Siva Maha Puranam-3
Chapters
అథ అష్టదశో%ధ్యాయః ఏకాదశరుద్రుల అవతారము నందీశ్వర ఉవాచ | ఏకాదశావతారాన్ వై శృణ్వథో శాంకరాన్ వరాన్ | యాన్ శ్రుత్వా న హి బాధ్యేత బాధా%సత్యాది సంభవా || 1 పురా సర్వే సురాశ్శక్రముఖా దైత్యపరాజితాః | త్యక్త్వామరావతీం భీత్యా%పలాయంత నిజాం పురీమ్ || 2 దైత్యప్రపీడితా దేవా జగ్ముస్తే కశ్యపాంతికమ్ | బద్ధ్వా కరాన్నతస్కంధాః ప్రణముస్తం సువిహ్వలమ్ || 3 సునుత్వా తం సురాస్సర్వే కృత్వా విజ్ఞప్తి మాదరాత్ | సర్వం నివేదయామాసుస్స్వదుఃఖం తత్పరాజయమ్ || 4 తతస్స కశ్యపస్తాత తత్పితా శివసక్తధీః | తదాకర్ణ్యామరాకం వైదుఃఖితో%భూన్న చాధికమ్ || 5 తానాశ్వాస్య మునిస్సో%థ ధైర్యమాధాయ శాంతధీః | కాశీం జగామ సుప్రీత్యా విశ్వేశ్వరపురీం మునే || 6 గంగాంభసీ తతస్స్నాత్వా కృత్వా తం విధిమాదరాత్ | విశ్వేశ్వరం సమానర్చ సాంబం సర్వేశ్వరం ప్రభుమ్ || 7 నందీశ్వరుడిట్లు పలికెను- తరువాత శంకరుని శ్రేష్ఠమగు పదకొండు అవతారములను వర్ణించెదను. వినుము. వీటిని విన్నచో అసత్యము మొదలగు వాటి వలన పీడ కలుగదు (1). పూర్వము ఇంద్రాది దేవతలందరు రాక్షసులచే పరాజితులై స్వీయనగరమగు అమరావతిని విడిచి భయముతో పారిపోయిరి (2). రాక్షసులచే పీడింపబడిన ఆ దేవతలు కశ్యపుని వద్దకు వెళ్లి శిరసువంచి చేతులు కట్టుకొని మిక్కిలి దుఃఖముతో నమస్కరించిరి (3). దేవతలందరు ఆయనను చక్కగా స్తుతించి రాక్షసుల చేతిలో తాము ఓడిపోవుట ఇత్యాది తమ దుఃఖమునంతనూ సాదరముగా విన్నవించుకొని రక్షించుమని విజ్ఞప్తి చేసిరి (4). వత్సా! అపుడు దేవతలకు తండ్రి, శివుని యందు లగ్నమైన బుద్ధి గలవాడునగు ఆ కశ్యపుడు దేవతల ఆ దుఃఖమును గూర్చి విని అధికముగా దుఃఖితుడు కాలేదు (5). శాంతమగు మనస్సుగల ఆ మహర్షి వారికి ధైర్యమును చెప్పి ఓ దార్చెను. ఓ మునీ! అపుడాయన మిక్కిలి ప్రీతితో విశ్వేశ్వరుని నగరమగు కాశీకి వెళ్లెను (6). తరువాత గంగానదిలో స్నానమాచరించి సర్వేశ్వరుడు,పార్వతీ సనాథుడు అగు ఆ విశ్వేశ్వర ప్రభుని యథావిధిగా భక్తితో చక్కగా అర్చించెను (7). శివలింగం సుసంస్థాప్య చకార విపులం తపః | శంభుముద్దిశ్య సుప్రీత్యా దేవానాం హితకామ్యయా || 8 మహాన్ కాలో వ్యతీయాయ తపతస్తస్య వై మునే | శివపాదాంబుజాసక్తమనసో ధైర్యశాలినః || 9 అథ ప్రాదురభూచ్ఛంభుర్వరం దాతుం తదర్షయే | స్వపదాసక్త మనసే దీనబంధుస్సతాం గతిః || 10 వరం బ్రూహీతి చోవాచ సుప్రసన్నో మహేశ్వరః | కశ్యపం ముని శార్దూలం స్వభక్తం భక్తవత్సలః || 11 దృష్ట్వాథ తం మహేశానం సుప్రణమ్య కృతాంజలిః | తుష్టావ కశ్యపో హృష్టో దేవతాతః ప్రసన్నధీః || 12 ఆయన దేవతలకు హితమును చేయగోరి శివలింగమును చక్కగా స్థాపించి శంభుని ఉద్దేశించి మిక్కిలి ప్రీతితో విస్తృతమగు తపస్సును చేసెను (8). ఓ మునీ! ఆ ధైర్యశాలి శివపాదపద్మములపై మనస్సును నిలిపి తపస్సును చేయుచుండగా చాలకాలము గడిచెను (9). తరువాత సత్పురుషులకు శరణ్యుడు, దీనులకు బంధువు అగు శంభుడు ఆ మహర్షికి వరమునిచ్చుట కొరకై ఆవిర్భవించెను. ఆ ఋషి శివుని పాదముల పై మనస్సును నిలిపి యుండెను (10). భక్తవత్సలుడగు మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై తన భక్తుడగు కశ్యపమహర్షిని ఉద్దేశించి వరమును కోరుకొనుము అని పలికెను (11). అపుడు దేవతలకు తండ్రియగు కశ్యపుడు ఆనందముతో ప్రసన్నమగు మనస్సుగల వాడై ఆ మహేశ్వరునకు చేతులు జోడించి నమస్కరించి స్తుతించెను (12). కశ్యప ఉవాచ| దేవదేవ మహేశాన శరణాగతవత్సల | సర్వేశ్వరః పరాత్మా త్వం ధ్యానగమ్యో%ద్వయో%వ్యయః || 13 బలనిగ్రహకర్తా త్వం మహేశ్వర సతాం గతిః | దీన బంధుర్దయాసింధుర్భక్తరక్షణ దక్షధీః || 14 ఏతే సురాస్త్వదీయా హి త్వద్భక్తాశ్చ విశేషతః | దైత్యైః పరాజితాశ్చాద్య పాహి తాన్ దుఃఖితాన్ ప్రభో || 15 అసమర్థో రమేశో%పి దుఃఖదస్తే ముహుర్ముహుః | అతో సురా మచ్ఛరణా వేదయంతో%సుఖం చ తత్ || 16 తదర్థం దేవదేవేశ దేవదుఃఖవినాశకః | తత్పూరితం తపోనిష్ఠాం ప్రసన్నార్థం తవాసదమ్ || 17 శరణం తే ప్రపన్నో %స్మి సర్వథాహం మహేశ్వర | కామం మే పూరయ స్వామిన్ దేవదుఃఖం వినాశయ || 18 పుత్రదుఃఖైశ్చ దేవేశ దుఃఖితో%హం విశేషతః | సుఖినం కురు మామీశ సహాయస్త్వం దివౌకసామ్ || 19 భూత్వా మమ సుతో నాథ దేవా యక్షాః పరాజితాః | దైత్యైర్మహాబలైశ్శంభో సురానందప్రదో భవ || 20 సదైవాస్తు మహేశాన సర్వలేఖ సహాయకృత్ | యథా దైత్య కృతా బాధా న బాధేత సురాన్ ప్రభో || 21 కశ్యపుడిట్లు పలికెను- ఓ దేవదేవా! మహేశ్వరా! శరణా గత వత్సలా! నీవు సర్వేశ్వరుడవు, పరమాత్మవు, ధ్యానముచే పొందదగినవాడవు, అద్వితీయుడవు, వినాశము లేనివాడవు (13). ఓ మహేశ్వరా! సత్పురుషులకు శరణ్యుడవగు నీవు రాక్షసబలమును నిగ్రహించవలెను. దీనబంధుడవు, దయాసముద్రముడవునగు నీవు భక్తులను రక్షించుటలో సమర్థమైన బుద్ధిగలవాడవు (14), ఈ దేవతలు నీ వారు. విశేషించి నీ భక్తులు. ఈ నాడు రాక్షసుల చేతిలో పరాజితులై దుఃఖించుచున్నారు. ఓ ప్రభూ! వారిని రక్షించుము (15). అసమర్థుడగు లక్ష్మీపతి కూడా నీకు పలుమార్లు దుఃఖమును కలిగించుచున్నాడు. అందువలననే, ఆ దేవతలు నన్ను శరణు జొచ్చినారు. వారి దుఃఖమును నాకు విన్నవించినారు (16). ఓ దేవదేవా! ఈశ్వరా! నేను దేవతల దుఃఖమును నశింపజేయగోరి నిన్ను ప్రసన్నుని చేసుకొనుట కొరకై తపోనిష్ఠను సలిపితిని (17). ఓ మహేశ్వరా! నేను అన్ని విధములుగా నిన్ను శరణు జొచ్చితిని. ఓ స్వామీ! దేవతల దుఃఖమును నశింపజేసి నా కోర్కెను దీర్చుము (18). ఓ దేవ దేవా! నేను పుత్రుల దుఃఖమును గాంచి మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ ఈశా! నన్ను సుఖిని చేయుము. నీవు దేవతలకు సాహాయ్యమొనర్చుము (19). ఓ నాథా! దేవతలు, యక్షులు మహాబలశాలురగు రాక్షసుల చేతిలో పరాజితులై యున్నారు. నీవు నా కుమారుడవై జన్మించి దేవతలకు ఆనందమును కలిగించుము (20). ఓ మహేశ్వరా! ప్రభూ! రాక్షసుల పీడ దేవతలకు తొలగు విధముగా నీవు సర్వదా దేవతలకు సహాయమును చేయుచుండుము (21). నందీశ్వర ఉవాచ | ఇత్యుక్త స్య తు సర్వేశస్తథేతి ప్రోచ్య శంకరః | పశ్యతస్తస్య భగవాన్ తత్రైవాంతర్దధే హరః || 22 కశ్యపో%పి మహాహృష్టః స్వస్థాన మగమద్ద్రుతమ్ | దేవేభ్యః కథయామాస సర్వవృత్తాంతమాదరాత్ || 23 తతస్స శంకరశ్శర్వ స్సత్యం కర్తుం స్వకం వచః | సురభ్యాం కశ్యపాజ్జజ్ఞే ఏకాదశస్వరూపవాన్ || 24 మహోత్సవస్తదాసీద్వై సర్వం శివమయం త్వభూత్ | ఆసన్ హృష్టా స్సురాశ్చాథ మునినా కశ్యపేన చ || 25 కపాలీ పింగలో భీమో విరూపాక్షో విలోహితః | శాస్తా%జపాదహిర్బుధ్న్యశ్శంభుశ్చండో భవస్తథా || 26 ఏకాదశైతే రుద్రాస్తు సురభీతనయాస్స్మృతాః | దేవకార్యర్థముత్పన్నా శ్శివరూపా స్సుఖాస్పదమ్ || 27 తే రుద్రాః కాశ్యపా వీరా మహాబలపరాక్రమాః | దైత్యాన్ జఘ్నుశ్చ సంగ్రామే దేవసాహాయ్యకారిణః || 28 తద్రుద్రకృపయా దేవా దైత్యాన్ జిత్వా చ నిర్భయాః | చక్రుస్స్వరాజ్యం సర్వే తే శక్రాద్యాస్స్వస్థమానసాః || 29 అద్యాపి తే మహారుద్రా స్సర్వే శివస్వరూపకాః | దేవానాం రక్షణార్థాయ విరాజంతే సదా దివి || 30 నందీశ్వరుడిట్లు పలికెను- కశ్యపుడిట్లు పలుకగా, సర్వేశ్వరుడు మంగళకరుడు అగు హరభగవానుడు 'అటులనే' అని పలికి ఆతడు చూచుచుండగా అచటనే అంతర్థానమయ్యెను (22). కశ్యపుడు కూడ మహానందమును పొంది శీఘ్రముగా తన స్థానమునకు మరలి వచ్చి జరిగిన వృత్తాంతమునంతనూ ఆదరముతో దేవతలకు చెప్పెను (23). అపుడు మంగళకరుడగు ఆ శర్వుడు తన వచనమును సత్యము చేయుటకై కశ్యపుని వలన సురభియందు పదకొండు రూపములలో అవతరించెను (24). అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. సర్వము శివమయమయ్యెను. కశ్యపమహర్షి వలన దేవతలందరు మహానందమును పొందిరి (25). కపాలి, పింగలుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజపాత్, అహిర్బుధ్న్యుడు, శంభుడు, చండుడు మరియు భవుడు (26) అను శివస్వరూపులగు ఈ పదకొండు రుద్రులకు సురభీతనయులని పేరు. వీరు దేవకార్యము కొరకు అవతరించి సుఖమునకు నిధానమైరి (27). కశ్యప పుత్రులు, వీరులు, గొప్ప బల పరాక్రమములు గలవారు అగు ఆ రుద్రులు యుద్ధములో దేవతలకు సహాయులై రాక్షసులను సంహరించిరి (28). ఆ రుద్రుల అనుగ్రహముచే ఇంద్రాది దేవతలు రాక్షసులను జయించి, అందరు నిర్భయులై స్వస్థమగు మనస్సు గలవారై తమ రాజ్యమునేలిరి (29). ఇప్పటికి శివస్వరూపులగు ఆ మహారుద్రులందరు దేవతలనురక్షించుట కొరకై సర్వదా స్వర్గలోకమునందు విరాజిల్లు చున్నారు (30). ఐశాన్యాం పురి తే వాసం చక్రిరే భక్త వత్సలాః | విరమంతే సదా తత్ర నానాలీలా విశారదాః || 31 తేషామనుచరా రుద్రాః కోటిశః పరికీర్తితాః | సర్వత్ర సంస్థితాస్తత్ర త్రిలోకేష్వభి భాగశః || 32 ఇతి తే వర్ణితాస్తాతావతారాశ్శంకరస్య వై | ఏకాదశమితా రుద్రా స్సర్వలోక సుఖావహాః || 33 ఇదమాఖ్యానమమలం సర్వపాపప్రణాశకమ్ | ధన్యం యశస్యమాయుష్యం సర్వకామప్రదాయకమ్ || 34 య ఇదం శృణుయాత్తాత శ్రావయేద్వై సమాహితః | ఇహ సర్వసుఖం భుక్త్యా తతో ముక్తిం లభేత సః || 35 ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం ఏకాదశావతార వర్ణనం నామ అష్టాదశో%ధ్యాయః (18). భక్తవత్సలురు, అనేక లీలలను ప్రకటించుటలో సమర్థులు నగు ఆ రుద్రులు ఈశాన్య దిక్కునందు నివసించి సర్వదా అచటనే రమించెదరు (31). వారి అనుచరులగు రుద్రులు కోట్ల సంఖ్యలో నున్నారు. వారు ముల్లోకములలో ఆయా భాగములయందు సర్వత్రా వ్యాపించియున్నారు (32). వత్సా! ఈ విధముగా సర్వప్రాణులకు సుఖమును కలిగించే శంకరుని ఏకాదశ రుద్రావతారములను నీకు వర్ణించితిని (33). ఈ వృత్తాంతము పవిత్రమైనది, పాపములను అన్నిటినీ నశింప జేయునది, ధన్యమైనది, యశస్సును కలిగించునది, ఆయుర్దాయమును ఇచ్చునది మరియు కోర్కెలనన్నిటినీ ఇచ్చునది (34). వత్సా! ఎవరైతే ఈ గాథను మనస్సు లగ్నముచేసి వినునో, అట్టివాడు ఇహలోకములో సర్వసుఖములననుభవించి, దేహత్యాగము తరువాత ముక్తిని పొందును (35). శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు ఏకాదశావతార వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).