Siva Maha Puranam-3
Chapters
అథ చతుర్థో%ధ్యాయః అత్రీశ్వర మాహాత్మ్యము సూత ఉవాచ | కదాచిత్స ఋషిశ్రేష్టో హ్యతిర్బ్రహ్మవిదాం వరః | జాగృతశ్చ జలం దేహి ప్రత్యువాచ ప్రియామితి || 1 సాపి సాధ్వీ త్వవశ్యం చ గృహీత్వాథ కమండలుమ్ | జగామ విపినే తత్ర జలం మే నీయతే కుతః || 2 కిం కరోమి క్వ గచ్ఛామి కుతో నీయతే వై జలమ్ | ఇతి విస్మయమాపన్నా తాం గంగాం హి దదర్శ సా || 3 తామనువ్రజతీ యావత్సాబ్రవీచ్చ సదా హి తామ్ | గంగా సరిద్వరా దేవీ బిభ్రతీ సుందరం వపుః || 4 సూతుడు ఇట్లు పలికెను- ఒకనాడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడగు అత్రిమహర్షి సమాధినుండి బయటకు వచ్చి ప్రియురాలిని నీటిని ఇమ్మని కోరెను (1). ఆ పతివ్రత అవశ్యమని పలికి కమండలమును చేతబట్టి అడవికి వెళ్లెను. నేను వీటిని ఎక్కడినుండి తేవలెను? (2) నేనేమి చేయుదును? ఎచటకు వెళ్లవలెను? ఇట్లు ఆమె ఆ అడవిలో కంగారు పడుతూ ఆ గంగను చూచెను (3). సుందరమగు దేహమును దాల్చియున్న నదీమతల్లియగు గంగాదేవివెంట ఆమె వెళ్లుచుండగా, ఇంతలో గంగ ఇట్లు పలికెను (4). గంగోవాచ | ప్రసన్నాస్మి చ తే దేవి కుత్ర యాసి వదాధునా | ధన్యా త్వం సుభ##గే సత్యం తవాజ్ఞాం చ కరోమ్యహమ్ || 5 గంగ ఇట్లు పలికెను- ఓ దేవీ! నేను నీ విషయములో ప్రసన్నురాలనైతిని. నీవిపుడు ఎచటకు వెళ్లుచున్నావు? ఓ సౌభాగ్యవతీ! నీవు యథార్థముగా ధన్యురాలవు. నేను నీ ఆజ్ఞను పాలించెదను (5). సూత ఉవాచ | తద్వచశ్చ తదా శ్రుత్వా ఋషిపత్నీ తపస్వినీ | ప్రత్యువాచ వచః ప్రీత్యా స్వయం సుచకితా ద్విజాః || 6 సూతుడు ఇట్లు పలికెను- ఓ బ్రాహ్మణులారా! అపుడా తపస్వినియగు ఋషిపత్ని ఆమె మాటను విని తాను మిక్కిలి చకితురాలై ప్రేమతో ఇట్లు బదులిడెను (6). అనసూయోవాచ | కా త్వం కమలపత్రాక్షి కుతో వా త్వం సమాగతా | తథ్యం బ్రూహి కృపాం కృత్వా సాధ్వీ సుప్రవదా సతీ || 7 అనసూయ ఇట్లు పలికెను- ఓ పద్మములవంటి కన్నులు గలదానా! నీవెవరివి? నీవెచటనుండి వచ్చితివి? దయ చేసి సత్యమును పలుకుము. సాధ్వియగు యువతి సత్యమును మాత్రమే పలుకును (7). సూత ఉవాచ| ఇత్యుక్తే చ తయా తత్ర మునిపత్న్యా మునీశ్వరాః | సరిద్వరా దివ్యరూపా గంగా వాక్యమథా బ్రవీత్ || 8 సూతుడిట్లు పలికెను- ఓ మహర్షులారా! అచట మునిపత్నియగు అనసూయ ఇట్లు పలుకగా, నదీమతల్లి మరియు దివ్యమగు రూపము గలది అగు గంగ ఇట్లు పలికెను (8). గంగోవాచ | స్వామినస్సేవనం దృష్ట్వా శివస్య చ పరాత్మనః | సాధ్వి ధర్మం చ తే దృష్ట్వా స్థితాస్మి తవ సన్నిధౌ || 9 అహం గంగా సమాయుతా భజనాత్తే శుచిస్మితే | వశీభూతా హ్యహం జాతా యదిచ్ఛసి వృణీష్వ తత్ || 10 గంగ ఇట్లు పలికెను- ఓ పతివ్రతా! నీవు నీ భర్తకు మరియు శివపరమాత్మకు చేసిన సేవను, నీ ధర్మమును చూచి నీ యెదుట నిలబడియున్నాను (9). ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా! నీ సేవను గాంచి నేను గంగను వచ్చియున్నాను. నేను నీకు వశురాలను అయితిని. నీకు నచ్చిన వరమును కోరుకొనుము (10). సూత ఉవాచ | ఇత్యుక్తే గంగయా సాధ్వీ నమస్కృత్య పురః స్థితా | ఉవాచేతి జలం దేహి చేత్ర్పసన్నా మమాధునా || 11 ఇత్యేతద్వచనం శ్రుత్వా గర్తం కుర్వితి సాబ్రవీత్ | శీఘ్రం చాయాచ్చ తత్కృత్వా స్థితతా తత్‌క్షణమాత్రతః || 12 తత్ర సా చ ప్రవిష్టా చ జలరూపమభూత్తదా | ఆశ్చర్యం పరమం గత్వా గృహీతం చ జలం తయా || 13 ఉవాచ వచనం చైతల్లోకానాం సుఖహేతవే | అనసూయా మునేః పత్నీ దివ్యరూపాం సరిద్వరామ్ || 14 సూతుడిట్లు పలికెను- గంగ ఇట్లు పలుకగా, ఆ సాధ్వి ఆమె ఎదుట నిలబడి నమస్కరించి, 'నీవు నాయందు ప్రసన్నురాలవైనచో, నాకు ఇపుడు నీటిని ఇమ్ము' అని పలికెను (11). ఈ మాటను విని ఆమె 'గోతిని త్రవ్వుము' అని పలికెను. అపుడు అనసూయ వెనువెంటనే గోతిని చేసి నిలబడెను (12). అపుడు ఆ గంగ జల రూపమును దాల్చి దానిలో ప్రవేశించెను. అనసూయ ఆశ్చర్యపడి నీటిని స్వీకరించెను (13). మునిపత్నియగు అనసూయ ప్రాణుల సుఖమును గోరి నదీమతల్లి, దివ్యరూప అగు గంగతో నిట్లనెను (14). అనసూయోవాచ | యది త్వం సుప్రసన్నా మే వర్తసే చ కృపా మయి| స్థాతవ్యం చ త్వయా తావన్మత్స్వామీ యావదావ్రజేత్||15 అనసూయ ఇట్లు పలికెను- నీవు నాయందు మిక్కిలి ప్రసన్నురాలవైనచో, నీకు నాయందు దయ ఉన్నచో, నా భర్త వచ్చువరకు నీవు నిలిచి యుండుము (15). సూత ఉవాచ | ఇతిశ్రుత్వానసూయాయా వచనం సుఖదం సతామ్ | గంగోవాచ ప్రసన్నాతి హ్యత్రేర్దాస్యసి మే%నఘే || 16 ఇత్యుక్తే చ తయా తత్ర హ్యనసాయి కృతం తథా | స్వామినే తజ్జలం దివ్యం దత్త్వా తత్పురతః స్థితా || 17 స ఋషిశ్చాపి సుప్రీత్యా స్వాచమ్య విధిపూర్వకమ్ | పపౌ దివ్యం జలం తచ్చ పీత్వా సుఖమవాప హ || 18 అహో నిత్యం జలం యచ్చ పీయతే తజ్జలం న హి | విచార్యేతి చ తేనాశు పరితశ్చావలోకినమ్ || 19 శుష్కాన్ వృక్షాన్ సమాలోక్య దిశో రూక్షతరాస్తథా | ఉవాచ తామృషిశ్రేష్ఠో న జాతం వర్షణం పునః || 20 తదుక్తం తత్సమాకర్ణ్య నేతి నేతి ప్రియాం తదా | తామువాచ పునస్సో%పి జలం నీతం కుతస్త్వయా || 21 ఇత్యుక్తే తు తదా తేన విస్మయం పరమం గతా | అనసూయా స్వమనసి సచింతా తు మునీశ్వరాః || 22 నివేద్యతే మయా చేద్వై తదోత్కర్షో భ##వేస్మమ | నివేద్యతే యదా నైవ వ్రతభంగో భ##వేన్మమ || 23 నోభయం చ తథా స్యాద్వై నివేద్యం తత్తథా మమ | ఇతి యావద్వి చార్యేత తావత్పృష్టా పునః పునః || 24 అథానుగ్రహతశ్శంభోః ప్రాప్తబుద్ధిః పతివ్రతా | ఉవాచ శ్రూయతాం స్వామిన్యజ్జాతం కథయామి తే || 25 సూతుడు ఇట్లు పలికెను- సత్పురుషులకు సుఖమునిచ్చే ఈ అనసూయావచనమును విని గంగ మిక్కిలి ప్రసన్నురాలై 'ఓ పుణ్యాత్మురాలా! నా ఈ జలమును అత్రికి ఇమ్ము' అని పలికెను (16). ఆమె ఇట్లు పలుకగా, అనసూయ ఆ వచనములకు అనురూపముగా చేసెను. ఆ దివ్యజలమును తన భర్తకు ఇచ్చి ఆయన యెదుట నిలబడెను (17). ఆ ఋషి మిక్కిలి ప్రీతితో యథావిధిగా ఆచమనమును చేసి ఆ దివ్యజలమును త్రాగి సుఖమును పొందెను (18). 'ఆశ్చర్యము! ఇది నేను నిత్యము త్రాగే జలము కాదు'. ఆయన ఇట్లు ఆలోచించి వెంటనే నలువైపులయందు చూచెను (19). ఆ మహర్షి ఎండియున్న వృక్షములను, ఎడారివలెనున్న దిక్కులను గాంచి 'వర్షము పడలేదా యేమి' అని ప్రశ్నించెను (20). ఆ మాటను విని అనసూయ 'లేదు, లేదని' సమాధానముగా చెప్పగా, 'నీవు నీటిని ఎక్కడినుండి తెచ్చితివి?' అని మరల ఆయన ప్రశ్నించెను (21). ఓ మహర్షులారా! ఆయన ఇట్లు ప్రశ్నించగా, అనసూయ పరమాశ్చర్యమును పొంది తన మనస్సులో ఇట్లు తలపోసెను (22). నేను ఉన్న విషయమును చెప్పినచో, నా గొప్పదనమును ప్రకటించినట్లగును. చెప్పనిచో వ్రతమునకు భంగము కలుగును (23). ఈ రెండు దోషములు కలుగని విధముగా నేను విన్నవించవలెను. ఆమె ఇట్లు ఆలోచించునంతలో ఆయన అదే ప్రశ్నను పలుమార్లు అడిగెను (24). అపుడా పతివ్రతకు శంభుని అనుగ్రహముతో ఉపాయము తోచి స్వామీ! జరిగిన వృత్తాంతమును నీకు చెప్పెదనని పలికెను (25). అనసూయోవాచ| శంకరస్య ప్రతాపాచ్చ తవైవ సుకృతైస్తథా | గంగా సమాగతాత్రై వ తదీయం సలిలం త్విదమ్ || 26 అనసూయ ఇట్లు పలికెను- శంకరుని ప్రతాపముచేత మరియు నీ పుణ్యములచేత గంగ ఇచటికే వచ్చినది. ఇది ఆ గంగ యొక్క నీరే (26). సూత ఉవాచ| ఏవం వచస్తదా శ్రుత్వా మునిర్విస్మయమానసః | ప్రియామువాచ సుప్రీత్యా శంకరం మనసా స్మరన్ || 27 సూతుడిట్లు పలికెను- అపుడీ మాటను విని ఆ ముని ఆశ్చర్యముతో నిండిన మనస్సు గలవాడై శంకరుని మనస్సులో స్మరిస్తూ అతిశయించిన ప్రేమతో తన ప్రియురాలితో నిట్లనెను (27). అత్రిరువాచ| ప్రియే సుందరి త్వం సత్యమథ వాచం వ్యలీకకామ్ | బ్రవీషి చ యథార్థం త్వం న మన్యే దుర్లభం త్విదమ్ || 28 అసాధ్యం యోగిభిర్యచ్చ దేవైరపి సదా శుభే | తచ్చైవాద్య కథం జాతం విస్మయః పరమో మమ || 29 యద్యేవం దృశ్యతే చేద్వై తన్మన్యేహం న చాన్యథా | ఇతి తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ పతిం ప్రియా || 30 అత్రి ఇట్లు పలికెను- ఓ ప్రియురాలా! సుందరీ! నీవు సత్యమును పలికితివో, అసత్యమును పలికితివో! నేను విశ్వసించలేకున్నాను. ఇది దుర్లభ##మైన విషయము (28). ఓ పుణ్యాత్మురాలా! ఏది యోగులకు, దేవతలకు కూడ సాధింప శక్యము కాదో, అది ఈ నాడు ఎట్లు ఘటిల్లినది? నాకు అత్యాశ్చర్యము కలుగుచున్నది (29). నేను నా కళ్లతో చూచినచో నమ్మెదను. లేనిచో, నేను నమ్మను. అత్రి ఇట్లు పలుకగా, అనసూయ ఇట్లు బదులిడెను (30). అనసూయోవాచ | ఆగమ్యతాం మయా సార్ధం త్వయా నాథ మహామునే | సరిద్వరాయా గంగాయా ద్రష్టుమిచ్ఛా భ##వేద్విది || 31 అనసూయ ఇట్లు పలికెను- ఓ నాథా! మహర్షీ! నీవు నదీమతల్లీయగు గంగను చూడగోరుచున్నచో, నాతో రమ్ము (31). సూత ఉవాచ| ఇత్యుక్త్వా తు సమాదాయ పతిం తం సా పతివ్రతా | గతా ద్రుతం శివం స్మృత్వా యత్ర గంగా సరిద్వరా || 32 దర్శయామాస తాం తత్ర గంగాం పత్యే పతివ్రతా | గర్తే చ సంస్థితాం తత్ర స్వయం దివ్యస్వరూపిణీమ్ || 33 తత్ర గత్వా ఋషిశ్రేష్ఠో గర్తం చ జలపూరితమ్ | ఆకంఠం సుందరం దృష్ట్వా ధన్యేయమితి చాబ్రవీత్ || 34 కిం మదీయం తపశ్చైవ కిమన్యేషాం పునస్తదా | ఇత్యుక్తో మునిశార్దూలో భక్త్యా తుష్టావ తాం తదా || 35 తతో హి స మునిస్తత్ర సుస్నాతస్సుభ##గే జలే | ఆచమ్య పునరేవాత్ర స్తుతిం చక్రే పునః పునః || 36 అనసూయాపి సంస్నాతా సుందరే తజ్జలే తదా | నిత్యం చక్రే మునిః కర్మ సానసూయాపి సువ్రతా || 37 తతస్సోవాచ తాం గంగా గమ్యతే స్వస్థలం మయా | ఇత్యుక్తే చ పునస్సాధ్వీ తామువాచ సరిద్వరామ్ || 38 సూతుడు ఇట్లు పలికెను- ఆ పతివ్రత ఇట్లు పలికి ఆ భర్తను దోడ్కొని శివుని స్మరిస్తూ నదీశ్రేష్ఠమగు గంగ ఉన్న చోటికి శీఘ్రముగా వెళ్లెను (32). ఆ పతివ్రత భర్తకు అచట గోతిలోనున్న దివ్యస్వరూపిణియగు గంగను సాక్షాత్తుగా చూపించెను (33). ఆ మహర్షి అచటకు వెళ్లి కంఠము లోతు వరకు నీటితో నిండియున్న గోతిని చూచి ఈమె ధన్యురాలని పలికెను (34). ఇది నేను చేసిన తపస్సునకు ఫలమా? లేక, ఇతరుల తపఃఫలమా? అని పలికి ఆ మహర్షి అపుడామెను భక్తితో స్తుతించెను (35). అపుడా మహర్షి ఆ సుందరజలములలో చక్కగా స్నానమును ఆచమనమును చేసి మరల పలుమార్లు స్తుతించెను (36). అపుడు అనసూయ కూడ ఆ సుందరజలములలో చక్కగా స్నానమాడెను. తరువాత గొప్పవ్రతము గల అనసూయ మరియు అత్రి ఇద్దరు నిత్య కర్మను ఆచరించిరి (37). అపుడు శ్రేష్ఠనదియగు ఆ గంగ 'నేను నా ధామమునకు వెళ్లుచున్నాను' అని పలుకగా ఆ పతివ్రత ఆమెతో మరలనిట్లనెను (38),. అనసూయోవాచ | యది ప్రసన్నా దేవేశి యద్యస్తి చ కృపా మయి | త్వయీ స్థేయం నిశ్చలత్వాదస్మిన్ దేవి తపోవనే || 39 మహతాం చ స్వభావశ్చ నాంగీకృత్య పరిత్యజేత్ | ఇత్యుక్త్వా చ కరౌ బద్ధ్వా తాం తుష్టావ పునః పునః || 40 ఋషిశ్చాపి తథోవాచ త్వయా స్థేయం సరిద్వరే | సానుకూలా భవ త్వం హి సనాథాన్ దేవి నః కురు || 41 తదీయం తద్వచశ్శ్రు త్వా రమ్యా గంగా సరిద్వరా | ప్రసన్నమానసా గంగా %నసూయాం వాక్యమబ్రవీత్ || 42 అనసూయ ఇట్లు పలికెను- ఓ దేవదేవీ! నీవు నాయందు ప్రసన్నురాలవైనచో, నీకు నాపై దయ ఉన్నచో ఈ తపోవనమునందు నీవు స్థిరముగా నుండవలెను (39). మాటను ఇచ్చి తప్పకుండుట మహాత్ముల స్వభావమై యున్నది. ఇట్లు పలికి ఆమె చేతులను జోడించి పలుమార్లు స్తుతించెను (40). ''ఓ నదీరాజమా! నీవిచటనే ఉండి మాకు సౌకర్యమును కలుగజేయుము. ఓ దేవీ! మాకు రక్షణనిమ్ము'' అని ఆ ఋషి కూడ కోరెను (41). సుందర నదీరాజమగు గంగ వారి మాటలను విని ప్రసన్నమగు మనస్సు గలదై అనసూయతో నిట్లు పలికెను (42). గంగోవాచ | శంకరార్చన సంభూతఫలం వర్షస్య యచ్ఛసి | స్వామినశ్చ తదా స్థాస్యే దేవానాముపకారణాత్ || 43 తథా దానైర్న మే తుష్టిస్తీర్థస్నానైస్తథా చ వై | యజ్ఞైస్తథాథవా యోగైర్యథా పాతివ్రతేన చ || 44 పతివ్రతాం యథా దృష్ట్వా మనసః ప్రీణనం భ##వేత్ | తథా నాన్యైరుపాయైశ్చ సత్యం మే వ్యాహృతం సతి || 45 పతివ్రతాం స్త్రియం దృష్ట్వా పాపనాశో భ##వేన్మమ | శుద్ధా జాతా విశేషేణ గౌరీతుల్యా పతివ్రతా || 46 తస్మాచ్చ యది లోకస్య హితాయ తత్ర్ప యచ్ఛసి | తర్హహం స్థిరతాం యాస్యే యది కల్యాణమిచ్ఛసి || 47 గంగ ఇట్లు పలికెను- నీవు, నీ భర్త సంవత్సరకాలము శివుని అర్చించిన ఫలమును నాకు ఇచ్చినచో, అపుడు నేను దేవతల ఉపకారముకొరకై ఇచట ఉండెదను (43). పాతివ్రత్యముచే నాకు కలిగిన సంతోషము దానములచే గాని, తీర్థస్నానములచే గాని, యజ్ఞములచే గాని, లేదా యోగములచే గాని కలుగదు (44). పతివ్రతను చూచినప్పుడు మనస్సునకు కలుగు ప్రీతి ఇతరములగు ఉపాయములచే కలుగదు. ఓ పతివ్రతా! నేను సత్యమును పలికితిని (45). పతివ్రతయగు స్త్రీని చూచినచో నా పాపములు తొలగి అతిశయించిన శుద్ధి కలుగును. పతివ్రత పార్వతితో సమానము (46). కావున నీవు లోకహితమును జనుల కల్యాణమును గోరినచో, ఆ పుణ్యమును నాకు ధారపోయుము. అప్పుడు నేను ఇచట స్థిరముగానుండెదను (47). సూత ఉవాచ | ఇత్యేవం వచనం శ్రుత్వా% నసూయా సా పతివ్రతా | గంగాయై ప్రదదౌ పుణ్యం సర్వం తద్వర్షసంభవమ్ || 48 మహతాం చ స్వభావో హి పరేషాం హితమావ హేత్ | సువర్ణం చందనం చేక్షురసస్తత్ర నిదర్శనమ్ || 49 ఏతద్దృష్ట్వానసూయం తత్కర్మ పాతివ్రతం మహత్ | ప్రసన్నో%భూన్మహాదేవః పార్థివాదావిరాశు వై || 50 సూతుడు ఇట్లు పలికెను- పతివ్రతయగు ఆ అనసూయ ఆ మాటలను విని ఆ సంవత్సరము సంపాదించిన పుణ్యము నంతనూ గంగకు ఇచ్చివేసెను (48). ఇతరులకు ఉపకారమును చేయుట మహాత్ముల స్వభావమై యున్నది. బంగారము, గంధపు చెక్క మరియు చెరుకు రసము దీనికి దృష్టాంతములు (49). మహాపతివ్రతయగు అనసూయ చేసిన ఆ కర్మచే ప్రసన్నుడైన మహాదేవుడు పార్థివలింగము నుండి ఆవిర్భవించెను (50). శంభురువాచ | దృష్ట్వా తే కర్మ సాధ్వ్యేతత్ర్ప సన్నో%స్మి పతివ్రతే | వరం బ్రూహి ప్రియే మత్తో యతః ప్రియతరాసి మే || 51 అథ తౌ దంపతీం శంభుమభూతాం సుందరాకృతిమ్ | పంచవక్త్రా దిసంయుక్తం హరం ప్రేక్ష్య సువిస్మితౌ || 52 నత్వా స్తుత్వా కరౌ బద్ధ్వా మహాభక్తి సమన్వితౌ | అవోచాతాం సమభ్యర్చ్య శంకరం లోకశంకరమ్ || 53 శంభుడు ఇట్లు పలికెను- ఓ సాధ్వీ! పతివ్రతా! నీవు చేసిన ఈ పనిని గాంచి నేను ప్రసన్నుడనైతిని. నీవు నా భక్తులలో ప్రముఖురాలవు. ఓ భక్తురాలా! వరమును కోరుకొనుము (51). అపుడు ఐదు ముఖములతో అపూర్వసుందరాకృతిని కలిగియున్న ఆ పాపహరుడగు శంభుని చూచి ఆ దంపతులు మిక్కిలి విస్మయమును పొందిరి (52). లోకములకు మంగళములను కలిగించు శంకరుని వారు మహాభక్తితో గూడినవారై చేతులను జోడించి నమస్కరించి చక్కగా అర్చించి ఇట్లు పలికిరి (53). దంపతీ ఊచతుః | యది ప్రసన్నో దేవేశ ప్రసన్నా జగదంబికా | అస్మింస్తపోవనే తిష్ఠ లోకానాం సుఖదో భవ || 54 ప్రసన్నా చ తదా గంగా ప్రసన్నశ్చ శివస్తదా | ఉభౌ తౌ చ స్థితౌ తత్ర యత్రాసీదృషిసత్తమః || 55 అత్రీశ్వరశ్చ నామ్నాసీదీశ్వరః పరదుఃఖహా | గంగా సాపి స్థితా తత్ర తదా గర్తే%థ మయయా || 56 తద్దినం హి సమారభ్య తత్రాక్షయ్యజలం సదా | హస్తమాత్రే హి తద్గర్తే గంగా మందాకినీ హ్యభూత్ || 57 తత్రైవ ఋషయో దివ్యాస్సమాజగ్ముస్సహాంగనాః | తీర్థాత్తీర్థాచ్చ తే సర్వే తే పురా నిర్గతా ద్విజాః || 58 యవాశ్చ వ్రీహయశ్చైవ యజ్ఞయాగపరాయణాః | యుక్తా ఋషివరైసై#్తశ్చ హోమం చక్రుశ్చ తే జనాః || 59 కర్మభిసై#్తశ్చ సంతుష్టా వృష్టిం చక్రుర్ఘనాస్తదా | ఆనందః పరమో లోకే బభూవాతి మునీశ్వరాః || 60 అత్రీశ్వరస్య మాహాత్మ్యమిత్యుక్తం వస్సుఖావహమ్ | భుక్తిముక్తిప్రదం సర్వకామదం భక్తివర్ధనమ్ || 61 ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం అత్రీశ్వరమాహాత్మ్య వర్ణనం నామ చతుర్థో%ధ్యాయః (4) ఆ దంపతులు ఇట్లు పలికిరి- ఓ దేవదేవా! నీవు మరియు జగన్మాత ప్రసన్నురాలైనచో, ఈ తపోవనములోనుండి లోకములకు సుఖములను కలిగించుము (54). అపుడు శివుడు మరియు గంగ ఇద్దరు ప్రసన్నులై అత్రి మహర్షి ఉన్నచోటనే స్థిరముగానుండిరి (55). మహాదుఃఖములను పోగొట్టే ఆ శివునకు అత్రీశ్వరుడను పేరు కలిగెను. గంగ కూడ తన మాయాశక్తిచే ఆ గోతియందు స్థిరముగానుండెను (56). ఆ నాటినుండియు ఒక చేయి లోతు మాత్రమే గల ఆ గోతిలో స్వర్గలోకవాసినియగు గంగ సర్వకాలములయందు తరుగు లేని నీటిని కలిగి యుండెను (57). దేవర్షులు మరియు పూర్వము వివిధతీర్థములనుండి వలసపోయిన బ్రాహ్మణులు తమ కుటుంబములతో కూడి అచటకు విచ్చేసిరి (58). గోధుమలు మరియు జొన్నలు సమృద్ధిగా నుండెను. యజ్ఞయాగములయందు శ్రద్ధగల జనులు ఆ మహర్షులతో గూడి హోమములను అనుష్ఠించిరి (59). అపుడు వారి ఆ కర్మలచే మేఘములు సంతోషించి వర్షమునిచ్చినవి. ఓ మునీశ్వరులారా! లోకములో పరమానందము తాండవించెను (60). సుఖమును కలిగించునది, భుక్తిని ముక్తిని ఇచ్చునది, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునది, భక్తిని పెంపొందింప జేయునది అగు అత్రీశ్వర మాహాత్మ్యమును మీకు ఈ విధముగా చెప్పియుంటిని (61). శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు అత్రీశ్వర మాహాత్మ్య వర్ణనమనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).