Sri Koorma Mahapuranam    Chapters   

సప్తమో7ధ్యాయః

అథ సృష్టివర్ణనమ్‌ - కూర్మ ఉవాచ | సృష్టిం చిన్తయత స్తస్య కల్పాదిషు యథా పురా| అబుద్ధిపూర్వకః సర్గః ప్రాదుర్భూతస్తమోమయః|| 1

తమోమోహ మహామోహ స్తామిస్రశ్చాన్ధ సంజ్ఞితః | అవిద్యా పఞ్చమీ తేషాం ప్రాదుర్భూతా మహాత్మనః ||2

పఞ్ఛధా వస్థితః సర్గో ధ్యాయతః సో2భిమానినః| సంవృత స్తమసా చైవ బీజకుమ్భవ దావృతః || 3

బహి రన్త శ్చాప్రకాశ స్తబ్ధో నిఃసంగ ఏవ చ| ముఖ్యానగా ఇతిప్రోక్తా ముఖ్య సర్గస్తు స స్మృతః || 4

తం దృష్ట్వ్యా సాధకం సర్గ మమస్య దపరం ప్రభుః తస్యా భిధ్యాయతః సర్గంతిర్యక్‌ స్రోతో2 భ్యవర్తత|| 5

సప్తమోధ్యాయము

సృష్టివర్ణనమ్‌

కూర్మస్వామి ఇట్లనెను.

ఆ విష్ణువు సృష్టిని గూర్చి ఆలోచించుచుండగా, ఆయాకల్పాలలో పూర్వము జరిగినట్టుగా, బుద్ధిపూర్వకము కాని అంధకారమయమైన సృష్టి అవిర్భవించెను(1)

మహాత్ముడైన అవిష్ణువు నుండి తమోమోహము, మహామోహము, తామిస్రము, అంధము, అవిద్య అని అయిదు విధములుగా తమోమయమైన సర్గము కలిగినది. (2)

అభిమానము కలిగి ధ్యానించుచున్న ఆ భగవంతునికి అయిదు ప్రకారములుగా ఉన్న సర్గము కుండచే కప్పబడిన బీజమువలె చీకటితో కప్పబడి ఉండెను. (3)

లోపల బయట కూడ వెలుతురు లేనిది, జడముగా ఉన్నది. సంబంధరహితము, ముఖ్యములైన పర్వతములని చెప్పబడినది, ప్రధాన సరమని తలపబడినది.(4)

ప్రభువైన విష్ణువు ఆసర్గము సమగ్రము కాదని తలచి మరొకసృష్టిని గూర్చి చింతించుండగా అడ్డముగా ఒక ప్రవాహము బయలుదేరినది (5)

యస్మాత్తిర్యక్‌ ప్రవృత్తః స తిర్యక్‌స్రోతః తతః స్మృతః పశ్యాదయ స్తే విఖ్యాత ఉత్పథగ్రాహిణో ద్విజాః|| 6

తమ ప్యసాధకం జ్ఞాత్వా సర్గ మన్యం ససర్జ హ| ఊర్ధ్వస్రోత ఇతి ప్రోక్తో దేవసర్గ స్తు సాత్త్వికః|| 7

తే సుఖప్రీతిబహులా బహి రన్తస్త్వనావృతాః| ప్రకాశా బహి రన్తశ్చ స్వభావా ద్దేవసంజ్ఞితాః||8

తతో2భిధ్యాయత స్తస్య సత్యాభిధ్యాయిన స్తదా|ప్రాదురాసీ త్తదా వ్యక్తా దర్వాక్‌ స్రోతస్తు సాధకః|| 9

తత్ర ప్రకాశబహులా స్తమోద్రిక్తా రజోధికాః | దుఃఖోత్కటాః సత్త్వయుతా మనుష్యాః పరికీర్తితాః|| 10

ఆ ప్రవాహము అడ్డముగా ప్రసరించినందున తిర్యక్‌స్రోతమని చెప్పబడినది. బ్రహ్మాణులారా! భిన్నమార్గమున గ్రహించినందున అవి పశ్వాదులుగా ప్రసిద్ధములైనవి.(6)

అది కూడా తృప్తికరము కాదని తలచి మరియొక సర్గమును సృష్టించినాడు. అది సత్త్వగుణ ప్రధానమైన దేవతాజాతి సర్గము. ఊర్థ్వస్రోతమని చెప్పబడినది(7)

ఆ దేవతలు సుఖములందు ఎక్కువ ప్రీతికలవారు, లోపల, బయట కూడ ఆవరణము లేనివారు, లోపలవెలుపల ప్రకాశముకలవారు స్వభావమును బట్టి దేవతలని పేర్కొనబడినారు.(8)

తరువాత మరల ఆ బ్రహ్మ ధ్యానాంచుచుండగా ఆవ్యక్తరూపమునుండి, ప్రయోజనకరమైన అర్వాక్‌స్రోతస్సు ప్రాదుర్భవించినది.(9)

దానియందు అధికప్రకాశము కలవారు, తమోగుణముచేత ఉద్రేకము పొందువారు, రజోగుణము ఎక్కువగా కలవారు, అధికదుఃఖముతో బాధపడువారు, సత్త్వగుణముతో కూడినవారు అగు మునుష్యులుగా వ్యవహరింపబడినారు.(10)

తం దృష్ట్వా చాపరం సర్గ మమస్య ద్భగవా నతః| తస్యాభిధ్యాయతః సర్గం సర్గో భూతాదికో2 భవత్‌||11

తే పరిగ్రహిణః సర్వే సంవిభాగరతాః పునః| ఖాదినశ్చాప్యశీలాశ్చ భూతాద్యాః పరికీర్తితాః||12

ఇత్యేతే పఞ్చకథితాః సర్గా వై ద్విజపుంగవాః| ప్రథమో మహతః సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తు సః|| 13

తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్గో హి సంస్మృతః| వైకారిక స్తృతీయస్తు సర్గ ఐన్ద్రియకః స్మృతః||14

ఇత్యేష ప్రాకృతః సర్గః సంభూతో బుద్ధిపూర్వకః| ముఖ్యసర్గ శ్చతుర్థస్తు ముఖ్యావై స్థావరాః స్మృతాః|| 15

ఆ రెండవ సృష్టిని చూచి భగవంతుడైన బ్రహ్మ ధ్యానించెను. ఆ సృష్టిని గూర్చి అతడు ధ్యానించుచుండగా ప్రాణులు మొదలగువానితో కూడిన సృష్టి ఏర్పడినది. (11)

అవి అన్నీ సంవిభాగముతోకూడి, పరిగ్రహించునవై, ప్రాణులనుతినేవి, శీలరహితములు అయిన భూతాదులుగా చెప్పబడినాయి. (12)

ఓ బ్రాహ్మణశ్రేష్టులారా ఇవి అయిదు సర్గములు అని చెప్పబడినవి. వీనిలో మొదటిది మహత్తత్త్వము యొక్క సర్గము. అది బ్రహ్మకు సంబంధించినదిగా తెలియదగును.(13)

రెండవది పంచతన్మాత్రలకు సంబంధించిన ప్రాణుల సృష్టిగా గుర్తింపదగినది. మూడవది తన్మాత్రల వికారములైన ఇంద్రియములకు సంబంధించిన సర్గము. (14)

ఈవిధముగా బుద్ధిపూర్వకమైన సకల ప్రాకృతసర్గము ఏర్పడినది. నాలుగవ సర్గము ముఖ్యమైనది. అవి స్థావరరూపములైన పదార్ధములుగా ముఖ్య సర్గముగా పేర్కొనబడినవి.(15)

తిర్యక్‌స్రోత స్తు యః ప్రోక్త స్తిర్యగ్యోన్యః స పఞ్చమః| తతోర్ధ్వ స్రోతసాం షష్ఠో దేవసర్గస్తు స స్మృతః|| 16

తతో ర్వాక్‌స్రోతసాం సర్గః సప్తమః సతు మానుషః| అష్టమో భౌతికః సర్గో భూతాదీనాం ప్రకీర్తితః|| 17

నవమ శ్చైవ కౌమరః ప్రాకృతా వైకృతాస్త్విమే| ప్రాకృతాస్తు త్రయః పూర్వే సర్గాస్తే బుద్ధిపూర్వకాః || 18

బుద్ధిపూర్వం ప్రవర్తన్తే ముఖ్యాద్యా మునిపుంగవాః | అగ్రే ససర్జ వై బ్రహ్మా మానసా నాత్మనః సమాన్‌|| 19

సనకం సనాతనం చైవ తథైవ చ సనన్దనమ్‌| క్రతుం సనత్కుమారం చ పూర్వమేవ ప్రజాపతిః|| 20

తిర్యక్‌ స్రోతస్సుగా చెప్పబడినది అయిదవసర్గము.అదిపశుపక్ష్యాది రూప ప్రాణులతో కూడి ఉన్నది. తరువాత ఊర్ధేరేతస్సు కల దేవతల సరము సృష్టి అరవవిభాగానికి చెందుతుంది.(16)

తరువాత ఏడవసర్గము మునుష్యులకు సంబంధించినది. అది అధోరేతస్కుల యొక్కసృష్టి. ఊర్ధ్వరేతస్కుల కానివారిది. ఎనిమిదవది భౌతికసర్గము. అది భూతములు మొదలగువానికి సంబంధించినది. (17)

తొమ్మిదవది కౌమారసర్గము. ఈ సర్గములలో కొన్ని ప్రాకృతములు, మరి కొన్ని వైకృతములు. మొదటి మూడు ప్రాకృతసర్గములు, అవి బుద్ధిపూర్వకమైనవి. (18)

మునిశ్రేష్టులారా! ముఖ్యతత్త్వము మొదలగునవి బుద్ధిపూర్వకముగా ప్రవర్తించును. బ్రహ్మ ముందుగా తనతోసమానులైన యీక్రిందివారిని మానసపుత్రులుగా సృజించెను.(19)

సనకుని, సనాతనుని, అట్లే సనందనుని, క్రతవును, సనత్కుమారుని కూడ ప్రజాపతి అగు బ్రహ్మ సృజించెను. (20)

పఞ్చైతే యోగినో విప్రాః పరం వైరాగ్య మాశ్రితాః | ఈశ్వరాసక్తమనసో న సృష్టౌ దధిరే మతిమ్‌|| 21

తేష్వేవం నిరపేక్షేషు లోకసృష్టౌ ప్రజాపతిః | ముమోహ మాయయా సద్యో మాయినః పరమేష్ఠినః || 22

సంబోధయామాస చ తం జగన్మాయో మహామునిః | నారాయణో మహాయోగీ యోగిచిత్తానురఞ్జనః|| 23

బోధిత స్తేన విశ్వాత్మా తతాప పరమం తపః | సతప్యమానో భగవా న్న కిఞ్చ త్ప్రత్యపద్యత|| 24

తతో దీర్ఘేణ కాలేన దుఃఖాత్క్రాధో2 భ్యజాయత | క్రోధావిష్టస్య నేత్యాభ్యాం ప్రాపత న్నశ్రుబిన్దవః|| 25

ఓ బ్రాహ్మణులారా! ఈ అయిదుగురు యోగులు గొప్పవైరాగ్యము నాశ్రయించి, భగవంతునియందే మనస్సుగలవారై, సృష్టికార్యము నందు బుద్ధిని ప్రసరింపజేయరైరి.(21)

వారు ఈరీతిగా కోరికలేని వారు కాగా ప్రజాపతియగు బ్రహ్మ లోకమును సృజించుటయందు, మాయామయుడైన పరమేష్టివలన మాయచే వెంటనే మోహితుడాయెను. (22)

మోహితుడైన బ్రహ్మను, లోకమును మాయలోనింపిన నారాయణుడు, మహాముని, మహాయోగిస్వరూపుడు, యోగీశ్వరుల మనుస్సును సంతోషపరచు వాడునై మాయనుండి మేలుకొలిపెను.(23)

ఆనారాయణునిచేత మేలుకొలుపబడిన విశ్వాత్ముడైన బ్రహ్మ తీవ్రమైన తపస్సును చేసెను. తపస్సుచేయుచున్న ఆభగవంతుడు ఇతరము దేనిని గూడ గుర్తించక ఉండెను.(24)

తరువాత చాలా కాలమునకు తపస్సులోని క్లేశదుఃఖములవలన అతనికి కోపము కలిగినది. కోపముతో కూడిన ఆయన కన్నులనుండి బాష్పబిందువులు జారిపడినవి.(25)

భృకుటీకుటిలా త్తస్య లలాటా త్పరమేష్టినః| సముత్పన్నో మహాదేవః శరణ్యో నీలరోహితః|| 26

స ఏవ భగవా నీశ స్తేజోరాశిః సనాతనః| యం ప్రపశ్యంతి విద్యాంసః స్మాత్మస్థం పరమేశ్వరమ్‌|| 27

ఓంకారం సమనుస్మృత్య ప్రణమ్య చ కృతాఞ్చలిః| తమహ భగవాన్‌ బ్రహ్మా సృజేమా వివిధాః ప్రజాః|| 28

నిశిమ్య భగవద్వాక్యం శంకరో ధర్మవాహనః| ఆత్మనా సదృశాన్‌ రుద్రాన్‌ ససర్జ మనసా శివః|| 29

కపర్దినో నిరాటజ్కాం స్త్రిణత్రా న్నీలలోహితాన్‌| తంప్రాహ భగవాన్‌ బ్రహ్మా జన్మమృత్యుయుతాః ప్రజాః|| 30

సృజేతి సో2 బ్రవీ దీశో నాహం మృత్యుజరాన్వితాః| ప్రజాః స్రక్ష్యే జగన్నాథ సృజ త్వ మశుభాః ప్రజాః|| 31

బొమ్మముడిచేత వంకరయిన బ్రహ్మయొక్క నొసటినుండి, శరణుపొందదగినవాడు, నీలలోహితుడును అగు మహాదేవుడు (శివుడు) పుట్టెను.(26)

అతడే భగవంతుడు తేజస్సులసమూహము, అతిపురాతనుడు, ఎవనిని పండితులు తమ ఆత్మలయందున్న పరమేశ్వరునిగా భావింతురో అతడే శివుడు.(27)

అప్పుడు భగవంతుడైన బ్రహ్మ ఓంకారమును స్మరించి, శివునికి నమస్కరించి, చేతులు జోడించి, వివిధ ప్రజలను సృజింపుమని అతనితో పలికెను.(28)

ధర్మము వాహనముగా కల శంకుడు బ్రహ్మయొక్క వాక్యమును విని తనతో సమానులైన మరికొందరు రుద్రులను సంకల్పముతో సృజించెను.(29)

వారు జటాజూటముకలవారు, మూడుకన్నులుకలవారు, అటంకరహితులు, నీలలోహితులుగా ఉండిరి. భగవంతుడగు బ్రహ్మ శివునితో, జననమరణములు కల ప్రజలను. (30)

సృజించుము. అని పలికెను. అప్పుడా శివుడు ఇట్లుపలికెను. నేను జరామరణములుకల జనులను సృజించను. ఓ జగన్నాథా! అటువంటి అశుభప్రజలను నీవే సృష్టించుము'' అనెను (31)

నివార్య స తదా రుద్రం ససర్జ కమలోద్భవః| స్థానాభిమానినః సర్వాన్‌ గదత స్తాన్నిబోధత||32

అపో2గ్నిరంతరిక్షం చ ద్యౌర్యాయుః పృథివీ తథా| నద్యః సముద్రాః శైలాశ్చ వృక్షావీరుధ ఏవచ||33

లవాః కాష్ఠాః కరా శ్చైవ ముహూర్తా దివసాః క్షపాః అర్ధమాసాశ్చ మాసాశ్చ అయనాబ్దయుగాదయః ||34

మరీచిభృగ్వజ్గిరసః పులస్త్యం పులహం క్రతుమ్‌| దక్ష మత్రిం వసిష్ఠంచ ధర్మం సంకల్ప మేవచ|| 35

అప్పుడు బ్రహ్మ శివుని వారించి స్థానాభిమానులైన అన్నిటిని సృష్టించినాడు. వానిని చెప్పుదును, తెలుసుకొనుడు.(32)

జలము, అగ్ని, ఆకాశము, వాయువు, భూమి, స్వర్గము, నదులు, సముద్రాలు, పర్వతాలు, వృక్షములు, తీగలును; (33)

లవములు, కాష్ఠలు, కలలు, ముహూర్తములు, పగళ్ళు, రాత్రులు, పక్షములు, మాసములు, అయనములు, సంవత్సరాలు, యుగములు మొదలగు కాలభేదములు. (34)

స్థానాభిమానులైన వానిని సృజించి మరల సాధకములను సృష్టించెను. మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వసిష్ఠుడు, ధర్ముడు, సంకల్పుడు అనువారిని; (35)

ప్రాణా ద్బహ్మ్రా సృజ ద్దక్షం చక్షుర్భ్యాం చ మరీచినమ్‌| శిరసో2 జ్గిరసం దేవో హృదయా ద్భృగు మేవచ||36

నేత్రాభ్యా మత్రినామానం ధర్మం చ వ్యవసాయతః| సంకల్పం చైవ సంకల్పాత్‌ సర్వలోకపితామహః|| 37

పులస్త్యంచ తథోదానా ద్వ్యానాచ్చ పులహం మునిమ్‌| అపానాత్‌ క్రతు మవ్యగ్రం సమానాచ్చ వసిష్ఠకమ్‌|| 38

ఇత్యేతే బ్రహ్మణా సృష్టాః సాధకా గృహమేధినః| ఆస్థాయ మానవం రూపం ధర్మసై#్తః సంప్రవర్తితః|| 39

తతో దేవాసురపితౄన్‌ మనుష్యాం శ్చ చతుష్టయమ్‌ సిసృక్షు ర్భగవా నీశః స్వ మాత్మాన మయోజయత్‌|| 40

బ్రహ్మదేవుడు ప్రాణమునుండి దక్షుని సృష్టించినాడు. కన్నులనుండి మరీచిని, శిరస్సునుండి అంగిరసుని, హృదయము నుండి భృగువును, సృజియించినాడు. (36)

కన్నులనుండి అత్రియను పేరుగల మునిని, తన వ్యవసాయమునుండి ధర్మపురుషుని, సంకల్పమునుండి సంకల్పదేవతను, సర్వలోక పితామహుడైన బ్రహ్మ సృష్టించినాడు.(37)

ఉదానవాయువునుండి పులస్త్యుని, వ్యానవాయువునుండి పులహుని, అపానమునుండి విచలితుడుకాని క్రతువును, సమానవాయువునుండి వసిష్ఠుని సృజించెను. (38)

ఈ చెప్పబడినవారందరు బ్రహ్మదేవునిచే సృజింపబడిన సాధకులైన గృహస్థులు. మానవశరీరమునధిష్ఠించి వారిచేత లోకములో ధర్మము ప్రవర్తింపచేయబడినది. (39)

తరువాత దేవతలను అసురలను, పితరులను, మనుష్యులను నాలుగువర్గాలుగా సృజించదలిచినవాడై భగవంతుడైన సృష్టికర్త, తనను ఆకార్యములో నిమగ్నునికావించుకొనెను. (40)

యుక్తాత్మన స్తమోమాత్రా హ్యుద్రిక్తా భూ త్ప్రజాపతేః | తతో2 స్య జఘనా త్పూర్వం అసురా జజ్ఞిరే సుతాః || 41

ఉత్ససర్జా సురాన్‌ సృష్ట్వా తాం తనుం పురుషోత్తమః| సాచోత్సృష్టా తనుస్తేన సద్యోరాత్రి రజాయత|| 42

సా తమోబహులా యస్మాత్‌ ప్రజా స్తస్యాం స్వపన్త్యతః| సత్త్వమాత్రాత్మికాం దేవ స్తను మన్యాం గృహీతవాన్‌|| 43

తతో2 స్య ముఖతో దేవా దీవ్యతః సంప్రజజ్ఞిరే | త్యక్తా సాపి తనుస్తేవ సత్యప్రాయ మభూద్దినమ్‌|| 44

తస్మా దహో ధర్మయుక్తా దేవతాః సముపాసతే | సత్వమాత్రాత్మికా మేవ తతో2 న్యాం జగృహే తనుమ్‌|| 45

తనను నియమించుకొన్న ప్రజాపతి నుండి తమోగుణము యొక్క పరిమాణము వృద్ధిచెందెను. అప్పుడతని జఘనభాగమునుండి ముందుగా కుమారులుగా అసురులు జన్మించిరి. (41)

అసురులను సృజించిన తరువాత పురుషోత్తముడు ఆపూర్వ శరీరమును విడిచిపెట్టెను. అతడా శరీరము విడువగానే వెంటనే రాత్రి ఏర్పడెను.(42)

ఆరాత్రి చీకటి ఎక్కువగా కలదైనందున దానియందు ప్రజలు నిద్రించుచుండిరి. అప్పుడు భగవంతుడు సత్త్వగుణము ప్రధానముగా గల మరియొక శరీరమును స్వీకరించెను.(43)

తరువాత ప్రకాశించుచున్న అతని ముఖమునుండి దేవతలు జన్మించిరి. అప్పుడా శరీరము కూడ అతనిచే విడువబడెను. తరువాత సత్త్వగుణాధికమైన పగలు ఏర్పడెను.(44)

అందువలన ధర్మయుక్తులైన దేవతలు సత్త్వగుణము మాత్రమే స్వరూపముగాగల మూర్తినే సేవించుచుండిరి. తరువాత ఆభగవానుడు మరొక శరీరమును స్వీకరించెను.(45)

పతృవ న్మస్య మానస్య పితరః సంప్రజజ్ఞిరే | ఉత్ససర్జ పితౄన్‌ సృష్ట్వా తతస్తా మపి విశ్వదృక్‌|| 46

సా పవిద్ధా తను స్తేన సద్యః సన్ధ్యా వ్యజాయత| తస్మా దహర్దైవతానాం రాత్రిః స్యాద్దేవవిద్విషామ్‌|| 47

తయో ర్మధ్యే పితౄణాంతు మూర్తిః సన్థ్యాగరీయసీ | తస్మా ద్దేవాసురాః సర్వే మునయో మానవా స్తదా|| 48

ఉపాసతే సదాయుక్తా రాత్య్రహ్నో ర్మధ్యమాం తనుమ్‌| రజోమాత్రాత్మికాం బ్రహ్మా తను మన్యాం తతో2 సృజత్‌|| 49

తతో2స్య జజ్ఞిరే పుత్రా మనుష్యా రజసావృతాః| తామథా శు స తత్యాజ తనుం సద్యః ప్రజాపతిః|| 50

తండ్రివలె భావించుచున్న ప్రజాపతికి పితృదేవతలు జనించిరి. పితురులను సృష్టించిన తరువాత ఆ శరీరమును కూడ విశ్వద్రష్ట అగుదేవుడు వదిలిపెట్టెను.(46)

అతనిచేత ఆశరీరము కప్పివేయిబడినది. అప్పుడే సంధ్య ఏర్పడెను. అందువలన దేవతలకు పగలు రాక్షసులకు రాత్రిగా ఆయెను.(47)

ఆ పగలు రాత్రులకు మధ్యలో పితురులకు సంధ్యారూపమైనమూర్తి గొప్పదిగా ఉండెను. ఆ కారణమువలన దేవతలు, అసురులు మునులు, మనుష్యులు అందరుకూడ అప్పుడు (48) రాత్రికి, పగటికి మధ్యమందున్న సంధ్యారూప శరీరమును ఎల్లప్పుడు సేవింతురు. తరువాత బ్రహ్మ రజోగుణము మాత్రము ముఖ్యముగా కల ఇతర శరీరము కల్పించెను.(49)

పిమ్మట ఆయనకు ఆశరీరము నుండి రజోగుణముచేత కప్పబడిన మనుష్యులు కుమారులుగా జన్మించిరి. అప్పుడు ప్రజాపతి ఆశరీరము కూడ శీఘ్రముగా విడిచిపెట్టెను.(50)

జ్యోత్స్నా సాచాభవ ద్విప్రాః ప్రాక్సంధ్యా యా భిధియతే తతః స భగవాన్‌ బ్రహ్మ సంప్రాప్య ద్విజపుంగవాః|| 51

మూర్తిం తమోరజఃప్రాయాం పున రేవా భ్యపూజయత్‌| అన్థకారే క్షుధావిష్టా రాక్షసా స్తస్య జజ్ఞిరే|| 52

పుత్రా స్తమోరజఃప్రాయా బలినస్తే నిశాచరాః| సర్పాయుధాస్తథాభూతా గన్ధర్వాః సంప్రజ్ఞిరే|| 53

రజస్తమోభ్యా మావిష్టాంస్తతో2 న్యాన సృజ త్ప్రభుః వయాంసి వయసః సృష్ట్వా అవీ న్వై వక్షసో2 సృజత్‌|| 54

మఖతో2 జాన్‌ ససర్జా న్యాన్‌ ఉదరాద్గాశ్య నిర్మమే| పద్భ్యాం చాశ్వాన్స మాతంగాన్రాసభాన్‌ గవయాన్మృగాన్‌|| 55

బ్రహ్మణులారా! ఏది పూర్వసంధ్య అని చెప్పబడుచున్నదో అది వెన్నెలగా అయినది. తరువాత భగవంతుడైన ఆ బ్రహ్మ; (51) తమస్సు, రజస్సు అనుగుణములు అధికముగాగల శరీరమును ధరించి మరల పూజించెను. అప్పుడాయనకు చీకటిలో ఆకలితో కూడిన రాక్షసులు పుట్టిరి.(52)

తమోరజోగుణ ప్రాయులైన. బలవంతులు, రాత్రించరులు అగుకుమారులు కలిగిరి. సర్పముల వంటి ఆయుధాలు కలవారు మరియు గంధర్వులు జన్మించిరి.(53)

తరువాత రజస్తమోగుణములతో కూడియున్న ఇతరప్రాణులను బ్రహ్మ సృజించెను. పక్షులను, సృష్టించి తరువాత తన హృదయస్థలము నుండి సర్పములను సృజించెను. (54)

ముఖము నుండి మేకలను, పొట్టనుండి గోవులను సృష్టించినాడు. పాదములనుండి గుఱ్ఱమును, ఏనుగులను, గాడిదలను, గవయములను, ఇతర మృగములను సృష్టించినాడు. (55)

ఉష్ట్రా నశ్వతరాంశ్చైవ అరత్నేశ్చ ప్రజాపతిః ఓషధ్యః ఫలమూలాని రోమభ్య స్తస్య జజ్ఞిరే|| 56

గాయత్రం చ ఋచ శ్చైవ త్రివృత్‌స్తోమం రథన్తరమ్‌ అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమా న్ముఖాత్‌|| 57

యజూషిం త్రైష్టుభం ఛన్ద స్తోమం పఞ్చదశం తథా| బృహత్సామ తథోక్‌థఞ్చ దక్షిణా దసృజ న్ముఖాత్‌|| 58

సామాని జాగతం ఛన్తస్తోమం సప్తదశం తథా| వైరూప మతిరాత్రం చ పశ్చిమా దసృజ న్ముఖాత్‌ || 59

ఏకవింశ మధర్వాణం ఆప్తోర్యామాణ మేవ చ| అనుష్టుభం సవైరాజం ఉత్తరా దసృజ న్ముఖాజ్‌ ||60

ప్రజాపతి తనమోచేతి నుండి ఒంటెలను, కంచరగాడిదలను సృజించెను. అతని రోమములనుండి ఓషధులు, పండ్లు, దుంపలు పుట్టినవి. (56)

ప్రజాపతి తన మొదటి ముఖమునుండి గాయత్రిమంత్రమును, ఋక్కులను త్రివృత్‌ స్తోమమును, రధంతరమను మంత్రమును, యజ్ఞములలో అగ్నిష్టోమమును సృజించెను. (57)

యజుర్వేద మంత్రములను త్రిష్టుప్ఛందస్సులోని మంత్రసమూహమును, బృహత్సామ మంత్రములను ఉక్థస్తోత్రమంత్రమును; దక్షిణపు ముఖమునుండి నిర్మించెను. (58)

సామమంత్రములను, జగతీఛందస్సుల సమూహమును పదునేడింటిని, వైరూపము, అతిరాత్రము అనుపేర్లుగల మంత్రసూక్తములను పడమటి ముఖమునుండి సృష్టించెను.(59)

ఇరువదియొక్క అధర్వశాఖలను, ఆప్తోర్యామ శాఖను, వైరాజముతోకూడిన అనుష్టుప్‌ ఛందమును ఉత్తర ముఖమునుండి సృజించెను.(60)

ఉచ్చావచాని భూతాని గాత్రేభ్య స్తస్య జజ్ఞిరే| బ్రహ్మణో హి ప్రజాసర్గం సృజత స్తు ప్రజాపతేః||61

యక్షాన్‌ పిశాచాన్‌ గన్ధర్వాం స్తధైవా ప్సరసః శుభాః| సృష్ట్వా చతుష్టయం సర్గం దేవర్షిపితృమానుషమ్‌|| 62

తతో2 సృజ చ్చ భూతాని స్థావరాణి చరాణి చ| నరకిన్నరరక్షాంసి వయఃపశుమృగోరగాన్‌|| 63

అవ్యయం చ వ్యయం చైవ ద్వయం స్థావరజఙ్గమమ్‌| తేషాం యే యాని కర్మాణి ప్రాక్‌ సృష్టేః ప్రతిపేదిరే|| 64

తాన్యేవ తే ప్రపద్యన్తే సృజ్య మానాః పునః పునః| హింస్రాహింస్రే మృదుక్రూరే ధర్మాధర్మా వృతానృతే|| 65

ప్రజలను సృజిస్తున్న ప్రజాపతియగు బ్రహ్మయొక్క అవయవాల నుండి ఉచ్చనీచములైన ప్రాణులు జన్మించినవి.(61)

యక్షులను, పిశాచాలను, గంధర్వులను, కల్యాణరూపులైన అప్సరసలను సృష్టించి, దేవతలు, ఋషులు, పితరులు, మనుష్యులు అను నాలుగు విధముల సర్గములను కల్పించి, (62)

తరువాత స్థావరములు జంగమములు అగు భూతములను సృష్టించెను. మనుష్య, కిన్నర, రాక్షసులను, పక్షులను, పశువులను. మృగములను సర్పములను సృష్టించినాడు. (63)

స్థావర జంగమములు రెండుకూడ నశించనిది, నాశము పొందునది అని రెండు విధములుగా ఉండును. వానిలో ఏవి ఏకర్మలను సృష్టికి పూర్వము పొందియుండెనో; (64)

ఆకర్మలనే అవి మరల సృజించబడినప్పుడు పొందుచుండును. హింసించునది - అహింసకలది, మృదువైనది - క్రూరమైనది, ధర్మము - అధర్మము, ఋతము - అనృతము; (65)

తద్భావితాః ప్రపద్యన్తే తస్మా త్తత్తస్య రోచతే| మహాభూతేషు నానాత్వం ఇన్ద్రియార్ధేషు మూర్తిషు|| 66

వినియోగం చ భూతానాం ధాతైవ వ్యదధా త్స్వయమ్‌| నామ రూపం చ భూతానాం ప్రాకృతానాం ప్రపఞ్చనమ్‌|| 67

వేదశ##బ్దేభ్య ఏవాదౌ నిర్మమే స మహేశ్వరః| ఆర్షాణి చైవ నామాని యాశ్చ వేదేషు సృష్టయః|| 68

శర్వర్యన్తే ప్రసూతానాం తాన్యే వైభ్యో దదా త్యజః యావన్తి ప్రతిలిజ్గాని నానారూపాణి పర్యయే|| 69

దృశ్యన్తే తాని తాన్యేవ తథాభావా యుగాదిషు|| 70

ఇతి శ్రీ కూర్మపురాణ సప్తమో2ధ్యాయః

దానిచేత భావింపబడి ఆశ్రయింతురు. అందువలన అదివానికి రుచించును. మహాభూతములయందు అనేకత్వమును, ఇంద్రియములకు విషయములైన శరీరములందు ప్రాణుల వినియోగమును కూడ బ్రహ్మయే స్వయముగా సృజించెను. నామరూపములను, ప్రాకృతములైన భూతముల విస్తారమును ఆమహేశ్వరుడు వేదశబ్దములనుండియే ఆదికాలమున నిర్మించెను. ఋషిప్రోక్తములైన నామములు, వేదములందు చెప్పబడిన సృష్టులు, (66, 67, 68)

రాత్రి ముగిసిన తరువాత మరల జనించిన వారికి మరల పూర్వపు పేర్లనే బ్రహ్మ కల్పించుచున్నాడు. పునః సృష్టిలో ఎన్ని ప్రతిలింగములు, నామరూపములు కలవో, యుగాది యందు మరల ఆయాభావములు నామరూపాదులతో కన్పించును (69, 70)

శ్రీకూర్మపురాణములో ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters