Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వాదశో%ధ్యాయః

శరభావతారము

సనత్కుమార ఉవాచ |

నందీశ్వర మహాప్రాజ్ఞ విజ్ఞాతం తదనంతరమ్‌ | మమోపరి కృపాం కృత్వా ప్రీత్యా త్వం తద్వదాధునా || 1

సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ నందీశ్వరా! నీవు మహాబుద్ధిశాలివి. తరువాతి వృత్తాంతము నీకు తెలియును. నా యందు దయను చేసి ప్రీతితో నాకా వృత్తాంతమును నీవు ఇపుడు చెప్పుము (1).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్తో వీర భ##ద్రేణ నృసింహః క్రోధవిహ్వలః | నినదన్నను వేగేన తం గ్రహీతుం ప్రచక్రమే || 2

అత్రాంతరే మహాఘోరం ప్రత్యక్షభయకారణమ్‌ | గగనవ్యాపి దుర్ధర్షం శైవతేజస్సముద్భవమ్‌ || 3

వీరభద్రస్య తద్రూప మదృశ్యం తు తతః క్షణాత్‌ | తద్వై హిరణ్మయం సౌమ్యం న సౌరం నాగ్ని సంభవమ్‌ || 4

న తడిచ్చంద్రసదృశమనౌపమ్య మహేశ్వరమ్‌ | తదా తేజాంసి సర్వాణి తస్మింల్లీనాని శంకరే || 5

న తద్వ్యోమ మహత్తేజో వ్యక్తాంతశ్చా భవత్తతః | రుద్రసాధారణం చైవ చిహ్నితం వికృతాకృతి || 6

తతస్సంహార రూపేణ సువ్యక్తం పరమేశ్వరః | పశ్యతాం సర్వదేవానాం జయశబ్దాదిమంగలైః || 7

సహస్ర బాహుర్జటిలశ్చంద్రార్ధకృతశేఖరః | సమృద్ధోగ్రశరీరేణ పక్షాభ్యాం చంచునా ద్విజః || 8

నందీశ్వరుడిట్లు పలికెను-

వీరభద్రుడిట్లు పలుకగా, క్రోధపీడితుడైన నృసింహుడు వెంటనే నినాదమును చేయుచూ వీరభద్రుని వేగముగా పట్టుకొనుటకు ప్రయత్నించెను (2). ఇంతలో వీరభద్రుని ఆ రూపము క్షణములో అంతర్థానమయ్యెను. దాని స్థానములో మిక్కిలి క్రూరమైనది, చూడగనే భయమును గొల్పునది, ఆకాశము వలె వ్యాపకమైనది, అడ్డుకొన శక్యము కానిది, శివుని తేజస్సునుండి పుట్టినది అగు ఆకారము ప్రత్యక్షమయ్యెను. ఆ ఆకారము తేజస్సుతో నిండి యుండెను. ఆ తేజస్సు అగ్ని సూర్యచంద్రుల తేజస్సు కంటె విలక్షణముగ నుండెను (3, 4). మెరుపుతోనైననూ దానిని పోల్చుట కుదరదు. మహేశ్వర స్వరూపమగు ఆ తేజస్సునకు సాటిలేదు. అపుడు తేజస్సులన్నియు ఆ శంకర తేజస్సునందు విలీనమయ్యెను (5). ఆ మహాతేజస్సును దాల్చుటకు ఆకాశమునకైననూ సాధ్యము కాకుండెను. ఆ తేజస్సు వికృతమగు ఆకారమును దాల్చియున్ననూ రుద్రునితో సమమగు చిహ్నములను కలిగియుండెను (6). ఇట్లు దేవతలందరు గాంచి జయశబ్దమును, ఇతరమంగళధ్వునులను చేయుచుండగా పరమేశ్వరుడు సంహారరూపముతో ఆవిర్భవించెను (7). వేయి బాహువులు కలది, జటలు కలది, చంద్రవంకచే అలంకరింపబడిన శిరస్సుగలది అగు ఆ ఆకారము భయంకరమగు పెద్ద శరీరముతో రెండు రెక్కలతో ముక్కుతో పక్షి ఆకారములో నుండెను (8).

అతితీక్‌ష్ణో మహాదంష్ట్రో వజ్రతుల్య నఖాయుధః | కంఠే కాలో మహాబాహు శ్చతుష్పాద్వహ్ని సన్నిభః || 9

యుగాంతోద్యత జీమూత భీమ గంభీర నిస్స్వనః | మహాకుపితకృత్యాగ్ని వ్యావృత్త నయనత్రయః || 10

స్పష్ట దంష్ట్రాధరోష్ఠశ్చ హుంకారస్సంయుతో హరః | ఈ దృగ్విధస్వరూపశ్చ హ్యుగ్ర ఆవిర్బభూవ హ || 11

హరిస్తద్దర్శనాదేవ వినష్టబలవిక్రమః | బిభ్రద్ధామ సహస్రాంశోరధః ఖద్యోత విభ్రమమ్‌ || 12

అథ విభ్రమ్య పక్షాభ్యాం నాభిపాదాన్‌ విదారయన్‌ | పాదాన్‌ బబంధ పుచ్ఛేన బాహు భ్యాం బాహుమండలమ్‌ || 13

భిందన్నురసి బాహుభ్యాం నిజగ్రాహ హరో హరిమ్‌ | తతో జగామ గగనం దేవైస్సహ మహర్షిభిః || 14

సహసైవాభ్యయాద్విష్ణుం స హి శ్యేన ఇవోరగమ్‌ | ఉత్‌క్షిప్యోత్‌ క్షిప్య సంగృహ్య ని పాత్య చ నిపత్య చ || 15

మిక్కిలి వాడియగు పెద్ద దంష్ట్రలు గలది, వజ్రముల వంటి నఖములే ఆయుధములుగా గలది, కంఠమునందు నల్లని మచ్చ గలది, పెద్ద బాహువులు గలది, నాల్గు పాదములు గలది, అగ్ని వలె ప్రకాశించునది (9), ప్రలయకాలములో వర్షించుటకు సిద్ధముగా నున్న మేఘముల గర్జనల వలె భయమును గొప్పు ఘీంకారము గలది. మిక్కిలి కోపించిన రాక్షసస్త్రీ వలె నిప్పులు గ్రక్కుచున్న మూడు కన్నులను ఇటునటు త్రిప్పుచున్నది (10), దంష్ట్రలు పొడుచుకువచ్చిన క్రింది పెదవి గలది, హుంకార శబ్దమును చేయుచున్నది, భయంకరమైనది అగు ఇట్టి ఆకారముతో శివుడుఆవిర్భవించెను (11). ఆ ఆకారమును చూచిన మాత్రముననే విష్ణువు తన బలపరాక్రమములను గోల్పోయెను. సూర్యమండలమును స్పృశించే ఆ రూపము సూర్యుని ప్రకాశము వెల వెలబోవునట్లు చేసెను (12). అపుడా ఆకారము నృసింహుని రెక్కలతో త్రిప్పి పాదములను నేలపై కొట్టి, తోకతో పాదములను, బాహువులతో బాహువులను వక్షస్థ్సలమును బంధించివేసెను (13). అపుడు శివుడు బాహువులతో వక్షస్థ్సలముపై కొట్టి నృసింహుని ఒడిసి పట్టెను. కాని నృసింహుడు దేవతలతో మరియు మహర్షులతో గూడి ఆకసమున కెగసెను (14). అపుడు శివుడు వెంటనే విష్ణువు వెనుక వేగముగా వెళ్లి గ్రద్ద పామును వలె పట్టుకొని అనేక పర్యాయములు పైకి ఎత్తి నేలపై పారవైచెను (15).

ఉడ్డీయోడ్డీయ భగవాన్‌ పక్షఘాత విమోహితమ్‌ | హరిం హరస్తం వృషభం వివేశానంత ఈశ్వరః || 16

అనుయాంతం సురాస్సర్వే నమోవాక్యేన తుష్టువుః | ప్రణముస్సాదరం ప్రీత్యా బ్రహ్మాద్యాశ్చ మునీశ్వరాః || 17

నీయమానః పరవశో దీనవక్త్రః కృతాంజలిః | తుష్టావ పరమేశానం హరిస్తం లలితాక్షరైః || 18

నామ్నామష్టశ##తేనైవ స్తుత్వా తం మృడమేవ చ | పునశ్చ ప్రార్థయామాస నృసింహశ్శరభేశ్వరమ్‌ || 19

యదా యదా మమా జ్ఞేయం మతిస్స్యాద్గర్వదూషితా | తదా తదాపనేతవ్యా త్యయైవ పరమేశ్వర || 20

ఏవం విజ్ఞాపయన్‌ ప్రీత్యా శంకరం నకరేసరీ | నత్వా శక్తో%భవద్విష్ణు ర్జీవి తాంతపరాజితః || 21

తద్వక్త్రం శేషగాత్రాం తం కృత్వా సర్వస్వవిగ్రహమ్‌ | శక్తియుక్తం తదీయాంగం వీరభద్రః క్షణాత్తతః || 22

అథ బ్రహ్మాదయో దేవాశ్శారభం రూపమాస్థితమ్‌ | తుష్టువు శ్శంకరం దేవం సర్వలోకైక శంకరమ్‌ || 23

గాలిలో ఎగురుతూ అనంతుడు, ఈశ్వరుడు అగు హరభగవానుడు శ్రేష్ఠుడగు ఆ హరిని లాగుకొని పోయి తన రెక్కలతో కొట్టి మూర్ఛిల్లునట్లు చేసి ఆకాశమును ప్రవేశించెను (16). నృసింహుని వెనుక పడిన శివుని బ్రహ్మాది దేవతలు మరియు మహర్షులు అందరు సాదరముగా ప్రీతితో నమస్కరించి స్తోత్రపాఠము (నమకము) లతో స్తుతించిరి (17). శివునిచే బలాత్కారముగా తీసుకొని వెళ్లబడుచున్న హరి దీనముఖుడై చేతులు జోడించి ఆ పరమేశ్వరుని సుందరమగు పదములతో గూడిన స్తోత్రములతో స్తుతించెను (18). నృసింహుడు శరభేశ్వరుని రూపములోనున్న శివుని అష్టోత్తరశతనామములతో స్తుతించి మరల ఇట్లు ప్రార్థించెను (19). ఓ పరమేశ్వరా ! అజ్ఞానముతో నిండియున్న నా ఈ మనస్సు ఏ ఏ సమయములలో గర్వముచే కలుషితమగునో, ఆయా సమయములలో నీవే ఆ గర్వమును తొలగించుచుండుము (20). పరాజితుడై ప్రాణాంతకస్థితిలో నున్న ఆ నృసింహుడు శంకరునికి ప్రీతితో ఇట్లు విన్నవించుకొని మరల శక్తిని పొంది విష్ణురూపమును పొందెను (21). అపుడు వీరభద్రుడు ఆ నృసింహదేహము యొక్క తలను మిగిలిన దేహము నుండి క్షణకాలములో వేరుచేసి శక్తిమంతుడగు ఆతనిని నిర్వీర్యుని చేసెను (22). సర్వలోకములకు ఏకైక మంగళప్రదాత, శరభావతారములో నున్నవాడు అగు ఆ శంకరదేవుని అపుడు బ్రహ్మాది దేవతలు స్తుతించిరి (23).

దేవా ఊచుః |

బ్రహ్మవిష్ణ్వింద్ర చంద్రాది సురాస్సర్వే మహర్షయః | దితి జాద్యా సంప్రసూతాస్త్వత్తస్సర్వే మహేశ్వరః || 24

బ్రహ్మవిష్ణు మహేంద్రాంశ్చ సూర్యాద్యానసురాన్‌ సురాన్‌ | త్వం వై సృజసి పాస్యత్సి త్వమేవ సకలేశ్వరః || 25

యతో హరసి సంసారం హర ఇత్యుచ్యతే బుధైః | నిగృహీతో హరిర్యస్మాద్ధర ఇత్యుచ్యతే బుధైః || 26

యతో బిభర్షి సకలం విభజ్య తనుమష్టధా | అతో%స్మాన్‌ పాహి భగవన్‌ సురాన్‌ దానై రభీప్సితైః || 27

త్వం మహాపురుషశ్శంభు స్సర్వే శస్సురనాయకః | నిస్స్వాత్మా నిర్వికారాత్మా పరబ్రహ్మ సతాంగతిః || 28

దీనబంధుర్దయాసింధు రద్భుతోతిః పరాత్మదృక్‌ | ప్రాజ్ఞో విరాట్‌ విభుస్సత్య స్సచ్చిదానంద లక్షణః || 29

దేవతలిట్లు పలికిరి -

ఓ మహేశ్వరా! బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, చంద్రుడు మొదలగు సకల దేవతలు,మహర్షులు, రాక్షసులు మొదలగు వారందరు నీనుండియే జన్మించిరి (24). బ్రహ్మ, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు మొదలగు దేవతలను మరియు అసురులను నీవే సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నావు. నీవు సర్వేశ్వరుడవు (25). నీవు సంసారమును పోగొట్టెదవు గాన నీకు హరుడని పేరు వచ్చినదని పండితులు చెప్పెదరు. నీవు హరిని నిగ్రహించినావు గాన హరుడైనా వనియు పండితులు చెప్పెదరు (26). ఓ భగవాన్‌ ! నీవు నీ శరీరమును అష్టమూర్తులుగా విభజించి బ్రహ్మాండము నంతనూ ధరించియున్నావు. కావున దేవతలమగు మమ్ములను అభీష్టవరములనిచ్చి కాపాడుము (27). నీవు పురుషోత్తముడవు, మంగళస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, దేవదేవుడవు, స్వార్థమునెరుంగని వాడవు, వికారహీనమగు స్వరూపము గలవడవు, పరబ్రహ్మవు, సత్పురుషులకు శరణ్యుడవు (28), దీనులకు బంధుడవు, దయా సముద్రుడవు, అద్భుతమగు లీలలు గలవాడవు, ధ్యానములో పరాత్మను దర్శించువాడవు, జ్ఞానస్వరూపుడవు, విరాట్‌ స్వరూపుడవు, సర్వవ్యాపివి, సత్యరూపుడవు, సచ్చిదానంద స్వరూపుడవు అయి ఉన్నావు (29).

నందీశ్వర ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచశ్శంభుర్దేవానాం పరమేశ్వరః | ఉవాచ తాన్‌ సురాన్‌ దేవ మహర్షీంశ్చ పురాతనాన్‌ || 30

యథా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతమ్‌ | ఏక ఏవ తథా విష్ణుశ్శివే లీనో న చాన్యథా || 31

ఏకో విష్ణుర్నృసింహాత్మా సదర్పశ్చ మహాబలః | జగత్సంహారకరణ ప్రవృత్తో నరకేసరీ || 32

ప్రార్థనీయో నమస్తసై#్మ మద్భక్తైస్సిద్ధికారిభిః | మద్భక్తప్రవరశ్చైవ మద్భక్తవరదాయకః || 33

ఏతావదుక్త్వా భగవాన్‌ పక్షిరాజో మహాబలః | పశ్యతాం సర్వదేవానాం తత్రైవాంతరధీయత || 34

వీరభద్రో%పి భగవాన్‌ గణాధ్యక్షో మహాబలః | నృసింహకృత్తిం నిష్కృష్య సమాదాయ య¸° గిరిమ్‌|| 35

నృసింహ కృత్తి వసనస్తదా ప్రభృతి శంకరః | తద్వక్త్రం ముండమాలాయాం నాయకత్వేన కల్పితమ్‌ || 36

నందీశ్వరుడిట్లు పలికెను-

పరమేశ్వరుడగు శంభుడు దేవతల ఈ మాటను విని, ఆ దేవతలను దేవర్షులను మరియు పురాతనులగు మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను (30). జలమును జలములో, పాలను పాలలో మరియు నేతిని నేతిలో పోసినచో అని ఏకమగును. అటులనే విష్ణువు శివునిలో లీనమై ఏకమగును. ఈ విషయములో సందేహము వలదు (31). విష్ణువు నృసింహరూపమును దాల్చి మహాబలముచే గర్వితుడై ఒంటరిగా జగత్తును సంహరించే కార్యమును ఆరంభించబోయెను (32). నృసింహునకు నమస్కారము. ఈ నృసింహుడు నిశ్చయముగా సిద్ధిని పొందు నా భక్తులచే ప్రార్థింపబడగలడు. నా భక్తులలో శ్రేష్ఠుడగు ఈతడు నా భక్తులకు వరముల నీయగలడు (33). మహాబలశాలియగు పక్షిరూపములో నున్న ఆ భగవానుడు ఇంతమాత్రమే పలికి దేవతలందరు చూచుచుండగా అచటనే అంతర్ధానమయ్యెను (34). గణాధ్యక్షుడు, మహాబలవంతుడు నగు వీరభద్ర భగవానుడు కూడా నృసింహ చర్మమును ఊడబీకి దానిని తీసుకొని కైలాసమునకు వెళ్లెను (35). ఆనాటినుండియు శంకరుడు నృసింహచర్మను ధరించెను. నృసింహుని తలను తలల మాలికయందు ప్రముఖ స్థానములో గ్రుచ్చి ధరించెను (36).

తతో దేవా నిరాంతకాః కీర్తయంతః కథా మిమామ్‌ | విస్మయోత్ఫుల్ల నయనా జగ్ముస్సర్వే యథాగతమ్‌ ||37

య ఇదం పరమాఖ్యానం పుణ్యం వేదరసాన్వితమ్‌ | పఠతి శృణుయాచ్చైవ సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ || 38

ధన్యం యశస్య మా యుష్యమారోగ్యం పుష్టివర్ధనమ్‌ | సర్వవిఘ్నప్రశమనం సర్వవ్యాధి వినాశనమ్‌ || 39

దుఃఖప్రశమనం వాంఛాసిద్ధిదం మంగలాలయమ్‌ | అపమృత్యుహరం బుద్ధిప్రదం శత్రు వినాశనమ్‌ || 40

ఇదం తు శరభాకారం పరం రూపం పినాకినః | ప్రకాశనీయం భ##క్తేషు శంకరస్య చరేషువై || 41

తైరేవ పఠితవ్యంచ శ్రోతవ్యం చ శివాత్మభిః | నవధా భక్తిదం దివ్యమంతః కరణ శుద్ధిదమ్‌ || 42

శివోత్సవేషు సర్వేషు చతుర్దశ్యష్టమీషు చ | పఠేత్ర్పతిష్ఠాకాలే తు శివసన్నిధి కారణమ్‌ || 43

అపుడు తొలగిన దుఃఖము గల దేవతలు ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములు గలవారై అందరు ఈ గాథను కీర్తించుచూ వచ్చిన దారిన వెళ్లిరి (37). శ్రేష్ఠము, పుణ్యము, వేదసారముతో గూడినది అగు ఈ వృత్తాంతమును చదువువాడు,మరియు వినువాడు కోర్కెలనన్నిటినీ పొందును (38). ఈ గాథ ధన్యమైనది, యశస్సును ఆయురారోగ్యములను ఇచ్చి పుష్టిని వర్ధిల్ల జేయునది, విఘ్నములనన్నిటినీ పోగొట్టునది, వ్యాధులనన్నిటినీ నశింపజేయునది (39), దుఃఖములను పోగొట్టునది, కోర్కెలనీడేర్చునది, మంగళములకు నిలయమైనది, అపమృత్యువును పోగొట్టునది, బుద్ధిని ఇచ్చి శత్రువులను నశింపజేయునది (40). పినాకియగు శివుని యొక్క శ్రేష్ఠమగు ఈ శరభావతారమును శంకరుని భక్తులలో, మరియు పూజకులలో ప్రచారమును చేయవలెను (41). శివస్వరూపులగు వారు మాత్రమే దీనిని పఠించవలెను. ఈ దివ్య గాథ నవవిధముల భక్తిని కలిగించి అంతఃకరణమును శుద్ధి జేయును (42). శివోత్సవములన్నిటి యందు, చతుర్దశినాడు, అష్టమినాడు, ఆలయ ప్రతిష్ఠ చేయు కాలములో దీనిని పఠించినచో, శివుని సన్నిధి లభించును (43).

చౌరవ్యాఘ్ర నృసింహాత్మ కృతరాజభ##యేషు చ | అన్యేషూత్పాత భూకంప దస్వ్యాది పాంశువృష్టిషు || 44

ఉల్కాపాతే మహావాతే వినా వృష్ట్యతి వృష్టిషు | పఠేద్యః ప్రయతో విద్వాన్‌ శివభక్తో దృఢవ్రతః || 45

యః పఠే చ్ఛృణుయాద్వాపి నిష్కామో వృత్తమైశ్వరమ్‌ | రుద్రలోకం సమాసాద్య రుద్రస్యాను చరో భ##వేత్‌ || 46

రుద్రలోకమనుప్రాప్య రుద్రేణ సహ మోదతే | తతస్సాయుజ్యమాప్నోతి శివస్య కృపయా మునే || 47

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం శరభావతార వర్ణనం నామ ద్వాదశో%ధ్యాయః (12).

చోరులు, వ్యాఘ్రములు, దుష్టులగు మానవులు, సింహములు మొదలగు వాటి వలన భయము కలిగినప్పుడు, రాజువలన భయము కలిగినప్పుడు, భూకంపము, దొంగలు పడుట ఇత్యాది ఉత్పాతములయందు, ధూళివర్షముకురిసినప్పుడు (44), ఉల్కలు పడినప్పుడు, తుఫాను, అనావృష్టి, అతి వృష్టి కలిగినప్పుడు శివభక్తుడగు విద్వాంసుడు దృఢమగు నిష్ఠగలవాడై శ్రద్ధతో పఠించవలెను (45). ఈ ఈశ్వర గాథను ఎవడైతే నిష్కామ బుద్ధితో పఠించునో, వాడు రుద్రలోకమును పొంది రుద్రుని అనుచరుడగును (46). ఆతడు రుద్రలోకమును పొంది రుద్రునితో కలిసి ఆనందించును. ఓ మునీ! అట్టి భక్తుడు ఆ తరువాత శివుని కృపచే సాయుజ్యమును పొందును (47).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు శరభావతారవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Siva Maha Puranam-3    Chapters