Siva Maha Puranam-3    Chapters   

శ్రీ గణశాయ నమః

శ్రీ శివ మహాపురాణము

రుద్ర సంహితా - యుద్ధఖండః

అథ అష్టాచత్వారింశోధ్యాయః

శివుడు శుక్రుని మ్రింగివేయుట

వ్యాస ఉవాచ |

శుక్రే నిగీర్ణే రుద్రేణ కిమకార్షుశ్చ దానవాః | అంధకేశా మహావీరా వద తత్త్వం మహామునే || 1

వ్యాసుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! రుద్రుడు శుక్రుని మ్రింగివేసిన తరువాత, అంధకుని అనుయాయులు మహావీరులు అగు దానవులు ఏమి చేసిరి? ఆ విషయమును నీవు చెప్పుము (1).

సనత్కుమార ఉవాచ |

కావ్యే నిగీర్ణే గిరిజేశ్వరేణ దైత్యా జయాశారహితా బభూవుః | హసై#్తర్విముక్తా ఇవ వారణంద్రా శ్శృంగైర్విహీనా ఇవ గోవృషాశ్చ|| 2

శిరోవిహీనా ఇవ దేహసంఘా ద్విజా యథా చాధ్యయనేన హీనాః |

నిరుద్యమాస్సత్త్వగణా యథా వై యథోద్యమా భాగ్యవివర్జితాశ్చ || 3

పత్యా విహీనాశ్చ యథైవ యోషా యథా విపక్షాః ఖలు మార్గణౌఘాః |

ఆయూంషి హీనాని యథైవ పుణ్యౖర్వ్రతె ర్విహీనాని యథా శ్రుతాని || 4

వినా యథా వైభవశక్తి మేకాం భవంతి హీనాస్స్వఫలైః క్రి¸°ఘాః |

యథా విశూరాః ఖలు క్షత్రియాశ్చ సత్యం వినా ధర్మగణో యథైవ || 5

నందినా చాహృతే శుక్రే గిలితే చ విషాదినా | విషాదమగమన్‌ దైత్యా యతమానరణోత్సవాః || 6

తాన్‌ వీక్ష్య విగతోత్సాహా నంధకః ప్రత్యభాషత | దైత్యాం స్తుహుండహుండాదీన్‌ మహాధీరపరాక్రమః || 7

సనత్కుమారుడిట్లు పలికెను -

పార్వతీపతి శుక్రుని మ్రింగివేయగా, రాక్షసులు విజయమునందు గల ఆశను వదులు కొనిరి. తుండములు లేని ఏనుగులు వలె, కొమ్ములు లేని గోసంతతివలె (2) శిరస్సు లేని మొండెములు వలె, వేదాధ్యయనము లేని బ్రాహ్మణులు వలె, ఉత్సాహశక్తి లేని ప్రాణి గణములువలె, భాగ్యము తోడు గాని యోజనలు వలె (3), భర్తృ విహీనలగు స్త్రీలవలె, పక్షిరెక్కల ఈకలను కట్టిన తోకలు లేని బాణ సమూహములు వలె, వ్రతాను ష్ఠానము లేని వేదములు వలె వారు నిర్వీర్యులైరి. ఎన్ని క్రియలను చేసిననూ వాటికి ధనబలము ఒక్కటి తోడుగానిచో ఆ క్రియాఫలములు ఉత్పన్నము గావు. వారి పని అట్లున్నది. వారు శౌర్యము లేని క్షత్రియులు వలె, సత్యము లేని ధర్మకార్యముల వలె నిరుత్సాహముగా నుండిరి (4,5), రాక్షసులు రణము అనే ఉత్సవము కొరకై యత్నించు చుండగా నందిచే శుక్రుడు అపహరింపబడుటను, ఆ శుక్రుని శివుడు భక్షించుటను గాంచి దుఃఖమును పొందిరి (6). ఉత్సాహము నీరు గారియున్న తుహుండహుండాది ఆ రాక్షసులను గాంచి గొప్ప ధైర్యపరాక్రమములు గల అంధకుడు వారితో నిట్లనెను (7).

అంధక ఉవాచ |

కవిం విక్రమ్య నయతా నందినా వంచితా వయమ్‌ | తనూర్వినా కృతాః ప్రాణాస్సర్వేషామద్య నో నను || 8

ధైర్యం వీర్యం గతిః కీర్తిస్సత్త్వం తేజః పరాక్రమః | యుగపన్నో హృతం సర్వమేకస్మిన్‌ భార్గవే హృతే || 9

ధిగస్మాన్‌ కులపూజ్యో యైరేకోపి కులసత్తమః | గురుస్సర్వసమర్థశ్చ త్రాతా త్రాతో న చాపది || 10

తద్యూయమవిలంబ్యేహ యుధ్యధ్వ మరిభిస్సహ | వీరైసై#్తః ప్రమథైర్వీరాస్స్మృత్వా గురుపదాంబుజమ్‌ || 11

గురోః కావ్యస్య సుఖదౌ స్మృత్వా చరణపంకజౌ | సూదయిష్యామ్యహం సర్వాన్‌ ప్రమథాన్‌ సహ నందినా || 12

అద్యైతాన్‌ వివశాన్‌ హత్వా సహ దేవైస్సవాసవైః | భార్గవం మోచయిష్యామి జీవం యోగీవ కర్మతః || 13

స చాపి యోగీ యోగేన యది నామ స్వయం ప్రభుః | శరీరాత్తస్య నిర్గచ్ఛే దస్మాకం శేషపాలితా || 14

అంధకుడిట్లు పలికెను -

నంది తన పరాక్రమముతో శుక్రుని అపహరించి మనలను మోసగించినాడు. ఈనాడు మన అందరి దేహములనుండి ప్రాణములు ఎగిరి పోయిన వనుట నిశ్చయము (8). ఒకే ఒక శుక్రుని అపహరించుటచే మన ధైర్య, పరాక్రమ, శక్తి, ఫల, కీర్తి, బల, తేజస్సులను ఒక్కమారుగా అపహరించినట్లైనది (9). కులములో శ్రేష్ఠుడు, కులమునకు పూజనీయుడు, గురువు, సర్వవిధములుగా సమర్థుడు, రక్షకుడు అగు ఒక్క వ్యక్తిని ఆపదలో రక్షించలేకపోయిన మనము నిందార్హులము (10). ఓ వీరులారా! కావున మీరు గురువుయొక్క పాదపద్మములను స్మరించి విలంబము లేకుండగా వీరులు, శత్రువులు అగు ఆ ప్రమథులతో యుద్ధమును చేయుడు (11). శుక్రాచార్యుని సుఖకరములగు పాదపద్మములను స్మరించి నేను నందితో సహా ప్రమథులనందరినీ సంహరించెదను (12). ఈనాడు ఇంద్రాది దేవతలతో కూడి యున్న వీరిని నిర్వీర్యులను చేసి సంహరించి, యోగి జీవుని కర్మ బంధమునుండి తప్పించు విధంబున, శుక్రుని విడిపించెదను (13). యోగి, సమర్థుడు అగు ఆ శుక్రుడు యోగశక్తిచే ఆయన శరీరమునుండి స్వయముగా బయట పడినచో, మిగిలియున్న మనమందరము రక్షింపబడెదము (14).

సనత్కుమార ఉవాచ |

ఇత్యంధకవచశ్శ్రుత్వా దానవా మేఘనిస్స్వనాః | ప్రమథాన్‌ నిర్దయాః ప్రాహుర్మర్తవ్యే కృతనిశ్చయాః || 15

సత్యాయుషి న నో జాతు శక్తాస్స్యుః ప్రమథా బలాత్‌ | అసత్యాయుషి కిం గత్వా త్యక్త్వా స్వామిన మాహవే || 16

యే స్వామినం విహాయాతో బహుమానధనా జనాః | యాంతి తే యాంతి నియతమంధ తామిస్ర మాలయమ్‌ || 17

అయశస్తమసా ఖ్యాతిం మలినీకృత్య భూరిశః | ఇహాముత్రాపి సుఖినో న స్యుర్భగ్నా రణాజిరే || 18

కిందానైః కిం తపోభిశ్చ కిం తీర్థపరిమజ్జనైః | ధారాతీర్థే యది స్నానం పునర్భ వ మలాపహే || 19

సంప్రధార్యేతి తద్వాక్యం దైత్యాస్తే దనుజాస్తథా | మమంథుః ప్రమథానాజౌ రణభేరీం నినాద్య చ || 20

తత్ర బాణాసి వజ్రౌఘైః కఠినైశ్చ శిలామయైః | భుశుండి భిందిపాలైశ్చ శక్తి భల్ల పరశ్వధైః || 21

ఖట్వాంగైః పట్టిశై శ్శూలైర్ల కుటైర్ము సలైరలమ్‌ | పరస్పరమభిఘ్నంతః ప్రచక్రుః కదనం మహత్‌ || 22

సనత్కుమారుడిట్లు పలికెను -

అంధకుని ఈ మాటలను విని మరణించుటకు నిశ్చయించుకున్న దయావిహీనులగు ఆ రాక్షసులు ప్రమథులనుద్దేశించి మేఘగంభీరధ్వనితో నిట్లనిరి (15). ఆయుర్దాయమున్నచో మమ్ములను ప్రమథులు ఎన్నటికైననూ బలముతో జయింపజాలరు. ఆయుర్దాయము లేనిచో ప్రభువును యుద్ధరంగములో విడిచి వెళ్లిననూ, ప్రయోజనమేమి గలదు? (16) ఎవరైతే మానమదర్యాదలు, ధనము అధికమని తలంచి ప్రభువుని విడిచిపెట్టి యుద్ధరంగమునుండి నిర్గమించెదరో, వారు నిశ్చితముగా అంధతామిస్రమనే నరకలోకమును పొందెదరు (17). అపకీర్తి యను చీకటిచే కీర్తిని అధికముగా మలినము గావించి వారు ఇహపరలోకములలో సుఖమునైననూ పొందజాలరు. రణరంగములో మరణించుటయే మేలు (18). పునర్జన్మ దోషమును పోగొట్టే ఖడ్గధారయను తీర్థములో స్నానమును చేసినవానికి దానములతోగాని, తపస్సులతో గాని, తీర్థస్నానములతో గాని పని యేమున్నది? (19) ఆ దైత్య దానవులు అంధకుని వచనములను మనస్సులో స్థిరముగా నుంచుకొని రణభేరిని మ్రోగించి యుద్ధములో ప్రమథులను దునుమాడ జొచ్చిరి (20). అచట వారు బాణములు, కత్తులు, వజ్రముల సమూహములతో, కఠిన పాషాణములతో, భుశుండి భింది పాలములతో, శక్తి, బల్లెము, గొడ్డలి అను ఆయుధములతో (21), ఖట్వాంగములతో, పట్టిసములతో, శూలములతో లకుటములతో, రోకళ్లతో ఒకరినొకరు గట్టిగా కొడుతూ గొప్ప యుద్ధమును చేసిరి (22).

కార్ముకాణాం వికృష్టానాం పతతాం చ పతత్త్రిణామ్‌ | భిందిపాలభుశుండీనాం క్ష్వేడితానాం రవోభవత్‌ || 23

రణతూర్య నినాదైశ్చ గజానాం బహుబృంహితైః | హేషారవైర్హయానాం చ మహాన్‌ కోలాహలోభవత్‌ || 24

అస్తి స్వనైరవాపూరి ద్యావాభూమ్యోర్యదంతరమ్‌ | అభీరూణాం చ భీరూణాం మహారోమోద్గమోభవత్‌ || 25

గజవాజి ª«sV¥¦¦¦LSª«s xqsVöéÈÁ aRP‡ôÁ úgRi¥¦¦¦ßÓá ¿RÁ e ˳ÏÁgRiõµ³R…*ÇÁ xms»yNS¬s OUPQßáúxmsx¤¦¦¦LRißجs ¿RÁ ee 26

రుధిరోద్గారచిత్రాణి వ్యశ్వహస్తిరథాని చ | పిపాసితాని సైన్యాని ముమూర్ఛు రుభయత్రవై || 27

అథ తే ప్రమథా వీరా నంది ప్రభృతయస్తదా | బలేన జఘ్నురసురాన్‌ సర్వాన్‌ ప్రాపుర్జయం మునే || 28

దృష్ట్వా సైన్యం చ ప్రమథైర్భజ్యమానమితస్తతః | దుద్రావ రథమాస్థాయ స్వయమేవాంధకో గణాన్‌ || 29

శరావార ప్రయుక్తైసై#్తర్వజ్రపాతైర్నగా ఇవ | ప్రమథా నేశిరే చాసై#్త్రర్నిస్తోయా ఇవ తోయదాః || 30

యాంత మాయాంత మాలోక్య దూరస్థం నికటస్థితమ్‌ | ప్రత్యేకం రోమ సంఖ్యాభిర్వివ్యాధేషుభిరంధకః || 31

ధనస్సుల నారిత్రాటిని లాగి ఎక్కు పెట్టుటలో, బాణములు పడుటలో, భిందిపాలభుశుండుల ప్రయోగములలో పుట్టిన శబ్దమునకు సింహనాదముల శబ్దము తోడగుచుండెను (23). యుద్ధవాద్యముల ధ్వనులు, నినాదములు, ఏనుగుల అతిశయించిన ఘీంకారములు, గుర్రముల సకిలింపు ధ్వనులు కలిసి పెద్ద కోలాహలము చెలరేగెను (24). భూమ్యాకాశముల మధ్యభాగము వివిధశబ్దములతో నిండియుండెను. భీరువులకు మరియు ధైర్యవంతులకు కూడ సమానముగా అధికమగు రోమాంచము కలిగెను (25). ఏనుగులు, గుర్రముల పెద్ద ధ్వనులచే సైనికుల కర్ణభేరులు పగులు చుండెను. ధ్వజములు పతాకములు విరిగి యుండెను. ఆయుధములు క్షీణించెను (26). రెండు పక్షముల సైన్యములలోని సైనికులు, గుర్రములు, ఏనుగులు వివిధ పద్ధతులలో రక్తమును గ్రక్కుచుండిరి. గుర్రములు, ఏనుగులు మరియు రథముల సంఖ్య క్షీణించెను. సైనికులు దాహముతో మూర్ఛిల్లుచుండిరి (27). ఓ మునీ! అపుడు నంది మొదలగు ప్రమథ వీరులు బలముగా రాక్షసులనందరినీ సంహరించి జయమును పొందిరి (28). తన సైన్యము ప్రమథుల దెబ్బలకు తాళ##లేక చెల్లాచెదరగుటను గాంచి అంధకుడు స్వయముగా రథమునెక్కి గణములను తరుమ జొచ్చెను (29). వజ్రపు దెబ్బలకు పర్వతములు వలె, అతడు ప్రయోగించిన శస్త్రాస్త్ర పరంపరలకు ప్రమథులు తట్టుకొనజాలక, నీరులేని మేఘములు వలె నిర్వీర్యులైరి (30). అంధకుడు తనకు వ్యతిరేకదిశలో వెళ్ళుచున్న వానిని, అభిముఖముగా వచ్చుచున్న వానిని, దూరముగా నున్నవానిని, దగ్గరలో నున్న వానిని గాంచి ప్రతి ఒక్కనిని ఒక్కొక్క రోమమునకు ఒక్కొక్కటి చొప్పున బాణములతో కొట్టెను (31).

దృష్ట్వా సైన్యం భజ్యమాన మంధకేన బలీయసా | స్కందో వినాయకో నందీ సోమ నంద్యాదయః పరే || 32

ప్రమథాః ప్రబలా వీరా శ్శంకరస్య గణా నిజాః | చుక్రుధుస్సమరం చక్రుర్విచిత్రం చ మహాబలాః || 33

వినాయకేన స్కందేన నందినా సోమనందినా | వీరేణ నైగమేయేన వైశాఖేన బలీయసా || 34

ఇత్యాద్యైస్తు గణౖరుగ్రై రంధకోప్యంధకీకృతః | త్రిశూలశక్తిబాణౌఘధారా సంపాతపాతిభిః || 35

తతః కోలాహలో జాతః ప్రమథాసురసైన్యయోః | తేన శ##బ్దేన మహతా శుక్రశ్శంభూదరే స్థితః || 36

ఛిద్రాన్వేషీ భ్రమన్‌ సోథ వినికేతో యథానిలః | సప్తలోకాన్‌ సపాతాలాన్‌ రుద్రదేహే వ్యలోకయత్‌ || 37

బ్రహ్మనారాయణంద్రాణాం సాదిత్యాప్సరసాం తథా | భువనాని విచిత్రాణి యుద్ధం చ ప్రమథాసురమ్‌ || 38

స వర్షణాం శతం కుక్షౌ భవస్య పరితో భ్రమన్‌ | న తస్య దదృశే రంధ్రం శుచే రంధ్రం ఖలో యథా || 39

శాంభ##వేనాథ యోగేన శుక్రరూపేణ భార్గవః | ఇమం మంత్రవరం జప్త్యా శంభోర్జఠరపంజరాత్‌ || 40

నిష్క్రాంతం లింగమార్గేణ ప్రణనామ తతశ్శివమ్‌ | గౌర్యా గృహీతః పుత్రార్థం తదా విఘ్నేశ్వరీకృతః || 41

అథ కావ్యం వినిష్ర్కాంతం శుక్రమార్గేణ భార్గవమ్‌ | దృష్ట్వోవాచ మహేశానో విహస్య కరుణానిధిః || 42

బలవంతుడగు అంధకుడు సైన్యమును వినాశముచేయుచుండుటను గాంచి కుమారస్వామి, వినాయకుడు, నంది, సోమనంది మొదలగు మహాబలశాలురైన వీరులు, శంకరుని స్వీయగణములగు ఇతర ప్రమథులు కోపించి విచిత్రమగు యుద్ధమును చేసిరి (32,33). వినాయకుడు, స్కందుడు, నంది, సోమనంది, వీరుడగు నైగమేయుడు, బలవంతుడగు వైశాఖుడు, మరియు భయంకరులగు ఇతర గణములు త్రిశూల శక్తి, బాణసమూహములను ధారాపాతముగా కురిపించి అంధకుని అంధుని చేసిరి (34, 35). అపుడు ప్రమథ, రాక్షస సేనల మధ్య పెద్ద కోలాహలము బయలుదేరెను. ఆ పెద్ద శబ్దమును విని, శంభుని ఉదరమునందున్న శుక్రుడు ఒక స్థిరమగు స్థానము లేని గాలివలె మార్గమును వెదుకుతూ తిరుగాడెను. అపుడాతడు శంభుని ఉదరములో ఏడు ఊర్ధ్వలోకములను, ఏడు అధోలోకములను గాంచెను (36, 37). మరియు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, ఆదిత్యులు, అప్సరసలు, చిత్రములగు భువనములు మరియు ప్రమథాసురయుద్ధము అతనికి కానవచ్చెను (38). పుణ్యాత్మునిలో దుష్టునకు వెదికిననూ దోషము కానరాదు. అటులనే, అతడు శివుని ఉదరములో సర్వత్రా తిరుగుతూ వంద సంవత్సరములు గడిపిననూ, బయట పడే మార్గము కానరాలేదు (39). అపుడా భార్గవుడు శాంభవయోగముచే శుక్రరూపమును పొంది ఈ శ్రేష్ఠమంత్రమును జపిస్తూ శంభుని ఉదరమనే కారాగారమునుండి (40) లింగమార్గము గుండా బయట పడి, తరువాత శివునకు ప్రణమిల్లెను. పార్వతి అపుడాతని తన పుత్రునిగా స్వీకరించి విఘ్నేశ్వరునితో సమమగు గణాధ్యక్షపదవి నొసంగెను (41). అపుడు శుక్రమార్గము గుండా బయటపడిన శుక్రాచార్యుని గాంచి కరుణాసముద్రుడగు మహేశ్వరుడు నవ్వి ఇట్లు పలికెను (42).

మహేశ ఉవాచ |

శుక్రవన్నిస్సృతో యస్మాల్లింగాన్మే భృగునందన | కర్మణా తేన శుక్రస్త్వం మమ పుత్రోసి గమ్యతామ్‌ || 43

మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ భృగుపుత్రా! నా లింగమునుండి నీవు శుక్రమువలె నిర్గమించితివి. అందువలన, నీవు శుక్రుడవు. నీవు నా పుత్రుడవు. పొమ్ము (43).

సనత్కుమార ఉవాచ |

ఇత్యేవముక్తో దేవేన శుక్రోర్క సదృశద్యుతిః | ప్రణనామ శివం భూయస్తుష్టా వ విహితాంజలిః || 44

సనత్కుమారుడిట్లు పలికెను -

సూర్యునితో సమముగా వెలిగిపోవుచున్న శుక్రుడు శివునిచే ఇట్లు పలుకబడినవాడై, చేతులు జోడించి ఆ దేవునకు పలుమార్లు నమస్కరించి స్తుతించెను (44).

శుక్ర ఉవాచ |

అనంత పాదస్త్వమనంతమూర్తి రనంత మూర్ధాంతకరశ్శివశ్చ |

అనంతబాహుః కథమీదృశం త్వాం స్తోష్యే హ నుత్యం ప్రణిపత్య మూర్ధ్నా || 45

త్వమష్టమూర్తి స్త్వమనంతమూర్తిస్త్వమిష్టదస్సర్వసురాసురాణామ్‌ |

అనిష్టదృష్టశ్చ విమర్దకశ్చ స్తోష్యే హ నుత్యం కథ మీదృశం త్వామ్‌ || 46

శుక్రుడిట్లు పలికెను -

నీకు అనంత సంఖ్యలో పాదములు, రూపములు, బాహువులు గలవు. నీవు సంహారకారకుడవగు శివుడవు. పొగడ దగిన ఇట్టి నిన్ను నేను ఎట్లు పొగడగలను? శిరసు వంచి నమస్కరించుచున్నాను (45). నీవు ఎనిమిది రూపములలో జగత్తును వ్యాపించి యున్నావు. జగత్తులోని రూపములన్నియూ నీవే. దేవతలకు రాక్షసులకు అందరికీ కోర్కెల నీడేర్చేవాడవు నీవే. ఆపదలయందు కనబడువాడవు, సంహారకుడవు నీవే. ఇట్టి స్తుతింపదగిన నిన్ను నేను ఎట్లు స్తుతించగలను? (46).

సనత్కుమార ఉవాచ |

ఇతి స్తుత్వా శివం శుక్రః పునర్నత్వా శివాజ్ఞయా | వివేశ దానవానీకం మేఘమాలాం యథా శశీ || 47

నిగీర్ణనమితి ప్రోక్తం శంకరేణ కవే రణ | శృణు మంత్రం చ తం జప్తో యశ్శంభోః కవినోదరే || 48

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే శుక్రనిగీర్ణనం నామ అష్టాచత్వారింశోధ్యాయః (48)

సనత్కుమారుడిట్లు పలికెను -

శుక్రుడు ఇట్లు శివుని స్తుతించి మరల నమస్కరించి శివుని యాజ్ఞచే, చంద్రుడు మేఘపంక్తిలోనికి వలె, దానవసైన్యములోనికి ప్రవేశించెను (47). ఈ తీరున యుద్ధము జరిగిన సమయములో శంకరుడు శుక్రుని మ్రింగిన వృత్తాంతము చెప్పబడినది. శుక్రుడు శివుని ఉదరములోనున్న వాడై జపించిన శివమంత్రమును ఇపుడు వినుము (48).

శ్రీశివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శివుడు శుక్రుని మ్రింగివేయుట అనే నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48).

Siva Maha Puranam-3    Chapters