Sri Koorma Mahapuranam    Chapters   

చతుశ్చత్వారింశోధ్యాయః

సూత ఉవాచ :-

ధ్రువా దూర్ధ్వం మహర్లోకః కోటియోజనవిస్తృతః | కల్పాధికారిణ స్తత్ర సంస్థితా ద్విజపుంగవాః || || 1 ||

జనలోకో మహర్లోకా త్తథా కోటిద్వయాత్మకః | సనకాద్యా స్తథా తత్ర సంస్థితా బ్రహ్మణః సుతాః || || 2 ||

జనలోకా త్తపోలోకః కోటిత్రయసమన్వితః | వైరాజా స్తత్ర వై దేవాః స్థితా దాహవివర్జితాః || || 3 ||

ప్రాజాపత్యా త్సత్యలోకః కోటిషట్కేన సంయుతః | అపునర్మారకో నామ బ్రహ్మలోక స్తు స స్మృతః || || 4 ||

అత్ర లోకగురు ర్బ్రహ్మా విశ్వాత్మా విశ్వభావనః | ఆస్తే స యోగిభి ర్నిత్యం పీత్వా యోగామృతం పరమ్‌ || || 5 ||

నలుబదినాలుగవ అధ్యాయము

సూతుడిట్లుపలికెను:-

ధ్రువస్థానమునకుపైన కోటియోజనముల విస్తారము కలిగిన మహర్లోకముకలదు. బ్రాహ్మణోత్తములారా! ఆ లోకములో కల్పముల కధికారులైన వారు నివసించియున్నారు. (1)

మహర్లోకమునకుపైన రెండు కోట్ల యోజనముల పరిమాణము కలిగిన జనలోకమున్నది. అక్కడ బ్రహ్మదేవుని కుమారులైన సనకాది మునులు నివసింతురు. (2)

జనలోకమునకుపైన తపోలోకము మూడుకోట్ల యోజనముల విస్తారము కలిగియుండును. ఆలోకములో తేజోమూర్తులైన దేవతలు, దాహములేనివారై నిలిచియున్నారు. (3)

ప్రాజాపత్యముకంటె సత్యలోకము ఆరుకోట్ల యోజనముల దూరమందున్నది. అపునర్మారకమను పేరుగల అది బ్రహ్మలోకముగా ప్రసిద్ధము. (4)

ఈ లోకములో విశ్వాత్ముడు, విశ్వభావనుడు, లోకగురువు అగు బ్రహ్మ యోగులతో కూడి యోగామృతమును త్రాగి వసించును. (5)

వసన్తి యతయః శాన్తా నైష్ఠికా బ్రహ్మచారిణః | యోగిన స్తాపసాః సిద్ధా జాపకాః పరమేష్ఠినః || || 6 ||

ద్వారం త ద్యోగినా మేకం గచ్ఛతాం పరమం పదమ్‌ | తత్ర గత్వా న శోచన్తి స విష్ణుః స చ శంకరః || || 7 ||

సూర్యకోటిప్రతీకాశం పురం తస్య దురాసదమ్‌ | న మే వర్ణయితుం శక్యం జ్వాలామాలాసమాకులమ్‌ || || 8 ||

తత్ర నారాయణ స్యాపి భవనం బ్రహ్మణః పురే | శేతే తత్ర హరిః శ్రీమా న్యోగీ మాయామయః పరః || || 9 ||

స విష్ణులోకః కథితః పునరావృత్తివర్జితః | యాన్తి తత్ర మహాత్మానో యే ప్రపన్నా జనార్దనమ్‌ || || 10 ||

శాంతస్వభావులు, నిష్ఠకలవారు అగు సన్యాసులు, బ్రహ్మచారులు, యోగులు, మునులు, సిద్ధులు, పరమేష్ఠినిగూర్చి జపించువారు అక్కడ నివసింతురు. (6)

ఆ స్థానము పరమపదమును పొందు యోగులకు ఏకైకద్వారము. అక్కడికి వెళ్లినవారు ఎవ్వరును దుఃఖమును పొందరు. అతడు నారాయణరూపుడు, శంకరుడు కూడ. (7)

ఆదేవుని పట్టణము కోటి సూర్యులతో సమానతేజము కలది. అది పొందుటకు దుర్లభ##మైనది. జ్వాలల సమూహములతో కూడిన ఆ స్థానమును వర్ణించుట నాకు శక్యము కాదు. (8)

అక్కడ బ్రహ్మదేవుని పట్టణములో నారాయణదేవుని భవనమున్నది. దానిలో మాయామయుడు, యోగీశ్వరుడు, పరమపురుషుడును అగు శ్రీమహావిష్ణువు శయనించి యుండును. (9)

అది విష్ణులోకముగా చెప్పబడుచున్నది. అక్కడికి వెళ్లిన వారికి మరల జనన మరణాదులుండవు. జనార్దనుడగునారాయణుని ఆశ్రయించిన మహాత్ములు ఆలోకమునకు వెళ్లుదురు. (10)

ఊర్ధ్వం తద్ర్బహ్మసదనా త్పురం జ్యోతిర్మయం శుభమ్‌ | వహ్నినా చ పరిక్షిప్తం తత్ర స్తే భగవా న్హరః || || 11 ||

దేవ్యా సహ మహాదేవ శ్చిన్త్యమానో మనీషిభిః || యోగిభిః శతసాహస్త్రె ర్భూతై రుద్రైశ్చ సంవృతః || || 12 ||

తత్ర తే యాన్తి నిరతా భక్తా వై బ్రహ్మచారిణః | మహాదేవపరాః శాన్తా స్తాపసాః సత్యవాదినః || || 13 ||

నిర్మమా నిరహఙ్కారాః కామక్రోధవివర్జితాః | ద్రక్ష్యన్తి బ్రాహ్మణా యుక్తా రుద్రలోకః సవై స్మృతః || || 14 ||

ఏతే సప్త మహాలోకాః పృథివ్యాః పరికీర్తితాః | మహాతలాదయ శ్చాధః పాతాలాః సన్తివై ద్విజాః || || 15 ||

మహాతలం చ పాతాలం సర్వరత్నోపశోభితమ్‌ | ప్రాసాదై ర్వివిధైః శుభ్రై ర్దేవతాయతనై ర్యుతమ్‌ || || 16 ||

ఆబ్రహ్మలోకముకంటెపై భాగమున తేజోమయమైన, మంగళదాయకమైన పురము కలదు. అతి అగ్ని హూత్రముచేత ఆవరించబడి యుండును. అక్కడ భగవంతుడైన శివుడు నివాసముండును. (11)

అక్కడ శంకరుడు బుద్ధిమంతులైన మహాత్ములచేత సేవింపబడుచు వేలకొలది యోగులతో, భూతగణముతో, రుద్రులతో, పార్వతీదేవితో కూడ నెలకొనియుండును. (12)

ఆ లోకమునకు ఆసక్తులైన భక్తులు, బ్రహ్మచర్యము నవలంబించినవారు, మహాదేవుని యందు శ్రద్ధకలవారు, శాంతులు, సత్యవాదులైన మునులు వెళ్లుదురు. (13)

అహంకారమమకారములు లేనివారు, కామము క్రోధము విడిచినవారు, యోగ్యులు అయిన బ్రాహ్మణులు ఆలోకమును చూడగలరు. అది రుద్రలోకముగా చెప్పబడుచున్నది. (14)

ఇవి భూమికి సంబంధించిన ఏడు మహాలోకములుగా పేర్కొనబడినవి. బ్రాహ్మణులారా! క్రింది భాగములో మహాతలముమొదలగు పాతాలలోకములు కలవు. (15)

మహాతలమనబడు క్రిందిలోకము సమస్తమణులతో ప్రకాశించునది, నానావిధములైన స్వచ్ఛములైన సౌధములతో, దేవమందిరములతో అ%ి కూడియుండును. (16)

అనన్తేన చ సంయుక్తం ముచుకున్దేన ధీమతా | నృపేణ బలినా చైవ పాతాలం స్వర్గవాసినా || || 17 ||

శైలం రసాతలం విప్రాః శార్కరం హి తలాతలమ్‌ | పీతం సుతల మిత్యుక్తం వితలం విద్రుమ ప్రభమ్‌ || || 18 ||

సితం చ వితం ప్రోక్తం తలం చైవ సితేతరమ్‌ | సుపర్ణేన మునిశ్రేష్ఠా స్తథా వాసుకినా శుభమ్‌ || || 19 ||

రసాతల మితి ఖ్యాతం తథా న్యైశ్చ నిషేవితమ్‌ | విరోచనహిరణ్యాక్షతారకాద్యై శ్చ సేవితమ్‌ || || 20 ||

తలాతలమితి ఖ్యాతం సర్వశోభాసమన్వితమ్‌ | వైనతేయాదిభి శ్చైవ కాలనేమిపురోగమైః || || 21 ||

పూర్వదేవైః సమాకీర్ఱం సుతల ఞ్చ తథాపరైః | వితలం యవనాద్యై శ్చ తారకాగ్నిముఖై స్తథా || || 22 ||

అనంతునితో, బుద్ధిమంతుడైన ముచుకుందునితో, స్వర్గవాసియగు బలిరాజుతో పాతాళము కూడియున్నది. (17)

ద్విజులారా! రసాతలము శిలామయముగా, తలాతలము మొరపనేల కలదిగా, సుతలము పసుపుపచ్చ నేలకలదిగా, వితలము పగడాల రంగు కలదై ఉండును. (18)

వితలము తెలుపురంగుగాను, తలము నల్లరంగుతోను ఉండును. ఈలోకములు గరుత్మంతునితో, వాసుకితో, ఇంకు ఇంతరులతో కూడి రసాతలమనుపేర ప్రసిద్ధమైనవి. అది విరోచనుడు, హిరణ్యాక్షుడు మరియు తారకాది రాక్షసులచేత ఆశ్రయించబడినది. (20)

తలాతలమనుపేర ప్రఖ్యాతమైన, అన్ని సౌందర్యాలతో కూడియున్న లోకము వైనతేయుడు, కాలనేమి ప్రభృతులచే సేవింపడి యుండును. (21)

సుతలము పూర్వదేవులచే వ్యాపించబడి, ఇతరులతో కూడి కూడియున్నది. వితలము యవనాదులచేత, తారకాగ్ని ప్రభృతులతో కూడి యుండును. (22)

జమ్భుకాద్యై స్తథా నాగైః ప్రహ్లాదేనా సురేణ చ | వితలం చైవ విఖ్యాతం కమ్బలాహీన్ద్రసేవితమ్‌ || || 23 ||

మహాజమ్భేన వీరేణ హయగ్రీవేణ ధీమతా | శఙ్కుకర్ణేన సంభిన్నం తథా నముచిపూర్వకైః || || 24 ||

తథా న్యై ర్వివిధై ర్నాగై స్తలఞ్చైవ సుశోభనమ్‌ | తేషా మథస్తా న్నరకాః కూర్మాద్యాః పరికీర్తితాః || || 25 ||

పాపిన స్తేషు పచ్యన్తే న తే వర్ణయితుం క్షమాః | పాతాలానా మధ శ్చాస్తే శేషాఖ్యా వైష్ణవీ తనుః || || 26 ||

కాలాగ్నిరుద్రో యోగాత్మా నారసింహోపి మాధవః | యోనన్తః పఠ్యతే దేవో నాగరూపీ జనార్దనః || || 27 ||

జంభకుడు మొదలగునాగులచేత, అసురుడైన ప్రహ్లాదునితోకూడ కంబలనామక సర్పరాజుచేత సేవింపబడునది వితలమని ప్రసిద్ధమైనది. (23)

వీరుడైన మహాజంభునితో, బుద్ధిశాలియైన హయగ్రీవునితో శంకుకర్ణునితో కూడి మరియు నముచి మొదలుగా కల (24) ఇతర వివిధ నాగజాతులతో మిక్కిలి అందమైన తలము ఒప్పుచున్నది. ఆలోకాలకు క్రిందిభాగాన కూర్మాది నరకములు పేర్కొనబడినవి. (25)

ఆ నరకములలో పాపాత్ములు శిక్షింపబడుదురు. వారిని వర్ణించుట శక్యముకాడు. పాతాళలోకములకు అడుగుభాగములో శేషనామకమైన విష్ణుసంబంధి శరీరము కలదు. (26)

ఆ శేషమూర్తి కాలాగ్నిరుద్రుడని, యోగాత్ముడని, నారసింహుడు, మాధవుడు, అనంతుడు అనియు, నాగరూపము ధరించిన జనార్దనుడనియు ప్రస్తుతింపబడుచున్నాడు. (27)

తదాధార మిదం సర్వం స కాలాగ్నిం సమాశ్రితః | త మావిశ్య మహాయోగీ కాల స్తద్వదనోషితః || || 28 ||

విషజ్వాలామయ శ్చేశో జగ త్సంహరతి స్వయమ్‌ | సహస్రమారిప్రతిమః సంహర్తా శఙ్కరో భవః || || 29 ||

తామసీ శామ్భవీ మూర్తిః కాలో లోక ప్రకాలనః ||

ఇతి శ్రీ కూర్మపురాణ భువనవిన్యాసే చతుశ్చత్వారింశోధ్యాయః

ఈ సమస్తము ఆయనపై ఆధారపడియున్నది. అతడు కాలాగ్నిని ఆశ్రయించి ఉన్నాడు. గొప్పయోగియగు కాలుడు అతని నావేశించి ముఖమునందు నివసించుచు, విషజ్వాలలతో నిండిన ఈశ్వరరూపుడై స్వయముగా విశ్వమును సంహరించును. వేయి మారిదేవతల సమానుడైన శంకరుడు సంహరించువాడుగచున్నాడు. తమోగుణ ప్రధానమైన, శంభునికి సంబంధించిన మూర్తియే లోకములను లయింపజేయు కాలరూపుడు. (28, 29)

శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసవర్ణనలో నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters