Sri Koorma Mahapuranam
Chapters
అథచతుర్థో೭ధ్యాయః ఈశ్వర ఉవాచ :- వక్ష్యే సమాహితా యూయం శ్రుణధ్వం బ్రహ్మవాదినః | మాహాత్మ్యం దేవదేవస్య యేన సర్వం ప్రవర్తతే ||
|| 1 || నాహం తపోభి ర్వివిధై ర్న దానేన న చేజ్యయా | శక్యో హి పురుషై ర్జాతు మృతే భక్తి మనుత్తమామ్ ||
|| 2 || అహం హి సర్వభూతానా మన్త స్తిష్ఠామి సర్వతః | మాం సర్వసాక్షిణం లోకో న జానాతి మునీశ్వరాం ||
|| 3 || యస్యాన్తరా సర్వ మిదం యోహి సర్వాన్తకః పరః | సో೭హం ధాతా విధాతా చ కాలో೭గ్ని ర్విశ్వతోముఖః || || 4 || న మాం పశ్యన్తి మునయః సర్వే పితృదివౌకసః | బ్రహ్మా చ మనవః శక్రో యేచాన్యో ప్రథితౌజసః ||
|| 5 || ఓ బ్రహ్మవాదులారా! ఏదేవదేవుని చేత సమస్తము ప్రవర్తించునో అతని మాహాత్మ్యమును చెప్పుదును. మీరు సావధానులై వినుడు. (1) నేను వివిధములైన తపస్సులచేత, దానముచేత, యజ్ఞకర్మచేత కాని తెలిసికొనుటకు శక్యుడను కాను. శ్రేష్ఠమైన భక్తిచే కాక మరొక విధముగా నన్ను తెలియలేరు. (2) నేను సమస్తభూతములలోపల అంతట వ్యాపించి ఉంటాను. ఓ మునీశ్వరులారా! ఈ లోకము సర్వసాక్షినైన నన్ను సరిగా గుర్తించదు. (3) ఈ సమస్తము ఎవనిలోపల నిండియుండునో, ఎవడు గొప్పనైన సర్వలయకారకుడో, అట్టినేను ధాతను, విధాతను, కాలరూపుడను, అగ్నిని అంతటముఖములు కలవాడను (4) అందరు మునులు, పితరులు, దేవతలు, బ్రహ్మదేవుడు, మనువులు, ఇంద్రుడు, ఇంకను ఇతరులు మహిమాన్వితులుగా ప్రసిద్ధులోవారెవ్వరు నన్ను చూడలేరు. (5) గృణన్తి సతతం వేదా మా మేకం పరమేశ్వరమ్ | యజన్తి వివిధై ర్యజ్ఞై ర్ర్బాహ్మణాః వైదికై ర్మఖైః ||
|| 6 || సర్వే లోకా న పశ్యన్తి బ్రహ్మా లోకపితామహః | ధ్యాయన్తి యోగినో దేవం భూతాధిపతి మీశ్వరమ్ ||
|| 7 || అహం హి సర్వహవిషాం భోక్తా చైవ ఫలప్రదః | సర్వదేవతను ర్భూత్వా సర్వాత్మా సర్వసంప్లుతః ||
|| 8 || మాం పశ్యన్తీహ విద్వాంసో ధార్మికా వేదవాదినః | తేషాం సన్నిహితో నిత్యం యే మాం నిత్య ముపాసతే ||
|| 9 || బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా ధార్మికా మా ముపాసతే | తేషాం దదామి తత్ స్థానం మానన్దం పరమం పదమ్ ||
|| 10 || అన్యేపి యే స్వధర్మస్థాః శూద్రాద్యా నీచజాతయః | భక్తిమన్తః ప్రముచ్యన్తే కాలేనా పి హి సంగతాః ||
|| 11 || వేదాలు ఎల్లప్పుడు నన్ను ఒక్కణ్ణి పరమేశ్వరుణ్ణిగా వర్ణించును. బ్రాహ్మణులు వివిధములైన వేదవిహిత యజ్ఞాలతో ననన్ను పూజింతరు. (6) లోకపితాహుడైన బ్రహ్మ, సమస్త లోకాలు కూడ నన్ను చూడలేవు. యోగులు భూతాధిపతి, ఈశ్వరుడు అగు భగవంతుని నన్ను ధ్యానింతురు. (7) నేనే సర్వహవిస్సులకు భోక్తను, ఫలములనిచ్చేవాడను. సర్వదేవతలు శరీరములుగా కలవాడనై, సర్వాత్మకుడను, అంతట వ్యాపించిన వాడను అగుచున్నాను. (8) వేదవాదులు, ధర్మస్వరూపులు అగు పండితులు నన్ను దర్శించుచున్నారు. ఎవరునన్ను ఎల్లప్పుడు సేవింతురో వారికినేను అందుబాటులో ఉంటాను. (9) ధర్మస్వభావులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నన్ను పూజింతురు. వారికి ఆనందమయమైన. ఆపరమ పదమును ఇచ్చెదను. (10) శూద్రులు మొదలుగా కల ఇతర జాతులవారు కూడ తమ ధర్మమునవలంబించినవారై, భక్తికలవారై సేవింతుకో వారుకూడ కాలము కలిసి వచ్చి ముక్తిని పొందుదురు. (11) మద్భక్తా న వినశ్యన్తి మద్భక్తా వీతకల్మషాః | ఆదా వేవ ప్రతిజ్ఞాతం న మే భక్తః ప్రణశ్యతి ||
|| 12 || యో వై నిన్దతి తం మూఢో దేవదేవం సప నిన్దతి | యోహి పూజయతే భక్త్యా స పూజయతి మాం సదా ||
|| 13 || పత్రం పుష్పం ఫలం తోయం మదారాధానకారణాత్ | యో మే దదాతి సతతం స మే భక్తిః ప్రియో మమ ||
|| 14 || అహం హి జగతా మాదౌ బ్రహ్మాణం పరమేష్ఠినమ్ | విదధౌ దత్తవా న్వేదా నశేషా నాత్మనిఃసృతాన్ ||
|| 15 || అహ మేవ హి సర్వేషాం యోగినాం గురు రవ్యయః | ధార్మికానాం చ గోప్తాహం నిహన్తా వేదవిద్విషామ్ ||
|| 16 || అహం హి సర్వసంసారా న్మోచకోయోగినా మిహ | సంసారహేతు రే వాహం సర్వసంసారవర్జితః ||
|| 17 || నా భక్తులు నశించరు. నా భక్తులు తొలగిన పాపములు కలవారగుదురు. నా భక్తుడు నాశము పొందడని మొదటనే ప్రతిజ్ఞచేసితిని. (12) ఏ మూఢుడు అటువంటి భక్తుని నిందించునో, వాడు దేవదేవుని నిందించిన వాడగును. ఎవడు భక్తితో నాభక్తునారాధించునో, వాడు నన్ను పూజించివాడగును. (13) ఆకు, పూవు, పండు, నీరు అను వస్తువులను ఎవరు నాపూజనిమిత్తముగా అర్పింతురో, అట్టివారు నాకు ప్రియమైన భక్తులుగా ఇష్టులు. (14) నేను మొట్టమొదట ప్రపంచమునకు పరమేష్ఠియగు బ్రహ్మను సృజించితిని. అతనికి నా నుండి బయల్వెడలిని వేదములనప్పగించితిని. (15) నేను సమస్త యోగులకు నాశరహితుడైన గురువును. ధర్మాత్ములను కాపాడువాడను. వేద శత్రువులను సంహరించువాడను నేనే (16) ఈ లోకములో యోగులకు సంసారబంధమునుండి విముక్తి కలిగించువాడను, సంసారమునకు కారణభూతుడను, సంసారబంధములేనివాడను నేనే. (17) అహ మేవ హి సంహర్తా సంస్రష్టా పరిపాలకః | మాయా వై మామికా శక్తి ర్మాయా లోకవిమోహినీ ||
|| 18 || మమైవ చ పరాశక్తి ర్యా సా విద్యేతి గీయతే | నాశయామి చ తాం మాయాం యోగినాం హృది సంస్థితః ||
|| 19 || అహం హి సర్వశక్తీనాం ప్రవర్తకనివర్తకః | ఆధారభూతః సర్వాసాం విధాన మమృతస్య చ ||
|| 20 || ఏకా సర్వాన్తరా శక్తిః కరోతి వివిధం జగత్ | ఆస్థాయ బ్రహ్మణో రూపం మన్మయీ మదధిష్ఠితా ||
|| 21 || అన్యా చ శక్తి ర్వుపులా సంస్థాపయతి మే జగత్ | భూత్వా నారాయణో೭నన్తో జగన్నాథో జగన్మయః ||
|| 22 || తృతీయా మహతీ శక్తి ర్నిహన్తి సకలం జగత్ | తామసీ మే సమాఖ్యాతా కాలాఖ్యా రుద్రరూపిణీ ||
|| 23 || నేనే సంహరించువాడను, సృజించువాడను, రక్షించువాడను కూడ. మాయ అనునది నాయొక్క శక్తి. ఈ మాయ లోకములను మోహింపజేయును. (18) నాయొక్క పరాశక్తియే విద్య అని కీర్తింపబడుచున్నది. యోగుల యొక్క హృదయ మందున్నవాడనై ఆ మాయను నశింపజేయుచున్నాను. (19) నేనే అన్ని శక్తుల యొక్క ప్రవర్తకుడను, నివర్తింపజేయువాడను కూడ. అన్ని శక్తులకు ఆధారమైన వాడను. అమృతమునకు స్థానమైన వాడను. (20) అన్నిటియందునిండియున్న ఒక్కశక్తియే సమస్త ప్రపంచమును నిర్మించుచున్నది. బ్రహ్మయొక్క రూపమును ధరించి, నా స్వరూపము కలదై నన్నాశ్రయించి ఆశక్తి పని చేయును. (21) మరియొక విశాలమైన నా శక్తి లోకమును స్థాపించుచుండును. అనంతుడు, జగన్నాథుడు, జగన్మయుడు అగు నారాయణరూపము కలదై ఆపనిచేయును. (22) మూడవదైన నా గొప్పశక్తి సమస్త విశ్వమును లయింపజేయును. అది తమోగుణప్రధానమై, కాలనామకమైన, రుద్రరూపిణియై యుండును. (23) ధ్యానేన మాం ప్రపశ్యన్తి కేచిత్ జ్ఞానేన చాపరే | అపరే భక్తియోగేన కర్మయోగేన చాపరే ||
|| 24 || సర్వేషా మేవ భక్తానా మిష్టః ప్రియతమో మమ | యో హి జ్ఞానేన మాం నిత్య మారాధయతి నాన్యథా ||
|| 25 || అన్యే చ హరయే భక్తా మదారాధనకారిణః | తే೭పి మాం ప్రాప్నువన్త్యేవ నావర్తన్తే చ వై పునః ||
|| 26 || మయా తత మిదం కృత్స్నం ప్రధానపురుషాత్మకమ్ | మయ్యేవ సంస్థితం చిత్తం మయా సంప్రేర్యతే జగత్ ||
|| 27 || నాహం ప్రేరయితా విప్రాః పరమం యోగ మాస్థితః | ప్రేయామి జగ త్కృత్స్న మేత ద్యోవేద సో೭మృతః || || 28 || పశ్యామ్య శేష మే వేదం వర్తమానం స్వభావతః | కరోతి కాఓ భగవా న్మహాయోగేశ్వరః స్వయమ్ ||
|| 29 || కొందరు నన్ను ధ్యానముతో దర్శింతురు. మరికొందరు జ్ఞానమార్గముతో చూచెదరు. ఇతరులు భక్తియోగముతో, కొందరు కర్మయోగముతో నన్ను సాక్షాత్కరించుకొందురు. (24) అన్ని విధముల భక్తులలోను, ఎవడైతే జ్ఞానమార్గముతో ఎల్లప్పుడు నన్నారాధించునో, ఇతర పద్ధతినాశ్రయింపడో అతడే నాకు మిక్కిలి ప్రియమైనవాడు, ఇష్టుడను అగుచున్నాడు. (25) విష్ణువునకు భక్తులైన ఇతరులు కూడ నన్ను ఆరాధించినట్లైన వారుకూడ నన్ను చేరుకొందరు. మరల జన్మ పరంపరను పొందరు. (26) ప్రధాన, పురుష స్వరూపమైన యీ సమస్త విశ్వము నాచేత వ్యాపింపజేయబడినది. మనస్సనునది నాయందే నిలిచియున్నది. ఈ లోకమునాచే ప్రేరేపింపబడుచున్నది. (27) గొప్పనైన యోగము నాశ్రయించిననేను ప్రేరకుడను కాను. ఓ బ్రాహ్మణులారా! సమస్త లోకమునకు నేను ప్రేరణ కలిగించుచున్నాను. దీనిని తెలిసినవాడు అమృతస్వరూపుడగును. (28) స్వభావముచేతనే ప్రవర్తించుచున్న యీ సమస్తమును నేను చూచుచున్నాను. మహాయోగేశ్వరుడు, కాలరూపుడగు భగవంతుడు స్వయముగా దీనినంతయు చేయుచున్నాడు. (29) యో೭హం సంప్రోచ్యతే యోగీ మాయీ శాస్త్రేషు సూరిభిః | యోగీవ్వరో೭సౌ భగవాన్ మహాయోగేశ్వరః స్వయమ్ ||
|| 30 || మహత్త్వం సర్వసత్త్వానాం వరత్వా త్పరమేష్ఠినః | ప్రోచ్యతే భగవాన్ మహాబ్రహ్మమయో೭మలః || || 31 || యో మా మేవం విజానాతి మహాయోగేశ్వరేశ్వరమ్ | సో೭వికల్పేన యేగేన యుజ్యతే నాత్ర సంశయః ||
|| 32 || సో೭హం ప్రేయితా దేవః పరమానన్ద మాశ్రితః | నృత్యామి యోగీ సతతం యస్త ద్వేద స యోగవిత్ ||
|| 33 || ఇతి గుహ్యతమం జ్ఞానం సర్వవేదేషు నిశ్చితమ్ | ప్రసన్నచేతసే దేయం ధార్మికాయా హితాగ్నయే ||
|| 34 || ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వర గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ఋషి వ్యాస సంవాదే చతుర్థో೭ధ్యాయః శాస్త్రములయందు పండితులచేత మాయామయుడని, యోగి అని చెప్పబడునేను స్వయముగా భగవంతుడగు మహాయోగేశ్వర రూపుడను. (30) సమస్త సత్త్వముల యొక్క గొప్పతనము, పరమేష్ఠి యొక్క శ్రేష్ఠత్వమువలన భగవంతుడగు బ్రహ్మ, మహాబ్రహ్మమయుడని, అమలుడని చెప్పబడుచున్నాడు. (31) ఎవడైతే నన్ను ఈవిధముగా మహాయోగేశ్వరేశ్వరుడని తెలిసికొనునో, వాడు నిర్వికల్పయోగముతో కూడుకొనుటలో సందేహము లేదు. (32) అట్టి నేను ప్రేరకుడనై పరమానందమును పొంది యోగినై నృత్యముచేయుదును. ఎవడుదానిని తెలియునో వాడు యోగవేత్త అనబడును. (33) మిక్కిలి రహస్యమైన, అన్ని వేదములయందు నిర్ధారింపబడిన జ్ఞానము, నిర్మలమనస్సు కలవాడు, ధర్మస్వభావుడు, ఆహితాగ్ని అగు వానికి ఉపదేశింపదగినది. (34) శ్రీ కూర్మపురాణము ఉత్తరార్థములో ఈశ్వరగీతయను ఉపనిషత్తునందు బ్రహ్మవిద్యయగు యోగశాస్త్రములో ఋషివ్యాససంవాదమను నాలుగవ అధ్యాయము సమాప్తము.