Siva Maha Puranam-3    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

చంద్రభాలేశ్వర మాహాత్మ్యము

ఋషయ ఊచుః |

సూత సూత మహాభాగ ధన్యస్త్వం శివసక్తధీః | మహాబలస్య లింగస్య శ్రావితేయం కథాద్భుతా || 1

ఉత్తరస్యాం దిశాయాం చ శివలింగాని యాని చ | తేషాం మాహాత్మ్యమనఘం వద త్వం పాపనాశకమ్‌ || 2

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ సూతా! సూతా! మహాత్మా! శివునియందు లగ్నమైన బుద్ధిగల నీవు ధన్యుడవు. మహాబలేశ్వర లింగముయొక్క ఈ అద్భుతగాథను వినిపించితివి (1). ఉత్తర దిక్కునందు గల శివలింగముల యొక్క పవిత్రమైన, పాపములను పోగొట్టే మాహాత్మ్యమును నీవు చెప్పుము (2).

సూత ఉవాచ |

శృణుతాదరతో విప్రా ఔత్తరాణాం విశేషతః | మాహాత్మ్యం శివలింగానాం ప్రవదామి సమాసతః || 3

గోకర్ణం క్షేత్రమపరం మహాపాతకనాశనమ్‌ | మహావనం చ తత్రాస్తి పవిత్రమతివిస్తరమ్‌ || 4

తత్రాస్తి చంద్రభాలాఖ్యం శివలింగమనుత్తమమ్‌ | రావణన సమానీతం సద్భక్త్యా సర్వసిద్ధిదమ్‌ || 5

తస్య తత్ర స్థితిర్వైద్యనాథ స్యేవ మునీశ్వరాః | సర్వలోకహితార్థాయ కరుణా సాగరస్య చ || 6

స్నానం కృత్వా తు గోకర్ణే చంద్రభాలం సమర్చ్య చ | శివలోకమవాప్నోతి సత్యం సత్యం న సంశయః || 7

చంద్రభాలస్య లింగస్య మహిమా పరమాద్భుతా | న శక్యా వర్ణితుం వ్యాసాద్భక్త స్నేహితరస్య హి || 8

చంద్రభాలమహాదేవలింగస్య మహిమా మహాన్‌ | యథాకథంచిత్సంప్రోక్తా పరలింగస్య వై శృణు || 9

సూతుడు ఇట్లు పలికెను-

ఓ బ్రాహ్మణులారా! ఉత్తరదిక్కునందలి శివలింగముల మాహత్మ్యమును సంగ్రహముగా చెప్పెదను. సాదరముగా వినుడు (3). గోకర్ణక్షేత్రములో మరియొక శివలింగము కలదు. అది మహాపాపములను పోగొట్టును. అచట పవిత్రమైనది, అధికవిస్తారము గలది అగు ఒక పెద్ద వనము గలదు (4). అచట చంద్రభాలేశ్వరుడను సర్వశ్రేష్ఠమగు శివలింగము గలదు. సర్వసిద్ధులనిచ్చే ఆ లింగమును రావణుడు ఉత్తమమగు భక్తితో గొని వచ్చెను (5). ఓ మహర్షులారా ! వైద్యనాథునివలెనే ఆయన కూడ అచ్చట ఉన్నవాడై సర్వమానవులకు హితమును ఒనగూర్చుచున్నాడు. ఆయన కరుణా సముద్రుడు (6). గోకర్ణములో స్నానము చేసి చంద్రభాలేశ్వరుని పరమాశ్చర్యకరమగు మహిమను సంగ్రహముగా కొనియాడుట అసంభవము (8). చంద్రభాల మహాదేవలింగము యొక్క గొప్ప మహిమను అతి కష్టముతో చెప్పియుంటిని. మరియొక లింగముయొక్క మహిమను వినుము (9).

దాధీచం శివలింగం తు మిశ్రర్షి వరతీర్థకే | దధీచినా మునీశేన సుప్రీత్యా చ ప్రతిష్ఠితమ్‌ || 10

తత్ర గత్వా చ తత్తీర్థే స్నాత్వా సమ్యగ్విధానతః | శివలింగం సమర్చేద్వై దాధీచేశ్వరమాదరాత్‌ || 11

దధీచమూర్తిస్తత్రైవ సమర్చ్యా విధిపూర్వకమ్‌ | శివప్రీత్యర్థమేవాశు తీర్థయాత్రాఫలార్థిభిః || 12

ఏవం కృతే మునిశ్రేష్ఠాః కృతకృత్యో భ##వేన్నరః | ఇహ సర్వసుఖం భుక్త్వా పరత్ర గతిమాప్నుయాత్‌ || 13

నైమిషారణ్యతీర్థే తు నిఖిలర్షి ప్రతిష్ఠితమ్‌ | ఋషీశ్వరమితి ఖ్యాతం శివలింగం సుఖప్రదమ్‌ ||14

తద్దర్శనాత్పూజనాచ్చ జనానాం పాపినామపి | భుక్తి ర్ముక్తి తేషాం తు పరత్రేహ మునీశ్వరాః || 15

హత్యాహరణతీర్థే తు శివలింగమఘాపహమ్‌ | పూజనీయం విశేషేణ హత్యా కోటి వినాశనమ్‌ || 16

దేవప్రయాగ తీర్థే తు లలితేశ్వరనామకమ్‌ | శివలింగం సదా పూజ్యం నరైస్సర్వాఘనాశనమ్‌ || 17

మిశ్రమహర్షికి చెందిన పవిత్రమగు తీర్థ క్షేత్రములో దధీచి మహర్షిచే పరమప్రీతితో స్థాపించబడిన దాధీచేశ్వరలింగము గలదు (10). అచటకు వెళ్లి ఆ తీర్థమునందు యథావిధిగా స్నానము చేసి దాధీచేశ్వర శివలింగమును భక్తిశ్రద్ధలతో అర్చించవలెను (11). తీర్థయాత్రయొక్క ఫలమును గోరు మానవులు అచటనే ఉన్న దధీచుని మూర్తిని శివుని ప్రీతి కొరకై యథావిధిగా అర్చించవలెను (12). ఓ మహర్షులారా! ఇట్లు చేసిన మానవుడు ఇహలోకములో సర్వసుఖములననుభవించి పరమగతిని పొంది కృతకృత్యుడగును (13). నైమిషారణ్య క్షేత్రమునందు ఋషులు అందరు కలిసి ప్రతిష్ఠించిన ఋషీశ్వరురడనే శివలింగము సుఖములనిచ్చునని చెప్పబడినది (14). ఓ మహర్షులారా! దానిని దర్శించి పూజించు జనులు పాపాత్ములే అయిననూ ఇహలోకములో భుక్తిని, పరలోకములో ముక్తిని ఇచ్చును (15). ఓ మహర్షులారా! హత్యాహరణములు అను తీర్థమునందు గల శివలింగము పాపములను పోగొట్టే విశేషముగా పూజించువారికి కోటిహత్యల పాపమును పోగొట్టును (16). దేవప్రయాగ తీర్థములో లలితేశ్వరుడను పేరుతో ప్రఖ్యాతిని గాంచిన శివలింగము సర్వదా పూజించదగినది. దానిని పూజించే మానవుల పాపములన్నియు నశించును (17).

నయపాలాఖ్యపుర్యాం తు ప్రసిద్ధాయాం మహీతలే | లింగం పశుపతీశాఖ్యం సర్వకామఫలప్రదమ్‌ || 18

శిరోభాగస్వరూపేణ శివలింగం తదస్తి హి | తత్కథాం వర్ణయిష్యామి కేదారేశ్వరవర్ణనే || 19

తదారాన్ముక్తి నాథాఖ్యం శివలింగం మహాద్భుతమ్‌ | దర్శనాదర్చనాత్తస్య భుక్తిర్ముక్తిశ్చ లభ్యతే || 20

ఇతి వశ్చ సమాఖ్యాతం లింగవర్ణనముత్తమమ్‌ | చతుర్దిక్షు ముని శ్రేష్ఠాః కిమన్య చ్ఛ్రోతుమిచ్ఛథ || 21

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయం చంద్రభాల పశుపతి నాథలింగమాహాత్మ్యవర్ణనం నామైకాదశో%ధ్యాయః (11).

భూలోకములో ప్రసిద్ధిని గాంచిన నయపాల నగరమునందు సకల కామనలను, ఫలములను ఇచ్చే పశుపతీశ్వరలింగము గలదు (18). ఆ శివలింగము తల అనే అవయవమును బోలియున్నది. కేదారేశ్వరుని వర్ణించినప్పుడు ఆ గాథను వర్ణించెదను (19). దానికి దగ్గరలో మహాశ్చర్యకరమగు ముక్తి నాథేశ్వరలింగము గలదు. దానిని దర్శించి పూజించువారలకు భుక్తి మరియు ముక్తి లభించును (20). ఓ మహర్షులారా! మీకీ విధముగా నాల్గు దిక్కులలో గల లింగముల శ్రేష్ఠమగు వృత్తాంతమును చెప్పియుంటిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నారు? (21).

శ్రీ శివమహాపురాణములో కోటిరుద్ర సంహితయందు చంద్రభాలలింగ మాహాత్మ్యవర్ణనమనే పదకొండు అధ్యాయము ముగిసినది (11).

Siva Maha Puranam-3    Chapters