Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకోనపంచాశత్తమోధ్యాయః

అంధకునకు గణాధ్యక్షపదవి లభించుట

సనత్కుమార ఉవాచ |

ఓం నమస్తే దేవేశాయ సురాసురనమస్కృతాయ భూతభవ్యమహా దేవాయ హరితపింగలలోచనాయ బలాయ బుద్ధిరూపిణవైయాఘ్రవసనచ్ఛదాయారణయాయ త్రైలోక్యప్రభ##వే ఈశ్వరాయ హరాయ హరితనేత్రాయ యుగాంతకరణాయానలాయ గణశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదంష్ట్రిణ కాలాయ మహేశ్వరాయ అవ్యయాయ కాలరూపిణ నీలగ్రీవాయ మహోదరాయ గణాధ్యక్షాయ సర్వాత్మనే సర్వభావనాయ సర్వగాయ మృత్యుహంత్రే పారియాత్ర సువ్రతాయ బ్రహ్మచారిణ వేదాంతగాయ తపోంతగాయ పశుపతయే వ్యంగాయ శూలపాణయే వృషకేతవే హరయే జటినే శిఖండినే లకుటినే మహాయశ##సేభూతేశ్వరాయ గుహావాసినే వీణా పణవతాలవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్యనిభాయ శ్మశానవాసినే భగవతే ఉమా పతయే అరిందమాయ భగస్యాక్షిపాతినే పూష్ణోదశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తాయ ప్రలయకాలాయ ఉల్కాముఖాయాగ్ని కేతవే మునయే దీప్తాయ విశాంపతయే ఉన్నతయే జనకాయ చతుర్థకాయ లోకసత్తమాయ వామదేవాయ వాగ్దాక్షిణ్యాయ వామతో భిక్షవే భిక్షురూపిణ జటినే స్వయం జటిలాయ శక్రహస్త ప్రతిస్తంభకాయ క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావినే మధుకరాయ చలాయ వానస్పత్యాయ వాజసనేతి సమాశ్రమ పూజితాయ జగద్ధాత్రే జగత్కర్త్రే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ ధర్మాధ్యక్షాయ త్రివర్త్మనే భూతభావనాయ త్రినేత్రాయ బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ దేవాయ సర్వతూర్యనినాదినే సర్వబాధా విమోచనాయ బంధనాయ సర్వధారిణ ధర్మోత్తమాయ పుష్పదంతాయావి భాగాయ ముఖ్యాయ సర్వహరాయ హిరణ్యశ్రవసే ద్వారిణ భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో నమః || 1

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓం దేవదేవుడు, దేవతలచే, రాక్షసులచే నమస్కరింపబడువాడు, భూత భవిష్యత్కాలములలోని ప్రాణులకు గొప్ప దైవము, పచ్చని మరియు తేనెరంగు గల కన్నులు గలవాడు, బలశాలి, బుద్ధిస్వరూపుడు, వ్యాఘ్రచర్మమే ఉత్తరీయముగా గలవాడు, అరణినుండి పుట్టిన యజ్ఞాగ్నియే స్వరూపముగా గలవాడు, ముల్లోకములకు ప్రభువు, ఈశ్వరుడు, పాపహారి, పచ్చని కన్నులు గలవాడు, ప్రళయకాలాగ్ని స్వరూపుడు, గణాధ్యక్షుడు, లోకములను పాలించువాడు, గొప్ప భుజములు చేతులు గలవాడు, శూలధారి, గొప్ప దంష్ట్రలు గలవాడు, మృత్యుస్వరూపుడు, మహేశ్వరుడు, వినాశము లేనివాడు, నల్లని కంఠము గలవాడు, గొప్ప ఉదరము గలవాడు, సర్వస్వరూపుడు, సర్వకారణుడు, సర్వవ్యాపి, మృత్యుంజయుడు, పారియాత్ర పర్వతముపై గొప్ప తపస్సును చేసినవాడు, బ్రహ్మచారి, వేదాంత ప్రతిపాద్యుడు, తపస్సు యొక్క అవధులను దాటిన వాడు, జీవులకు పాలకుడు, నిరవయవుడు, వృషభము ధ్వజమునందు గలవాడు, జటాధారి, జుట్టుముడి గలవాడు, దండధారి, గొప్ప కీర్తి గలవాడు, భూతపతి, గుహయందు ఉండువాడు, వీణపై మృదంగముపై తాళములను పలికించువాడు, అవినాశి, సుందరాకారుడు, బాలసూర్యుని వలె ప్రకాశించువాడు, శ్మశానమునందు నివసించు వాడు, భగవాన్‌ పార్వతీపతి, శత్రుసంహారకుడు, భగుని కన్నులను పూష దంతములను బెరికిన వాడు, దుష్టసంహారకుడు, పాశధారి, ప్రలయకాల మృత్యుస్వరూపుడు, ఉల్క నోటియందు గలవాడు, అగ్నియే ధ్వజముగా గలవాడు, మననశీలి, ప్రకాశస్వరూపుడు, మానవులకు ప్రభువు, ఎత్తైన దేహము గలవాడు, తండ్రి, త్రిమూర్తుల కతీతుడు, భువనములలో సర్వశ్రేష్ఠుడు, వామదేవుడు, వక్తలలో శ్రేష్ఠుడు, భిక్షురూపధారియై వామార్ధమునందున్న అన్నపూర్ణనుండి భిక్షను గోరువాడు, తెలియ శక్యము కాని స్వరూపము గలవాడు, ఇంద్రుని చేతులను స్తంభింప జేసినవాడు, యజ్ఞస్వరూపుడు, యజమానస్వరూపుడు, మృత్యుస్వరూపుడు, జ్ఞాననిధి, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమస్వరూపుడు, సర్వాశ్రమముల వారిచే వాజసన నామముతో పూజింపబడువాడు, జగత్తును సృష్టించి పోషించే శాశ్వత కూటస్థ పరబ్రహ్మ స్వరూపుడు, ధర్మమునకు అధ్యక్షుడు, ఉత్తర-దక్షిణ-అధో మార్గములు గలవాడు, ప్రాణులను సృష్టించువాడు, ముక్కంటి, అనేక రూపుడు, పదివేల సూర్యులతో సమమగు తేజస్సు గలవాడు, ప్రకాశస్వరూపుడు, సర్వవాద్యముల ధ్వనులు గలవాడు, బాధలనన్నింటి నుండియు విముక్తిని కలిగించువాడు, సంసారములో బంధించువాడు, ఉత్తమమగు ధర్మస్వరూపుడు, పుష్పదంతస్వరూపుడు, ద్వైతవర్జితుడు, త్రిమూర్తులలో ముఖ్యుడు, సర్వమును హరించువాడు, బంగరు వర్ణముగల చెవులు గలవాడు, ద్వారదేవతారూపుడు, భయంకరుడు, భయంకరమగు పరాక్రమము గలవాడు, ఓంకారస్వరూపుడు అగు శివునకు అనేక వందనములు (1).

ఇమం మంత్రవరం జప్త్వా శుక్రో జఠరపంజరాత్‌ | నిష్క్రాంతో లింగమార్గేణ శంభోశ్శుక్రమివోత్కటమ్‌ || 2

గౌర్యా గృహీతః పుత్రార్థం విశ్వేశేన తతః కృతః | అజరశ్చామరశ్శ్రీమాన్‌ ద్వితీయ ఇవ శంకరః || 3

త్రిభిర్వర్ష సహసై#్రస్తు సమతీతైర్మ హీతలే | మహేశ్వరాత్పునర్జాత శ్శుక్రో వేదనిధిర్మునిః || 4

దదర్శ శూలే సంశుష్కం ధ్యాయంతం పరమేశ్వరమ్‌ | అంధకం ధైర్యసంయుక్తం దానవేశం తపస్వినవ్‌ || 5

మహాదేవం విరూపాక్షం చంద్రార్ధ కృతశేఖరమ్‌ | అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినమ్‌ || 6

వృషభాక్షం మహా జ్ఞేయం పురుషం సర్వకామదమ్‌ | కామారిం కామదహనం కామరూపం కపర్దినమ్‌ || 7

విరూపం గిరిశం భీమం స్రగ్విణం రక్త వాసనమ్‌ | యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినమ్‌ || 8

శుక్రుడు ఈ గొప్ప మంత్రమును జపించి శివుని ఉదరము అనే పంజరమునుండి లింగమార్గము గుండా ఉత్కటమగు శుక్రమువలె నిష్క్రమించెను (2). పార్వతి ఆయనను పుత్రునిగా స్వీకరించగా, విశ్వేశ్వరుడు తరువాత ఆయనను రెండవ శంకరుని వలె జరామరణములు లేనివాడై శోభిల్లునట్లు చేసెను (3). భూలోకములో మూడు వేల సంవత్సరముల కాలము గడిచిన తరువాత వేదనిధియగు శుక్రమహర్షి శివునినుండి మరల జన్మించెను (4). శూలముపై ఎండిపోయిననూ ధైర్యముతో తపస్సును చేయుచున్న రాక్షసరాజగు అంధకుని ఆయన గాంచెను. ఆతడు పరమేశ్వరుని ధ్యానించు చుండెను. (5) మహాదేవుడు, బేసి కన్నులవాడు, చంద్రవంకతో ప్రకాశించే శిరస్సు గలవాడు, అమృత స్వరూపుడు, నిత్యుడు, కూటస్థుడు, నల్లని కంఠము గలవాడు, పినాకధారి (6), వృషభముయొక్క కన్నులు వంటి కన్నులు గలవాడు, జ్ఞేయబ్రహ్మ రూపుడు, చేతనుడు, కోర్కెలనన్నిటినీ తీర్చు వాడు, కాముని దహించి సంహరించిన వాడు, యథేచ్ఛారూపము గలవాడు, జటాధారి (7), వికృతరూపుడు, కైలాసవాసి, భయంకరుడు, మాలను ధరించినవాడు, ఎర్రని వస్త్రములు గలవాడు, యోగి, కాలాంతకుడు, త్రిపురారి, కపాల ధారియగు శివుని ఆతడు ధ్యానించెను (8).

గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరమ్‌ | అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్య దాయకమ్‌ || 9

వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలం పటుమ్‌ | మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరమ్‌ || 10

త్రైలోక్యద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనమ్‌ | కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాససమ్‌ || 11

గజకృత్తి పరీధానం క్షుబ్ధం భుజగభూషణమ్‌ | దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితమ్‌ || 12

అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిమ్‌ | భస్మాంగం జటిలం శుద్ధం భేరుండశతసేవితమ్‌ || 13

భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగమ్‌ | క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియమ్‌ || 14

చండం తుంగం గరుత్మంతం నిత్యమాసవభోజనమ్‌ | లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరమ్‌ || 15

మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినమ్‌ | రాగం విరాగం రాగాంధం వీతారాగశతార్చితమ్‌ || 16

సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజమ్‌ | సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకమ్‌ || 17

అర్ధనారీశ్వరం భానుం భాను కోటీశతప్రభమ్‌ | యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివమ్‌ || 18

అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః | శివస్య దానవో ధ్యాయన్‌ ముక్తస్తస్మాన్మహా భయాత్‌ || 19

దివ్యేనామృతవర్షేణ సోభిషిక్తః కపర్దినా | తుష్టేనమోచితం తస్మా చ్ఛూలాగ్రా దవరోపితః || 20

ఉక్తశ్చాథ మహాదైత్యో మహేశానేన సోeÅôంధకః | అసురస్సాంత్వపూర్వం యత్‌ కృతం సర్వం మహాత్మనా || 21

రహస్యమగు వ్రతము మరియు మంత్రము గలవాడు, గంభీరమైన వాడు, మనస్సులో సాక్షాత్కరించువాడు, అణిమ మొదలగు అష్టసిద్ధులకు ఆధారమైన వాడు, ముల్లోకములకు ఐశ్వర్యము నిచ్చువాడు (9). వీరుడు, శత్రు వీరులను సంహరించువాడు, భయంకరాకారుడు, వికృతరూపుడు, బలిసి యున్నవాడు, సమర్థుడు, మాంసభక్షకుడు ఉన్మత్తునివలె నున్నవాడు అగు భైరవుడు, మహేశ్వరుడు (10), ముల్లోకములను సంహరించువాడు, లోభి, కిరాతుడు, యజ్ఞనాశకుడు, కార్తికేయునితో గూడి యున్నవాడు, ఉన్మత్తుడు, చర్మమే వస్త్రముగా గలవాడు (11), గజ చర్మ ఉత్తరీయముగా గలవాడు, క్షోభను పొంది సృష్టిని చేయువాడు, పాములే ఆభరణములుగా గలవాడు, సహకారము నిచ్చువాడు, వేతాళుడు, శాకినిచే పూజింపబడే భయంకరమగు ఆకారము గలవాడు (12), సౌమ్యరూపుడు, భయంకరులగు రాక్షసులను సంహరించువాడు, భయంకరమగు సింహనాదమును చేయువాడు, వృక్షములో నుండువాడు, భస్మను ధరించువాడు, జటాధారి, నిత్యశుద్ధుడు, అనేక భేరుండములచే సేవింపబడు వాడు (13), భూతములకు ప్రభువు, ప్రాణులకు తండ్రి, పంచభూతములకు కారణమైనవాడు, ఆకాశరూపుడు, కోపించి హానిని కలిగించే భయంకరుడు, చండీ దేవికి ప్రియుడగు భర్త (14), ఉన్నతమైన వాడు, గరుత్ముంతుని రూపములో నున్నవాడు, నిత్యము అమృతమే భోజనముగా గలవాడు, ముల్లోకములను అవలీలగా సంహరించే మహారుద్రస్వరూపుడు, మృత్యు రూపుడు, మృత్యువునకు అతీతుడు (15), మృత్యువునకు మృత్యువు, మహాసేనానాయకుడు, శ్మశానమునందు అరణ్యమునందు నివసించువాడు, రాగము గలవాడు, విరాగి, రాగముచే వివేకమును గోల్పోయినట్లు కన్పట్టువాడు, అనేకులగు వైరాగ్యసంపన్నులైన జ్ఞానులచే అర్చింపబడువాడు (16), సత్త్వరజస్తమోగుణములకు ధర్మాధర్మములకు అధిష్ఠానమైనవాడు, ఇంద్రుని తమ్ముడు (విష్ణువు), సత్య-అసత్యములకు సత్‌ (కార్య) - అసత్‌ (కారణ)లకు అధిష్ఠానమైన వాడు, జన్మ లేనివాడు (17), అర్ధనారీశ్వరుడు, సూర్యుడు, వందకోటి సూర్యుల కాంతి గలవాడు, యజ్ఞరూపుడు, యజమాన రూపుడు, రుద్రుడు ఈశానుడు, వరములనిచ్చువాడు, మంగళకరుడు (18) అగు పరమాత్మ యొక్క నూట ఎనిమిది రూపములను ధ్యానించి ఆ రాక్షసుడు ఆ మహాభయమునుండి విముక్తుడయ్యెను (19). అపుడు జటాజూట ధారియగు శివుడు సంతసించి శూలాగ్రమునుండి క్రిందకు దింపి విముక్తుని చేసి దివ్యమగు ఆమృత వర్షముతో ఆతనిని అభిషేకించెను (20). మహాత్ముడగు అంధకుడు పూర్వములో చేసిన పనులన్నిటినీ విస్మరించి మహేశ్వరుడు అనునయ పూర్వకముగా ఆ మహారాక్షసునితో నిట్లనెను (21).

ఈశ్వర ఉవాచ |

భో భో దైత్యేంద్ర తుష్టోస్మి దమేన నియమేన చ | శౌర్యేణ తవ ధైర్యేణ వరం వరయ సువ్రత || 22

ఆరాధితస్త్వయా నిత్యం సర్వనిర్ధూత కల్మషః | వరదోహం వరార్హస్త్వం మహాదైత్యేంద్ర సత్తమ || 23

ప్రాణసంధారణా దస్తి యచ్చ పుణ్యఫలం తవ | త్రిభిర్వర్ష సహసై#్రస్తు తేనాస్తు తవ నిర్వృతిః || 24

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓయీ! రాక్షసరాజా! నీ ఇంద్రియనిగ్రహమునకు, నియమపాలనకు, ధైర్యశౌర్యములకు సంతసించితిని. ఓయీ గొప్పవ్రతము గలవాడా! వరమును కోరుకొనుము (22). ఓ మహారాక్షసశ్రేష్ఠా! నీ సమస్తదోషములు తొలగిపోయినవి. వరములకు యోగ్యుడవగు నీవు వరదుడనగు నన్ను నిత్యము ఆరాధించితివి (23). నీవు మూడు వేల సంవత్సరములు ప్రాణములను (శూలముపై) ధరించి యుండుటచే ఏ పుణ్యము లభించినదో, దాని వలన నీకు సుఖము కలుగు గాక! (24)

సనత్కుమార ఉవాచ |

ఏతచ్ఛ్రుత్వాంధకః ప్రాహ వేపమానః కృతాంజలిః | భూమౌ జానుద్వయం కృత్వా భగవంతముమాపతిమ్‌ || 25

సనత్కుమారుడిట్లు పలికెను -

ఈ మాటను విని అంధకుడు వణికి పోతూ చేతులు జోడించిమోకాళ్ళపై నిలబడి భగవాన్‌ పార్వతీపతితో నిట్లనెను (25).

అంధక ఉవాచ |

భగవన్‌ యన్మయోక్తోసి దోనోదీనః పరాత్పరః | హర్షగద్గదయా వాచా మయా పూర్వం రణాజిరే || 26

యద్యత్కృతం విమూఢత్వాత్కర్మ లోకేషు గర్హితమ్‌ | అజానతా త్వాం తత్సర్వం ప్రభో మనసి మా కృథాః || 27

పార్వత్యామపి దుష్టం యత్‌ కామదోషాత్‌ కృతం మయా | క్షమ్యతాం మే మహాదేవ కృపణో దుఃఖితో భృశమ్‌ || 28

దుఃఖితస్య దయా కార్యా కృపణస్య విశేషతః | దీనస్య భక్తి యుక్తస్య భవతా నిత్యమేవ హి || 29

సోహం దీనో భక్తియుక్త ఆగతశ్శరణం తవ | రక్షా మయి విధాతవ్యా రచితోయం మయాంజలిః || 30

ఇయం దేవీ జగన్మాతా పరితుష్టా మమోపరి | క్రోధం విహాయ సకలం ప్రసన్నా మాం నిరీక్షతామ్‌ || 31

క్వాస్యాః క్రోధః క్వ కృపణో దైత్యోహం చంద్రశేఖర | తత్సోఢా నాహ మర్ధేందు చూడ శంభో మహేశ్వర || 32

క్వ భవాన్పరమోదారః క్వ చాహం వివశీకృతః | కామక్రోధాదిభిర్దోషైర్జరసా మృత్యునా తథా || 33

అయం తే వీరకః పుత్రో యుద్ధశౌండో మహాబలః | కృపణం మాం సమాలక్ష్య మా మన్యువశమన్వగాః || 34

తుషార హార శీతాంశు శంఖ కుందేందు వర్ణభాక్‌ | పశ్యేయం పార్వతీం నిత్యం మాతరం గురుగౌరవాత్‌ || 35

నిత్యం భవద్భ్యాం భక్తస్తు నిర్వైరో దేవతైస్సహ | నివసేయం గణౖస్సార్ధం శాంతాత్మా యోగచింతకః || 36

మా స్మరేయం పునర్జాతం విరుద్ధం దానవోద్భవమ్‌ | త్వత్కృపాతో మహేశాన దేహ్యేతద్వరముత్తమమ్‌ || 37

అంధుకుడిట్లు పలికెను -

హే భగవన్‌! నేను పూర్వము యుద్ధరంగములో ఆనందాతిరేకముతో గద్గదమైన వచనములతో పరాత్పరుడవగు నిన్ను దీనులలో దీనునిగా భావించి ఏవేవో పలికితిని (26). ఓ ప్రభూ! నీ స్వరూపము నెరుంగక నేను పరమ మూఢుడనై లోకములలో నిందింపబడే ఏయే కర్మలను చేసితినో, ఆ సర్వమును నీవు మనస్సులో పెట్టు కొనవద్దు (27). ఓ మహాదేవా! పార్వతి విషయములో కామమనే దోషమువలన నేను ఏయే తప్పులనాచరించితినో, వాటిని కూడ క్షమించవలెను. నేను దీనుడను, మిక్కిలి దుఃఖించుచున్నాను (28). దుఃఖితుడు, దీనుడు అగు భక్తునియందు నీవు సర్వదా విశేషమగు దయను చూపదగును (29). నేను దీనుడను, భక్తుడను; నిన్ను శరణు వేడుచున్నాను. చేతులు జోడించి నమస్కరించుచున్నాను. నన్ను రక్షించుము (30). జగన్మాతయగు ఈ దేవి నాపై కోపమును విడనాడి సంతోషముతో ప్రసన్నవీక్షణములను నాపై బరపుగాక! (31) ఓ చంద్రశేఖరా! శంభో! మహేశ్వరా! ఆమె క్రోధమెక్కడ? దీనుడను, రాక్షసుడను అగు నేనెక్కడ? నేను ఆమె కోపమును భరించలేను (32). పరమదయామూర్తివగు నీవెక్కడ? కామక్రోధాది దోషములకు, జరామృత్యువులకు పూర్తిగా వశుడనై ఉండే నేనెక్కడ? (33) నీ పుత్రుడగు ఈ వీరకుడు మహాబలశాలి, యుద్ధములో దక్షుడు. దీనుడనగు నన్ను గాంచి ఈతడు క్రోధమును చేయకుండు గాక! (34) మంచు, ముత్యాలహారము, చంద్రుడు, శంఖము, మల్లెపువ్వు వలె స్వచ్ఛమగు వర్ణము గలవాడా! తల్లియగు పార్వతిని నేను సర్వదా మహాగౌరవముతో చూడగలను (35). నేను దేవతలతో వైరమును మాని, శాంతమగు మనస్సుతో యోగమును గురించి ఆలోచిస్తూ, మీ ఇద్దరితో మరియు గణములతో కలిసి భక్తి పూర్వకముగా జీవించెదను (36). ఓ మహేశ్వరా! నీ కృపచే నేను దానవవంశములో పుట్టుట వలన కలిగిన విరుద్ధ స్వభావమును పూర్తిగా మరచిపోయెదను. నాకీ ఉత్తమమగు వరము నిమ్ము (37).

సనత్కుమార ఉవాచ |

ఏతావదుక్త్వా వచనం దైత్యేంద్రో మౌనమాస్థితః | ధ్యాయంస్త్రిలోచనం దేవం పార్వతీం ప్రేక్ష్య మాతరమ్‌ || 38

తతో దృష్టస్తు రుద్రేణ ప్రసన్నేనైవ చక్షుషా | స్మృతవాన్‌ పూర్వవృత్తాంత మాత్మనో జన్మ చాద్భుతమ్‌ || 39

తస్మిన్‌ స్మృతే చ వృత్తాంతే తతః పూర్ణమనో రథః | ప్రణమ్య మాతాపితరౌ కృతకృత్యోభవత్తతః || 40

పార్వత్యా మూర్ధ్న్యు పాఘ్రాతశ్శంకరేణ ఛ ధీమతా | తథాభిలషితం లేభే తుష్టాద్బాలేందు శేఖరాత్‌ || 41

ఏతద్వస్సర్వమాఖ్యాత మంధకస్య పురాతనమ్‌ | గాణపత్యం మహాదేవప్రసాదాత్పరసౌఖ్యదమ్‌ || 42

మృత్యుంజయశ్చ కథితో మంత్రో మృత్యువినాశనః | పఠితవ్యః ప్రయత్నేన సర్వకామ ఫలప్రదః || 43

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధ ఖండే అంధకగణ జీవిత ప్రాప్తి వర్ణనం నామ ఏకోన పంచాశత్తమోధ్యాయః (49)

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆ రాక్షసరాజు ఇంతమాత్రము పలికి తల్లియగు పార్వతిని చూచి ముక్కంటి దేవుని ప్రార్థిస్తూ మిన్నకుండెను (38). అపుడు రుద్రుడు ప్రసన్నమగు చూపులనాతనిపై ప్రసరింప జేయగా, ఆతడు అద్భుతమగు తన పూర్వజన్మ వృత్తాంతమును స్మరించగల్గెను (39). అపుడాతడు ఆ వృత్తాంతము స్మరణకు రాగానే పరిపూర్ణమైన మనో రథము గలవాడై తల్లిదండ్రులకు ప్రణమిల్లి కృతార్థుడాయెను (40). పార్వతి ఆతనిని శిరస్సుపై ముద్దాడెను. చంద్రవంకను శిరమున దాల్చిన ధీశాలియగు శంకరుడు సంతసించి ఆతని కోర్కెను నెరవేర్చెను (41). అంధకుడు మహాదేవుని అనుగ్రహముచే పూర్వము గణాధ్యక్ష్య స్థానమును పొంది మహాసౌఖ్యముననుభవించిన వృత్తాంతమునంతనూ మీకీ తీరున చెప్పియుంటిని (42). మృత్యువును దూరము చేసి కోర్కెలనన్నిటినీ ఈడేర్చే మృత్యుంజయ మంత్రమును కూడ చెప్పితిని. దీనిని ప్రయత్న పూర్వకముగా పఠించుడు (43).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధ ఖండలో అంధకునకు గణాధ్యక్షపదవి లభించుట అనే నలుబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (49).

Siva Maha Puranam-3    Chapters