Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టత్రింశో%ధ్యాయః

అర్జునుని తపస్సు

నందీశ్వర ఉవాచ|

అర్జునో%పి తదా తత్ర దీప్యమానో వ్యదృశ్యత | మంత్రేణ శివరూపేణ తేజశ్చాతులమావహన్‌ || 1

తే సర్వే చార్జునం దృష్ట్వా పాండవా నిశ్చయం గతాః | జయో%స్మాకం ధ్రువం జాతం తేజశ్చ విపులం యతః || 2

ఇదం కార్యం త్వయా సాధ్యం నాన్నేన చ కదాచన | వ్యాసస్య వచనాద్భాతి సఫలం కురు జీవితమ్‌ || 3

ఇతి ప్రోచ్యార్జునం తే వై విరహౌత్సుక్యకాతరాః | అనిచ్ఛంతో%పి తత్రైవ ప్రేషయామాసురాదరాత్‌ || 4

ద్రౌపదీ దుఃఖసంయుక్తా నేత్రాశ్రూణి నిరుధ్య చ | ప్రేషయంతీ శుభం వాక్యం తదోవాచ పతివ్రతా || 5

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు అచట శివరూపమగు మంత్రముచే సాటిలేని తేజస్సును కలిగియున్న అర్జునుడు, ప్రకాశిస్తూ కానవచ్చెను (1). ఆ పాండవులందరు అర్జునుని గాంచి, 'ఈతనియందు ఇంతటి గొప్ప తేజస్సు కలదు గాన, మనకు విజయము తథ్యము' అని భావించిరి (2). ఈ పనిని నీవు మాత్రమే చేయగలవు. ఇతరులు ఎన్నడైననూ చేయజాలరు. వ్యాసుని వచనముచే ఈ సత్యము స్పష్టమగుచున్నది. నీ జీవితమును సఫలము చేసుకొనుము (3). వారు ఇట్లు పలికి విరహదుఃఖముచే భయపడుతూ ఇష్టములేకున్ననూ అర్జునుని సాదరముగా అచటకు పంపిరి (4). పతివ్రతయగు ద్రౌపది దుఃఖముతో నిండిన హృదయముగలదై కన్నీటిని ఆపుకొని ఆయనకు వీడ్కోలు చెపుతూ అపుడు ఈ శుభవచనములను పలికెను (5)

ద్రౌపద్యువాచ |

వ్యాసోపదిష్టం యద్రాజంస్త్వయా కార్యం ప్రయత్నతః | శుభప్రదో%స్తుతే పంథాశ్శంకరశ్శంకరో%స్తువై || 6

తే సర్వే చావసంస్తత్ర విసృజ్యార్జు నమాదరాత్‌ | అత్యంత దుఃఖమాపన్నా మిలిత్వా పంచ ఏవ చ || 7

స్థితాస్తత్ర వదంతి స్మ శ్రూయతామృషిసత్తమ | దుఃఖే%పి ప్రియసంగో వై న దుఃఖాయ ప్రజాయతే || 8

వియోగే ద్విగుణం తస్య దుఃఖం భవతి నిత్యశః | తత్ర ధైర్యధరస్యాపి కథం ధైర్యం భ##వేదిహ || 9

ద్రౌపది ఇట్లు పలికెను-

ఓ రాజా! నీవు వ్యాసుని ఉపదేశమును శ్రద్ధగా పాలించుము. నీకు మార్గము శుభప్రదమగు గాక! శంకరుడు నీకు మంగళమును చేయుగాక! (6) ఆ పాండవులు నల్గురు ద్రౌపది కలిసి అర్జునునకు వీడ్కోలు చెప్పి మహాదుఃఖమును పొందిన వారై అచటనే నివసించిరి (7). ఓ మహర్షీ! వారచట ఉన్నవారై తమలో తాము ఇట్లు మాటలాడు కొనిరి. వినుము. ప్రియుని సన్నిధిలో దుఃఖము కలిగిననూ అది అధికముగా పీడించదు (8). ప్రియవియోగములో నుండగా దుఃఖము కలిగినచో, అది నిత్యము రెండు రెట్లు అధికపీడను కలిగించును. ధైర్యము గలవాని కైననూ ఆ స్థితిలో ధైర్యము ఎట్లు నిలబడును ? (9)

నందీశ్వర ఉవాచ|

కుర్వత్స్వేవ తదా దుఃఖం పాండవేషు మునీశ్వరః | కృపాసింధుశ్చ స వ్యాస ఋషివర్యస్సమాగతః || 10

తం తదా పాండవాస్తే వై నత్వా సంపూజ్య చాదరాత్‌ | దత్త్వాసనం హి దుఃఖాఢ్యాః కరౌ బద్ధ్వా వచోబ్రువన్‌ || 11

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ పాండవులు అట్లు దుఃఖించుచుండగా ఆ సమయములో దయానిధియగు వ్యాసమహర్షి విచ్చేసెను (10). అపుడా పాండవులు ఆయనకు నమస్కరించి, సాదరముగా పూజించి ఆసనముపై కూర్చుండ బెట్టి దుఃఖముతో నిండిన హృదయములు గలవారై చేతులు జోడించి ఇట్లు పలికిరి (11).

పాండవా ఊచుః |

శ్రూయతామృషిశ్రేష్ఠ దుఃఖదగ్ధా వయం ప్రభో | దర్శనం తే%ద్య సంప్రాప్య హ్యానందం ప్రాప్నుమో మునే || 12

కియత్కాలం వసాత్రైవ దుఃఖనాశాయ నః ప్రభో | దర్శనాత్తవ విప్రర్షేస్సర్వదుఃఖం విలీయతే || 13

పాండవులిట్లు పలికిరి-

ఓ మహర్షీ! ప్రభూ! వినుడు. మేము దుఃఖముచే పీడితులమై ఉన్నాము. ఓ మునీ! ఈ నాడు నీ దర్శనముచే మాకు ఆనందము కలుగుచున్నది (12). ఓ ప్రభూ! మా దుఃఖమును పోగొట్టుట కొరకై మీరు కొంతకాలము ఇచటనే నివసించుడు. ఓ ఋషీ! నీ దర్శనముచే దుఃఖమంతయూ దూరమగును (13).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్తస్స ఋషిశ్రేష్ఠో న్యపసత్తత్సుఖాయ వై | కథాభిర్వివిధాభిశ్చ తద్దుఃఖం నోదయంస్తదా || 14

వార్తాయాం క్రియమాణాయాం తేన వ్యాసేన సన్మునే | సుప్రణమ్య వినీతాత్మా ధర్మరాజో%బ్రవీదిదమ్‌ || 15

నందీశ్వరుడిట్లు పలికెను-

వారిట్లు కోరగా ఆ మహర్షి అచట నివసించి వివిధ గాథలతో వారి దుఃఖమును పోగొట్టి సుఖమును కలిగించెను (14). ఓ మహర్షీ! ఆ వ్యాసుడు ఇట్లు ఒకనాడు వ్యాఖ్యానించుచుండగా వినయశీలుడగు ధర్మరాజు ప్రణమిల్లి ఇట్లు పలికెను (15).

ధర్మరాజు ఉవాచ |

శృణు త్వం హి ఋషిశ్రేష్ఠ దుఃఖశాంతిర్మతా మమ | పృచ్ఛామి త్వాం మహాప్రాజ్ఞ కథనీయం త్వయా ప్రభో || 16

ఈ దృశం చైవ దుఃఖం చ పురా ప్రాప్తశ్చ కశ్చన | వయమేవ పరం దుఃఖం ప్రాప్తా వై నైవ కశ్చన || 17

ధర్మరాజు ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! నీవు వినుము. నేను ఈ దుఃఖముయొక్క శాంతిని అపేక్షించుచున్నాను. నీవు మహాప్రజ్ఞాశాలివి. నేను నిన్ను ప్రశ్నించుచున్నాను. ఓ ప్రభూ! నీవు చెప్పవలెను (16). ఇట్టి దుఃఖమును పూర్వము ఎవరైననూ పొందినారా? మేమే మహాదుఃఖమును పొందుచున్నామా ? ఇతరులకు ఎవ్వరికైననూ ఇంత దుఃఖములేదు (17).

వ్యాస ఉవాచ |

రాజ్ఞస్తు నలనామ్నో వై నిషధాధిపతేః పురా | భవద్ధుఃఖాధికం దుఃఖం జాతం తస్య మహాత్మనః || 18

హరిశ్చంద్రస్య నృపతే ర్జాతం దుఃఖం మహత్తరమ్‌ | అకథ్యం తద్విశేషేణ పరశోకావహం తథా || 19

దుఃఖం తథైవ విజ్ఞేయం రామస్యాప్యథ పాండవ | యచ్ఛ్రుత్వాస్త్రీ నరాణాం చ భ##వేన్మోహో మహత్తరః || 20

తస్మాద్వర్ణయితుంనైవ శక్యతే హి మయా పునః | శరీరం దుఃఖరాశిం చ మత్వా త్యాజ్యం త్వయాధునా || 21

యేనేదం చ ధృతం తేన వ్యాప్తమేవ న సంశయః | ప్రథమం మాతృగర్భే వై జన్మ దుఃఖస్య కారణమ్‌ || 22

కౌమారే%పి మహాద్దుఃఖం బాలలీలానుసారితమ్‌ | తతో%పి ¸°వనే కామాన్‌ భుంజానో దుఃఖరూపిణః || 23

గతాగతైర్దినానాం హి కార్య భారైరనేకశః | ఆయుశ్చ క్షీయతే నిత్యం న జానాతి హ తత్పునః || 24

అంతే చ మరణం చైవ మహాదుఃఖమతః పరమ్‌ | నానానరకపీడాశ్చ భుజ్యంతే%జ్ఞైర్నరైస్తదా || 25

తస్మాదిమసత్యం చ త్వం తు సత్యం సమాచర | యేనైవ తుష్యతే శంభుస్తథా కార్యం నరేణ చ || 26

వ్యాసుడిట్లు పలికెను-

పూర్వము నిషధదేశాధిపతియగు నలమహారాజునకు మీకంటే అధికమగు దుఃఖము కలుగగా, ఆ మహాత్ముడు దానిని సహించెను (18). హరిశ్చంద్ర మహారాజునకు అంత కంటే అధికమగు దుఃఖము కలిగెను. మహాదుఃఖమును కలిగించే ఆయన కష్టములను వివరించి చెప్పుట సంభవము కాదు (19). ఓ ధర్మరాజా! అదే విధముగా రామునకు కూడ మహాదుఃఖము కలిగెను. ఆ దుఃఖమును గురించి విన్న స్త్రీ పురుషులు మహామోహమును పొందెదరు (20). కావున ఆ దుఃఖమును మరల వర్ణించే శక్తి నాయందు లేదు. ఈ శరీరము దుఃఖనిలయము. నీవీసత్యమునెరింగి దుఃఖమును విడనాడుము (21). ఏ పరమేశ్వరుడు ఈ జగత్తును ధరించుచున్నాడో, ఆయనయే దీనినంతనూ వ్యాపించి యున్నాడు. దీనిలో సందేహము లేదు. ముందుగా తల్లి గర్భములో ప్రవేశించుటయే దుఃఖహేతువు అగును (22). బాలచేష్టలతో గూడియుండు బాల్యావస్థయందు కూడా మహాదుఃఖము గలదు. ఆ తరువాత మానవుడు ¸°వనములో దుఃఖాత్మకములగు కోర్కెలను అనుభవించును (23). రాత్రింబగళ్లు ఒకదాని తరువాత మరియొకటి క్రమముగా వచ్చిపోవుచుండును. అనేక కార్యముల భారము నెత్తిపై పడును. ప్రతిదినము ఆయుర్దాయము క్షీణించుచుండును. కాని మానవుడు ఆ సత్యమును తెలియకున్నాడు (24). ఆయుర్దాయము పూర్తి కాగానే మరణము సంప్రాప్తమగును. దాని తరువాత అజ్ఞానులగు జీవులు అనేకనరకపీడలనను భవించెదరు (25). కావున ఈ జగత్తు మిథ్య. నీవు సత్యము ననుష్ఠించుము. ఏ పనిని చేసినచో, శంభుడు సంతుష్టుడగునో, మానవుడా పనిని చేయవలెను (26).

నందీశ్వర ఉవాచ |

ఏవం వివిధవార్తాభిః కాలనిర్యాపణం తదా | చక్రుస్తే భ్రాతర స్సర్వే మనోరథపథైః పునః || 27

అర్జునో%పి స్వయం గచ్ఛన్‌ దుర్గాద్రిషు దృఢవ్రతః | యక్షం లబ్ధ్వా చ తేనైవ దస్యూన్నిఘ్నన్ననేకశః || 28

మనసా హర్ష సంయుక్తో జగామాచల ముత్తమమ్‌ | తత్ర గత్వా చ గంగా యాస్సమీపం సుందరం స్థలమ్‌ || 29

అశోకకాననం యత్ర తిష్ఠతి స్వర్గ ఉత్తమః | తత్ర తస్థౌ స్వయం స్నాత్వా నత్వా చ గురుముత్తమమ్‌ || 30

యథోపదిష్టం వేషాది తథా చైవకరోత్స్వయమ్‌ | ఇంద్రియాణ్యపకృష్యాదౌ మనసా సంస్థితోభవత్‌ || 31

పునశ్చ పార్థివం కృత్వా సుందరం సమసూత్రకమ్‌ | తదగ్రే ప్రణిదధ్యౌ స తేజోరాశిమనుత్తమమ్‌ || 32

త్రికాలం చైవ సుస్నాతః పూజనం వివిధం తదా | చకారోపాసనం తత్ర హరస్య చ పునః పునః || 33

తసై#్యవ శిరసస్తే జో నిస్సృతం తచ్చరాస్తదా | దృష్ట్వా భయం సమాపన్నాః ప్రవిష్టశ్చ కదా హ్యయమ్‌ || 34

పునస్తే చ విచార్యైవం కథనీయం బిడౌజసే | ఇత్యుక్త్వా తు గతాస్తే వై శక్ర స్యాంతికమంజసా || 35

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ సోదరులందరు ఈ విధముగా వివిధగాథలను వింటూ మనోరాజ్యములో విహరిస్తూ కాలమును గడుపుచుండిరి (27). దృఢవ్రతుడగు అర్జునుడు దుర్గమములగు పర్వతములయందు పయనిస్తూ దారిలో ఒక యక్షుని కలుసుకొని వాని ద్వారా చాలమంది బందిపోటు దొంగలను సంహరించెను (28). ఆతడు మనస్సులో హర్షము గలవాడై ఉత్తమమగు ఇంద్రకీల పర్వతమును చేరుకొని అచట గంగానదికి సమీపములో అందమగు స్థలమునందు మకాము చేసెను (29). అశోక వనముతో గూడియున్న ఆ స్థానము స్వర్గము కంటే ఉత్తమముగా నుండెను. ఆతడు గంగానదిలో స్నానమాడి గురువునకు నమస్కరించి (30), గురువు ఉపదేశించిన విధంబున వేషాదులను దాల్చి ఉపాసనను మొదలిడెను. ముందుగా ఇంద్రియములను ఉపసంహరించి మనస్సును ఏకాగ్రము చేసెను (31). ఆతడు చక్కని ఆసనముపై కూర్చుండెను. సుందరము, సమపరిమాణము గలది అగు పార్థివ లింగమును చేసి దాని ఎదుట కూర్చుండి సర్వశ్రేష్ఠుడు, తేజోరాశియగు శివుని ధ్యానించెను (32). ఆతడు మూడు కాలములలో స్నానమును చేయుచూ శివుని పలుతెరంగుల పూజించి ఉపాసించెను (33). ఆతని శిరస్సునుండి తేజస్సు బయల్వెడలు చుండెను. దానిని చూచి ఇంద్రుని అనుచరులు భయపడిరి. ఈతడు ఎప్పుడు ఇచట ప్రవేశించినాడు? అని వారు ఆశ్చర్యమును పొందిరి (34). వారు మరల ఆలోచించుకొని ఇంద్రునకు చెప్పవలెనని నిశ్చయించి వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్లిరి (35).

చరా ఊచుః |

దేవో వాథ ఋషిశ్చైవ సూర్యో వాథ విభావసుః | తపశ్చరతి దేవేశ న జానీమో వనే చ తమ్‌ || 36

తసై#్యవ తేజసా దగ్ధా ఆగతాస్తవ సన్నిధౌ| నివేదితం చరిత్రం తత్‌ క్రియతాముచితం తు యత్‌ || 37

అనుచరులిట్లు పలికిరి-

ఓ దేవేంద్రా! అడవిలో ఒక వ్యక్తి తపస్సు చేయుచున్నాడు. ఆతడు ఋషియా, దేవతయా, సూర్యుడా, లేక అగ్నియా అను విషయము మాకు తెలియకున్నది (36). ఆతని తేజస్సుచే పీడింపబడిన మేము నీ సన్నిధికి వచ్చితిమి. ఆ వృత్తాంతమును నీకు నివేదించితిమి. ఉచితమగు ప్రతిక్రియను నీవు ఆచరింపుము (37).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్త సై#్తశ్చరైస్సర్వం జ్ఞాత్వా పుత్ర చికీర్షితమ్‌ | స గోత్రపాన్‌ విసృజ్యైవ తత్ర గంతుం మనో దధే || 38

స వృద్ధ బ్రాహ్మణో భూత్వా బ్రహ్మచారీ శచీపతిః | జగామ తత్ర విప్రేంద్ర పరీక్షార్థం హి తస్య వై || 39

తమాగతం తదా దృష్ట్వాకార్షీత్పూజాం చ పాండవః | స్థితో%గ్రే చ స్తుతిం కృత్వా క్వాయాతో%సి వదాధునా || 40

ఇత్యుక్తస్తేన దేవేశో ధైర్యార్థం తస్య ప్రీతితః | పరీక్షా గర్వితం వాక్యం పాండవం తం తతో%బ్రవీత్‌ || 41

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ అనుచరులిట్లు పలుకగా ఇంద్రునకు తన కుమారుని సంకల్పము అవగతమయ్యెను. ఆయన ఆ పర్వత రక్షకులను పంపించి, తాను అచటకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను (38). ఆ శచీపతియగు ఇంద్రుడు అర్జునుని పరీక్షించుట కొరకై వృద్ధ బ్రాహ్మణ బ్రహ్మచారి రూపమును దాల్చి అచటకు వెళ్లెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! (39) అర్జునుడు అచటకు విచ్చేసిన ఆ బ్రాహ్మణుని గాంచి పూజించి ఎదుట నిలబడి స్తుతించి 'అయ్యా! ఎచటనుండి ఇపుడిచటకు వచ్చినారు?' (40) అని ప్రశ్నించగా, ఇంద్రుడు ప్రేమతో ఆతనిని పరీక్షించి ధైర్యమును కలిగించుటకొరకై, ఆ పాండు పుత్రునితో గర్వముతో గూడిన ఈ వాక్యమును పలికెను (41).

బ్రాహ్మణ ఉవాచ |

నవే వయసి వై తాత కిం తపస్యసి సాంప్రతమ్‌ | ముక్త్యర్థం వా జయార్థం కిం సర్వధైతత్తపస్తవ || 42

బ్రాహ్మణుడిట్లు పలికెను-

వత్సా! నీవు ఇపుడు ¸°వనములో నున్నావు. తపస్సు చేయుటకు కారణమేమి? ఈ నీ తపస్సునకు ప్రధానప్రయోజనము ముక్తియా? లేక యుద్ధములో జయమా? (42).

నందీశ్వర ఉవాచ|

ఇతి పృష్టస్తదా తేన సర్వం సంవేదితం పునః | తచ్ఛ్రుత్వా స పునర్వాక్యమువాచ బ్రాహ్మణస్తదా || 43

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ బ్రాహ్మణుడిట్లు ప్రశ్నించగా అర్జునుడు సర్వమును విన్నవించెను. అపుడా బ్రాహ్మణుడు ఆ మాటలను విని మరల ఇట్లు పలికెను (43).

బ్రాహ్మణ ఉవాచ |

యుక్తం న క్రియతే వీర సుఖం ప్రాప్తుం చ యత్తపః | క్షాత్రధర్మేణ క్రియతే ముక్త్యర్థం కురు సత్తమ || 44

ఇంద్రస్తు సుఖదాతా వై ముక్తి దాతా భ##వేన్న హి | తస్మాత్త్వం సర్వథా శ్రేష్ఠ కర్తుమర్హసి సత్తపః || 45

బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఓ వీరా! నీవు క్షత్రియధర్మమగు యుద్ధముచే సుఖమును పొందగోరి తపస్సును చేయుట ఉచితము కాదు. ఓ సత్పురుషా! ముక్తి కొరకు తపస్సును చేయుము (44). ఇంద్రుడు సుఖమునిచ్చువాడే గాని ముక్తిని ఇచ్చువాడు కాదు. ఓ వీరా! కావున నీవు సద్రూపుడగు పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సును చేయుట నిశ్చితముగా ఉచితమగు తపస్సు అగును (45).

నందీశ్వర ఉవాచ |

ఇదం తద్వచనం శ్రుత్వా క్రోధం చక్రేర్జు%నస్తదా | ప్రత్యువాచ వినీతాత్మా తదనాదృత్య సువ్రతః || 46

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆతని ఈ మాటలను విని అర్జునునకు అపుడు కోపము వచ్చెను. గొప్ప వ్రతముగల అర్జునుడు ఆ కోపమును తొలగించుకొని వినయముతో నిండిన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (46).

అర్జున ఉవాచ |

రాజ్యార్థం న చ ముక్త్యర్థం కిమర్థం భాషసే త్విదమ్‌ | వ్యాసస్య వచనేనైవ క్రియతే తప ఈదృశమ్‌ || 47

ఇతో గచ్ఛ బ్రహ్మచారిన్‌ మా పాతయితు మిచ్ఛసి | ప్రయోజనం కిమత్రాస్తి తవ వై బ్రహ్మచారిణః || 48

అర్జునుడిట్లు పలికెను-

నేను రాజ్యము కొరకు తపస్సును చేయుచున్నాను; ముక్తి కొరకు కాదు. నీవు ఇట్లేల మాటలాడుచుంటివి? ఈ తపస్సును నేను వ్యాసుని ఆదేశముచే మాత్రమే చేయుచున్నాను (47). ఓ బ్రహ్మచారీ! నీవు ఇచటనుండి తొలగిపొమ్ము. నన్ను పతితుని చేయు ఇచ్ఛను విడనాడుము. బ్రహ్మచారివి అగు నీకు ఇచట పని యేమున్నది? (48)

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్తస్స ప్రసన్నో%భూత్సుందరం రూపమద్భుతమ్‌ | స్వోపకరణసంయుక్తం దర్శయామాస వై నిజమ్‌ || 49

శక్రరూపం తదా దృష్ట్వా లజ్జితశ్చార్జునస్తదా | స ఇంద్రస్తం సమాశ్వాస్య పునరేవ వచో%బ్రవీత్‌ || 50

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆతడిట్లు పలుకగా ఇంద్రుడు ప్రసన్నుడై వజ్రాద్యాయుధములతో గూడియున్న తన అద్భుత సుందరరూపమును ఆతనికి చూపించెను (49). అపుడు అర్జునుడు ఇంద్రుని రూపమును గాంచి తన వచనములకు సిగ్గుపడుచుండగా, ఇంద్రుడు ఆతనికి నచ్చజెప్పి మరల ఇట్లు పలికెను (50).

ఇంద్ర ఉవాచ |

వరం వృణీష్వ హే తాత ధనంజయ మహామతే | యదిచ్ఛసి మనో%భీష్టం నాదేయం విద్యతే తవ || 51

తచ్ఛ్రుత్వా శక్రవచనం ప్రత్యువాచార్జునస్తదా | విజయం దేహి మే తాత శత్రుక్లిష్టస్య సర్వథా || 52

ఇంద్రుడిట్లు పలికెను-

ఓ వత్సా! ధనంజయా! నీవు మహాబుద్ధిశాలివి. నీ మనస్సునకు నచ్చిన అభీష్టమగు వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (51). అపుడు అర్జునుడు ఇంద్రుని ఆమాటను విని 'తండ్రీ! నేను అన్ని విధములుగా శత్రువులచే క్లేశములకు గురి చేయబడి యున్నాను; నాకు విజయము నిమ్ము' అని బదులిడెను (52).

శక్ర ఉవాచ |

బలిష్ఠాశ్శత్రవస్తే చ దుర్యోధనపురస్సరాః | ద్రోణో భీష్మశ్చ కర్ణశ్చ సర్వే తే దుర్జయా ధ్రువమ్‌ || 53

అశ్వత్థామా ద్రోణపుత్రో రౌద్రోంశో దుర్జయో%తి సః | మయా సాధ్యా భ##వేయుస్తే సర్వథా స్వహితం శృణు || 54

ఏత ద్వీర జపః కర్తుం న శక్తః కశ్చనాధునా | వర్తతే హి శివో వర్య స్తస్మాచ్ఛంభోర్జపో%ధునా || 55

శంకరస్సర్వలోకేశశ్చ రాచరపతి స్స్వరాట్‌ | సర్వం కర్తుం సమర్థో%స్తి భుక్తి ముక్తి ఫలప్రదః || 56

అహమన్యే చ బ్రహ్మాద్యా విష్ణుస్సర్వవరప్రదః | అన్యే జిగీషవో యే చతే సర్వే శివపూజకాః || 57

అద్యప్రభృతి తన్మంత్రం హిత్వా భక్త్యా శివం భజ | పార్థివేన విధానేన ధ్యానేనైవ శివస్య చ || 58

ఉపచారైరనే కై శ్చ సర్వభావేన భారత | సిద్ధిస్స్యాదచలా తే %ద్య నాత్ర కార్యా విచారణా || 59

ఇంద్రుడిట్లు పలికెను-

నీకు శత్రువులగు దుర్యోధన, ద్రోణ, భీష్మ, కర్ణాదులందరు బలవంతులు, దుర్జయులు అను మాట నిశ్చయము (53). ద్రోణపుత్రుడు, రుద్రాంశసంభూతుడునగు అశ్వత్థామను జయించుట మిక్కిలి కష్టమైన పని. నేను వారిని జయించు ఉపాయమును పరిశీలించెదను. నీకు సర్వవిధములుగా హితము కలిగే మార్గమును చెప్పెదను వినుము (54). ఓ వీరా! ఇపుడు ఈ జపమును చేయగల వీరుడు లేడు. శివుడు దేవతలలో శ్రేష్ఠుడు. కావున ఇపుడు శంభుని మంత్రమును జపించుము (55). శంకరుడు సర్వలోకములకు ప్రభువు, స్థావరజంగమాత్మకమగు జగత్తునకు నియంత, దేవతాసార్వభౌముడు, సర్వమును చేయ సమర్థుడు మరియు భుక్తి ముక్తి ఫలములను ఇచ్చువాడు (56). నేను, బ్రహ్మాది ఇతర దేవతలు, అందరికీ వరములిచ్చే విష్ణువు మాత్రమే గాక, విజయమును కాంక్షించువారందరు శివుని పూజించెదరు (57). ఈనాటి నుండియు ఆ ఇంద్రమంత్రమును పరిత్యజించి శివుని సేవించుము. పార్థివలింగమును పూజించి శివుని ధ్యానించుము (58). ఓ భారతా! శివునకు అనేక ఉపచారములనర్పించి సర్వభావముతో పూజింపుము. నీకు నిశ్చయముగా సిద్ధి కలుగును. ఈ విషయములో సంశయమునకు తావు లేదు (59).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా చ చరాన్‌ సర్వాన్‌ సమాహూయాబ్రవీదిదమ్‌ | సావధానేన స్థేయమేతత్సం రక్షణ సదా || 60

ప్రభోధ్య స్వచరానింద్రో%ర్జున సంరక్షణాదికమ్‌ | వాత్సల్యపూర్ణహృదయః పునరూచే కపిధ్వజమ్‌ || 61

నందీశ్వరుడిట్లు పలికెను-

ఇట్లు పలికి ఇంద్రుడు తన అనుచరులనందరినీ సమావేశపరిచి 'మీరు నిత్యము సావధానులై ఉండి ఈతనిని రక్షించుడు' అని ఆదేశించెను (60). ప్రేమతో నిండిన హృదయము గల ఇంద్రుడు ఈ విధముగా తన అనుచరులకు అర్జునుని సంరక్షించుట ఇత్యాది కార్యములనప్పగించి మరల అర్జునునితో నిట్లనెను (61).

ఇంద్ర ఉవాచ|

రాజ్యం త్వయా ప్రమాదాద్వై న కర్తవ్యం కదాచన | శ్రేయసే భద్ర విద్యేయం భ##వేత్తవ పరంతప || 62

ధైర్యం ధార్యం సాధకేన సర్వథా రక్షకశ్శివః | సంపత్తీశ్చ ఫలం తుల్యం దాస్యతే నాత్ర సంశయః || 63

ఇంద్రుడిట్లు పలికెను-

నీవు పొరబడి ఎన్నడైననూ రాజ్యమును చేయవలదు. వత్సా! శత్రువులను తపింప జేయువాడా! ఈ విద్య నీకు శ్రేయస్సును కలిగించును (62). సాధకుడు ధైర్యమును కలిగియుండవలెను. శివుడు అన్ని విధములుగా రక్షించి, సంపత్తులను కర్మానురూపమగు ఫలమును ఇచ్చుననుటలో సంశయము లేదు (63).

నందీశ్వర ఉవాచ|

ఇతి దత్త్వా వరం తస్య భారతస్య సురేశ్వరః | స్మరన్‌ శివపదాంభోజం జగామ భవనం స్వకమ్‌ || 64

అర్జునో%పి మహావీరస్సుప్రణమ్య సురేశ్వరమ్‌ | తపస్తేపే సంయతాత్మా శివముద్దిశ్య తద్విధమ్‌ || 65

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం అర్జున తపోవర్ణనం నామ అష్టత్రింశో%ధ్యాయః (38).

నందీశ్వరుడిట్లు పలికెను-

ఇంద్రుడు ఈ తీరున ఆ అర్జునునకు వరములనిచ్చి శివుని పాదపద్మమును స్మరిస్తూ తన భవనమునకు వెళ్లెను (64). మహావీరుడగు అర్జునుడు దేవేంద్రునకు ప్రణమిల్లి ఆయన చెప్పిన విధముగా మనస్సును నియమించి శివుని ఉద్దేశించి తపస్సును చేసెను (65).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు అర్జున తపోవర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).

Siva Maha Puranam-3    Chapters