Siva Maha Puranam-3    Chapters   

అథ చతుఃపంచాశత్త మో%ధ్యాయః

శ్రీకృష్ణ బాణాసురుల యుద్ధము

వ్యాస ఉవాచ |

అనిరుద్ధే హృ తే పౌత్రే కృష్ణస్య మునిసత్తమ | కుంభాండసుతయా కృష్ణః కిమకార్షీద్ధి తద్వద || 1

వ్యాసుడు ఇట్లు పలికెను -

ఓ మహర్షీ ! కృష్ణుని మనుమడు అగు అనిరుద్ధుని కుంభాండుని కుమార్తె అపహరించుకొని పోగా, శ్రీ కృష్ణుడు ఏమి చేసెనో చెప్పుము (1).

సనత్కుమార ఉవాచ |

తతో గతే%నిరుద్ధే తు తత్‌ స్త్రీణాం రోదనస్వనమ్‌ | శ్రుత్వా చ వ్యథితః కృష్ణో బభూవ మునిసత్తమ || 2

అపశ్యతాం చానిరుద్ధం తద్బంధూనాం హరేస్తథా | చత్వారో వార్షికా మాసా వ్యతీయురనుశోచతామ్‌ || 3

నారదాత్తదుపాకర్ణ్య వార్తాం బద్ధస్య కర్మ చ | ఆసన్‌ సువ్యథితాస్సర్వే వృష్ణయః కృష్ణదేవతాః || 4

కృష్ణస్తద్వృత్తమఖిలం శ్రుత్వా యుద్ధాయ చాదరాత్‌ | జగామ శోణితపురం తార్‌క్ష్యమాహూయ తత్‌క్షణాత్‌ || 5

ప్రద్యుమ్నో యయుధానశ్చ గతస్సాంబోథ సారణః | నందోపనందభద్రాద్యా రామకృష్ణానువర్తినః || 6

అక్షౌహిణీభిర్ద్వాదశభిస్సమేతాస్సర్వతో దిశమ్‌ | రురుధుర్బాణనగరం సమంతాత్సాత్వతర్షభాః || 7

భజ్యమానపురోద్యానప్రాకారాట్టాలగోపురమ్‌ | వీక్ష్యమాణో రుషావిష్టస్తుల్యసైన్యోభినిర్య¸° || 8

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

ఓమహర్షీ! అనిరుద్ధుడు అపహరింపబడిన తరువాత వాని స్త్రీల ఏడ్పులను విని శ్రీ కృష్ణుడు మిక్కిలి దుఃఖితుడాయెను (2). అనిరుద్ధుడు అదృశ్యమైన తరువాత ఆతని బంధువులు మరియు శ్రీ కృష్ణుడు దుఃఖించుచుండగా వర్షాకాలము నాలుగు మాసములు గడిచిపోయెను (3). అనిరుద్ధుడు బంధితుడగుట, ఆ తరువాత జరిగిన ఘటనలు ఇత్యాది వృత్తాంతమును నారదుడు చెప్పగా విని శ్రీ కృష్ణుడే దైవముగాగల వృష్ణులు అందరు దుఃఖితులైరి (4). శ్రీ కృష్ణుడు ఆ వృత్తాంతమునంతను విని వెంటనే గరుత్మంతుని పిలిచి యుద్ధమునందు బద్ధాదరుడై శోణితపురమునకు వెళ్లెను (5). బలరామకృష్ణుల అను యాయులగు ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉప నందుడు, భద్రుడు మొదలగు వారందరు కూడా వెళ్లిరి (6). ఆ యదువంశవీరులు పన్నెండు అక్షౌహిణీల సైన్యమును తీసుకొని బాణుని నగరమును అన్ని వైపుల నగరమును అన్నివైపులనుండి పూర్తిగా ముట్టడించిరి (7). ప్రాకారములు, నగరమునందలి ఉద్యానవనములు, బురుజులు, గోపురములు పగులగొట్టబడుటను గాంచిన బాణుడు క్రోధముతో నిండినవాడై సమానమగు సైన్యము తోడు రాగా వారికి ఎదురు వెళ్లెను (8).

బాణార్థే భగవాన్‌ రుద్రస్ససుతః ప్రమథైర్వృతః | ఆరుహ్య నందివృషభం యుద్ధం కర్తుం సమాయ¸° || 9

ఆసీత్సుతుములం యుద్ధమద్భుతం లోమహర్షణమ్‌ | కృష్ణాదికానాం తైస్తత్ర రుద్రాద్యైర్బాణరక్షకైః || 10

కృష్ణశంకరయోరాసీత్ర్పద్యుమ్నగుహయోరపి | కూష్మాండకూపకర్ణాభ్యాం బలేన సహ సంయుగః || 11

సాంబస్య బాణపుత్రేణ బాణన సహ సాత్యకేః | నందినా గరుడస్యాపి పరేషాం చ పరైరపి || 12

బ్రహ్మాదయస్సురాధీశా మునయస్సిద్ధచారణాః | గంధర్వావ్సరసో యానైర్విమానైర్ద్ర ష్టుమాగమన్‌ || 13

ప్రమథైర్వివిధాకారై రేవత్యంతైస్సుదారుణమ్‌ | యుద్ధం బభూవ విప్రేంద్ర తేషాం చ యదువంశినామ్‌ || 14

భ్రాత్రా రామేణ సహితః ప్రద్యుమ్నేన చ ధీమతా | కృష్ణశ్చకార సమరమతులం ప్రమథైస్సహ || 15

బాణునికొరకై రుద్రభగవానుడు నందియనే వృషభమునధిరోహించి తమ కుమారులతో మరియు ప్రమథగణములతో కూడినవాడై యుద్ధమును చేయుటకు విచ్చేసెను (9). అపుడు కృష్ణుడు మొదలగు వారికి బాణుని రక్షించే రుద్రుడు మొదలగు వారితో రోమాంచమును కలిగించే అద్భుతమగు తుములయుద్ధము జరిగెను (10) . కృష్ణునకు శంకరునితో, ప్రద్యుమ్నునకు కుమారస్వామితో, బలరామునకు కూష్మాండకూపకర్ణులతో, సాంబునకు బాణుని పుత్రునితో, సాత్యకికి బాణునితో, గరుడునకు నందితో మరియు ఇతరులకు ఇతరులతో ద్వంద్వయుద్ధము జరిగెను (11, 12). బ్రహ్మ మొదలగు దేవ నాయకులు, మునులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు మరియు అప్సరసలు తమ తమ వాహనములపై మరియు విమానములలో చూచుటకు వచ్చిరి (13). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా ! ఆ యదువంశీయులకు రేవతీగణము వరకు గల వివిధప్రమథ గణములతో దారుణమగు యుద్ధము జరిగెను (14). శ్రీకృష్ణుడు సోదరుడగు బలరామునితో మరియు బుద్ధిశాలియగు ప్రద్యుమ్నునితో గూడి ప్రమథగణములతో సాటిలేని యుద్ధమును చేసెను (15).

తత్రాగ్నినా%భవద్యుద్ధం యమేన వరుణన చ | విముఖేన త్రిపాదేన జ్వరేణ చ గుహేన చ || 16

వ్రమథైర్వివిధాకారైస్తేషామత్యంతదారుణమ్‌ | యుద్ధం బభూవ వికటం వృష్ణీనాం రోమహర్షణమ్‌ || 17

విభీషికాభిర్బహ్వీభిః కోటరీభిః పదే పదే | నిర్లజ్జాభిశ్చ నారీభిః ప్రబలాభిరదూరతః || 18

శంకరానుచరాన్‌ శౌరిర్భూతప్రమథగుహ్యకాన్‌ | ద్రావయామాస తీక్‌ష్ణాగ్రై శ్శరైశ్శార్‌ఙ్గధనుశ్చ్యుతైః || 19

ఏవం ప్రద్యుమ్నప్రముఖా వీరా యుద్ధమహోత్సవాః | చక్రుర్యుద్ధం మహాఘోరం శత్రుసైన్యం వినాశయన్‌ || 20

విశీర్యమాణం స్వబలం దృష్ట్వా రుద్రో%త్యమర్షణః | క్రోధం చకార సుమహన్ననాద చ మహోల్బణమ్‌ || 21

తచ్ఛ్రుత్వా శంకరగణా వినేదుర్యుయుధుశ్చ తే | మర్దయన్‌ ప్రతియోద్ధారం వర్ధితాశ్శంభుతేజసా || 22

అప్పుడు అగ్నియమవరుణులకు విముఖ త్రిపాద జ్వర గుహులతో యుద్ధము జరిగెను (16). ఆ యాదవులకు వివిధములగు ఆకారములు గల ప్రమథులతో, భయమును గొల్పు అనేక కోటరీ గణములతో మరియు సిగ్గును విడచిన బలవంతులగు స్త్రీలయొక్క దట్టమగు సైన్యముతో ప్రతి అడుగునందు మిక్కిలి భయంకరము, బీభత్సము అగు యుద్ధము జరిగెను (17, 18). శ్రీ కృష్ణుడు శార్‌ఙ్గధనస్సునుండి ప్రయోగించబడిన వాడియగు బాణములతో శంకరుని అనుచరులగు భూతములను, ప్రమథులను మరియు గుహ్యకులను తరుమజొచ్చెను (19). ఈ విధముగా యుద్ధమును గొప్ప ఉత్సవముగా పరిగణించే ప్రద్యుమ్నాది వీరులు మహాభయంకరమగు యుద్ధములో శత్రుసైన్యమును వినాశమొనర్చిరి (20). చెల్లాచెదరగుచున్న తమ సైన్యమును గాంచిన రుద్రుడు సహనమును గోల్పోయి అతిభయంకరమగు క్రోధమును పొంది పెద్ద సింహనాదమును చేసెను (21). శంభుని తేజస్సుచే వృద్ధిని పొందిన శంకరగణములు దానిని విని తాము కూడ నినదించి శత్రువులను సంహరిస్తూ యుద్ధమును చేసిరి (22).

పృథగ్విధాని చాయుంక్త శార్‌ఙ్గాస్త్రాణి పినాకినే | ప్రత్యక్షైశ్శమయామాస శూలపాణిరవిస్మితః || 23

బ్రహ్మాస్త్రస్య చ బ్రహ్మాస్త్రం వాయవ్యస్య చ పార్వతమ్‌ | ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం నారాయణస్య చ || 24

కృష్ణసైన్యం విదుద్రావ ప్రతివీరేణ నిర్జితమ్‌ | న తస్థౌ సమరే వ్యాస పూర్ణరుద్రసు తేజసా || 25

విద్రావితే స్వసైన్యే తు శ్రీ కృష్ణశ్చ పరంతపః | స్వం జ్వరం శీతలాఖ్యం హి వ్యసృజద్దారుణం మునే || 26

విద్రావితే కృష్ణసైన్యే కృష్ణస్య శీతలజ్వరః | అభ్యపద్యత తం రుద్రం మునే దశ దిశో దహన్‌ || 27

మహేశ్వరో%థ తం దృష్ణ్వా%%యాంతం స్వం విసృజన్‌ జ్వరమ్‌ | మాహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ || 28

వైష్ణవో%థ సమాక్రందన్మాహేశ్వరబలార్దితః | అలబ్ధ్వా%భయమన్యత్ర తుష్టావ వృషభధ్వజమ్‌ || 29

అథ ప్రసన్నో భగవాన్‌ విష్ణుజ్వరనుతో హరః | విష్ణుశీతజ్వరం ప్రాహ శరణాగతవత్సలః || 30

శ్రీ కృష్ణుడు తన శార్‌ఙ్గమునుండి వివిధములగు అస్త్రములను శివునిపై ప్రయోగించెను. కాని శూలమును చేతిలో ధరించియుండే శివుడు విస్మయమును పొందకుండగనే వాటిని ప్రత్యక్షములగు ఆయుధములతో శాంతింపజేసెను (23). ఆయన బ్రహ్మాస్త్రమును బ్రహ్మాస్త్రముతో, వాయవ్యాస్త్రమును పార్వతాస్త్రముతో, ఆగ్నేయమును పర్జన్యాస్త్రముతో మరియు నారాయణాస్త్రమును పాశుపతాస్త్రముతో, శమింపజేసెను (24). ఓ వ్యాసా ! యుద్ధములో రుద్రుని పూర్ణతేజస్సు ముందు నిలబడజాలక శ్రీకృష్ణుని సైన్యము ప్రతిపక్షముచే జయించబడి పారిపోయెను (25). ఓ మునీ! శత్రువులను తపింపజేయు శ్రీకృష్ణుడు తన సైన్యము చెల్లాచెదరు అగుటను గాంచి శీతలము అను పేరు గల తన భయంకరమగు జ్వరమును విడిచిపెట్టెను (26). ఓ మునీ ! శ్రీ కృష్ణుని సైన్యము పారిపోగా, ఆయన ప్రయోగించిన శీతలజ్వరము పది దిక్కులను దహింపజేయుచు రుద్రుని మీదకు వచ్చెను (27). అపుడు తన మీదకు వచ్చుచున్న ఆ జ్వరమును గాంచి మహేశ్వరుడు తన జ్వరమును విడిచిపెట్టెను. ఆ మాహేశ్వర-వైష్ణవజ్వరములు రెండు యుద్ధమును చేసినవి (28). అపుడు మాహేశ్వరజ్వరముయొక్క బలముచే పీడించబడిన వైష్ణవజ్వరము ఇతరత్రా అభయమును పొందజాలక వృషభధ్వజుని స్తుతించెను (29). అపుడు శరణాగతవత్సలుడగు శివుడు విష్ణుజ్వరముయొక్క స్తోత్రముచే ప్రసన్నుడై ఆ శీతలజ్వరముతో నిట్లనెను (30).

మహేశ్వర ఉవాచ -

శీతజ్వర ప్రసన్నో%హం వ్యేతు తే మజ్జ్వరాద్భయమ్‌ | యో నౌ స్మరతి సంవాదం తస్య న స్యాజ్జ్వరాద్భయమ్‌ || 31

మహేశ్వరుడు ఇట్లు పలికెను -

ఓ శీతజ్వరమా !నేను నీ విషయములో ప్రసన్నుడనైతిని. నీకు నా జ్వరము వలని భయము తొలగిపోయినది. మన ఇద్దరి సంభాషణను ఎవడైతే స్మరించునో, వానికి జ్వరభయము ఉండదు (31).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తో రుద్రమానమ్య గతో నారాయణజ్వరః | తం దృష్ట్వా చరితం కృష్ణో విసిస్మాయ భయాన్వితః || 32

స్కందః ప్రద్యుమ్నబాణౌఘైరర్ద్యమానో%థ కోపితః | జఘాన శక్త్యా ప్రద్యుమ్నం దైత్యసంఘాత్యమర్షణః || 33

స్కందశక్తిహతస్తత్ర ప్రద్యుమ్నః ప్రబలో%పి హి | అసృ గ్విముంచన్‌ గాత్రేభ్యో బలేనాపాక్రమద్రణాత్‌ || 34

కుంభాండకూపకర్ణాభ్యాం నానాసై#్త్రశ్చ సమాహతః | దుద్రావ బలభద్రో%పి న తస్థే%పి రణ బలీ || 35

కృత్వా సహస్రం కాయానాం పీత్వా తోయం మహార్ణవాత్‌ | గరుడో నాశయత్యర్థావర్తైర్మేఘార్ణవాంబుభిః || 36

అథ క్రుద్ధో మహేశస్య వాహనో వృషభో బలీ | వేగేన మహతారం వైశృంగాభ్యాం నిజఘాన తమ్‌ || 37

శృంగఘాతవిశీర్ణాంగో గరుడో%తీవ విస్మితః | విదుద్రావ రణత్తూర్ణం విహాయ చ జనార్దనమ్‌ || 38

ఏవం జాతే చరిత్రం తు భగవాన్‌ దేవకీసుతః | ఉవాచ సారథిం శీఘ్రం రుద్రతేజోతివిస్మితః || 39

సనత్కుమారుడిట్లు పలికెను -

రుద్రుడిట్లు పలుకగా నారాయణజ్వరము ఆయనకు ప్రణమిల్లి నిష్క్రమించెను. ఆ ఘటనను గాంచి శ్రీ కృష్ణుడు చకితుడై భయమును పొందెను (32). అపుడు రాక్షస సంహారకుడగు కుమారస్వామి ప్రద్యుమ్నుని బాణపరంపరలచే పీడింపబడినవాడై దానిని సహించనివాడై కోపించి ప్రద్యుమ్నుని కొట్టెను (33). కుమారస్వామియొక్క శక్తిచే బలముగా కొట్టబడిన ప్రద్యుమ్నుడు గొప్ప బలశాలియే అయిననూ శరీరావయవములనుండి రక్తము స్రవించుచుండగా అపుడు రణరంగమునుండి పారిపోయెను (34). కుంభాండకూపకర్ణులచే వివిధములగు అస్త్రములచే గట్టిగా కొట్టబడిన బలరాముడు బలశాలియే అయినా యుద్ధమునందు నిలబడలేక పారిపోయెను (35). గరుడుడు వేయి దేహములను దాల్చి మహాసముద్రమునుండి నీటిని త్రాగి ప్రళయకాలమేఘముల జలధారలతో శత్రువులను ముంచెత్తి నశింపజేసెను (36). అపుడు బలవంతుడు, మహేశుని వాహనము అగు నంది మహావేగముతో ఆతనిని కొమ్ములతో పొడిచెను (37). కొమ్ముపోట్లచే శిథిలమైన అవయవములు గల గరుడుడు మిక్కిలి ఆశ్చర్యమును పొంది జనార్దనుని విడిచిపెట్టి రణరంగమునుండి వెంటనే పారిపోయెను (38).దేవకీనందనుడగు శ్రీ కృష్ణభగవానుడు ఈ ఘటనలను గాంచి రుద్రుని తేజస్సును స్మరించి అత్యాశ్చర్యమును పొందినవాడై వెంటనే సారథితోనిట్లు పలికెను (39).

శ్రీ కృష్ణ ఉవాచ |

హే సూత శృణు మద్వాక్యం రథం మే వాహయ ద్రుతమ్‌ | మహాదేవసమీపస్థో యథా స్యాం గదితుం వచః || 40

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ సూతా !నా మాటను వినుము. నా రథమును వెంటనే మహాదేవుని సమీపమునకు గొనిపొమ్ము. నేను ఆయనతో మాటలాడవలసియున్నది (40).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తో హరిణా సూతోదారుకస్స్వగుణాగ్రణీః | ద్రుతం తం వాహయామాస రథం రుద్రసమీపతః || 41

అథ విజ్ఞాపయా మాస నతో భూత్వా కృతాంజలిః | శ్రీ కృష్ణశ్శంకరం భక్త్యా ప్రపన్నో భక్తవత్సలమ్‌ || 42

సనత్కమారుడు ఇట్లు పలికెను -

శ్రీకృష్ణుడు ఇట్లు పలుకగా, రథమును నడుపుటలో అగ్రేసరుడగు దారుకుడు ఆ రథమును వెంటనే రుద్రుని సమీపమునకు తోలుకొని వెళ్లెను (41). అపుడు శ్రీకృష్ణుడు చేతులను జోడించి సమస్కరించి, భక్తవత్సలుడగు శంకరుని శరణు పొంది భక్తితో ఇట్లు విన్నవించుకొనెను (42).

శ్రీ కృష్ణ ఉవాచ |

దేవ దేవ మహాదేవ శరణాగతవత్సల | నమామి త్వా%నంతశక్తిం సర్వాత్మానం పరేశ్వరమ్‌ || 43

విశ్వోత్పత్తిస్థాననాశ##హేతుం సద్‌ జ్ఞప్తిమాత్రకమ్‌ | బ్రహ్మలింగం పరం శాంతం కేవలం పరమేశ్వరమ్‌ || 44

కాలో దైవం కర్మ జీవస్స్వభావో ద్రవ్యమేవ చ | క్షేత్రం చ ప్రాణ ఆత్మా చ వికారస్తత్సమూహకః || 45

బీజరోహప్రవాహస్తు త్వన్మాయైషా జగత్ర్పభో | తన్నిబంధం ప్రపద్యేహం త్వామహం పరమేశ్వరమ్‌ || 46

నానాభావైర్లీలయైవ స్వీకృతైర్నిర్జరాదికాన్‌ | నూనం బిభర్షి లోకేశో హంస్యున్మార్గాన్‌ స్వభావతః || 47

త్వం హి బ్రహ్మ పరం జ్యోతిర్గూఢం బ్రహ్మణి వాఙ్మయే | యం పశ్యంత్యమలాత్మానమాకాశమివ కేవలమ్‌ || 48

త్వమేవ చాద్యః పురుషో%ద్వితీయస్తుర్య ఆత్మదృక్‌ | ఈశో హేతురహేతుశ్చ సవికారః ప్రతీయసే || 49

స్వమాయయా సర్వగుణప్రసిద్ధ్యై భగవనో ప్రభో | సర్వాన్వితః ఫ్రభిన్నశ్చ సర్వతస్త్వం మహేశ్వర || 50

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ దేవ దేవా! మహాదేవా! శరణాగతవత్సలుడు, అనంతశక్తి గలవాడు, సర్వమునకు ఆత్మ అయినవాడు, పరమేశ్వరుడు (43). జగత్తుయొక్క ఉత్పత్తిస్థితిలయములకు కారణమైన వాడు, సద్ఘనుడు, కేవలజ్ఞానఘనుడు, లింగరూపములో వెలిసిన పరబ్రహ్మ నిర్వికారుడు, అద్వయుడు అగు నీకు నమస్కరించుచున్నాను (44). ఓ జగత్ర్పభూ! కాలము, అదృష్టము, కర్మ, జీవుడు, అజ్ఞానము, ద్రవ్యము, పంచభూతాది క్షేత్రము, ప్రాణము, దేహము, ప్రకృతివికారముల సముదాయము, బీజాంకురప్రవాహము అను ఈ సర్వము నీ మాయయే సుమా ! పరమేశ్వరుడవగు నీవు ఈ సర్వమునకు కారణమగుచున్నావు. నిన్ను నేను శరణు పొందుచున్నాను (45, 46). లోకేశ్వరుడవగు నీవు లీలచే వివిధరూపములలో ప్రకటమై దేవతలను మొదలగు వారిని నిశ్చయముగా రక్షించి, అజ్ఞానముచే అ ధర్మమార్గములో ఉన్నవారిని దండించుచున్నావు (47). వేదవాఙ్మయమునందు దాగియున్న పరంబ్రహ్మవు, పరంజ్యోతివి నీవే. ఆకాశమువలె శుద్ధము, అద్వయము, ఆత్మస్వరూపము అగు నిన్ను జ్ఞానులు దర్శించెదరు (48). సృష్ట్యాదియందు ఉన్న అద్వయపురుషుడవు నీవే. జాగ్రత్స్వప్నసుషుప్తులకు అతీతమైన తురీయసాక్షిచైతన్యము నీవే. నిర్గుణుడవగు నీవు మాయాసహితుడవై జగత్కారణమగుచున్నావు; వికారములు లేకున్ననూ, ఉన్నట్లు కన్పట్టుచున్నావు (49). హే భగవన్‌! ప్రభూ ! ప్రకృతిగుణములు జగద్రూపముగా పరిణమించుటకొరకై నీవు నీ మాయతో గూడి జగత్తులోని విభిన్నవస్తువుల రూపములో భాసిస్తూ సర్వమునకు అధిష్ఠానమై సర్వము కలవాడువలె కన్పట్టుచున్నావు (50).

యథైవ సూర్యోపిహితశ్ఛాయారూపాణి చ ప్రభో | స్వచ్ఛాయయా సంచకాస్తి హ్యయం పరమదృగ్భవాన్‌ || 51

గుణనాపిహితో%పి త్వం గుణనైవ గుణాన్‌ విభో | స్వప్రదీపశ్చకాస్సి త్వం భూమన్‌ గిరిశ శంకర || 52

త్వన్మాయామోహితధియః పుత్రదారగృహాదిషు | ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్తా వృజినార్ణవే || 53

దైవదత్తమిమం లభ్ధ్వా నృలోకమజితేంద్రియః | యో నాద్రియేత త్వత్పాదౌ స శోచ్యో హ్యాత్మవంచకః || 54

త్వదాజ్ఞయాహం భగవన్‌ బాణదోశ్ఛేత్తుమాగతః | త్వయైవ శప్తో బాణో%యం గర్వితో గర్వహారిణా || 55

నివర్తస్వ రణాద్దేవ త్వచ్ఛాపో న వృథా భ##వేత్‌ | ఆజ్ఞాం దేహి ప్రభో మేం త్వం బాణస్య భుజకృంతనే || 56

సూర్యుడు తన ప్రకాశముచే సర్వవస్తువులను, మరియు సూర్యుని కప్పివేయు మేఘాదులను కూడ ప్రకాశింపజేయును. అటులనే, పరమాత్మవగు నీవు సాక్షివై సర్వమును ప్రకాశింపజేయుచున్నావు (51). ఓ కైలాసవాసా! శంకరా! నీవు గుణములచే బంధింప బడకపోయిననూ, గుణములచేతనే గుణములను ప్రకాశింప జేయుచున్నావు. స్వయంప్రకాశస్వరూపుడవగు నీవు పరబ్రహ్మవు (52). నీ మాయచే మోహమును పొందిన బుద్ధి గలవారు సంతానము, భార్య, ఇల్లు, మొదలగు వాటియందు ఆసక్తి గలవారై పాపమనే సముద్రమునందు మునుగుతూ, తేలుతూ ఉందురు (53). మానవుడు ఈశ్వరునిచే అనుగ్రహించబడిన ఈ దేహమును పొందియు, ఇంద్రియములను జయించలేక నీ పాదపద్మములయందు ఆదరము లేనివాడై ఆత్మవంచనను చేసుకొని, శోచింప దగినవాడు అగుచున్నాడు (54). హే భగవన్‌! నీ ఆజ్ఞచే నేను బాణుని చేతులను నరుకుటకు వచ్చియుంటిని. గర్వమును పోగొట్టే నీవు మాత్రమే గర్వితుడైన ఈ బాణుని శపించియున్నావు (55). ఓ దేవా! ఈ యుద్ధమునుండి నీవు తప్పుకొనుము. నీ శాపము వృథా కారాదు. ఓ ప్రభూ! బాణుని భుజములను నరుకుటకు నాకు ఆజ్ఞను ఇమ్ము (56).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచశ్శంభుః శ్రీకృష్ణస్య మునీశ్వర | ప్రత్యువాచ ప్రసన్నాత్మా కృష్ణస్తుత్యా మహేశ్వరః || 57

సనత్కుమారుడు ఇట్లు పలికెను...

ఓ మహర్షీ! శ్రీకృష్ణుని ఈ మాటను విని ఆయన చేసిన స్తుతిచే ప్రసన్నమైన మనస్సుగల మహేశ్వరుడగు శంభుడు ఇట్లు బదులిడెను (57).

మహేశ్వర ఉవాచ |

సత్యముక్తం త్వయా తాత మయా శప్తో హి దైత్యరాట్‌ | మదాజ్ఞయా భవాన్‌ ప్రాప్తో బాణదోర్దండకృంతనే || 58

కిం కరోమి రమానాథ భక్తాధీనస్సదా హరే | పశ్యతో మే కథం వీర స్యాద్బాణభుజకృంతనమ్‌ || 59

అతస్త్వం జృంభణాస్త్రేణ మాం జృంభయ మదాజ్ఞయా | తతస్త్వం కురు కార్యం స్వం యథేష్టం చ సుఖీ భవ || 60

మహేశ్వరుడిట్లు పలికెను-

ఓ కుమారా! నీవు సత్యమును పలికితివి. రాక్షసరాజును శపించినది నేనే. నీవు నా ఆజ్ఞ చేతనే బాణుని చేతులను నరుకుటకు వచ్చియుంటివి (58). ఓ లక్ష్మీపతి! నేను ఏమి చేయగలను ? నేను సర్వదా భక్తులకు ఆధీనుడనై యుందును. ఓ వీరా! నేను చూచు చుండగా బాణుని చేతులను నరుకుట ఎట్లు సంభవమగును ? (59) కావున నీవు నా ఆజ్ఞచే జృంభణాస్త్రమును ప్రయోగించి నేను స్పృహను కోల్పోవునట్లు చేసి, ఆ తరువాత నీ పనిని యథేచ్ఛగా పూర్తి చేసుకొని సుఖుమును పొందుము (60).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తశ్శంకరేణాథ శార్‌ఙ్గపాణిస్సువిస్మితః | స్వరణస్థానమాగత్య ముమోద స మునీశ్వర || 61

జృంభణాస్త్రం ముమోచాథ సంధాయ ధనుషి ద్రుతమ్‌ | పినాకపాణయే వ్యాస నానాస్త్ర కుశలో హరిః || 62

మోహయిత్వా తు గిరిశం జృంభణాస్త్రేణ జృంభితమ్‌ | బాణస్య పృతనాం శౌరిర్జఘానాసిగదర్‌ష్టిభిః || 63

ఇతి శ్రీశివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే బాణాసుర కృష్ణయుద్ధవర్ణనం నామ చతుఃపంచాశత్తమో%ధ్యాయః (54).

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! శంకరుడిట్లు పలుకగా శార్‌ఙ్గధారియగు ఆ విష్ణువు మిక్కిలి విస్మయమును పొంది యుద్ధరంగములో తన స్థానమునకు వచ్చి ఆనందించెను (61). ఓ వ్యాసా! అప్పుడు వివిధములగు అస్త్రములలో సమర్థుడగు హరి ధనస్సునందు వెంటనే జృంభణాస్త్రమును సంధించి పినాకధారియగు శివునిపైకి వదిలిపెట్టెను (62). జృంభణాస్త్రముచే శివుడు ఆవులిస్తూ మోహితుడగునట్లు చేసి శ్రీకృష్ణుడు బాణుని సైన్యమును కత్తులు, గదలు, శక్తులు అను ఆయుధములతో సంహరించెను (63).

శ్రీశివమహాపురాణములోని రుద్రసంహితయందలి యుద్ధఖండలో బాణాసుర కృష్ణయుద్ధమనే ఏబది నాల్గవ అధ్యాయము ముగిసినది (54).

Siva Maha Puranam-3    Chapters