Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టావింశోధ్యాయః

యతినాథ హంసావతారములు

నందీశ్వర ఉవాచ|

శృణు ప్రాజ్ఞ ప్రవక్ష్యామి శివస్య పరమాత్మనః | అవతారం పురానందం యతి నాథాహ్వయం మునే || 1

అర్బుదాచల సంజ్ఞే తు పర్వతే భిల్లువంశజః | ఆహుకశ్చ తదభ్యాసే వసతిస్మ మునీశ్వర || 2

తత్పత్నీ హ్యాహుకా నామ బభూవ కిల సువ్రతా | ఉభావపి మహాశైవావాస్తాం తౌ శివపూజకౌ || 3

కస్మింశ్చిత్సమయే భిల్ల శ్శివభక్తిరతస్సదా | ఆహారార్థం స్వపత్న్యాశ్చ సుదూరం స గతో మునే || 4

ఏతస్మిన్నంతరే తత్ర గేహే భిల్లస్య శంకరః | భూత్వా యతివపుస్సాయం పరీక్షార్థం సమాయ¸° || 5

తస్మిన్నవసరే తత్రాజగామ స గృహాధిపః | పూజనం చ యతీశస్య చకార ప్రేమతస్సుధీః || 6

తద్భావస్య పరీక్షార్థం పతిరూపస్స శంకరః | మహాలీలాకరః ప్రీత్యా భీతం ప్రోవాచ దీనగీః || 7

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ ప్రాజ్ఞా! పూర్వము పరమాత్మయగు శివుడు ఆనందదాయకమగు యతినాథావతారమును స్వీకరించెను. ఓ మునీ! ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము (1). ఓ మహర్షీ! అర్బుదాచలమనే పర్వతమునకు సమీపములో భిల్ల వంశమునకు చెందిన ఆహుకుడను వ్యక్తి నివసించెడివాడు (2). ఆతని భార్యయగు ఆహుక మంచి నిష్ఠ గలది. వారిద్దరు శివపూజను చేయు గొప్ప శివభక్తులు (3). ఓ మహర్షీ! సర్వదా శివభక్తి నిష్ఠుడై ఉండే ఆ భిల్లుడు ఒకనాడు తన భార్యయొక్క ఆహారము కొరకు చాల దూరము వెళ్లెను (4). ఇంతలో సాయంకాలమునందు శంకరుడు ఆతనిని పరీక్షించుటకై యతివేషమును దాల్చి ఆ భిల్లుని ఇంటికి వచ్చెను (5). అదే సమయములో గృహయజమాని, పవిత్రమగు బుద్ధి గలవాడునగు ఆ భిల్లుడు అచటకు చేరుకుని ఆ యతీశ్వరుని ప్రేమతో పూజించెను (6). గొప్పలీలలను ప్రకటించే శంకరుడు ప్రేమతో ఆతని భావమును పరీక్షింపగోరి భయపడిపోతూ ఆ భిల్లునితో దీనవచనములతో నిట్లనెను (7).

యతినాథ ఉవాచ |

అద్య స్థలం నివాసార్థం దేహి మే ప్రాతరేవ హి | యాస్యామి సర్వథా భిల్ల స్వస్తి స్యాత్తవ సర్వదా || 8

యతినాథుడిట్లు పలికెను-

ఓ భిల్లా! నాకు ఈనాడు నివసించుటకు చోటును ఇమ్ము. ఉదయమే నేను తప్పని సరిగా నిష్క్రమించెదను. నీకు సర్వకాలములలో శుభమగు గాక! (8)

భిల్ల ఉవాచ |

సమ్యక్‌ ప్రోక్తం త్వయా స్వామిన్‌ శృణు మద్వచనం చ తే | అతి స్వల్పం స్థలం మే హి స్యాన్నివాసః కథం తవ || 9

భిల్లుడిట్లు పలికెను-

ఓ స్వామీ! మీరు చక్కగా మాటలాడితిరి. కాని నామాటను కూడ వినుడు. నా ఇల్లు చాల చిన్నది. మీరు నివసించుట ఎట్లు సంభవమగును? (9)

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త స్స యతిస్తేన గమనాయ మతిం దధే | తావద్భిల్ల్యా వచః ప్రోక్తం స్వామినం సంవిచార్య వై || 10

నందీశ్వరుడిట్లు పలికెను-

అతడిట్లు పలుకగా, ఆ యతి మరలి పోవుటకు నిశ్చయించుకొనెను. ఇంతలో ఆ భిల్లుని భార్య ఆలోచించి తన భర్తతో నిట్లనెను (10).

భిల్ల్యువాచ |

స్వామిన్‌ దేహి యతేస్థ్సానం విముఖం కురు మాతిథిమ్‌ | గృహధర్మ విచార్య త్వం మన్యథా ధర్మసంక్షయః || 11

స్థీయతాం తే గృహాభ్యంత స్సుఖేన యతినా సహ | అహం బహిస్థ్సితిం కుర్యామాయుధాని బృహంత్యపి || 12

భిల్లుని భార్య ఇట్లు పలికెను-

స్వామీ! ఈ యతికి స్థానమునిమ్ము. అతిథి మరలి వెళ్లునట్లు చేయకుము. నీవు గృహస్థధర్మమును గురించి ఆలోచించుము. నీవు అతిథిని ఆచరించనిచో, ధర్మము తొలగిపోవును (11). నీవు ఈ యతితో కలిసి లోపల సుఖముగా నుండుము. నేను గొప్ప ఆయుధములను చేతబట్టి నిలబడి యుండెదను (12).

నందీశ్వర ఉవాచ |

తస్యాస్తద్వచనం శ్రుత్వా భిల్ల్యా ధర్మాన్వితం శివమ్‌ | స్వపత్న్యా మనసా తేన భిల్లేన చ విచారితమ్‌ || 13

స్త్రియం బహిశ్చ నిష్కాస్య కథం స్థేయం మయా గృహే | యతేరన్యత్ర గమనమధర్మ కరమాత్మనః || 14

ద్వయమప్యుచితం నైవ సర్వథా గృహమేధినః | యద్భావి తద్భవేదేవ మయా స్థేయం గృహాద్బహిః || 15

ఇత్యాగ్రహం తదా కృత్వా గృహాంతస్థ్సాప్య తౌ ముదా | స్వాయుధాని చ సంస్థాప్య భిల్లో%తిష్ఠ ద్గృహాద్బహిః || 16

రాత్రౌ తం పశవః క్రూరా హింసకాస్సమ పీడయన్‌ | తేనాపి చ యథా శక్తి కృతో యత్నో మహాంస్తదా || 17

ఏవం యత్నం ప్రకుర్వాణస్స భిల్లో బలవానపి | ప్రారబ్ధాత్ర్పేరితైర్హింసై#్రర్బలాదాసీచ్చ భక్షితః || 18

ప్రాతరుత్థాయ స యతిర్దృష్ట్వా హింసై#్రశ్చ భక్షితమ్‌ | భిల్లం వనేచరం తం వై దుఃఖితో % భూదతీవ హి || 19

దుఃఖితం తం యతిం దృష్ట్వా భిల్లీ సా దుఃఖితాపి హి | ధైర్యాత్సుదుఃఖం సంహృత్య వచనం చేదమబ్రవీత్‌ || 20

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ భిల్లుడు తన భార్యయగు ఆ భిల్లి యొక్క ధర్మయుక్తము శుభకరమునగు ఆ మాటను విని తన మనస్సులో నిట్లు తలపోసెను (13). స్త్రీని బయటకు నెట్టి నేను ఇంటిలోపల ఎట్లు ఉండగల్గుదును? ఈ యతి మరి యొక స్థలమునకు వెడలినచో, నాకు అధర్మము చుట్టుకొనును (14). గృహస్థుడనగు నాకు ఈ రెండు వికల్పములు కూడా ఉచితమైనవి గావు. జరుగవలసినది జరిగితీరును. నేను ఇంటికి బయట నుండెదను (15). ఆతడు ఇట్లు దృఢముగా నిశ్చయించుకొని వారినిద్దరినీ లోపల ఉంచి తాను ఆయుధములను ధరించి ఇంటికి బయటనుండెను (16). రాత్రియందు క్రూర మృగములాతనిని చాల పీడించినవి. అయిననూ ఆతడు యథాశక్తిగా వాటిని ఎదుర్కొనుటలో గొప్ప యత్నమును చేసెను (17). ఆ భిల్లుడు బలవంతుడే అయిననూ, ఈ తీరున ప్రయత్నమును చేసియున్ననూ, ప్రారబ్ధముచే ప్రేరితములైన క్రూరమృగములు బలముగా ఆతనిని భక్షించి వేసినవి (18). ఆ యతి ఉదయమే నిద్రలేచి, ఆ వనవాసియగు భిల్లుడు క్రూరమృగములచే భక్షింపబడుటను గాంచి మిక్కిలి దుఃఖితుడాయెను (19). ఆ భిల్లి తాను స్వయముగా దుఃఖితురాలై యున్ననూ, దుఃఖితుడైయున్న ఆ యతిని గాంచి, ధైర్యముతో తన మహాదుఃఖమును నిలద్రొక్కుకొని, ఇట్లు పలికెను (20).

భిల్ల్యు వాచ|

కిమర్థం క్రియతే దుఃఖం భద్రం జాతం యతో%ధునా | ధన్యో%యం కృతకృత్యశ్చ యజ్జాతో మృత్యురీదృశః || 21

అహం చైనం గమిష్యామి భస్మ భూత్వానలే యతే | చితాం కారయ సుప్రీత్యా స్త్రీణాం ధర్మస్సనాతనః || 22

ఇతి తద్వచనం శ్రుత్వా హితం మత్వా స్వయం యతిః | చితాం వ్యరచయత్సా హి ప్రవివేశ స్వధర్మతః || 23

ఏతస్మిన్నంతరే సాక్షాత్పురః ప్రాదురభూచ్ఛివః | ధన్యే ధన్యే ఇతి ప్రీత్యా ప్రశంసన్‌ తాం హరో%బ్రవీత్‌ || 24

భిల్లయువతి ఇట్లు పలికెను-

ఏల దుఃఖించుచుంటిరి? ఇప్పుడు మంగళ##మే జరిగినది. ఈ విధమగు మృత్యువును పొందిన ఈతడు ధన్యుడు, కృతార్థుడు అయినాడు (21). ఓ యతీ! నేనుకూడా అగ్నిలో బూడిదయై ఈతని వెనుక వెళ్లెదను. మిక్కిలి ప్రీతితో చితిని ఏర్పరుచుడు. ఇది స్త్రీలకు సనాతన ధర్మము (22). ఆమె ఈ మాటలను విని ఆ యతి అట్లు చేయుట హితకరమని తలంచి స్వయముగా చితిని ఏర్పరచగా, ఆమె తన ధర్మముననుసరించి ప్రవేశించెను (23). ఇంతలో ఆమె ఎదుట పాపహారియగు శివుడు స్వయముగా ప్రత్యక్షమై 'ఓ ధన్యురాలా! ధన్యురాలా! అని ప్రీతితో ప్రశంసించి ఇట్లు పలికెను (24).

హర ఉవాచ|

వరం బ్రూహి ప్రసన్నో%స్మి త్వదా చరణతో%నఘే | తవాదేయం న వై కించి ద్వశ్వో%హం తే విశేషతః || 25

శివుడిట్లు పలికెను-

ఓ పుణ్యాత్మురాలా! నీ ఆచరణచే ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము ఏదియూ లేదు. నేను నీకు పూర్ణముగా వశుడనైతిని (25).

నందీశ్వర ఉవాచ|

తచ్చ్రుత్వా శంభువచనం పరమానందదాయకమ్‌ | సుఖం ప్రాప్తం విశేషేణ న కించిత్‌ స్మరణం య¸° || 26

తస్యాస్తద్గతి మాలక్ష్య సుప్రసన్నో హరో%భవత్‌ | ఉవాచ చ పునశ్శంభుర్వరం బ్రూహీతి తాం ప్రభుః || 27

నందీశ్వరుడిట్లు పలికెను-

పరమానందమును కలిగించు ఆ శంభుని వచనమును విని ఆమె మహాసుఖమును పొంది, సర్వమును విస్మరించెను (26). ఆమె యొక్క ఆ స్థితిని గాంచి పాపహారియగు శంభుప్రభుడు మిక్కిలి ప్రసన్నుడై మరల ఆమెతో వరమును కోరుకొనుమని చెప్పి ఇంకనూ ఇట్లు పలికెను (27).

శివ ఉవాచ |

అయం యతిశ్చ మద్రూపో హంసరూపో భవిష్యతి | పరజన్మని వాం ప్రీత్యా సంయోగం కారయిష్యతి || 28

భిల్లశ్చ వీరసేనస్య నైషధే నగరే వరే | మహాన్‌ పుత్రో నలో నామ భవిష్యతి న సంశయః || 29

త్వం సుతా భీమరాజస్య వైదర్భే నగరే %నఘే | దమయంతీ చ విఖ్యాతా భవిష్యసి గుణాన్వితా || 30

యువాం చోభౌ మిలిత్వా చ రాజభోగం సువిస్తరమ్‌ | భుక్త్వా ముక్తిం చ యోగీంద్రైర్ల ప్స్యేథౌ దుర్లభాం ధ్రువమ్‌ || 31

శివుడిట్లు పలికెను-

నా అవతారమైన ఈ యతి మీ మరుజన్మలో హంసరూపమును దాల్చి మీ ఇద్దరికీ ప్రీతి పూర్వకముగా సంధానమును చేయగలడు (28). వీరసేనుని నైషధరాజ్యములో శ్రేష్ఠమగు రాజధానీ నగరమునందు ఈ భిల్లుడు ఆ రాజునకు పుత్రుడై జన్మించి, నలుడను పేర ప్రఖ్యాతిని గాంచుననుటలో సందేహము లేదు (29). భీమ రాజు యొక్క విదర్భదేశరాజధానిలో నీవాతని కుమార్తెవై జన్మించగలవు. ఓ పుణ్యాత్మురాలా! సద్గుణములతో విలసిల్లు నీవు దమయంతి అను పేరుతో ఖ్యాతిని పొందగలవు (30). మీరిద్దరు కలిసి మహారాజభోగముల ననుభవించి యోగీశ్వరులకై ననూ లభ్యము కాని ముక్తిని నిశ్చయముగా పొందగలరు (31).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్త్వా చ స్వయం శంభుర్లింగరూపో%భవత్తదా | తస్మాన్న చలితో ధర్మాదచలేశ ఇతి స్మృతః || 32

స భిల్ల ఆహుకశ్చాపి వీరసేనసుతో%భవత్‌ | నైషధే నగరే తాత నలనామా మహానృపః || 33

ఆహుకా సా మహాభిల్లీ భీమస్య తనయా%భవత్‌ | వైదర్భే నగరే రాజ్ఞో దమయంతీతి విశ్రుతా || 34

యతినాథా హ్వయ స్సో%పి హంసరూపో%భవచ్ఛివః | వివాహం కారయామాస దమయంత్యా నలేన పై || 35

పూర్వసత్కారరూపేణ మహాపుణ్యన శంకరః | హంసరూపం విధాయైవ తాభ్యాం సుఖమదాత్ర్పభుః || 36

శివో హంసావతారో హి నానావర్తా విచక్షణః | దమయంత్యా నలస్యాపి పరమానందదాయకః || 37

ఇదం చరిత్రం పరమం పవిత్రం శివావతారస్య పవిత్రకీర్తేః |

యతీశసంజ్ఞస్య మహాద్భుతం హి హంసాహ్వయస్యాపి విముక్తిదం హి || 38

యతీశబ్రహ్మ హంసాఖ్యావతార చరితం శుభమ్‌ | శృణుయాచ్ఛ్రావయేద్యో హి స లభేత పరాం గతిమ్‌ ||39

ఇదమాఖ్యానమనఘం సర్వకామఫలప్రదమ్‌ | స్వర్గ్యం యశస్యమాయుష్యం భక్తివర్ధనముత్తమమ్‌ || 40

శ్రుత్వైతచ్చరితం శంభోర్యతి హంసస్వరూపయోః | ఇహ సర్వ సుఖం భుక్త్వా సో%ంతే శివపురం వ్రజేత్‌ || 41

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం యతినాథ బ్రహ్మహంసావతార వర్ణనం నామ అష్టావింశో%ధ్యాయః (28).

నందీశ్వరుడిట్లు పలికెన-

శంభుడు ఇట్లు పలికి తాను స్వయముగా అపుడు లింగరూపమును దాల్చెను. ఆ భిల్లుడు ధర్మమును తప్పలేదు గనుక, ఆయనకు అచలేశుడని పేరు కలిగెను (32). ఆహుకుడను ఆ భిల్లుడు నైషధనగరములో వీరసేనుని పుత్రుడై జన్మించెను. వత్సా! ఆతడు మహారాజై నలుడని ప్రఖ్యాతిని గాంచెను (33). ఆహుకయను ఆ మహాభిల్ల యువతివైదర్భ నగరములో భీమ మహారాజునకు కుమార్తెయై జన్మించి, దమయంతి యను పేరుతో ప్రఖ్యాతిని గాంచెను (34). యతినాథునిగా అవతరించిన ఆ శివుడు కూడా హంసరూపమును దాల్చి దమయంతీ నలుల వివాహమును జరిపించెను (35). పూర్వజన్మలో చేసిన సత్కారము అనే మహాపుణ్యముచే శంకరప్రభుడు హంసరూపమును దాల్చి వారిద్దరికీ సుఖమును కలిగించెను (36). అనేక సందేశములను అందజేయుటలో సమర్థమగు శివుని ఆ హంసావతారము దమయంతీనలులకు పరమానందమును కలిగించెను (37). పవిత్రమగు కీర్తిగల శివుడు యతినాథునిగా, హంసగా అవతరించిన ఈ చరిత్ర పరమ పవిత్రమైనది, ముక్తిని ఇచ్చునది, మరియు మహాద్భుతమైనది (38). యతీశ్వరుడు, మరియు బ్రహ్మయొక్క హంస అనే ఈ రెండు అవతారముల శుభచరిత్రను ఎవడు వినిపించునో, వాడు పరమగతిని పొందును (39). ఈ వృత్తాంతము పవిత్రమైనది, సర్వకామనలను ఫలములను ఈడేర్చునది, స్వర్గమును కీర్తిని ఆయుర్దాయమును ఇచ్చునది. ఉత్తమమగు ఈ గాథ భక్తిని వర్ధిల్లజేయును (40). శంభుని యతినాథ హంసావతారముల ఈ చరితమును విను వ్యక్తి ఇహలోకములో సుఖములనన్నిటినీ అనుభవించి, మరణించిన పిదప శివుని పదమును పొందును (41).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు యతినాథ హంసావతార వర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).

Siva Maha Puranam-3    Chapters