Siva Maha Puranam-3    Chapters   

అథ పంచమో%ధ్యాయః

బ్రాహ్మణపత్ని కాల ధర్మమును చెందుట

సూత ఉవాచ|

కాలంజరే గిరౌ దివ్యే నీలకంఠో మహేశ్వరః | లింగరూపస్సదా చైవ భక్తానందప్రదస్సదా || 1

మహిమా తస్య దివ్యో%స్తి శ్రుతిస్మృతి ప్రకీర్తితః | తీర్థం తదాఖ్యయా తత్ర స్నానాత్పాతకనాశకృత్‌ || 2

రేవాతీరే యాని సంతి శివలింగాని సువ్రతాః | సర్వసౌఖ్యకరాణీహ తేషాం సంఖ్యా న విద్యతే || 3

సా చ రుద్రస్వరూపా హి దర్శనాత్పాపహారికా | తస్యాం స్థితాశ్చ యే కేచిత్పాషాణాశ్శివరూపిణః || 4

తథాపి చ ప్రవక్ష్యామి యథాన్యాని మునీశ్వరాః | ప్రధానశివలింగాని భుక్తిముక్తిప్రదాని చ || 5

ఆర్తేశ్వరసునామా హి వర్తతే పాపహారకః | పరమేశ్వర ఇతి ఖ్యాతస్సింహేశ్వర ఇతి స్మృతః || 6

శ##ర్మేశశ్చ తథా చాత్ర కుమారేశ్వర ఏవ చ | పుండరీకేశ్వరః ఖ్యాతో మండపేశ్వర ఏవ చ || 7

సూతుడు ఇట్లు పలికెను-

దివ్యమగు కాలంజర పర్వతమునందు నీలకంఠ మహేశ్వరుడు లింగరూపములో నున్నవాడై సర్వదా భక్తులకు ఆనందమునిచ్చుచున్నాడు (1). ఆయనయొక్క దివ్యమగు మహిమను శ్రుతులు మరియు స్మృతులు కొనియాడుచున్నవి. అదే పేరుతో అచట ప్రసిద్ధిని గాంచిన తీర్థమునందు స్నానమును చేసినచో పాపములు నశించును (2). ఓ గొప్ప నిష్ఠ గలవారా! ఇహలోకములో సర్వసౌఖ్యములనిచ్చే శివలింగములు రేవానదీతీరమునందు అనంతసంఖ్యలో గలవు (3). ఆ నది శివుని స్వరూపము. దాని దర్శనము చేతనే పాపములు నశించును. దానియందు గల పాషాణములన్నియు శివస్వరూపములే (4). ఓ మహర్షులారా! భుక్తిని ముక్తిని ఇచ్చే శివలింగములలో మరికొన్నింటిని ప్రధానమైన వాటిని గురించి చెప్పగలను (5). పాపములను పోగొట్టే ఆర్తేశ్వరుడు, పరమేశ్వరుడు, సింహేశ్వరుడు (6), శ##ర్మేశ్వరుడు, కుమారేశ్వరుడు పుండరీకేశ్వరుడు మరియు మండపేశ్వరుడు ప్రఖ్యాతిని గాంచినవారు (7).

తీక్‌ష్ణేశనామా తత్రాసీద్దర్శనాత్పాపహారకః | ధుంధేశ్వరనామాసీత్పాపహా నర్మదాతటే || 8

శూలేశ్వర ఇతి ఖ్యాతస్తథా కుంభేశ్వరస్స్మృతః | కుంబేరేశ్వరనామాపి తథా సోమేశ్వరస్స్మృతః || 9

నీలకంఠో మంగలేశో మంగలాయతనో మహాన్‌ | మహాకపీశ్వరో దేవః స్థాపితో హి హనూమతా || 10

తతశ్చ నందికో దేవో హత్యాకోటినివారకః | సర్వకామార్థదశ్చైవ మోక్షదో హి ప్రకీర్తితః || 11

నందికేశం చ యశ్చైవ పూజయేత్పరయా ముదా | నిత్యం తస్యాఖిలా సిద్ధిర్భవిష్యతి న సంశయః || 12

తత్ర తీరే చ యస్స్నాతి రేవాయాం మునిసత్తమాః | తస్య కామాశ్చ సిధ్యంతి సర్వం పాపం వినశ్యతి || 13

తీక్‌ష్ణేశ్వరుడు దర్శనముచేతనే పాపములను హరించునని ప్రసిద్ధిని గాంచినాడు. నర్మదానదీ తీరమునందు పాపములను పోగొట్టే ధుంధేశ్వరుడు గలడు (8). శూలేశ్వరుడు, కుంభేశ్వరుడు, కుబేశ్వరుడు, సోమేశ్వరుడు (9), మరియు నీలకంఠేశ్వరుడు ప్రఖ్యాతిని గాంచినారు. మంగళేశ్వరుడు గొప్ప మంగళమునకు నిధానమై యున్నాడు. మహాకపీశ్వరదేవుడు హనుమంతునిచే ప్రతిష్ఠించబడినాడు (10). నందికేశ్వరదేవుడు కోటి హత్యల పాపములను పోగొట్టుననియు, అభీష్టవస్తువులనన్నిటినీ ఇచ్చుటయే గాక మోక్షమును కూడ ఇచ్చుననియు కీర్తించబడినాడు (11). ఎవడైతే నందికేశ్వరుని నిత్యము పరమానందముతో పూజించునో, వానికి సకలసిద్ధులు కలుగుననుటలో సందేహము లేదు (12). ఓ మహర్షులారా! అచట రేవానదిలో స్నానమును చేసినవారికి పాపములన్నియు నశించి కామనలు సిద్ధించును (13).

ఋషయ ఊచుః |

ఏవం తస్య చ మాహాత్మ్యం కథం తత్ర మహామతే | నందికేశస్య కృపయా కథ్యతాం చ త్వయాధునా || 14

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ మహాబుద్ధిశాలీ! నీవు అచటి నందికేశ్వరుని మాహాత్మ్యమును దయతో ఇప్పుడు చెప్పుము (14).

సూత ఉవాచ|

సమ్యక్‌ పృష్టం భవిద్భిశ్చ కథయామి యథాశ్రుతమ్‌ | శౌనకాద్యాశ్చ మునయస్సర్వే హి శృణుతాదరాత్‌ || 15

పురా యుధిష్ఠిరేణౖవం పృష్టశ్చ ఋషిసత్తమః | యథోవాచ తథా వచ్మి భవత్స్నేహానుసారతః || 16

రేవాయాః పశ్చిమే తీరే కర్ణికీ నామ వై పురీ | విరాజతే సుశోభాఢ్యా చతుర్వర్ణసమాకులా || 17

తత్ర ద్విజవరః కశ్చిదుత్తస్య కులసంభవః | కాశ్యాం గతశ్చ పుత్రాభ్యామర్పయిత్వా స్వపత్నికామ్‌ || 18

తత్రైవ స మృతో విప్రః పుత్రాభ్యాం చ శ్రుతం తదా | తదీయం చైవ తత్కృత్యం చక్రాతే పుత్రకావుభౌ || 19

పత్నీ చ పాలయామాస పుత్రౌ పుత్రహితైషిణీ | పుత్రౌ చ వర్ధయిత్వా చ విభక్తం వై ధనం తయా || 20

స్వీయం చ రక్షితం కించిద్ధనం మరణహేతవే | తతశ్చ ద్విజపత్నీ హి కియత్కాలం మృతా చ సా || 21

కదా చిత్ర్కి యమాణా సా వివిధం పుణ్యమాచరత్‌ | న మృతా దైవయోగేన ద్విజపత్నీ చ సా ద్విజాః || 22

యదా ప్రాణాన్న ముముచే మాతా దైవాత్తయోశ్చ సా | తద్దృష్ట్వా జననీ కష్టం పుత్రకావూచతుస్తదా || 23

సూతుడు ఇట్లు పలికెను-

ఓ శౌనకాది మునులారా! మీరు చక్కగా ప్రశ్నించితిరి. నేను విన్నంతలో చెప్పెదను. మీరందరు శ్రద్ధగా వినుడు (15). పూర్వము ధర్మరాజు మహర్షిని ఇట్లు ప్రశ్నించగా ఆ మహర్షి చెప్పిన విషయమును నేను మీయందలి ప్రేమచే చెప్పుచున్నాను (16). రేవానది యొక్క పశ్చిమ తీరము నందు గొప్ప శోభాసంపద కలిగి నాల్గు వర్ణముల వారితో రద్దీగా ఉండే కర్ణికీ అని ప్రఖ్యాతి గాంచిన నగరము గలదు (17). అచట ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుడు గలడు. ఆతడు ఉత్తస్యుని కులములో జన్మించినవాడు. ఆతడు తన భార్యను కుమారులిద్దరికీ అప్పజెప్పి కాశీకి వెళ్లెను (18). ఆతడు అచటనే మృతి చెందగా పుత్రులిద్దరు ఆ వార్తను విని శ్రాద్ధాది కర్మను చేసిరి (19). పుత్రుల హితమును గోరే వారి తల్లి వారిని పాలించి పోషించెను. ఆమె వారిని పెద్దజేసిన తరువాత ఆస్తిని పంచి యిచ్చెను (20). ఆమె తాను మరణించువరకు సుఖముగా జీవించుట కొరకై కొద్ది ధనమును తన వద్ద ఉంచుకొనెను. కొద్ది రోజుల తరువాత ఆ బ్రాహ్మణ పత్ని మరణించుటకు సిద్ధముగానుండెను (21). ఓ బ్రాహ్మణులారా! ఆమె వివిధపుణ్య కర్మల నాచరించెను. కాని దైవవశముచే ఆ బ్రాహ్మణపత్ని అనాయాసముగా మరణించలేదు (22). ఆ తల్లిదైవేచ్ఛచే ప్రాణములను వీడజాలక కష్టపడుచుండగా, ఆమె కష్టమును గాంచి ఆ పుత్రులిద్దరు ఇట్లు పలికిరి (23).

పుత్రావూచతుః |

కిం న్యూనం విద్యతే మాతః కష్టం యద్విద్యతే మహత్‌ | వ్రియతాం తద్ద్రుతం ప్రీత్యా తదావాం కరవావహే || 24

పుత్రులిద్దరు ఇట్లు పలికిరి-

ఓ తల్లీ! నీకు గొప్ప కష్టము కలుగుచున్నది. నీకు ఏమి తక్కువ అయినది? నీవు వెంటనే నీ కోరికను ప్రీతితో చెప్పుము. మేము దానిని చేసెదము (24).

సూత ఉవాచ |

తచ్ఛ్రుత్వోక్తం తయా తత్ర న్యూనం మే విద్యతే బహు | తదేవ క్రియతే చేద్వై సుఖేన మరణం భ##వేత్‌ || 25

జ్యేష్ఠపుత్రశ్చ యస్తస్యాస్తేనోక్తం కథ్యతాం త్వయా | కరిష్యామి తదేతద్ధి తయా చ కథితం తదా || 26

సూతుడిట్లు పలికెను-

వారి ఆ మాటలను విని ఆమె ఇట్లు పలికెను: నాకు పెద్దలోటు గలదు. మీరు ఆ లోటును తీర్చినచో, నేను సుఖముగా మరణించెదను (25). అపుడామెతో పెద్దకుమారుడిట్లు పలికెను: నీవు చెప్పుము. నేను నీవు చెప్పిన విధముగా ఆచరించెదను. అపుడామె ఇట్లు పలికెను (26).

ద్యిజ పత్న్యువాచ |

శృణు పుత్ర వచః ప్రీత్యా పురాసీన్మే మనస్స్పృహా | కాశ్యాం గంతుం తథా నాసీ దిదానీం మ్రియతే పునః || 27

మమాస్థీని త్వయా పుత్ర క్షేపణీయాన్యతం ద్రితమ్‌ | గంగాజలే శుభం తే %ద్య భవిష్యతి న సంశయః || 28

ఆ బ్రాహ్మణ పత్ని ఇట్లు పలికెను-

ఓ కుమారా! నా మాటను ప్రీతితో వినుము. పూర్వము నా మనస్సులో కాశీకి వెళ్లవలెననే కోరిక ఉండెను. కాని అది సిద్ధించలేదు. ఇప్పుడు మృత్యువు ఆసన్నమైనది (27). ఓ పుత్రా! నీవు అశ్రద్ధ చేయకుండగా నా ఎముకలను గంగానదిలో కలుపుము. నీకు శుభము కలుగును. సంశయము లేదు (28).

సూత ఉవాచ |

ఇత్యుక్తే చ తయా మాత్రా స జ్యేష్ఠతనయో%బ్రవీత్‌ | మాతరం మాతృభక్తిస్తు సువ్రతాం మరణోన్ముఖీమ్‌ || 29

సూతుడిట్లు పలికెను-

తల్లి ఇట్లు పలుకగా, తల్లియందు భక్తి గల ఆ పెద్ద కుమారుడు మరణించుటకు సిద్ధముగా నున్న వ్రతనిష్ఠురాలైన తల్లితో నిట్లనెను (29).

పుత్ర ఉవాచ |

మాతస్త్వయా సుఖేనైవ ప్రాణాస్త్యాజ్యా న సంశయః | తవ కార్యం పురా కృత్వా పశ్చాత్కార్యం మదీయకమ్‌ || 30

ఇతి హస్తే జలం దత్త్వా యావత్పుత్రో గృహం గతః | తావత్సా చ మృతా తత్ర హరస్మరణ తత్పరా || 31

తస్యాశ్చైవ తు యత్‌ కృత్యం తత్సర్వం సం విధాయ సః | మాసికం కర్మ కృత్వా తు గమనాయ ప్రచక్రమే || 32

ద్వయోశ్శ్రేష్ఠతమో యో వై సువాదో నామ విశ్రుతః | తదస్థీని సమాదాయ నిస్సృతస్తీర్థ కామ్యయా || 33

సంగృహ్య సేవకం కంచిత్తేనైవ సహితస్తదా | ఆశ్వాస్య భార్యాపుత్రాంశ్చ మాతుః ప్రియచికీర్షయా || 34

శ్రాద్ధ దానాదికం భోజ్యం కృత్వా విధిమనుత్తమమ్‌ | మంగలస్మరణం కృత్వా నిర్జగామ గృహాద్ద్విజః || 35

తద్దినే యోజనం గత్వా వింశతి గ్రామకే శుభే | ఉవాసాస్తంగతే భానౌ గృహే విప్రస్య కస్యచిత్‌ || 36

చక్రే సంధ్యాది సత్కర్మ స ద్విజో విధిపూర్వకమ్‌ | స్తవాది కృతవాంస్తత్ర శంభోరద్భుత కర్మణః || 37

సేవకేన తదా యుక్తో బ్రాహ్మణస్సంస్థితస్తదా | యామినీ చ గతా తత్ర ముహూర్తద్వయ సంమితా || 38

ఏతస్మిన్నంతరే తత్రైకమాశ్చర్య మభూత్తదా | శృణుతాదరతస్తచ్చ మునయో వో వదామ్యహమ్‌ || 39

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం నందీకేశ్వరమాహాత్మ్యే వర్ణనం నామ పంచమో%ధ్యాయః (5)

పుత్రుడు ఇట్లు పలికెను-

తల్లీ! నీవు సుఖముగా ప్రాణములను వీడుము. సందేహము వలదు. నేను మున్ముందుగా నీ పనిని చేసి ఆ తరువాతనే నా పనిని చేసుకొనెదను (30). పుత్రుడిట్లు పలికి ఆమె చేతిలో నీటిని వదలి ఇంటికి వెళ్లులోపలనే, ఆ తల్లి శివుని స్మరణయందు తత్పురులై ప్రాణములను వీడెను (31). ఆతడు ఆమె యొక్క శ్రాద్ధకర్మలనన్నిటినీ చక్కగా నిర్వర్తించి మాసికకర్మను కూడ పూర్తిచేసి ప్రయాణమునకు సంసిద్ధుడాయెను (32). ఆ ఇద్దరు పుత్రులలో సువాదుడను పేరుతో ప్రసిద్ధిని గాంచినవాడు శ్రేష్ఠుడు. ఆతడు అస్థికలను గ్రహించి తీర్థసేవనము కొరకై బయల్వెడలెను (33). ఆతడు తల్లియొక్క కోర్కెను పూర్తి చేయుటకొరకై భార్యాపుత్రులకు నచ్చజెప్పి ఒక సేవకుని వెంట నిడుకొని బయలుదేరెను (34). ఆ బ్రాహ్మణుడు శ్రాద్ధకాలములో భోజనాదులను ఏర్పాటు చేసి, దానములను చేసి, శ్రేయోదాయకమగు ధర్మమును యథావిధిగా అనుష్ఠించి మంగళస్మరణ పూర్వకముగా ఇంటినుండి బయలుదేరెను (35). ఆనాడు ఆతడు యోజనదూరము వెళ్లి శుభకరమగు వింశతి గ్రామమును చేరి, సూర్యుడు అస్తమించిన పిదప ఒక బ్రాహ్మణుని ఇంటిలో మకాము చేసెను (36). అపుడా బ్రాహ్మణుడు సంధ్యావందనాది సత్కర్మను యథావిధిగా చేసి అద్భుతమగు లీలలను చేయు శంభుని స్తోత్రమును పఠించి పూజించెను (37). అపుడా బ్రాహ్మణుడు సేవకునితో కలిసి అచటనే ఉండెను. అపుడు రాత్రి యందు రెండు ముహూర్తముల కాలము గడిచెను (38). ఇంతలో అపుడచట ఒక అద్భుతము జరిగెను. ఓ మునులారా! దానిని మీకు చెప్పెదను. దానిని ఆదరముతో వినుడు (39).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు బ్రాహ్మణపత్నీ కాల ధర్మమును చెందుట అనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).

Siva Maha Puranam-3    Chapters