Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయోదశో%ధ్యాయః

విశ్వానరుని తపస్సు

నందీశ్వర ఉవాచ|

శృణు బ్రహ్మసుత ప్రీత్యా చరితం శశిమౌలినః | సో%వతీర్ణో యథా ప్రీత్యా విశ్వానరగృహే శివః || 1

నామ్నా గృహపతి స్సో%భూదగ్నిలోక పతిర్మునే | అగ్నిరూపసై#్తజసశ్చ సర్వాత్మా పరమః ప్రభుః || 2

నర్మదాయాస్తటే రమ్యే పురే నర్మపురే పురా | పురారిభక్తః పుణ్యాత్మాభవద్విశ్వానరో మునిః || 3

బ్రహ్మచర్యాశ్రమే నిష్ఠో బ్రహ్మయజ్ఞరతస్సదా | శాండిల్యగోత్రః శుచిమాన్‌ బ్రహ్మతే జో నిధిర్వశీ || 4

విజ్ఞాతాఖిల శాస్త్రార్థస్సదాచారరతస్సదా | శైవాచరప్రవీణో%తి లౌకికా చారవిద్వరః || 5

చిత్తే విచార్య గృహిణీ గుణాన్‌ విశ్వానరశ్శుభాన్‌ | ఉదువాహ విధానేన స్వోచితాం కాలకన్యకామ్‌ || 6

అగ్ని శుశ్రూషణరతః పంచయజ్ఞ పరాయణ | షట్‌ కర్మనిరతో నిత్యం దేవపిత్రతిథి ప్రియః || 7

ఏవం బహుతిథే కాలే గతే తస్యాగ్రజన్మనః | భార్యా శుచిష్మతీ నామ భర్తారం ప్రాహ సువ్రతా || 8

నాథ భోగా మయా సర్వే భుక్తా వై త్వత్ర్ప సాదతః | స్త్రీ ణాం సముచితా యే స్యుస్త్యాం సమేత్య ముదావహాః || 9

ఏవం మే ప్రార్థితం నాథ చిరాయ హృది సంస్థితమ్‌ | గృహస్థానాం సముచితం త్వమేతద్దాతుమర్హసి || 10

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ బ్రహ్మపుత్రా! చంద్రశేఖరుని గాథను ప్రీతితో వినుము. ఆ శివుడు ప్రేమతో విశ్వానరుని గృహములో అవతరించిన గాథను వినుము (1). సర్వాత్ముడగు ఆ పరమప్రభుడు తేజోమయుడై అగ్నిలోకమునకు ప్రభువై గృహపతియను పేరుతో అవతరించెను (2). పూర్వము సుందర నర్మదానదీతీరమునందు నర్మపురములో త్రిపురాంతకుడగు శివుని భక్తుడు, పుణ్యాత్ముడు అగు విశ్వానరుడనే ముని ఉండెను (3). శాండిల్య గోత్రికుడు, శుచిమంతుడు, బ్రహ్మతేజస్సునకు నిధి, జితేంద్రియుడు అగు నాతడు బ్రహ్మచర్యాశ్రమమునందు నిష్ఠ గలవాడై నిత్యము వేదాధ్యయనమనే యజ్ఞమునందు రతుడై యుండెను (4). సకలశాస్త్రముల సారము తెలిసినవాడు, సర్వదా సదాచారమునందు నిష్ఠ గలవాడు, శైవాచారములో సమర్థుడు, లౌకికాచారముల నెరింగిన వారిలో మిక్కిలి శ్రేష్ఠుడునగు (5) ఆ విశ్వానరుడు శుభకరమగు గృహీణీధర్మములను మనస్సులో విచారణ చేసి తనకు దగిన యుక్త వయస్కురాలగు కన్యను యథావిధిగా వివాహమాడెను (6). అతడు అగ్నిసేవయందు నిష్ఠగలవాడై, పంచ యజ్ఞములను శ్రద్ధగా ఆచరించుచూ, షట్‌కర్మలను ఏకాగ్రతతో అనుష్ఠిస్తూ నిత్యము దేవతలకు పితరులకు అతిథులకు ప్రీతిని కలిగించుచుండెను (7). ఆ బ్రాహ్మణుడు ఇట్లు జీవించుచుండగా చిరకాలము గడిచిన తరువాత శుచిష్మతియను ఆతని భార్య గొప్ప వ్రతముతో జీవిస్తూ ఒకనాడు ఆతనితో నిట్లనెను (8). ఓ నాథా ! నీ అనుగ్రహముచే నేను భోగములనన్నిటినీ అనుభవించితిని. నేను నిన్ను పొంది స్త్రీలకు యోగ్యమైన, ఆనందదాయకమగు సుఖములను భోగించితిని (9). చిరకాలమునుండియు నా హృదయములో ఒక కోరిక మిగిలి యున్నది. ఓ నాథా! గృహస్థులకు ఉచితమగు ఈ కోర్కెను నీవు తీర్చదగును (10).

విశ్వానర ఉవాచ |

కిమదేయం సుశ్రోణి తవ ప్రియహితైషిణి | తత్ర్పార్థయ మహాభాగే ప్రయచ్ఛామ్యవిలంబితమ్‌ || 11

మహేశితుః ప్రసాదేన మమ కించిన్న దుర్లభమ్‌ | ఇహాముత్ర చ కళ్యాణి సర్వకల్యాణ కారిణః || 12

విశ్వానరుడిట్లు పలికెను-

ఓ సుందరీ ! ప్రియుని హితమును గోరు నీకు ఈయదగినది ఏమి గలదు? ఓ పుణ్యాత్మురాలా! నీవు కోరుకొనుము. నేను వెనువెంటనే నీ కోర్కెను తీర్చెదను (11). ఓ కళ్యాణీ ! పుణ్యకార్యములను అన్నింటినీ చేయు నాకు మహేశ్వరుని అనుగ్రహముచే ఇహపరలోకములలో దుర్లభమగునది ఏదియూ లేదు (12).

నందీశ్వర ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచః పత్యుస్తస్య సా పతిదేవతా | ఉవాచ హృష్యవదనా కరౌ బద్ధ్వా వినీతికా || 13

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ పతివ్రత భర్తయొక్క ఆ మాటను విని సంతోషముతో గూడిన ముఖము గలదై వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికెను (13).

శుచిష్మత్యువాచ |

వరయోగ్యాస్మి చేన్నాథ యది దేయో వరో మమ | మహేశసదృశం పుత్రం దేహి నాన్యం వరం పృణ || 14

శుచిష్మతి ఇట్లు పలికెను-

ఓ నాథా! నేను వరమునకు యోగ్యురాలనైనచో,నాకు వరమునీయ దలచినచో, మహేశ్వరుని బోలు పుత్రుని ఇమ్ము. మరియొక వరమును నేను కోరను (14)

నందీశ్వర ఉవాచ|

ఇతి తస్యా వచశ్శ్రుత్వా బ్రాహ్మణస్స శుచి వ్రతః | క్షణం సమాధి మాధాయ హృద్యేతత్సమచింతయత్‌ || 15

అహో కిం మే తయా తన్వ్యా ప్రార్థితం హ్యతిదుర్లభమ్‌ | మనోరథ పథా ద్దూరమస్తు వా స హి సర్వకృత్‌ || 16

తేనైవాస్యా ముఖే స్థిత్వా వాక్‌ స్వరూపేణ శంభునా | వ్యాహృతం కో%న్యథా కర్తుముత్సహేత భ##వేదిదమ్‌ || 17

ఇతి సంచింత్య స మునిర్విశ్వానర ఉదారధీః | తతః ప్రోవాచ తాం పత్నీమేక పత్నీవ్రతే స్థితః || 18

ఇత్థమాశ్వాస్య తాం పత్నీం జగామ తపసే మునిః | యత్ర విశ్వేశ్వర స్సాక్షాత్కాశీనాథో%ధితిష్ఠతి || 19

ప్రాప్య వారాణసీం తూర్ణం దృష్ట్వా తాం మణి కర్ణికామ్‌ | తత్యాజ తాపత్రితయమపి జన్మశతార్జితమ్‌ || 20

దృష్ట్వా సర్వాణిలింగాని విశ్వేశప్రముఖాని చ | స్నాత్వా సర్వేషు కుండేషు వాపీ కూపసరస్సు చ || 21

నందీశ్వరుడిట్లు పలికెను-

శౌచముతో గూడిన వ్రతము గల ఆ బ్రాహ్మణుడు ఆమెయొక్క ఈ మాటను విని క్షణకాలము మనస్సును ఏకాగ్రము చేసి హృదయములో నిట్లు తలపోసెను (15). ఆశ్చర్యము ! ఈ సుందరి అతి దుర్లభమగు వరమును కోరినది యేమి? ఈ వరము ఊహకైననూ అందునది కాదు. కానిమ్ము. సర్వమును చేయువాడు ఆయనయే గదా! (16) ఆ శంభుడు ఈమె నోటిలో వాగ్రూపముతో నుండి పలికినాడు. అట్లు గానిచో ఇట్లు పలుకు సామర్థ్యము ఎవరికి గలదు? (17) విశాలహృదయుడగు ఆ విశ్వానరమహర్షి ఇట్లు తలపోసి, ఏకపత్నీవ్రతమునందున్నవాడై, తరువాత తన భార్యకు నచ్చచెప్పి, (18) తపస్సు కొరకు బయలు దేరెను. ఎచట విశ్వేశ్వరుడు కాశీనాథుడై స్వయముగా వెలసి యున్నాడో (19). అట్టి వారాణసీ నగరమును చేరి, వెంటనే మణికర్ణికను దర్శించి అనేక జన్మలనుండి సంప్రాప్తమైన త్రివిధ తాపములను విడిచిపెట్టెను (20). విశ్వేశ్వరుడు మొదలగు లింగములనన్నిటినీ దర్శించి, సర్వకుండములయందు, దిగుడు బావులయందు, బావులయందు మరియు సరస్సులయందు స్నానమును చేసెను (21).

నత్వా వినాయకాన్‌ సర్వాన్‌ గౌరీం శర్వాం ప్రణమ్య చ | సంపూజ్య కాలరాజం చ భైరవం పాపభక్షణమ్‌ || 22

దండనాయకముఖ్యాంశ్చ గణాన్‌ స్తుత్వా ప్రయత్నతః | ఆదికేశవముఖ్యాంశ్చ కేశవం పరితోప్య చ || 23

లోలార్కముఖసూర్యాంశ్చ ప్రణమ్య స పునః పునః | కృత్వా చ పిండదానాని సర్వతీర్థేష్వతంద్రితః || 24

సహస్ర భోజనాద్యైశ్చ మునీన్‌ విప్రాన్‌ ప్రతర్వ్య చ | మహాపూజోపచారైశ్చ లింగాన్య భ్చర్చ్య భక్తితః || 25

అసకృచ్చింతయామాస కిం లింగం క్షిప్రసిద్ధిదమ్‌ | యత్ర నిశ్చలతామేతి తపస్తనయకామ్యయా || 26

క్షణం విచార్య స మునిరితి విశ్వానరస్సుధీః | క్షిప్రం పుత్రప్రదం లింగం వీరేశం ప్రశశంస హ ||27

అసంఖ్యాతాస్సహస్రాణి సిద్ధాస్సిద్ధిం గతాస్తతః | సిద్ధలింగమితి ఖ్యాతం తస్మా ద్వీరేశ్వరం పరమ్‌ || 28

వినాయకులకందరికీ ప్రణమిల్లి, శివుని పత్నియగు గౌరికి వందనమాచరించి, పాపములను పోగొట్టువాడు కాలరాజు అగు భైరవుని చక్కగా పూజించి (22), దండనాయకులను గణాధ్యక్షులను శ్రద్ధతో స్తుతించి, ఆదికేశవుడు మొదలగు దేవతలను మరియు కేశవుని సంతోషపెట్టి (23), లోలార్కుడు మొదలగు సూర్యులకు అనేకపర్యాయములు ప్రణమిల్లి, తీర్థములన్నిటియందు అలసట నెరుంగ పిండదానములను చేసి (24), వేయి మంది మునులకు బ్రాహ్మణులకు భోజనసంతర్పణ చేసి, మహాపూజోపచారములతో భక్తిపూర్వకముగా లింగములనర్చించెను (25). ఏ లింగము శీఘ్రముగా ఫలము నిచ్చును? పుత్రుని కోరి చేయు తపస్సు ఏ లింగమునుందు నిశ్చలముగా కొనసాగును? (26) అను విషయమును బుద్ధిశాలియగు ఆ విశ్వానరమహర్షి క్షణకాలము ఆలోచించి, వీరేశలింగము నారాధించినచో శీఘ్రమే పుత్రుడు కలుగునని ప్రశంసించెను (27). లెక్కలేనంతమంది సిద్ధులు ఆరాధించి సిద్ధిని పొందుటచే శ్రేష్ఠమగు ఆ వీరేశలింగమునకు సిద్ధలింగమను ఖ్యాతి కలిగినది (28).

వీరేశ్వరం మహాలింగ మబ్దమభ్యర్చ్య భక్తితః | ఆయుర్మనోరథం సర్వం పుత్రాదిక మనేకశః || 29

అహమప్యత్ర వీరేశం సమారాధ్య త్రికాలతః | ఆశు పుత్ర మవాప్స్యామి యథాభిలషితం స్త్రియా || 30

ఇతి కృత్వా మతిం ధీరో విప్రో విశ్వానరః కృతీ | చంద్రకూపజలే స్నాత్వా జగ్రాహ నియమం వ్రతీ || 31

ఏకాహారో%భవన్మా సం మాసం నక్తాశనో%భవత్‌ | అయాచితాశనో మాసం మాసం త్యక్తాశనః పునః || 32

పయోవ్రతో%భవన్మాసంమాసం శాకఫలాశనః | మాసం ముష్టి తిలాహారో మాసం పానీయ భోజనః || 33

పంచగవ్యాశనో మాసం మాసం చాంద్రాయణ వ్రతీ | మాసం కుశాగ్రజల భుక్‌ మాసం శ్వసనభక్షణః || 34

ఏవమబ్దమితం కాలం తతాప స తపో%ద్భుతమ్‌ | త్రికాలమర్చయద్భక్త్యా వీరేశం లింగముత్తమమ్‌ || 35

అథ త్రయోదశే మాసి స్నాత్వా త్రిపథగాంభసి | ప్రత్యూష ఏవ వీరేశం యావదాయాతి స ద్విజః || 36

వీరేశ్వర మహాలింగమును సంవత్సరకాలము భక్తితో అర్చించినచో, ఆయుర్దాయము, పుత్రుడు ఇత్యాది మనోరథములన్నియు సిద్ధించును (29). నేను కూడా ఇచట మూడు కాలములయందు వీరేశుని ఆరాధించి నాభార్య కోరిన విధంబుగా శీఘ్రమే పుత్రుని పొందగలను (30). ధీరుడు, కృతార్థుడు అగు విశ్వానరముని ఇట్లు నిర్ణయించుకొని, చంద్రకూపముయొక్క నీటిలో స్నానము చేసి వ్రతనియమమును చేపట్టెను (31). ఆతడు ఒకనెల ఒక పూట, రెండవనెల రాత్రి మాత్రమే భోజనము చేసెను. ఒకనెల అయాచితముగా లభించిన ఆహారమును మాత్రమే భోజనము చేసెను. ఒకనెల ఉపవాసమును చేసెను (32). ఒకనెల పాలు త్రాగి, మరియొక్క నెల కూరలను, పళ్లను తిని, మరియొక నెల గుప్పెడు తిలలను మాత్రమే తిని, ఒక నెల నీరు త్రాగి తపస్సును చేసెను (33). ఒక నెల పంచగవ్యమును భుజించెను. ఒక నెల చాంద్రాయణవ్రతము నాచరించెను. దర్భల అగ్రమునందలి జలమును మాత్రమే ఒక నెల త్రాగెను. ఒక నెల గాలిని మాత్రమే ఆహారముగా తీసుకొనెను (34). ఈ విధముగా ఆతడు ఒక సంవత్సరము అద్భుతమగు తపస్సును చేసెను. ఆతడు ఉత్తమమగు వీరేశలింగమును త్రికాలములయందు భక్తితో అర్చించెను (35). తరువాత పదమూడవ మాసములో ఆ బ్రాహ్మణుడు తెల్లవారుజామున గంగాజలముతో స్నానము చేసి వచ్చుచుండెను (36).

తావద్విలోకయాం చక్రే మధ్యే లింగం తపోధనః | విభూతి భూషణం బాలమష్టవర్షాకృతిం శిశుమ్‌ || 37

ఆ కర్ణాయతనేత్రం చ సురక్తదశనచ్ఛదమ్‌ | చారు పింగజటామౌలిం నగ్నం ప్రహసితాననమ్‌ || 38

శైశవోచితనేపథ్య ధారిణం చితిధారిణమ్‌ | పఠంతం శ్రుతిసూక్తాని హసంతం చ స్వలీలయా ||39

తమాలోక్య ముదం ప్రాప్య రోమకంచుకితో మునిః | ప్రోచ్చచార హృదాలపాన్నమోస్త్వితి పునః పునః || 40

అభిలాషప్రదైః పద్యైరష్టభిర్బాలరూపిణమ్‌ | తుష్టావ పరమానందం శంభుం విశ్వానరః కృతీ || 41

ఇంతలో ఆ తపోనిధికి లింగమధ్య భాగమునందు విభూతియే అలంకారముగా గలవాడు, ఎనిమిది సంవత్సరముల వయస్సు గలవాడు (37), ఆకర్ణ విశాలమగు కన్నులు గలవాడు, ఎర్రని పెదవులు గలవాడు, సుందరమైన నల్లని జటలతో గూడిన శిరస్సు గలవాడు, వస్త్రములు లేనివాడు, చిరునవ్వు మోమువాడు (38), బాల్యమునకు తగిన ఆభరణములను ధరించినవాడు, చితాభస్మను ధరించినవాడు, తన లీలతో నవ్వుతూ వేదసూక్తములను పఠించుచున్నవాడు అగు బాలకుడు కనబడెను (39). ఆ మహర్షికి ఆ బాలుని చూచుట తోడనే ఆనందముతో శరీరము గగుర్పాటు చెందెను. ఆయన తన హృదయానందమును అనేకపర్యాయములు 'నమస్కారమగు గాక!' అని బిగ్గరగా పలుకుతూ ప్రకటించెను (40). కృతార్థుడైన విశ్వానరుడు బాలరూపములోనున్న పరమానందస్వరూపుడగు శివుని భక్తిని కలిగించే ఎనిమిది పద్యములతో స్తుతించెను (41).

విశ్వానర ఉవాచ|

ఏకం బ్రహ్మైవాద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించిత్‌ |

ఏక రుద్రో న ద్వితీయో%వతస్థే తస్మాదేకం త్వాం ప్రపద్యే మహేశమ్‌ || 42

కర్తా హర్తా త్వం హి సర్వస్య శంభో నానారూపే ష్వేకరూపో%ప్యరూపః |

యద్వ త్ర్పత్యగ్ధర్మ ఏకో%ప్యనేకస్తస్మాన్నాన్యం త్వాం వినేశంప్రపద్యే || 43

రజ్జౌ సర్పశ్శుక్తికాయాం చ రౌప్యం నైరః పూరస్తన్మృగాఖ్యే మరీచౌ |

యద్యత్సద్విద్విష్వగేవ ప్రపంచో యస్మిన్‌ జ్ఞాతే తం ప్రపద్యే మహేశమ్‌ || 44

తోయే శైత్యం దాహకత్వం చ వహ్నౌ తాపో భానౌ శీతభానౌ ప్రసాదః |

పుష్పే గంధో దుగ్ధమధ్యే%పి సర్పిర్యత్తచ్ఛంభో త్వం తతస్త్వాం ప్రపద్యే || 45

శబ్దం గృహ్ణాస్యశ్రవాస్త్వం హి జిఘ్ర స్యఘ్రాణస్త్వం వ్యం ఘ్రిరాయాసి దూరాత్‌ |

వ్యక్షః పశ్యేస్త్వం రసజ్ఞో%ప్య జిహ్వః కస్త్వాం సమ్యగ్వేత్త్యతస్త్వాం ప్రపద్యే || 46

నో వేద త్వామీశ సాక్షాద్ధి వేదో నో వా విష్ణుర్నో విధాతాఖిలస్య |

నో యోగీంద్రా నేంద్రముఖ్యాశ్చ దేవా భక్తో వేద త్వామతస్త్వాం ప్రపద్యే || 47

నో తే గోత్రం నో సజన్మాపి నాశో నో వా రూపం నైవ శీలం న దేశః |

ఇత్థం భూతో%పీశ్వరస్త్వం త్రిలోక్యాస్సర్వాన్‌ కామాన్‌ పూరయేస్త్వం భ##జే త్వామ్‌ || 48

త్వత్తస్సర్వం త్వం హి సర్వం స్మరారే త్వం గౌరీశస్త్వం చ నగ్నో%తిశాంతః |

త్వం వై వృద్ధస్త్వం యువా త్వం చ బాలస్తత్త్వం యత్కిం నాన్యతస్త్వాం నతో%హమ్‌ || 49

విశ్వానరుడిట్లు పలికెను-

బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగతభేదములు లేని పూర్ణ సత్యతత్త్వము. ఈ నానాత్వము కన్పట్టునదియే గాని సత్యము గాదు. రుద్రుడు ఒక్కడే గలడు.రెండవ తత్త్వము లేదు. కావున అద్వయుడవు, మహేశుడవు అగు నిన్ను శరణు జొచ్చుచున్నాను (42). హే శంభో! సర్వమును సృష్టించి లయము చేయువాడవు నీవే. వివిధరూపములలో అఖండసత్తారూపములో నుండే నీకు రూపము లేదు. ప్రత్యగాత్మ స్వరూపుడవగు నీవు అద్వయుడవైననూ అనేకముగ కన్పట్టు చున్నావు. కావున ఈశ్వరుడవగు నిన్ను తక్క ఇతరమును నేను శరణు పొందుట లేదు (43). త్రాడు నందు పాము, ముత్యపు చిప్ప యందు వెండి, ఎండమావుల యందు నీరు ఎట్లు మిథ్యయో, అటులనే సద్ఘనుడవగు నీ యందు విశ్వము మిథ్యయగును. దేనిని తెలిసినచో ప్రపంచము తత్త్వతః తెలిసినట్లు యగునో, అట్టి మహేశుని శరణు పొందుచున్నాను (44). నీటియందలి చల్లదనము, నిప్పుయందలివేడి, సూర్యుని యందలి తాపము, చంద్రుని యందలి ఆహ్లాదకత్వము, పుష్పమునందలి పరిమళము, పాలలోని వెన్న నీవే. కావున, హే శంభో! నిన్ను నేను శరణు వేడుచున్నాను (45). నీవు శబ్దమును వినెదవు. కాని నీకు చెవులు లేవు. నీవు ఆఘ్రాణించెదవు. కాని నీకు ముక్కులేదు. నీకు పాదము లేకున్ననూ దూరమునుండి వచ్చెదవు. కన్నులు లేని నీవు చూచుచున్నావు. జిహ్వ లేని నీవు రుచిని తెలియుచున్నావు. నీ స్వరూపమును పూర్ణముగాఎవరు ఎరుంగగలరు? కావున నిన్ను శరణు వేడుచున్నాను (46). ఓ ఈశ్వరా! వేదము సాక్షాత్తుగా నిన్ను ఎరుంగక జాలదు. విష్ణువు గాని, సర్వమును సృజించు బ్రహ్మగాని నిన్ను యెరుంగరు. యోగిశ్రేష్ఠులు, ఇంద్రాదిదేవతలు నిన్ను ఎరుంగరు. కాని, భక్తుడు నిన్ను తెలియగల్గును. కావున నిన్ను శరణు పొందుచుచున్నాను (47). నీకు గోత్రములేదు. జన్మనాశములు లేవు. నీకు రూపము లేదు. శీలము లేదు. దేశము లేదు. ఇట్టివాడవైననూ, నీకు ముల్లోకములకు ప్రభుడవు. నేను నిన్ను సేవించుచున్నాను నాకోర్కెలనన్నిటినీ ఈడేర్చుము (48). ఓ మన్మథాంతకా! సర్వము నీనుండి ఉద్భవించినది. సర్వము నీవే. గౌరీపతివి నీవు. దిగంబరుడవు అగు నీవు పరమ శాంత స్వరూపుడవు. వృద్ధుడవు నీవే. యువకుడవు నీవే. బాలుడవు నీవే. నీచే వ్యాప్తము కాని తత్త్వము ఏది గలదు? నేను నిన్ను నమస్కరించుచున్నాను (49).

నందీశ్వర ఉవాచ |

స్తుత్వేతి విప్రో నిపపాత భూమౌ సంబద్ధ పాణిర్భవతీహ యావత్‌ |

తావత్స బాలో%ఖిల వృద్ధవృద్ధః ప్రోవాచ భూదేవమతీవ హృష్ణః || 50

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ బ్రాహ్మణుడు ఇట్లు స్తుతించి చేతులను కట్టుకొని సాష్టాంగ ప్రణామము నాచరించునంతలో, వృద్ధులందరిలో వృద్ధుడగు ఆ బాలుడు మిక్కిలి ఆనందించి ఆ బ్రాహ్మణునితో నిట్లనెను (50).

బాల ఉవాచ |

విశ్వానర మునిశ్రేష్ఠ భూదేవాహం త్వయాద్య వై | తోషితస్సుప్రసన్నాత్మా వృణీష్వ వరముత్తమమ్‌ || 51

తత ఉత్థాయ హృష్టాత్మా మునిర్విశ్వానరః కృతీ | ప్రత్యబ్రవీన్ముని శ్రేష్ఠ శ్శంకరం బాలరూపిణమ్‌ || 52

బాలుడిట్లు పలికెను-

ఓ మహర్షీ ! విశ్వానరా ! బ్రాహ్మణా! నేను నీ తపస్సునకు సంతోషించితిని. నా మనస్సు మిక్కిలి ప్రసన్నమైనది. నీవు ఉత్తమమగు వరమును కోరుకొనుము (51). అపుడు కృతార్థుడైన విశ్వానరమహర్షి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై లేచి నిలబడి బాలుని రూపములోనున్న శంకరునకు ఇట్లు బదులిడెను (52).

విశ్వానర ఉవాచ |

మహేశ్వర కిమజ్ఞాతం సర్వజ్ఞస్య తవ ప్రభో | సర్వాంతరాత్మా భగవాన్‌ శర్వ స్సర్వప్రదో భవాన్‌ || 53

యాచ్ఞాం ప్రతి నియుక్తం మాం కిం బ్రూషే దైన్యకారిణీమ్‌ | ఇతి జ్ఞాత్వా మహేశాన యథేచ్ఛసి తథా కురు || 54

విశ్వానరుడిట్లు పలికెను-

మహేశ్వర ప్రభూ! సర్వజ్ఞుడవగు నీకు తెలియనది ఏమున్నది? నీవు సర్వుల అంతరంగములో నుండే భగవానుడవు. సర్వమును ఇచ్చే శర్వుడవు (53). అయిననూ, నీవు నన్ను దైన్యమును కలిగించే యాచనయందు ఏల నియోగించుచున్నావు? ఓ మహేశ్వరా! సర్వము నీకు తెలియును. కావున నీకు తోచినట్లు చేయుము (54).

నందీశ్వర ఉవాచ|

ఇతి శ్రుత్వా వచస్త దేవో విశ్వానరస్య హి శుచిశ్శుచివ్రతస్యాథ శుచిం స్మిత్వాబ్రవీచ్ఛిశుః || 55

త్వయా శుచే శుచిష్మత్యాం యో%భిలాషః కృతో హృది | అచిరేణౖవ కాలేన స భవిష్యత్యసంశయమ్‌ || 56

తవ పుత్రత్వమేష్యామి శుచిష్మత్యాం మహామతే | ఖ్యాతో గృహపతిర్నామ్నా శుచి స్సర్వామరప్రియః || 57

అఖిలాషాష్టకం పుణ్యం స్తోత్రమేతత్త్వయేరితమ్‌ | అబ్దత్రికాల పఠనాత్కామదం శివసన్నిధౌ || 58

ఏతత్‌ స్తోత్రపఠనం పుత్ర పౌత్రధనప్రదమ్‌ | సర్వశాంతి కరశ్చాపి సర్వాపత్తి వినాశనమ్‌ || 59

స్వర్గాపవర్గ సంపత్తి కారకం నాత్ర సంశయః | సర్వస్తోత్రసమం హ్యేతత్స్వకామప్రదం సదా || 60

నందీశ్వరుడిట్లు పలికెను-

శుద్ధవ్రతుడగు ఆ విశ్వానరుని ఈ మాటను విని పవిత్ర శిశురూపములో నున్న శివదేవుడు చిరునవ్వుతో అపుడిట్లనెను (55). ఓయీ పవిత్రుడా! నీవు ఎట్టి పుత్రుని శుచిష్మతియందు బడయవలెనని హృదయములో కోరుకుంటివో, అట్టి పుత్రుడు శీఘ్రముగా నిస్సంశయముగా లభించగలడు (56). ఓ మహాత్మా! నేను శుచిష్మతి యందు నీ పుత్రుడనై జన్మించి గృహపతి యను పేరుతో ప్రసిద్ధిని గాంచి పావనుడనై దేవతలందరికీ ప్రియుడను కాగలను (57). నీవు పలికిన అభిలాషాష్టకమను పేరు గల పవిత్రమగు ఈ స్తోత్రమును శివుని సన్నిధిలో మూడు కాలములయందు సంవత్సరకాలము పఠించినచో కోర్కెలు ఈడేరును (58). ఈ స్తోత్రమును పఠించినచో పుత్రులు, పౌత్రులు, ధనము లభించి ఆపదలన్నియు దూరమై సంపూర్ణమగు శాంతి కలుగును (59). ఈ స్తోత్రము స్వర్గమోక్షములను, సంపదను ఇచ్చుననుటలో సందేహము లేదు. సర్వదా కోర్కెలనన్నిటినీ ఈడేర్చు ఈ ఒక్క స్తోత్రము ఇతరస్తోత్రములన్నింటితో సమమైనది (60).

ప్రాతరుత్థాయ సుస్నాతో లింగమభ్యర్చ్య శాంభవమ్‌ | వర్షం జపన్నిదం స్తోత్రమపుత్రః పుత్రవాన్‌ భ##వేత్‌ || 61

అభిలాషాష్టక మిదం న దేయం యస్య కస్యచిత్‌ | గోపనీయం ప్రయత్నేన మహావంధ్యాప్రసూతికృత్‌ || 62

స్త్రియా వా పురుషేణాపి నియమాల్లింగ సన్నిధౌ | అబ్దం జప్తమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశయః || 63

ఇత్యుక్త్వాం తర్దధే శంభుర్బాలరూపస్సతాం గతిః | సో%పి విశ్వానరో విప్రో హృష్టాత్మా స్వగృహం య¸° || 64

ఇతి శ్రీశివమహాపురాణ శతరుద్రసంహితాయాం గృహపత్య వతారవర్ణనం నామ త్రయోదశో%ధ్యాయః (13)

సంవత్సరకాలము ఉదయమే నిద్ర లేచి చక్కగా స్నానము చేసి శంభుని లింగమును పూజించి ఈ స్తోత్రమును జపించినచో, పుత్రుడు లేని వానికి పుత్రుడు కలుగును (61). ఈ అభిలాషాష్టకమును ఎవడు కనబడితే వానికి చెప్పరాదు. దీర్ఘకాల వంధ్యయైననూ ప్రసవించునట్లు చేయగల ఈ స్తోత్రమును శ్రద్ధతో పరిరక్షించవలెను (62). స్త్రీగాని, పురుషుడు గాని లింగసన్నిధిలో నియమపూర్వకముగా సంవత్సరకాలము ఈ స్తోత్రమును జపించినచో, నిస్సంశయముగా పుత్రుడు కలుగును (63). సత్పురుషులకు శరణ్యుడు, బాలరూపములో నున్న వాడు అగు శంభుడు ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. ఆ విశ్వానరమహర్షి కూడా ఆనందముతో నిండిన మనస్సు గలవాడై తన ఇంటికి చేరుకొనెను (64).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్ర సంహితయందు గృహపత్యవతారవర్ణనమనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).

Siva Maha Puranam-3    Chapters