Sri Koorma Mahapuranam    Chapters   

అథనవమోధ్యాయః

సూత ఉవాచ: అథ పద్మోద్భవ ప్రాదుర్భాదః||

ఏతచ్ఛృత్వా తు వచనం నారదాద్యా మహర్షయః| ప్రణమ్య వరదం విష్ణుం పప్రచ్ఛుః సంశయాన్వితాః|| 1

మునయ ఊచుః:

కథితో భవతా సర్గో ముఖ్యాదీనాం జనార్దన| ఇదానీం సంశయం చేమం అస్మాకం ఛేత్తు మర్హసి|| 2

కథం స భగవానీశః| పూర్వజో7 పి పినాకథృక్‌| పుత్రత్వ మగమచ్ఛంభుః బ్రహ్మణో7 వ్యక్తజన్మనః|| 3

కథం చ భగవా ఞ్జజ్ఞే బ్రహ్మా లోక పితామహః| అణ్ణతో జగతా మీశః తన్నో వక్తుమిహార్హసి|| 4

కూర్మ ఉవాచ

శృణుధ్వ మృషయః సర్వే శంకరస్వామితేజసః| పుత్రత్వం బ్రహ్మణ స్తస్య పద్మయోనిత్వ మేవ చ || 5

నవమాధ్యాయము

సూతుడు చెప్పెను:

ఈ మాటను విని నారదుడు మొదలగు మహర్షులు, వరములనిచ్చు విష్ణువుకు నమస్కరించి, సందేహముతో కూడిన వారై అయననిట్లు ప్రశ్నించిరి.(1)

మనులు పలికిరి:-

ఓ జనార్దనా! నీ చేత ముఖ్యతత్త్వము మొదలగు వాని సర్గము గూర్చి చెప్పబడినది. ఇప్పుడిక మాయీ సంశయమును తొలిగించుటకు నీవు తగియున్నావు. (2)

భగవంతుడు, పినాకమును ధరించువాడును అగు శివుడు పూర్వమందే ఉన్నవాడైనప్పటికి, అవ్యక్తముఐన పుట్టుక గల బ్రహ్మకు కుమారుడుగా ఎట్లు అయినాడు?(3)

మరియు లోకపితామహుడు, జగత్తులకు ప్రభువు అగు బ్రహ్మ అండము నుండి ఎట్లు జన్మించెనో, దానిని మాకు తెలుపుము.(4)

కూర్మస్వామి చెప్పెను:-

ఋషులారా! మీరందరు వినుడు. అధికమైన ప్రభావము కల శంకరుడు బ్రహ్మకు కుమారుడగుట కమల సంభవుడుగా బ్రహ్మయొక్క పుట్టుకను గూడ చెప్పుదును.(5)

అతీతకల్పావసానే తమోభూతం జగత్త్రయమ్‌ | అసీదేకార్ణవం ఘోరం న దేవాద్యాన చర్షయః||6

తత్ర నారాయణో దేవో నిర్జనే నిరుపప్లవే| ఆశ్రిత్య శేషశయనం సుష్వాప పురుషోత్తమః|| 7

సహస్రశీర్షా భూత్వా స సహస్రాక్షః సహస్ర పాత్‌| సహస్రబాహుః సర్వజ్ఞః చిన్త్యమానో మనీషిభిః|| 8

పీతవాసా విశాలాక్షో నీలజీమూత సన్నిభః| తతో విభూతియోగాత్మ యోగినాం తు దయాపరః|| 9

కదాచి త్తస్య సుప్తస్య లీలార్థం దివ్య మద్భుతమ్‌ | త్రైలోక్యసారం విమలం నాభ్యాం వఙ్కజ ముద్భభౌ|| 10

గడచిన కల్పము చివర మూడు లోకములు అంధకారముతో నిండి ఉండెను. మొత్తము ఒకే సముద్ర రూపముగా భయంకరముగా ఉండెను. దేవతలు మొదలగు వారు కాని, ఋషులు కాని లేకుండిరి. (6)

జనశూన్యమైన, ప్రమాదరహితమైన ఆ సముద్రములో భగవంతుడగు నారయణుడు, పురుషోత్తముడు శేషుని శయ్యగా కల్పించుకొని శయనించెను. (7)

ఆ నారాయణుడు వేయి తలలు కలవాడు, వేయి కన్నులు వేయిపాదములు కలవాడుగా, వేయి చేతులు కలవాడును అయి, సర్వజ్ఞుడై బుద్ధిమంతులైన పండితుల చేధ్యానింపబడును. (8) పసుపు పచ్చని వస్త్రము ధరించి, వెడల్పయిన రొమ్ము కలవాడై, నల్లని మేఘముతో సమాన కాంతి కలిగి, విభూతి యోగ స్వరూపుడై యోగుల యందు దయకలవాడుగా నుండెను. (9)

ఒకప్పుడు నిద్రించి యున్న ఆ నారాయణుని యొక్క నాభియందు విలాసము కొరకు, ఆశ్చర్యకరము, మూడు లోకముల సారభూతము, నిర్మలము, అగు కమలము అవిర్భవించెను.(10)

శతయోజనవిస్తీర్ణం తరుణాదిత్యసన్నిభమ్‌| దివ్యగన్థమయం పుణ్యం కర్ణికాకేసరానిత్వమ్‌|| 11

తసై#్యవం సుచిరం కాలం వర్తమాసన్య శార్ఞిణః| హిరణ్యగర్భో భగవాంస్తం దేశ ముపచక్రమే|| 12

స తం కరేణ విశ్వాత్మా సముత్థాప్య సనాతనమ్‌| ప్రోవాచ మధురం వాక్యం మాయయా తస్య మోహితః|| 13

అస్మిన్నేకార్ణవే ఘోరే నిర్జనే తమసా వృతే| ఏకాకీ భవాంశ్చేతి బ్రూహి మే పురుషర్షభ||14

తస్య తద్వచనం శ్రుత్వా విహస్య గరుఢధ్వజః| ఉవాచ దేవం బ్రహ్మాణం మేఘగమ్భీర నిఃస్వనః|| 15

ఆపద్మము నూరు యోజనముల విస్తీర్ణము కలది, బాలసూర్యునితో సమాన కాంతి గలది, శ్రేష్ఠమైన పరిమళముతో కూడినది, పుణ్యకరము కర్ణికతో కేసరములతో కూడియుండెను. (11)

ఈ విధముగా చాలా కాలము ఆ విష్ణువు నివసించి యుండగా అప్పుడు భగవంతుడగు హిరణ్యగర్భుడు ఆ ప్రదేశమును చేరుకొనెను. (12)

విశ్వాత్మకుడైన నారాయణుని తన చేతితో సనాతనుడైన బ్రహ్మ పైకి లేపి, అతని మాయ చేత మోహితుడై మధురమైన మాటను ఇట్లు పలికెను. (13)

జనశూన్యము, అంధకారముతో నిండినది, ఒకే సముద్ర రూపముగా మారిన యీలోకములో ఒంటరివాడుగా ఉన్న నీవెవరవు? ఓ పురుషశ్రేష్ణుడా! నాకు తెలుపుము. (14)

బ్రహ్మయొక్క ఆ మాట విని నారాయణుడు నవ్వి మేఘము వలె గంభీర ధ్వని కలవాడై బ్రహ్మదేవుని గూర్చి ఇట్లు పలికెను. (15)

భో భో నారాయణం దేవం లోకానాం ప్రభవావ్యయమ్‌| మహాయోగీశ్వరం మాం వై జానీహి పురుషోత్తమమ్‌|| 16

మయి పశ్య జగత్కృత్స్నం త్వం చ లోకపితామహ| సపర్వతమహాద్వీపం సముద్రైః సప్తభిర్వృతమ్‌||17

తతః ప్రహస్య భగవాన్‌ బ్రహ్మా వేదనిధిః ప్రభుః ప్రత్యువాచా మ్బుజాభాక్షం సస్మితం శ్లక్ష్‌ణయా గిరా|| 18

ఏవ మాభాష్య విశ్వాత్మా ప్రోవాచ పురుషం హరిం| జానన్నపి మహాయోగీ కోభవా నితి వేధసమ్‌|| 19

అహం ధాతా విధాతా చ స్వయమ్భూః ప్రపితామహః| మయ్యేవ సంస్థితం విశ్వం బ్రహ్మాహం విశ్వతోముఖః||20

ఓ బ్రహ్మదేవుడా! నారాయణ దేవుని, లోకములకు ఉత్పత్తి కారణమైన, నాశరహితుడైన వానిగా పురుషోత్తముడని, గొప్ప యోగీశ్వరుడని తెలిసికొనుము.(16)

లోకములకు పితామహుడవైన నీవు ఈ సమస్త ప్రపంచమును నా యందు చూడుము - పర్వతములతో, మహాద్వీపములతో కూడినది, ఏడు సముద్రముల చేత చుట్టబడి యున్నదై నాలో నున్నది. (17).

తరువాత భగవంతుడు, వేదములకు నిధి యగు బ్రహ్మ నవ్వి కమలములవంటి కన్నులు కల విష్ణువును గూర్చి తీక్షణమైన వాక్కుతో బదులు పలికెను. (18)

ఈ రీతిగా మాట్లాడి విష్ణువు, మహాయోగి, తెలిసిన వాడయ్యు బ్రహ్మను నీవెవ్వడవు? అని ప్రశ్నించెను. (19)

నేను ధాతను, విధాతను, స్వయంభువును, ప్రపితామహుడను. ఈ విశ్వము నాయందే నిలిచి యున్నది. నేను అంతట వ్యాపించియున్న బ్రహ్మను. (20).

శ్రుత్వా వాచం స భగవాన్‌ విష్ణుః సత్యపరాక్రమః| అనుజ్ఞాప్యాథ యోగేన ప్రవిష్టో బ్రహ్మణ స్తనుమ్‌|| || 21 ||

త్రైలోక్యమేత త్సకలం సదేవాసురమానుషమ్‌| ఉదరే తస్య దేవస్య దృష్ట్వా విస్మయమాగతః|| || 22 ||

తదాస్య వక్త్రాన్నిష్క్రమ్య పన్నగేన్ట్రనికేతనః | అథాపి భగవాన్విష్ణుః పితామహ మథాబ్రవీత్‌|| || 23 ||

భవా నప్యేవమే వాద్య శాశ్వతం హి మమోదరమ్‌ | ప్రవిశ్య లోకాన్పశ్యైతాన్‌ విచిత్రాన్‌ పురుషర్షభ|| || 24 ||

తతః ప్రహ్లాదినీం వాణీం శ్రుత్వా తస్యాభినన్ద్య చ| శ్రీపతే రుదరం భూయః ప్రవివేశ కుశధ్వజః| || 25 ||

ఆ వాక్కును విని, సత్యపరాక్రముడైన భగవంతుడగు విష్ణువు వారిని పంపించి తరువాత యోగశక్తితో బ్రహ్మయొక్క శరీరమును ప్రవేశించెను. (21)

దేవతలు, రాక్షసులు, మనుష్యులతో కూడిన ఈ మూడు లోకముల సముదాయమును ఆ భగవంతుని ఉదరములో చూచి ఆశ్చర్యమును పొందెను. (22)

అప్పుడాతని ముఖము నుండి బయటికి వచ్చి, శేషుడే నివాసముగా కలిగిన భగవంతుడైన విష్ణువు ఆ బ్రహ్మను గూర్చి ఇట్లు పలికెను. (23).

నీవు కూడా ఇదే విధముగా శాశ్వతమైన నా కుక్షిని ప్రవేశించి, ఈ విచిత్రములైన లోకాలను పురుషశ్రేష్ఠుడా! చూడుము. (24).

తరువాత ఆహ్లాదమును కల్గించు అతని వాక్కును విని, అభినందించి కుశధ్వజుడు మరల శ్రీపతియగు నారాయణుని యొక్క ఉదరమును ప్రవేశించెను. (25).

తానేవ లోకాన్గర్భస్థాన్‌ అపశ్య త్సత్యవిక్రమః | పర్యటిత్వా థ దేవస్య దదృశేన్తం న వై హరేః || || 26 ||

తతో ద్వారాణి సర్వాణి పిహితాని మహాత్మనా | జనార్దనేన బ్రహ్మాసౌ నాభ్యాం ద్వారమవిన్దత|| || 27 ||

తత్ర యోగబలేనాసౌ ప్రవిశ్య కనకాణ్డజః | ఉజ్జహారా త్మనో రూపం పుష్కరా చ్చతురాననః|| || 28 ||

విరరాజా ర విన్దస్థః పద్మగర్భ సమద్యుతిః| బ్రహ్మా స్వయంభూ ర్భగవా ఞ్జగద్యోనిః పితామహః || || 29 ||

స మన్యమానో విశ్వేశం ఆత్మానం పరమం పదమ్‌ | ప్రోవాచ విష్ణుం పురుషం మేఘగమ్భీరయా గిరా|| || 30 ||

సత్యమైన పరాక్రమము కల ఆకుశధ్వజుడు శ్రీమహావిష్ణువుయొక్క గర్భములో నున్న ఆ లోకములను చూచెను. ఆ గర్భములోపలి భాగములో సంచరించి ఆ నారాయణుని యొక్క చివరి హద్దును చూడలేక పోయెను. (26).

తరువాత మహాత్ముడగు ఆ విష్ణువు చేత అన్ని ద్వారములు మూయబడినవి. అప్పుడీ బ్రహ్మ నారాయణుని నాభి యందు ద్వారమును పొందెను. (27)

సువర్ణ రూపమైన అండము నుండి పుట్టిన బ్రహ్మతన యోగ బలముచేత ఆ నాభిద్వారములో ప్రవేశించి తన స్వరూపమును చతురాననుడుగా కమలము నుండి సాక్షాత్కరింపజేసెను. (28).

కమలము యొక్క లోపలి భాగము వంటి కాంతి గల ఆ బ్రహ్మ పద్మము నందు నిలిచిన వాడై, భగవంతుడు, స్వయంభువు, లోకములకు కారణభూతుడు, పితామహుడుగా ప్రకాశించెను. (29).

అతడు తనను ప్రపంచమునకు ప్రభువుగా, సర్వోన్నత స్థానముగా తలచిన వాడై విష్ణువును గూర్చి మేఘ ధ్వని వలె గంభీర మైన వాక్కుతో ఇట్లు పలికెను. (30).

కృతం కిం భవతే దానీం ఆత్మనో జయకాంక్షయా| ఏకోహం ప్రబలో నాన్యో మాం వై కోభి భవిష్యతి|| || 31 ||

శ్రుత్వా నారాయణో వాక్యం బ్రహ్మణోక్త మత న్ద్రితః| సాన్తపూర్వ మిదం వాక్యం బభాషే మధురం హరిః|| || 32 ||

భవా న్ధాతా విధాతా చ స్వయంభూః ప్రపితామహః | న మాత్సర్యాభియోగేన ద్వారాణి పిహితాని మే|| || 33 ||

కిస్తు లీలార్థ మేవైత న్నత్వాం బాధితు మిచ్ఛయా| కోహి బాధితు మన్విచ్ఛే ద్దేవదేవం పితామహమ్‌ || || 34 ||

నహి త్వం బాధ్యసే బ్రహ్మన్‌ మాన్యోహి సర్వధా భవాన్‌ | మమ క్షమస్వ కల్యాణ యన్మయా పకృతం తవ || || 35

అస్మా చ్చ కారణా ద్బ్రహ్మన్‌ పుత్రో భవతు మే భవాన్‌ | పద్మయోని రితి ఖ్యాతో మత్ప్రియార్థం జగన్మయ|| || 36 ||

నీవు జయమును పొందవలెనను కోరికతో ఇప్పుడు చేసిన పనియేమిటి? నేను ఒక్కడినే మిక్కిలి బలవంతుడను. మరియొకడు లేడు. నన్ను ఎవడు తిరస్కరించగలడు? (31)

బ్రహ్మచేత పలుకబడిన వాక్యమును విని నారాయణుడు సావధానుడై ఊరడింపు ధోరణితో అతనితో మధురమైన వాక్యమునిట్లు పలికెను. (32)

నీవు ధాతవు, విధాతవు, స్వయముగా అవతరించిన వాడవు. ప్రపితామహుడవు. నేను అసూయతో ద్వారములను మూయలేదు. (33)

కేవలము వినోదము కొరకే ఆ పని చేసినాను. నిన్ను బాధించు కోరికతో కాదు. దేవతలకు దేవుడవైన పితామహుని నిన్ను ఎవరు బాధింపగోరుదురు? (34)

నీవు బాధింపబడుట లేదు. అన్ని విధముల నీవు గౌరవింప తగిన వాడవు. నీ చేత నీకు జరిగిన అపకారమునకు నన్ను నీవు మన్నించుము. (35)

ఓ బ్రహ్మా! ఈ కారణము వలన గూడ నీవు నాకు కుమారుడవు అగుదువు గాక. నాకు ప్రియమగునట్లు పద్మయోని అని ప్రసిద్ధుడవు కమ్ము. (36)

తతః స భగవా న్దేవో వరం దత్వా కిరీటినే | ప్రహర్ష మతులం గత్వా పున ర్విష్ణుమభాషత|| || 37 ||

భవా న్సర్వాత్మకో నన్తః సర్వేషాం పరమేశ్వరః | సర్వభూతాన్తరాత్మా వై పరం బ్రహ్మ సనాతనమ్‌|| || 38 ||

అహం వై సర్వలోకానా మాత్మా లోకో మహేశ్వరః | మన్మయం సర్వమేవేదం బ్రహ్మణః పురుషః పరః || || 39 ||

నావాభ్యాం విద్యతే హ్యన్యో లోకానాం పరమేశ్వరః | ఏకా మూర్తి ర్ద్విధాభిన్నా నారాయణపితామహౌ|| || 40 ||

తేనైవ ముక్తో బ్రహ్మాణం వాసుదేవో బ్రవీ దిదమ్‌| ఇయం ప్రతిజ్ఞా భవతో వినాశాయ భవిష్యతి|| || 41 ||

కిం న పశ్యసి యోగేన బ్రహ్మాధిపతి మవ్యయమ్‌|| ప్రథానపురుషేశానం వేదాహం పరమేశ్వరమ్‌|| || 42 ||

తరువాత భగవంతుడైన బ్రహ్మ, విష్ణువునకు ఆ వరము నిచ్చి సాటిలేని సంతోషమును పొందిన వాడై మరల విష్ణువుతో ఇట్లనెను. (37).

నీవు సమస్త ప్రపంచము ఆత్మగా కలవాడవు. నాశములేని వాడవు. అందరికి పరమేశ్వరుడవు. సమస్త భూతములకు అంతరాత్మ స్వరూపుడవు, అతి పురాతనమైన పరబ్రహ్మ స్వరూపమవు. (38)

నేను సమస్త లోకములకు ఆత్మ స్వరూపుడను. మహేశ్వరుడను. ఈ సమస్తవిశ్వము నాతో నిండి యున్నది. బ్రహ్మ కంటే శ్రేష్ఠుడైన పురుషుడను నేను. (39)

మన యిద్దరి కంటే భిన్నముగా మరొక పరమేశ్వరుడు లోకములకు లేడు. ఒకే స్వరూపము నారాయణుడు, పితామహుడు అను పేర్లతో రెండుగా విభజింపబడినది. (40)

అతని చేత ఇట్లు పలుకబడిన నారాయణుడు బ్రహ్మతో ఇట్లనెను. నీవు ఈ విధముగా శపథము చేయుట వినాశమునకు కారణము కాగలదు. (41).

నీవు యోగశక్తితో, నాశరహితుడు, బ్రహ్మకు అధిపతి, ప్రధాన పురుషుడు, అయిన ఈశ్వరుని చూచుట లేదా? నేనా పరమేశ్వరుని తెలుసుకున్నాను. (42).

యం న పశ్యన్తి యోగీన్ద్రాః సాంఖ్యా అపి మహేశ్వరమ్‌ | అనాదినిధనం బ్రహ్మ తమేవ శరణం వ్రజ|| || 43 ||

తతః క్రుద్ధో మ్బుజాభాక్షం బ్రహ్మా ప్రోవాచ కేశవమ్‌ | భగవ న్నూన మాత్మానం వేద్మి తత్పర మక్షరమ్‌ || || 44 ||

బ్రహ్మాణం జగతా మేక మాత్మానం పరమం పదమ్‌ | నావాభ్యాం విద్యతే త్వన్యో లోకానాం పరమేశ్వరః || || 45 ||

సంత్యజ్య నిద్రాం విపులాం స్వ మాత్మానం విలోకయ| తస్య తత్ర్కోధజం వాక్యం శ్రుత్వాపి స తదా ప్రభుః|| || 46 ||

మా మైవం వద కల్యాణ పరివాదం మహాత్మనః | న మే హ్యవిదితం బ్రహ్మన్‌ నాన్యథా హం వదామి తే|| || 47 ||

ఏ మహేశ్వరుని యోగీంద్రులు, సాంఖ్యులు కూడా దర్శించ లేకపోవుచున్నారో, అది అంతము లేని ఆ పరబ్రహ్మము నే శరణము పొందుము. (43).

అప్పుడా మాటలకు కోపించిన బ్రహ్మ, కమలముల వంటి కన్నులు గల కేశవునితో ఇట్లనెను. మహాత్మా! శ్రేష్ఠము, నాశరహితము అగు ఆత్మస్వరూపమును నిశ్చయముగా ఎరుగుదును. (44).

జగత్తులకు బ్రహ్మ, అద్వితీయుడు, పరమమైన స్థానముగా నన్ను నేను భావించుచున్నాను మన యిద్దరి కంటే ఇతరుడు మరి యొక పరమేశ్వరుడు లోకములకు లేడు. (45)

నీవు అధిక మైన నిద్రను విడిచి, నీ ఆత్మస్వరూపమును దర్శించుము. అని కోపముతో పలికిన బ్రహ్మయొక్క వాక్యమును విని కూడా ప్రభువైన ఆ విష్ణువు, (46) ఓ శ్రేష్ఠుడా! నీవిట్లు మహాత్ముని గూర్చి తిరస్కారముగా పలుకకుము. ఓ బ్రహ్మా ! నాకు తెలియనిది లేదు. నేను మరి యొక విధముగా నీకు చెప్పుట లేదు (47).

కిన్తు మోహయతి బ్రహ్మ న్ననన్తా పారమేశ్వరీ | మాయా శేషవిశేషాణాం హేతు రాత్మసముద్భవా|| || 48 ||

ఏతావ దుక్త్వా భగవా న్విష్ణు స్తూప్ణీం బభూవ హ| జ్ఞాత్వా తత్పరమం తత్త్వం స్వ మాత్మానం సురేశ్వరః| || 49 ||

కుతో హ్యపరిమేయాత్మా భూతానాం పరమేశ్వరః| ప్రసాదం బ్రహ్మణ కర్తుం ప్రాదురాసీ త్తతోహరః| || 50 |

లలాటనయనో దేవో జటామణ్డలమణ్డితః| త్రిశూలపాణిర్భగవాం స్తేజసాం పరమో నిధిః|| || 51 ||

విద్యావిలాసగ్రథితా గ్రహైః సార్కేన్దు తారకైః| మాలా మత్యద్భుతాకారాం ధారయ న్పాదలమ్బినీమ్‌|| || 52 ||

కాని ఓ బ్రహ్మా! పరమేశ్వర సంబంధిని, అంతములేనిది, సమస్త విశేషములకు కారణభూతమైనది, తనంతట తాను సంభవించి నది యగు మాయ మోహింపజేయును. (48)

భగవంతుడగు విష్ణువు ఇంత మాత్రముగా యీ విషయమును చెప్పి ఊరకుండెను. దేవేంద్రుడు ఆపరమతత్త్వమును, తన ఆత్మస్వరూపమును తెలిసికొనెను. అపరిమేయమైన ఆత్మ కల, భూతములకు పరమేశ్వరుడగు శివుడు బ్రహ్మను అనుగ్రహించుట కొరకు అక్కడ సాక్షాత్కరించెను. (49, 50).

నొసటి యందు కన్ను కలవాడు, జడల సమూహముచేత అలంకరింపబడినవాడు. త్రిశూలము చేతియందు ధరించిన వాడు, తేజస్సులకు గొప్ప నిధి, భగవంతుడు, విద్యలయొక్క విలాసములను కూర్చిన వాడు, సూర్య, చంద్ర, నక్షత్ర సహితములైన గ్రహములతో ఆశ్యర్యకరమైన రూపము కలిగి పాదముల యందు వ్రేలాడుచున్న మాలను ధరించువాడుగా శివుడు కన్పించెను. (51, 52)

తం దృష్ట్వా దేవ మీశానం బ్రహ్మా లోకపితామహః| మోహితో మాయయా త్యర్థం పీతవాసస మబ్రవేత్‌|| || 53 ||

క ఏష పురుషో నీలః శూలపాణి స్త్రిలోచనః| తేజోరాశి రమేయాత్మా సమాయాతి జనార్దన|| || 54 ||

తస్య తద్వచనం శ్రుత్వా విష్ణు ర్దానవమర్దనః| అపశ్య దీశ్వరం దేవం జ్వలన్తం విమలే మ్బసి|| || 55 ||

జ్ఞాత్వా తం పరమం భావ మైశ్వరం బ్రహ్మభావనః| ప్రోవా చోత్థాయ భగవా న్దేవ దేవం పితామహమ్‌|| || 56 ||

అయం దేవో మహాదేవః స్వయం జ్యోతిః సనాతనః| అనాది నిధనో చిన్త్యో లోకానా మీశ్వరో మహాన్‌|| || 57 ||

ఆ యీశానదేవుని చూచి లోకపితామహుడైన బ్రహ్మ మాయచేత మిక్కిలి మోహితుడై పీతాంబరుడైన విష్ణువుతో ఇట్లనెను (53)

నల్లని వాడు, శూలము చేతి యందు కలవాడు, మూడు కన్నులు కల యీ పురుషుడెవ్వడు? ఓ జనార్దనా! ఇతడు తేజస్సుల సమూహము, అమేయమైన ఆకారము కలవాడై వచ్చుచున్నాడు (54)

అతని యీ మాటను విని రాక్షస వినాశకుడైన విష్ణువు, నిర్మలమైన జలము నందు ప్రకాశించుచున్న భగవంతుడగు ఈశ్వరుని చూచెను. (55)

బ్రహ్మతత్త్వమును భావించు వాడగు, భగవంతుడు విష్ణువు, ఈశ్వరుని ఆపరమ భావమును తెలిసి కొని, లేచి దేవదేవుడగుపితామహుని గూర్చి యిట్లనెను. (56)

ఇతడు భగవంతుడగు మహాదేవుడు. స్వయం ప్రకాశమానుడు. సనాతనుడు, ఆద్యంతాలు లేనివాడు, ఆలోచింప శక్యము కాని వాడు, లోకములకు ప్రభువు, గొప్పవాడు (57)

శంకరః శమ్భురీశానః సర్వాత్మా పరమేశ్వరః| భూతానా మధిపో యోగీ మహేశో విమలః శివః || || 58 ||

ఏష ధాతా విధాతా చ ప్రధానః ప్రభు రవ్యయః || యం ప్రపశ్యన్తి యతయో బ్రహ్మభావేన భావితాః || || 59 ||

సృజ త్యేష జగత్‌ కృత్స్నం పాతి సంహరతే తథా | కాలో భూత్వా మహాదేవః కేవలో నిష్కలఃశివః || || 60 ||

బ్రహ్మాణం విదధే పూర్వం భవన్తంయః సనాతనః | వేదాంశ్చ ప్రదదౌ తుభ్యం సోయ మాయాతి శంకరః || || 61 ||

అసై#్యవ చాపరాం మూర్తిం విశ్వయోనిం సనాతనీమ్‌ | వాసుదేవాభిధానం మా మవేహి ప్రపితామహ || || 62 ||

ఇతడు శుభమును కలిగించువాడు, శంభువు, ఈశానుడు, సమస్తమునకు ఆత్మయగువాడు, పరమేశ్వరుడు, భూతముల కధిపతి, యోగి, మహేశుడు, నిర్మలుడు, శివుడు, ధాత మరియు విధాత, ప్రధానుడు, నాశరహితుడగు ప్రభువు. బ్రహ్మభావము చేత ప్రభావితులైన సన్యాసులు ఎవనిని దర్శింతురో, అతడే ఇతడు. (58, 59)

ఇతడు సమస్త విశ్వమును సృజించును, కాపాడును, సంహరించును. ఈ మహాదేవుడు, కేవలుడు, భేదరహితుడు శివుడు. కాలపురుష రూపుడై సృష్ట్యాది కార్యములను జరుపును. (60)

ఏ సనాతన పురుషుడు పూర్వము నిన్ను బ్రహ్మగా చేసెనో, నీకు వేదములను గూడ అప్పగించెనో ఆ శంకరుడు ఇప్పుడు వచ్చుచున్నాడు. (61)

ఓ ప్రపితామహా! ఈ శివుని మొక్క మరి యొక మూర్తి లోక కారణభూతము, సనాతనము అయిన నా రూపమును వాసుదేవ నామము కలదానినిగా తెలిసికొనుము. (62)

కిం న పశ్యసి యోగేశం బ్రహ్మాధిపతి మవ్యయమ్‌ | దివ్యం భవతు తే చక్షు ర్యేన ద్రక్ష్యసి తత్పరమ్‌ || || 63 ||

లబ్ధ్వా చైవం తదా చక్షు ర్విష్ణో ర్లోకపితామహః | బుబుధే పరమజ్ఞానం పురతః సమవస్థితమ్‌ || || 64 ||

స లబ్ధ్వా పరమం జ్ఞాన మైశ్వరం ప్రపితామహం | ప్రపేదే శరణం దేవం తమేవ పితరం శివమ్‌ || || 65 ||

ఓంకారం సమనుస్మృత్య సంస్తభ్యాత్మాన మాత్మనా | అథర్వశిరసా దేవం తుష్టావ చ కృతాఞ్జలిః || || 66 ||

సంస్తు తస్తేన భగవాన్‌ బ్రహ్మణా పరమేశ్వరః | అవాప పరమాం ప్రీతిం వ్యాజహార స్మయన్నివ || || 67 ||

యోగేశ్వరుడు, బ్రహ్మకు అధిపతి, నాశరహితుడు అగు భగవంతుని చూచుట లేదా? నీ నేత్రము దివ్యదృష్టి కలదగు గాక. దానితో అపరతత్త్వరూపమును చూడగలవు. (63)

విష్ణువు వలన దివ్యచక్షువును పొంది లోకపితామహుడగు బ్రహ్మ తన ఎదురుగా నిలిచి యున్న శివుని పరమజ్ఞాన రూపునిగా తెలిసికొనెను. (64)

ఆ బ్రహ్మదేవుడు ఈశ్వర సంబంధియగు ఆ పరమజ్ఞానమును పొంది, ఆ దేవుని తండ్రిగా గుర్తించి శరణము పొందెను. (65)

ఓంకారమును స్మరించుకొని, ఆత్మను ఆత్మతో నిగ్రహించుకొని, అధర్వ శిరోమంత్రములతో అంజలి జోడించి దేవుని స్తోత్రము చేసెను. (66)

భగవంతుడగు పరమేశ్వరుడు ఆ బ్రహ్మ చేత స్తోత్రము చేయబడిన వాడై గొప్ప ప్రీతిని పొంది చిరునవ్వు కలవాడై ఇట్లు పలికెను. (67)

మత్సమస్త్వం న సన్దేహో వత్స భక్తశ్చ మే భవాన్‌ | మయైవో త్పాదితః పూర్వం లోకసృష్ట్యర్థ మవ్యయః|| || 68 ||

త్వ మాత్మా హ్యాదిపురుషో మమ దేహసముద్భవః | వరం వరయ విశ్వాత్మ న్వరదో హం తవానఘ || || 69 ||

స దేవదేవవచనం నిశమ్య కమలోద్భవః | నిరీక్ష్య విష్ణుం పురుషం ప్రణమ్యోవాచ శంకరమ్‌ || || 70 ||

భగవ న్భూతభ##వ్యేశ మహాదేవామ్బికాపతే | త్వామేవ పుత్ర మిచ్ఛామి త్వయా వా సదృశం సుతమ్‌ || || 71 ||

మోహితో స్మి మహాదేవ మాయయా సూక్ష్మయా త్వయా | న జానే పరమం భావం యాథాతధ్యేన తే శివ || || 72 ||

త్వమేవ దేవ భక్తానాం మాతా భ్రాతా పితా సుహృత్‌ | ప్రసీద తవ పాదాబ్జం నమామి శరణాగతః || || 73 ||

వత్సా! నీవు నాతో సమానుడవు, సందేహము లేదు. నీవు నాకు భక్తుడవు కూడా. నీవు నా చేతనే పూర్వము లోక సృష్టి కొరకు పుట్టించబడినావు (68)

నీవు నా శరీరము నుండి పుట్టిన ఆది పురుషుడవు, నాకు ఆత్మరూపుడవు, ఓ విశ్వాత్మా ! అనఘా! ఒక వరమును కోరుకొనుము. నీకు నేను వరము నిచ్చెదను. (69)

దేవదేవుని మాటను విని పద్మసంభవుడైన బ్రహ్మ విష్ణుదేవుని చూచి నమస్కరించి శంకరునితో ఇట్లనెను (70)

భూతభవిష్యత్తులకు ప్రభువైన భగవంతుడా! పార్వతీ పతీ! మహాదేవా! నిన్నే కుమారునిగా పొందగోరుచున్నాను. లేదా నీతో సమానుడైన పుత్రునైనా అనుగ్రహించుము (71)

మహాదేవా! నీచేత సూక్ష్మమైన మాయద్వారా మోహము పొందింపబడినాను. శివా! నీ సర్వోత్కృష్ట తత్త్వమును యథాతథముగా తెలియకున్నాను. (72)

ప్రభూ! నీవే భక్తులకు తల్లివి, సోదరుడవు, తండ్రివి, మిత్రుడవు కూడా. శరణుకోరి నీ పాదములకు నమస్కరించుచున్నాను. ప్రసన్నుడవుకమ్ము (73).

స తస్య వచనం శ్రుత్వా జగన్నాథో వృషధ్వజః | వ్యాజహార తదా పుత్రం సమాలోక్య జనార్దనమ్‌ || || 74 ||

యదర్థితం భగవతా తత్కరిష్యామి పుత్రక | విజ్ఞాన మైశ్వరం దివ్య ముత్పత్స్యతి తవానఘమ్‌ || || 75 ||

త్వమేవ సర్వభూతానా మాదికర్తా నియోజితః | కురుష్వ తేషు దేవేశ మాయాం లోకపితామహ || || 76 ||

ఏష నారాయణో మత్తో మమైవ పరమా తనుః | భవిష్యతి తవేశాన యోగక్షేమవహో హరిః || || 77 ||

ఏవం వ్యాహృత్య హస్తాభ్యాం ప్రీతః స పరమేశ్వరః | సంస్పృశ్య దేవం బ్రహ్మాణం హరిం వచన మబ్రవీత్‌ || || 78 ||

లోకానికి ప్రభువు, వృషభధ్వజుడైన ఆ దేవుడు అతని మాటను విని, కుమారుడైన జనార్దనుని చూచి ఇట్లు పలికెను. (74)

కుమారా! పూజ్యుడవైన నీచేత ఏది అడుగబడినదో, దానిని చేయగలను. నీకు పాపరహితమైన, దివ్యమైన, ఈశ్వరసంబంధి అయిన విజ్ఞానము కలుగగలదు (75)

లోకములకు పితామహుడా! నీవే సమస్త భూతములకు మొదటి స్రష్టగా నియమింపబడినావు. దేవతలకు ప్రభువైన వాడా! ఆభూతముల యందు నీవు మాయను కల్పించుము. (76)

ఈ నారాయణుడు, నా యొక్క ప్రశస్తమైన శరీరరూపుడు. ఈ హరి నావలన నియుక్తుడై నీ యొక్క యోగక్షేమాలను పాలించగలడు. (77)

ఆ పరమేశ్వరుడు ఈ విధముగా పలికి, సంతోషించిన వాడై చేతులతో బ్రహ్మదేవుని స్పృశించి, తరువాత విష్ణువు నుద్దేశించి ఈ మాట పలికెను. (78).

తుష్టోస్మి సర్వథా హం తే భక్త స్త్వంచ జగన్మయ | వరం పృణీష్వ నావాభ్యా మన్యోస్తి పరమార్థతః || || 79 ||

శ్రుత్వా థ దేవవచనం విష్ణు ర్విశ్వమయం జగత్‌ | ప్రాహ ప్రసన్నయా వాచా సమాలోక్య చ తన్ముఖమ్‌ || 80 ||

ఏష ఏవ వరః శ్లాఘ్యో యదహం పరమేశ్వరమ్‌ | పశ్యామి పరమాత్మానం భక్తి ర్భవతు మే త్వయి || || 81 ||

తథే త్యుక్త్వా మహాదేవః పున ర్విష్ణు మభాషత | భవా స్సర్వస్య కార్యస్య క ర్తాహమధి దేవతమ్‌ || || 82 ||

త్వన్మయం మన్మయం చైవ సర్వ మే తన్న సంశయః | భవాన్‌ సోమ స్త్వహం సూర్యో భవాన్రాత్రి రహందినమ్‌ || || 83 ||

నేను నీ విషయంలో అన్ని విధాల సంతోషించినాను. జగన్మయుడా! నీవు భక్తుడవు. ఏదైన వరమును కోరుకొనుము. యథార్థముగా మన యిద్దరి కంటే ఇతరుడొకడు లేడు (79)

భగవంతుని వాక్యమును విని విశ్వమయుడగు విష్ణువు, ఆయన ముఖమును చూచి ప్రసన్న వాక్కుతో ఇట్లనెను (80)

పరమేశ్వరుడవైన నిన్ను నేను చూచుచున్నాను. ఇదియే నాకు కొని యాడ దగిన వరము. నాకు నీ యందు భక్తి కలిగి ఉండుగాక. (81).

మహాదేవుడు 'అట్లే అగుగాక' అని పలికి మరల విష్ణువు తో పలికెను. నీవు సమస్త కార్యములకు కర్తవు, నేను అధిదేవతను. (82)

ఈ సమస్త ప్రపంచము, నీ రూపము నా రూపము అనుటలో సందేహము లేదు. నీవు చంద్రుడ వైన నేను సూర్యుడను. నీవు రాత్రివి కాగా నేను పగలును. (83).

భవాన్‌ ప్రకృతి రవ్యక్త మహం పురుష ఏవ చ | భవాన్‌ జ్ఞాన మహం జ్ఞాతా భవా న్మాయాహ మీశ్వరః || || 84 ||

భవా న్విద్యాత్మికా శక్తిః శక్తిమా సహ మీశ్వరః | యోహం స నిష్కలోదేవః సోసి నారాయణః ప్రభుః || || 85 ||

ఏకీభావేన పశ్యన్తి యోగినో బ్రహ్మవాదినః || త్వా మనాశ్రిత్య విశ్వాత్మ న్న యోగీ మా ముపైష్యతి || || 86 ||

ఇతీద ముక్త్వా భగవా సనాదిః స్వమాయయా మోహిత భూతభేదః | జగామ జన్మర్థివినాశహీనం ధామైక మవ్యక్తమనస్త శక్తిః || || 87 ||

ఇతి శ్రీకూర్మపురాణ పద్మోధ్బవ ప్రాదుర్భావ వర్ణనం నామ నవమో ధ్యాయః

నీవు అవ్యక్తమైన ప్రకృతి రూపుడవు, నేను పురుషుడను, నీవు జ్ఞానము నేను జ్ఞాతను. నీవు మాయా స్వరూపుడవు, నేనీశ్వరుడను (84).

నీవు విద్యాస్వరూపిణియైన శక్తివి, నేను శక్తిమంతుడనైన ఈశ్వరుడను. ఏ నేను కలారహితుడైన భగవంతుడనో, నీవు నా కభిన్నుడవైన నారాయణ ప్రభుడవు (85)

బ్రహ్మవాదులైన యోగులు మన యిద్దరిని ఒకరుగానే చూచెదరు. ఓ విశ్వాత్మా! నిన్నాశ్రయించక ఏ యోగి కూడా నన్ను చేరలేడు. దేవతలు, అసురులు, మనుష్యలతో కూడిన యీ ప్రపంచాన్నంతటిని పరిపాలించుము. (86)

అనాది యగు భగవంతుడు తన మాయచేత సమస్త భూతములను మోహింప జేయువాడు, అనంత శక్తి కల వాడు అగు మహేశ్వరుడు ఇట్లు పలికి, పుట్టుక, వృద్ధి, నాశము లేనటు వంటి, అవ్యక్తము, కేవలము అగు తన ధామము నకు వెళ్లెను. (87)

శ్రీ కూర్మపురాణములో నవమాధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters