Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తమో%ధ్యాయః

మూఢా సుర సంహారము

ఋషయ ఊచుః |

కథం గంగా సమాయాతా వైశాఖే సప్తమీదినే | నర్మదాయాం విశేషేణ సూతైతద్వర్ణయ ప్రభో || 1

ఈశ్వరశ్చ కథం జాతో నందికేశో హి నామతః | వృత్తం తదపి సుప్రీత్యా కథయ త్వం మహామతే || 2

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! గంగ వైశాఖసప్తమినాడు నర్మదలోనికి వచ్చిన విధమెట్టిది? ప్రభూ! ఈ విషయమును విశేషించి వర్ణించుము (1). ఈశ్వరునకు నందికేశుడను పేరు ఎట్లు వచ్చెను? ఓ మహాబుద్ధీ! ఈ వృత్తాంతమును కూడ మహాప్రీతితో వినిపించుము (2).

సూత ఉవాచ|

సాధు పృష్టమృషిశ్రేష్ఠా నందికేశాశ్రితం వచః | తదహం కథయామ్యద్య శ్రవణాత్పుణ్యవర్ధనమ్‌ || 3

బ్రాహ్మణీ ఋషికా నామ్నా కస్యచిచ్చ ద్విజన్మనః | సుతా వివాహితా కసై#్మచిద్ద్విజాయ విధానతః || 4

పూర్వకర్మప్రభావేణ పత్నీ సా హి ద్విజన్మనః | సువ్రతాపి చ విప్రేంద్రా బాలవైధవ్యమాగతా || 5

అథ సా ద్విజపత్నీ హి బ్రహ్మచర్య వ్రతాన్వితా | పార్థివార్చనపూర్వం హి తపస్తేపే సుదారుణమ్‌ || 6

తస్మిన్నవసరే దుష్టో మూఢనామా%సురో బలీ | య¸° తత్ర మహామాయీ కామబాణన తాడితః || 7

తపంతీం తాం సమాలోక్య సుందరీ మతి కామినీమ్‌ | తయా భోగం యయాచే స నానాలోభం ప్రదర్శయన్‌ || 8

అథ సా సువ్రతా నారీ శివధ్యానపరాయణా | తస్మిన్‌ దృష్టిం దధౌ నైవ కామదృష్ట్యా మునీశ్వరాః || 9

సూతుడిట్లు పలికెను-

ఓ మహర్షులారా! నందికేశ్వరుని వృత్తాంతమును గూర్చి మీరు చక్కని ప్రశ్నను వేసితిరి. శ్రవణము చేసినచో పుణ్యమును వర్ధిల్ల జేయు ఆ గాథను ఇప్పుడు చెప్పుచున్నాను (3). ఒక బ్రాహ్మణునకు ఋషిక యను కుమార్తె గలదు. ఆమెను మరియొక బ్రాహ్మణుడు యథావిధిగా వివాహమాడెను (4). ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఆ బ్రాహ్మణ పత్ని గొప్ప వ్రతనిష్ఠ కలదియే అయిననూ, పూర్వకర్మల ప్రభావముచే బాల్యమునందు భర్తృ వియోగమును పొందెను (5). తరువాత ఆ బ్రాహ్మణపత్ని బ్రహ్మచర్యవ్రతమును స్వీకరించి పార్థివ లింగమును పూజిస్తూ మిక్కిలి కఠోరమగు తపస్సును చేసెను (6). ఆ సమయములో దుష్టుడు, బలవంతుడు, మహామాయావి అగు మూఢుడనే రాక్షసుడు కామబాణ పీడితుడై అచటకు వెళ్లెను (7). అతిశయించిన సౌందర్యము గల ఆ కామిని తపస్సును చేయుచుండగా గాంచి ఆతడు వివిధలోభములను చూపించి ఆమెను భోగించగోరెను (8). ఓ మహర్షులారా! వ్రతనిష్ఠురాలగు ఆ యువతి శివధ్యానతత్పరురాలై వాని వైపు కామనదృష్టితో చూడనే లేదు (9).

న మానితవతీ తం చ బ్రాహ్మణీ సా తపోరతా | అతీవ హి తపోనిష్ఠాసీచ్ఛి వధ్యానమాశ్రితా || 10

అధ మూఢస్స దైత్యేంద్ర స్తయా తన్వ్యా తిరస్కృతః | చుక్రోధ వికటం తస్య పశ్చాద్రూపమదర్శయత్‌ || 11

అథ ప్రోవాచ దుష్టాత్మా దుర్వచో భయకారకమ్‌ | త్రాసయామాస బహుశస్తాం చ పత్నీం ద్విజన్మనః || 12

తదా సాభయసంత్రస్తా బహువారం శివేతి చ | బభాషే స్నేహతస్తన్వీ ద్విజపత్నీ శివశ్రయా ||13

విహ్వలాతీవ సా నారీ శివనామప్రభాషిణీ | జగామ శరణం శంభో స్స్వధర్మావనహేతవే || 14

శరణాగతరక్షార్థం కిం తు సద్వృత్తమాహితమ్‌ | ఆనందార్థం హి తస్యాస్తు శివ ఆవిర్బభూవ హ || 15

అథ తం మూఢనామానం దైత్యేంద్రం కామవిహ్వలమ్‌ | చకార భస్మసాత్సద్యః శంకరో భక్తవత్సలః || 16

తతశ్చ పరమేశానః | కృపాదృష్ట్వా విలోక్య తామ్‌ | వరం బ్రూహీతి చోవాచ భక్తరక్షణ దక్షధీః || 17

శ్రుత్వా మహేశవచనం సా సాధ్వీ ద్విజకామిని | దదర్శ శాంకరం రూపమానందజనకం శుభమ్‌ || 18

తతః ప్రణమ్య తం శంభుం పరమేశం సుఖావహమ్‌ | తుష్టావ సాంజలిస్సాధ్వీ నతస్కంధా శుభాశయా || 19

తపస్సునందు ప్రేమగల ఆ బ్రాహ్మణస్త్రీ తీవ్రమగు తపోనిష్ఠ యందుండి శివుని ధ్యానిస్తూ వానిని ఆదరించలేదు (10). అపుడా మూఢాసురుడు ఆ సుందరిచే తిరస్కరింపబడి కోపించి తన భయంకరరూపము నామెకు చూపెను (11). అపుడా దుర్బుద్ధి భయమును గొల్పు చెడుమాటలను ఆమె యెదుట పలికెను. ఆ బ్రాహ్మణపత్నిని పరిపరివిధముల భయపెట్టెను (12). శివుని శరణు జొచ్చిన ఆ బ్రాహ్మణపత్ని భయవిహ్వలయై ప్రేమతో శివా! అని పలుమార్లు పిలిచెను (13). మిక్కిలి భయపడిన ఆ యువతి శివుని నామమునుచ్చరిస్తూ తన ధర్మమును రక్షించుకొనుట కొరకై శంభుని శరణు పొందెను (14). ఆమె సదాచారము రక్షింపబడెను. శరణు జొచ్చిన ఆమెను రక్షించి ఆమెకు ఆనందమును కలిగించుట కొరకై శివుడు సాక్షాత్కరించెను (15). అపుడు భక్తవత్సలుడగు శంకరుడు కామముతో కన్ను గానని ఆ మూఢాసురుని వెంటనే బూడిద చేసెను (16). తరువాత భక్తులను రక్షించే స్వభావముగల పరమేశ్వరుడు ఆమెపై దయాదృష్టిని బరపి వరమును కోరుకొనుమని పలికెను (17). పతివ్రతయగు ఆ బ్రాహ్మణపత్ని మహేశ్వరుని ఆ వచనమును విని ఆనందదాయకమగు శంకరుని శుభరూపమును దర్శించెను (18). పవిత్రమగు అంతః కరణము గల ఆ సాధ్వి చేతులను జోడించి శిరస్సును వంచి నమస్కరించి సుఖకరుడగు ఆ శంభు పరమేశ్వరుని స్తుతించెను (19).

ఋషి కోవాచ |

దేవదేవ మహాదేవ శరణాగతవత్సల | దీనబంధుస్త్వమీశానో భక్తరక్షాకరస్సదా || 20

త్వయా మే రక్షితో ధర్మో మూఢనామ్నో%సురాదిహ | యదయం నిహతో దుష్టో జగద్రక్షా కృతా త్వయా || 21

స్వపాదయోః పరాం భక్తిం దేహి మే హ్యనపాయినీమ్‌ | అయమేవ వరో నాథ కిమన్య దధికం హ్యతః || 22

అన్యదాకర్ణయ విభో ప్రార్థనాం మే మహేశ్వర | లోకానాముపకారార్థమిహ త్వం సంస్థితో భవ || 23

ఋషిక ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! మహాదేవా! శరణాగతవత్సలా! నీవు దీనులకు బంధుడవు, ఈశ్వరుడవు, సర్వదా భక్తులను రక్షించువాడవు (20). నీవు ఇచట నన్ను మూఢాసురుని బారి నుండి రక్షించి నా ధర్మమును నిలబెట్టితివి. ఈ దుష్టుని సంహరించి నీవు జగత్తును కాపాడితివి (21). నాకు నీ పాదములయందు నిశ్చలమగు భక్తిని అనుగ్రహించుము. ఓ నాథా! ఇదియే నేను గోరు వరము. ఇంతకు మించి యేమి గలదు? (22). ఓ విభూ! మహేశ్వరా! నా ప్రార్థన మరియొకటి గలదు. దానిని ఆలకించుము. నీవిచట లోకోపకారము కొరకై స్థిరముగా నుండుము (23).

సూత ఉవాచ |

ఇతి స్తుత్వా మహాదేవమృషికా సా శుభవ్రతా | తూష్ణీ మాసాథ గిరిశః ప్రోవాచ కరుణాకరః || 24

సూతుడు ఇట్లు పలికెను-

శుభకరమగు వ్రతనిష్ఠ గల ఋషిక మహాదేవుని ఇట్లు స్తుతించి విరమించెను. అపుడు కరుణానిధి, కైలాసవాసి యగు పరమేశ్వరుడిట్లు పలికెను (24).

గిరిశ ఉవాచ |

ఋషికే సుచరిత్రా త్వం మమ భక్తా విశేషతః | దత్తా వరాశ్చ తే సర్వే తుభ్యం యే యే హి యాచితాః || 25

ఏతస్మిన్నంతరే తత్ర హరిబ్రహ్మాదయస్సురాః | శివావిర్భావమాజ్ఞాయ యయుర్షర్ష సమన్వితాః || 26

శివం ప్రణమ్య సుప్రీత్యా సమానర్చుశ్చ తే%ఖిలాః | తుష్టువుర్నతకా విప్రాః కరౌ బద్ధ్వా సుచేతసః || 27

ఏతస్మిన్‌ సమయే గంగా సాధ్వీం తాం స్వర్ధునీ జగౌ | ఋషికాం సుప్రసన్నాత్మా ప్రశంసంతీ చ తద్విధిమ్‌ || 28

శివుడు ఇట్లు పలికెను-

ఓ ఋషికా! నీ శీలము చాల గొప్పది. నీకు నాయందు గొప్ప భక్తి గలదు. నీవు కోరే వరములనన్నిటినీ నేను నీకు ఇచ్చుచున్నాను (25). ఇంతలో బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు అచట శివుడు ఆవిర్భవించినాడని తెలిసి ఆనందముతో గూడినవారై విచ్చేసిరి (26). ఓ బ్రాహ్మణులారా! వారందరు ప్రసన్నమగు మనస్సు గలవారై శివుని మహాప్రీతితో చేతులను జోడించి ప్రణమిల్లి పూజించి స్తుతించిరి (27). అదే సమయములో స్వర్గమునందు ప్రవహించే గంగా దేవి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలదై సాధ్వియగు ఋషికయొక్క భాగ్యమును కొనియాడుతూ ఆమెతో నిట్లనెను (28).

గంగోవాచ |

మమార్థే చైవ వైశాఖే మాసి దేయం త్వయా వచః | స్థిత్యర్థం దినమేకం మే సామీప్యం కార్యమేవ హి || 29

గంగ ఇట్లు పలికెను-

నా కొరకై నీవు వైశాఖమాసములో ఒక రోజు ఇచట నుండవలయును. నాకు మాటను ఇమ్ము. ఆనాడు నేను కూడ ఈ తీర్థములో నుండగోరుచున్నాను (29).

సూత ఉవాచ |

గంగావచనమాకర్ణ్య సా సాధ్వీ ప్రాహ సువ్రతా | తథాస్త్వితి వచః ప్రీత్యా లోకానాం హితహేతవే || 30

ఆనందార్థం శివస్త స్యా స్సుప్రసన్నశ్చ పార్థివే | తస్మింల్లింగే లయం యాతః పుర్ణాంశేన తయా హరః || 31

దేవాస్సర్వే సుప్రసన్నాః ప్రశంసంతి శివం చ తామ్‌ | స్వం స్వం ధామ యయు ర్విష్ణుబ్రహ్మాద్యా అపి స్వర్ణదీ || 32

తద్దినాత్పావనం తీర్థమాసీదీదృశముత్తమమ్‌ | నందికేశశ్శివః ఖ్యాతస్సర్వపాపవినాశనః || 33

గంగాపి ప్రతివర్షం తద్దినే యాతి శుభేచ్ఛయా | క్షాలనార్థం స్వపాపస్య యద్గృహీతం నృణాం ద్విజాః || 34

తత్ర స్నాతో నరస్సమ్య ఙ్నందికేశం సమర్చ్య చ | బ్రహ్మహత్యాదిభిః పాపైర్ముచ్యతే హ్యఖిలైరపి || 35

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం నందికేశ్వర శివలింగమాహాత్మ్యవర్ణనం నామ సప్తమో%ధ్యాయః (7).

సూతుడిట్లు పలికెను-

గొప్ప వ్రతనిష్ఠ గల ఆ సాధ్వి గంగయొక్క మాటను విని మానవుల హితమును గోరి 'అటులనే యగుగాక! అని పలికెను (30). పాపహారియగు శివుడు మిక్కిలి ప్రసన్నుడై ఆమెకు ఆనందమును కలిగించ గోరి పూర్ణాంశతో ఆ పార్థివ లింగమునందు విలీనమయ్యెను (31). విష్ణువు, బ్రహ్మ మొదలగు సర్వదేవతలు మరియు గంగానది శివుని మరియు ఆమెను ప్రశంసించి తమ తమ స్థానములకు వెళ్లిరి (32). ఆ నాటి నుండి ఆ స్థానము ఉత్తమము, పావనము అగు తీర్థము ఆయెను. ఆ శివుడు నందికేశ్వరుడను పేర విఖ్యాతిని పొంది సర్వుల పాపములను నశింపజేయుచున్నాడు (33). ఓ బ్రాహ్మణులారా! ప్రతి సంవత్సరము గంగ కూడ ఆ నాడు శుభమును గోరి మానవులనుండి తనకు సంక్రమించిన పాపములను క్షాళన చేసుకొనుటకై అచటకు వచ్చును (34). మానవుడు అచట స్నానమును చేసి నందికేశ్వరుని చక్కగా అర్చించినచో బ్రహ్మహత్య మొదలగు సమస్త పాపములనుండి విముక్తుడగును (35).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు నందికేశ్వర శివలింగ మాహాత్మ్యవర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

Siva Maha Puranam-3    Chapters