Siva Maha Puranam-3    Chapters   

అథ అష్టమో%ధ్యాయః

మహాబలేశ్వర మాహాత్మ్యము

సూత ఉవాచ |

ద్విజాశ్శృణుత సద్భక్త్యా శివలింగాని తాని చ | పశ్చిమాయాం దిశాయాం వై యాని ఖ్యాతాని భూతలే || 1

కపిలాయాం నగర్యాం తు కాలరామేశ్వరాభిధే | శివలింగే మహాదివ్యే దర్శనాత్పాపహారకే || 2

పశ్చిమే సాగరే చైవ మహాసిద్ధేశ్వరస్స్మృతః | ధర్మార్థకామదశ్చైవ తథా మోక్షప్రదో%పి హి || 3

పశ్చిమాంబుధి తీరస్థం గోకర్ణం క్షేత్రముత్తమమ్‌ | బ్రహ్మహత్యాది పాపఘ్నం సర్వకామఫలప్రదమ్‌ || 4

గోకర్ణే శివలింగాని విద్యంతే కోటి కోటిశః | అసంఖ్యాతాని తీర్థాని తిష్ఠంతి చ పదే పదే || 5

బహునాత్ర కిముక్తేన గోకర్ణస్థాని సర్వశః | శివప్రత్యక్షలింగాని తీర్థాన్యంభాంసి సర్వశః || 6

గోకర్ణే శివలింగానాం తీర్థానామపి సర్వశః | వర్ణ్యతే మహిమా తాత పురాణషు మహర్షిభిః || 7

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! భూలోకములో పశ్చిమ దిక్కునందు ప్రఖ్యాతిని గాంచిన శివలింగములను గురించి ఉత్తమభక్తితో వినుడు (1). కపిలా నగరములో కాలరామేశ్వరుడను పేరుగల శివలింగము మహాదివ్యమైనది. దానిని దర్శించినచో పాపములు నశించును (2). పశ్చిమ సముద్రతీరమునందు గల మహాసిద్ధేశ్వరుడు ధర్మార్థకామములను మాత్రమే గాక మోక్షమును గూడ ఇచ్చునని మహర్షులు చెప్పిరి (3). పశ్చిమ సముద్ర తీరమునందు బ్రహ్మహత్య మొదలగు పాపములను నశింపజేయునది, సర్వకామనలను ఫలములను ఇచ్చునది అగు ఉత్తమ గోకర్ణక్షేత్రముగలదు (4). గోకర్ణములో కోట్ల సంఖ్యలో శివలింగములు, ప్రతి అడుగులో తీర్థములు గలవు. వాటి సంఖ్య ఊహకు అందదు (5). వేయి మాటలేల? శివుని స్వయంభూలింగములు, సర్వతీర్థములు గోకర్ణమునందు గలవు (6). ఓ వత్సా! గోకర్ణములోని శివలింగములకు మరియు తీర్థములకు గల మహిమను పురాణములలో మహర్షులు వర్ణించెదరు (7).

కృతే యుగే స హి శ్వేతస్త్రేతాయాం సో %తిలోహితః | ద్వాపరే పీతవర్ణశ్చ కలౌ శ్యామో భవిష్యతి || 8

ఆక్రాంత సప్తపాతాల కుహరో%పి మహాబలః | ప్రాప్తే కలియుగే ఘోరే మృదుతాముపయాస్యతి || 9

మహాపాతకినాశ్చాత్ర సమభ్యర్చ్య మహాబలమ్‌ | శివలింగం చ గోకర్ణే ప్రయాతాశ్శాంకరం పదమ్‌ || 10

గోకర్ణే తత్ర మునయో గత్వా పుణ్యర్‌క్ష వాసరే | యే%ర్చయంతి చ తే భక్త్యా తే రుద్రాస్స్యుర్న సంశయః || 11

యదా కదా చిద్గో కర్ణే యో వా కో వాపి మానవః | పూజయేచ్ఛివలింగం తత్స గచ్ఛేద్ర్బహ్మణః పదమ్‌ || 12

బ్రహ్మవిష్ణ్వా దిదేవానాం శంకరో హితకామ్యయా | మహాబలాభిధానేన దేవస్సంనిహితస్సదా || 13

ఘోరేణ తపసా లబ్ధం రావణాఖ్యేన రక్షసా | తల్లింగం స్థాపయామాస గోకర్ణే గణనాయకః || 14

శివుడు కృతయుగములో తెల్లగను, త్రేతాయుగములో మిక్కిలి ఎర్రగను, ద్వాపరయుగములో పచ్చగను, కలిలో నల్లగను ఉండును (8). మహాబలేశ్వరుడు ఏడు పాతాళలోకముల వరకు వ్యాపించి యున్నాడు. కాని భయంకరమగు కలియుగము రాగానే ఆయన మెత్తదనమును పొందును (9). గోకర్ణములో మహాబలేశ్వరుని చక్కగా ఆరాధించువారు మహాపాపములనుండి విముక్తులై శంకరుని ధామమును పొందెదరు (10). ఓ మునులారా! గోకర్ణమునకు వెళ్లి పుణ్యనక్షత్రములో పుణ్యదినమునాడు భక్తితో ఆయనను ఆరాధించువారు నిస్సంశయముగా రుద్రులు అగుదురు (11). ఏ మానవుడైననూ ఏ సమయమునందైననూ గోకర్ణములోని శివలింగమును పూజించినచో, ఆతడు బ్రహ్మ పదవిని పొందును (12). శంకరుడు బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతల హితమును గోరి మహాబలేశ్వరరూపములో నిత్యము సన్నిహితుడై యున్నాడు (13). రావణాసురుడు ఘోరమగు తపస్సును చేసి సంపాదించిన శివలింగమును విఘ్నేశ్వరుడు గోకర్ణములో ప్రతిష్ఠించెను (14).

విష్ణుర్బ్రహ్మ మహేంద్రశ్చ విశ్వేదేవా మరుద్గణాః | ఆదిత్యా వసవో దస్రౌ శశాంకశ్చ సతారకః || 15

ఏతే విమానగతయో దేవాశ్చ సహ పార్షదైః | పూర్వద్వారం నిషేవంతే తస్య వై ప్రీతి కారణాత్‌ || 16

యమో మృత్యుస్స్వయం సాక్షాచ్చిత్రగుప్తశ్చ పావకః | పితృభిస్సహ రుద్రైశ్చ దక్షిణ ద్వారమాశ్రితః || 17

వరుణస్సరితాం నాథో గంగాది సరితాం గణౖః | మహాబలం చ సేవంతే పశ్చిమ ద్వారమాశ్రితాః || 18

తథా వాయుః కుబేరశ్చ దేవేశీ భద్రకాలికా | మాతృభిశ్చండికాద్యాభిరుత్తరద్వారమాశ్రితాః || 19

సర్వే దేవాస్స గంధర్వాః పితరస్సిద్ధచారణాః | విద్యాధరాః కింపురుషాః కిన్నరా గుహ్యకాః ఖగాః || 20

నానాపిశాచా వేతాలా దైతేయాశ్చ మహాబలాః | నాగాశ్శేషాదయస్సర్వే సిద్ధాశ్చ మునయో%ఖిలాః || 21

ప్రణువంతి చ తం దేవం ప్రణమంతి మహాబలమ్‌ | లభంత ఈ ప్సితాన్‌ కామాన్‌ రమంతే చ యథా సుఖమ్‌ || 22

విష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు, విశ్వే దేవతలు, మరుద్గణములు, ఆదిత్యులు, వసువులు, ఆశ్వినీదేవతలు, నక్షత్రములతో గూడియున్న చంద్రుడు (15) అను ఈ దేవతలు తమ గణములతో బాటు విమానములపై వచ్చి శివునకు ప్రీతిని కలిగించుటకై తూర్పు ద్వారమును సేవించుచున్నారు (16). యముడు, స్వయముగా మృత్యు దేవత, చిత్రగుప్తుడు, అగ్ని, పితృదేవతలు మరియు రుద్రులు దక్షిణ ద్వారమునాశ్రయించి ఉన్నారు (17). వరుణుడు, సముద్రుడు, గంగా మొదలగు నదీ సముదాయము పశ్చిమ ద్వారము నాశ్రయించి మహాబలేశ్వరుని సేవించెదరు (18). అదే విధముగా వాయువు, కుబేరుడు, దేవదేవియగు భద్రకాళి, చండికా మొదలగు మాతృమూర్తులు ఉత్తరద్వారము నాశ్రయించి ఉన్నారు (19). సకల దేవతలు, గంధర్వులు, పితరులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు, గుహ్యకులు, గరుడులు (20), అనేకరకముల పిశాచములు, వేతాళులు, మహాబలశాలురగు రాక్షసులు, శేషుడు మొదలగు నాగులు, సకల సిద్ధులు, సర్వమునులు (21) ఆ మహాబలదేవుని స్తుతించి ప్రణమిల్లి అభీష్టములగు కామనలను పొంది సుఖముగా రమించుచున్నారు (22).

బహుభిస్తత్ర సుతపస్తప్తం సంపూజ్య తం విభుమ్‌ | లబ్ధా హి పరమా సిద్ధి రిహాముత్రాపి సౌఖ్యదా || 23

గోకర్ణే శివలింగం తు మోక్షద్వార ఉదాహృతః | మహాబలాభిధానో%సౌ పూజిత స్సంస్తుతో ద్విజాః || 24

మాఘాసిత చతుర్దశ్యాం మహాబలసమర్చనమ్‌ | విముక్తిదం విశేషేణ సర్వేషాం పాపినామపి || 25

అస్యాం శివతిథౌ సర్వే మహోత్సవ దిదృక్షవః | ఆయాంతి సర్వదేశేభ్య శ్చాతుర్వర్ణ్య మహాజనాః || 26

స్త్రియో వృద్ధాశ్చ బాలాశ్చ చతురాశ్రమవాసినః | దృష్ట్వా తత్రైత్య దేవేశం లేభిరే కృతకృత్యతామ్‌ || 27

మహాబలప్రభావాత్తే తచ్చ లింగం శివస్య తు | సంపూజ్యైకాథ చాండాలీ శివలోకం గతా ద్రుతమ్‌ || 28

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం మహాబలమాహాత్మ్యవర్ణనం నామాష్టమో%ధ్యాయః (8).

అనేకులచట ఆ విభుని పూజించి గొప్ప తపస్సును చేసి ఇహ పరలోకములయందు సుఖమునిచ్చే పరమసిద్ధిని పొందిరి (23). ఓ బ్రాహ్మణులారా! గోకర్ణములోని మహాబలేశ్వరుడను శివలింగమును స్తుతించి పూజించినచో మోక్షద్వారము తెరుచుకొనునని చెప్పెదరు (24). పాపాత్ములతో సహా సర్వులు మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాబలేశ్వరుని ఆరాధించినచో విశేషించి ముక్తిని పొందెదరు (25). ఈ శివతిథినాడు అన్ని ప్రాంతములనుండి నాల్గువర్ణముల జనులు అందరు మహోత్సవమును చూడగోరి వచ్చుచుందురు (26). స్త్రీలు, వృద్ధులు, బాలకులు మరియు నాల్గు ఆశ్రములకు చెందిన జనులు అచటకు వచ్చి శివుని చూచి కృతార్థులగుదురు (27). ఒక చండాలస్త్రీ ఆ శివలింగమును చక్కగా పూజించి మహాబలేశ్వరుని మహిమచే శీఘ్రముగా శివలోకమును పొందెను (28).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు మహాబలేశ్వర మాహాత్మ్యవర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Siva Maha Puranam-3    Chapters