Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయోదశో%ధ్యాయః

వటుకోత్పత్తి

సూత ఉవాచ |

యథాభవల్లింగ రూపస్సంపూజ్యస్త్రి భ##వే శివః | తథోక్తం వా ద్విజాః ప్రీత్యా కిమన్య చ్ఛ్రోతుమిచ్ఛథ || 1

సూతుడిట్లు పలికెను-

ఓ ద్విజులారా! ముల్లోకములలో శివుడు లింగరూపములో పూజింపబడే విధానమును ప్రీతితో చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నారు? (1)

ఋషయ ఊచుః |

అంధకేశ్వరలింగస్య మహిమానం వద ప్రభో | తథాన్యచ్ఛివ లింగానాం ప్రీత్యా వక్తు మిహార్హసి || 2

ఋషులు ఇట్లు పలికిరి-

ఓ ప్రభూ! అంధకేశ్వరలింగము యొక్క మహిమను, మరియు ఇతర శివలింగములను గురించి ప్రేమతో నీవు ఈ సమయములో చెప్పదగును (2).

సూత ఉవాచ |

పురాబ్ధిగర్తమాశ్రిత్య వసన్‌ దైత్యో%ంధకాసురః | స్వవశం కారయామాస త్రైలోక్యం సురసూదనః || 3

తస్మాద్గర్తాచ్చ నిస్సృత్య పీడయిత్వా పునః ప్రజాః | ప్రావిశచ్చ తదా దైత్యస్తం గర్తం సుపరాక్రమః || 4

దేవాశ్చ దుఃఖితాస్సర్వే శివం ప్రార్థ్య పునః పునః | సర్వం నివేదయామాసు స్స్వదుఃఖం చ మునీశ్వరాః || 5

తదాకర్ణ్య వచస్తే షాం దేవానాం పరమేశ్వరః | ప్రత్యువాచ ప్రసన్నాత్మా దుష్టహంతా సతాం గతిః || 6

సూతుడిట్లు పలికెను-

పూర్వము అంధకాసురుడు సముద్రములోని ఒక లోతైన స్థానమునాశ్రయించి దేవతలను జయించి ముల్లోకములను తన వశము చేసుకొనెను (3). ఆతడు ఆ లోతైన స్థానమునుండి బయటకు వచ్చి ప్రజలను పీడించి మరల దానిలో ప్రవేశించెడివాడు. ఆ రాక్షసుడు మహాపరాక్రమ శాలి (4). దుఃఖితులైన దేవతలందరు శివుని పలుమార్లు ప్రార్థించిరి. ఓ మహర్షులారా! వారు ఆయనకు తమ దుఃఖమునంతనూ విన్నవించుకొనిరి (5). దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అగు ఆ పరమేశ్వరుడు ఆ దేవతల పలుకులను విని ప్రసన్నమగు మనస్సు గల వాడై ఇట్లు బదులిడెను (6).

శివ ఉవాచ |

ఘాతయిష్యామి తం దైత్యమంధకం సురసూదనమ్‌ | సైన్యం చ నీయతాం దేవా హ్యాయామి చ గణౖస్సహ || 7

తస్మాద్గర్తా దంధకే హి దేవర్షి ద్రుహి భీకరే | నిస్సృతే చ తదా తస్మిన్‌ దేవా గర్తముపాశ్రితాః || 8

దైత్యాశ్చ దేవతాశ్చైవ యుద్ధం చక్రు స్సుదారుణమ్‌ | శివానుగ్రహతో దేవాః ప్రబలాశ్చాభవంస్తదా || 9

దేవైశ్చ పీడితస్సో%పి యావద్గర్తము పాగతః | తావచ్ఛూలేన సంప్రోతశ్శివేన పరమాత్మనా || 10

తత్రత్యశ్చ తదా శంభుం ధ్యాత్వా సంప్రార్థయత్తదా | అంతకాలే చ త్వాం దృష్ట్వా తా దృశో భవతి క్షణాత్‌ || 11

ఇత్వేవం సంస్తుత స్సో%పి ప్రసన్న శ్శంకరస్తదా | ఉవాచ వచనం తత్ర వరం బ్రూహి దదామి తే || 12

ఇత్యేవం వచనం శ్రుత్వా స దైత్యః పునరబ్రవీత్‌ | సుప్రణమ్య శివం స్తుత్వా సత్త్వభావము పాశ్రితః | 13

శివుడిట్లు పలికెను-

దేవతలను పీడించే ఆ అంధకాసురుని నేను సంహరించగలను. దేవతలారా! సైన్యముతో నడువుడు. నేను కూడ గణములతో కలిసి వచ్చుచున్నాను (7). దేవతలకు, ఋషులకు ద్రోహమునాచరించే భయంకరుడగు అంధకుడు ఆ సముద్రగర్భములోని బిలమునుండి బయటకు రాగానే దేవతలా బిలములో ప్రవేశించిరి (8). దేవదానవుల మధ్య మిక్కిలి భయంకరమగు యుద్ధము జరిగెను. కాని శివుని అనుగ్రహముండుటచే అపుడు దేవతల బలము అతిశయించెను (9). దేవతలచే పీడింపబడి ఆ రాక్షసుడు బిలము వద్దకు వచ్చుసరికి పరమాత్మయగు శివుడు వానిని శూలముతో పొడిచెను (10). అపుడాతడు అచట నిలబడి శంభుని ధ్యానించి ఇట్లు ప్రార్థించెను:, మరణసమయములో నిన్ను దర్శించిన వ్యక్తి అదేక్షణములో నీ వంటి వాడు అగును (11). అతడిట్లు స్తుతించగా అపుడు శంకరుడు ప్రసన్నుడై 'వరమును కోరుకొనుము. నీకు ఇచ్చెదను' అని పలికెను (12). ఈ మాటను విని ఆ రాక్షసుడు సత్త్వగుణప్రధానమగు హృదయము గలవాడై శివునకు ప్రణమిల్లి స్తుతించి మరల ఇట్లు పలికెను (13).

అంధక ఉవాచ |

యది ప్రసన్నో దేవేశ స్వభక్తిం దేహి మే శుభామ్‌ | కృపాం కృత్వా విశేషేణ సంస్థితో భవ చేహ వై || 14

అంధకుడిట్లు పలికెను-

ఓ దేవదేవా! నీవు ప్రసన్నుడవైనచో నీయందు శుభకరమగు భక్తిని నాకు కలిగించుము. నీవు ప్రత్యేకమగు కృపను చూపి ఇచటనే స్థిరముగా నుండుము (14).

సూత ఉవాచ |

ఇత్యుక్తస్తేన దైత్యం తం తద్గర్తే చాక్షిపద్ధరః | స్వయం తత్ర స్థితో లింగరూపో%సౌ లో కకామ్యయా || 15

అంధకేశం చ తల్లింగం నిత్యం యః పూజయేన్నరః | షణ్మాసా జ్జాయతే తస్య వాంఛా సిద్ధిర్న సంశయః || 16

వృత్త్యర్థం పూజయేల్లింగం లోకస్య హితకారకమ్‌ | షణ్మాసం యో ద్విజశ్చైవ స వై దేవలకస్స్మృతః || 17

యథా దేవలకశ్చైవ స భ##వేదిహ వై తదా | దేవలకశ్చ యః ప్రోక్తో నాధికారో ద్విజస్య హి || 18

సూతుడు ఇట్లు పలికెను-

ఆ రాక్షసుడు ఇట్లు పలుకగా, శివుడు ఆతనిని ఆ బిలములో పడవేసెను. తరువాత ఆయన లోకహితమును గోరి అచట స్వయముగా లింగరూపములో నుండెను (15). ఏ మానవుడైతే ఆ అంధకేశ్వరలింగమును ప్రతి నిత్యము పూజించునో, వానికి ఆరుమాసములలో నిస్సందేహముగా కోర్కెలు ఈడేరును (16). శివలింగము లోకములకు హితమును కలిగించును. ఏ బ్రాహ్మణుడైతే జీవనవ్యయమును సంపాదించుట కొరకై ఆరుమాసములు శివలింగమును పూజించునో, వానికి దేవలకుడని పేరు. దేవలకుడై జీవించే బ్రాహ్మణునకు వైదిక కర్మలయందు అధికారము లేదు (17, 18)

ఋషయ ఊచుః |

దేవలకశ్చ కః ప్రోక్తః కిం కార్యం తస్య విద్యతే | తత్త్వం వద మహాప్రాజ్ఞ లోకానాం హితహేతవే || 19

ఋషులు ఇట్లు పలికిరి -

దేవలకుడు ఎవడు? వానికి కర్తవ్యమేమి గలదు? ఓ మహాబుద్ధిశాలీ! లోకములకు హితమును ఒనగూర్చుటకై ఈ తత్త్వమును చెప్పుము (19).

సూత ఉవాచ |

దధీచిర్నామ విప్రో యో ధర్మిష్ఠో వేదపారగః | శివభక్తిరతో నిత్యంశివశాస్త్ర పరాయణః || 20

తస్య పుత్రస్తథా హ్యాసీత్స్మృతో నామ్నా సుదర్శనః | తస్య భార్యా దుకూలా చ నామ్నా దుష్టకులోద్భవా || 21

తద్వశే స చ భర్తాసీత్తస్య పుత్రచతుష్టయమ్‌ | సో%పి నిత్యం శివసై#్యవ పూజాం చ స్మ కరోత్యసౌ || 22

దధీచేస్తు తదా హ్యాసీద్గ్రామాంతర నివేశనమ్‌ | జ్ఞాతి సంయోగతశ్చైవ జ్ఞాతిభిర్న సమోచితః || 23

కథయిత్వా చ పుత్రం స శివభక్తిరతో భవ | ఇత్యుక్త్వా స గతో ముక్తో దధీచిశ్శైవసత్తమః || 24

సుదర్శనశ్చ పుత్రో%పి శివపూజాం చకార హ | ఏవం చిరతరః కాలో వ్యతీయాయ మునీశ్వరాః || 25

ఏవం చ శివరాత్రిశ్చ సమాయాతా కదాచన | తస్యాం చోపోషితాస్సర్వే స్వయం సంయోగతస్తదా || 26

పూజాం కృత్వా గతస్సో%పి సుదర్శన ఇతి స్మృతః | స్త్రీ సంగం శివరాత్రౌ తు కృత్వా పునరిహాగతః || 27

న స్నానం తేన చ కృతం తద్రాత్యాం శివపూజనమ్‌ | తేన తత్కర్మపాకేన క్రుద్ధః ప్రోవాచ శంకరః || 28

సూతుడిట్లు పలికెను-

ధర్మాత్ముడు, వేదములను క్షుణ్ణముగా తెలిసిన వాడు, శివభక్తియందు ప్రీతి గలవాడు, నిత్యము శివశాస్త్రమునందు నిమగ్నమై యుండువాడు అగు దధీచి అనే బ్రాహ్మణుడు గలడు (20). ఆయనకు సుదర్శనుడని ప్రసిద్ధి గాంచిన పుత్రుడు గలడు. వానికి దుష్టకులమునందు జన్మించిన దుకూలయను భార్య గలదు (21). ఆతడు ఆమెకు వశుడై యుండెడివాడు. వానికి నల్గురు పుత్రులు గలరు. ఆతడు కూడ ప్రతిదినము శివుని పూజించెడివాడు (22). దధీచి బంధువులను కలుసుకొనుటకై మరియొక గ్రామమునకు వెళ్లి అచట ఉండెను. బంధువులాతనిని విడిచిపెట్టలేదు (23). జీవన్ముక్తుడు, శివభక్తాగ్రేసరుడు అగు ఆ దధీచి పుత్రునితో 'శివభక్తి యందు ప్రీతి గలవాడవు కమ్ము' అని చెప్పి వెళ్లెను (24). దధీచి పుత్రుడగు సుదర్శనుడు కూడ శివుని పూజించుచుండెను. ఓ మహర్షులారా! ఈ తీరున చాల కాలము గడిచెను (25). ఇంతలో ఒకనాడు శివరాత్రి వచ్చెను. ఆనాడు అందరు ఉపవాసముండిరి. సుదర్శనుడు తానుకూడ ఉపవసించెను (26). సుదర్శనుడు పూజను చేసి వెళ్లెను. కాని శివరాత్రినాడు ఆతడు స్త్రీసంగము గలవాడై ఇచటకు మరల వచ్చెను (27). ఆతడు స్నానమును చేయలేదు. ఆనాటి రాత్రి శివుని పూజించలేదు. ఆతని ఆ చేష్టలచే శంకరుడు కోపించి ఇట్లు పలికెను (28).

మహేశ్వర ఉవాచ |

శివరాత్ర్యాం త్వయా దుష్ట సేవనం చ స్త్రియాః కృతమ్‌ | అస్నాతేన మదీయా చ కృతా పూజా%వివేకినా || 29

జ్ఞాత్వా చైవం కృతం యస్మాత్తస్మాత్త్వం జడతాం వ్రజ | మమాస్సృశ్యో భవ త్వంచ దూరతస్స్పర్శనం కురు || 30

మహేశ్వరుడిట్లు పలికెను-

ఓరీ దుష్టా! నీవు శివరాత్రి నాడు స్త్రీతో కులాసాగా గడిపితివి. మరియు వివేకహీనుడవగు నీవు స్నానమును చేయకుండగా నన్ను పూజించితివి (29). నీవు తెలిసి కూడా ఇట్లు చేసితివి గాన జడుడవు కమ్ము. నీకు నన్ను స్పృశించే అధికారము లేదు. నాకు దూరముగా నుండుము (30).

సూత ఉవాచ |

ఇతి శప్తో మహేశేన దాధీచిస్స సుదర్శనః | జడత్వం ప్రాప్తవాన్‌ సద్యశ్శివమాయా విమోహితః || 31

ఏతస్మిన్‌ సమయే విప్రా దధీచిశ్శైవసత్తమః | గ్రామాంతరాత్సమాయాతో వృత్తాంతం శ్రుతవాంశ్చ సః || 32

శివేన భర్త్సి తస్సో%పి దుఃఖితో%భూదతీవ హి | రురోద హా హతో%స్మీతి దుఃఖేన సుతకర్మణా || 33

పునః పునరువాచేతి స దధీచిస్సతాం మతః | అనేనేదం కుపుత్రేణ హతం మే కులముత్తమమ్‌ || 34

న పుత్రో%పి హతో భార్యాం పుంశ్చలీం కృతవాన్‌ ద్రుతమ్‌ | పశ్చాత్తాపమను ప్రాప్య స్వపిత్రా పరిభర్త్సితః || 35

తత్పిత్రా గిరిజా తత్ర పూజితా విధిభిర్వరైః | సుయత్నతో మహాభక్త్యా స్వపుత్ర సుఖహేతవే || 36

సుదర్శనో%పి గిరిజాం పూజయామాస చ స్వయమ్‌ | చండీపూజనమార్గేణ మహాభక్త్యా శుభైస్త్నవైః || 37

సూతుడు ఇట్లు పలికెను-

దధీచి పుత్రుడగు సుదర్శనుడు శివమాయచే విమోహితుడై, మహేశ్వరుడీ తీరున శపించిన వెంటనే జడుడు ఆయెను (31). ఓ బ్రాహ్మణులారా! ఇంతలో శివభక్తాగ్రగణ్యుడగు దధీచి గ్రామాంతరమునుండి మరలి వచ్చి ఆ వృత్తాంతమును వినెను (32). శివుడు ఆయనను భయపెట్టెను. ఆయన పుత్రుడు చేసిన పనివలన అతిశయించిన దుఃఖమును పొంది 'అయ్యో! నేను హతుడనైతిని' అని పలుకుతూ రోదించెను (33). సత్పురుషులకు సమాదరణీయుడగు ఆ దధీచి పలుమార్లు ఇట్లు పలికెను: దుష్టుడగు ఈ నా పుత్రుడు ఉత్తమమగు నా కులమునకు వినాశమును దెచ్చినాడు (34). నా పుత్రుడు కూడ వినాశమును పొందినాడు ఆతడు నిశ్చితముగా దుష్టురాలిని వివాహమాడినాడు. ఈ విధముగా తండ్రి నిందించగా, ఆ కుమారుడు పశ్చాత్తాపమును పొందినాడు (35). అపుడు దధీచి తన పుత్రుని సుఖము కొరకై శ్రేష్ఠ విధానముననుసరించి మహాభక్తితో శ్రద్ధాపూర్వకముగా పార్వతిని పూజించెను (36). సుదర్శనుడు కూడ చండీపూజావిధానముననుసరించి మహాభక్తితో శుభస్తోత్రములతో తాను కూడ పార్వతిని పూజించెను (37).

ఏవం తౌ పితృపుత్రౌ హి నానోపాయై స్సుభక్తితః | ప్రసన్నాం చక్రతుర్దేవీం గిరిజాం భక్తవత్సలామ్‌ || 38

తయోస్సేవాప్రభావేణ ప్రసన్నా చండికా తదా | సుదర్శనం చ పుత్రత్వే చకార గిరిజా మునే || 39

శివం ప్రసాదయామాస పుత్రార్థే చండికా స్వయమ్‌ | క్రుద్ధో%క్రుద్ధో పునశ్చండీ తత్పుత్రస్య ప్రసన్నధీః || 40

అథాజ్ఞాయ ప్రసన్నం తం మహేశం వృషభధ్వజమ్‌ | నమస్కృత్య స్వయం తస్య హ్యుత్సంగే తం న్యవేశయత్‌ || 41

ఘృతస్నానం తతః కృత్వా పుత్రస్య గిరిజా స్వయమ్‌ | త్రిరావృత్తో పవీతం చగ్రంథినైకేన సంయుతమ్‌ || 42

సుదర్శనాయ పుత్రాయ దదౌ ప్రీత్యా తదాంబికా | ఉద్దిశ్య శివగాయత్రీం షోడశాక్షరసంయుతామ్‌ || 43

తదోం నమశ్శివాయేతి శ్రీ శబ్దపూర్వకాయ చ | వరాన్‌ షోడశ సంకల్పపూజాం కుర్యాదయం వటుః || 44

ఈ విధముగా ఆ తండ్రి కొడుకులు మహాభక్తితో అనేకములగు ఉపాయములననుష్ఠించి భక్తవత్సలయగు పార్వతీ దేవిని ప్రసన్నము చేసుకొనిరి (38). ఓ మునీ! వారి సేవయొక్క ప్రభావముచే ప్రసన్నురాలైన పర్వతరాజపుత్రిక యగు చండిక అపుడు సుదర్శనుని తన పుత్రునిగా స్వీకరించెను (39). తాను పుత్రునిగా స్వీకరించిన ఆ సుదర్శనుని కొరకై ఆ చండిక స్వయముగా ప్రార్థించగా కోపమును పొందియున్న శివుడు కోపమును విడనాడెను. అపుడు చండి మరియు వారి పుత్రుడగు సుదర్శనుడు ప్రసన్నమనస్కులైరి (40). వృషభధ్వజుడగు మహేశ్వరుడు ప్రసన్నుడైనాడని తెలిసి ఆమె ఆయనకు నమస్కరించి సుదర్శనుని స్వయముగా శివుని ఒడిలో కూర్చుండబెట్టెను (41). పార్వతి స్వయముగా తన పుత్రుడగు సుదర్శనునకు నేతితో స్నానమును చేయించి మూడు పేటలతో మరియు ఒక ముడితో నున్న యజ్ఞోపవీతమును వేసెను (42). అపుడా అంబికాపుత్రుడగు సుదర్శనునకు పదునారు అక్షరములు గల శివగాయత్రిని ప్రేమతో ఉపదేశించెను (43). అపుడా బ్రాహ్మణబాలకుడు పదునారు పర్యాయములు ఓం నమశ్శివాయ అను మంత్రమునకు శ్రీ కారమును ముందు జోడించి సంకల్ప పూజను చేసెను (44).

ఆస్నానాది ప్రణామాంతం పూజయన్‌ వృషభధ్వజమ్‌ | మంత్ర వాదిత్ర పూజాభిస్సర్షీణాం సన్నిధౌ తథా || 45

నామమంత్రాననేకాంశ్చ పాఠయామాస వై తదా | ఉవాచ సుప్రసన్నాత్మా చండికా చ శివస్తథా || 46

మదర్పితం చ యత్‌ కించిద్ధనధాన్యాదికం తథా | తత్సర్వం చ త్వయా గ్రాహ్యం న దోషాయ భవిష్యతి || 47

మమ కృత్యే భవాన్ముఖ్యో దేవీ కృత్యే విశేషతః | ఘృతతైలాదికం సర్వం త్వయా గ్రాహ్యం మదర్పితమ్‌ || 48

ప్రాజాపత్యం భ##వేద్యర్హి తర్హ్యేకో హి భవాన్‌ భ##వేత్‌ | తదా పూజా చ సంపూర్ణాన్యథా సర్వా చ నిష్ఫలా || 49

తిలకం వర్తులం కార్యం స్నానం కార్యం తదా త్వయా | శివసంధ్యా చ కర్తవ్యా గాయత్రీ చ తదీయకా || 50

మత్సేవాం ప్రథమం కృత్వా కార్యమన్యత్కులోచితమ్‌ | ఏవం కృతే%ఖిలే భద్రం దోషాః క్షాంతా మయా తవ || 51

ఆతడు మహర్షుల సన్నిధిలో స్నానముతో మొదలిడి ప్రదక్షిణము వరకు గల ఉపచారములతో వృషభధ్వజుని పూజించి మంత్ర ములను పఠించి, వాద్యగోష్ఠిని చేసెను (45). మరియు అనేక నామ మంత్రములను పఠింపజేసెను. అపుడు చండిక మరియు శివుడు కూడ మిక్కిలి ప్రసన్నులైరి. శివుడిట్లు పలికెను (46). నాకు అర్పించబడే ధనము, ధాన్యము మొదలగు వాటినన్నింటిని నీవు స్వీకరించవచ్చును. నీకు దోషము అంటదు (47). నాకు, దేవికి చేసే పూజలన్నింటిలో నీవు ప్రధానుడవు. నేయి, నూనె ఇత్యాది వస్తువులు నాకు అర్పించబడినప్పుడు వాటిని నీవు తీసుకొనవచ్చును (48). ప్రాజాపత్యవ్రతమును చేయు సమయములో నీవు ఒక్కడివి మాత్రమే అచట నుండవలెను. అపుడు మాత్రమే పూజ సఫలమగును. లేనిచో పూజ వ్యర్థమగును (49). గుండ్రని తిలకమును ధరించవలెను. తరువాత నీవు స్నానమును చేయవలెను. సంధ్యాకాలములో శివుని ప్రార్థించవలెను. శివగాయత్రిని కూడ జపించవలెను (50). ముందుగా నన్ను సేవించి తరువాత నీ కులమునకు తగిన కర్మలను చేయుము. ఈ సర్వమును అనుష్ఠించినచో నీకు మంగళము కలుగగలదు. నీ దోషములను నేను క్షమించితిని (51).

ఇత్యుక్త్వా తస్య పుత్రాశ్చ చత్వారో వటుకాస్తదా | అభిషిక్తాశ్చతుర్దిక్షు శివేన పరమాత్మనా || 52

చండీ చైవాత్మనికటే పుత్రం స్థాప్య సుదర్శనమ్‌ | తత్పుత్రాన్‌ ప్రేరయామాస వరాన్‌ దత్త్వా హ్యనేకశః || 53

ఇట్లు పలికి తరువాత శివపరమాత్మ వాని పుత్రులగు నల్గురు వటువులను (శక్తి పూజలో శివుని ప్రతీక) నాల్గు దిక్కులలో అభిషేకించెను (52). చండి కూడ పుత్రుడగు సుదర్శనుని తన సమీపములో నుంచుకొని వాని పుత్రులకు అనేకవరములనిచ్చి ప్రోత్సహించెను (53).

దేవ్యువాచ |

ఉభయోర్యువయోర్మధ్యే వటుకో యో భ##వేన్మమ | తస్య స్యాద్విజయో నిత్యం నాత్ర కార్యా విచారణా || 54

భవాంశ్చ పూజితో యేన తేనైవాహం ప్రపూజితా | కర్తవ్యం హి భవద్భిశ్చ స్వీయం కర్మ సదా సుత || 55

దేవి ఇట్లు పలికెను-

మీ ఇద్దరిలో ఎవరైతే నా పూజలో వటు (శివరూపి యగు బ్రహ్మచారి) స్థానములో పూజింపబడుదురో, వానికి నిత్యము విజయము కలుగుననుటలో సందేహము లేదు (54). ఓ కుమారా! నిన్ను పూజించినవారికి మాత్రమే నన్ను పూజించే అర్హత కలుగును. మీరు మీ కర్తవ్యమును పాలించుడు (55).

సూత ఉవాచ |

ఏవం తసై#్మ వరా దత్తా స్సపుత్రాయ మహాత్మనే | సుదర్శనాయ కృపయా శివాభ్యాం జగతాం కృతే || 56

శివాభ్యాం స్థాపితా యస్మాత్తస్మాత్తే వటుకాస్స్మృతాః | తపోభ్రష్టాశ్చ యే జాతాస్స్మృతాస్త స్మాత్తపోధమాః || 57

శివయోః కృపయా సర్వే విస్తారం బహుధా గతాః | తేషాం చ ప్రథమా పూజా మహాపూజా మహాత్మనః || 58

తేన యావత్కృతా నైవ పూజా వై శంకరస్య చ | తావత్పూజా న కర్తవ్యా కృతా చేన్న శుభాపి సా || 59

శుభం వాప్యశుభం వాపి వటుకం న పరిత్యజేత్‌ | ప్రాజాపత్యే చ భోజ్యే వై వటురేకో విశిష్యతే || 60

శివయోశ్చ తథా కార్యే విశేషో%త్ర ప్రదృశ్యతే | తదేవ శృణు సుప్రాజ్ఞ యథాహం వచ్మి తే%నఘ || 61

తసై#్యవ నగరే రాజ్ఞో భద్రస్య నిత్యభోజనే | నియమే ప్రాజాపత్యస్య హ్యంధకేశసమీపతః || 62

సూతుడు ఇట్లు పలికెను-

ఈ విధముగా పార్వతీపరమేశ్వరులు లోకహితమును గోరి మహాత్ముడగు సుదర్శనునకు, ఆతని పుత్రులకు దయతో వరములనిచ్చెను (56). వారు పార్వతీపరమేశ్వరులచే స్థాపించబడినారు గనుక వటుకులని చెప్పబడినారు. వారు తపస్సునుండి జారి పోయినారు గనుక, తపోధములనబడుదురు (57). పార్వతీపరమేశ్వరుల అనుగ్రహముచే ఆ వటువులు పలువిధముల అభివృద్ధిని పొందిరి. పరమేశ్వరుడగు శివుని పూజలో ముందుగా వారిని పూజించవలెను. అపుడా పూజ మహిమను గాంచును (58). వారిని పూజించకుండగా శంకరుని పూజను చేయరాదు. ఒకవేళ చేసిననూ, అది శుభకరము గాదు (59). శుభాశుభకర్మలయందు వటువును విడిచిపెట్టరాదు. ప్రాజాపత్య వ్రతమునందు మరియు భోజనమునందు ఒకే వటువు ఉండుట శ్రేష్ఠము (60). పార్వతీపరమేశ్వరుల ఆరాధనయందు ఒక విశేషము కానవచ్చును. ఓ ప్రజ్ఞాశాలీ! నీవు దోషరహితుడవు. ఆ విశేషమును నేను నీకు చెప్పెదను. వినుము (61). అదే నగరములో భద్రమహారాజు నియమముగా ప్రాజాపత్యవ్రతమును అంధకేశ్వరుని సన్నిధిలో అనుష్ఠించి నిత్యాన్నదానమును చేయుచుండెను (62).

యజ్జాతమద్భుతం వృత్తం శివానుగ్రహకారణాత్‌ | శ్రూయతాం తచ్చ సుప్రీత్యా కథయామి యథాశ్రుతమ్‌ || 63

ధ్వజ ఏకశ్చ తద్రాజ్ఞే దత్తస్తుష్టేన శంభునా | ప్రోక్తశ్చ కృపయా రాజా దేవదేవేన తేన సః | 64

ప్రాతశ్చ బధ్యతాం రాజన్‌ ధ్వజో రాత్రౌ పతిష్యతి | మమ త్వేవం చ సంపూర్ణే ప్రాజపత్యే తథా పునః || 65

అన్యథాయం ధ్వజో మే హి రాత్రావపి స్థిరో భ##వేత్‌ | ఇత్యుక్త్వాంతర్హిత శ్శంభూ రాజ్ఞే తుష్టః కృపానిధిః || 66

తథేతి నియమశ్చాసీత్తస్య రాజ్ఞో మహామునే | ప్రాజాపత్యం కృతం నిత్యం శివపూజా విధానతః || 67

స్వయం ప్రాతర్వివర్ధేత ధ్వజస్సాయం పతేదితి | యది కార్యం చ సంపూర్ణం జాతం చైవ భ##వేదిహ || 68

ఏకస్మిన్‌ సమయే చాత్ర వటోః కార్యం పురా హ్యభూత్‌ | ధ్వజస్స పతితో వై హి బ్రహ్మభోజం వినాపి హి || 69

శివుని అనుగ్రహ ప్రభావముచే అద్భుతమగు వృత్తాంతము జరిగినది. దానిని నేను విన్నంతవరకు చెప్పెదను. దానిని పరమప్రీతితో వినుడు (63). దేవదేవుడగు ఆ శంభుడు ప్రసన్నుడై ఆ రాజునకు ఒక ధ్వజమును ఇచ్చి దయతో నిట్లు పలికెను (64). ఓ రాజా! ఉదయమే ఈ ధ్వజమును ఎగురవేసి కట్టివేయుడు. రాత్రియందు క్రిందబడగలదు. ప్రాజాపత్య వ్రతము పూర్ణమైన సందర్భములలో నా ఈ ధ్వజము ఇటులనే ప్రవర్తించును (65). అట్లు కాని పక్షములో నా ధ్వజము రాత్రియందు కూడ స్థిరముగా ఉండి పోవును. ఇట్లు రాజుతో పలికి దయాసముద్రుడగు శంభుడు ప్రసన్నుడై అంతర్ధానమును చెందెను (66). ఓ మహర్షీ! రాజు అదే నియమమును పాటించెను. ఆయన శివపూజా విధానములో ప్రతిదినము ప్రాజాపత్య వ్రతమును చేయుచుండెను (67). ఈ కార్యములు సంపూర్ణమగుచుండెను. కావుననే ధ్వజము ఉదయమునందు స్వయముగా తానే పైకి లేచి ఎగురుతూ సాయంకాలమునందు మరల పడుచుండెడిది (68) ఒక నాడు వారు వటు కార్యము ముందుగా చేసిరి. అపుడు బ్రాహ్మణభోజనమునకు ముందుగనే ధ్వజము పడి పోయెను (69).

దృష్ట్వా తచ్చ తదా తత్ర పృష్టా రాజ్ఞా చ పండితాః | భుంజతే బ్రాహ్మణా హ్యత్ర నోత్థితో వైధ్వజస్త్వితి || 70

కథం చ పతితస్సో%త్ర బ్రాహ్మణా బ్రూత సత్యతః | తే పృష్టాశ్చ తదా ప్రోచుర్బ్రాహ్మణాః పండితోత్తమాః || 71

బ్రహ్మభోజే మహారాజ వటుకో భోజితః పురా | చండీపుత్ర శ్శివస్తుష్టస్తస్మాచ్చ పతితో ధ్వజః || 72

తచ్ఛ్రుత్వా నృపతిస్సో%థ జనాశ్చాన్యే%పి సర్వశః | అభవన్విస్మితాస్తత్ర ప్రశంసాం చక్రిరే తతః || 73

ఏవం చ మహిమా తేషాం వర్ధిత శ్శంకరేణ హి | తస్మాచ్చ వటుకాశ్శ్రేష్ఠాః పురావిద్భిః ప్రకీర్తితాః || 74

శివపూజా తు తైః పూర్వముత్తార్యా నాన్యథా పునః | అన్యేషాం నాధికారో%స్తి శివస్య వచనాదిహ || 75

ఉత్తారణం చ కార్యం వై పూజా పూర్ణా భవత్వితి | ఏతావదేవ తేషాం తు కార్యం నాన్యత్తథైవ చ || 76

ఏతత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టం చ మునీశ్వరాః | యచ్ఛ్రుత్వా శివపూజాయాః ఫలం ప్రాప్నోతి వై నరః || 77

ఇతి శ్రీ శివమహాపురాణ కోటిరుద్రసంహితాయాం వటుకోత్పత్తి వర్ణనం నామ త్రయోదశో%ధ్యాయః (13).

దానిని గాంచి రాజు పండితులను అపుడు అచట ఇట్లు ప్రశ్నించెను : ఇచట బ్రాహ్మణులు భుజించుచున్నారు. కాని ధ్వజమింకనూ లేవలేదు (70). ఓ బ్రాహ్మణులారా ! అది అట్లు పడిపోవుటకు కారణమేమి ? సత్యమును చెప్పుడు. రాజు అట్లు ప్రశ్నించగా పండితోత్తములగు ఆ బ్రాహ్మణులు ఇట్లు బదులిడిరి (71). ఓ మహారాజా! బ్రాహ్మణ భోజనము కంటే ముందుగా వటువు భుజించినాడు. చండీపుత్రుడు, మంగళకరుడు అగు వటువు సంతృప్తిని చెందినాడు. అందువలననే ధ్వజము పడినది (72). ఆ మాటను విని ఆ మహారాజు, ఇతర జనులు అందరు ఆశ్చర్యపడిరి. తరువాత వారు ప్రశంసించిరి (73). ఈ తీరున శంకరుడు వారి మహిమను వర్ధిల్ల జేసెను. కావుననే వటువులు శ్రేష్ఠులని సంప్రదాయాజ్ఞులు కీర్తించెదరు (74). ముందుగా ఆ వటువులు శివుని పూజించవలెను. దీనికి భిన్నముగా చేయరాదు. శివుని ఆదేశము వలన దీనిలో ఇతరులకు అధికారము లేదు (75). పూజ్య పూర్ణమగుగాక! అని పలికి వారు పూజను పరిసమాప్తి చేయవలెను. వారు చేయవలసిన కార్యము ఇంతే. ఇంతకు మించి లేదు (76). ఓ మహర్షులారా ! మీరు ప్రశ్నించిన విధముగా ఈ సర్వమును నేను వివరముగా చెప్పితిని. దీనిని విన్న మానవునకు శివపూజాఫలము లభించును (77).

66).

శ్రీ శివమహాపురాణములో కోటి రుద్ర సంహితయందు వటుకోత్పత్తి వర్ణనమనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).

Siva Maha Puranam-3    Chapters