Siva Maha Puranam-3    Chapters   

అథ అష్ట పంచాశత్తమో%ధ్యాయః

దుందుభి నిర్హ్రాదుని సంహారము

సనత్కుమార ఉవాచ |

శృణు వ్యాస ప్రవక్ష్యామి చరితం శశిమౌలినః | యథా దుందుభినిర్హ్రా దమవధీద్దితిజం హరః || 1

హిరణ్యాక్షే హతే దైత్యే దితిపుత్రే మహాబలే | విష్ణుదేవేన కాలేన ప్రాప దుఃఖం మహద్దితిః|| 2

దైత్యో దుందుభినిర్హ్రాదో దుష్టః ప్రహ్లాదమాతులః | సాంత్వయామాస తాం వాగ్భిర్తుఃఖితాం దేవదుఃఖదః || 3

అథ దైత్యస్స మాయావీ దితిమాశ్వాస్య దైత్యరాట్‌ | దేవాః కథం సుజేయాస్స్యు రిత్యు పాయమచింతయత్‌ || 4

దేవైశ్చ ఘాతితో వీరో హిరణ్యాక్షో మహాసురః | విష్ణునా చ సహ భ్రాత్రా సచ్ఛలైర్దైత్యవైరిభిః || 5

కింబలాశ్చ కిమాహారా కిమాధారా హి నిర్జరాః | మయా కథం ను జేయాస్స్యురిత్యుపాయమచింతయత్‌ || 6

విచార్య బహుశో దైత్యస్తత్త్వం విజ్ఞాయ నిశ్చితమ్‌ | అవశ్యమగ్రజన్మానో హేతవో%త్ర విచారతః || 7

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ వ్యాసా! చంద్రశేఖరుడగు హరుడు దుందుభినిర్హ్రాదుడనే రాక్షసుని సంహరించిన వృత్తాంతమునుచెప్పెదను, వినుము (1). దితిపుత్రుడు, మహాబలశాలి అగు హిరణ్యాక్షుని విష్ణుదేవుడు సంహరించిన తరువాత దితి చాలకాలమువరకు మహాదుఃఖమును పొందియుండెను (2). ప్రహ్లాదుని మేనమామ, దుష్టుడు, దేవతలకు దుఃఖమును కలిగించువాడు అగు దుందుభినిర్హ్రాదుడనే రాక్షసుడు ఆమెను మంచిమాటలతో ఓదార్చెను (3). మాయావి యగు ఆ రాక్షసేశ్వరుడు దితిని ఓదార్చిన తరువాత దేవతలను జయించే ఉపాయమును గూర్చి ఆలోచించెను (4). వీరుడు, మహారాక్షసుడు అగు హిరణ్యాక్షుని రాక్షసశత్రువులగు దేవతలు ఇంద్రుని, ఉపేంద్రుని ముందిడుకొని మోసముతో సంహరించిరి (5). దేవతల బలమేది? వారి ఆహారమేది? వారి ఆధారమేది? వారిని నేను తేలికగా జయించు ఉపాయమేది? అని అతడు ఆలోచించెను (6). ఆ రాక్షసుడు పరిపరివిధముల ఆలోచించి దీనికి బ్రాహ్మణులు మాత్రమే కారణమని నిశ్చయించెను (7).

బ్రాహ్మణాన్‌ హంతుమసకృదన్వధావతవై తతః | దైత్యో దుందుభినిర్హ్రాదో దేవవైరీ మహాఖలః || 8

యతః క్రతుభుజో దేవాః క్రతవో వేదసంభవాః | తే వేదా బ్రాహ్మణాధారాస్తతో దేవబలం ద్విజాః || 9

నిశ్చితం బ్రాహ్మణా ధారాస్సర్వే దేవాస్సవాసవాః | గీర్వాణా బ్రాహ్మణబలా నాత్ర కార్యా విచారణా || 10

బ్రాహ్మణా యది నష్టాస్స్యుర్వేదా నష్టాస్తతస్స్వయమ్‌ | అతస్తేషు ప్రణష్టేషు వినష్టాస్సతతం సురాః || 11

యజ్ఞేషు నాశం గచ్ఛత్సు హతాహారాస్తతస్సురాః | నిర్బలాస్సుఖజయ్యాస్స్యుర్నిర్జితేషు సురేష్వథ || 12

అహమేవ భవిష్యామి మాన్యస్త్రి జగతీపతిః | ఆహరిష్యామి దేవానామక్షయాస్సర్వసంపదః || 13

నిర్వేక్ష్యామి సుఖాన్యేవ రాజ్యే నిహతకంటకే | ఇతి నిశ్చిత్య దుర్బుద్ధిః పునశ్చింతితవాన్‌ ఖలః || 14

తరువాత దేవశత్రువు, పరమ దుర్మార్గుడు అగు దుందుభినిర్హ్రాదాసురుడు బ్రాహ్మణులను సంహరించుటకై పలుమార్లు వారి వెనుక పడెను (8). యజ్ఞములలో ఈయబడిన హవిస్సును దేవతలు భుజింతురు. యజ్ఞములకు వేదములు ఆధారము. ఆ వేదములు బ్రాహ్మణులపై ఆధారపడియున్నవి. కావున, దేవతల బలము బ్రాహ్మణాధీనమై యున్నది (9). ఇంద్రాది దేవతలందరు నిశ్చయముగా బ్రాహ్మణులపై మాత్రమే ఆధారపడియున్నారు. వారి బలము బ్రాహ్మణులే. దీనిలో సందేహము లేదు (10). బ్రాహ్మణులు నశించినచో, వేదములు వాటంతట అవి నశించును. ఆ వేదములు నశించినచో, దేవతలు నిశ్చయముగా నశించెదరు (11). యజ్ఞములు నశించినచో, తరువాత దేవతలకు తిండి లేక నిర్బలులగుదురు. అపుడు వారిని తేలికగా జయించవచ్చును. దేవతలను జయించిన తరువాత (12), ముల్లోకములకు నేనే అధిపతినై మన్ననలను పొందగలను. అప్పుడు నేను దేవతల అక్షయసంపదలనన్నిటినీ లాగుకొనెదను (13). అపుడు నిష్కంటకముగా రాజ్యమునేలుతూ దుఃఖసంపర్కము లేని సుఖములను అనుభవించెదను. ఆదుర్మార్గుడు ఇట్లు నిశ్చయించుకొని, మరల ఇట్లు తలపోసెను (14).

ద్విజాః క్వ సంతి భూయాంసో బ్రహ్మతేజోతిబృంహితాః | శ్రుత్యధ్యయనసంపన్నాస్తపోబలసమన్వితాః || 15

భూయసాం బ్రాహ్మణానాం తు స్థానం వారాణసీ ఖలు | తామాదావుపుసంహృత్య యాయాం తీర్థాంతరం తతః || 16

యత్ర యత్ర హి తీర్థేషు యత్ర యత్రాశ్రమేషు చ | సంతి సర్వే% గ్రజన్మానస్తే మయాద్యాస్సమంతతః || 17

ఇతి దుందుభినిర్హ్రాదో మతిం కృత్వా కులోచితామ్‌ | ప్రాప్యాపి కాశీం దుర్వృత్తో మాయావీ వ్యవధీద్ద్విజాన్‌ || 18

సమిత్కుశాన్‌ సమాదాతుం యత్ర యాంతి ద్విజోత్తమాః | అరణ్య తత్ర తాన్‌ సర్వాన్‌ స భక్షయతి దుర్మతిః || 19

యథా కో%పి న వేత్త్యేవం తథా %%చ్ఛన్నో%భవత్పునః | వనే వనేచరో భూత్వా యాదోరూపో జలాశ##యే || 20

అదృశ్యరూపీ మాయావీ దేవానామప్యగోచరః | దివా ధ్యానపరస్తిష్ఠేన్ము నివన్ముని మధ్యగః || 21

ప్రవేశముటజానాం చ నిర్గమం హి విలోకయన్‌ | యామిన్యాం వ్యాఘ్రరూపేణా భక్షయద్బ్రాహ్మణాన్‌ బహూన్‌ || 22

నిశ్శంకం భక్షయత్యేవం న త్యజత్యపి కీకశమ్‌ | ఇత్థం నిపాతితాస్తేన విప్రా దుష్టేన భూరిశః || 23

అతిశయించిన బ్రహ్మతేజస్సుతో వర్ధిల్లువారు, వేదాధ్యయనసంపన్నులు, తపోబలముతో గూడిన వారు అగు బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఎక్కడ ఉన్నారు? (15) బ్రాహ్మణులు అధికసంఖ్యలో నివసించు నగరము వారాణసి గదా! దానిని ముందుగా వినాశము చేసి తరువాత మరియొక తీర్థమునకు వెళ్లగలను (16). ఏయే తీర్థములలో, ఏయే ఆశ్రమములలో బ్రాహ్మణులు గలరో వారినందరినీ నేను భక్షించవలెను (17). ఈ విధముగా దుష్టాచారుడు, మాయావి అగు దుందుభినిర్హ్రాదుడు తన వంశమునకు దగిన నిశ్చయమును చేసుకొని, కాశీ నగరమును చేరు కొని, బ్రాహ్మణులను సంహరించెను (18). బ్రాహ్మణులు ఏ కాలములో సమిధలను, దర్భలను తెచ్చుకొనుటకై అరణ్యమునకు వెళ్లెదరో, ఆ సమయములో ఆ దుర్మార్గుడు వారినందరినీ భక్షించెడివాడు (19). తరువాత ఆతడు ఇతరులకు కంటబడకుండగా దాగియుండెడివాడు. అడవిలో వనచరుని రూపములో, మరియు జలములలో జలజంతువు రూపములో నుండెడివాడు (20). అమాయావియొక్క మాయారూపము దేవతలకైననూ గుర్తుపట్ట శక్యముకాదు. ఆతడు పగటి సమయములో మునివేషములో మునుల మధ్యలో ధ్యానమగ్నుడై యుండెడివాడు. (21). బ్రాహ్మణులు కుటీరములలోనికి వచ్చుటను, పోవుటను గమనించి రాత్రియందు ఆతడు పెద్దపులి రూపములో అనేకమంది బ్రాహ్మణులను భక్షించెను (22). ఆతడీ తీరున ఏ విధమున శంక లేకుండగా ఎముకలను విడువకుండగా భక్షించెడివాడు. ఈ విధముగా ఆ దుష్టుడు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను సంహరించెను (23).

ఏకదా శివరాత్రౌ భక్తస్త్వేకో నిజోటజే | సపర్యాం దేవదేవస్య కృత్వా ధ్యానస్థితో%భవత్‌ || 24

స చ దుందుభినిర్హ్రాదో దైత్యేంద్రో బలదర్పితః! వ్యాఘ్రరూపం సమాస్థాయ తమాదాతుం మతిం దధే 25

తం భక్తం ధ్యానమాపన్నం దృఢచిత్తం శివేక్షణ | కృతాస్త్రమంత్రవిన్యాసం క్రాంతుమశకన్న సః || 26

అథ సర్వగతశ్శంభుర్‌ జ్ఞాత్వా తస్యాశయం హరః | దైత్యస్య దుష్టరూపస్య వధాయ విదధే ధియమ్‌ || 27

యావదాదిత్సతి వ్యాఘ్రస్తావదావిరభూద్ధరః | జగద్రక్షామణిస్త్య్రక్షో భక్తరక్షణదక్షధీః || 28

రుద్రమాయాంతమాలోక్య తద్భక్తార్చితలింగతః | దైత్యస్తేనైవ రూపేణ వవృధే భూధరోపమః || 29

సావజ్ఞమథ సర్వజ్ఞం యావత్పశ్యతి దానవః | తావదాయాతమాదాయ కక్షాయంత్రే న్యపీడయత్‌ || 30

పంచాస్యస్త్వథ పంచాస్యం ముష్ట్యా మూర్ధన్యతాడయత్‌ | భక్తవత్సలనామాసౌ వజ్రాదపి కఠోరయా || 31

స తేన ముష్టిఘాతేన కక్షానిష్పేషణన చ | అత్యార్తమారటద్వ్యాఘ్రో రోదసీం పూరయన్మృతః || 32

తేన నాదేన మహతా సంప్రవేపితమానసాః | తపోధనాస్సమాజగ్ముర్నిశి శబ్దానుసారతః || 33

అత్రేశ్వరం సమాలోక్య కక్షీకృతమృగేశ్వరమ్‌ | తుష్ణువుః ప్రణతాస్సర్వే శర్వం జయజయాక్షరైః || 34

ఒక శివరాత్రినాడు ఒక భక్తుడు తన కుటీరములో దేవదేవుడగు శివుని అర్చించి ధ్యానమునందు మగ్నుడయ్యెను (24). బలముచే గర్వించియున్న దుందుభినిర్హ్రాదుడనే ఆ రాక్షసవీరుడు వ్యాఘ్రరూపమును దాల్చి వానిని భక్షించుటకు నిశ్చయించుకొనెను (25). అస్త్ర మంత్రమును న్యాసము చేసి ఏకాగ్రచిత్తముతో శివుని ధ్యానించుచున్న ఆ భక్తునిపై దాడి చేయుటకు వానికి సామర్థ్యము లేకపోయెను (26). అపుడు సర్వవ్యాపకుడు, పాపహారియగు శంభుడు వాని అభిప్రాయమునెరింగి క్రూరమృగరూపములోనున్న ఆ రాక్షసుని వధించవలెనని నిర్ణయించెను (27). జగత్తును రక్షించే చింతామణి, ముక్కంటి, భక్తుని రక్షించే సామర్థ్యముతో నిండిన బుద్ధిగలవాడు అగు హరుడు ఆ భక్తుని రాక్షసుడు లాగబోవుచుండగా ప్రత్యక్షమయ్యెను (28). ఆ భక్తుడు అర్చించిన లింగమునుండి రుద్రుడు ఆవిర్భవించుటను గాంచి ఆ రాక్షసుడు అదే రూపములో పర్వతాకారముగా పెరిగెను (29). ఆ రాక్షసుడు సర్వజ్ఞుడగు శివుని తిరస్కారదృష్టితో చూచుచుండగనే, వానిని ఆయన పట్టుకొని తన భుజబంధములో నొక్కిపెట్టెను (30). భక్తవత్సలుడని పేరు గాంచిన ఆ అయిదు మోముల దైవము వజ్రముకంటె అధికకఠోరమగు పిడికిలితో ఆ పులిని తలపై కొట్టెను (31). ఆ విధముగా బాహువుతో నొక్కిపెట్టి పిడికిలితో కొట్టగానే ఆ పెద్దపులి భయంకరమగు ఆర్తనాదముతో దిక్కలను పూరించుచూ మరణించెను (32). ఆ నాదము విని భయముతో కంపించిన మనస్సులు గల తపశ్శాలురగు ఋషులు ఆ చీకటిలో శబ్దముననుసరించి అచటకు విచ్చేసిరి (33). అచట వారు అందరు తన భుజబంధములో పెద్దపులిని నొక్కి పెట్టియున్న జగత్సంహారకుడగు ఈశ్వరుని గాంచి ప్రణమిల్లి జయజయధ్వానములతో స్తుతించిరి (34).

బ్రాహ్మణా ఊచుః|

పరిత్రాతాః పరిత్రాతాః ప్రత్యూహాద్దారుణాదితః | అనుగ్గహం కురుష్వేశ తిష్ఠాత్రైవ జగద్గురో || 35

అనేనైవ స్వరూపేణ వ్యాఘ్రేశ ఇతి నామతః | కురు రక్షాం మహాదేవ జ్యేష్ఠస్థానస్య సర్వదా || 36

అన్యేభ్యో హ్యుపసర్గేభ్యో రక్ష నస్తీర్థవాసినః | దుష్టానపాస్య గౌరీశ భ##క్తేభ్యో దేహి చాభయమ్‌ || 37

బ్రాహ్మణులిట్లు పలికిరి-

ఈ భయంకరమగు విఘ్నమునుండి మేము రక్షింపబడితిమి. ఓ ఈశా! జగద్గురూ ! నీవు అనుగ్రహము గలవాడవై ఇచటనే నిలచి యుండుము (35). ఓ మహాదేవా ! నీవు ఇదే రూపములో ఇచట వ్యాఘ్రేశ్వరుడు అను పేర నిత్యము ఉండి ఈ స్థానమును పవిత్రము చేయుము (36). ఓ గౌరీపతీ! నీవు నీ భక్తులకు అభయమునిచ్చి దుష్టులను శిక్షించి పుణ్యక్షేత్రవాసులమగు మమ్ములను ఇతరవిఘ్నములనుండి కూడ రక్షించుము (37).

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషాం భక్తానాం చంద్రశేఖరః | తథేత్యుక్త్వా పునః ప్రాహ స భక్తాన్‌ భక్తవత్సలః || 38

సనత్కుమారుడు ఇట్లు పలికెను -

భక్తవత్సలుడగు ఆ చంద్రశేఖరుడు ఆ భక్తుల ఈ మాటలను విని అటులనే యని పలికి వారితో మరల నిట్లనెను (38).

మహేశ్వర ఉవాచ |

యో మామనేన రూపేణ ద్రక్ష్యతి శ్రద్ధయాత్ర వై | తస్యోపసర్గసంధానం పాతయిష్యామ్యసంశయమ్‌ || 39

మచ్చరిత్రమిదం శ్రుత్వా స్మృత్వా లింగమిదం హృది | సంగ్రామే ప్రవిశన్మర్త్యో జయమాప్నోత్యసంశయమ్‌ || 40

ఏతస్మిన్నంతరే దేవాస్సమాజగ్ము స్సహసవాః | జయేతి శబ్దం కుర్వంతో మహోత్సవపురస్సరమ్‌ || 41

ప్రణమ్య శంకరం ప్రేవ్ణూ సర్వే సాంజలయస్సురాః | నతస్కంధాస్సువాగ్భిస్తే తుష్టువుర్భ క్తవత్సలమ్‌ || 42

మహేశ్వరుడుట్లు పలికెను -

ఎవడైతే నన్ను ఈ రూపములో ఇచట శ్రద్ధతో దర్శించునో, వానికి ఉపద్రవములతో గల సంసర్గమును నేను నిశ్చయముగా తొలగించగలను (39). నాఈ చరితమును విని ఈ లింగమును హృదయములో స్మరించి యుద్ధములో ప్రవేశించు వ్యక్తి నిస్సంశయముగా విజయమును పొందును (40). ఇంతలో ఇంద్రాది దేవతలు పెద్ద ఉత్సాహముతో జయ శబ్దమును చేయుచూ వచ్చిరి (41). ఆ దేవతలు భక్తవత్సలుడగు శంకరునకు ప్రేమతో చేతులను జోడించి తలలను వంచి నమస్కరించి చక్కని వచనములతో స్తుతించిరి (42).

దేవా ఊచుః |

జయ శంకర దేవేశ ప్రణతార్తిహర ప్రభో | ఏతద్దుందుభినిర్హ్రాదవధాత్త్రాతా వయం సురాః || 43

సదా రక్షా ప్రకర్తవ్యా భక్తానాం భక్తవత్సల | వధ్యాః ఖలాశ్చ దేవేశ త్వయా సర్వేశ్వర ప్రభో || 44

ఇత్యాకర్ణ్య వచస్తేషాం సురాణాం పరమేశ్వరః | తథేత్యుక్త్వా ప్రసన్నాత్మా తస్మింల్లింగే లయం య¸° || 45

సవిస్మయాస్తతో దేవాస్స్వం స్వం ధామ యయుర్ముదా | తే%పి విప్రా మహాహర్షాత్పునర్యాతా యథాగతమ్‌ || 46é

ఇదం చరిత్రం పరమం వ్యాఘ్రేశ్వరసముద్భవమ్‌ | శృణుయాచ్ఛ్రావయేద్వాపి పఠేద్వా పాఠయేత్తథా || 47

సర్వాన్‌ కామానవాప్నోతి నరస్స్వమనసేప్సితాన్‌ | పరత్ర లభ##తే మోక్షం సర్వదుఃఖవివర్జితః || 48

ఇదమాఖ్యానమతులం శివలీలామృతాక్షరమ్‌ | స్వర్గ్యం యశస్యమాయుష్యం పుత్రపౌత్రప్రవర్ధనమ్‌ || 49

వరం భక్తిప్రదం ధన్యం శివప్రీతికరం శివమ్‌ | పరమజ్ఞానదం రమ్యం వికారహరణం పరమ్‌ || 50

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే దుందుభినిర్హ్రాద వధవర్ణనం నామ అష్టపంచాశత్తమో %ధ్యాయః (58)

దేవతలు ఇట్లు పలికిరి -

ఓ శంకరా! దేవదేవా! నమస్కరించిన వారి కష్టములను బాపువాడా! ప్రభూ! నీకు జయమగుగాక! నీవీ దుందుభినిర్హ్రాదుని సంహరించి దేవతలమగు మమ్ములను రక్షించితివి (43). ఓ భక్తవత్సలా! దేవదేవా! సర్వేశ్వరా! ప్రభూ! నీవు సర్వదా దుష్టులను వధించి భక్తులను రక్షించదగును (44). పరమేశ్వరుడు ఆ దేవతల ఈ మాటలను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై అటులనే యని పలికి ఆ లింగమునందు విలీనమాయెను (45). అపుడు దేవతలు ఆశ్చర్యమును పొంది ఆనందముతో తమతమ ధామములకు వెళ్లిరి. ఆ బ్రాహ్మణులు కూడ మహానందముతో వచ్చిన దారిని మరలి వెళ్లిరి (46). వ్యాఘ్రేశ్వరుని ఉద్భవమును వర్ణించే ఈ శ్రేష్ఠమగు వృత్తాంతమును ఎవరైతే వినెదరో, వినిపించెదరో, పఠించెదరో, లేదా పఠింపజేయుదురో (47), అట్టివారు మనస్సులో తలచిన కోర్కెలన్నియు ఈడేరుటయే గాక, వారు దేహత్యాగానంతరము సర్వదుఃఖవినిర్ముక్తమైన మోక్షమును పొందెదరు (48). శివలీలను అమృతాక్షరములలో వర్ణించే ఈ సాటి లేని గాథ స్వర్గమును, యశస్సును, ఆయుర్దాయమును ఇచ్చి, పుత్రపౌత్రాభివృద్ధిని కలిగించును (49). ఈ గాథ పరమ భక్తిని ఇచ్చి మంగళములను కలిగించును. ధన్యము, శివునికి ప్రీతిని కలిగించునది, పరమజ్ఞానము నిచ్చునది, సుందరమైనది అగు ఈ శ్రేష్ఠగాథ వికారములను పోగొట్టును (50).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో దుందుభినిర్హ్రాద వధవర్ణనమనే ఏబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (58).

Siva Maha Puranam-3    Chapters