశ్ములు మూడువిధముల వేడిమిని ప్రసరించును. సూర్యుడు ఆ రశ్ములతో మనుష్యులను, పితరులను, దేవతలను సమానముగా భరించును. (16)

మనుష్యా నౌషధేనేహ స్వధయా చ పితౄ నపి | అమృతేన సురా న్సర్వాం స్త్రీం స్త్రిభి స్తర్పయ త్యసౌ || || 17 ||

వసన్తే గ్రీష్మకే చైవ షడ్భిః స తపతి ప్రభుః | శరద్యపి చ వర్షాసు చతుర్భిః సంప్రవర్షతి || || 18 ||

హేమన్తే శిశిరే చైవ హిమ ముత్సృజతి త్రిభిః | వరుణో మాఘమాసే తు సూర్యః పూషాతు ఫాల్గుణ || || 19 ||

చైత్రే మాసే స దేవేశో ధాతా వైశాఖతాపనః | జ్యేష్ఠే మాసే భ##వే దిన్ద్రః ఆషాఢే తపతే రవిః || || 20 ||

వివస్వాన్‌ శ్రవాణ మాసి ప్రౌష్ఠపద్యాం భగః స్మృతః | పర్జన్య శ్చాశ్వినే మాసి కార్తికే మాసి భాస్కరః || || 21 ||

మార్గశీర్షే భ##వే న్మిత్రః పౌషే విష్ణుః సనాతనః | పఞ్చరశ్మిసహస్రాణి వరుణ స్యార్క కర్మణి || || 22 ||

ఈ సూర్యభగవానుడు మనుష్యులను ఔషధముతో, పితరులను స్వధతోను, దేవతలందరిని అమృతముతోను మూడు విధములసాధనములతో ముగ్గురిని తృప్తిపరచుచున్నాడు. (17)

వసంతగ్రీష్మఋతువులలో సూర్యుడు ఆరురశ్ములతో వేడిని ప్రసరించును. శరత్కాలములో, వర్షఋతువులో నాలుగు రశ్ములతో వర్షమును కురియును. (18)

హేమంతశిశిరఋతువులలో ప్రభువైన సూర్యుడు మంచును వ్యాపింపజేయును. సూర్యుడు మాఘమాసములో వరుణుడుగాను, ఫాల్గుణములో పూషగాను, (19) చైత్రమాసములో దేవేశుడని, వైశాఖములో ధాత అనుపేరుతోను, జ్యేష్ఠములో ఇంద్రుడని, ఆషాఢమాసములో రవి అనియును (20) శ్రావణమాసములో వివస్వంతుడని, భాద్రపదములో భగుడనియును, ఆశ్వయుజములో పర్జన్యుడని, కార్తికమాసములో భాస్కరుడని వ్యవహరింపబడును. (21)

మార్గశీర్షములో మిత్రుడని, పౌషమాసములో సనాతనుడైన విష్ణురూపుడుగాను వ్యవహరింపబడును. వరుణరూపుడైన సూర్యుడు తన వ్యాపారములో 5వేల రశ్ములనుపయోగించును. (22)

షడ్భిః సహసై#్త్రః పూషా తు దేవేశః సప్తభి స్తథా | ధాతా ష్టభి స్సహసై#్ర స్తు నవభి శ్చ శతక్రతుః || || 23 ||

వివస్వా న్దశభిః పాతి పాత్యేకాదశభి ర్భగః | సప్తభి స్తపతే మిత్ర స్త్వష్టా చైవాష్టభి స్తపేత్‌ || || 24 ||

అర్యమా దశభిః పాతి పర్జన్యో నవభి స్తథా | షడ్భీ రశ్మిసహసై#్రస్తు విష్ణు స్తపతి విశ్వధృక్‌ || || 25 ||

వసన్తే కపిలః సూర్యో గ్రీష్మే కాఞ్చనసప్రభః | శ్వేతో వర్షాసు విజ్ఞేయః పాణ్డురః శరది ప్రభుః || || 26 ||

హేమన్తే తామ్రవర్ణః స్యా చ్ఛిశిరే లోహితో రవిః | ఔషధీషు కలాం ధత్తే స్వధా మపి పితృ ష్వథ || || 27 ||

పూషరూపములో సూర్యుడు 6వేల రశ్ములతో, దేవేవుడు ఏడువేల రశ్ములతోను, ధాతరూపుడైన భాస్కరుడు 8వేలతోను, ఇంద్రరూపుడుగా తొమ్మిది వేల రశ్ములతో, (23) వివస్వంతుడు 10వేల రశ్ములతో, భగుడు 11వేల రశ్ములతో, మిత్రుడు ఏడువేలతోను, త్వష్ట 8వేల రశ్ములతో ప్రకాశించును. (24)

అర్యముడు 10వేలతోను, పర్జన్యుడు 9వేల రశ్ములతోను, విష్ణునామకుడైన సూర్యుడు 6వేల రశ్ములతో తపింపజేయును. (25)

సూర్యుడు వసంతకాలములో కపిలవర్ణుడుగాను, గ్రీష్మకాలములో బంగారు కాంతి కలవాడుగాను, వర్షఋతువులో తెలుపుగాను, శరత్కాలములో పాండువర్ణముగాను ప్రకాశించును. (26)

సూర్యుడు హేమంతఋతువులో రాగిరంగుకలవాడుగా నుండును. శిశరకాలములో ఎరుపురంగు కలిగియుండును. ఔషధుల యందు అతడు తన కళను ధరించును. పితృదేవతలయందు స్వధను ధరించును. (27)

సూర్యోమరే ష్వమృతస్తు త్రయం త్రిషు నియచ్ఛతి | అన్యే చాష్టౌ గ్రహా జ్ఞేయాః సూర్యేణాధిష్ఠితా ద్విజాః || || 28 ||

చన్ద్రమాః సోమపుత్రశ్చ శుక్ర శ్చైవ బృహస్పతిః | భౌమో మన్ద స్తథా రాహుః కేతుమానపి చాష్టమః || || 29 ||

సర్వే ధ్రువే నిబద్ధావై గ్రహా స్తే వాత రశ్మిభిః | భ్రామ్యమాణా యథా యోగం భ్రమ న్త్యను దివాకరమ్‌ || || 30 ||

అలాతచక్రవ ద్యాన్తి వాతచక్రేరితా స్తథా | యస్మా ద్వహతి తా న్వాయుః ప్రవహ స్తేన స స్మృతం || || 31 ||

రథ స్త్రిచక్రః సోమస్య కున్దాభా స్తస్య వాజినః | వామదక్షిణతో యుక్తా దశ##తేన క్షపాకరః || || 32 ||

సూర్యుడు దేవతలయందు మూడు విధముల అమృతమును మూడు భాగముల యందు వినియోగించును. విప్రులారా! సూర్యునిచేత అధిష్ఠింపడిన గ్రహములు ఎనిమిదింటినీ విధముగా తెలియవలెను. (28)

చంద్రుడు, బుధుడు, శుక్రుడు మరియు బృహస్పతి, అంగారకుడు శని, రాహువు, కేతుమంతుడు అని ఆ ఎనిమిది గ్రహముల పేర్లు. (29)

ఆగ్రహములన్నియు వాయురశ్ములచే నియమింపబడినవై, త్రిప్పబడుచు వారి వారి నియమానుసారము సూర్యుని అనుసరించి తిరుగుచున్నవి. (30)

వాతచక్రముచేత ప్రేరేపింబడినవై అగ్రహములు కొఱవి చక్రము వలె సంచరించును. ఆ గ్రహములను వహించుచున్న కారణముచేత వాయువునకు ప్రవహము అనుపేరు ప్రసిద్ధమైనది. (31)

చంద్రునియొక్క రథము మూడు చక్రములు కలది. అతని గుఱ్ఱములు మొల్లపూవువంటి కాంతి కలవి. అవి కుడి యెడమ భాగములలో కట్టబడిన పది గుఱ్ఱములు దానిని మోయును. చంద్రుడు,

వీథ్యాశ్రయాణి చరతి నక్షత్రాణి రవి ర్యథా | హ్రాసవృద్ధీ తు విప్రేన్ద్రా ధ్రువాధారాణి సర్వదా || || 33 ||

స సోమః శుక్లపక్షే తు భాస్కరే పరతః స్థితే | ఆపూర్యతే పరస్యాన్తే సతతం చైవ తాః ప్రభాః || || 34 ||

క్షీణం పీతం సురైః సోమ మాప్యాయయతి నిత్యదా | ఏకేన రశ్మినా విప్రాః సుషుమ్నాఖ్యేన భాస్కరః || || 35 ||

ఏషా సూర్యస్య వీర్యేణ సోమస్యా ప్యాయితా తనుః | పౌర్ణమాస్యాం స దృశ్యేత సమ్పూర్ణో దివసక్రమాత్‌ || || 36 ||

సమ్పూర్ణ మర్ధమాసేన తం సోమ మమృతాత్మకమ్‌ | పిబన్తి దేవతా విప్రా యతస్తే మృతభోజనాః || || 37 ||

దానితో వీథుల నాశ్రయించి యున్న నక్షత్రములను గూర్చి, సూర్యుని వలె సంచరించును. బ్రాహ్మణశ్రేష్ఠులారా! చంద్రుని వృద్ధి క్షయములు ఎల్లప్పుడు ధ్రువస్థానముపై ఆధారపడియుండును. (32, 33)

ఆ చంద్రుడు శుక్లపక్షములో సూర్యుడు ఆవలిభాగములో నుండగా కళలచేనింపబడును. శుక్లపక్షము సమాప్తిచెందగా ఆకళలు ఎల్లప్పుడు దేవతలచే త్రాగబడి క్షీణించును. సూర్యుడు సుషుమ్నమను రశ్మితో చంద్రుని ఎల్లప్పుడు కాంతివంతముగా చేయును. (34, 35)

సూర్యుని తేజస్సుచేత ప్రకాశవంతము చేయబడిన ఈ చంద్రుని శరీరము దినక్రమములో వృద్ధిపొంది పూర్ణిమనాడు సంపూర్ణ రూపముతో కన్పించును. (36)

నిండుబింబముకల చంద్రుని అమృతాత్మకమైన రూపమును, దేవతలు అమృతభోజనులు కనుక పక్షము రోజులలో క్రమముగా ఒక్కొక్క కళచొప్పున పానము చేయుదురు. (37)

తతః పఞ్చదశే భాగే కిఞ్చి చ్ఛిష్టే కలాత్మకే | అపరాహ్ణే పితృగణా జఘన్యం పర్యుపాసతే || 38 ||

పిబన్తి ద్విలవం కాలం శిష్టా తస్య కలాతు యా | సుధామృతమయీం పుణ్యాం తా మిన్దో రమృతాత్మికామ్‌ || || 39 ||

నిఃసృతం తద మావాస్యాం గభస్తిభ్యః స్వధామృతమ్‌ | మాసతృప్తి మవాశ్నన్తి పితరః సన్తి నిర్వృతాః || || 40 ||

న సోమస్య వినాశః స్యా త్సుధా చైవం సుపీయతే | ఏవం సూర్యనిమిత్తోస్య క్షయో వృద్ధిశ్చ సత్తమాః || || 41 ||

సోమపుత్రస్య చాష్టాభి ర్వాజిభి ర్వాయువేగిభిః | వారిజైః స్యన్దనో యుక్త స్తేనా సౌ యాతి సర్వతః || | 42 ||

తరువాత పదునైదవ కళారూపమైన భాగము కొంచెము మిగిలియుండగా అపరాహ్ణకాలములో పితృగణములు వెనుకాభాగము నాశ్రయింతురు. (38)

ఆ చంద్రుని మిగిలిన కళను రెండు లవలకాలము అమృతమయము, అమృతరూపము, పుణ్యకరము అయినదానిని పానము చేయుదురు. (39)

అమావాస్యవాడు కిరణములనుండి ప్రసరించుచున్న ఆ అమృతమును పితృదేవతలు ఆస్వాదించి సుఖముకలవారై మాసతృప్తిని పొందుదురు. (40)

చంద్రునకు పూర్తిగా వినాశనము జరుగదు. అమృతము ఈవిధముగా చక్కగా ఆస్వాదింపబడును. ఓ సజ్జనులారా! ఇట్లు చంద్రుని యొక్క వృద్ధి క్షయములు సూర్యుని కారణముగా జరుగుచుండును. (41)

చంద్రుని కుమారుడైన బుధునియొక్క రథము, వాయువేగముకల, నీటి నుండి పుట్టిన గుఱ్ఱములతో కూర్చబడియుండును. ఆ బుధుడుదానితో అంతట సంచరించును. (42)

శుక్రస్య భూమిజై రశ్వైః స్యన్దనో దశభి ర్వృతః | అష్టాభి శ్చాపి భౌమస్య రథో హైమః సుశోభనః || || 43 ||

బృహస్పతే రథో శ్వాష్టః స్యన్దనో హేమనిర్మితః | రథో రూప్యమయోష్టాశ్వో మన్దస్యా యసనిర్మితః || || 44 ||

స్వర్భానో ర్భాస్కరారే శ్చ తథాష్టాభి ర్హయై ర్వృతః | ఏతే మహాగ్రహాణాం వై సమాఖ్యాతా రథా శ్చవై || || 45 ||

సర్వే ధ్రువే మహాభాగే నిబద్ధా వాయురశ్మిభిః | గ్రహర్‌క్షతారాధిష్ణ్యాని ధ్రువే బద్ధా న్యశేషతః || || 46 ||

భ్రమన్తి భ్రామయన్త్యేనం సర్వాణ్యనిల రశ్మిభిః |

ఇతి శ్రీకూర్మపురాణ భువనకోశే త్రిచత్వారింశోధ్యాయః

శుక్రునియొక్క రథము భూమియందు పుట్టిన పది అశ్వములు కలిగి యుండును. అంగారకుని రథము బంగారముతో చేయబడినది, మిక్కిలి అందమైనదై ఎనిమిది గుఱ్ఱములతో కూడియుండును. (43)

బృహస్పతి రథము ఎనిమిది గుఱ్ఱములు కలది, బంగారముతో నిర్మించబడినది. శనియొక్క రథము వెండితో చేయబడినది, ఎనిమిది అశ్వములు కలదిగా ఉండును. (44)

రాహుకేతువుల యొక్క రథములు కూడ ఇనుముతో చేయబడినవై ఎనిమిది అశ్వములు కలవై యుండును. ఇవి మహాగ్రహములయొక్క రథములు మీకు వివరింపబడినవి. (45)

ఇవి యన్నియు వాయురశ్ములతో ధ్రువస్థానముతో నియమింపబడియున్నవి. గ్రహముల, నక్షత్రముల స్థానములన్నియు సంపూర్ణముగా ధ్రువస్థానముతో నిబంధింపబడినవి. అని తిరుగుచు, వాయురశ్ములతో భ్రమింపజేయుచుండును. (46)

Sri Koorma Mahapuranam    Chapters