Siva Maha Puranam-3    Chapters   

అథ చతుర్వింశో%ధ్యాయః

దధీచి ఎముకలను దానము చేయుట

నందీశ్వర ఉవాచ |

పిప్పలా దాఖ్యపరమమవతారం మహేశితుః | శృణు ప్రాజ్ఞ మహాప్రీత్యా భక్తి వర్ధన ముత్తమమ్‌ || 1

యఃపురా గదితో విప్రో దధీచిర్మునిసత్తమః | మహాశైవస్సుప్రతాపీ చ్యావనిర్భృగువంశజః || 2

క్షువేణ సహా సంగ్రామే యేన విష్ణుః పరాజితః | సనిర్జరో%థ సంశప్తో మహేశ్వర సహాయినా || 3

తస్య పత్నీ మహాభాగా సువర్చా నామ నామతః | మహాపతివ్రతా సాధ్వీ యయా శప్తా దివౌకసః || 4

తస్మాత్తస్యాం మహాదేవో నానాలీలా విశారదః | ప్రాదుర్బభూవ తేజస్వీ పిప్పలాదేతి నామతః || 5

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ బుద్ధిశాలీ! పిప్పలాదుడు అనే మహేశ్వరుని మరియొక శ్రేష్ఠ అవతారము గలదు. భక్తిని వర్ధిల్ల జేయు ఉత్తమమగు ఆ అవతారమును నీవు మహాప్రీతితో వినుము (1). బ్రాహ్మణుడు, గొప్ప శైవుడు, గొప్ప వ్రతాపము గలవాడు, చ్యవనుని పుత్రుడు, భృగు వంశములో జన్మించినవాడు అగు దధీచి మహర్షి గురించి పూర్వమే వర్ణించబడినది (2). ఆయన యుద్ధములో మహేశ్వరుని సాహాయ్యముతో, కువుని మరియు దేవతలతో గూడియున్న విష్ణువును నిర్జించి శపించినాడు (3). ఆయన భార్య పేరు సువర్చ. ఆమె పుణ్యాత్మురాలు, మహాపతివ్రత, సాధ్వి. ఆమె దేవతలను శపించినది. (4). ఆ దంపతులకు అనేక లీలానిపుణుడగు మహాదేవుడు పుత్రుడై జన్మించెను. తేజశ్శాలి యగు ఆ బాలుని పేరు పిప్పలాదుడు. (5).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య మునిశ్రేష్ఠో నందీశ్వరవచో%ద్భుతమ్‌ | సనత్కుమారః ప్రోవాచ నతస్కంథః కృతాంజలిః || 6

నూతుడిట్లు పలికెను-

నందీశ్వరుని ఈ అద్భుతమగు వచనమును విని మహర్షిశ్రేష్ఠుడగు సనత్కుమారుడు తలవంచి, చేతులను జోడించి ఇట్లు పలికెను (6).

సనత్కుమార ఉవాచ |

నందీశ్వర మహాప్రాజ్ఞ సాక్షాద్రుద్రస్వరూపధృక్‌ | ధన్యస్త్వం సద్గురుస్తాత శ్రావితేయం కథా ద్భుతా || 7

క్షువేణ సహ సంగ్రామే శ్రుతో విష్ణు పరాజయః | బ్రహ్మణా మే పురా తాత తచ్ఛాపశ్చ శిలాదజ || 8

అధునా శ్రోతుమిచ్ఛామి దేవశాపం సువర్చయా | దత్తం పశ్చాత్పిప్పలాద చరితం మంగలాయనమ్‌ || 9

సనత్కమారుడిట్లు పలికెను-

ఓ నందీశ్వరా! మహాబుద్ధిశాలీ! సాక్షాత్తుగా రుద్రుని స్వరూపమైన నీవు ధన్యుడవు. తండ్రీ ! సద్గురుడవగు నీవు అద్భుతమగు కథను వినిపించితివి (7). క్షువునితో విష్ణువు యుద్ధమును చేసి పరాజయమును పొందిన గాథను వింటిని. ఓయీ శిలాదపుత్రా! తండ్రీ ! దధీచి విష్ణువునకు శాపమునిచ్చిన గాథను కూడా పూర్వము బ్రహ్మ చెప్పగా వింటిని (8). సువర్చ దేవతలకు శాపమునిచ్చిన గాథను ఇపుడు వినగోరుచున్నాను. తరువాత మంగళనిధానమగు పిప్పలాద చరితమును వినగోరుచున్నాను (9).

సూత ఉవాచ |

ఇతి శ్రుత్వాథ శైలాది ర్విధిపుత్రవచశ్శుభమ్‌ | ప్రత్యువాచ ప్రసన్నాత్మా స్మృత్వా శివపదాంబుజమ్‌ || 10

సూతుడిట్లు పలికెను-

శిలాదపుత్రుడగు నందీశ్వరుడు బ్రహ్మపుత్రుని ఈ శుభవచనమును విని ప్రసన్నమగు మనస్సుతో శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు బదులిడెను (10).

నందీశ్వర ఉవాచ |

ఏకదా నిర్జ రాస్సర్వే వాసవాద్యా మునీశ్వర| వృత్రాసురసహాయైశ్చ దైత్యైరాసన్‌ పరాజతితాః || 11

స్వాని స్వాని వరాస్త్రాణి దధీచస్యాశ్రమే %ఖిలాః| నిక్షిప్య సహసా సద్యో%భవన్‌ దేవాః పరాజితాః || 12

తదా సర్వే సురాస్సేంద్రా వధ్యమానాస్తథర్షయః | బ్రహ్మలోకం గతాశ్శీఘ్రం ప్రోచుస్స్వం వ్యసనం చ తత్‌ || 13

తచ్ఛ్రుత్వా దేవవచనం బ్రహ్మ లోకపితామహః | సర్వం శశంస తత్త్వేన త్వష్టుశ్చైవ చికీర్షితమ్‌ || 14

భవద్వధార్థం జనితస్త్వష్ట్రాయం తపసాసురః | వృత్రో నామ మహాతేజతాస్సర్వదైత్యాధిపో మహాన్‌ || 15

అథ ప్రయత్నః క్రియతాం భ##వేదస్య వధో యథా | తత్రోపాయం శృణు ప్రాజ్ఞ ధర్మహేతోర్వదామితే || 16

మహాముని ర్దధీచిర్యస్స తపస్వీ జితేంద్రియః | లేభే శివం సమారాధ్య వజ్రాస్థిత్వవరం పురా || 17

తస్యాస్థీన్యేవ యాచధ్వం స దాస్యతి న సంశయః | నిర్మాయ తైర్దండవజ్రం వృత్రం జహి న సంశయః || 18é

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మహర్షీ! ఒకప్పుడు ఇంద్రాది దేవతలందరు వృత్రాసురుడు సహాయముగా గల రాక్షసులచే ఓడింపబడిరి (11). అపుడు పరాజితులైన దేవతలందరు తమ తమ శ్రేష్ఠమగు అస్త్రములను శీఘ్రముగా దధీచుని ఆశ్రమముగా బ్రహ్మలోకమునకు వెళ్ళి తమ దుఃఖమును విన్నవించిరి (13). లోకపితామహుడగు బ్రహ్మ దేవతల ఆ వచనములను విని, త్వష్ట యొక్క ఆకాంక్షయొక్క స్వరూపమును వివరముగా వారికి తెలిపెను (14). త్వష్ట తపస్సు చేసి మిమ్ములను వధించుట కొరకై ఈ రాక్షసుని సృష్టించెను. మహాతేజశ్శాలి, సర్వరాక్షసులకు ప్రభువు, మహాత్ముడు అగు ఈ రాక్షసుని పేరు వృత్రుడు (15). కావున ఈ వృత్రుని వధకొరకై ప్రయత్నమును చేయవలెను. ఓ ప్రాజ్ఞా! ధర్మరక్షణ కొరకై నేను నీకు వృత్రవధోపాయమును చెప్పెదను. వినుము (16). తపశ్శాలి, జితేంద్రియుడు అగు దధీచ మహాముని పూర్వము శివుని ఆరాధించి వజ్రమువంటి ఎముకలను వరముగా పొంది యుండెను (17). మనము అతని ఎముకలను యాచించెదము. అతడు నిస్సంశయముగా ఇచ్చును. వాటితో వజ్రదండమును నిర్మించి వృత్రుని సంహరించుము. దీనిలో సంశయము లేదు (18).

నందీశ్వర ఉవాచ |

తచ్ఛ్రుత్వా బ్రహ్మవచనం శక్రో గురుసమన్వితః | ఆగచ్ఛ త్సామరస్సద్యో దధీచ్యాశ్రమముత్తమమ్‌ || 19

దృష్ట్వా తత్ర మునిం శక్ర స్సువర్చా న్వితమాదరాత్‌ | ననామ సాంజలిర్నమ్రస్సగురుస్సామరశ్చ తమ్‌ || 20

తదిభిప్రాయమాజ్ఞాయ స ముని ర్బుధసత్తమః | స్వపత్నీం ప్రేషయామాస సువర్చాం స్వాశ్రమాంతరమ్‌ || 21

తతస్స దేవరా జశ్చ సామరస్స్వార్థసాథకః | అర్థ శాస్త్రపరో భూత్వా మునీశం వాక్యమబ్రవీత్‌ || 22

నందీశ్వరుడిట్లు పలికెను-

బృహస్పతితో గూడియున్న ఇంద్రుడు బ్రహ్మయొక్క ఆ మాటను విని వెంటనే దేవతలతో కలిసి ఉత్తమమగు దధీచి ఆశ్రమము నకు వెళ్లెను (19). అచట సువర్చతో కూడియున్న దధీచి మహర్షిని గాంచి దేవతలతో బృహస్పతితో సహా ఇంద్రుడు ఆదరముతో వినయముతో చేతులు జోడించి ప్రణమిల్లెను (20). జ్ఞానులలో శ్రేష్ఠుడగు ఆ మహర్షి ఆతని అభిప్రాయము నెరింగి తన భార్యయగు సువర్చను ఆశ్రమము లోపలికి పంపించెను (21). అపుడు స్వార్థమును సాధించుటలో సమర్థుడు, నీతి శాస్త్రకోవిదుడు అగు దేవరాజు దేవతులతో గూడి మహర్షితో ఇట్లు పలికెను (22).

శక్ర ఉవాచ |

త్వష్ట్రా విప్రకృతాస్సర్వే వయం దేవాస్తథర్షయః | శరణ్యం త్వాం మహాశైవం దాతారం శరణం గతాః || 23é

స్వాస్థీని దేహి నో విప్ర మహావజ్రమయాని హి | అస్థ్నా తే స్వపవిం కృత్వా హనిష్యామి సురద్రుహమ్‌ || 24

ఇత్యుక్తస్తేన స మునిః పరోపకరణ రతః | ధ్యాత్వా శివం స్వనాథం హి విససర్జ కలేవరమ్‌ || 25

బ్రహ్మలోకం గతస్సద్యస్స మునిర్ధ్వస్తబంధనః | పుష్పవృష్టిరభూత్తత్ర సర్వే విస్మయమాగతాః || 26

అథ గాం సురభిం శక్ర ఆహూయాశు హ్యలేహయత్‌ | అస్త్ర నిర్మతయే త్వాష్ట్రం నిదిదేశ తదస్థిభిః || 27

విశ్వకర్మా తదాజ్ఞప్తశ్చ క్లుపే%స్త్రాణి కృత్స్నశః | తదస్థిభిర్వజ్రమయై స్సుదృఢైశ్శివవర్చసా || 2

తస్య వంశోద్భవం వజ్రం శరో బ్రహ్మశిరస్తథా | అన్యాస్థిభిర్బహూని స్వపరాణ్యస్త్రాణి నిర్మమే || 29

ఇంద్రుడిట్లు పలికెను-

దేవతలమగు మేము మరియు మహర్షులు త్వష్టచే మోసగింపబడితిమి. శరణు పొంద దగినవాడవు, గొప్ప శివభక్తుడవు మరియు దాతవు అగు నిన్ను శరణు పొందుచున్నాము (23). ఓ విప్రా! గొప్ప వజ్రముతో సమమగు నీ ఎముకలను మాకు ఇమ్ము. నీ ఎముకతో నేను వజ్రమును చేసి దానితో దేవ ద్రోహియగు వృత్రుని సంహరించెదను (24). ఇంద్రుడు ఇట్లు పలుకగా, పరోపకార పారీణుడగు ఆ మహర్షి తన ప్రభువగు శివుని ధ్యానించి దేహమును విడిచిపెట్టెను (25). సర్వబంధములనుండి విముక్తుడైన ఆ మహర్షి వెంటనే బ్రహ్మలోకమును చేరెను. అచట ఆతనిపై పుష్పవర్షము గురిసెను . అందరు ఆశ్చర్య చకితులైరి (26). అపుడు ఇంద్రుడు వెంటనే సురభిధేనువును పిలిపించి దేహమునుండి ఎముకలను వేరు చేయించెను. ఆ ఎముకలతో అస్త్రములను నిర్మించమని ఇంద్రుడు విశ్వకర్మను ఆదేశించెను (27). ఇంద్రునిచే ఆజ్ఞాపించబడిన విశ్వకర్మ శివుని తేజస్సుచే మిక్కిలి దృఢముగా నున్న ఆ వజ్రమయమగు ఎముకలతో పూర్ణముగా అస్త్రములను నిర్మించెను (28). ఆయన వెన్నెముకతో వజ్రమును, బ్రహ్మశిరమను బాణమును నిర్మించెను. మరియు మిగిలిన ఎముకలతో ఇతరములగు అనేక అస్రములను నిర్మించెను (29).

తమింద్రో వ్రజముద్యమ్య వర్ధితశ్శివవర్చసా | వృత్రమిభ్యద్రవత్‌ క్రుద్ధో మునే రుద్ర ఇవాంతకమ్‌ || 30

తతశ్శక్రస్సుసన్నద్ధస్తేన వజ్రేణ స ద్రుతమ్‌ | ఉచ్చకర్త శిరో వార్త్రం గిరిశృంగమివౌజసా || 31

తదా సముత్సవస్తాత బభూవ త్రిదివౌక సామ్‌ | తుష్టువుర్నిర్జరాశ్శక్రం పేతుః కుసుమవృష్టయః || 32

ఇతి తే కథితం తాత ప్రసంగాచ్చరితం త్విదమ్‌ | పిప్పలాదావతారం మే శృణు శంభోర్మహాదరాత్‌ || 33

సువర్చా సా మునేః పత్నీ దధీచస్య మహాత్మనః | య¸° స్వమాశ్ర మాభ్యంతస్తదాజ్ఞ ప్తా పతివ్రతా || 34

ఆగత్య తత్ర సా దృష్ట్వా న పతిం స్వం తపస్వినీ| గృహకార్యం చ సా కృత్వా ఖిలం పతినిదేశతః || 35

ఆజగామ పునస్తత్ర పశ్యంతీ బహ్వశోభనమ్‌ | దేవాంశ్చ తాన్‌ మునిశ్రేష్ఠ సువర్చా విస్మితా%భవత్‌ || 36

జ్ఞాత్వా చ తత్సర్వమిదం సురాణాం కృత్యం తదానీం చ చుకోప సాధ్వీ |

దదౌ తదా శాపమతీవ రుష్టా తేషాం సువర్చా ఋషివర్య భార్యా || 37

శివుని తేజస్సుచే పెరిగిన శక్తి గల ఇంద్రుడు కోపముతో వజ్రమును చేత బట్టి వృత్రుని వైపు పరుగెత్తెను. ఓ మహర్షీ! ఆతడు యముని వెంటపడిన రుద్రుని వలె నుండెను (30). యుద్ధమునకు పూర్తిగా సంసిద్ధుడై యున్న ఆ ఇంద్రుడు అపుడు శీఘ్రమే వృత్రాసురుని శిరస్సును పర్వత శిఖరమును వలె బలముగా నరికెను (31). వత్సా! అపుడు దేవతలు ఉత్సవమును చేసుకొనిరి. ఇంద్రుని కొనియాడిరి. పుష్పవర్షములు కురిసెను (32). వత్సా! ఈ తీరున నేను ప్రసంగవశమున నీకు ఈ గాథను చెప్పితిని. ఇప్పుడు శంభుని పిప్పలాద అవతార గాథను మహాదరముతో వినుము (33). మహాత్ముడగు దధీచమహర్షియొక్క పత్నియగు ఆ సువర్చ పతివ్రత గనుక భర్తయొక్క ఆజ్ఞను పాలించి తన ఆశ్రమముయొక్క లోపలికి వెళ్లియుండెను (34). ఆమె భర్త యొక్క ఆజ్ఞను పాలించి ఇంటి పనులనన్నిటినీ చక్క బెట్టుకొని అచటకు వచ్చెను. కాని తపస్విని యగు సువర్చకు తన భర్త కానరాలేదు (35). ఆమె మరల అచటకు వచ్చినపుడు ఆమెకు సర్వము అమంగళరూపముగా కన్పట్టెను. ఓ మహర్షీ! ఆమె ఆ దేవతలను గాంచి చకితురాలయ్యెను (36). ఆ పతివ్రత ఆ క్షణములో దేవతలు చేసిన ఆ పనిని గురించి పూర్తిగా ఎరింగినది. మహర్షి భార్యయగు సువర్చ వారిపై మిక్కిలి కోపించి శాపమునిచ్చెను (37).

సువర్చో వాచ|

అహో సురా దుష్టతరాశ్చ సర్వే స్వకార్యదక్షా హ్యబుధాశ్చ లుబ్ధాః |

తస్మాచ్చ సర్వే పశవో భవంతు సేంద్రాశ్చ మే %ద్య ప్రభృతీత్యువాచ || 38

ఏవం శాపం దదౌ తేషాం సురాణాం సా తపస్వినీ | సశక్రాణాం చ సర్వేషాం సువర్చా మునికామినీ || 39

అనుగంతుం పతేర్లోక మథైచ్ఛత్సా పతివ్రతా | చితాం చక్రే సమేధోభిస్సు పవిత్రైర్మన స్వినీ || 40

తతో నబోగిరా ప్రాహ సువర్చాం తాం ముని ప్రియామ్‌ | ఆశ్వాసయంతీ గిరిశ##ప్రేరితా సుఖదాయినీ || 41

సువర్చ ఇట్లు పలికెను-

అహో! దేవతలు ఎంతటి దుష్టులో! వీరందరు తమ కార్యమును నెరవేర్చకొనుటలో సమర్థులు. అపండితులు, లుబ్ధులు అగు ఈ ఇంద్రాది దేవతలందరు ఈ నాటి నుండియు నా శాపముచే పశువులు అగుదురు గాక! (38) తపశ్శాలిని, మునిపత్నియగు ఆ సువర్చ ఆ ఇంద్రాది దేవతలందరికీ ఇట్లు శాపమునిచ్చెను (39). తరువాత ఆ పతివ్రత పతి వెళ్లిన లోకమునకు పతి వెనుకనే వెళ్లుటకు నిశ్చయించుకొనెను. అభిమానవతి యగు ఆమె మిక్కిలి పవిత్రమగు సమిధలతో చితిని ఏర్పాటు చేసెను (40). అపుడు శివునిచే ప్రేరితమై ఆకాశవాణి ఆ ముని పత్నియగు సువర్చను ఓదార్చి సుఖమును కలిగించుచూ ఇట్లు పలికెను (41).

ఆకాశవాణ్యువాచ|

సాహసం న కురు ప్రాజ్ఞే శృణు మే పరమం వచః | మునితేజస్త్వదుదరే తదుత్పాదయ యత్నతః || 42

తతస్స్వా భీష్ట చరణం దేవి కర్తుం త్వమర్హసి | సగర్భాన దహేద్గాత్రమితి బ్రహ్మనిదేశనమ్‌ || 43

ఆకాశవాణి ఇట్లు పలికెను-

ఓ బుద్ధిమంతులారా! సాహసమును చేయకుము. నేను చెప్పే శ్రేష్ఠమగు వచనమును వినుము. నీ గర్భములో ముని యొక్క తేజస్సు గలదు. దానికి ప్రయత్నపూర్వకముగా జన్మను ఇమ్ము (42). ఓ దేవీ! ఆ తరువాత నీకు నచ్చిన విధముగా చేయవచ్చును. గర్భిణియగు స్త్రీ తన దేహమును నశింపజేయరాదని వేదము నిషేధించుచున్నది (43).

ఇత్యుక్త్వా సా నభోవాణీ విరరామ మునీశ్వర | తాం శ్రుత్వా సా మునేః పత్నీ విస్మితా% భూత్‌ క్షణం చ సా || 44

సువర్చా సా మహాసాధ్వీ పతిలోక మభీప్సతీ | ఉపవిశ్యాశ్మనా భూయ స్సోదరం విదదార హ || 45

నిర్గతో జఠరాత్తస్యా గర్భో మునివరస్య సః | మహాదివ్యతనుర్దీప్తో భాసయంశ్చ దిశో దశ || 46

సాక్షాద్రుద్రావతారో% సౌ దధీచవరతేజసః | ప్రాదుర్భూతస్స్వయం తాత స్వలీలాకరణ క్షమః || 47

తం దృష్ట్వా స్వసుతం దివ్య స్వరూపం మునికామినీ | సువర్చాజ్ఞాయ మనసా సాక్షాద్రుద్రావతారకమ్‌ || 48

ప్రహృష్టా భూన్మహాసాధ్వీ ప్రణమ్యాశు నునావ సా | స్వహృది స్థాపయామాస తత్‌ స్వరూపం మునీశ్వర || 49

సువర్చా తనయం తం చ ప్రవాస్య విమలేక్షణా | జననీ ప్రాహ సుప్రీత్యా పతిలోకమభీప్సతీ || 50

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మహర్షీ! ఆ ఆకాశవాణి ఇట్లు పలికి విరమించెను. ఆ వచనములను విని ఆ మునిపత్ని క్షణకాలము చకితురాలయ్యెను (44). పతిలోకమును పొందగోరే మహాపతివ్రత యగు ఆ సువర్చ కూర్చుండి రాతితో తన గర్భమును పలు పర్యాయములు కొట్టుకొనెను (45). ఆమె ఉదరమునుండి దధీచి మహర్షి యొక్క పుత్రుడు మహాదివ్య శరీరముతో, పది దిక్కులను తన తేజస్సుచే ప్రకాశింప జేయుచూ ఉదయించెను (46). ఓ వత్సా! తన లీలలను నెరపుటలో సమర్థుడగు రుద్రుడు స్వయముగా దధీచుని శ్రేష్ఠపుత్రుడై ఉదయించెను (47). దివ్య స్వరూపుడగు ఆ తన పుత్రుని గాంచి ముని పత్నియగు సువర్చ తన మనస్సులో ఆ బాలుడు సాక్షాత్తుగా రుద్రావతారమే నని గుర్తించెను (48). ఓ మహర్షీ! మహాసాధ్వియగు ఆమె చాల సంతసిల్లి వెంటనే ప్రణమిల్లి స్తుతించెను. ఆమె ఆ రూపమును తన హృదయములో పదిలపరచుకొనెను (49). నిర్మలమగు చూపులు గలది, పతి లోకమును పొందగోరునది, ఆ బాలుని తల్లి యగు సువర్చ నవ్వి మిక్కిలి ప్రీతితో ఆ పుత్రుని ఉద్దేశించి ఇట్లు పలికెను (50).

సువర్చోవాచ|

హే తాత పరమేశాన చిరం తిష్ఠాస్య సన్నిధౌ | అశ్వత్థస్య మహాభాగ సర్వేషాం సుఖదో భ##వేః || 51

మామాజ్ఞాపయ సుప్రీత్యా పతిలోకాయ చాధునా| తత్రస్థాహం చ పతినా త్వాం ధ్యాస్యే రుద్రరూపిణమ్‌ || 52

సువర్చ ఇట్లు పలికెను-

ఓ పుత్రా! పరమేశ్వరా! మహత్మా! ఈ రావి చెట్టు యొక్క సన్నిధి లో చిరకాలము ఉన్నవాడవై అందరికీ సుఖమును కలిగించుము (51). ఇప్పుడు నేను నా భర్త యొక్క సన్నిధికి పయనమగుటకు ప్రీతితో అనుమతి నిమ్ము. నేనచట పతితో గూడి రుద్రరూపుడవగు నిన్ను ధ్యానించెదను (52).

నందీశ్వర ఉవాచ |

ఇత్యేవం సా బభాషే%థ సువర్చా తనయం ప్రతి | పతిమన్వగమత్సాధ్వీ పరమేణ సమాధినా || 53

ఏవం దధీచ పత్నీ సా పతినా సంగతా మునే | శివలోకం సమాసాద్య సిషేవే శంకరం ముదా || 54

ఏతస్మిన్నంతరే దేవాస్సేంద్రాశ్చ మునిభిస్సహ | తత్రాజగ్ముస్త్వరా తాత ఆహూతా ఇవ హర్షితాః || 55

హరిర్బ్రహ్మా చ సుప్రీత్యా వతీర్ణం శంకరం భువి | సువర్చాయాం దధీచాద్వా యయతు స్స్వగణౖస్సహ || 56

తత్ర దృష్ట్వా వతీర్ణం తం మునిపుత్రత్వమాగతమ్‌ | రుద్రం సర్వే ప్రణముశ్చ తుష్టువుర్బద్ధపాణయః || 57

తదోత్సవో మహా నాసీ ద్దేవానాం మునిసత్తమ | నేదుర్దుందు భయస్తత్ర నర్తక్యో ననృతుర్ముదా || 58

జగుర్గంధర్వపుత్రాశ్చ కిన్నరా వాద్య వాదకాః | వాదయామాసురమరాః పుష్పవృష్టిం చ చక్రిరే || 59

నందీశ్వరుడిట్లు పలికెను-

సాధ్వియగు ఆ సువర్చ కుమారునితో నిట్లు పలికి గొప్ప సమాధిని పొంది భర్తవద్దకు చేరుకొనెను (53) ఓ మునీ! ఈ విధముగా దధీచుని భార్య భర్తతో గూడి శివలోకమును పొంది ఆనందముతో శంకరుని సేవించెను (54). ఓ వత్సా! ఇంతలో ఇంద్రాది దేవతలు మహర్షులతో గూడి ఆహ్వానింప బడిన వారు వలె ఆనందముతో శీఘ్రముగా అచటకు వచ్చిరి (55). సువర్చాదధీచుల పుత్రుడై భూమి యందు అవతరించిన శంకరుని దర్శించుటకై బ్రహ్మ విష్ణువులు తమ గణములతో గూడి ఆనందముతో విచ్చేసిరి (56). అచట ముని పుత్రుడై అవతరించిన ఆ రుద్రుని గాంచి వారందరు చేతులు కట్టుకొని నమస్కరించి స్తుతించిరి (57). ఓ మహర్షీ! అపుడు దేవతలు గొప్ప ఉత్సవమును చేసిరి. అచట దుందుభులు మ్రోగినవి. నర్తకస్త్రీలు ఆనందముతో నాట్యమును చేసిరి (58). గంధర్వ పుత్రులు మరియు కిన్నరులు గానము చేయగా వాద్య గాండ్రు వాద్యములను మ్రోగించిరి. దేవతలు పుష్పవృష్టిని కురిపించిరి (59).

పిప్పలస్య శర్వపితుర్విలసంతం సుతం చ తమ్‌ | సంస్కృత్య విధివత్సర్వే విష్ణ్వాద్యాస్తుష్టువుః పునః || 60

పిప్పలాదేతి తన్నామ చక్రే బ్రహ్మా ప్రసన్నధీః | ప్రసన్నో భవ దేవేశ ఇత్యూచే హరిణా సురైః || 61

ఇత్యుక్త్వా తమను జ్ఞాయ బ్రహ్మా విష్ణుస్సురాస్తథా | స్వం స్వం ధామ యయుస్సర్వే విధాయ చ మహోత్సవమ్‌ || 62

అథ రుద్రః పిప్పలాదో%శ్వత్థమూలే మహాప్రభుః | తతాప సుచిరం కాలం లోకానాం హితకామ్యయా || 63

ఇత్థం సుతపతస్తస్య పిప్పలాదస్య సమ్ముఖే | మహాకాలో వ్యతీయాయ లోక చర్యానుసారిణః || 64

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం పిప్పలాద అవతార వర్ణనం నామ చతుర్వింశో%ధ్యాయః (24).

రుద్రునకు తండ్రి అయిన ఆ అశ్వత్థ వృక్షమును, ప్రకాశించుచున్న ఆ బాలకుని, యథావిధిగా సంస్కారములను చేసిన తరువాత విష్ణువు మొదలగు వారందరు పలుమార్లు స్తుతించిరి (60). ప్రసన్నమగు మనస్సుగల బ్రహ్మ ఆ బాలునకు పిప్పలాదుడు అని నామకరణము చేసెను. విష్ణువుతో మరియు దేవతలతో గూడి ఓ దేవ దేవా! ప్రసన్నుడవు కమ్ము అని ప్రార్థించెను (61). బ్రహ్మ విష్ణువులు మరియు దేవతలు అందరు ఇట్లు పలికి ఆయన వద్ద సెలవు తీసుకొని మహోత్సవమును చేసి తమ తమ స్థానములకు వెళ్లిరి (62). అపుడు రుద్రావతారుడగు పిప్పలాదమహాప్రభుడు రావిచెట్టు మూలమునందు లోకముల హితమును గోరి చాలకాలము తపస్సును చేసెను (63). లోకపు పోకడననుసరించి ఈ తీరున పిప్పలాదుడు గొప్ప తపస్సును చేయుచుండగా చాలకాలము గడచెను (64).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు పిప్పలాదావతారవర్ణనమనే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).

Siva Maha Puranam-3    Chapters