Siva Maha Puranam-3    Chapters   

అథ సప్తపంచాశత్తమో%ధ్యాయః

గజాసుర సంహారము

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస మాహాప్రేవ్ణూ చరితం శశిమౌలినః | యథా%వధీత్త్రి శూలేన దానవేంద్రం గజాసురమ్‌ || 1

దానవే నిహతే దేవ్యా సమరే మహిషాసురే | దేవానాం చ హితార్థాయ పురా దేవాస్సుఖం యయుః || 2

తస్య పుత్రో మహావీరో మునీశ్వర గజాసురః | పితుర్వధం హి సంస్మృత్య కృతం దేవ్యా సురార్థనాత్‌ || 3

స తద్వైరమనుస్మృత్య తపోర్థం గతవాన్‌ వనే | సముద్దిశ్య విధిం ప్రీత్వా తతాప పరమం తపః || 4

అవధ్యో%హం భవిష్యామి స్త్రీ పుంసైః కామనిర్జితైః | సంవిచార్యేతి మనసా% భూత్తపోరతమానసః || 5

స తేపే హిమవద్ద్రోణ్యాం తపః పరమదారుణమ్‌ | ఊర్ధ్వబాహుర్నభోదృష్టిః పాదాంగుష్ఠాశ్రితావనిః || 6

జటాభారస్స వై రేజే ప్రలయార్క ఇవాంశుభిః | మహిషాసురపుత్రో%సౌ గజాసుర ఉదారధీః || 7

తస్య మూర్ధ్నస్సముద్భూతస్సధూమో%గ్నిస్తపోమయః | తిర్యగూర్ధ్వమధోలోకాంస్తాపయన్‌ విష్వగీరితః || 8

చుక్షుభుర్నద్యుదన్వంతశ్చాగ్నేర్మూర్ధసముద్భవాత్‌ | ని పేతుస్సగ్రహస్తారా జజ్వలుశ్చ దిశో దశ || 9

తేన తప్తాస్సురాస్సర్వే దివం త్యక్త్వా సవాసవాః | బ్రహ్మలోకం యుయుర్విజ్ఞాపయామాసుశ్చచాల భూః || 10

సనత్కుమారుడిట్లు పలికెను-

ఓ వ్యాసా! చంద్రశేఖరుని చరితమును మహాప్రేమతో వినుము. ఆయన త్రిశూలముతో గజాసురుని వధించిన వృత్తాంతమును చెప్పెదను (1). పూర్వము దేవతల హితమును గోరి దేవి యుద్ధములో మహిషాసురుని సంహరించగా దేవతలు సుఖమును పొందిరి (2). ఓ మహర్షీ ! వాని పుత్రుడు, మహావీరుడు అగు గజాసురుడు దేవతలు కోరగా దేవి తన తండ్రిని సంహరించిన విషయమును స్మరించి (3), ఆమెపై వైరమును బూని తపస్సును చేయుటకై వనమునకై వెళ్లి, బ్రహ్మను ఉద్దేశించి గొప్ప తపస్సును శ్రద్ధతో చేసెను (4). 'కామమునకు దాసులైన స్త్రీ పురుషులచే నేను వధింపబడరాదు' అని మనస్సులో తలపోసి మనస్సును తపస్సుపై లగ్నము చేసెను (5). అతడు చేతులను పైకెత్తి నేలమీద కాలిబొటన వేలిపై నిలబడి పైకి చూస్తూ హిమవత్పర్వతమునందలి లోయలో మిక్కిలి దారుణమగు తపస్సును చేసెను (6). మహిషాసురుని పుత్రుడు, విశాలమగు హృదయము గలవాడునగు ఆ గజాసురుడు జటలతో, ప్రలయకాలసూర్యుడు కిరణములతో వలె ప్రకాశించెను (7). వాని శిరస్సునుండి పుట్టిన తపోమయమగు అగ్ని పోగతో గూడి భూమియందు మాత్రమే గాక, ఊర్ధ్వలోకములయందు మరియు అధోలోకములయందు కూడ వ్యాపించెను (8). వాని శిరస్సునుండి పుట్టిన ఆ అగ్నిచే నదులు, సముద్రములు క్షోభను పొందినవి. గ్రహములు, నక్షత్రములు నేల రాలినవి. పది దిక్కులు మండినవి (9). దానిచే పీడించబడిన ఇంద్రాది దేవతలు అందరు స్వర్గమును వీడి బ్రహ్మలోకమునకు వెళ్లి మొర పెట్టుకొనిరి. భూమి కంపించెను (10).

దేవా ఊచుః |

విధే గజాసురతపస్తప్తా వయమథాకులాః | న శక్నుమో దివి స్థాతుమతస్తే శరణం గతాః || 11

విధే హ్యుపశమం తస్య చాన్యాన్‌ జీవయితుం కృపా | లోకా నంక్ష్యత్యన్యథా హి సత్యం సత్యం బ్రువామహే || 12

ఇతి విజ్ఞాపితో దేవైర్వాసవాద్యైస్స ఆత్మభూః | భృగుదక్షాదిభిర్ర్బహ్మా య¸° దైత్యవరాశ్రయమ్‌ || 13

తపంతం తపసా లోకాన్యథా%భ్రపిహితం దివి | విలక్ష్య విస్మితః ఫ్రాహ విహసన్‌ సృష్టికారకః || 14

దేవతలు ఇట్లు పలికిరి -

ఓ బ్రహ్మా ! గజాసురుని తపస్సుచే తపింపచేయబడుచున్న మేము మిక్కిలి దుఃఖమును పొంది యున్నాము. మేము స్వర్గములో నిలబడలేక నిన్ను శరణు జొచ్చినాము (11). ఓ బ్రహ్మా! దయచేసి వాని తపస్సును ఆపించి ఇతరులు జీవించునట్లు చేయుము. లేనిచో, లోకములు నశించుట ముమ్మాటికీ సత్యము (12). ఇంద్రాది దేవతలు, భృగువు, దక్షుడు మొదలగు వారు ఇట్లు విన్నవించగా స్వయంభువుడగు బ్రహ్మ ఆ రాక్షసశ్రేష్ఠుని ఆశ్రమమునకు వెళ్లెను (13). ఆతడు తన తపస్సుచే లోకములను తపింప జేయుచుండెను. ఆకాశము మేఘములచే ఆచ్ఛాదించబడినదా యన్నట్లు ఉండెను. సృష్టికర్త వానిని చూసి విస్మితుడై నవ్వుతూ ఇట్లు పలికెను (14).

బ్రహ్మోవాచ |

ఉత్తిష్ఠోత్తిష్ఠ దైత్యేంద్ర తపస్సిద్ధో%సి మాహిషే | ప్రాప్తో%హం వరదస్తాత వరం వృణు యథేప్సితమ్‌ || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ రాక్షసరాజా ! లెమ్ము, లెమ్ము. ఓ మహిషపుత్రా! నీ తపస్సు సిద్ధించినది. ఓ కుమారా! నీకు వరమును ఇచ్చుటకొరకై వచ్చియుంటిని. నీకు నచ్చిన వరమును కోరుకొనుము (15).

సనత్కుమార ఉవాచ |

ఉత్థాయోత్థాయ దైత్యేంద్ర ఈక్షమాణో దృశా విభుమ్‌ | గిరా గద్గదయా ప్రీతో%గృణద్దేవం స మాహిషిః || 16

సనత్కుమారుడిట్లు పలికెను -

మహిషపుత్రుడగు ఆ రాక్షసవీరుడు మెల్లగా లేచి, కన్నులతో ఆ దేవప్రభుని గాంచి సంతోషించి గద్గదమగు వాక్కుతో ఇట్లు స్తుతించెను (16).

గజాసుర ఉవాచ |

నమస్తే దేవదేవేశ యది దాస్యసి మే వరమ్‌ | అవధ్యో%హం భ##వేయం వైస్త్రీపుంసైః కామనిర్జితైః || 17

మహాబలో మహావీర్యో%జేయో దేవాదిభిస్సదా | సర్వేషాం లోకపాలానాం నిఖిలర్ధసుభుగ్విభో || 18

గజాసురుడిట్లు పలికెను -

ఓ దేవదేవా ! ఈశ్వరా ! నీకు నమస్కారము. నీవు నాకు వరమును ఈయగోరుచున్నచో, నేను కామనిర్జితులైన స్త్రీ పురుషులచే వధించబడకూడదు (17). ఓ విభూ ! నేను మహాబలవంతుడను, గొప్ప పరాక్రమము గలవాడను, ఏ కాలమునందైననూ దేవాదులచే జయింపశక్యము కానివాడను, లోకపాలకులందరియొక్క సమస్తసమృద్ధులను అనుభవించు వాడను కావలెను (18).

సనత్కుమార ఉవాచ |

ఏవం వృతశ్శతధృతిర్దానవేన స తేన వై | ప్రాదాత్తత్తవసా ప్రీతో వరం తస్య సుదుర్లభమ్‌ || 19

ఏవం లబ్ధవరో దైత్యో మాహిషిశ్చ గజాసురః | సుప్రసన్నమనాస్పో%థ స్వధామ ప్రత్యపద్యత || 20

న విజిత్య దిశస్సర్వా లోకాంశ్చ త్రీన్మహాసురః | దేవాసురమనుష్యేంద్రాన్‌ గంధర్వగరుడోరగాన్‌ || 21

ఇత్యాదీన్నిఖిలాన్‌ జిత్వా వశమానీయ విశ్వజిత్‌ | జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా || 22

దేవోద్యానశ్రియా జుష్టమధ్యాస్తే స్మ త్రివిష్టపమ్‌ | మహేంద్రభవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్మణా || 23

తస్మిన్మహేంద్రస్య గృహే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్‌ |

రేమే%భివంద్యాంఘ్రియుగస్సురాదిభిః ప్రతాపితైరూర్జితచండశాసనః || 24

స ఇత్థం నిర్జితకకుబేకరాడ్‌ విషయాన్‌ ప్రియాన్‌ | యథోపజోషం భుంజానో నాతృప్యదజితేంద్రియః || 25

ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్ఛాస్త్రవర్తినః | కాలే వ్యతీతే మహతి పాపబుద్ధిరభూత్తతః || 26

మహిషాసురపుత్రో%సౌ సంచిక్లేశ ద్విజాన్‌ వరాన్‌ | తాపసాన్నితరాం పృథ్వ్యాం దానవస్సురమర్దనః || 27

సురాన్నరాంశ్చ ప్రమథాన్‌ సర్వాన్‌ చిక్లేశ దుర్మతిః | ధర్మాన్వితాన్విశేషేణ పూర్వవైరమనుస్మరన్‌ || 28

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆ రాక్షసుడు బ్రహ్మను ఈ విధమైన వరములను కోరగా వాని తపస్సుచే సంతోషించిన బ్రహ్మ మిక్కిలి దుర్లభమగు ఆ వరమును వానికి ఇచ్చెను (19). మహిషాసురపుత్రుడగు ఆ గజాసురుడు ఈ తీరున వరమును పొంది మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలవాడై తరువాత తన నివాసమును చేరుకొనెను (20). ఆ మహారాక్షసుడు సర్వదిక్కులను, మూడు లోకములను, దేవతలను, రాక్షసులను, మనుష్యులను, ఇంద్రుని, గంధర్వులను, గరుడుని, నాగులను, ఇతరులను సర్వులను జయించి తన వశములోనికి తెచ్చుకొనెను. ఆతడు ఈ విధమున విశ్వమును జయించి లోకపాలకుల స్థానములను వారి తేజస్సులతో సహా అపహరించెను (21, 22). నందనోద్యానశోభతో గూడియున్న స్వర్గములో సాక్షాత్తుగా విశ్వకర్మచే నిర్మించబడిన మహేంద్రభవనములో అతడు నివసించెను (23). మహా బలశాలి, గొప్ప స్వాభిమానము గలవాడు, లోకములను జయించిన ఏకచ్ఛత్రాధిపతి, ఆతని ప్రతాపమును చవిచూచిన దేవతలు మొదలగు వారిచే నమస్కరింపబడే పాదములు గలవాడు, చండశాసనుడు అగు ఆ గజాసురుడు ఆ మహేంద్రభవనములో రమించెను (24). ఈ విధముగా దిక్కులను జయించి ఏకచ్ఛత్రాధిపతియగు గజాసురుడు అభీష్టములగు ఇంద్రియసుఖములను హద్దు లేకుండగా అనుభవించియు, ఇంద్రియజయము లేని వాడగుటచే తృప్తిని పొందలేకపోయెను (25). ఈ విధముగా ఐశ్వర్యమదమత్తుడు, శాస్త్రమును ఉల్లంఘించి ప్రవర్తించువాడు అగు ఆ రాక్షసునకు చాల కాలము గడిచిన తరువాత పాపబుద్ధి కలిగెను (26). మహిషాసురపుత్రుడు, దేవపీడకుడు అగు ఆ రాక్షసుడు భూలోకములో బ్రాహ్మణశ్రేష్ఠులను, ఋషులను అధికమగు కష్టములకు గురిచేసెను (27). ఆ దుర్బుద్ధియగు గజాసురుడు పూర్వమునందలి వైరమును స్మరించి దేవతలను, మానవులను, మరియు సర్వప్రమథులను, విశేషించి ధర్మానుయాయులను ఇడుముల పాలు చేసెను (28).

ఏకస్మిన్‌ సమయే తాత దానవో%సౌ మహాబలః | ఆగచ్ఛద్రాజధానీం వై శంకరస్య గజాసురః || 29

సమాగతే%సురేంద్రే హి మహాన్‌ కలకలో మునే | త్రాత త్రాతేతి తత్రాసీదానందవనవాసినామ్‌ || 30

మహిషాసురపుత్రో%సౌ యదా పుర్యాం సమాగతః | ప్రమథన్‌ ప్రమథాన్‌ సర్వాన్నిజవీర్యమదోద్థతః || 31

తస్మిన్నవసరే దేవాశ్శక్రాద్యాస్తత్పరాజితాః | శివస్య శరణం జగ్ముర్నత్వా తుష్టువురాదరాత్‌ || 32

న్యవేదయన్‌ దానవస్య తస్య కాశ్యాం సమాగమమ్‌ | క్లేశాధిక్యం తత్రత్యానాం తన్నాథానాం విశేషతః || 33

ఓ కుమారా! ఒకప్పుడు మహాబలశాలియగు ఈ గజాసురుడు శంకరుని రాజధానికి వచ్చెను (29). ఓ మునీ ! ఆ రాక్షసవీరుడు రాగానే అచట ఆనందవనములో నివసించు జనులు రక్షించుడు, రక్షించుడు అని పెద్ద కలకలమును చేసిరి (30). మహిషాసురుని పుత్రుడగు ఈ రాక్షసుడు తనకు గల పరాక్రమముచే మిక్కిలి గర్వించినవాడై ఈ నగరమునకు వచ్చిన సమయంలో ప్రమథులనందరినీ హింసించును (31). అదే సమయములో వానిచే పరాజితులైన ఇంద్రుడు మొదలగు దేవతలు శివుని శరణుపొంది ఆయనకు నమస్కరించి శ్రద్ధతో స్తుతించిరి (32). ఆ రాక్షసుడు కాశీ నగరమునకు వచ్చుట, అచటనున్నవారికి ప్రత్యేకించి శివుని నమ్ముకున్నవారికి అధికమగు క్లేశము కలుగుచుండుట అను విషయమును ఆయనకు విన్నవించిరి (33).

దేవా ఊచుః |

దేవ దేవ మహాదేవ తవ పుర్యాం గతో%సురః | కష్టం దత్తే త్వజ్జనానాం తం జహి త్వం కృపానిధే || 34

యత్ర యత్ర ధరాయాం చ చరణం ప్రమిణోతి హి | అచలాం సచలాం తత్ర కరోతి నిజభారతః || 35

ఊరువేగేన తరవః పతంతి శిఖరైస్సహ | యస్య దోర్దండఘాతేన చూర్ణాస్స్యుశ్చ శిలోచ్చయాః || 36

యస్య మౌలిజసంఘర్షాద్ఘనా వ్యోమ త్యజంత్యపి | నీలిమానం న చాద్యాపి జహ్యుస్తత్కేశసంగజమ్‌ || 37

యస్య నిశ్శ్వాససంభారైరుత్తరంగా మహాబ్ధయః | సద్యో%ప్యమందకల్లోలా భవంతి తిమిభిస్సహ || 38

యోజనానాం సహస్రాణి నవ యస్య సముచ్ఛ్రయః | తావానేవ హి విస్తారస్తనోర్మాయావినో%స్య హి || 39

యన్నేత్రయోః పింగలిమా తథా తరలిమా పునః | విద్యుతః నోహ్యతే%ద్యాపి సో%యం స్మాయాతి సత్వరమ్‌ || 40

యాం యాం దిశం సమభ్యేతి సోయం దుస్సహదానవః | అవధ్యో%హం భవామీతి స్త్రీ పుంసైః కామనిర్జితైః || 41

ఇత్యేవం చేష్టితం తస్య దావనస్య నివేదితమ్‌ | రక్షస్వ భక్తాన్‌ దేవేశ కాశీరక్షణతత్పర || 42

దేవతలు ఇట్లు పలికిరి -

ఓ దేవదేవా! మహాదేవా! దయానిధీ! నీ నగరమునకు వచ్చి ఈ రాక్షసుడు నీ భక్తులకు కష్టమును కలిగించుచున్నాడు. వీనిని నీవు సంహరించుము (34). మహభారముగల వీడు భూమిపై ఎక్కడ కాలిడిననూ, అచట భూమి కంపించును (35). వీడి పాదముల వేగమునకు వృక్షములు కొమ్మలతో సహానేలగూలును. వీడు తన భుజస్కంధములతో కొట్టి పర్వతములను చూర్ణము చేయును (36). వీని శిరస్సుయొక్క రాపిడికి మేఘములు కూడ ఆకాశమున వీడి పోవుచున్నవి. అవి వీని కేశముల సంగమువలన కలిగిన నీలివర్ణమును ఇంకనూ వీడకున్నవి (37). వీని విశ్శ్వాసవాయువులచే నదులలో మరియు సముద్రములలో పెద్ద తరంగములు లేచి తిమింగలములతో సహా సర్వప్రాణులు గొప్ప కల్లోలమును పొందుచున్నవి (38). ఈ మాయావియొక్క శరీరము తొమ్మిది వేల యోజనముల ఎత్తు, మరియు అంతే నిడివి కలిగియున్నది (39). వీని నేత్రముల పింగలవర్ణము మరియు చంచలత విద్యుత్తునకు ఇంకనూ అబ్బలేదు. అట్టి రాక్షసుడు వేగముగా వచ్చుచున్నాడు (40). నేను కామపరాజితులైన స్త్రీ పురుషులచే వధింపబడననే ధైర్యముగల ఈ దానవుడు ఏయే స్థలములకు వెళ్లిననూ, వీనిని సహించుట అసంభవము (41). ఆ దానవుని చేష్టలను ఈ తీరున విన్నవించితిమి. ఓ దేవేశా! కాశీనగరమును రక్షించుటలో తత్పురుడవగు నీవు భక్తులను రక్షించుము (42).

సనత్కుమార ఉవాచ |

ఇతి సంప్రార్థితో దేవైర్భక్తరక్షణతత్పరః | తత్రాజగామ సో%రం తద్వధకామనయా హరః || 43

ఆగతం తం సమాలోక్య శంకరం భక్తవత్సలమ్‌ | త్రిశూలహస్తం గర్జంతం జగర్జ స గజాసురః || 44

తతస్తయోర్మహానాసీత్సమరో దారుణో%ద్భుతః | నానాస్త్ర శస్త్ర సంపాతైర్వీరారావం ప్రకుర్వతోః || 45

గజాసురో%తితేజస్వీ మహాబలపరాక్రమః | వివ్యాధ గిరిశం బాణౖస్తీక్‌ ష్ణైర్దానవఘాతినమ్‌ || 46

అథ రుద్రో రౌద్రతనుస్స్వశ##రైరతిదారుణౖః | తచ్ఛరాంశ్చిచ్ఛిదే తూర్ణమప్రాప్తాంస్తిలశో మునే || 47

తతో గజాసురః క్రుద్ధో%భ్యధావత్తం మహేశ్వరమ్‌ | ఖడ్గహస్తః ప్రగర్జ్యోచ్చైర్హతో%సీత్యద్య వై మయా || 48

తతస్త్రి శూలహేతిస్తమాయాంతం దైత్యపుంగవమ్‌ | విజ్ఞాయావధ్యమన్యేన శూలేనాభిజఘాన తమ్‌ || 49

ప్రోతస్తేన త్రిశూలేన స చ దైత్యో గజాసురః | ఛత్రీకృతమివాత్మానం మన్యమానో జగౌ హరమ్‌ || 50

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

వారు ఇట్లు విన్నవించగా భక్తులను రక్షించుటలో తత్పరుడైన శివుడు వానిని వధించగోరి వెంటనే అచటకు వచ్చెను (43). భక్తవత్సలుడు, త్రిశూలమును చేతియందు ధరించినవాడు అగు శంకరుడు గర్జిస్తూ అచటకు వచ్చుటను గాంచిన ఆ గజాసురుడు కూడ గర్జించెను (44). అపుడు వారిద్దరు వీరవచనములను పలుకుతూ అనేకశస్త్రాస్త్రములను ప్రయోగిస్తూ అద్భుతము, భయంకరము అగు యుద్ధమును చేసిరి (45). మహాతేజశ్శాలి, గొప్ప బలపరాక్రమములు గలవాడు అగు గజాసురుడు దానవసంహారకుడు, కైలాసవాసి అగు శివుని వాడి బాణములతో కొట్టెను (46). ఓ మహర్షీ! అపుడు భయంకరాకారుడగు రుద్రుడు మిక్కిలి దారుణమగు తన బాణములతో ఆ బాణములు తనను చేరకమునుపే వాటిని శీఘ్రముగా ముక్కలు ముక్కలుగా ఛేదించెను (47). అపుడు గజాసురుడు కోపించి కత్తిని చేతబట్టి నీవీనాడు నా చేతిలో మరణించితివి అని బిగ్గరగా గర్జిస్తూ ఆ మహేశ్వరుని మీదకు ఉరికెను (48). అపుడు త్రిశూలధారియగు శివుడు తన మీదకు వచ్చుచున్న ఆ రాక్షసవీరుని గాంచి, ఈతడు ఇతరులచే వధింపబడడని తెలుసుకొని, వానిని శూలముతో పొడిచెను (49). త్రిశూలముచే పొడువబడిన ఆ గజాసురుడు తాను శూలముపై గొడుగు వలెనున్నట్లు భావించి శివుని మహిమను గానము చేసెను (50).

గజాసుర ఉవాచ |

దేవదేవ మహాదేవ తవ భక్తో%స్మి సర్వథా | జానే త్వాం త్రిదేవేశానం త్రిశూలిన్‌ స్మరహారిణమ్‌ || 51

తవ హస్తే మమ వధో మహాశ్రేయస్కరో యతః | అంధకారే మహేశాన త్రిపురాంతకసర్వగ || 52

కించిద్విజ్ఞప్తుమిచ్ఛామి తచ్ఛృణుష్వ కృపాకర | సత్యం బ్రవీమి నాసత్యం మృత్యుంజయ విచారయ || 53

త్వమేకో జగతాం వంద్యో విశ్వస్యోపరి సంస్థితః | కాలేన సర్వైర్మర్త్వ్యం శ్రేయ సే మృత్యురీదృశః || 54

గజాసురుడు ఇట్లు పలికెను -

ఓ దేవదేవ ! మహాదేవా! నేను అన్ని విధములుగా నీ భక్తుడను. ఓ త్రిశూలధారీ ! త్రిమూర్తులకు శాసకుడు, మన్మథసంహారి అగు నిన్ను నేను ఎరుంగుదును (51). ఓ అంధకాసురసంహారా ! మహేశ్వరా! త్రిపురనాశకరా! సర్వవ్యాపీ! నీ చేతిలో మృత్యువు గొప్ప శ్రేయస్సును కలిగించును (52). ఓ దయానిధీ ! నేను ఒక చిన్న విన్నపమును చేసెదను. దానిని వినుము. ఓ మృత్యుంజయా! నేను సత్యమును పలుకుచున్నాను. అసత్యమును పలుకను. నీవే ఆలోచించుము (53). సర్వలోకములకు వందనీయుడవు నీవే. నీవు జగత్తునకు అతీతుడవై ఉన్నావు. ఏదో ఒక సమయములో అందరు మరణించవలసిన వారే. కాని ఇట్టి మృత్యువు మోక్షహేతువు అగును (54).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య శంకరః కరుణానిధిః | ప్రహస్య ప్రత్యువాచేశో మాహిషేయం గజాసురమ్‌ || 55

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

కరుణాసముద్రుడు, పాలకుడు అగు శంకరుడు మహిషాసురపుత్రుడగు గజాసురుని ఈ మాటలను విని నవ్వి ఇట్లు బదులిడెను (55).

ఈశ్వర ఉవాచ |

మహాపరాక్రమనిధే దానవోత్తమ సన్మతే | గజాసుర ప్రసన్నో%స్మి స్వానుకూలం వరం వృణు || 56

ఈశ్వరుడు ఇట్లు పలికెను-

ఓ దానవశ్రేష్ఠా ! నీవు గొప్ప పరాక్రమనిధివి. నీవు సద్బుద్ధి గలవాడవు. ఓ గజాసురా! నేను ప్రసన్నుడనైతిని. నీకు నచ్చిన వరమును కోరుకొనుము (56).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య మహేశస్య వచనం వరదస్య హి | ప్రత్యువాచ ప్రసన్నాత్మా దానవేంద్రో గజాసురః || 57

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

వరములనిచ్చే మహేశ్వరుని ఈ మాటలను విని దానవశ్రేష్ఠుడగు గజాసురుడు ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (57).

గజాసుర ఉవాచ |

యది ప్రసన్నో దిగ్వాసస్తదా నిత్యం వసాన మే | ఇమాం కృత్తిం మహేశాన త్వత్త్రిశూలాగ్నిపావితమ్‌ || 58

స్వప్రమాణాం సుఖస్పర్శాం రణాంగణపణీకృతామ్‌ | దర్శనీయాం మహాదివ్యాం సర్వదైవ సుఖావహామ్‌ || 59

ఇష్టగంధిస్సదైవాస్తు సదైవాస్త్వతికోమలా | సదైవ నిర్మలా చాస్తు సదైవాస్త్వతిమండనమ్‌ || 60

మహాతపోనలజ్వాలాం ప్రాప్యాపి సుచిరం విభో | న దగ్ధా కృత్తిరేషా మే పుణ్య గంధనిధిస్తతః || 61

యది పుణ్యవతీ నైషా మమ కృత్తిర్దిగంబర | తదా త్వదంగసంగో%స్యాః కథం జాతో రణాంగణ || 62

అన్యం చ మే వరం దేహి యది తుష్టో%సి శంకర | నామాస్తు కృత్తివాసాస్తే ప్రారభ్యాద్యతనం దినమ్‌ || 63

ఓ దిగంబరా ! మహేశ్వరా ! నీవు ప్రసన్నుడవైనచో, నీ త్రిశూలముయొక్క అగ్నిచే పావనమైన ఈ నా శరీరచర్మమును నిత్యము ధరించుము (58). ఇది నీ శరీరపరిమాణమునకు తగినట్లున్నది. యుద్ధభూమిలో పణముగా పెట్టబడిన ఈ సుందరమగు చర్మము సుఖమగు స్పర్శ గలది. మహాదివ్యమగు ఈ చర్మము సర్వకాలములయందు సుఖమును ఈయగలదు (59). ఇది సర్వదా అభీష్టమగు గంధమును కలిగియుండుగాక! ఇది సర్వదా మిక్కిలి కోమలముగా నుండుగాక! ఇది సర్వదా నిర్మలముగానుండి నీకు సర్వకాలములలో అలంకారమగుగాక ! (60) ఓ విభూ! ఈ నా చర్మము గొప్ప తపస్సునుండి పుట్టిన అగ్నిజ్వాలలో చిరకాలము ఉండియూ దగ్ధము కాలేదు. కావున ఇది పుణ్యగంధముయొక్క నిధి (61). ఓ దిగంబరా! ఈ నా చర్మము పుణ్యము కలది కానిచో, దీనికి యుద్ధభూమిలో నీ శరీరముతోడి సంపర్కము ఎట్లు కలిగినది? (62) ఓ శంకరా ! నీవు సంతోషించినచో, నాకు మరియొక వరమునిమ్ము. ఈ నాటినుండియూ నీకు కృత్తివాససుడు అను పేరు కలుగుగాక ! (63)

సనత్కుమార ఉవాచ |

శ్రుత్వేతి స వచస్తస్య శంకరో భక్తవత్సలః | తథేత్యువాచ సుప్రీతో మహిషాసురజం చ తమ్‌ || 64

పునః ప్రోవాచ ప్రీతాత్మా దానవం తం గజాసురమ్‌ | భక్తప్రియో మహేశానో భక్తినిర్మలమానసమ్‌ || 65

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

భక్తవత్సలుడగు ఆ శంకరుడు మహిషాసురపుత్రుడగు వాని ఈ మాటలను విని మిక్కిలి సంతోషించి వానితో అటులనే యగుగాక ! అని పలికెను (64). భక్తప్రియుడగు మహేశ్వరుడు సంతసించిన మనస్సు గలవాడై భక్తిచే నిర్మలమైన మనస్సు గల ఆ గజాసురునితో నిట్లనెను (65).

ఈశ్వర ఉవాచ |

ఇదం పుణ్యం శరీరం తే క్షేత్రే%స్మిన్ముక్తిసాధనే | మమ లింగం భవత్వత్ర సర్వేషాం ముక్తిదాయకమ్‌ || 66

కృత్తివాసేశ్వరం నామ మహాపాతకనాశనమ్‌ | సర్వేషామేవ లింగానాం శిరోభూతం విముక్తిదమ్‌ || 67

కథయిత్వేతి దేవేశస్తత్కృత్తిం పరిగృహ్య చ | గజాసురస్య మహతీం ప్రావృణోద్ధి దిగంబరః || 68

మహామహోత్సవో జాతస్తస్మిన్నహ్ని మునీశ్వర | హర్షమాపుర్జనాస్సర్వే కాశిస్థాః ప్రమథాస్తథా || 69

హరిబ్రహ్మదయో దేవా హర్షనిర్భరమానసాః | తుష్టువుస్తం మహేశానం నత్వా సాంజలయస్తతః || 70

హతే తస్మిన్‌ దానవేశే మాహిషే హి గజాసురే | స్వస్థానం భేజిరే దేవా జగత్స్వాస్థ్యమవాప చ || 71

ఇత్యుక్తం చరితం శంభోర్భక్తవాత్సల్యసూచకమ్‌ | స్వర్గ్యం యశ్యస్యమాయుష్యం ధనధాన్యప్రవర్ధనమ్‌ || 72

య ఇదం శృణుయాత్ప్రీ త్యా శ్రావయేద్వా శుచివ్రతః | స భుక్త్వా చ మహాసౌఖ్యం లభేతాంతే వరం సుఖమ్‌ || 73

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే గజాసురవధో నామ సప్తపంచాశత్తమో%ధ్యాయః (57)

ఈశ్వరుడిట్లు పలికెను-

ముక్తి సాధనమగు ఈ క్షేత్రమునందు ఈ నీ పుణ్యశరీరము సర్వులకు ముక్తినిచ్చే నా లింగము అగుగాక! (66) కృత్తివాసేశ్వరుడను పేరు గల ఈ లింగము శ్రేష్ఠమైనది కాగలదు. ఇది మహాపాపములను పోగొట్టి మోక్షమునీయ గలదు (67). దిగంబరుడగు ఆ దేవదేవుడు ఇట్లు పలికి ఆ గజాసురుని గొప్ప చర్మమను స్వీకరించి ధరించెను (68). ఓ మహార్షీ ! ఆ నాడు గొప్ప ఉత్సవము జరిగెను. కాశీనగరవాసులు అందరు మరియు ప్రమథులు ఆనందమును పొందిరి (69). అపుడు విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై చేతులను జోడించి సమస్కరించి ఆ మహేశ్వరుని స్తుతించిరి (70). మహిషాసురపుత్రుడు, రాక్షసశ్రేష్ఠుడునగు ఆ గజాసురుడు సంహరింపబడిన తరువాత దేవతలు తమ స్థానములకు చేరుకొనిరి. జగత్తు స్వస్థతను పొందెను (71). శంభుని భక్తవాత్సల్యమును సూచించినది, స్వర్గమును యశస్సును ఆయుర్దాయమును ఇచ్చునది, ధనధాన్యములను వర్ధిల్లజేయునది అగు ఆ చరితమును చెప్పియుంటిని (72). ఎవడైతే పవిత్రమగు వ్రతనిష్ఠ గలవాడై దీనిని వినునో, లేక వినిపించునో, అట్టి వాడు ఇచట మహాసౌఖ్యముననుభవించి, మరిణించిన తరువాత మోక్షమును పొందును (73).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందలి యుద్ధఖండలో గజాసుర వధ అనే ఏబది ఏడవ అధ్యాయము ముగిసినది (57).

Siva Maha Puranam-3    Chapters